top of page

పారిజాతం

గమనిక : ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి 2021 కథల పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకుంది. ఎంపికలో పాఠకుల అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకున్నాం.

Parijatham Written By Udaya Sankar Balabhadrapatruniరచన : బలభద్రపాత్రుని ఉదయ శంకర్


అది 1946 - వ్యయ నామ సంవత్సరం. శ్రీకృష్ణాష్టమి ఉత్సవాల చివరి రోజు. వేణుగోపాల స్వామి ఆలయ మండపంలో పారిజాతం చేస్తున్న అద్భుతమైన నాట్యానికి, ఆమె సౌందర్యానికి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వ ఉన్నతాధికారి రాబర్ట్ పరవశించిపోయాడు. మూలవిరాట్టులకు అలంకరించిన వజ్రాభరణాలనూ, ఉత్సవ విగ్రహాలనూ నిశితంగా పరిశీలిస్తూ, పక్కనే ఉన్న జమీందారు రాజమన్నారుని పారిజాతం గురించి, దేవుడి ఆభరణాల గురించి వివరాలు అడిగాడు.


జమీందారు మనసు ఏదో కీడు శంకించింది. కానీ అడిగింది ప్రభుత్వ ఉన్నతాధికారి కావటంతో చెప్పక తప్పలేదు. "ఆమె పేరు పారిజాతం... ఇక్కడి దేవదాసి!" అని గర్భగుడిలోకి చూస్తూ "అవి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి స్వర్ణ, వజ్రాభరణాలు. ఆ పంచలోహ ఉత్సవమూర్తులు ఏనాడో రాజులు బహూకరించినవి" అని కాసేపు ఆగి "ఎందుకలా అడిగారు?" అన్నాడు అనుమానంగా.


రాబర్ట్ వికృతంగా నవ్వి, "ఇంత విలువైన ఆభరణాలు ఉండవలసింది ఇక్కడ కాదు. ఉత్సవాలు ముగిశాక వీటిని ప్రభుత్వ ఖజానాకు తరలించాలి" అన్నాడు.

దగ్గరలోనే ఉన్న ప్రధాన అర్చకుడు అనంతాచార్యులు కలుగజేసుకుని "ఏలినవారు క్షమించాలి. తరతరాలుగా స్వామి వారికి అలంకారాలుగా ఉన్న ఈ ఆభరణాలను తరలించటం మహా పాపం" అన్నాడు.


రాబర్ట్ ఆగ్రహంతో "నాన్సెన్స్! రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికే ధిక్కారమా? ఇది ప్రభుత్వ ఆదేశం. అమలు జరగాల్సిందే" అని హుంకరించాడు. కాసేపు ఆగి, కాస్త స్వరం తగ్గించి "ఆమెను ఈ రాత్రికి మా గెస్ట్ హౌస్ కి పంపండి" అన్నాడు మళ్ళీ.


రాజమన్నారు గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఆమెను తన ఉంపుడుగత్తెగా చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఆమెను రాబర్ట్ దగ్గరకు పంపటం, దేవుడి నగలు ప్రభుత్వ పరం చేయటం రెండూ అతడికి ఇష్టం లేదు. కానీ రాబర్ట్ చెప్పినట్లు చేయకపోతే ప్రభుత్వంతో అనవసరమైన చిక్కులు తప్పవు. పైగా తను రావు బహద్దూర్ టైటిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అతడు కర్తవ్యం ఆలోచిస్తుండానే, రాబర్ట్ మోటారు వాహనం దుమ్ము లేపుకుంటూ గెస్ట్ హౌస్ వైపు దూసుకెళ్లింది.


మేకప్ తీసేసి అప్పుడే సాధారణ దుస్తుల్లో బయటికి వచ్చిన పారిజాతం విచారంగా ఉన్న జమీందారుని, అనంతాచార్యులుని చూసి "ఏమిటలా ఉన్నారు? నా నాట్యం రాబర్ట్ గారికి నచ్చలేదా? ఏమైనా అన్నారా?" అంది అమాయకంగా.


రాజమన్నారు కాస్త తటపటాయిస్తూనే రాబర్ట్ కోరికలు ఆమె ముందుంచాడు. పారిజాతం హతాశురాలైంది. ఆమె నిరసనగా చూస్తూ "పరస్త్రీని, దేవుడి సొత్తును ఆశించటం తప్పని మీరు చెప్పలేదా?" అంది తీవ్రంగా.


అనంతాచార్యులు చిన్నగా నిట్టూర్చి "రెండు వందల ఏళ్ళ నుంచి మన దేశ సంపదను దోచుకోవడానికి అలవాటు పడ్డారు ఈ తెల్లవాళ్ళు. వీళ్ళని తరిమి కొట్టాలని మనవాళ్ళు తొంభై ఏళ్ళుగా పోరాడుతూనే ఉన్నారు. అధికార మదాంథులకు మనం చెప్పే నీతి వాక్యాలు తలకెక్కవు" అన్నాడు విచారంగా.


బ్రిటిష్ అధికారులంటే భయం, భక్తి ఉన్న జమీందారు మాత్రం "నువ్వు ధర్మపన్నాలు వల్లిస్తూ కూర్చుంటే, అతడు అధికార బలంతో ఏమైనా సాధించుకోగలడు. అందుకని నువ్వే ఎలాగో అతడిని సంతృప్తిపరిచి, నీ మైకంలో ఉండగానే దేవుడి ఆభరణాల మీద నుంచి అతడి దృష్టిని మళ్ళించు. నువ్వంటే పడి చస్తున్నాడు. అది నీ వల్లే సాధ్యం అవుతుంది" అన్నాడు.


జమీందారు మాటలు వింటుంటే ఆమెకు కన్నీళ్ళు ఆగలేదు. "మాకు పెద్ద దిక్కైన మీరేనా ఆ మాట అంటున్నది? ఆడదంటే భోగ వస్తువు అనుకున్నారా? ఐహిక సుఖాలను విడిచిపెట్టి దేవదాసిగా మారింది ఇందుకేనా? శ్రీకృష్ణపరమాత్మకే జీవితం అంకితం చేసిన నాకెందుకీ శిక్ష?" అని రోదించింది.


ఆమె ప్రశ్నలకు అతడి దగ్గర సమాధానాలు లేవు. అయినా దర్పంగా చూస్తూ "ప్రభుత్వాన్ని ధిక్కరించటం రాజద్రోహమే అవుతుంది. గోపాలపురం జమీందారుగా ఆదేశిస్తున్నాను. దేవదాసిగా ఉన్న నీకు దేవుడి ఆస్తిని కాపాడే బాధ్యత కూడా ఉంది. చెప్పింది చెయ్యకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి" అని హెచ్చరించి దివాణం వైపు సాగిపోయాడు రాజమన్నారు.


ఆమె వేదన అరణ్యరోదనే అయింది. అనంతాచార్యులు నిస్సహాయుడని పారిజాతానికి తెలుసు.‌ ఆ నిశిరేయి ఆమె చింతాక్రాంతయై మూర్తీభవించిన శోకదేవతలా ఉంది.


******


బాలభానుడి బంగారు కిరణాలు భూపాల రాగం ఆలపించే వేళ, గోపాలపురం గ్రామం ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. అర్ధరాత్రి వేణుగోపాల స్వామి ఆలయం మీద బందిపోట్లు దాడి చేశారని, పారిజాతంతో సహా దేవుడి నగలను, ఉత్సవ విగ్రహాలను దోచుకెళ్ళారనే వార్త దావానలంలా వ్యాపించింది.


అసలే పారిజాతాన్ని పంపనందుకు అగ్గిమీద గుగ్గిలం అవుతున్న రాబర్ట్, విలువైన ఆభరణాలు కూడా పోయాయని తెలిసి ధర్మకర్తల మీద విరుచుకు పడ్డాడు. "నేను ఇక్కడ ఉండగా, ఇంత సెక్యూరిటీలో ఎవరు అంత ధైర్యం చేస్తారు? ఇది ఆ నాట్యగత్తె పనే అయి ఉంటుంది. ముందు ఆమెను వెదకండి" అన్నాడు.


అనంతాచార్యులు భయంతో వణికిపోతూ "దొంగలు రావడం నిజమే దొరగారూ! నడి ఝామున ఒక ముసుగు మనిషి నా మెడ మీద కత్తి పెట్టి నన్ను చంపుతానని బెదిరించాడు. భయంతో నాకు స్పృహ తప్పింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు. పారిజాతం వేసిన కేకలకు నాకు తెలివి వచ్చింది. అప్పటీకే సమయం మించిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఆగంతకులు చీకట్లో కలిసి పోయారు" అని కాస్త ఊపిరి పీల్చుకునే "అయినా కానిస్టేబుళ్ళు మీ భవనం వద్ద ఉన్నారు కానీ ఆలయం వద్ద లేరుగా. అదీగాక ఒక అబల అంతటి సాహసం చేస్తుందనుకోను" అన్నాడు.


రాజమన్నారుకేమీ పాలుపోవట్లేదు. వాస్తవం అతడి ఊహకు అందటం లేదు. రాబర్ట్ కి ఇదంతా కట్టుకధలా గోచరించింది. పారిజాతం కోసం గాలించమని పోలీసులను ఆదేశించాడు. 'పారిజాతం దేవుడి సొత్తుని దొంగిలించి పారిపోయింది'' అని ఆ పరగణా మొత్తం చాటింపు వేయించి, ఆమెకు ఎవరూ ఆశ్రయం ఇవ్వరాదని హెచ్చరించారు. ఆమెను నగలతో పట్టించిన వారికి వెయ్యి రూపాయల నజరానా కూడా ప్రకటించింది ప్రభుత్వం.


******


ఆమె జుట్టంతా రేగిపోయి ఉంది. దుస్తులు మట్టి కొట్టుకు పోయాయి. వాగులు, వంకలు దాటుకుంటూ భారంగా నడుస్తుంది. రాత్రంతా నిద్ర లేకపోవటంతో ఆమె అడుగులు తడబడుతున్నాయి‌. 'ఇంకొక్క క్రోసు దూరం నడిస్తే రైలు బండిని పట్టుకోవచ్చు' అనుకుంది. ఇంతలో ఎదురుగా వస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆమెను గుర్తుపట్టి "నువ్వు గోపాలపురం ఆలయంలో దేవదాసివి కదూ! నీ కోసం జమీందారు గారు వెదుకుతుంటే ఇక్కడేం చేస్తున్నావు?" అని ఒకడు అంటుండగానే, రెండోవాడు ఆమె పారిపోకుండా చెయ్యి పట్టుకున్నాడు.


పారిజాతం ఇక తన మాన, ప్రాణాల మీద ఆశ వదులుకుంది. ఆమె ఏదో చెప్పబోతున్నా వాళ్ళు వినే స్థితిలో లేరు. వాళ్ళ దృష్టంతా జమీందారు గారు ఇచ్చే బహుమతి మీదే ఉంది. ఆగమేఘాల మీద ఆమెను రాజమన్నారు ముందు ప్రవేశపెట్టారు. అతడు ఆమెను తీక్షణంగా చూస్తూ "దేవదాసీగా ఉంటూ దేవుడి ఆభరణాలు దొంగిలించడానికి నీకు సిగ్గుగా లేదూ?" అన్నాడు.


ఆమె భీతహరిణిలా వణికిపోతూ "నన్ను నేను దేవుడికి అర్పించుకుని దేవదాసిని అయ్యాను. ఇక నాకు దేవుడి సొత్తు ఎందుకు జమీందారు గారూ? బందిపోట్లు దేవాలయం మీద పడి సర్వం దోచుకున్నారు. వాళ్ళు కొంతదూరం నన్ను రక్షణ కవచంలా వాడుకొని, తర్వాత అడవుల్లో వదిలేశారు. కరడుగట్టిన ఆ దొంగలను ఎదుర్కొనే శక్తి నాకు లేకపోయింది" అంది.


పారిజాతాన్ని చూస్తుంటే ఆమె చెప్పింది నిజమేనేమో అనిపించింది రాజమన్నారుకి. ఆమె దుస్తులు చిరిగి పోయి, మట్టికొట్టుకుని ఉన్నాయి. ఆమెను ఆ స్థితిలో చూస్తుంటే ఆమెపై అత్యాచారం కూడా జరిగిందేమో అనిపించింది. జమీందారు హేళనగా నవ్వుతూ "రాబర్ట్ తో ఒకరాత్రి గడపమంటే పేద్ద పతివ్రతలా నీతులు చెప్పావు. చివరికి ఆ దొంగల చేతిలో నీ బతుకు కుక్కలు చింపిన విస్తరి అయింది" అన్నాడు తన ఊహ వాస్తవమేనని నిర్ధారించుకుంటూ.


అతడి మాటలకు ఆమె సిగ్గుతో చచ్చిపోయింది. రేగిన కురులను సవరించుకుంటూ, ముళ్ళకంపల్లో చిక్కుకుని చిరిగిన రవికెపై చీర చెంగు కప్పుకుని మౌనం దాల్చింది.

ఇప్పుడు తను ఏం చెప్పినా నమ్మరని ఆమెకు తెలుసు.


రాజమన్నారు ఆలోచనలు చకచకా కదులుతున్నాయి. తను ఉంపుడుగత్తెగా చేసుకోవాలనుకున్న దేవదాసిని బందిపోట్లు చెరిచి వదిలేశారు. కుక్క ముట్టిన కుండలా మైలపడ్డ పారిజాతం యవ్వనం తనకు అవసరం లేదు. ఇక ఆమెను రాబర్ట్ దగ్గరకు పంపి అతడిని ప్రసన్నం చేసుకోవచ్చు. తన విధేయతకు రావు బహద్దూర్ టైటిల్ వస్తుంది. అది తమ వంశానికే వన్నె తెస్తుంది. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా అతడు దాసీలను పిలిచి ఏదో చెప్పాడు. వారు పారిజాతాన్ని తోట బంగాళాకి తీసికెళ్ళారు.


జమీందారు వెంటనే రాబర్ట్ ని కలిసి "మీ కోరిక తీరబోతుంది. పారిజాతం తన అందాలతో మీకు ఈ రాత్రి విందు చేస్తుంది" అన్నాడు సవినయంగా.


రాబర్ట్ సంబ్రమంగా చూస్తూ "వ్వాట్? పారిజాతం దొరికిందా? మరి ఆభరణాలు ఎక్కడున్నాయి?" అని ప్రశ్నించాడు. రాజమన్నారు చేతులు నలుపుకుంటూ "దొరగారు క్షమించాలి. బందిపోట్లు ఇంకా దొరకలేదు. మనవాళ్ళు గాలిస్తున్నారు. త్వరలోనే నగలను కూడా స్వాధీనం చేసుకుంటాం" అన్నాడు.


రాబర్ట్ మండిపడి "మీరు ఇంత చేతకాని దద్దమ్మలు అనుకోలేదు. మీకు రెండు వారాల గడువు ఇస్తున్నాను. ఈలోగా దేవుడి ఆభరణాలు అప్పజెప్పాలి. లేదంటే పన్నులు రెట్టింపు చేస్తాం" అని హెచ్చరించి, పారిజాతం అందాలను తల్చుకుంటూ "ఈ రాత్రికైనా ఘనమైన ఏర్పాట్లు చెయ్యండి" అన్నాడు ఓరగా చూస్తూ.


******


సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి. దాసీలు పారిజాతాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అపర రతీదేవిలా ఉన్న పారిజాతాన్ని చూస్తుంటే రాజమన్నారు మనసు వశం తప్పింది. అతి కష్టం మీద తనను తాను నిగ్రహించుకుని, ఆమెను తన గుఱ్ఱపు బగ్గీలో గెస్ట్ హౌస్ కి సాగనంపాడు. ఆమెకు తోడుగా తన నమ్మినబంటు మాల్యాద్రిని కూడా పంపాడు.


దారిలో ఆమె వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయంలో పారిజాతం మొక్కను నాటి, స్వామిని దర్శించుకుంది. బలికి సిద్ధం చేసిన మేకలా ఉన్న పారిజాతాన్ని చూసిన ఆచార్యులకు దుఃఖం ఆగలేదు. కళ్ళతోనే ఆమెను మనసారా ఆశీర్వదించాడు.


ఆమె గెస్ట్ హౌస్ కి చేరుకునే సరికి చీకటి బాగా చిక్క బడింది. పారిజాతం లోపలికి ప్రవేశిస్తూనే "అమ్మా!" అంటూ బాధగా అరిచి కుప్పకూలిపోయింది. పని వాళ్ళందరూ హాహాకారాలు చేస్తూ ఆమె చుట్టూ మూగి సపర్యలు చేయటం ప్రారంభించారు. ఇవేమీ తెలియని రాబర్ట్ అప్పుడే గది నుండి బయటకు వచ్చి, పారిజాతాన్ని చూస్తూనే "వెల్కమ్ మై డియర్ బ్యూటీ!" అన్నాడు చేతులు చాపి.


ఆమె పంటి బిగువున బాధను నొక్కిపెట్టి "పారిజాత పుష్పం భారత నారికి ప్రతీక. పారిజాతం తనంత తానుగా రాలి పోవాలే గానీ, చెట్టు నుంచి కోసే సాహసం ఎవరూ చేయలేరు" అని వంట్లోని శక్తినంతా కూడ దీసుకుని రాబర్టునే చూస్తూ "ఈ పారిజాతం రాలిపోయినా అది చేరేది శ్రీకృష్ణపరమాత్మ పాదాల చెంతకే కానీ, నీలాంటి కామాంధుల బాహువుల్లోకి కాదు" అని ప్రతి పదం ఒత్తి పలుకుతూ "మాధవా… ముకుందా…మురారీ..." అంటూ తల వాల్చేసింది.


గెస్ట్ హౌస్ లోని దాసీ జనమంతా నిశ్చేష్టులై చూస్తుంటే, రాబర్ట్ నెత్తి మీద ఉన్న హ్యాట్ తీసి చేత్తో పట్టుకొని "ఓ మై గాడ్!" అంటూ తల వంచాడు. పాషాణం లాంటి అతడి హృదయం బాధతో కలుక్కుమంది.


తన కళ్ళ ముందే కుప్పకూలిన పారిజాతాన్ని చూసి నిర్ఘాంతపోయిన మాల్యాద్రికి దారిలో జరిగిన సంఘటన గుర్తొచ్చింది. గుఱ్ఱపు బగ్గీ గన్నేరు పొదల సమీపానికి చేరుతుండగా పారిజాతం బిడియంతో తటపటాయిస్తూ "రెండు రోజుల నుంచి తిండితిప్పలు లేక, వంట్లో ఉష్ణం పెరిగి ఎంతో ఇబ్బందిగా ఉంది. బండి కాస్త పక్కన ఆపుతావా? చెట్టు చాటుకి వెళ్ళి వస్తాను" అంది. గన్నేరు పప్పు కోసమే ఆమె బండి ఆపమందని తను ఏమాత్రం ఊహించినా, ఆమె ప్రాణం నిలబెట్టే వాడినని అతడు చింతించాడు.


******


దేవదాసి లేకపోవటంతో వేణుగోపాల స్వామికి సంగీత, నృత్య నీరాజనాలు లేవు. వజ్రాభరణాల అలంకరణలు లేవు. సంవత్సర కాలం భారంగా గడిచింది. 1948లో దేశానికి స్వాతంత్య్రం రావచ్చని వార్తలు వస్తున్నాయి. 'ఈ సంవత్సరం ఉత్సవాలకి దేవుడికి వజ్రాభరణాల అలంకారం లేదన్న మాట' అనుకొని నిట్టూర్చాడు అనంతాచార్యులు పంచాంగం చూసుకుంటూ.


అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్, మిత్ర దేశాలకు లొంగిపోయి 1947 ఆగష్టు15కి రెండేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా, ఆ రోజునే భారత స్వాతంత్య్ర దినంగా నిర్ణయించాడు బ్రిటీష్ ఇండియా గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్. దీంతో 1948లో వస్తుందనుకున్న స్వాతంత్ర్యం 1947 లోనే వచ్చింది.


ఆనందం అర్ణవమైన అనంతాచార్యులకి పారిజాతం గుర్తొచ్చింది. క్రిందటి వ్యయనామ సంవత్సరంలో, రాబర్ట్ దేవుడి ఆభరణాలను ప్రభుత్వపరం చేయమన్న రోజున తమ మధ్య జరిగిన సంభాషణ ఆయన స్మృతి పథంలో మెదిలింది. ఆ రోజు అర్ధరాత్రి ఆమె ఆచార్యుల దగ్గరకు వచ్చి తన మదిలో ఉన్న ఆలోచనను చెప్పింది.


ఆమె తెగింపు చూసి నివ్వెరపోయిన ఆచార్యులు ఏం చెప్పాలో తోచక సందిగ్ధంలో పడిపోయాడు. "నువ్వు చెప్పినట్లు చేస్తే సంఘం ముందు మనం దోషులుగా నిలబడాలి" అన్నాడు.


పారిజాతం మాత్రం అన్నింటికీ సిద్ధపడినట్లు "మనకి ఈ ఒక్క రోజే అవకాశం ఉంది. ఇప్పుడు సాహసించకపోతే రేపు నేను ఆ తెల్ల కుక్కకు లొంగిపోవల్సిందే. మీరు స్వామి వారి నగలను వాడికి సమర్పించుకోవల్సిందే. దేవుడి సంపదను రక్షించుకోవాలంటే, తెల్లవాడి పాలన ముగిసే వరకు వాటికి అజ్ఞాత వాసం తప్పదు" అని స్ధిరంగా పలికింది. అనంతాచార్యులు సందేహిస్తూనే తల ఊపాడు.


సర్వజిత్ నామ సంవత్సర జన్మాష్టమి వేడుకలకు అంకురార్పణ జరుగబోతున్న వేళ, పారిజాతం మాటలు గుర్తొచ్చి ఆచార్యులకు కర్తవ్యం బోధపడింది. కృష్ణాష్టమి నాలుగు రోజులుందనగా ఆయన జమీందారు గారి బంగళాకి వెళ్ళి "అయ్యా! ఉత్సవాలు ప్రారంభించాలి. తమరు ఒకసారి ఆలయానికి దయచేస్తే బాగుంటుంది" అన్నాడు.


జమీందారు జీరబోయిన గొంతుతో "నా స్వార్ధం వల్లే దేవుడి నగలు, విగ్రహాలు దొంగల పాలయ్యాయి. పారిజాతం జీవితాన్ని చేజేతులా నాశనం చేశాను. నేను చేసిన పాపాలకు నిష్కృతి లేదు. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని వేణుగోపాలుని దర్శించుకోను?" అన్నాడు.


అనంతాచార్యులు జమీందారుని ఓదార్చుతూ "పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. కృష్ణ భగవానుడు మనల్ని కనికరించాడు. రాత్రి స్వప్నంలో నాకు శ్రీకృష్ణుడు కనిపించి - దేవుడి నగలు, ఉత్సవమూర్తులు ఆలయంలో ఉన్న బావిలోనే ఉన్నాయని సెలవిచ్చారు" అని భక్తితో నమస్కరించాడు.


జమీందారు రాజమన్నారు ఆశ్చర్యానందాలతో "మీరు చెప్పింది నిజమేనా? అవి బావిలోనే ఉన్నాయా?" అన్నాడు. ఆచార్యులు మౌనంగా పైకి చూస్తూ చేతులు జోడించాడు.


అతడు తల పంకిస్తూ "జరిగిపోయిన సంఘటనల గురించి ఇప్పుడు తర్కించి ప్రయోజనం లేదు. బావిలో వెతికిద్దాం. ఏ పుట్టలో ఏ పాముందో" అని వెంటనే పని వాళ్ళని పిలిపించాడు. బావిలో దొరికిన పెట్టెలో స్వామి వారి ఆభరణాలు, ఉత్సవ మూర్తులు బయటపడ్డాయి.


అట్టహాసంగా కృష్ణాష్టమి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. పారిజాతం నాటిన పారిజాత చెట్టు కింద రాలిన పూలను పదిలంగా ఏరుకొచ్చి, వాటిని స్వామి పాదాల చెంత సమర్పించాడు అనంతాచార్యులు.‌ ఆలయ ప్రాంగణమంతా పారిజాత పరిమళాలు వ్యాపించాయి.


******

రచయిత పరిచయం :

నా కథ "పారిజాతం" ప్రచురించినందుకు, నిర్వాహకులకు ధన్యవాదాలు.

నా చిరు పరిచయం:

నేను పుట్టింది, పెరిగింది, విద్యాబుద్ధులు నేర్చింది గుంటూరులోనే. వృత్తిరీత్యా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (పూర్వపు కార్పొరేషన్ బ్యాంకు) బ్రాంచి మేనేజర్ గా పనిచేస్తున్నాను.

మూడు దశాబ్దాల పైనుంచి రచనలు చేస్తున్నా, సంఖ్యాపరంగా తక్కువ. ఇంతవరకు నా రచనలు సుమారుగా తొంభై వరకు వివిధ పత్రికల్లో (ఆంధ్ర ప్రభ, ఆంధ్ర భూమి, ఆంధ్ర జ్యోతి, జాగృతి, తెలుగు వెలుగు, విపుల, ఈనాడు, స్వాతి, గుజరాత్ తెలుగు వాణి మొదలగునవి, ఇంకా అంతర్జాల పత్రికలు) ప్రచురణ అయ్యాయి. వీటిల్లో పదిహేను రచనలు బహుమతులు పొందాయి. క్లుప్తంగా ఇది నా గురించి.

భవదీయుడు

బలభద్రపాత్రుని ఉదయ శంకర్1,446 views4 comments
bottom of page