top of page
Original.png

బాల గేయాలు - తాతయ్య మేలి సుద్ధులు

బాల గేయాలు, తాతయ్య మేలి సుద్ధులు, తెలుగు బాల సాహిత్యం, పిల్లల గేయాలు, నీతి గేయాలు, తెలుగు పద్యాలు, మానవ విలువలు, తల్లి ప్రేమ, భగవంతుని నామము, పిల్లల కవితలు, Moral Poems Telugu, Children Poems Telugu, Inspirational Telugu Poems, Telugu Rhymes

పిల్లలకు మంచి విలువలు, నీతి, మానవత్వం నేర్పే తెలుగు బాల గేయాల సంకలనం – తాతయ్య మేలి సుద్ధులు
పిల్లలకు మంచి విలువలు, నీతి, మానవత్వం నేర్పే తెలుగు బాల గేయాల సంకలనం – తాతయ్య మేలి సుద్ధులు

Bala Geyalu - Thathayya Meli Suddulu | Gadwala Somanna 

బాల గేయాలు - తాతయ్య మేలి సుద్ధులు | గద్వాల సోమన్న

Published in manatelugukathalu.com on 16/07/2026


బాల్యంలో నేర్చుకున్న విలువలే జీవితాంతం మనిషికి మార్గదర్శకంగా నిలుస్తాయి. "తాతయ్య మేలి సుద్ధులు" అనే ఈ బాలగేయాల సంకలనంలో మంచి గుణాలు, మానవత్వం, కుటుంబ విలువలు, ప్రకృతి పరిరక్షణ, భగవద్భక్తి, ఆశావాదం వంటి జీవితానికి అవసరమైన పాఠాలను చిన్నారులకు సులభంగా అర్థమయ్యే రీతిలో అందించారు.


ఈ సంకలనంలోని 10 బాల గేయాలు

  1. తాతయ్య మేలి సుద్ధులు

  2. ఉండాలి జీవితంలో

  3. జీవితమే సముద్రం

  4. అక్షరాల ఆణిముత్యాలు

  5. భగవంతుని నామము

  6. ఘన జీవితమే ఉండాలి!

  7. అందాల పాపాయి

  8. నిరాశ చెందకు!

  9. భగవంతుని కరుణలో..

  10. మాతృమూర్తి ఘన స్ఫూర్తి

    =================

    తాతయ్య మేలి సుద్ధులు

    మనసులో ఉల్లాసము 

బ్రతుకులో ఉజ్జీవము 

ఉండేలా చూసుకో 

స్వర్గాన్ని నిర్మించుకో 


చేయదలిచే పనిలోన 

చిత్తశుద్ధి ఉండాలి

నిరంతరం మదిలోన

సమాధానం పండాలి 


బ్రతకరాదు భ్రమలోన 

బద్ధకం నీడలోన 

చురుకుదనం చాటుతూ 

ముందుండాలి భువిలోన


కోపంలో నిర్ణయము

మేలు కాదు మేలు కాదు 

ఉద్వేగంలో  ప్రమాణము 

చేయరాదు  చేయరాదు







ఉండాలి జీవితంలో 

-------------------------------

శ్రేష్టమైన కుందనమై 

గుబాళించు చందనమై 

ఉండాలి జీవితంలో 

పదిమందికి ఇంధనమై 


పసి పిల్లల అందమై

చిరునవ్వుల బంధమై 

ఉండాలి జీవితంలో 

అనురాగపు భవనమై 


ఆపదలో సాయమై 

అక్కరలో నేస్తమై

ఉండాలి జీవితంలో 

ఆదుకునే హస్తమై 


కోకిలమ్మ గానమై 

నెమలమ్మ నాట్యమై 

ఉండాలి జీవితంలో 

కదిలించే గీతమై 





జీవితమే సముద్రం 

------------------------------

కడలిలాంటి జీవితము 

ఆటుపోట్లకది నిలయము 

తట్టుకుంటే విజయము 

అంతులేని సంతసము 


ఎగసిపడే కెరటాలు 

గుండెలోని కోరికలు 

అదుపు లేక కల్లోలము 

ఆఖరికి పెను విషాదము 


కెరటాల్లా ఆరాటము 

ఎడతెగని పోరాటము 

సముద్రంతో పోలికలు 

మానవుని జీవితాలు 


చేస్తేనే నియంత్రణ

జీవితాల్లో రక్షణ 

ముందుచూపే ముఖ్యము 

లేదంటే బహు నష్టము 







అక్షరాల ఆణిముత్యాలు 

-------------------------------

విడిచిపెడితే కలతలు 

బాగుండునోయ్! బ్రతుకులు 

లేకుంటే మనసుల్లో 

సుఖముండదు బ్రతుకుల్లో 


మితిమీరిన కలహాలు 

హరించును కుటుంబాలు 

పెరిగితే శత్రుత్వము 

ఉండదోయ్! సమాధానము 


లేనిపోని గొడవలతో 

మసిబారిన తలపులతో 

సమైక్యతకు ఆటంకము 

కల్గించకు ఓ నేస్తము 


ప్రశాంతత బహు భాగ్యము 

తలపిస్తుంది స్వర్గము 

ఎన్ని ఉన్న  మనశ్శాంతికి 

ఏది కూడా కాదు సమము 






భగవంతుని నామము 

-------------------------------

భగవంతుని ఘన నామము 

జీవితాల్లో దుర్గము 

ఆపత్కాలాన ఇలను 

అక్కున చేర్చుకొని కాయును


ఉద్దరించే నామము 

తోడుండే ఆయుధము 

మలినమైన హృదయాలను 

పవిత్రపరచు నామము 


మహోన్నతమైన నామము 

సృష్టించును స్వర్గధామము 

అన్నీ వేళల్లో అది 

కనుపాపలా ఉండునది 


ధ్యానిస్తే ఆ నామము 

ప్రసాదిస్తుంది శాంతము 

జీవితమంతా క్షేమము 

కలుగజేసే మంత్రము 






ఘన జీవితమే ఉండాలి!

-------------------------------

కన్నవారు గర్వించేలా 

గురుదేవులు హర్షించేలా 

ఘన జీవితమే ఉండాలి!

ఉన్న ఊరు పేరొందేలా 


సమాజమే గుర్తించేలా 

సన్మానమే చేసేలా 

ఘన జీవితమే ఉండాలి!

ఆదర్శమే  చిందేలా 


మహనీయులే మెచ్చేలా 

తల్లిదండ్రులకు నచ్చేలా 

ఘన జీవితమే ఉండాలి!

మన దేశ కీర్తి తెచ్చేలా 


అద్భుతాలే చేసేలా 

ఆశ్చర్యమే చెందేలా 

ఘన జీవితమే ఉండాలి!

చరిత్రే తిరిగి రాసేలా 







అందాల పాపాయి 

------------------------------

అందాల పాపాయి

మా ఇంట సిపాయి 

మనోహరం కనుదోయి 

పాప సాటి లేదోయి 


ముద్దులొలుకు రూపము 

చేయునోయి కనువిందు 

సదనంలో దీపము 

పాపాయి  పసందు 


మాటేమో మధురము 

సున్నితమే హృదయము 

చిన్నారి ఇంటిలో 

తారమ్మ మింటిలో 


మనసేమో మెత్తన 

మమకారపు వంతెన 

పాపాయి ఉండగా 

దీవెనలు మెండుగా






నిరాశ చెందకు!

------------------------------

పదే పదే గతాన్ని

తవ్వుకోకు నేస్తము 

మదిలోని గర్వాన్ని 

చూపకు ఏమాత్రము 


గమనించు ప్రస్తుతాన్ని 

అందుకో విజయాన్ని 

జాప్యమెంత జరిగినా 

చేరుకో గమ్యాన్ని 


ముందుచూపు  వీడకు 

నిర్లక్ష్యం చేయకు 

భవితపై లక్ష్యంతో 

సాగిపో తెగువతో 


అడ్డంకులు వచ్చినా 

ఎదురించుట మానకు 

కష్టాలే తెచ్చినా 

నిరాశ చెందబోకు 







భగవంతుని కరుణలో...

------------------------------

భగవంతుని  కటాక్షము

అమితమైన  అనురాగము 

ఉండాలి జీవితంలో 

మెండుగా ఆశీర్వాదము 


భగవంతుని హస్తంలో 

ఆ చల్లని కరుణలో 

ఉంటేనే బహు క్షేమము 

శుభములే జీవితంలో 


భగవంతుడు తోడుంటే 

ఆశీస్సులు నీ వెంటే 

లేకపోతే బ్రతుకులు 

అవుతాయి పలు ముక్కలు 


భగవంతుని సన్నిధిలో 

నివసించుము నిరంతరము 

కష్టాల సమయంలో 

ఆశ్రయించుము అనిశము 





మాతృమూర్తి ఘన స్ఫూర్తి 

------------------------------

ప్రశాంతతకు నిలయము 

పూలలాంటి అమ్మ ఒడి 

పరికింపగ ఆలయము 

మాతృమూర్తి గర్భ గుడి 

 

నవ మాసాలు మోసిన 

కనుపాపలా చూసిన

అమ్మ కదా దీపిక 

త్యాగానికి ప్రతీక


ఇంటిలో తొలి గురువు 

మేలు చేసే తరువు 

దేవునికి ఆనవాలు 

అమ్మ ఉంటే మేలు 


చేస్తుందోయ్! సేవలు 

చూపిస్తుందోయ్! ప్రేమలు 

సాటిలేని మేటి జనని 

అమ్మ ఉన్న దీవెనలు 


నెరవేర్చును బాధ్యత 

అమ్మ ఉంటే ధన్యత 

ఇల భూతల స్వర్గమే 

సదనానికే నవ్యత 


కుటుంబమే లోకము 

అదే అమ్మ నాకము 

సమానంగా చూచును 

ఉండదోయి స్వార్ధము 



-గద్వాల సోమన్న



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page