top of page

సంసారంలో సరిగమలు


'Samsaramlo Sarigamalu' New Telugu Story

Written By Balla Shanmukha Rao

'సంసారంలో సరిగమలు' తెలుగు కథ

రచన : బళ్ళా షణ్ముఖరావు


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

హలో మేష్టారు.. మిమ్మల్నేనండి. ఒక్కసారి ఆగండి సార్‌.. నా బాధ కాస్త చెప్పుకుంటాను.

ఆహా! మీరు తీరుస్తారని కాదు. చెప్పుకుంటే నాకు తగ్గుతుందని.


‘‘అప్పు లేనివాడు అధిక సంపన్నుడు’’ అన్న ఫార్ములాని ఆచరణలో పెట్టి, ప్రతీ రూపాయినీ జాగ్రత్తగా ఆచితూచి ఖర్చుపెట్టే మధ్యతరగతి మనిషి నండి నేను. అలా లేకపోతే వేళ్ళ సందుల్లోంచి ఇసుక జారినట్టు రూపాయిలకి రెక్కలొచ్చి ఎగిరిపోతాయండి.


మొన్నామధ్య పండగ వెళ్ళింది కదా. పండగ సరదాలో ఖర్చుని పెద్దగా పట్టించుకోలేదండి. తీరా లెక్క చూసుకుంటే అయిన ఖర్చుకి నా నడుం సగానికి వంగింది. ఫేమలి కోపరేషనుంటే అలా వంగదండి. మా ఫ్రేమలీ రూటే సెపరేటు.


మేం ఇద్దరం. మాకు ఇద్దరు. అమ్మాయి వయసు పది. పేరు స్వీటీ. కానీ చాలా నాటీ. అల్లరిలో బహు మేటి. దాని చేష్టలకు ఇరుగు పొరుగే కాదు ఎవరైనా జడాల్సిందే. ఏం చెయ్యను? అది నా గారాల పట్టి.


కుర్రాడి వయసు ఏడు. పేరు టింకు. అడవిలో తప్పిపోయిన పిల్లాడ్ని నక్కలు, తోడేళ్ళు పాలిచ్చి పెంచి పెద్ద చేసిన సంగతి మీరు పేపర్లో చదివే వుంటారు. మా వాడు ఆటైపు, ఇల్లు పీకి పందిరేసి దాన్ని కూడా పీకేసే బాపతు.


నా అర్ధాంగి. నాలో సగ భాగం. కాని ఆవిడ నన్ను ఏనాడో పూర్తిగా ఆక్రమించేసింది.

‘‘ఇసుక నుండి తైలము మీరు పిండగలరా?’’

నో డౌట్‌. మా ఆవిడ లెఫ్ట్‌ హేండ్‌తో పిండగలదు. పైకి అంజలీదేవిలా అణకువగా కనిపిస్తుంది. కానీ ‘బ్రూస్‌ లీ’ కంటే ఎక్కువ విద్యలు ఆమె దగ్గరున్నాయని పెళ్ళయ్యాక తెలిసింది. వాటిని నా మీద ప్రయోగించే ఛాన్సు మాత్రం నేను ఇప్పటివరకూ ఇవ్వలేదు.


పండగ బట్టల కోసం అందరం షాపులు వెంట పడ్డాం. ఎక్కే గుమ్మం. దిగే గుమ్మం. షాపుల మెట్లన్ని అరగొట్టేశాం. చివరికి ఓ చీర ఆవిడ గారికి నచ్చింది. ధర మూడు వేలు. గుండె గుబేల్మంది. సరిగ్గా ఈ సమయంలోనే ‘‘బెటర్‌ హాఫ్‌లు’’ తమలో దాచి వుంచిన ప్రతిభను బయటకు రిలీజ్‌ చేస్తారండి. ముద్ద చేసి గోడకి పిడక కొట్టినట్టు, ప్రేమను మన మీదకు విసురుతారు.


అవి పలుకులా.. కాదు జీడి పలుకులు. నైసుగా, గోముగా, మాటల్ని తేనెలో ముంచి తీస్తారు. కోడి రామ్మూర్తయినా సరే ఆ వల్లో పడాల్సిందే. నేనెంత. పిచ్చికని, పడ్డాను. కాని ధైర్యం తెచ్చుకుని ‘‘మూడు వేలు పెట్టి ఒక్క చీర కొనే బదులు మూడు చీరలు కొనుక్కుంటే మూడు పండగలకి కట్టుకోవచ్చు కదా..’’ నసిగాను.


మేష్టారు.. ఇలాంటి లాజిక్కులు, మేజిక్కులు మా లేడీస్‌ దగ్గర ఉడకవండి. చివరాఖరికి అన్నీ మూసుకుని చీర కొన్నానని తమరు గ్రహించే వుంటారు. నా కాళ్ళు బోదకాళ్ళలయ్యే టైంకి మా పిల్లలక్కూడా బట్టలు దొరికాయి. నేను ఓ కొత్త కర్చీఫ్‌ కొనుక్కుని బుర్ర మీద వేసుకుని తృప్తి పడ్డానండి.


పండగ రోజున కడుపారా భోం చేసేసరికి కనులారా నిద్ర తన్నుకొచ్చింది. లేచేసరికి సాయంత్రం నాలుగు. ముఖం కడుక్కుని వాలుకుర్చీలో జారబడ్డాను. క్షీరసాగర మధనంలో అమృత భాండాన్ని అరచేతిలో పెట్టుకున్న మోహినిలా టీ గ్లాసు పట్టుకుని చిరునవ్వుతో మా ఆవిడ నిలబడిరది. నోరు వెడల్పు చేసి పెద్దగా నవ్వుతూ మెలికలు తిరుగుతోంది. నా ఎడం కన్ను అదిరింది. మనసు కీడు సంకించింది. దేనికో ఎసరు పెట్టడానికి రడీ అయినప్పుడే ఇలాంటి ప్రత్యేక ప్రదర్శన ఇస్తుంది. తియ్యగా, మృదువుగా ‘‘హేవండీ’’ అంది. ఆ పలుకు ములుకుగా మారి నా వంట్లో దిగేసరికి ‘‘ఊ’’ అంటూ మూలిగాను. అరమోడ్పు కన్నులతో గోముగా ‘‘మహేష్‌ బాబు సినిమా చూసి చాన్నాళ్ళయ్యింది. ఇవ్వాళ వెడదామండి’’ అంది.


నేను నవ్వేసి ‘‘పండగ పూట సినిమా ఏంటి? రష్‌గా వుంటుంది. టిక్కెట్లు దొరకవు. జనంలో నలిగిపోతాం. సినిమా ఎక్కడికి పారిపోదు. తర్వాత చూద్దాం’’ అన్నాను.


వెంటనే ఆవిడ ఫీలింగు మారింది. బుసలు వినిపించాయి. ఆ చెవి నుండి ఈ చెవి దాకా మూతి తిప్పి గిర్రున లోపలకెళ్ళింది. నాకివ్వాళ మూడిరదని కన్‌ఫర్మ్‌ చేసుకున్నాను. వెంటనే రియాక్షన్‌ కనబడిరది. మా పిల్లలిద్దరూ ఎక్స్‌ప్రెస్‌ వేగంతో దూసుకొచ్చి నా మీద పడి ‘‘నాన్నా సినిమాకి.. నాన్నా సినిమాకి’’ అంటూ వీపు గోతులు పడేలా గోకేశారు. ఆ గోతుల్లో మందు రాసుకుంటూ ‘సరే’ అన్నాను. నా శ్రీమతి గారు ఏదైనా డైరక్టు స్పీచ్‌లో వీలుకాకపోతే ఇన్‌డైరక్టుగా నయినా సాధించగలరని తమకు అర్ధమయి వుంటుంది. ఇక్కడ కట్‌ చేస్తే తర్వాత సీను రోడ్డు మీద.


మా సర్కస్‌ కంపెనీతో ఆటో కోసం రోడ్డు మీద ఎదురు చూస్తున్నాను. రోడ్లన్నీ కొత్త బట్టలతో కాంతులీనుతూ కళకళలాడుతున్నాయి. జనం వుషారుషారుగా తిరుగుతున్నారు. ఆటో ఆగింది. పిల్లలు కేకలు పెట్టుకుంటూ ఎక్కబోయారు. వాళ్ళని వెనక్కి గుంజి ‘ఫలానా థియేటర్‌కు వస్తావా?’ అనడిగాను.

‘‘వస్తాను. వందివ్వండి’’ అన్నాడు.

నాకు ఎక్కడో కాలింది. ‘‘ఇరవై’’ అన్నాను.

నోట్లో నవుల్తున్న గుట్కాని తుపుక్కున నేల మీద ఊసి, సర్రుమని పొగ నా మీద వదిలి ఆటో లాగించేశాడు. ఇలా నాలుగయిదారేడు ఆటోలు పోయాక ఒకడు నా మీద దయతలచి ‘ఏభయి’ అన్నాడు.

నేను బేరమాడే లోపు మా ఆవిడ ‘‘అఘోరించినట్టే వున్నాయి. మీ తెలివితేటలు. ఎంతో కొంత. ఇప్పటికే బాగా లేటయ్యింది. ఎక్కండి’’ అంటూ గదిమింది.


ఇంకేం బేరమాడను. మొత్తానికి అందరం ఆటో అధిరోహించి సినిమా హాలుకు బయల్దేరాం.


హాలుకు దగ్గర్లో నాలుగు రోడ్ల జంక్షన్‌ ఉంది. అక్కడి సిగ్నెల్‌ పాయింటు ‘రెడ్‌’లో వుంది. ఆటో దిగి రోడ్‌ క్రాస్‌ చేస్తే ప్రక్కనే హాలు. లేకపోతే అర కిలోమీటరు ముందుకెళ్ళి యు టర్న్‌ తీసుకుని మళ్ళా వెనక్కి రావాలి. ఇంకా ఆలస్యమవుతుందని మా వాళ్ళని తొందరపెట్టి ఆటో దింపేశాను. ఆటోవాడికి వంద నోటిచ్చాను. మా ఫేమలీ జాగ్రత్తగా రోడ్డు దాటి అవతలికి వెళ్ళిపోతున్నారు. అటే చూస్తున్నాను. ఈలోగా సిగ్నెల్‌ ‘గ్రీన్‌’కు మారింది. ఆటోవాడు తిరిగి నాకు ఏభయి ఇవ్వకుండానే ముందుకు దూసుకుపోయాడు. నేను అవాక్కయ్యాను. పండగ నాకు బోణీ కొట్టింది.


పుష్కరాల టైంలో గోదావరి ఒడ్డులా.. కుంభమేళాలా.. తిరుమల బ్రహ్మోత్సవాల్లా కిటకిటలాడుతోంది హాలు. మన రాష్ట్రంలో ప్రజలు దేవుళ్ళు తర్వాత సినిమా హాళ్ళనే ఎక్కువ కొలుస్తున్నట్టున్నారు. ఒక్కసారి పరిస్థితి సమీక్షించేను. నాక్కావల్సిన మధ్యతరగతి టిక్కెట్లు అయిపోయాయి. వెరీ హై క్లాసు టిక్కెట్లున్నాయి. గుండె దడదడలాడిరది.

ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ మా ఆవిడతో డిస్కస్‌ చేద్దామనుకున్నాను. ఈలోగా ఆవిడగారు కదనరంగంలోకి దూకి అమ్మాయి చెయ్యి పట్టుకుని సమరోత్సాహంతో జనాన్ని ఛేదించుకుంటూ వెళ్ళి ఆడవాళ్ళ లైన్‌లో నిలబడిరది. నేను తెల్లబోయి చూస్తున్నాను. అక్కడ్నించే ‘‘హేవండీ’’ అంటూ దిక్కులు దద్దరిల్లేలా గావుకేక పెట్టింది. తక్షణం నేను ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షమయ్యాను.


‘‘మనిషికి ఒకటేనట. మేం ఇద్దరం రెండు తీసుకుంటాం. మీరో టిక్కెట్టు తీసుకోండి. కుర్రాడికి అక్కర్లేదు. వాడికి అప్పేంటు వేశాను. వయసు తెలీదు. మీరు ఎత్తుకుందురు గాని. తొందరగా వెళ్ళి లైనులో నిలబడండి’’. ఇనప గొంతుతో వివరించింది. ఆజ్ఞ శిరసావహించి గబగబా వెళ్ళి లైనులో నిలబడ్డాను. భారంగా కొంత సమయం గడిచింది. టిక్కెట్టు కౌంటరు తలుపు చప్పుడయింది. కౌంటరు ఓపెన్‌ చేశారు.

అకస్మాత్తుగా వరదొచ్చి ఊరు మీద పడ్డట్టు జనం కౌంటరు మీద ఎగబడ్డారు. అరుపులు, కేకలు, కుమ్ములాటలు, గుద్దులాటలు, తోపులాటలు, కీచులాటలు. జుత్తు రేగి, చొక్కా నలిగి, గుండీలు తెగి, చిన్న చిన్న గాయాలతో రేప్‌కి గురయ్యాక నాకు టిక్కెట్టు దొరికింది.


ఈ పరిస్థితి కల్పించినందుకు మా ఆవిడ్ని మనసారా తిట్టుకున్నాను. ఇసుమంతయినా మేకప్పు చెరిగిపోకుండా రెండు టిక్కెట్లు పట్టుకొచ్చింది నా శ్రీమతి. ఆదరాబాదరా నలుగురం లోపలికి పరిగెట్టాం. మా ఆవిడి సూచన ప్రకారం కుర్రాడ్ని ఎత్తుకున్నాను. కాళ్ళు నేలకి తగిలేస్తున్నాయి.


‘‘లోపలికి వెళ్ళేంత వరకూ భుజం మీద పడుకో. మాట్లాడకు. నిద్ర నటించు’’ అని వాడికి వార్నింగిచ్చేను.

గేటు కీపరు టిక్కెట్టు చింపబోతూ అనుమానంగా నా భుజం మీంచి నేల వరకు చూపు సారించి ‘‘అబ్బాయి వయసెంత?’’ అన్నాడు.


‘‘మొన్ననే రెండు వెళ్ళి.. మూడు వచ్చి..’’ తడబడ్డాను. మా వాడు చెంగున కిందకి దూకి ‘‘అంకుల్‌ నాకు ఏడేళ్ళు. టిక్కెట్టు తీయబడద్దని అలా చెబుతున్నాడు మా నాన్న’’ అంటూ నా వైపు తిరిగి హీ.. హి మని నవ్వి లోపలికి పరిగెట్టాడు. మా ఆవిడ వైపు కొరకొరా చూశాను. ఆవిడగారు కించిత్‌ చలించలేదు.


చాలా తేలిగ్గా ‘‘ఇప్పుడేవయిందని, మీరెళ్ళి ఇంకో టిక్కెట్టు తెచ్చుకోండి. మేం లోపలుంటాం’’ అంది. నేను ఏదో అనబోయాను. ఈ లోపల వెనక నుంచి ఎవడో నా మెడ మీద చెయ్యేసి గెంటాడు. నేను పక్కకి పడ్డాను. మా వాళ్ళు ప్రశాంతంగా లోనికెళ్ళారు.


నేను ఏమాత్రం విరక్తి భావాన్ని మనసులోకి రానివ్వకుండా టిక్కెట్టు కౌంటరుకు చేరుకున్నాను. ‘‘హౌస్‌ పుల్‌’’ బోర్డు కనిపించింది. హే భగవాన్‌ ఇప్పుడు నా కేది దారి? దూరంగా గేటుకు వారగా నిలబడి ఒకడు రహస్యంగా టిక్కెట్లు అమ్ముతున్నాడు. ఒకటే మిగిలింది. రేటు మూడు రెట్లు చెప్పాడు. గుండె కలుక్కుమంది. ఊపిరి బిగబెట్టి కొనేశాను. పండగరోజు రెండో బోణీ తగిలింది. పరిగెట్టి హాల్లో అడుగుపెట్టాను.


అప్పటికే సినిమా మొదలయింది. వెలుతురు లోంచి వచ్చానేమో కళ్ళు చీకట్లు కమ్మాయి. మా వాళ్ళు ఎక్కడున్నారా అని చూపులతో వెతుకుతున్నాను. ఓ మూల నుంచి ‘హేవండీ’ అంటూ గావుకేక. గొంతు గుర్తుపట్టాను. మరో కేక రాకముందే చటుక్కున అటువైపు నడిచాను. కనబడలేదు. ఎవరిదో కాలు తగిలింది. తూలి నిభాయించుకోలేక ముందు సీట్లో కూర్చున్న ఒకావిడ మీద పడి కౌగిలించుకున్నాను.


‘‘బాబోయ్‌, ఎవడో తాగేసి నా మీద పడిపోయాడు.’’ ఆవిడ గగ్గోలుపెట్టింది. వాళ్ళాయన అనుకుంటాను. వస్తాదులా వున్నాడు. పక్క సీట్లోంచి లేచాడు. నా భుజాలు రెండూ పట్టుకుని గాల్లో లేపి ‘‘నేను లెగదీస్తే గాని మా ఆవిడ మీద నుంచి లెగవా?’’ ‘‘ఏవే ముందు నీ మెళ్ళో గొలుసులు చూసుకో’’ అన్నాడు.


దొంగోడు పోలీసోడ్ని బ్రతిమాలినట్టు ‘‘సారీ సార్‌.. చీకటి సార్‌.. కనబడ్లేదు సార్‌.. మా ఫేమలీ సార్‌.. అక్కడుంది సార్‌’’ అంటూ ఆయన చేతులు పిసికాను.


క్షమించి నన్ను వదిలేశాడు. తడుముకుంటూ మా వాళ్ళ దగ్గరకెల్లాను. ముగ్గురూ హాయిగా సినిమా చూస్తున్నారు. ఆ వరుసలో సీట్లు ఖాళీగా లేవు. చీకట్లో నా టిక్కెట్టు మీద సీటు నెంబరు కనబడ్డం లేదు. లైటుబోయి కోసం చూస్తూ నిలబడ్డాను.


వెంటనే వెనక నుంచి ‘‘అడ్డు లే. కూర్చో. లేకపోతే బయటకు పో’’ అంటూ కేకలు వినిపించాయి. వంగుని ‘రో’ మధ్య లోంచి గబగబా బయటకు నడిచి లైటుబోయికి టిక్కెట్టు చూపించాను. అవతల వైపు ఎక్కడో మూలగా లైటు వేసి అక్కడ కూర్చోమన్నాడు. మా ఫేమలీ ఇక్కడ.. నేనక్కడ. ఇలా విడివిడిగా కూర్చుని సినిమా చూస్తే ఆనందం ఏముంది? మరలా ‘రో’ లో దూరాను.


‘‘జోళ్ళు తన్నుకుంటూ పోతున్నావేంటి?’’ అని ఒకడు నా వెనక గిల్లేడు. ‘‘ఇస్‌స్‌.. అబ్బా’’ అని అక్కడ రుద్దుకుంటూ మా అమ్మాయి ప్రక్కన కూర్చున్న పెద్దమనిషి దగ్గరకెళ్ళాను. ఆయన గెడ్డం, చేతులు సున్నితంగా మాలిష్‌ చేస్తూ పరిస్థితి వివరించాను. ఆయనకు సీటెక్కడో చూపించి ‘‘ప్లీజ్‌ ప్లీజ్‌’’ అన్నాను. ఆయన లేచి ఓ బస్తాడు తిట్లు తిట్టి అటు వెళ్ళాడు. హమ్మయ్య అనుకుని సీట్లో కూలబడ్డాను.


నా అవస్థని కాస్త చెప్పుకుందామని మా ఆవిడ వైపు చూశాను. లాభం లేదు. శరీరం సీట్లో వుంటే ఆత్మ వెండితెరకు అంటుకుపోయి వుంది. రెప్ప వేయకుండా సినిమాను ఆస్వాదిస్తూ టిక్కెట్టు డబ్బులు కిట్టిస్తోంది. నేను నిట్టూర్చి సినిమా చూడ్డం మొదలుపెట్టాను. బహుశా అప్పటికే అరగంట సినిమా అయి వుంటుంది. నాకు ఏం అర్థం కావడంలేదు. మా ఆవిడ నా వైపు తిరిగి ‘‘ఇప్పటి వరకూ ఏం చేస్తున్నారు? సినిమాకొచ్చి బయట షికార్లేంటి?’’ అంది. మౌనం ఉత్తమం అని వూరుకున్నాను.


మా అబ్బాయి సీట్లో అటూ ఇటూ కదులుతూ నన్ను తట్టి ‘‘నాన్నోయి నాకు సరిగా కనబడ్డం లేదు. ముందు కూర్చున్నాడే.. ఆడి బుర్ర అడ్డగా వుంది. తియ్యమను’’ అంటూ కేకలు పెట్టాడు. ముందు కూర్చున్న వ్యక్తి వెనక్కి తిరిగి ‘‘మీరేనా ఆ కుర్రాడీ తండ్రి’’ అని అడిగాడు.


అవునన్నాను. ‘‘కుర్రాడ్ని చక్కగా పెంచుతున్నారు. అలాగే పెంచండి. వృద్ధిలోకి వస్తాడు’’ అంటూ సర్టిఫికెట్‌ ఇచ్చాడు.


తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు. మా వాడ్ని నాలుగు తిట్టి వాడికి కనిపించేలా సీట్లు మారాం. తన ప్రక్కన కూర్చున్నందుకు మా అమ్మాయి చాలా సంతోషించింది. కొంతసేపు నన్ను సినిమా చూడనిచ్చి ‘‘నాన్నా ఐస్‌ క్రీం తేలేదా? మర్చిపోయావా?’’ అని ముద్దుగా అడిగింది.


నాకు మండిపోయి మా ఆవిడ భుజం వూపుతూ ‘‘చూడవే దీని కిప్పుడు ఐస్‌ క్రీం కావాలట’’ అంటూ ఫిర్యాదు చేశాను.


మా ఆవిడ నా వైపు తిరక్కుండానే ‘‘తెస్తే పోలా. ఇంటి దగ్గర ఎలాగూ లేదు. ఇక్కడయినా దాని ముచ్చట తీర్చండి’’ అంది.

నేను పళ్ళు పటపటా కొరికి ‘‘ఇక్కడ కాడు. ఇంటికి రండి మీ పని చెబుతాను’’ అంటూ హూంకరించాను. ఈ మేటరు మా వాడి చెవిలో పడినట్టుంది.

నా వైపు తిరిగి ‘‘అక్కకు ఐస్‌ క్రీం కొంటే నాకూ కొనాలి. లేకపోతే అమ్మకు చెబుతాను. అమ్మా..’’ అరున్నర శృతిలో అందుకున్నాడు.


‘‘ఆపండి. వెధవ గోలా మీరును. ఐస్‌ క్రీం తెచ్చి పడేస్తే వాళ్ళు నోరు మూస్తారు కదా. ప్రతీదీ నేనే చెప్పాలి’’ అని విసుక్కుని తిరిగి సినిమా తెరకు అంటుకుపోయింది.


‘నాకు శాంతిని ప్రసాదించు స్వామీ’ దేవుడ్ని తలంచుకుంటూ బయటకొచ్చాను. కేంటీను కెళ్ళి రెండు ఐస్‌ క్రీం లు కొని లోపలికి అడుగు పెట్టాను. యధాప్రకారం నా కళ్ళు చీకట్లు కమ్మాయి. ఆచితూచి అడుగులు వేస్తూ నెమ్మదిగా సీటు దగ్గరకొచ్చి కూలబడ్డాను.


‘‘అబ్బా! ఎవడ్రా నువ్వు? నా ఒళ్ళో కూర్చున్నావు. రేచీకటా? పూర్తిగా కళ్ళు కనబడవా? లెగు బే’’ ఎవడో నన్ను తోసేసాడు.


‘‘అమ్మా నాన్నేమో వెనక వరసలో కెళ్ళి ఎవరి ఒళ్ళోనో కూర్చున్నాడు. చీకట్లో కనబడలేనట్టుంది. నాన్నా.. ఐస్‌ క్రీం తెచ్చావా.. ముందు ఇలా ఇచ్చేయ్‌’’ అంటూ ముందు వరుస లోంచి వంగుని నా చేతిలో ఐస్‌ క్రీం లాక్కుంది మా అమ్మాయి.


‘‘ మీ నాన్న సంగతి నాకు తెలీదా, ఏ పని మాత్రం సవ్యంగా చేశారు. ఇటు రండి ఇటు రండి’’ అంటూ చెయ్యి పూపింది.


జాగ్రత్తగా నడిచి నా సీట్లో కూర్చున్నాను. రెండో ఐస్‌ క్రీం మా అబ్బాయి అందుకున్నాడు. మరో పావుగంట గడిచేసరికి ‘‘ఇంటర్వెల్‌’’. నా టిక్కెట్టు డబ్బులు సగం వేస్టయ్యాయి. అసలే బోల్డంత పోసి కొన్నాను.


ముగ్గుర్ని లోపల కూర్చోమని చెప్పి నేను బయట పడి ప్రశాంతంగా టీ తాగుతున్నాను. ఓ జంటిల్‌మేన్‌ గబగబా దగ్గరకొచ్చాడు. ‘‘సార్‌, మీ శ్రీమతిగారనుకుంటాను. సినిమాలో ఫైటింగు సీను వచ్చినప్పుడల్లా ప్రక్క సీటులో కూర్చున్న నన్ను గుద్దేసి గిల్లిన చోటే మళ్ళీ మళ్ళీ గిల్లేస్తున్నారు. చూడండి దద్దుర్లు. ఓర్చుకోవడం కష్టంగా వుంది. బహుశా మీరనుకుని పొరబడి వుంటారు. ఆ అలవాటు మాన్పించండి. కాస్త కంట్రోల్లో పెట్టండి’’ అన్నాడు.


ఎవడో కోన్‌ కిస్కాగాడు మా ఆవిడ గురించి అలా మాట్లాడేసరికి, మేష్టారూ.. అది నవ్వా, ఏడుపా, బాధా.. అప్పుడు నా మొహం పలికించిన ఎక్స్‌ప్రెషన్స్‌ని వర్ణించడం ఏ పేరు మోసిన రచయిత తరం కూడా కాదు.


నేను తేరుకునే లోపు తుఫానులా మరో జంటిల్‌మేన్‌ దూసుకొచ్చి తన పేంటు చూపిస్తూ ‘‘మీ అబ్బాయి చేసిన ఘనకార్యం బాగా చూడండి. ఐస్‌ క్రీం తినేసి రెండు చేతులూ నా పేంటుకు పామేశాడు. దూరం జరుగుతున్నా మీద మీద కొచ్చి తుడిచేశాడు. పైగా, మా నాన్ననుకున్నాను చీకట్లో కనబట్లేదు అన్నాడు. ఇది మా అత్తారెట్టిన కొత్త పేంటు, మీ వాడికి మంచి విద్యే నేర్పారు. కొన్నాళ్ళు హాస్టల్లో పడేయండి. దార్లో కొస్తాడు.’’ ఉచిత సలహా ఇచ్చి పేంటు కడుక్కోవడానికి కుళాయి దగ్గర కెళ్ళాడు. ఆయన సారీ చెప్పడం కూడా మర్చిపోయి స్తంభించిపోయాను.


నా అదృష్టంకొద్దీ ఇంటర్వెల్‌ తర్వాత మా వాళ్ళు పెద్దగా ఏం ఇబ్బంది పెట్టలేదు. మధ్యలో మా అబ్బాయి ‘‘బాత్రూం’’ అన్నాడు. ‘‘ఇప్పుడు తీసుకెళ్ళను’’ అన్నాడు. ‘‘ఇక్కడే పొసేస్తా’’ అన్నాడు. మరి నాకు తప్పలేదు. తిరిగి వస్తుంటే ఒకాయన ‘‘మీకు షుగరా?’’ అన్నాడు. కోపం ఉవ్వెత్తున లేచింది. కాని తమాయించుకుంటూ సీట్లో కూర్చుని మా ఆవిడ వైపు చూశాను. తెర మీద ఫైటింగు సీను చూస్తూ ప్రక్కాయన్ని కసితీరా గుద్దుతోంది. నేను మా అవిడ భుజం గోకి ‘‘కాస్త చూసుకోవే. నేను ఇటు వైపు ఉన్నాను. ఆయన్ని వదిలేయి. చచ్చిపోయేలా ఉన్నాడు’’ అన్నాను.

‘‘ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా..’’ అంటూ అప్పుడు నా వైపు తిరిగింది.


ప్రశాంతంగా అరగంట గడిచాక మా కుర్రాడు ‘‘నాన్నా పాప్‌కార్న్‌’’ అన్నాడు.

నాకు చిర్రెత్తుకొచ్చి ‘‘నోర్ముయి. నోరెత్తావో పీక పిసికేస్తాను వెధవా’’ అని అరిచాను.


‘‘వచ్చిన దగ్గర్నించి ఒకటే గోల. మమ్మల్ని సినిమా చూడనివ్వరా. బాగా తగులుకున్నారు మాకు’’ వెనక నుంచి ఎవడో నా కంటే గట్టిగా అరిచాడు.

‘‘ఊరుకున్నంత ఉత్తమం.. బోడిగుండంత సుఖం’’ మరొకటి లేదని గ్రహించి కిమ్మనకుండా కూర్చున్నాను.


సినిమా అయ్యేక అందరితో బాటు వెళ్ళడానికి సిగ్గేసింది. ఆగి ఆఖరున బయటకొచ్చాం. రోడ్డు మీద మళ్ళా నాలుగయిదారు ఆటోలు పోయాక ఒక ఆటో కుదిరింది.

‘‘సినిమా సరిగా చూడనివ్వకుండా హాల్లో మీ గోలేమిటండీ?’’ మా ఆవిడ గొంతు సవరించింది.


నేను తల తిప్పి రోడ్డు ప్రక్క అందాలు చూడ్డం మొదలుపెట్టాను. అయిన ఖర్చు తలంచుకుంటే గుండె గుభేల్‌ మంటోంది. ఆటో ఇంటి ముందు ఆగింది. దిగి తలెత్తి చూశాను. నా భార్య వేలు విడిచిన మేనమామ కూతురు, అల్లుడు, ఇద్దరు పిల్లలు.. కొడుకు, కోడలు. ఇద్దరు పిల్లలు అరుగు మీద కూర్చుని కనిపించారు.


తోచీ తోచనమ్మ తోటికోడలు పుట్టింటికెళితే అదీ తోచనమ్మ ఆడ బిడ్డ అత్తారింటి కెళ్ళినట్టు వాళ్ళు పండగ పూట మా ఇంటి కొచ్చారు. ఆ జనాభాని వాళ్ళ బేగ్గులని చూసేసరికి మలేరియా, చికిన్‌ గున్యా కలిసి ఒకేసారి తగులుకున్నట్టయింది నాకు.


పిల్లలతో కిష్కిందకాండలా కళకళలాడుతోంది ఇల్లు. మా ఆవిడ లబ్జుగా ‘‘హే.. హేవండీ’’ అంటూ పిల్చింది.


గతుక్కుమన్నాను. ‘‘మీరో నాల్రోజులు సెలవు పెట్టండి. అందరం కలిసి అరుకు, అన్నవరం, సింహాచలం, కైలాసగిరి చూసొద్దాం. మా వాళ్ళు రాక రాక వచ్చేరు. నాలుగూ చూపించకపోతే ఏం బావుంటుంది చెప్పండి’’ అంది.


నిజవేఁ. అస్సలు బాగోదు. నాలో రగులుతున్న ఆవేశాన్ని అణిచేస్తూ ‘‘బస్సు టైమింగ్స్‌ కనుక్కుని వస్తాను’’ అన్నాను.


‘‘బస్సా?’’ అని ఆవిడ చిరునవ్వుతో నా వైపు చూసి ‘‘ఇంత అమాయకులయితే ఎలా బ్రతుకుతారండి. టాక్సీలు బుక్‌ చెయ్యండి’’ అంది.

ఒక్కసారిగా ముందుకు తూలాను. గిల్లుకుని చూసుకున్నాను. పూర్తిగా స్పృహ పోలేదు.


ఆ విధంగా మా బంధువర్గమంతా హాయిగా నాలుగు రోజులు టాక్సీల మీద తిరుగుతూ ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలక్షేపం చేశారు. ఎందుకు చెయ్యరు? సొమ్మొకడిది సోకొకడిది. అందరికీ బట్టలు పెట్టి అతిధి మర్యాద చేశాం. చుట్టాలంతా ఆనందంగా తిరుగు ప్రయాణం కట్టారు.


అయిన ఖర్చు లెక్క చూసుకుంటే నా గుండెను ఎవరో పిడికిలితో పిసికినట్టయింది. పండగ నెల ఖర్చు వుంటుంది కాబట్టి జాగ్రత్తగా పొదుపు చేద్దామనుకున్నాను. కాని నేను అనుకున్నదానికి వ్యతిరేకంగా జరిగింది. మీరు ఏమీ అనుకోనంటే నా పరిస్థితిని ఒక్క మాటలో వివరిస్తాను.

‘‘సంతానం కోసం సప్త సముద్రాల్లోనూ స్నానం చేస్తే ఉప్పు నీరు తగిలి ఉన్నది కాస్తా ఊడిపోయిందట.’


‘‘మేష్టారూ, మీరు అర్జెంటు పని మీద వెళుతున్నట్టున్నారు. వెళ్ళండి సార్‌. మరి నే వుంటాను.’’

***

బళ్ళా షణ్ముఖరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



Comments


bottom of page