పంతం పద్మ
- Mohana Krishna Tata

- Jul 25
- 4 min read
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #PanthamPadma, #పంతంపద్మ, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Pantham Padma - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 25/07/2025
పంతం పద్మ - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"పద్మా. ! స్నానానికి వేడినీళ్లు ఇంకా పెట్టనేలేదు.. స్నానంచేసి వెంటనే ఆఫీస్ కు వెళ్ళాలి.. లేట్ అవుతోంది" అన్నాడు ప్రసాద్.
"అవును.. ఇంకా పెట్టలేదు"
"ఈ రోజు నీకు ఏమైంది? ఆరోగ్యం బాగోలేదా.. ?"
"ఆరోగ్యం కాదు.. మనసు బాగోలేదు.. ఎందుకో మీకు తెలియదా.. ?"
"నిన్న రాత్రి అత్తాకోడళ్ళ సీరియల్ ఏమైనా చూసావా.. ? అందుకే సీరియల్స్ గట్రా చూడొద్దని చెప్పేది.. "
"అబ్బే.. ఇది సీరియల్ ఎఫెక్ట్ కాదు లెండి.. ('మీ వల్ల వచ్చిన ఎఫెక్ట్ లెండి' - అని పద్మ మైండ్ వాయిస్)
"పోనీ వంట ఏమైనా చేశావా? దానికీ మనసు బాగోలేదా?"
"వంట చెయ్యాలనిపించలేదు.. రోజూ చేసి చేసి బోరుకొడుతోంది"
"ఎందుకు అలా ఉన్నావు.. చెప్పు"
"మీకు తెలియదా? మనం రిసార్ట్స్ కి వెళ్లి.. నాలుగు రోజులు ఉందామని అడిగాను కదా.. "
"అదా.. అది కుదరదు. అయినా ఎందుకంత పంతం పద్మా! ఇంటిపని కూడా చెయ్యకుండా ఇలా ఉంటే ఎలా? "
"రిసార్ట్స్ లో చక్కగా స్విచ్ నొక్కితే వేడి నీళ్లు.. బెల్ కొడితే భోజనం.. భలే ఉంటుందంట.. పక్కింటి పిన్నిగారు చెప్పారు. వాళ్ళు ఎప్పుడూ రిసార్ట్స్ కి వెళ్తారు. సిటీ లో ఉన్నామనే మాటే గాని.. ఇప్పటివరకు మనం వెళ్ళలేదు. అక్కడ స్విమ్మింగ్ పూల్, గేమ్స్ అన్నీ భలే ఉంటాయి.. నాకు రిసార్ట్స్ ట్రిప్ కావాలి.. "
"దానికి బోలెడంత డబ్బులు కావాలి. మీ ఆయన జస్ట్ ఒక చిన్న ఉద్యోగస్తుడని మరచిపోకు.. నేనేమైనా అంబానీ ఇంట్లో చపాతీ చేసే పనివాడిని అనుకున్నావా?"
"ఎలాగో డబ్బులు అడ్జస్ట్ చేసుకోండి.. లేకపోతే, రోజూ మీరు ఫుడ్ బయటనుంచి తెప్పిస్తే, మీకు రిసార్ట్స్ కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది.. ఆలోచించుకోండి మరి"
"స్వీట్ మెమొరీస్" మళ్ళీ రావు అల్లుడు! ఓకే చెప్పు.. అమ్మాయి అంతగా అడుగుతూ ఉంటేనూ.. " అన్నారు మామగారు
"మీరు స్పాన్సర్ చెయ్యండి మావగారు.. ! మాకు హనీమూన్ కి ఎలాగో మీరు ఎక్కడకు పంపించలేదు కదా.. "
"నాకెందుకు ఇవన్నీ.. మీరు మీరు చూసుకోండి.. " అంటూ మామగారు జంప్!
"చూసావా.. మీ నాన్న ఎలా అంటున్నారో?"
"అయినా మా నాన్న ఎందుకు చేస్తారు చెప్పండి.. ! పెళ్ళైన తర్వాత నా అకౌంట్ అంతా మీరే చూసుకోవాలి. ఇదొక్కట్టి చెయ్యండి.. మిమల్ని ఇంకేమి అడగను. నా కోసం ప్లీజ్.. ! ప్లీజ్.. !" అంటూ భుజం మీద చెయ్యి వేసింది పద్మ.
"ఇప్పుడు కనీసం ఒక యాభై వేలు కావాలి.. ఆఫీస్ లో సుబ్బారావు దగ్గర అప్పు చేస్తాను.. నీ కోసం, పద్మ.. "
***
"ఇరవయ్యో తారీకు ఉదయం మనం బయల్దేరుతాము.. ఫోర్ డేస్ మనం అక్కడే పద్మ.. నీకున్న నాలుగు చీరలు సర్దుకో"
"మీరు ఎంత మంచివారండీ.. నాకోసం ఒప్పుకున్నారు. ఇప్పుడే మీకోసం వేడినీళ్లు సిద్ధం చేస్తాను.. వేడిగా ఇడ్లీ చేసి పెడతాను. అలాగే బూట్లు కూడా పాలిష్ చేసి పెడతాను. ఇడ్లీ తినగలరా? లేకపోతే నోట్ల పెట్టనా?"
"రిసార్ట్స్ అనగానే చాలా హుషారు వచ్చిందే.. మేడం గారికి"
"మీరు ఒప్పుకున్న తర్వాత కూడా.. భర్తకు ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా చెప్పండి? రాత్రి మీకోసం ఇంకా స్పెషల్ గా అన్నీ చేసి పెడతాను"
'పెళ్ళాం చేస్తానన్నప్పుడే చేయించుకోవాలే ప్రసాదూ.. ఎంజాయ్' అని ప్రసాద్ మైండ్ వాయిస్.
ఆ రోజు రాత్రి పెళ్ళాం చేసిన విందు భోజనం తిన్నాక.. "ఏమండీ.. ! ఈ రోజు పదిహేనో తారీకు.. ఇంకా ఐదు రోజుల్లో మన ట్రిప్.. "
"అయితే ఏంటి.. బట్టలు సర్దేసావా?"
"ఏమండీ.. ! రిసార్ట్స్ అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారంట కదా.. "
"అవును.. అందరూ వస్తారు.. అయితే?"
"అక్కడ రిచ్ గా కనిపించాలిగా! నా దగ్గర కొత్త చీరలు, బట్టలు ఏమీ లేవు.. అలా లేకపోతే, అక్కడ గార్డ్ కూడా నమస్తే పెట్టడంట కదా.. పక్కింటి పిన్నిగారు చెప్పారు. మొన్న పక్కింటి పిన్నిగారైతే రిసార్ట్స్ వెళ్ళేముందు అన్నీ కొత్త బట్టలే కొన్నారుట.. అప్పుడే రిచ్ గా కనిపిస్తామంట. అందుకే మనమూ షాపింగ్ కి వెళ్ళాలండీ.. మీరు కూడా రెండు జీన్స్, మంచి షర్ట్స్ తీసుకోండి.. "
"ఇప్పుడు అంత బడ్జెట్ లేదు పద్మ"
"నా కోసం ప్లీజ్.. ! ప్లీజ్.. !" అంటూ భుజం మీద చెయ్యి వేసింది పద్మ
"నువ్వు మరీ అలా చెయ్యి వేసి ప్లీజ్ అంటుంటే.. ఐస్ అయిపోతానే.. కంట్రోల్ తప్పిపోతానే"
"అయితే పదండి మరి రేపు షాపింగ్ కి.. "
ఇద్దరూ షాపింగ్ కోసం ఉదయాన్నే షాప్ ఓపెన్ చేసే టైం కే బయల్దేరారు..
"ఇగిదో పద్మ.. ! నా రెండు జీన్స్, షర్ట్స్ తీసుకున్నాను.. మొత్తం కలిపి ఆరు వందలు.. నా బడ్జెట్ లో వచ్చేసింది"
"పది నిమిషాలలో అయిపోయిందే మీ షాపింగ్.. గ్రేట్! మీకు పెద్ద వెరైటీస్ ఏమ్ముంటాయి లెండి.. ఎప్పుడూ అవే రంగులు, గీతలు"
"అంతేగా.. అంతేగా.. మగవారు బట్టలకోసం అంతగా ఆలోచించరు.. అందుకే తయారు చేసేవారికీ అంత కష్టం ఉండదు"
ఉదయం సూర్యోదయానికి వెళ్ళిన జంట, చీకటి పడినా.. ఇంకా చీరలు చూస్తూనే వుంది పద్మ.. పాపం ప్రసాద్ దీనంగా కూర్చొని దిక్కులు చూస్తున్నాడు.
"ఇదిగోండి నా షాపింగ్ బిల్.. "
"ఇంతకీ బిల్ ఎంత.. ?"
"ఎంతో లేదు.. ఒక కిలో కొంటె ఒక కిలో ఫ్రీ ఇచ్చారు.. అందుకే, ఒక ఐదు కిలోలు తీసుకున్నాను.. కిలో చాలా చీప్ అండి.. పదివేలే"
"అంటే యాభై వేలకు ఎసరు పెట్టావా? ఇప్పుడు ఒక ఆటో మాట్లాడాలేమో" అని తలపట్టుకున్నాడు ప్రసాద్
"ఏముందండీ.. నా కోసం ప్లీజ్.. ! ప్లీజ్.. ! " అంటూ మళ్ళీ భుజం మీద చేయి వేసింది పద్మ.
"నన్ను మళ్ళీ ఐస్ చేసేస్తున్నావే పద్మ.. ఇప్పుడు మళ్ళీ డబ్బులకోసం నేను ఎవరిని ఐస్ చెయ్యాలో?"
"సర్.. ! కొంచం డిస్కౌంట్ ఇవ్వండి.. మా ఆవిడ ఇన్ని బట్టలు కొందిగా.. " అని షాప్ వాడిని బతిమాలాడు ప్రసాద్.
"కుదరదు.. మీ ఆవిడ షాప్ లో ఉన్న అన్ని బట్టలు తీయించింది.. సర్డుకోవడానికి మాకు ఎన్ని రోజులు పడుతుందో.. ! ఇంకా ఫైన్ వెయ్యలేదు సంతోషించండి"
('దీనికన్నా బయట ఫుడ్ తెప్పించుకుంటే సరిపోయేది.. లేకపోతే నేను వంట నేర్చుకుని చేసినా సరిపోయేది. పెళ్ళాం మాటలకు ఐస్ అయిపోతే.. భర్తకు మిగిలేది నిరాశే.. ' మైండ్ వాయిస్ అనుకుని బయటకు అనేసాడు ప్రసాద్)
"అందుకే సార్.. పెళ్ళైన కొత్తలోనే మగవాళ్ళు వంట నేర్చేసుకోవాలి.. " అని షాప్ ఓనర్ వాయిస్ వినిపించింది.
*********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ




Comments