Professor Doctor Sachhidananda Written By Sunadh Kappala
రచన : సునాధ్ కప్పల
మాథ్స్ ప్రొఫెసర్ డాక్టర్ సచ్చిదానంద సన్మాన కార్యక్రమం. కరతాళధ్వనుల మధ్య గొప్పగా జరుగుతుంది. సభకు విచ్చేసిన వక్తలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
"గణిత మేధావి సచ్చిదానంద గారు మన కళాశాలలో పనిచేయడం మనకెంతో గర్వకారణం"బెలూన్ పగిలేలా ఉన్నా, ప్రిన్సిపాల్ సుబ్బారాయుడు ఇంకా గాలి కొడుతూనే ఉన్నాడు.
"ఉత్తమ అధ్యాపకులుగా రచయితగా గణిత మేధావిగా దేశవ్యాప్తంగా అనేక పురస్కారాలు అందుకున్న సచ్చిదానంద గారిని సన్మానించడం నాకెంతో గర్వంగా ఉంది" విద్యాశాఖ మంత్రిగారి ఊకదంపుడు ప్రసంగం.
"క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తూ ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారుబాట వేస్తున్న సచ్చిదానంద గారు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు "ఇంకొంచెం గాలికొట్టారు జిల్లా కలెక్టర్ గారు .
మేధావులకు మేధావి.. మరుపు ఎరుగని విశిష్ట అధ్యాపకులు... వీరుడు శూరుడు.....ఇలా సభంతా వచ్చిన వక్తలతో పొగడ్తలే.
డాక్టర్ సచ్చిదానంద కాకినాడ లోని ఓ డిగ్రీ కళాశాలలో మాథ్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు.ఇతగాడు గణితావధానిగా,గణిత రచయితగా,గణిత మేధావిగా గుర్తింపు పొందడానికి ఎన్నో పిల్లిమొగ్గలు వేసాడు. ఇటీవల న్యూ ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నాడు.అందువల్లనే ప్రస్తుతం జరుగుతున్న సన్మాన కార్యక్రమం.
పొగడ్తల ఘట్టం ముగిసిన తర్వాత సన్మాన గ్రహీతకు మాట్లాడే అవకాశం వచ్చింది.
"నేనీరోజు ఈస్థాయిలో ఉండటానికి కారణం నాలోని క్రమశిక్షణ, ఏకగ్రత, ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదల. వీటన్నింటి కంటే ముఖ్యమైంది జ్ఞాపకశక్తి. ఏవ్యక్తి ఉన్నతికైన జ్ఞాపకశక్తి కీలకం. మనిషికి మతి మరుపు అనేది లేకపోతే జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు.కొంతమంది ఇంట్లో ఏవస్తువు ఎక్కడ పెట్టారో కూడా మర్చిపోతుంటారు .అటువంటి వారు పెద్ద పెద్ద విషయాలు ఏం గుర్తుంచుకుంటారు...చెప్పండి ! అటువంటి వారు మైండ్ పవర్ టెక్నిక్స్ ద్వార జ్ఞాపకశక్తి పెంచుకోవచ్చు.మైండ్ పవర్ టెక్నిక్స్ పై రాష్ట్రవ్యాప్తంగా క్లాసులు కండక్ట్ చేస్తున్నాను. విద్యార్థులంతా ఈ క్లాసులకు హాజరై తమ మెమరీ పెంచుకోవాలని ఈసందర్బంగా మనవి చేస్తున్నాను."ఇలా తనొక గొప్పమేధావినని డప్పు వాయించేసాడు.
సన్మాన సభ చప్పట్లతో మార్మోగింది. పూలమాలలు, బొకేలు, గిప్టులు, శాలువాలు, పొగడ్తలు, హర్షతిరేకాలతో సన్మానసభ గొప్పగా ముగిసింది.
ఆకాశంలో వరుణుడు కూడా చిరుజల్లులతో ఇతగాడ్ని ఆశీర్వదించాడు.ఆ సమయంలో ఇంద్రధనస్సు వర్ణంలో నున్న గొడుగు విప్పి తడవకుండా వేసుకున్నాడు.
* * *
"ఏమేవ్ రుక్కూ ...కన్నా చిట్టీ ! ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందిరా ! గతంలో ఎన్ని సన్మానాలు జరిగినా ఇంత అద్బుతంగా జరగలేదు."ఉబ్బితబ్బిబ్బవుతూ ఇంట్లో అడుగు పెట్టాడు సచ్చిదానంద.
"ఆ...లోకల్ కేబుల్ లైవ్లో చూసాంలెండి"వ్యంగ్యంగా అంది భార్య రుక్మిణి.
"డాడీ నీసన్మానం చూస్తే భలే నవ్వొచ్చింది తెలుసా ! హహ్హహ్హ...చాలా కామెడీగా జరిగింది డాడీ " పిల్లలు పగలబడి నవ్వుతున్నారు.
"నా సన్మానం మీకు నవ్వులాటగా ఉందా ?" సీరియస్ గా అరిచాడు. ఎంతో ఆనందంతో ఇంటికొచ్చిన తనకు వాళ్ళ వెటకారం చూసి చిర్రెత్తుకొచ్చింది.కాలేజీలో అందర్నీ క్రమశిక్షణలో పెట్టగలిగాడు కానీ ఇంట్లో మాత్రం పప్పులేమీ ఉడకడంలేదు. అందుకే ఇంట్లో విషయాలు బయటకు తెలియకుండ జాగ్రత్త పడుతుంటాడు.
"ఏమండీ..జ్ఞాపకశక్తి గురించి మీరాచెప్పడం.పైగా మైండ్ పవర్ గురించి క్లాసులా ? మీఉన్నతికి జ్ఞాపకశక్తా కారణం. ఎన్నెన్ని కబుర్లు చెప్పారండీ ! మీకబుర్లకి పాపం అక్కడున్నవాళ్ళాంతా బకరాలయ్యారు"అసలే ఉడికిపోతున్న భర్తను ఆట పట్టించింది రుక్మిణి.
"డాడీ నేను బయటకు వెళ్ళాలి. వర్షం వస్తుంది. ఇంట్లో ఒక్క గొడుగు కూడ లేకుండా చేసారు." ఇప్పుడెలా అన్నట్లుగా మోహం పెట్టాడు పుత్రరత్నం.
"డాడీ వారానికి ఎన్ని గొడుగులు పొగొడ్తారు. అసలే వర్షకాలం. మన ముగ్గురికి మూడు గొడుగులు కొనుక్కురండి"ఆర్డర్ వేసింది ముద్దుల కూతురు .
"ఏమండీ.. బయట జ్ఞాపకశక్తి గురించి ఎన్నో కబుర్లు చెబుతారు. ఈవర్షకాలంలో ఇప్పటికే ఇరవై గొడుగులు పోగొట్టారు తెలుసా ! గొడుగేసుకుని బయటకు వెళతారు. ఎక్కడో మర్చిపోయి చేతులూపుకుంటూ ఖాళీగా ఇంటికొస్తారు.అక్కడికీ గొడుగు వద్దంటే వినరు. తడిస్తే జలుబు జ్వరమంటారు."
"అదికాదే రుక్కూ..ఒక్క గొడుగు విషయంలోనే నా మెమరీ పనిచేయడం లేదు. ఎంతగా జ్ఞాపకం ఉంచుకోవాలనుకున్నా మర్చిపోతున్నాను. అక్కడికి ఎన్నో టెక్నిక్స్ వాడి ప్రయత్నం చేసాను. అయినా గొడుగు ఎక్కడ వదిలిపెట్టింది గుర్తు రావడం లేదు".పాపం తన బాధను చెప్పుకున్నాడు.
"ఈసారైనా మీబుర్రనుపయోగించి గొడుగు విషయంలో మేధావినని నిరూపించుకోండి"కాస్తంత సిరియస్ గానే అంది.రుక్మిణి .
* * *
"సొసైటీలో ఎంతో గౌరవముంది.ఇంట్లోనే అదిలేదు.దానికంతటికి కారణం గొడుగే."గొడుగు విషయంలో ఏదొకటి చేయాలని ఆలోచిస్తూనే ఉన్నాడు సచ్చిదానంద.
ఆలోచించగా..ఆలోచించగా తనకో కత్తిలాంటి ఐడియా వచ్చింది. దాన్ని అమలు చేయడానికి పూనుకున్నాడు.
"ఈ గొడుగు నాది. దొరికినవాళ్ళు సగం ధర పంపిస్తే చాలు"అని గొడుగు పై పెయింట్తో రాసి బ్యాంకు ఎకౌంట్ నెంబర్ కూడా ఇచ్చేసాడు.ఇలా రాయడం వల్ల గొడుగు దొరికినవాళ్ళు ఇవ్వాలనుకుంటే ఓయాభై రూపాయిలైనా ఎకౌంటుకి ట్రాన్స్ ఫర్ చేయెచ్చు అనుకున్నాడు. ఇలా జరిగితే కొంత నష్టమైనా తగ్గించుకోవచ్చు.రుక్మిణి ఎకౌంటు నెంబర్ ఇచ్చాడు.భార్యపిల్లల నుంచి కొంతైనా ఉపశమనం పొంద వచ్చని ఊపిరి పీల్చుకున్నాడు.
* * *
పెయింటుతో ఎకౌంటు నెంబర్ వేసిన గొడుగు కూడా పొయి నెల రోజుల పైనే అయింది."ఈరోజుల్లో గొడుగు దొరికితే ఎవ్వడిస్తాడు ! డబ్బులెందుకు పంపిస్తాడు ? మీ పిచ్చి కాకపోతే.పెయింటింగుకి మరో యాభై దండగ "అంది రుక్మిణి.
"ఎందుకైనా ఓసారి బ్యాంకుకెళ్లి చూడవే ! నీ ఆకౌంటే ఇచ్చాను "
"దొబ్బెట్టిన గొడుగు కి యాభై రూపాయలోస్తాయా ! దానికోసం ఇప్పుడు నేను బ్యాంకుకెళ్ళాలా ? నిజంగా మీరు చాలా గొప్ప మేధావేనండీ."వెటకారంగా అంది.
సరేలే..బుక్ ఇవ్వు .బయటకెళ్ళినప్పుడు ప్రింట్ వేయిస్తానని బ్యాంకు బుక్ తీసుకెళ్ళాడు.
* * *
బ్యాంకు బుక్ ప్రింట్ వేయించుకుని చాలా ఆనందంగా ఇంటికొచ్చాడు సచ్చిదానంద.
"ఏంటి చాలా ఆనందంగా ఉన్నారు.. గొడుగు డబ్బులు యాభై రూపాయిలుగానీ పడ్డాయా ! "వేళాకోళంగా ఉందా"అడిగింది .
"నిజమేనోయ్...డబ్బులు పడ్డాయి."
"ఏదీ నిజమా ! ఎంత పడిందండీ ?"ఆశ్చర్యపొయింది
"యాభై..యాభై..యాభై..యాభై..చాలా యాభైలు పడ్డాయే ! మొత్తం రెండువేలు పడ్డాయి"సచ్చిదానందకు మతి పొయింది.
"మనం పోగొట్టుకుంది ఒక గొడుగే కదా ! సగమంటే యాభైయ్యే రావాలి కదండీ.ఇంతెలా వచ్చిందో నాకర్థం కావడం లేదండీ"
"నాకర్థమైందిలే రుక్కూ ! " ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ గర్వంగా చెప్పాడు.
"ఒక్క గొడుగుకు అన్ని డబ్బులొచ్చాయని ఆనందమా ! లేక మేధావిననీ నిరూపించుకున్నందుకు సంతోషమా ? "షాక్ నుంచి తేరుకోలేక అడిగింది సచ్చిదానంద భార్య.
" అవి రెండు కాదే..."
"మరెందుకండీ ఆనందం !!!"
"నాలాంటోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారే !"
--------------- the end -------------
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి
చక్కని హాస్యం
అదిరింది
Superb
Nice story
Ha haha haha....