top of page

శంఖంలో పోస్తేనేగా..

#SusmithaRamanaMurthy, #సుస్మితారమణమూర్తి, #SankhamloPosthenega, #శంఖంలోపోస్తేనేగా, #TeluguKathalu, #తెలుగుకథలు


Sankhamlo Posthenega - New Telugu Story Written By Susmitha Ramana Murthy

Published In manatelugukathalu.com On 29/06/2025

శంఖంలో పోస్తేనేగా - తెలుగు కథ

రచన : సుస్మితా రమణ మూర్తి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

“అంత గాభరా దేనికిరా ఆదిత్యా?.. వాడి చుట్టూ అలా గుమికూడకండి. భయపడతాడు” తండ్రి గోపాలం మాటలు, కొడుకు పట్టించుకోలేదు. 


“వాంతులు అవడం మంచిది కాదండీ! బాబుని మంచి పిల్లల స్పెషలిస్టుకి చూపిద్దాం. చెవుల్లో వేళ్ళు పెట్టి తెగ తిప్పుతున్నాడు. నిన్న చీము కూడా వచ్చింది. చెవి స్పెషలిస్టుకి కూడా చూపిద్దామండీ!”


 కోడలు గాభరా పడ్డం చూసిన గోపాలం ఆమెకు ధైర్యం చెప్పబోయాడు. ఆమె మామగారి మాటలు ఖాతరు చేయలేదు. ప్రయత్నం వీడలేదు ఆయన. 


“దూరంగా వున్న స్కూలుకి బస్సులో వెళ్ళి వచ్చాడు కదా?.. కాస్త నీర్సపడ్డాడు అంతే! వాడు వద్దు వద్దంటున్నా బలవంతంగా పులిహోర, సేమియా పాయసం పెట్టారు. హార్లిక్సు తాగించారు.


తినమని బిస్కట్లు, చాక్లెట్లు కూడా ఇచ్చారు. అవన్నీ ఇమడక బస్సులో వాంతులు అయ్యుంటాయి. వికారం తలనొప్పి వచ్చి వుండొచ్చంతే! చెవుల్లో ఇన్ఫెక్షన్ వున్నా, గులిమి వున్నా దురద వేస్తుంది. చీము కారుతుంది “ 


కొడుకుపై మమకారం వలన, వారి మాటలు గాలిలో కలసిపోయాయి. 

“మీ అంత నిబ్బరం మాకు లేదు మావయ్యగారూ! స్పెషలిస్టులకు, చూపించడమే మంచిది”

 భార్య మాటలను సమర్థించాడు ఆదిత్య. 


“ఇంత చిన్న విషయానికి పది కిలోమీటర్ల దూరంలో వున్న స్పెషలిస్టుల దగ్గరకు అప్పాయిమెంటు తీసుకుని పరుగెత్తాలా? మనింటికి దగ్గరలో వున్న జనరల్ డాక్టరుకి చూపించండి. వారి హస్తవాసి మంచిది. మనం చాలాసార్లు వారి దగ్గరకు వెళ్ళాం కదా? వారు చెప్పేది ఓపిగ్గా వింటారు. మంచి మందులు రాస్తారు. ముందు వారికి చూపించండి. అవసరమైతే వారే స్పెషలిస్టులకి చూపించమంటారు” 

 

ఆ మాటలు వారిని ఆలోచించేలా చేసాయి. 


“సైన్సు టీచరుగా వున్నప్పుడు ఎంతోమంది పిల్లల ఇబ్బందులను చూసాను. నామాట వినండి. ముందు ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన నీళ్ళు పట్టండి” 


 ఆమె వెంటనే వారు చెప్పినట్లు చేసింది. 


‘ఆడుతూ, పాడుతూ ఇంటికి దగ్గరలో వున్న స్కూలులో యు. కేజి పూర్తిచేసిన మనవడి వాంతులకి కారణం ఏమిటి?.. కొత్త స్కూలుకి అలవాటు లేని బస్సులో వెళ్ళి రావడమా?.. ’ 


గోపాలం ఆలోచనలకు అయిదు కిలో మీటర్ల దూరంలోని కొత్త స్కూలు కేంద్ర బిందువైంది. అనారోగ్యంకి కారణం చూచాయగా గోచరించింది. 

“అంత దూరంలో వున్న స్కూలు వద్దని చెప్పినా, నామాట వినలేదు. వాడిది ట్రేవలింగు సిక్నెస్ అయ్యుండొచ్చు” 


“ఈ తరంది పోటీ ప్రపంచం మావయ్య గారూ! అందరిలానే దూరమైనా, బెస్ట్ స్కూలులో వేసాం” 


కోడలు కోపంగా అన్న మాటలకు వారు మందహాసం చేసారు. 


“చూడమ్మా! తరం ఏదైనా ముందు చూడాల్సింది పిల్లల ఆరోగ్యమే! ఆ తర్వాతే చదువులు! ఒకటో క్లాసునుంచే బెదర కొట్టకండి. ఆరేడు క్లాసుల దాకా వాడిని ఆడుతూ పాడుతూ దగ్గరలో వున్న స్కూలులో చదువుకోనివ్వండి ”


“ప్రతిదానికీ ఏదో ఒకటి అనడం మీకు బాగా అలవాటు అయిపోయింది డాడీ!” 


కొడుకు ఛీత్కరించుకున్నా, వారి ధోరణిలో మార్పు లేదు. 

“వీడి అనారోగ్యంకి కారణం మీరే!” 


వారి మాటలకు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. 


“ఈ విషయం చాలాసార్లు చెప్పాను. అయినా మీలో మార్పు లేదు. మీ సాఫ్టువేరు ఇంజినీర్లు అందరికీ లక్షల సంపాదనే ధ్యేయం అయిపోయింది. ఇంట్లోవారి ఆరోగ్యంకి, అనారోగ్యంకి కారకులు మీరేనని తెలుసుకోలేక పోతున్నారు” 


ఆ మాటలకు ఇద్దరూ నిర్ఘాంతపోయారు. 


“రాత్రి పిల్లలను తొమ్మిదిలోపే పడుకోబెడితే, ఉదయం ఉత్సాహంగా లేస్తారు. అలాంటి వాతావరణం లేదీ ఇంట్లో. ప్రతిరోజూ వాడు పన్నెండు గంటల తర్వాతే నిద్ర పోతున్నాడు. అర్థరాత్రి దాటినా మీకు ఆన్ లైన్లో ఆఫీసు మీటింగులు, ఆతర్వాత రిలేక్సేషనుకి సినిమాలు!” 


“ఆపండిక డాడీ! మీరు చేసింది ప్రభుత్వ ఉద్యోగం. మీకు పని గంటలు పరిమితం. మావి ప్రైవేటు ఉద్యోగాలు. మాకు ప్రాజెక్టు పని పూర్తవడమే ముఖ్యం. గంటల పరిమితి లేదు” 


కొడుకు మాటలు అక్షర సత్యాలు కావడంతో వారు మరిక నోరు విప్పలేదు. 

“వారిది విశ్రాంత జీవనం కదండీ!!.. ఎన్నైనా ఉచిత సలహాలు పారేస్తారు” 


ఆ మాటలు వారు పట్టించుకో లేదు. 

“ముందు వాడిని ఆ డాక్టరుకి చూపించండి” 


వారు సీరియస్గా చెప్పేసరికి, తలూపారు ఇద్దరూ. 

 

 ***** 

“నమస్కారం డాక్టర్ గారూ!” 


“నమస్తే! బాబుకి ఏమయింది?” 


విషయం వివరంగా చెప్పారు వారు. 

బాబుని పరీక్ష చేసి డాక్టరు నవ్వుతూ చెప్పారు. 


“గాభరా పడకండి. ట్రేవలింగు సిక్నెస్ వలన వాంతులు అయాయి. తిన్నది బాగా జీర్ణం అవడానికి మంచి టానిక్ రాసాను. చెవిలో గులిమి వలన దురద వేస్తుంది. , ఇన్పెక్షన్ వలన చీము వస్తుంది. చెవిలోకి డ్రాప్సు వేయండి. ఇన్పెక్షను తగ్గుతుంది" 


మందులు రాసిన చీటీ వారికి ఇచ్చి వాడే విధానం వివరంగా చెప్పారు డాక్టరు. 

“అలాగేనండీ! మాబాబుతో బాటు మా పక్కనున్న ఇద్దరు పిల్లలు కూడా అదే బస్సులో వెళ్ళారు. వాళ్ళు బాగానే వున్నారండీ!” 


“అందరి ఆరోగ్యం ఒకేలా వుండదు కదమ్మా!” 


అవునన్నట్టు తలాడించింది ఆమె. 

“డాక్టరు గారూ! చెవి డాక్టరుకి, పిల్లల స్పెషలిస్టుకి చూపించమంటారా?” 


నవ్వుతూ చెప్పారు డాక్టరు. “ ముందు నే రాసిన మందులు వాడండి. తగ్గిపోతుంది” 


ఇంకా వారి సందేహం తీరలేదు. మరోసారి అడిగారు. 

“మాబాబుకే వాంతులు అవడానికి, చీము రావడానికి కారణం ఏమిటండీ?” 


“చెప్పాను కదమ్మా! బాబుకి ట్రేవలింగు సిక్నెస్ వలన కడుపులో తిప్పి వాంతులు అయుంటాయని. ఉదయం పిల్లలకు తేలికగా జీర్ణమయే అల్పాహరమే పెట్టండి. చెవులు శుభ్రంగా ఉండాలి. స్నానం చేసేటప్పుడు సబ్బు నురగ లోపలికి వెళ్లకుండా చూడాలి, పుల్లలు, పిన్నీసులు పెట్టి తిప్పితే, చెవిలో వుండే అతి సున్నితమైన భాగాలు దెబ్బ తింటాయి. , ఇన్ఫక్షన్ వచ్చి చీము కారుతుంది. ఈ మందులు వాడితే అన్నీ తగ్గుతాయి “ 


“అలాగేనండీ! మందులు వాడింతర్వాత, అవసరమైతే మరల వస్తామండీ” అంటూ వారు బయటకు వచ్చేసారు. 

 *****

“డాక్టరు గారు ఏమన్నారురా?.. స్పెషలిస్టులకి చూపించమన్నారా?మందులు ఏమైనా రాసారా? తగ్గిపోతుందన్నారా?”


తండ్రి ప్రశ్నలకు కొడుకు విసుక్కున్నాడు. కోడలు బాబుని తీసుకుని తన గదిలోకి అసహనంగా వెళ్ళిపోయింది. తండ్రి మరోసారి అడిగేసరికి, డాక్టరు చెప్పింది వివరంగా చెప్పాడు కొడుకు. 

“నే చెప్పలేదట్రా! ఆ డాక్టరు దగ్గరకు వెళ్ళినందుకు సంతోషం. శంఖంలో పోస్తేనేగా నీరు తీర్థం అయేది!” 


 తండ్రి మాటలకు కొడుకు మౌనం వహించాడు. 


 / సమాప్తం /

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

సుస్మితా రమణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సమ్మెట్ల వెంకట రమణ మూర్తి

కలం పేరు : సుస్మితా రమణ మూర్తి

పుట్టుక, చదువు, వుద్యోగం, స్వస్థలం .. అన్నీ విశాఖలోనే.

విశ్రాంత జీవనం హైదరాబాద్ లో.

కథలు, కవితలు, కొన్ని నాటికలు .. వెరసి 300 పైచిలుకు వివిధ వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి లో కూడా ప్రసారం అయ్యాయి.

బాగా రాస్తున్నవారిని ప్రోత్సహిస్తూ , కలం కదిలితే రాయాలన్న తపనతో

      మీ సుస్మితా రమణ మూర్తి.


 

 

 

 

 

 





 

 

 



 




 


Commentaires


bottom of page