top of page
Yamini Tinnanuri

పట్టుపరికిణీ -ఓణీ

గమనిక : ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి 2021 కథల పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకుంది. ఎంపికలో పాఠకుల అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకున్నాం.

Pattuparikini - Oni Written By Yamini Tinnanuri

రచన : యామినీ(తిన్ననూరి) అశోక్


అతి జాగ్రత్తగా కనకాంబరాలు కోస్తూ ఉంది మాధురి. గుప్పెడు కనకాంబరాలు కోయాలన్నా గంట సేపు అవుతుంది తనకి. ఒక్కొక్క పువ్వుని అతి జాగ్రత్తగా కోస్తూ, పొరపాటున కూడా మొగ్గ రాకూడదు, కాడ తునగ కూడదు. ఒకవేళ ఏమరు పాటున ఒక్క మొగ్గ చేతికి వచ్చినా విలవిల్లాడి పోతుంది మనసు. అసలు ఏ చెట్టు నుంచి పువ్వులు కోయడం నచ్చదు తనకి..ఒక్క కనకాంబరాలయితేనే కొన్ని కోస్తుంది. అది కూడా మాల కట్టాలంటే ఇష్టం. కోసిన గుప్పెడు పువ్వుల్ని చాలా అపురూపంగా అల్లుకోవాలి..అమ్మవారికి అలంకరించాలి. ఒక్కోసారి ఇంట్లో విసుక్కుంటారు...మిగతావన్నీ గబగబా చేస్తావు కదా!ఈ ఒక్కటి మాత్రం ఎందుకు ఇంత సమయం తీసుకుంటావంటూ..మిగతావన్నీ అందరి కోసం..ఈ ఒక్కటి నాకోసం అంటుంది మాధురి.

చిన్నప్పుడు ఎప్పుడో సినిమా పత్రిక విజయచిత్ర లో సెంటర్ స్ప్రెడ్ అని మధ్యపేజీ మొత్తం ఒకే బొమ్మ ఎవరైనా సినిమా హీరోయిన్లవి వేసేవారు. క్రింద చిన్న అక్షరాలు.. వర్ణచిత్రం :కె.వి.ఆర్.భక్త అని ఉండేది. ఎంత జీవం ఉట్టిపడేలా ఉండేవో ఆ ఫోటోలు. వాళ్ళు మన ఎదురుగా నిలబడి నట్లే ఉండేది. అలా వచ్చిన ఒక బొమ్మ కె . ఆర్. విజయ..ఒక గుడి ముందు పూల సజ్జతో నిలబడి ఉంటుంది. ఆమె తలలో పెట్టుకున్న కనకాంబరాల మాల మాధురి ని ఆ చిన్న (10)వయసులోనే ఎంతో ఆకర్షించింది. కాస్త దూరం దూరంగా కాడల చివర్లో గుబ్బలకి దగ్గరగా కట్టింది ఎందుకో మనసులో అలా ముద్ర పడి పోయింది. ఎప్పటికైనా అలాగే కనకాంబరాల మాల అల్లడం నేర్చుకోవాలి... అని.. సాధించింది 13 ఏళ్ళు వచ్చేసరికి.

ఇక ఆమె కట్టుకున్న పట్టుచీర..చీర అంటే ఎంతో పెద్దవ్వాలి. ఈ లోవు లంగా ఓణీ.. అది కూడా పట్టులంగా ఓణీ..వేసుకుని,పెద్ద జడ నిండా కనకాంబరాల మాల పెట్టుకుని..జడ కుప్పెలు పెట్టుకున్న జడ తో. ...పూల సజ్జ తీసుకుని గుడికి వెళ్ళాలి. కోరిక బలంగా నాటుకుపోయింది మాధురి మనసులో.

ఏ పండక్కి గుడికి వెళ్ళినా అక్కడికి పట్టులంగా ఓణీ ల్లో వచ్చే అమ్మాయిల్ని చూసి...కళ్ళు తిప్పుకునేది కాదు. బలవంతం గా తీసుకొస్తున్నా వెనక్కి చూస్తూ నడిచేది. ఎంత తొందరగా పెద్దయ్యి పోతామా ,పట్టులంగా ఓణీ తో గుడికి వచ్చేద్దామా అని సాగుతుండేవి ఆలోచనలు.

అలా తయారయ్యే వయసు, సౌష్టవం, మోకాళ్ళని తాకే జడ, ఒకసారి చూస్తే మరోసారి చూడాలనిపించే చక్కదనం...అన్నీ ఇచ్చాడు దేవుడు. ఇన్నిచ్చిన వాడు

ఆ కోరిక తీర్చే ఆర్థిక స్థోమత ఆ కుటుంబానికి ఇవ్వలేదు. .

రోజులు గడిచే కొద్దీ కోరిక మరింత బలంగా వ్రేళ్లూనుకుంటోంది.పాత చీరలు ఓణీలు గా మారుతున్నాయి. కోరిక తీరడం గగనం అనిపిస్తోంది. అప్పటికీ నోరు తెరిచి అడగను కూడా ఆడిగేసింది. నీ ఒక్కదానికి అంటే నీ తర్వాత వాళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు అందరికీ అంటే నా వల్ల కాదంటూ చేతులెత్తేశారు..తల్లీ తండ్రీ. పండుగ వస్తే గుడికి దేవుడిని చూసేందుకంటే.. పట్టులంగా ఓణీ వేసుకున్న అమ్మాయిల్ని చూసేందుకు వెళ్ళేది. కళ్ళార్పకుండా చూసి నిట్టూర్చి వచ్చేది.

పాత ఓణీలకు చెల్లెళ్లు కూడా వాటాకి రావడం తో అమ్మ చీరలే దిక్కయ్యేవి బయటికి వెళ్లేందుకు. పెద్ద ఆరిందా లాగా చీరలెందుకు అప్పుడే...చక్కగా లంగా ఓణీ వేసుకోకుండా అని ఎవరైనా అంటే..వెర్రినవ్వు నవ్వుకునేది మనసు.పైకి మాత్రం చీరలే ఇష్టం నాకు అనేది. ఎప్పటికైనా కట్టుకోవాల్సిందే..గా. ఇప్పట్నుంచీ ఎందుకూ అంటే మౌనంగా వచ్చేసేది.

కాలం సాగిపోతోంది కానీ, మాధురి కోరిక అక్కడే ఆగిపోయింది. ఆరోజు ఏదో పేరంటం..అమ్మ వెళ్తోంది. అమ్మ అందగత్తె, పసిమి ఛాయ తో మిలమిలా మెరిసిపోయేది.ఎర్రటి బొట్టు ఉదయించే సూర్యునిలా ఉండేది.మెడలో పసుపుతాడు, గొంతుకు దగ్గరగా నల్లపూసలు...చేతికి ఎర్రటి మట్టిగాజులు..ఏడు వారాల నగలకంటే ఎక్కువగా మెరిసిపోయేది. అమ్మ పెళ్లినాటి

ట్రంకు పెట్టె నుంచి పెళ్లి పట్టుచీర తీసి దులిపి కట్టుకుంది .

మాధురి కళ్ళు దానిమీద పడ్డాయి.

అమ్మ బయలుదేరి వెళ్ళిపోయింది. మాధురి చూపు వెనకే వెళ్ళింది. స్నేహితురాళ్లు వచ్చి ఆటకు పిలిచేవరకు. రోజుకి ఒక్కసారి అయినా కళ్లముందు పట్టు పరికిణీ ఓణీ కళ్ళ ముందు కదలకుండా ఉండదు. మాధురి మనసు లోనుంచి నిట్టూర్పు(ఆ వయసుకి అది నిట్టూర్పు అని తెలియదు)రాకా మానదు.

కొంచెం వయసు పెరిగింది. కాస్త కాస్త ఇంటి పరిస్థితులు అర్ధం అవుతున్నాయి. కోరిక కాస్త మసక పడుతుంది. ఏ గుడి లోనో,పేరంటం లోనో,పండుగ రోజో.. ఎక్కడైనా పట్టులంగా ఓణీ వేసుకున్న అమ్మాయిల్ని చూస్తే మాత్రం గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకునేది. మళ్లీ మామూలే.

ఒకరోజు అమ్మ చీర ఒకటి మంచిది మేకు తగిలి చిరిగింది. ఉసూరుమనిపించింది అమ్మకి. మాధురికి కూడా పాపం అనిపించింది. అంతలో అమ్మ చెప్పింది."గట్టి చీర. కొర్రు బోయింది గానీ కనాకష్టం ఇంకో రెండు ఏళ్ళు అయినా వాడొచ్చు...ఒక సగం నీకు లంగా కుట్టి,మిగతా ముక్క చెల్లికి గౌన్ కుడతాను".. అనేసరికి.

మాధురి కోరిక తీవ్రత ఎంత గా కుదిపేసిందంటే..ఆ చిరిగేది ఏదో పట్టుచీర చిరిగి ఉండోచ్చు గా అని ఒకసారి మనసు మూలిగినా...విచక్షణ చెంప మీద కొట్టినట్లు అయింది.

రోజులు గడుస్తున్నాయి. ఆడుతూ,పాడుతూ వయసు వచ్చేసింది ...వయసు వస్తే ఊరుకుంటుందా!రంగురంగుల కలలు...తెస్తుంది. కమ్మటి ఊహలు తెస్తుంది. అయినా మాధురికి మాత్రం చిన్నతనంలో పుట్టిన ఆశ అంతకంతకు పెరిగింది..కానీ మనసులో నే నిక్షిప్తం చేసుకుంది. ఎంతైనా పరిణత చెందుతున్న వయసు.

దానికి తోడు తన స్నేహితులు వేరే ఎవరైనా జడ కుప్పెలు పెట్టుకుంటే.."అబ్భా, ఆ జుట్టుకు సవరం పెట్టి మరీ కుప్పెలు పెట్టుకోవాలా! అసలు మన మాధురి జడకి ఎంత అందంగా ఉంటుంది. పెడితే ఇలాంటి జడలకి పెట్టాలి గానీ..".అని దీర్ఘాలు తీసేవారు. మనసు కలుక్కు మనేది. అయినా ఇంటి పరిస్థితులు ఏనాడూ చెప్పేది కాదు.గుంభనం ఎక్కువ.

ఏదో కాలానికి,పరిస్థితుల కి తల వంచి, మంచి చదువు చదువుకుని ఉద్యోగం చేసి...పరిస్థితులు చక్కదిద్దాలని, తండ్రికి సాయంగా ఉండాలని కలలు గనేది మాధురి. ఇవన్నీ ప్రథమ స్థానంలో కి వచ్చేసరికి...మిగిలిన కోరికలు వెనుక వరుసలోకి నెట్టబడ్డాయి.

పట్టు పరికిణీ ఓణీ కోరిక చూసి మాధురిని తక్కువ అంచనా వేయక్కర్లేదు. ఆశ మనిషికి సహజం..కానీ మాధురి...ఎంతో ఆత్మ విశ్వాసంతో,పద్ధతిగా...చక్కని నైతిక విలువలు కలిగి ఉండేది. ఒకే ఒక్క బలహీనత...అదీ చిన్న కోరిక.. కానీ...తాహతుకు మించింది..అదీ బాధ.

కోరికని తొక్కి పెట్టి, చదువే ధ్యేయంగా సాగుతున్న మాధురి జీవితంలో ఒక పెను తుఫాను సంభవించింది. జీవితంలో తిరిగి పొందలేనిది.

ఆ రోజు మామూలు గానే కాలేజీకి వెళ్ళింది మాధురి.

పూర్తిగా క్లాసు జరగనే లేదు..ఇంటి నుంచి ఎవరో వచ్చారంటూ కబురు, మాధురికి అయోమయం గా ఉంది. ఎప్పుడూ ఇంటినుంచి ఎవ్వరూ రాలేదెప్పుడు..ఇప్పుడేంటిలా? ఆలోచిస్తూనే వెళ్ళింది ప్యూన్ వెంట ఆఫీస్ రూమ్ కి. ప్రిన్సిపాల్ జాలిగా చూస్తోంది. ఏదో తేడా కొడుతోంది... ఆ చూపు.

ప్రిన్సిపాల్ చెప్పింది..."నువ్వు ఇంటికి వెళ్ళు మాధురీ...ఏమైనా అవసరం అంటే మేము ఉన్నాము.."అంటూ.. ఇంకా తేడా గా అనిపించింది.

"అసలేమైంది" గొంతు పెగుల్చుకుని అడిగింది. "ముందు నువ్వు వెళ్ళు" అనేసరికి కాలేజీ బయటికి వచ్చిన మాధురికి ఇంటి దగ్గరి అబ్బాయిలు ఇద్దరు కనిపించారు." నాన్నగారికి కాస్త ఒంట్లో బాగోలేదు. హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు..నిన్ను తీసుకురమ్మన్నారు"

అనేసరికి గుండెని ఎవరో నొక్కేస్తూ ఉంటే...ఊపిరి ఆడక గిలాగిలా కొట్టుకున్న ఫీలింగ్. ఏదో జరిగింది... అదేంటి?

అడిగితే చెప్తున్నది నిజం కాదు..కానీ తెలియటం లేదు..అడుగు ముందుకు పడదు..దూలాల్లా అయిపోతోంది.. బరువెక్కి. కంటి ముందు జరుగుతున్నవేవీ...మనసు లోపలి దాకా వెళ్లట్లేదు. యాంత్రికంగా నడుస్తోంది అనే కంటే..స్నేహితురాలిద్దరు లాక్కెళ్తున్నారు.

అలా తీసుకెళ్లి ఆటోలో కూర్చోపెట్టారు. నేరుగా ఇంటి ముందు ఆగింది. ఇంటి ముందు తండోపతండాలుగా జనం. మెడ మీద ఎవరో ఛెళ్లుమని చరచి నట్లయింది. లోపల జరిగిందేమిటో అర్ధం అయిపోతోంది. కానీ మనసు ఒప్పుకోవటం లేదు..వెళ్లి చూసేసరికి...ఉదయం వెళ్తున్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు చెప్పిన నాన్న విగతజీవుడిగా...తల్లీ,తమ్ముళ్లు,చెల్లెళ్లు...రోదిస్తూ..

దుఃఖం గొంతులో ఘనీభవించింది. కళ్ళల్లో నీరు వెనక్కి వెళ్ళిపోయింది సమయం ఇది కాదని. అందరు బంధువులు వచ్చేవరకు...ఒక్కత్తే నిలబడింది.

అన్ని కార్యక్రమాలు అయ్యాయి. మ్మగపిల్లవాడి వి అయ్యుంటే ఎంత బాగుండేది? ఈ చిన్న పిల్లలతో ఎలా నెట్టుకొస్తుంది? అని బంధువులు బాధ పడుతుంటే చివుక్కుమంది. అమ్మాయి అయితే ఆదుకోకూడదా?

తండ్రి ఉద్యోగాన్ని తల్లికి ఇస్తామన్నారు. మాధురి తాను చేసి కుటుంబాన్ని పోషిస్తానంది. ఒప్పుకోలేదు ఎవ్వరూ? పెళ్లి చేసుకుని ఒకింటికి వెళ్లాల్సిన పిల్లవి అంటూ..ఏవేవో చెప్పి విరమింప చేశారు. తల్లికి ఉద్యోగం వచ్చేలా ఏర్పాట్లు జరిగాయి. కాలం గాయాల్ని మాన్పుతుంది అంటారు...కానీ గాయం పైన పరిస్థితులు పెచ్చులు కడతాయి. జ్ఞాపకాలు రేగినప్పుడల్లా పచ్చిగా నొప్పెడతాయి.

కాలం గడుస్తోంది. మాధురి కాలేజీకి వెళ్తోంది. తల్లి ఉద్యోగం చేస్తూ గుట్టుగా కాలం గడుపుతోంది. చదువుకుంటూనే...మాధురి తల్లికి సాయం చేస్తుండేది. ఒకరోజు బట్టలు సర్దుతూ..పెళ్లి పట్టుచీర తీసి దులిపి మడత పెట్టి పెట్టె అడుగున వేసింది మాధురి వాళ్ళమ్మ. ఎప్పుడో ఆ పట్టుచీర లాగానే మనసుపెట్టెలో అడుగున వేసేసిన కోరిక ఒళ్ళు విరుచుకుంది మాధురి లో.

" నువ్వు కట్టుకోవచ్చుగా ఎందుకు అడుగున వేసేస్తున్నావ్" అని తల్లిని అడిగింది.

"ఇక ఆ చీర నేనేం కట్టుకుంటాను. ఆ యోగం లేదు,పెట్టెయ్ అడుగున" అంటూ ముఖం తిప్పుకుంది.

చీరవైపే ఆశ గా చూస్తున్న మాధురి మనసులో ఆలోచన...అమ్మ కట్టుకోనంది కాబట్టి..ఇది పరికిణీ కుట్టించుకుంటేపోలా! కొత్తది ఎలాగూ కొనలేము.ఇప్పుడు అసలే కొనలేము.

(ఒక్కసారి తల్లి ముఖం లోకి చూసి ఉంటే మాధురి ఇది అడిగేది కాదు)

చీరనే చూస్తూ అమ్మని అడిగింది ,"అమ్మా నేను పరికిణీ కుట్టించుకోనా!" అంటూ.

పసి వయసు నుంచి ఆ పిల్ల కోరిక తెలిసిన తల్లిగా కదిలిపోయింది. ఒక్క చిన్న కోరిక తీర్చలేని స్థితిలో తనని ఉంచినందుకు భగవంతుడిని మనసులోనే తిట్టుకుంది. ఆ చీరని తీసి మాధురి చేతిలో పెట్టి

"వెంటనే వెళ్లి కుట్టించుకో... మ్యాచింగ్ ఓణీ జాకెట్టు నేను జీతం రాగానే కొంటాను..ఫెస్టివల్ అడ్వాన్స్తో "అనే సరికి మాధురి మనసు ఉప్పొంగి పోయింది.

సరాసరి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. ఫ్రెండ్ కి తెలిసిన టైలర్ షాపు కి వెళ్లి పట్టుచీర ఇచ్చి పరికిణీ కుట్టించమని చెప్పేసి, చీర ఇచ్చేసి వచ్చేసింది. మనసు గాల్లో తేలిపోతోంది. కల నిజమాయెగా! కోరిక తీరేగా! అంటూ గంతులు వేస్తోంది మనసు. టైలర్ కి మరీ మరీ చెప్పింది, "త్వరగా ఇచ్చెయ్యమని." అతను మీకెందుకమ్మా!ఎల్లుండి ఈపాటికి రండి ఇచ్చేస్తానని" నమ్మకం గా చెప్పాడు.

రాత్రి నిద్ర పట్టలేదు.. పట్టిన ఆ కాస్త కలలే..తెల్లారింది. కాలేజీకి వెళ్తూ టైలర్ షాప్ వైపు వెళ్ళింది. మూసేసి ఉంది.అయినా రేపు కదా ఇస్తానన్నాడని వెళ్ళిపోయింది తన ఆతృత కి తానే నవ్వుకుంటూ...

రెండోరోజు... టైలర్ చెప్పిన రోజు...ఉద్వేగంతో ఊగిపోతూ బయలుదేరింది.షాపు దగ్గర పడే కొద్దీ

ఇన్నాళ్ల కోరిక తీరబోతోందన్న ఆనందం ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే... షాపు దగ్గరికి నడిచింది.

ఎంతో ఉత్సాహంగా వెళ్లిన మాధురి...టైలర్ షాపు చూడగానే అంతా నిరాశకు గురయ్యింది. షాపు కట్టేసి ఉంది. ఎవరిని అడిగినా ఏమో తెలియదన్నారు. ఫ్రెండ్ ని కనుక్కుందామంటే.. తనూ ఊరెళ్ళింది. ఉసూరుమంటూ కాళ్ళీడ్చుకుంటూ వచ్చి మంచం మీద బోర్లా పడుకుంది.

తల్లి అడిగింది." ఏం మధూ... టైలర్ ఇంకా కుట్టలేదా పరికిణీ.."అంటూ..

"లేదమ్మా! ఊరెళ్ళాడని చెప్పారు.." అంది ముభావంగా.

"అయినా పరికిణీ ఎంతసేపట్లో కుడతాడూ..పట్టుమని అరగంట కూడా పట్టదు. రాగానే కుట్టేస్తాడులే. నువ్వు కాస్త టైలరింగ్ నేర్చుకుని ఉంటే ఎంత బాగుండేది? ఒకరికోసం ఎదురు చూడకుండా అవసరం తీరేది కాదూ!" అంది మాధురి తల్లి .

ఆ సమయంలో ఆ ప్రసక్తి ఎందుకో మాధురికి చిరాకు అనిపించి తల్లిని విసుక్కుంది...

" నీకు నన్ను అనడానికి భలే చాన్స్ దొరికింది కదమ్మా!" అంటూ చిన్నబుచ్చుకునే సరికి తల్లికి కూడా చివుక్కుమంది. ఇంత చిన్న కోరిక కూడా తీర్చలేని వారికి

చక్కటి ఆడపిల్లల్ని ఎందుకిచ్చావు భగవంతుడా అని కుమిలిపోయేది.

అంతలో అక్కడికి వచ్చిన చెల్లెలు "అక్కా! పట్టు పరికిణీ కుట్టేసారా! నువ్వు కట్టుకున్నాక

నేనూ ఒకసారి కట్టుకుంటానక్కా! ప్లీజ్.."అనేసరికి మాధురికి మరింత బాధ అనిపించింది. "ముందు కుట్టనివ్వు..." అని కసిరే సరికి ఆ పిల్ల చిన్న బుచ్చుకుని అవతలికి వెళ్ళిపోయింది.

రాత్రి నిద్రపట్టక ఇంట్లో ఉన్న పాత ఫోటోలు అన్నిటినీ...చూద్దాం అని తీసుకుని ముందేసుకుంది. ఒక్కో ఫోటో చూస్తూ చూస్తూ..ఒక చిన్న ఫోటో ఒకటి చూసి చప్పున చేతుల్లోకి తీసుకుని మరింత దృష్టి పెట్టి చూసేసరికి.. అమ్మ నాన్నల పెళ్లి ఫోటో చిన్నది కనిపించింది. తండ్రి ఫోటో చూడగానే మాధురి కళ్ళల్లో చివ్వున నీరు చిమ్మింది.

పెళ్లి బట్టల్లో తండ్రి...ప్రక్కనే అమ్మ కుందనపు బొమ్మలా మెరిసిపోతూ....అదే పట్టు చీర..గచ్చకాయ రంగుకి ఎర్రటి అంచు, మెడలో దండలు, కళ్యాణం బొట్టు తో ఎంత అందంగా ఉందొ! ఫోటో నలుపు తెలుపుదే.. అయినా మాధురి కళ్ళకి పంచరంగుల్లో

కనిపిస్తోంది. అమ్మ కాస్త నవ్వినా ఎర్రగా అయిపోయేచెంపలు...పెళ్లికూతురి అలంకరణ లో మరింత అందాన్ని ఇచ్చాయి.

పెళ్లి చీర గురించి ఎప్పుడో ఒకసారి నానమ్మ లేనప్పుడు చెప్పిన కథ గుర్తొచ్చింది. ఇంతలో పెళ్లికూతురికి చీర తీసుకోండి అని నానమ్మ వాళ్ళు చెప్తే నాన్న సొంతడబ్బు కొంచెం ఎక్కువేసి ఖరీదైన ఫర్వాలేదు, మంచిదే కొనండి అని చీర కొనడానికి వెళ్తున్న చెల్లెళ్ళకి చెప్పడం, ఆనోటా,ఆనోటా నానమ్మ చెవిన పడి.. హమ్మో! ఇప్పుడే ఇలా ఉన్నాడంటే.. పెళ్లయ్యాక ఎలాగో? అని మల్లగుల్లాలు పడిపోయి ఇంకా ఇంటికి రాని కోడలిని నానమ్మ బ్యాచ్ మొత్తం నానా మాటలు మాట్లాడుకోవడం...అది విన్న నాన్న కోపంతో కొన్ని రోజులు నానమ్మ తో మాట్లాడక పోవడం,

తీరా పెళ్లయ్యాక అమ్మ ప్రవర్తన తో అత్తగారు అమ్మగా మారిపోవడం..ఇవన్నీ గుర్తుకి వచ్చాయి మాధురి కి.

ఒక్కసారిగా ఎవరో వీపు మీద చెళ్లున చరిచినట్లయ్యింది. ఒకరి మధుర స్మృతుల్ని కాల రాసేంతటి కర్కశత్వపు కోరిక తనకి కలిగినందుకు తనపై తనకే చెప్ప లేనంత అసహ్యం వేసింది. 'ఎంత పిచ్చి పని చేశాను' అని మనసులోనే చెంపలు వాయించుకుంది. ఆ పరికిణీ కట్టుకుని రేపు అమ్మ ముందు తిరుగుతుంటే...అసలే నాన్న మరణంతో కృంగిపోయిన అమ్మ...తమకోసం బ్రతుకు గడుపుతుంటే జీవచ్చవంలా...ఆమె మనసుని మరింత చిన్నాభిన్నం చేసే అతి భయంకరమైన పొరపాటు చేసేసింది..ఎలా దిద్దుకోవడం? కన్నీరు మున్నీరై పోతోంది. ఎవరికీ కనిపించకుండా...ఏడుపుని ఆపేసుకోవడానికి విశ్వప్రయత్నము చేస్తోంది.తెల్లవారేది ఎప్పుడా! అంటూ ఎదురు చూస్తోంది.

చేసిన పొరపాటు దిద్దుకునే అవకాశం ఇవ్వు భగవంతుడా అని వేడుకుంటోంది. ఈ విషయం లో అమ్మ మనసు ఏనాడు చివుక్కుమన్నా ...పైనున్న తండ్రి కి కనీసం క్షమాపణ అడగలేని దీనత్వం లోకి దిగజారిపోతుంది మనసు....అని పరిపరి విధాల విలపిస్తోంది హృదయం.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఉదయం అయ్యింది. షాపు తెరిచే సమయం కోసం క్షణం ఒక యుగం గా ఎదురు చూస్తూ గడిపింది మాధురి. టైలర్ షాపుకి బయలుదేరింది. అడుగులు అతి భారంగా పడుతున్నాయి. ఒక్కో అడుగు దగ్గర పడే కొద్దీ తన గుండె చప్పుడు తనకే వినిపించి దుఃఖం తన్నుకుని వస్తోంది. మెల్లగా వెళ్లి సందు మొదట్లో నిలబడి చూసింది...షాపు తెరిచి ఉందా! లేదా ! అని.

తెరిచే ఉంది. గుండెల్లో దడ రెట్టింపు అయ్యింది.

టైలర్ కుట్టివుండకూడదు అని వెయ్యిదేవుళ్ళకి మొక్కుకుంటోంది. మాధురిని చూడగానే టైలర్

ఇబ్బందిగా మొహం పెట్టి..."ఏమనుకోకండి అమ్మాయిగారూ! మీరు చీర ఇచ్చి వెళ్లిన రోజే మా మామగారికి సీరియస్ అని కబురొస్తే వెళ్లానమ్మా!

మాయావిడ్ని అక్కడోదిలేసి రాత్రే వచ్చాను. ఈరోజు సాయంత్రానికి ఖచ్చితంగా కుట్టించేస్తానమ్మా!"

అనేసరికి అప్పటివరకు లోలోపల దాచిపెట్టిన దుఃఖం మొత్తం తుడిచిపెట్టుకొని పోయింది.

ఆనందంగా "ఏం పర్వాలేదు..కుట్టనఖ్ఖర్లేదు..ఇచ్చెయ్యండి..."అనేసరికి

తాను సమయానికి కుట్టలేదని కోపం వచ్చిందను కున్న టైలర్... బ్రతిమలాడటం మొదలు పెట్టాడు. ఒక్క గంట లో కుట్టించేస్తానమ్మా అంటూ..

మాధురి పకపకా నవ్వుకుంటూ.."వద్దండీ..అది చీరలాగా కట్టుకుంటేనే బాగుంటుంది. తొందర్లో వేరే పరికిణీ లు కుట్టించుకుంటాను లెండీ..."అనేసరికి టైలర్ చేసేది లేక ఇచ్చేశాడు.

ఒక్క పరుగులో ఆ చీర ఉంచిన సంచీని గుండెలకి హత్తుకుని ఇంటికొచ్చేసింది. అందరూ వింతగా చూస్తున్నారు... ఏమీ పట్టించుకోకుండా వచ్చేసింది.

ఇంట్లోకి రాగానే తల్లి అడిగింది "పరికిణీ ఇచ్చాడా!"అంటూ.

"నేను వద్దన్నానమ్మా! నాకు నచ్చలేదు... చీరతో కుట్టించుకోవడం.. అదీ పాత ఫ్యాషన్ చీర కదా!

అయినా ఇప్పుడు చీర చింపి ఎందుకు కుట్టించాలి?

చీరగానే కట్టుకోవచ్చు అని తెచ్చేశాను..." అనేసరికి, తల్లి కళ్ళల్లో మెరుపు మాధురి చూపుని తప్పించుకోలేదు. ఆ మెరుపుని పసిగట్టిన మాధురికి కొండంత సంతృప్తి...ఒకరి జ్ఞాపకాన్ని చింపేయలేదని.

కోరిక తీరక పోవచ్చు...పోతే...పోనీ... తృప్తి మిగిలింది.

మన కోరిక తీర్చుకొనేందుకు, ఇంకొకరి జ్ఞాపకాన్ని చిదిమెయ్యకూడదు కదూ! అదే కోరిక తీర్చుకోడానికి మొండిగా కుట్టించుకుని ఉంటే...జీవితాంతం తప్పుచేసినట్లు బాధ పడుతూనే ఉండేది..

ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉందిగా!

(సమాప్తము)


రచయిత్రి పరిచయం

పేరు.. యామినీ(తిన్ననూరి) అశోక్

వయసు.. 56

హాబీ.. కవితలు ,కథలు వ్రాయడం,చదవడం

ఫేస్ బుక్ లో గత ఆరేళ్లు గా రచనలు పోస్ట్ చేస్తున్నాను


.


339 views2 comments

2 Comments


vasudharani.v
Dec 25, 2020

చక్కటి కథ,కథనం..ఒక నాటి మధ్యతరగతి జీవితాల దర్పణం.

Like

lkamakoti
lkamakoti
Dec 22, 2020

katha.

Like
bottom of page