పొడుపుకథలో దాగిన కథ
- Karlapalem Hanumantha Rao
- Apr 23
- 4 min read
#పొడుపుకథలోదాగినకథ, #PodupukathaloDaginaKatha, #KarlapalemHanumantha Rao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguMoralStories, #నైతికకథలు

Podupukathalo Dagina Katha - New Telugu Story Written By Karlapalem Hanumantha Rao
Published In manatelugukathalu.com On 23/04/2025
పొడుపుకథలో దాగిన కథ - తెలుగు కథ
రచన: కర్లపాలెం హనుమంతరావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ప్రజల్లో ప్రచారం పొందిన శ్లోకాలన్ని కథాత్మకాంధ్ర ప్రహేళికలకు మార్గదర్శనం చేశాయి. ఈ క్రిందిశ్లోకం-కథ ఆ విధంగా సేకరించిందే.
"అన్యథా చింతితం కార్యం
దైవమన్యత్ర చింతయేత్,
రాజకన్యాభిలాపేణ
ఎ ప్రం భల్లూక భక్షణమ్||
ఆదో మహానగరం; దాన్నో మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు యుక్త వయస్క అయిన ఓ కూతురుంది. ఆమె చక్కని చుక్క. ఆమెకు చాలా కాలం చదువు చెప్పి ఓ విప్రవిద్వాంసుడు చదుపుల కుప్పగా తయారు చేశాడు. చక్కని చుక్క... అందులో చదువుల కుప్ప,
ఆమె చదువు ముగిసింది. తండ్రి అనుమతితో ఆమె గురువుగారికి లెక్కకు మిక్కిలి శుద్ధ సువర్ణాల్ని గురుదక్షిణగా ఇచ్చింది. 'ఓ చదువుల కుప్పా నీవేనాకు దక్షిణ కోరాదా?' అన్నాడు గురువు. ఆమె పరిహాసంగా భావించి గురువు వైపు చూసింది, అతను నిశ్చలంగానే ఉన్నాడు.
'గురులకు శిష్యులు పుత్రులు, పరమార్థము లోకధర్మ పథమిది...అని గురువుగారి పాఠం గురువుగారికే అప్పజెప్పింది. ఆయన తన పరీక్షలో గెలిచావని ప్రశంసించి వెళ్లిపోయాడు.
రాజు, కూతురు వివాహానికై ముహూర్తం నిశ్చయం చేయడానికి జోతిష్యుని పిలిపించాడు. రాజ కొమార్తె అందాన్ని ఆశించిన ఆ విప్ర విద్వాంసుడు ఆ జోతిష్యునితో స్నేహం చేశాడు ఆతణ్ని వశపరచుకొన్నాడు; డబ్బుకు లోకం దాసోహ మన్నట్లు ఆ బీద జోతిష్యుడు గురు బోధనను సరించాడు. 'మహారాజా! మీ కూతురుకు వివాహమైన తొమ్మిదో రోజున ఏనుగులు, పదో రోజున గుఱ్ఱాలు, పదకొండో రోజున సైన్యం, పన్నెండో రోజున రాజ్యం వరుసగా నాశనమవుతాయి, మీరు శత్రువులతో సంహరింపబడతారు' అని జోతిష్యుడు చెప్పాడు.
మహారాజు ఆయోమయంలో పడ్డాడు. ఆతణ్ని ప్రాణభీతి పట్టుకుంది. ఏంచేయాలో అర్థం కావడంలేదు. పరిష్కార మార్గం, వివంచాల్సిందని ప్రాధేయ పడ్డాడు. జ్యోతిష్యుడు గురువుగారు చెప్పిన మాటల్ని తుచ తప్పకుండా విన్నవించాడు.
'ఓ పెద్ద పెట్టె, ఆ పెట్టెలో మంచం; మంచం మీద రాకొమార్తె; పెట్టె మూయాలి. అర్ధరాత్రి మహానదీ ప్రవాహంలో వదిలేయాలి; ఈ విషయం పుత్రికి కూడా తెలియరాదు. అలా పీడ వదలించుకుంటేనే రాజ్యం దక్కుతుంది; లేకుంటే సర్వం జగన్నాధమవుతుంది'.... అన్నాడు జోతిష్యుడు.
మహారాజు జోతిష్యునికి కానుకలిచ్చి సాగనంపాడు. ఆ రోజు అర్ధరాత్రే అనుంగు పుత్రిని పెట్టెలో పెట్టి ప్రవాహంలో వదిలించాడు.
ఆ పెట్టె ప్రవాహంలో మూడు రోజులు పయనించింది విప్రవిద్వాంసుడు ఆ పెట్టెను వెలుపలికి లాగే ప్రయత్నంలో మహారణ్యంలోని ఓ ప్రదేశంలో ఒక ఇద్దరు సేవకులతో కాచుకొని ఉన్నాడు.
ఈలోగా పెట్టె మరొకరి చేతికి చిక్కింది. పొరుగు రాజ్యానికి చెందిన రాజకుమారుడు, మంత్రి కుమారుడు ఆ అరణ్యానికే వేటకు వచ్చారు. ప్రవాహంలో కొట్టుకు పోతున్న పెట్టెను చూశారు. ఇద్దరూ నీటిలోకి దూకి ఒడ్డుకు తెచ్చారు; పెట్టె మూత తీశారు చక్కని చుక్కను చూశారు. ఆమెకు అప్పుడప్పుడే స్పృహ వస్తోంది. కళ్లు విప్పి చూసింది, తన పరిస్థితి అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. నీరసంగా ఉన్న రాజపుత్రికి చేతిని ఊతంగా ఇచ్చి రాజకుమారుడు ఆమెను చెట్టు నీడకు చేర్చాడు.
మాటల మధ్యలో తనకు కాబోయే భార్య ఆమేనని రాజకుమారునికి అనిపించింది. రాజపుత్రికి కూడా తనకు కాబోయే భర్త ఆతడే అయితే బాగుణ్ణునిపించింది.
తనకు మత్తు మందెవరిచ్చారో, మందసంలో ఎవరు పెట్టాలో, ప్రవాహంలో ఎవరు విడిచారో అర్థం కావడం లేదని, అంతా అయోమయంగా ఉందని రాజపుత్రి ఆలోచనల్లో పడిపోయింది. ఇందులో ఏదో కుట్ర ఉందని ఆ కుట్రను భేదించాలని, అందుకొరకు ఆప్పటికే తాము బంధించి ఉంచిన ఎలుగుబంటిని పెట్టెలో పెట్టి నీట వదలి పెట్టాలని మంత్రికుమారుడు రాకుమారుడికి సలహా ఇచ్చాడు. రాజపుత్రికి, రాజపుత్రునికి ఈ సలహా నచ్చింది.
వెంటనే ముగ్గురు కలిసి ఎలుగు బంటిని పెట్టెలోకి చేర్చారు; మూత మూశారు; ప్రహంలోకి తోశారు. ఆ తర్వాత ఆకుల చాటు చేసుకొని, పొదల మాటున నక్కుతూ నక్కుతూ నది ఒడ్డును అనుసరించే పెట్టెను చూస్తూ పరిసరాలని పరిశీలిస్తూ పట్టుదలతో నడిచారు.
అల్లంత దూరాన్నే వాళ్ళకి గురువుగారు కనిపించారు. రాజపుత్రి అతనెవరో చెప్పింది. గురుదక్షిణనాటి అతని కోరిక సంగతికూడా చిప్పి చెప్పింది. 'ఇతను గురువా! కాముకుడు, పాప కర్ముడు. అవివేకి' అన్నాడు మంత్రి కుమారుడు. 'అందుకే తగిన ఫలితం అనుభవిస్తాడు' అన్నాడు రాజకుమారుడు.
గురువుగారు పెట్టెను పట్టారు, ఒడ్డుకు లాగారు; సేవకుల సహాయంతో బండి పైకి ఎక్కించారు. బండిని నగరాభిముఖంగా నదిపించారు.
ఇక్కడ ఈ ముగ్గురు కూడబలుక్కున్నారు. మారువేషాలతో నగరంలో ప్రవేశించి ఓ ధర్మ సత్రంలో విడిది చేశారు. విప్రవిద్వాంస గురువరేణ్యుడేం చేస్తున్నాడనేది ఎప్పటికప్పుడు తెలుసు కొంటూనే ఉన్నారు.
బండి పెట్టెతో బాటు గురువుగారి గృహాంతర్భాగానికి చేసింది. అప్పటికే గురువుగారూ శిష్యులూ, సేవకులూ వివాహానికి కావల్సిన ఎర్పాట్లన్నీ చేశారు.
పెట్టె తెరచిన వెంటనే తాళిబొట్టు కట్టాలని గురువుగారు తహతహ లాడుతున్నారు. తాళి కట్టిన తర్వాత రాకుమారి కుక్కిన పేనులా పడి ఉంటుందని ఉబలాటపడుతున్నాడు. గదిలోకి ఎవరూ రావద్దని హుకుం జారీ చేశాడు. పెట్టెలోనికి తెప్పించాడు. చేత తాళి బొట్టుతో పెట్టెను సమీపించాడు; మూత తీశాడు.
బయట మేళ తాళాలు మోగుతున్నాయి. లోన గురువుగారి మీదికి ఎలుగు బంటి ఎగబడుతున్నది. గురువుగారు 'కుయ్యో మొర్రో ' ఆంటున్నారు. ఓ పెద్దగావుకేక పెట్టి భల్లూకం చేతుల్లో ఇరుక్కు పోయారు.
చివరికి అప్పుడే అక్కడికి రాజకుమారుడు, రాజకుమార్తె, మంత్రి పుత్రుడు వచ్చారు. ఎవ్వరినీ కదల వద్దని శాసించారు. గురువుగారున్న గది తెలుసుకున్నారు. తలుపులు పగులగొట్టించారు.
దూసుకొని వస్తోన్న భల్లూకానికి దారి ఇచ్చారు. రక్తం మడుగులో పడి ఉన్న గురువుశవాన్ని చూశారు.
రాజపుత్రి అప్పటికప్పుడే ఈ పై శ్లోకాన్ని వ్రాసి, మంత్రి పుత్రునికిచ్చి తన తండ్రి దగ్గరకి పంపించింది.
రాజు తన అనాలోచిత కార్యానికి సిగ్గుపడ్డాడు. వెంటనే సేనాధిపతితో, మంత్రితో, గురువు గృహానికి వచ్చాడు. కూతురునూ, కాబోయే ఆల్లుణ్ని అక్కున చేర్చుకొని ముద్దాడి, ఆశ్రు జలంతో అభిషే కించి రాజ గృహానికి తీసుకొని వెళ్లాడు.
ఇదీ కథ; అంత చిన్న శ్లోకానికి ఇంత పెద్ద, కథ ! బీజభూతాలైన ఇలాంటి శ్లోకాలు మహా వృక్షతుల్యాలైన విడుపు కధలకు సంకేతికమైన పొడుపుకథలుగా భావిస్తారు.
ఈ శ్లోకాలెవరి విరచితాలో, ఏ చెవినిపడి, ఏ మనస్సులో నిలిచి, ఏ నోట ప్రకటితమవుతున్నాయో ప్రజల్లో తిరిగితేనే అర్థమవుతుంది. ఏ ఉద్దేశంతో ఈ శ్లోకాలు కట్టినా, ఎందుకొరకు ప్రచారం చేసినా, ఎవరిమీద సంధించినా ఇవి మాత్రం కొందరి నోట నేటికీ బతికే ఉన్నాయి.
***
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోదీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.
Comments