
'Pachha Bottu' - New Telugu Story Written By P. Gopalakrishna
'పచ్చబొట్టు' తెలుగు కథ
రచన: P. గోపాలకృష్ణ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"బావా, మనం శివరాత్రి జాతరకు పోదామా రేపు" గోముగా అడిగింది.
ఏ కళనున్నాడో ఇంకా తాగింది పూర్తిగా ఎక్కలేదో కానీ "అలాగేలేవే" పెళ్ళాన్ని మీదికి లాక్కుంటూ అన్నాడు కోటేశు.
"ఇంకా బువ్వ తినలేదు కదా బావా!” అంది అతన్ని వదలడానికి ఇష్టం లేకుండానే. ఆరేళ్ళ వాళ్ళ కాపురంలో ఒక్క నలుసు కూడా పుట్టనేలేదు. అయినా ఎలాంటి చింతా లేకుండా ఒకరికొకరు అన్నట్లు కాలం గడిచిపోతోంది. ఎలాగో కోటేశు కౌగిట్లోంచి విడిపించుకొని ఒక మూల ఉట్టిలో పెట్టిన కుండలోంచి కొంచెం అన్నం, ఇంకో కుండలోంచి కూర గిన్నెలో ఏసుకొచ్చి ముందు పెట్టింది. మందు కొంచెం కొంచెం గా నషాళానికి ఎక్కుతోంది అన్నట్లు ముద్దగా మాటలొస్తున్నాయి కోటేశానికి.
"ఏం కూరే ఇది"?,
"ఇయ్యాల నాయుడుగారింటికి పనికెళ్ళలేదు బావా,పేనం బాగోలేకపోయింది. డబ్బుల్నేక పోతే సంతలో తోటకూర తెచ్చి కూరొండానయ్యా", దీనంగా మొహం పెట్టింది.
"నీయవ్వా...కోటేశానికి ఆకుకూరెడతావా!” చేతిలో గిన్నె లచ్చిమి మొహం మీదికి విసిరాడు.
లచ్చిమికి కోపం తారాస్థాయికి చేరిపోయింది. "ఇంట్లోకి అర్ధరూపాయి తెచ్చివ్వవు కానీ, తిండి దెగ్గర మాత్రం పోతురాజులా మెక్కుతావు" గట్టిగానే అరిచింది.
ఇద్దరి మధ్యా కాసేపు రణరంగమే అయ్యింది. ఎప్పటిలా కోటేశం విజయం సాధించి లచ్చిమిని బూతులు తిడుతూ కింద చాప పరుచుకున్నాడు. మందేసినప్పుడు కోటేశు లో రాక్షసుడు బయటికి వస్తాడు. అప్పటిదాకా నోరు మూసుకోవాలనుకున్న లచ్చిమికి పౌరుషం రెట్టింపవుతుంది. అంతే! వాళ్ళ తాటాకు పాక యుద్ధరంగమే అయిపోతుంది.
బావున్నప్పుడు లచ్చిమి తప్ప ఇంకోలోకం ఉండదు వాడికి. పనిచేసి ఇంటికొచ్చేదారిలో పూటుగా తాగి వస్తే రాక్షసుడే.
పక్కనే ఉన్న నులకమంచం లాక్కొని పడుకొని పైకప్పుకేసి చూస్తూ, గంట దాటుతోంది దెబ్బలాట అయిపోయి..
నెమ్మదిగా పక్కకి చేరి పెళ్ళాన్ని దగ్గరకి లాక్కున్నాడు. వాణ్ణి పక్కకి తోసేసి, వెనక్కి తిరిగిపోయింది.
"తప్పైపోనాదే లచ్చిమీ" అంటూ బతిమాలుకోసాగాడు.
లచ్చిమికి లోపల్లోపల నవ్వొస్తోంది. అర్ధరాత్రైతే ఇద్దరూ చిన్నపిల్లలైపోతారు.
"నాకు ఆకలవుతోంది. ఉదయం నుండి ఏమీ తినలేదు బావా" అంది.
"ఎందుకే లచ్చిమీ" అడిగాడు కోటేశు.
"ఇవాళ మన పెళ్ళైన రోజు బావా, గుడికెళ్ళొచ్చాను. నన్ను బలవంతంగా ఇంట్లోంచి తీసుకొచ్చావు కదా!” అంది లచ్చిమి.
లచ్చిమికి మామయ్య వరసయ్యే రాజుతో పెళ్ళి చెయ్యబోయారు వాళ్ళింట్లో. రాజు రెండో పెళ్ళివాడని ఒద్దు అని గొడవపెడితే ఇంట్లో లచ్చిమి వాళ్ళమ్మ నానా అల్లరి చేసింది. పీటల మీది నుండి తీసుకొచ్చి గుడిలో లచ్చిమి మెళ్ళో తాళికట్టాడు కోటేశు. అప్పటినుండి లచ్చిమి తల్లి ఇంటికి రానివ్వడం మానేసింది.
కోటేశు గబగబా గిన్నెలో ఇంత అన్నం కలిపి తీసుకొచ్చి, "నన్ను సెమించవే లచ్చిమీ" అంటూ అన్నం తినిపించాడు. ఇద్దరూ ఒకరికొకరు అన్నం తినిపించుకుంటూ కబుర్లలో పడ్డారు.
"ఇవాళ మన పెళ్ళి రోజు బావా, ఉదయం గుళ్ళోకెళ్లి వచ్చాను. ఎందుకో కళ్ళు తిరిగాయి. ఏమీ తినాలనిపించలేదు బావా. అలాగే పనిలోకి ఎల్లాను" అంది లచ్చిమి.
"నువ్వు పని మానెయ్యవే లచ్చిమీ. నాను పోసిత్తాను నిన్ను. తాగుడు మానెత్తానే రేపటినుండి". కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు కోటేశు.
"ఏటి బావ ఇది. సిన్నపిల్లోడిలా ఏడుత్తావేటి?" కళ్ళు తుడిచి దగ్గరకు తీసుకుంది కోటేశుని.
"ఎప్పుడూ లేంది ఇయ్యాల ఏడుత్తున్నావేటి?” లచ్చిమి మొహం బాధగా ఉంది.
"లేదే లచ్చిమీ.. నువ్వు బంగారం. నేను పెతిసారి నిన్ను కొడుతున్నాను. ఇంకెప్పుడూ నిన్నేమీ అననే", దగ్గరగా లాక్కున్నాడు.
ఇద్దరూ ఒకరిలో ఒకరు కరిగిపోయేవేళ. లాంతరు వెలుతురు పెంచింది లచ్చిమి. అలాంటి వేళ దీపం పెద్దదిగా ఉంచుకోవడం ఇద్దరికీ ఇష్టం. కోటేశు జబ్బ మీద లచ్చిమి పేరు పచ్చబొట్టుతో వేయించుకున్నాడు. కండలు తిరిగిన కోటేశు జబ్బలు అంటే లచ్చిమికి చాల ఇష్టం.
"ఏటి బావా ఇక్కడ వేయించుకున్నావు పచ్చబొట్టు" అడిగింది, పేరును తన చేతివేలుతో తడుముతూ.
"లచ్చిమీ నువ్వు లేకపోతే నేను లేనే" అన్నాడు కోటేశు.
లచ్చిమి కడుపులో తిప్పుతున్నట్లుంది. "బావా కడుపులో తిప్పుతోంది" అంది అతనిలో కరిగిపోతూ.
"ఏటయ్యిందే లచ్చిమీ" అడిగాడు ఆత్రంగా.
"నీ జబ్బమీద పచ్చబొట్టు గుర్తులాగా, నా కడుపులో నీ గుర్తు పెరుగుతోందయ్యా" అంది లచ్చిమి.
"ఎంత చల్లని మాట సెప్పావే లచ్చిమీ" అంటూ ఆమెను ముద్దుల్లో ముంచెత్తాడు. వాళ్ళ ముద్దు మురిపాలకు అడ్డెందుకని లాంతరు లో వెలుగుతున్న దీపం కొండెక్కిపోయింది సిగ్గుపడి.
"రేపు ఆసుపత్రికి ఎల్దామే లచ్చిమీ" అన్నాడు కోటేశు.
"నేను ఎల్లొచ్చాను బావా, పక్కింటి సుబ్బులు తీసుకెళ్లింది. మూడోనెల అన్నారు డాట్టరమ్మ. మందులు కొనుక్కోమని సీటీ ఇచ్చారు" అంది.
"ఉదయం మనం దుర్గమ్మ గుడికి ఎల్లి ఒద్దామె. నేనింక తాగుడు మానేసి, మన చిట్టి పాపకి ఆ డబ్బంతా దాస్తాను". మురిపెంగా భార్యను చూస్తూ చెప్పాడు కోటేశు. అతని కౌగిట్లో కరిగిపోయింది లచ్చిమి.
**************************
P. గోపాలకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు గోపాలకృష్ణ. పుట్టింది, పెరిగింది శ్రీకాకుళం జిల్లా లో. చిన్నప్పటినుండి కథలూ,కవితలూ, రాయడం చదవడం ఇష్టం. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. నా తల్లిదండ్రులు చిన్నప్పటినుండి ఇచ్చిన ప్రోత్సాహమే రచనావ్యాసంగాన్ని అంటిపెట్టుకొనేలా చేసింది. పచ్చబొట్టు కథ ఈ సైట్ లో నేను రాస్తున్న మొదటి కథ. నా కథలను తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
𝓚𝓡'𝓼 కథామాలిక
•9 hours ago
🎉
@GKP-tt6ci • 1 day ago
Thank you sir
@palakaveerraju2800 • 2 hours ago
Super sir