top of page

నిర్ణయం


'Nirnayam' New Telugu Story

Written By Kayala Nagendra

'నిర్ణయం' తెలుగు కథ

రచన: కాయల నాగేంద్ర

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

రంగారావు ప్రభుత్వరంగ సంస్థలో పనిచేస్తూ ఈమధ్యనే రిటైర్డ్ అయ్యాడు. కొడుకు పెళ్లి అయ్యేంతవరకూ ఏ బాధలు లేవతనికి. తన కొడుకు ఆఫీసులో పనిచేసే ‘రజిని’ అనే అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే, పెద్ద మనసుతో సరేనన్నాడు. కొడుకు సంతోషం కంటే ఏదీ గొప్ప కాదనుకున్నాడు.


కన్నబిడ్డను చదివించి వాడి కాళ్ళ మీద వాడు నిలబడేందుకు చేయి అందించి తండ్రిగా తన భాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. కొడుకు చదువు కోసం అహర్నిశలు శ్రమించాడు. అయితే కొడుకు మాత్రం మనసు, మానవత్వం అంటే ఏమిటో తెలియని అమ్మాయిని కోడలిగా తీసుకొచ్చాడు. ఆమె మానవతా సంబంధాలను ‘పాత చింతకాయ’ అని కొట్టిపారేస్తుంది.


ఆర్ధ్రత, ఓదార్పు అనేవి ఆమెలో మచ్చుకైనా కనిపించవు. తనను నమ్మినవాళ్లు ఏమవుతారో అని ఆలోచించదు. ఆమెకి కావాల్సిందల్లా అనుకున్నది జరగాలి అంతే! పెద్దలను గౌరవించడం, మన సంస్కృతీ సాంప్రదాయాలను పాటించడం అనేది ఆమెకు అసలు ఇస్టం ఉండదు.

ఆమె రూపంలో లావణ్యమే తప్ప, మనసంతా మాలిన్యం. ఇంటి పనులు చేయకపోగా మూతి విరుపు మాటలతో ఎదుటివారి మనసులను గాయపరచేది.


కోడలు వస్తే ఇంటిపనుల్లో అత్తకు సహాయంగా ఉంటుందనుకున్నాడు. కానీ, ఆమెపని కూడా అతని భార్య నెత్తిన పడుతుందని ఊహించలేక పోయాడు. కోడలిని సెలక్ట్ చేసుకునే విషయంలో బోల్తా పడ్డారు. ప్రతి విషయంలోనూ తనమాటే నెగ్గాలనుకోవడం, చిన్నచిన్న విషయాలకు పంతాలకు పోవడం, కాదంటే అలిగి పడుకోవడం కోడలికి షరా మామూలే!


ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయనట్లు కొద్దిరోజుల్లోనే పులిగా ఉండే అతని కొడుకు పిల్లిగా మారిపోయాడు. కన్నకొడుకు తల్లిదండ్రులపై నిర్లక్షం చూపడంతో రంగారావు మనసు విరిగిపోయింది. భార్య ముందు నోరెత్తటం మానేసి, బుద్దిగా ఆమెచెప్పేది వినటం నేర్చుకున్నాడు పుత్ర రత్నం. కుక్కిన పేను లా ఉంటూ భార్యను ప్రసన్నం చేసుకొనే స్థాయికి దిగజారిపోయాడు. మాటకు మాట, కసురుకు కసురు, విసురుకు విసురు.. ఇంకేమి చేస్తాడు పాపం.


రాముడిలా క్రమశిక్షణలో పెరిగే కొడుకులందరూ ఇంతేనేమో. పెళ్లి కానంత వరకు అమ్మ మాట.. పెళ్లయిన తరువాత భార్య మాట అంటారు. అనుబంధాల విలువ తెలియని వారికి ఎంత చెప్పినా లాభం ఉండదు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న కొడుకుల కథలు ఈ రోజుల్లో సర్వసామాన్యంగా వినిపిస్తున్నాయి.


‘కష్టపడి పండించిన పంట మన కడుపు నింపి ఆకలి తీరుస్తుంది. కన్నకొడుకును ప్రయోజకుడ్ని చేస్తే కడుపు మంట రగిలిస్తున్నాడు’ అనుకున్నాడు రంగారావు. ఆలోచించే కొద్దీ అతని హృదయ కడలిలో ఉవ్వెత్తున ఆలోచనా తరంగాలు లేచి అంతులేని సంచలనాన్ని కలిగిస్తున్నాయి.

కొడుకేదో ఉద్దరిస్తాడని వాడికోసం ఉన్నదంతా ఊడ్చి పెట్టారు. రెక్కలొచ్చిన ఆ పక్షికి ఇప్పుడు తల్లిదండ్రుల అవసరం లేకుండా పోయింది.


ఈ రోజుల్లో రంగారావు లాంటి తల్లిదండ్రులు, అతని కొడుకులాంటి ప్రబుద్ధులు చాలా మందే ఉన్నారు. బాల్యంలో తల్లిదండ్రులు తమ కోసం ఎంత కష్టపడ్డది, ఎన్నెన్ని త్యాగాలు చేసినది మర్చిపోయి స్వార్థం తో వారి ఆనందం వారు చూసుకుంటున్నారు.


రెండేళ్ళకి మనవడు పుట్టాడు. ఇక ఇవన్నీ మరచిపోయి మనవడితో హాయిగా గడపడం వారి దినచర్యలో ఒక భాగం అయింది. వాడి ముద్దు ముద్దు మాటలతో వారిమధ్య ప్రేమానురాగాలు అల్లుకుపోయాయి. వచ్చిరాని మాటలతో రంగరావుకి ఎక్కడలేని శక్తిని ఇవ్వసాగాడు. అన్నీ బంధాలకన్నా మనవడు బంధం ప్రత్యేకమైనదని అందుకే అంటారు.


రోజులు గడిచే కొద్దీ ఇంట్లో పరిస్థితులు మారిపోతున్నాయి. ‘ఏమైయింది’ అడిగాడు భార్య బుగ్గలపై కారుతున్న కన్నీటిని తుడుస్తూ రంగారావు.


“వొంట్లో బాగులేదమ్మా కొంచెం వంట చేయమని కోడలితో చెప్పానండీ. అంతే! ఆగ్రహంతో ఊగిపోతూ ‘ఇంటి పనులు నేను చేయాలా? నన్ను పనిమనిషి అనుకున్నారా?’ అంటూ చిర్రుబుర్రులాడిందండీ!” అతని భార్య వాపోయింది.


“పిచ్చిదానా! దీనికే ఇంతలా బాధపడాలా? కొద్ది రోజుల్లోనే అన్నీ సద్దుకుంటాయి” అంటూ ఆమెను ఓదార్చాడు రంగారావు.


పక్కమీద వాలినా నిద్ర రావడం లేదతనికి. భవిష్యత్తు గురించి ఆలోచనలెన్నో కందిరీగల్లా అతన్ని చుట్టుముట్టాయి. మధుమేహం అదుపు తప్పడంతో నెల రోజుల నుంచి మంచానికి అంకితమై పోయాడు. రోజులు గడుస్తున్నకొద్దీ అతని ఆరోగ్యం క్షీణించసాగింది. ఎన్ని మందులు వాడినా ఫలితం శూన్యం.


రోజురోజుకీ ఆయన పరిస్థితి దిగజారింది. ముఖంలో కళాకాంతులు లేవు. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని జీవిస్తున్నాడు.


రోజులు గడుస్తున్నా ఎడతెగని ఆలోచనలు శ్రావణమాసపు ముసురులా అతన్ని వదలడం లేదు. ఉన్నట్టుండి కళ్ళు మూతలు పడ్డాయి.


అతనికి మెలుకువ వచ్చే సరికి ఆసుపత్రిలో బెడ్ పైన ఉన్నాడు.

“ఎంత డబ్బు అయినా పరవాలేదు డాక్టర్.. మావారు మాములు మనిషిని కావాలి”.. రంగారావు భర్య డాక్టర్ని దీనంగా వేడుకుంటోంది.


“ఆయనకేమీ కాదమ్మా! వారం రోజుల్లో మామూలు మనిషి అవుతాడు. హాయిగా ఇంటికి తీసుకెళ్ళవచ్చు. మీరేమీ వర్రీకాకండి!” రంగారావు భార్యకి దైర్యం చెప్పాడు డాక్టర్.


“ఏమండీ!” భార్య పిలుపు తో నెమ్మదిగా కళ్ళు విప్పాడు రంగారావు. పసిపిల్లలా ఆయన్ని అనునయంగా ఓదార్చుతూ ఆత్మీయంగా భర్త తల నిమిరింది. వారం రోజుల్లో పూర్తిగా కోలుకున్నాడు రంగారావు. అతనిలోని నిసత్తువ, నిరాశ అనే చీకట్లు తొలగిపోయాయి.


ఆయన రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన డబ్బు సగం బ్యాంకులో జమ చేసి, మిగిలిన మొత్తాన్ని వృద్ధాశ్రమానికి విరాళంగా ఇచ్చాడు.


కొడుకు, కోడలికి బరువు కాకూడదనే ఉద్దేశంతో దంపతులిద్దరూ వృద్ధాశ్రమం లో చేరారు. అహంకారం, గర్వం, పొగరు అనేవి చాలా ఖరీదయినవి. వాటిని ఎదు ర్కొనే స్తోమత సామాన్యులయిన వారికిలేదు. అందుకే చవగ్గా దొరికే చిరునవ్వు, సంతోషం, ప్రేమ, ఆప్యాయత అనే సుగుణాలతో సరిపెట్టుకోవడం మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నారు.

***

కాయల నాగేంద్ర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.రచయిత పరిచయం:

నా పేరు కాయల నాగేంద్ర, నేను కేంద్ర ప్రభుత్వ సంస్థలో పని చేస్తూ 31-10-2021 తేదీ రిటైర్ అయ్యాను. నా రచనలు వివిధ దిన, వార, మాస పత్రికలో ప్రచురింపబడ్డాయి. తాజాగా ఈ సంవత్సరం 'విడదల నీహారక ఫౌండేషన్, సాహితీ కిరణం' సౌజన్యంతో నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో 'సంబంధం కుదిరింది' కథకు బహుమతి వచ్చింది.


59 views0 comments

Comments


bottom of page