top of page
Original.png

రవి కిరణం కావాలి – గద్వాల సోమన్న 20 స్ఫూర్తిదాయక కవితలు

7 hours ago
4 min read

గద్వాల సోమన్న రచించిన 20 తెలుగు కవితలు – నీతి కవితలు, బాల గేయాలు, స్ఫూర్తిదాయక రచనలు

Ravi Kiranam Kavali Gadwala Somanna 20 Spurthidayaka Kavithalu | Telugu Inspirational Poems | Gadwala Somanna 

రవి కిరణం కావాలి – గద్వాల సోమన్న 20 స్ఫూర్తిదాయక కవితలు | గద్వాల సోమన్న

Published in manatelugukathalu.com on 05/11/2026


రవి కిరణం కావాలి కవితలో సమాజానికి వెలుగునిచ్చే వ్యక్తిత్వాన్ని, తాతయ్య మేటి మాటలు, అమ్మమ్మ సూక్తి రత్నాలు వంటి కవితల్లో పెద్దల అనుభవసారాన్ని, సాటిలేని మేటి అమ్మ కవితలో మాతృప్రేమ గొప్పతనాన్ని కవి మనకు తెలియజేస్తారు.

పిల్లలం పూచే పూవులం, పుస్తకం వెలిగించు మస్తకం వంటి బాల గేయాలు పిల్లల్లో విద్య పట్ల ఆసక్తిని, మంచి అలవాట్లను పెంపొందించేలా ఉన్నాయి. కలాం గారికి సలాం కవిత ద్వారా డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం సేవలను స్మరించుకుంటూ యువతకు స్ఫూర్తినందిస్తారు.

ఈ కవితలు పిల్లలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, తెలుగు సాహిత్యాభిమానులకు ఉపయోగకరంగా ఉంటాయి.

మంచి భావాలు పంచే ఈ 20 కవితలను చదివి, మీకు నచ్చిన కవితను వ్యాఖ్యలలో తెలియజేయండి.


రవి కిరణం కావాలి!

----------------------------- 

చేయాలి మేలిమి పనులు 

మెచ్చాలి భువిలో జనులు 

ఉండాలి తరువుల్లా 

జ్ఞానంలో గురువుల్లా 


వదలాలి అల్పబుద్ధులు 

తరమాలి చెడు తలపులు 

దైవ నామ ధ్యానంతో 

కడగాలి మలిన మనసులు

 

విరియాలి ముఖమున నగవులు 

కురియాలి ప్రేమ జల్లులు 

పరిమళించే మల్లెలై 

జీవించాలి వెన్నెలై 


పోవాలి తరతమ్యాలు 

మానాలి వైషమ్యాలు 

వసుధైక కుటుంబంలా 

బ్రతకాలి రవి కిరణంలా 


తాతయ్య మేటి మాటలు 

----------------------------- 

అనుకున్న లక్ష్యాన్ని 

చేరుకో చేరుకో 

ముందున్న కష్టాన్ని 

ఇష్టంగా మార్చుకో 


కాసింత త్యాగాన్ని 

చాటుకో  చాటుకో

ఒక్కింత స్వార్థాన్ని 

వదులుకో వదులుకో 


ఘనమైన నమ్మకాన్ని 

సదా నిలబెట్టుకో 

వచ్చిన అవకాశాన్ని 

వాడుకో వాడుకో 


కళ్లెదుట ఘోరాన్ని 

అడ్డుకో  అడ్డుకో

సాధనతో విజయాన్ని 

అందుకో అందుకో 


అమ్మ ప్రేమ సందేశం 

----------------------------- 

మంచిని నేర్పించే 

మమతను పంచేసే 

సంస్కృతి రావాలి 

వ్యక్తిని గౌరవించే 


ఒకటిగా భావించే 

పెద్దలను పూజించే 

సంస్కృతి రావాలి 

చక్కగా యోచించే 


అందరిని ప్రేమించే 

అమ్మలా గమనించే 

దొడ్డ గుణం కావాలి 

అందరూ మెచ్చాలి 


త్రోవలో నడిపించే 

ప్రేమను చూపించే 

త్యాగగుణం ఉండాలి 

ఆదర్శం చాటాలి 


అమ్మమ్మ సూక్తి రత్నాలు 

----------------------------- 

వ్యక్తులను ఆదరించే 

అన్యాయమునెదురించే 

మనస్తత్వమే ఉండాలి 

మానవత్వం పండాలి 


పేదోళ్లను కరుణించే 

గురువులను వెంబడించే 

సంస్కృతే విరియాలి 

సమ భావం రావాలి 


సత్యాన్ని ఆచరించే 

దైవాన్ని విశ్వసించే 

శుద్ధ హృదయముండాలి 

దైవమందుండాలి 


దానవత్వం పోవాలి 

మంచి మనసు చాటాలి 

ఆధ్యాత్మిక చింతనతో 

మున్ముందుకు సాగాలి


ఉండాలి మంచిగా!

----------------------------- 

అందరితో మంచిగా 

పలకరిస్తూ ప్రేమగా 

అందరూ ఉండాలి

ఆనందం పొందాలి 


జీవితంలో నీతిగా 

కాంతులీను జ్యోతిగా 

జగతిలోన ఎదగాలి 

ఉండాలోయి గొప్పగా 


దేవుడంటే భక్తిగా 

ఆపదలో యుక్తిగా 

ఉంటేనే బహు మంచిది 

నిరంతరం ఓర్పుగా 


పెద్దలతో వినయంగా 

బ్రతుకులోన క్షేమంగా 

చిరునవ్వులు రువ్వుతూ 

సాగాలి హుందాగా 


ఉండాలి గొప్పగా 

----------------------------- 

మాటలో నిలకడగా 

తలపులో పవిత్రంగా 

ఉండాలోయ్! జగతిలో 

అగ్ర స్థానం ప్రగతిలో 


అందరితో మర్యాదగా 

సఖ్యతే ఆయుధంగా 

జీవనం సాగించాలి 

పిల్లలే ప్రాణంగా 


పేదోళ్లకు అండగా 

చేయూతే మెండుగా 

ఉంటేనే గొప్పతనము 

జీవితాన చక్కదనము 


బాధ్యత గల తండ్రిగా 

ఆదరించే అమ్మగా 

ఉండాలి కుటుంబంలో 

అనురాగాల అన్నగా 


ఆత్మీయుని మాటలు 

----------------------------- 

పరీక్షలే పెట్టినా 

కష్టాలే వచ్చినా 

సాగాలోయ్!మున్ముందుకు 

జీవితాన ఎదిగేందుకు 


సమస్యలు చుట్టుముట్టినా 

సునామీలే తెచ్చినా 

ఏమాత్రం భీతిల్లకు 

నైరాశ్యానికి గురికాకు 


అందరూ గేలి చేసినా 

నిందలెన్నో వేసినా 

మనోధైర్యం కోల్పోకు 

వెనుకడుగు వేయబోకు 


సాహసమే ఆధారము 

గొప్ప పనుల సాధనకు 

పెట్టుకోకు విరోధము 

అభివృద్ధికి అవరోధము

 

అక్కయ్య హితవు 

----------------------------- 

దైవాన్ని నమ్ముకో 

ధైర్యాన్ని తెచ్చుకో 

మితిలేని సంతోషము 

నీ సొంతం చేసుకో 


ద్రోహాన్ని మానుకో 

దోషాన్ని దిద్దుకో 

దైనందిన బ్రతుకులో 

ధ్యానమే చేసుకో 


బాగుగా చదువుకో 

సంస్కారం నేర్చుకో 

ఈ సభ్య సమాజాన 

క్షేమాన్ని కోరుకో 


తెలుగు విలువ తెలుసుకో 

దాని ఖ్యాతి చాటుకో 

పూర్వ వైభవము కొరకు 

కాసింత పూనుకో 


భగవంతుడు ఊరుకోడు

----------------------------- 

బీదలను వెక్కిరిస్తే 

వారికి కీడు చేస్తే 

భగవంతుడు ఊరుకోడు 

వారి పక్షాన ఉంటాడు 


అన్యాయం చేసేస్తే 

ఆనందం హరిస్తే 

భగవంతుడు ఊరుకోడు

వారి కొరకు పోరాడు 


బీదలను బాధించకు 

హేళనగా చూడబోకు 

అందరూ సమానమే 

దేవునిది సమ న్యాయమే 


చేతనైతే సాయము 

చూపించు సమ భావము 

పేదోళ్లకు అండగా 

కొండగా ఉండు దైవము 


ముత్యాల్లాంటి మాటలు 

----------------------------- 

మేలు చేసిన వారికి 

చేయకూడదు కీడు 

విలువ లేని వాటికి 

ఇక వెంపర్లాడకు 


ప్రేమ లేని చోటుకి 

వెళ్లకు ఏమాత్రము 

అదుపు లేని నోటికి 

చెరుపు చేయ ఇష్టము 


విలువియ్యకు  నోటుకు 

పెద్దల మాట దాటకు 

కన్నవారి సేవలో 

సేదదీరు ప్రేమలో 


గురుదేవులకు దండము 

పెట్టితే బహు మంచిది 

వారు పంచే జ్ఞానము 

అనుసరిస్తే లాభము 


దైవంతో ఆటలు వద్దు 

-------------------- --------- 

దేవునితో వేషాలు 

వేయొద్దు వేయొద్దు

మితిమీరిన దోషాలు 

చేయొద్దు చేయొద్దు 


దుష్టులతో  స్నేహాన్ని 

అందరితో వైరాన్ని 

పెట్టుకోకు నేస్తమా! 

చెరుపుకోకు బంధాన్ని 


కష్టాలు వచ్చినా 

కోల్పోకు ధైర్యాన్ని 

ప్రాణమే పోయినా 

దూషించకు దైవాన్ని 


దేవునితో సఖ్యత 

సమాజాన సభ్యత 

చాలా అవసరమే 

సదనంలో బాధ్యత 


సాటిలేని మేటి అమ్మ 

----------------------------- 

అమ్మలోని త్యాగగుణము 

అమితమైన అనురాగము 

ఆమెలోనే సాధ్యము 

ఆదరించు మేలిగుణము 


అపారమైన సహనము 

అమ్మకదే ఆభరణము

మాతృమూర్తి సదనంలో 

తారకమ్మ గగనంలో 


అమ్మకు అమ్మే సాటి 

లేరు ఎవ్వరూ పోటీ 

సదనానికి సింగారము 

ఆమె మనసు బంగారము 


పువ్వులాగ మెత్తదనము 

వెన్న వోలె నవనీతము 

అమ్మ మంచి హృదయము 

భగవంతుని ఆలయము


సహనమే ఆభరణము 

----------------------------- 

సమస్యలు సహజమే 

దాటితే విజయమే 

ఇక జీవితమవుతుంది 

అత్యంత అద్భుతమే 


బహు గొప్పది సహనము 

కల్గియున్న లాభము 

నెమ్మదిని పంచేసి 

చేకూర్చును క్షేమము 


ఓర్పులేని బ్రతుకులు 

అభివృద్ధికి దూరము 

కల్లోలం మనసులు 

ఉండదోయి శాంతము 


ఉండాలోయ్! తాలిమి 

అదే కదా మేలిమి 

దానితో ఉపయోగము 

చేస్తుంది ఉపకారము 


సహనమే ఆభరణము 

చూడ కంఠ హారము 

తెస్తుంది గౌరవము

ధరించుము నిత్యము 


ఉంటేనే ఉపయోగం 

----------------------------- 

తరువులా త్యాగగుణము 

గురువులా ఆదర్శము  

ఉంటేనే జీవితము 

పడితేనే ఉపయోగము 


మిత్రునిలా సహకారము

అమ్మలా అనురాగము 

అందిస్తే గొప్పతనము 

ఘన ఆపన్నహస్తము 


చీమలా చురుకుదనము 

పాపలా ప్రసన్న వదనము 

ఉంటేనే లాభకరము 

ఎంతైనా క్షేమకరము 


సూర్యునిలా ఉపకారము 

దారంలా ఆధారము 

అయితేనే సార్థకము 

అవుతుందోయ్! జీవితము 


తాతయ్య హిత బోధ 

----------------------------- 

ఇరుగుపొరుగు వారిలో 

వెదకరాదు  తప్పులు 

పనికిరాని బుద్ధితో 

వేయరాదు నిందలు 


సున్నితమైన మనసులు 

చేయరాదు ముక్కలు 

చేయునోయి గాయము 

కఠినమైన మాటలు 


మూర్ఖులతో  స్నేహము 

వ్యర్థమైన వాదము 

రెండూ హానికరము 

ఉండాలోయ్! దూరము 


పాములాంటి  కోపము 

అగ్నిలాంటి ద్వేషము 

బంధాలకు విఘాతము 

చెరుపును ఆరోగ్యము 


పిల్లలం పూచే పూవులం 

----------------------------- 

పూవులాంటి పిల్లలం 

పరిమళించు మల్లెలం 

కాబోయే నేతలం 

దేశానికి  ఎల్లలం 


జాబిలమ్మ సొగసులం 

వెన్నెలమ్మ వెలుగులం 

అభివృద్ధికి బాటలం 

అనురాగాల తోటలం 


పారే సెలయేరులం 

ప్రాకే పూతీగలం 

ముద్దులొలుకు పిల్లలం

అందరికీ ఇష్టులం 


నింగిలోని చుక్కలం 

నీటిలోని కలువలం 

అందమైన మొక్కలం 

అవనిలోన ఆప్తులం 


చదువులమ్మ బిడ్డలం 

సత్యానికి సాక్షులం 

కపటమెరుగని పిల్లలం 

గుణంలోన శ్రేష్టులం 


స్వేచ్ఛ కోరు పక్షులం 

స్వచ్ఛమైన బాలలం 

కన్నవారి ఆశలం 

వారి కంటిరెప్పలం 


పుస్తకం వెలిగించు మస్తకం

----------------------------- 

పట్టుకొమ్ము పుస్తకం 

వెలుగుతుంది మస్తకం 

దొరుకుతుంది విజ్ఞానం 

తొలగుతుంది అజ్ఞానం 


విలువైనది పుస్తకం 

అదే హస్త భూషణం 

ఉంటుందోయ్! తోడుగా 

బ్రతుకులో మిత్రునిగా 


ఏకాగ్రత పెంచుతుంది 

ఆనందం పంచుతుంది 

సాటిలేని పుస్తకం 

అత్యంత ఉపయోగం 


చదువుకుంటే శ్రద్ధగా 

జీవితాన మేలేగా 

నేర్పుతుంది సంస్కారం 

అభివృద్ధికి సోపానం 


 కలాం గారికి సలాం 

----------------------------- 

జీవించారు గొప్పగా 

నిలబడ్డారు స్ఫూర్తిగా 

అబ్దుల్ కలాం గారు 

మేటి శాస్త్రవేత్త వారు 


సాంకేతిక రంగంలో 

మానవ జీవితంలో 

దేశకీర్తి చాటారు 

దేశభక్తి చూపారు 


అపారమైన సేవలు 

జన్మభూమికి చేశారు 

అసమానులు కలాం జీ 

ప్రగతి బాట వేశారు 


ఆదర్శమే జీవితం 

చేసుకున్నారు సార్ధకం 

"మిస్సైల్ మ్యాన్"  కలాం 

చేయాలోయ్! సదా సలాం 


గురుదేవులు పూజ్యులు 

----------------------------- 

గురుదేవుల మాటలో 

వారు చూపు బాటలో 

ఎంచక్కా సాగాలి 

గమ్యం చేరుకోవాలి 


గురుదేవుల బోధలో 

ఘనమైన జ్ఞానంలో 

ఉన్నతంగా ఎదగాలి 

ఉజ్జీవం పొందాలి 


గురువులుంటేనే కదా 

తొలగేది అజ్ఞానము 

దివ్వెలు వెలిగితేనే 

చీకట్లు మటుమాయము 


ఉదయించే భాస్కరుడు 

అందరికీ సన్నిహితుడు 

ఉపాధ్యాయులు జగతిలో 

అభివృద్ధి పథంలో 


సరదాల దసరా 

----------------------------- 

వచ్చిందోయ్! దసరా 

తెచ్చిందోయ్! సరదా 

అందరికీ కాదా!

పర్వదినం సోదరా!


విజయానికి చిహ్నము 

తొలగిస్తుంది ఖేదము 

పంచుతుంది మోదము 

లేదోయ్! ఏ భేదము 


చూడు కోడి పందాలు 

అవనిలో సరదాలు 

కారాదు వ్యసనాలు 

చెరుపు రాదు బ్రతుకులు 


లోకంలో వేడుక 

ఖరీదైన కానుక 

కోకొల్లలు సరదాలు 

కళకళలాడు గృహములు 




Gadwala Somanna

-గద్వాల సోమన్న



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page