top of page
Original_edited.jpg

శకున ఫలితం

  • Writer: Kandarpa Venkata Sathyanarayana Murthy
    Kandarpa Venkata Sathyanarayana Murthy
  • Nov 7, 2024
  • 4 min read

#KandarpaMurthy, #కందర్పమూర్తి, #SakunaFalitham, #శకునఫలితం, #TeluguStories, #తెలుగుకథలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Sakuna Falitham - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 07/11/2024

శకున ఫలితం - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


ఆదివారం, హైస్కులు తెలుగు పండితులు వామన మూర్తిగారి ఇల్లు సందడిగా ఉంది. ఆయనకు ఈ సంవత్సరం ఉపాధ్యాయ దినసందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారం వచ్చినందున ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయిస్తున్నారు. మాస్టారికి ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారం రావడం ఇది రెండవసారి. 


 ఇల్లంతా మామిడి తోరణాలు రంగుల కాగితాలతో శిష్యులు అలంకరించారు. గుమ్మం ముందు రంగుల ముగ్గులతో ఆడపిల్లలు పనితనం చూపించారు. మద్యాహ్నానికి విందు భోజన ఏర్పాట్లు మరోపక్కన జరుగుతున్నాయి. 


 అగ్రహారం వేద పండితులు, ఊరి పౌరోహితులు విశ్వనాథ శాస్త్రి గారు ఎర్రని పూల శాలువ భుజం మీద కప్పుకుని, నుదుటున, భుజాలు, వక్షస్తం, చేతుల మీద విభూతి రేఖలు, చెవులకు బంగారు తమ్మెట్లు, నెత్తిన వేలాడుతున్న పిలక, భారీ శరీరంతో పూజా వస్తువులతో

 కొడుకు మాధవ్ వెంట రాగా వ్రతానికి ఏర్పాట్లలో నిమగ్నమయారు. 


 శలవు దినమైనందున మాస్టారి స్నేహితులు, బంధువులు, తోటి ఉపాధ్యాయులు ఒక్కొక్కరుగా వామనమూర్తి గారి ఇంటికి చేరుకుంటున్నారు. అనుకున్న సమయానికి సత్యనారాయణ వ్రతం పూర్తి చేసారు విశ్వనాథ శాస్త్రి గారు. ఇల్లంతా సందడిగా కనబడుతోంది. 


వామనమూర్తి దంపతులకు వేద శ్లోకాలతో శుభాశీసులు అందించారు శాస్త్రి గారు. ఒక్కొక్కరు వచ్చి వామనమూర్తి దంపతులను అభినందిస్తు కానుకలు అందచేసిన తర్వాత 

విందు భోజనశాల వైపు నడిచి వెల్తున్నారు. 


ఇంటికి తీసుకెళ్లాల్సిన పూజాసామగ్రి సంచిలో సర్దుతున్నాడు మాధవ్. 


 విశ్వనాథ శాస్త్రి గారికి, వారి శ్రీమతికి బట్టలు, సంభావన అందచేస్తు మాధవ్ ను చూసి " శాస్త్రి గారూ, అబ్బాయి మాధవ్ కు మీ వేదం, వైదీకంతో పాటు లోకజ్ఞానం కోసం ఆధునిక విద్య కూడా అబ్యసించనివ్వండి. ఊళ్లోనే స్కూలు కనక దూరం వెళ్లి చదవనవుసరం లేదు " అని తన మనసులో మాట బయట పెట్టారు. 


 వామనమూర్తి మాస్టారి మాటల్లో సబబు ఉందని శాస్త్రిగారికి తట్టింది. నేటి ఆధునాతన ప్రపంచంలో సాంప్రదాయ విద్యలతో పాటు సామాజిక విద్య అవసరాన్ని గుర్తించారు. 

  *

 అగ్రహారంలో విశ్వనాథ శాస్త్రి గారు వేద పండితుడు. వేదాల్ని ఔపాసన పట్టిన ఘనాపాటి. నిత్య వేదపారాయణ, ఆధ్యాత్మిక పరిమళాలతో విరాజిల్లుతుంది వారి గృహం. జాతక, గృహవాస్తు, వివాహాది శుభ కార్యాలకు పంతులు గారు నిర్ణయించిన  ముహూర్తాలకు తిరుగుండదని ఊరి ప్రజల నమ్మకం. 


 శాస్త్రి గారి ధర్మపత్ని కామాక్షమ్మ భర్తకు తగిన భార్య. ముఖాన పసుపు, నుదుటున రూపాయంత కుంకుమబొట్టుతో సాంప్రదాయ వస్త్ర ధారణ, కాలికి వెండి కడియాలు, నిత్య పూజా పునస్కారాలతో మహలక్ష్మిలా కనబడుతుందా ఇల్లాలు. 


 శాస్త్రి దంపతుల ఏకైక సంతానం పదిహేనేళ్ల మాధవ్. ఇంట్లో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సమయానుసారం సంధ్యా వందనం, గాయత్రీ జప పఠనం చేస్తుంటాడు. తెలివైన వాడు. వినయ విధేయతల పుట్ట. విశ్వనాథ శాస్త్రి గారు కుమారునికి వారి సాంప్రదాయవిద్యతో పాటు ప్రపంచ జ్ఞానం కోసం అధునాతన విద్య కూడా అవుసరమని తలిచి ఊరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రవేశం కలిగించారు. 


మాధవ్ తండ్రి గారికి వైదిక కార్యక్రమాల్లో సహాయపడుతు స్మార్థం నేర్చుకుంటు పాఠశాల చదువు సాగిస్తున్నాడు. మాధవ్ ను ఊరి పాఠశాలలో పదవ తరగతి వరకు చదివించాలని శాస్త్రి గారి మనోభీష్టం. 


 మాధవ్ చదువులో చురుకైన తెలివైన విధ్యార్థి కావడంతో తరగతిలో ఉపాద్యాయులు బోధించే విద్య విషయాలు ఒకసారి వింటేచాలు జ్ఞాపకం ఉంచుకుని వార్షిక పరిక్షల్లో ఎనబై శాతం పై బడిన మార్కులతో ప్రథముడిగా ఉంటున్నాడు. మాధవ్ కనబరిచే వినయ విధేయతలకు ఉపాధ్యాయులు ముగ్ధులయేవారు. 


 రోజులు గడుస్తున్నాయి. మాధవ్ క్రింది తరగతుల్లో మంచి మార్కులతో పాసవుతు పాఠశాలకి మెరిట్ విద్యార్థిగా పేరు సంపాదించు కున్నాడు. ప్రస్తుతం పదవ తరగతిలో కొచ్చాడు. ఇప్పుడు పదవ తరగతి వార్షిక పరీక్షలు వ్రాసే సమయం వచ్చింది. మొదటిరోజు పరిక్ష రాసే రోజు మొదలైంది. 


 ఇంతవరకూ ఊరి ఉన్నత పాఠశాలలో పరీక్షలు రాస్తున్న మాధవ్ కి పదవతరగతి పబ్లిక్ అయినందున పరిక్షా కేంద్రం పక్క ఊరి పాఠశాలలో రాయవలసివచ్చింది. స్కూలు వరకు నడచి వెళ్లి అక్కడి నుంచి రిక్షాలో వెళ్లడానికి సిద్ధమయాడు. 


 మాధవ్ రోజూ మాదిరి పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని పదవ తరగతి వార్షిక మొదటిరోజు పేపరు రాయడానికి బయలు దేరుతుంటే వెనుక నుంచి తల్లి కామాక్షమ్మ "శకునం చూసుకుని వెళ్లు బాబూ !" అంది. 


 మాధవ్ తన వ్రాత పరికరాలతో బయలుదేరి వీధి మలుపు తిరుగుతూంటే విధవరాలైన మేనత్త పార్వతమ్మ ఎదురు పడి "ఏంట్రా, మాధవా ! నీ స్కూలు పరీక్షలు ఎప్పటి నుంచి ?" అంటూ పలకరించింది. 


 మాధవ్ కి చిర్రెత్తి ఏదో జవాబు చెప్పి వెనక్కి వచ్చాడు. అసలే సాంప్రదాయ కుటుంబంలో పెరిగిన మాధవ్ కి అనుమానాలెక్కువ. వెంటనే ఇంటికి తిరిగొచ్చి కాళ్లు కడుక్కుని చెంబుతో మంచి నీళ్ళు తాగి కూర్చున్నాడు. తల్లికి విషయం చెబితే కామాక్షమ్మ దేవుడి పూజ గది నుంచి కుంకుమ తెచ్చి బొట్టు పెట్టింది. విశ్వనాథ శాస్త్రి గారు వసారాలో పంచాంగం పట్టుకుని ఎవరికో పెళ్లి ముహూర్తం నిర్ణయిస్తున్నారు. 


 కామాక్షమ్మ కొడుక్కి హితవు చెప్పి పూజా కార్యక్రమంలో నిమగ్నమైంది. మాధవ్ పరిక్షకి సమయం మించి పోతోందన్న ఆందోళన తో గుమ్మం ముందు నుంచి తొంగిచూసి ఎవరు లేరని నిర్ధారణ చేసుకుని గబగబ అడుగు లెయ్యడం మొదలెట్టాడు. 


 వీధి మద్యలో కొచ్చేసరికి భైరవమూర్తి గారింట్లోంచి నూనె పోసే తెలుకుల నూకాలు నూనెమట్టెతో ఎదురుపడి "చినబాబూ, ఇస్కూలుకి పోతన్నారా? " అంటూ పలకరించింది. 


మాధవ్ కి చిర్రెత్తింది. పరుగున ఇంటికి వచ్చి కాళ్లు కడుక్కుని మంచినీళ్లు తాగి కూర్చున్నాడు. తల్లి పూజ గదిలో పూజలో నిమగ్నమై ఉంది. తండ్రి పంచాంగ పఠనంలో కనిపించారు. 


పరీక్ష సమయం దాటి పోతోందన్న గాబరాతో మాధవ్ మారు మాట్లాడకుండా గుమ్మం దిగాడో లేదో మంగలిపొది పట్టుకుని అప్పన్న "చినబాబూ, తల బాగా మాసిపోనాది. ఎప్పుడు

 చెయ్యమంటారని" వినయంగా అడిగాడు. 


 మాధవ్ కి ఒకటే భయం పట్టుకుంది. పబ్లిక్ పరీక్ష కేంద్రం మార్పు జరగడం, తను ఇప్పటికే శకునాల అనుమానంతో సమయాన్ని వృధా కావించడం తట్టుకోలేకపోయాడు. 


 పర్యవసానం, పరీక్షా కేంద్రానికి పది నిమిషాలు ఆలశ్యంగా చేరి కంగారుగా పరీక్ష పేపరు రాయడం జరిగింది. మరుసటి దినం నుంచి తల్లినే నీళ్ల బిందెతో ఎదురు రప్పించి మిగతా 

 పరిక్ష పేపర్లు రాసినా ప్రథమ పరీక్షరోజు ప్రభావం మిగత రోజుల పరిక్షల మీద కనబడింది. 


 పాఠశాలకు ప్రథముడిగా వస్తాడనుకున్న తెలివైన విధ్యార్థి మాధవ్ మూఢనమ్మకాల అనుమానంతో పరీక్ష కేంద్రానికి ఆలస్యమవడం, ఆందోళనతో పరీక్ష రాయడం కారణంగా 

 ద్వితీయశ్రేణిలో పాసవడం దిన పత్రికలో పరీక్షా ఫలితాలు చూసిన ప్రధానోపాధ్యాయుడు,  మిగతా ఉపాధ్యాయులు ఆశ్చర్య పోయారు. 


 సాంప్రదాయంతో పాటు అధునాతన దైనందిన పనులలో మార్పు తేవల్సిందే. 


 సమాప్తం  


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page