top of page
Original.png

మానవత్వం నుంచి సామాజిక చైతన్యం వరకు

3 hours ago
10 min read

ఈ బానిసత్వం ఇంకెన్నాళ్ళురా అంబేద్కర్ స్ఫూర్తితో సామాజిక చైతన్య తెలుగు కవిత పోలయ్య కవి
పోలయ్య కవి కూకట్లపల్లి పది తెలుగు కవితల సంకలనం – సాహిత్యం, మానవత్వం, సమానత్వం, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించే చిత్రం.

Manavatvam Nunchi Samajika Chaithanyam Varaku - Telugu Poems | Polayya Kavi

మానవత్వం నుంచి సామాజిక చైతన్యం వరకు - పది తెలుగు కవితలు | పోలయ్య కవి కూకట్లపల్లి 

Published In manatelugukathalu.com On 02/11/2026


పోలయ్య కవి కూకట్లపల్లి రచించిన ఈ పది తెలుగు కవితలు మానవత్వం, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం, సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్య చైతన్యం వంటి అంశాలను ఆలోచనాత్మకంగా ఆవిష్కరిస్తాయి. వ్యక్తిత్వ వికాసంతో పాటు సమాజ పరివర్తనకు సాహిత్యం అందించే ప్రేరణను ఈ కవితా సంకలనం ప్రతిబింబిస్తుంది.


1. దివిలో ధృవతారగా వెలగాలంటే..?

2. ప్రదర్శించేందుకే ప్రతిభ..!

3. వెలిగించు వేయి దీపాలు..!

తొలిగించు లక్ష పాపాలు..!!

కరిగించు కోటి శాపాలు..!!!!

4. బుద్ధుని బాటలో…

అంబేద్కర్ అడుగుజాడల్లో!

అంబేద్కర్ ఆశయ సాధన కోసం  (అభ్యుదయ గీతం )

5. అక్షర అక్షయ మాల..!

6. కంటికేల కన్నీటి శిక్ష..? 

7. ఉక్కు మహిళ ఇందిర...! 

చరిత ఒక ప్రశ్నల కొలిమి..!

8. కన్నతల్లి ఇందిర...కన్ను మూసిందిర..!

9. అహంకారం..! అంధకారం..!

10. ఓ మనిషి మారరా..!

మహర్షిగా మారరా..!!

రచన: 

పోలయ్య కవి కూకట్లపల్లి 

అత్తాపూర్ హైదరాబాద్


1. నీవు దివిలో ధృవతారగా వెలగాలంటే..?


నీ మాట...

మకరందమై 

మాధుర్యాన్ని చిందించాలి...


నీచూపు... 

చందమామలా 

స్వచ్ఛతను కురిపించాలి!


నీమనసు... 

దివ్య మందిరంలా 

పవిత్రతను పంచాలి...


నీ కోరికలు...

కడలిలా కాక కలువరేకుల్లా పరిమితమవ్వాలి!


నీ ఆశ...ఆవగింజంత... 

నీ ఆశయం...ఆకాశమంత 


నీ ఓర్పు... హిమగిరి శిఖరమంత... ఒడిదుడుకులకు ఒరిగిపోని నిబ్బరం!


నీ సహనం... సముద్రమంత... 

సందిగ్ధాలకు సమాధానం!


నీ ఆలోచన...అనంత ఆకాశమంత... ఆవిష్కరణలకు ఆలవాలం!


నీ వినయం... 

వసంత పవనం..

ఎదిగిన కొద్దీ ఒదిగే సంస్కారం!


నీ విజయం... 

జీవిత లక్ష్యమై 

నిత్యం వెంటాడాలి!


నీ ప్రేమ పరిమళాలు... 

పదిమందికి పంచాలి...


నీ త్యాగం... 

తపస్సై తనువంతా 

తేజస్సు నింపాలి!


నీ సాహసం... 

శ్వాసగా సమరానికి సిద్ధపడాలి...


నీ ఆత్మగౌరవం... 

ఆక్సిజనై అస్తిత్వాన్ని నిలపాలి!


నీ ఆత్మవిశ్వాసం... 

ఔషధమై అపజయాలను జయించాలి...


నీ ఆత్మబలం... 

అస్త్రంగా అడ్డంకులను ఛేదించాలి!


నీ ఆత్మీయత... 

ఆభరణమై అందరినీ అలరించాలి...


నీ శ్రమ... 

శిలాశాసనమై చరిత్రలో నిలవాలి!


నీ సత్యం... 

సోపానమై శిఖరాగ్రానికి చేర్చాలి...


నీ స్థితప్రజ్ఞత... 

సింహాసనమై మదిని ఏలాలి!


నీ ప్రజాసేవే... 

జీవిత పరమార్థం కావాలి...


నీ ధర్మమే... 

దారి దీపమై దిశను చూపాలి!


నీ వైరాగ్యమే... 

వరమై వాంఛలను వశపరచాలి...


నీ ఆత్మపరిశీలన... 

అంతరంగానికి అద్దమవ్వాలి!


నీ అంతరంగ అన్వేషణ.. ఆత్మసాక్షాత్కారానికి బాటవ్వాలి!


అప్పుడే ఓ మనిషి...

నీవు ఒక త్యాగిగా... ఒక యోగిగా...

ఒక మహర్షిగా... ఒక మహనీయుడిగా!

ఒక ఉత్తముడిగా... ఒక మహాత్ముడిగా...

మారి పురుషుల్లో 

పుణ్యపురుషుడివౌతావు


దైవాంశ సంభూతుడివై

దివ్యత్వాన్ని చాటుతావు..

భువిలో నడిచే దైవానివౌతావు!

కాలం కరిగినా కీర్తి 

కరగని మహోన్నతుడివై...

వెయ్యేళ్ల చరిత్రలో 

చెరగని సంతకమౌతావు!


దేవున్ని వెతుకుతూ నీవు 

దివి దాకా వెళ్లనక్కరలేదు...

దైవత్వాన్ని నింపుకున్న 

మనిషే కదా నేలన నడిచే దైవం!

గుడిలో వెలిగే దీపమే దేవుడైతే...

దివ్యమైన సుగుణాలతో వెలిగే 

ఓ మనిషి..!

నీవే ఈ లోకానికి ధృవతారవౌతావు


రచన: 

పోలయ్య కవి కూకట్లపల్లి 

అత్తాపూర్ హైదరాబాద్ 


2. ప్రదర్శించేందుకే ప్రతిభ..!


పంచేందుకే జ్ఞానం 

ప్రదర్శించేందుకే ప్రతిభ..!

ప్రయత్నించేందుకే జీవితం..!!


ఓ యువతా..! ఓ నవయువతా..!

నీ నరనరాన నిదురించే

నిప్పుకణాన్ని నింగికి 

ఎగసే జ్వాలగా మార్చు!


సద్బుద్ధి నీ చిరునామా కావాలి...

సహనం నీ సహచరి కావాలి...

సుగుణం నీ సౌరభం కావాలి...

సంకల్పం నీ సారథి కావాలి!


సంయమనం నీ సంస్కారం కావాలి...

సమయస్ఫూర్తి నీ ఆయుధం కావాలి...

సత్యం నీ పలుకుల్లో ప్రకాశించాలి...

సత్ప్రవర్తన నీ నడతలో ప్రతిఫలించాలి!


కసి నీ కండరాల్లో కదలాలి...

కృషి నీ కనురెప్పల్లో మెరవాలి...

పట్టుదల నీ పాదాలకు బలమవ్వాలి...

దీక్ష నీ విజయానికి మార్గమవ్వాలి!


ప్రదర్శించని !

ప్రతిభ ఉండి ప్రయోజనమేమి...

పదిమందికి పంచని !

జ్ఞానముండి లాభమేమి...


మట్టిలో దాగిన విత్తనం

మహావృక్షమై ఎదగదు...

మదిలో దాగిన ఆలోచన

మహోద్యమంగా మారదు!


మరుగున పడిన మణి

మార్కెట్‌లో మెరవదు...

మౌనంగా మిగిలిన మేధ

మానవాళికి వెలుగునివ్వదు!


ప్రపంచం పడుకున్నవాణ్ణి

పలకరించకపోవచ్చు...

కానీ పడుతూ లేస్తూ పైకెగసే

ప్రయత్నశీలికి మాత్రం

వేలచేతులు ఆసరా ఔతాయి!


పాతాళంలో దాగిన జలధార

బయటకు రావాలని తహతహలాడుతుంది...

దాహార్తి పెదవులను తడిపి

జీవనధార కావాలని పరితపిస్తుంది!

ప్రవహించని నీటికి విలువేముంది?

పంచని ప్రతిభకు పరమార్థమేముంది?


విత్తనం నాటిన రైతే

పచ్చని పంటలను పండిస్తాడు...

పరుగుపందెంలో పాల్గొన్నవాడే

పతకాన్ని ముద్దాడుతాడు...

సముద్ర గర్భంలోకి దిగినవాడే

ముత్యాల నిధిని అందుకుంటాడు...

సాహసంతో ముందుకు సాగినవాడే

శిఖరాగ్రాన్ని చేరుకుంటాడు!


ఓటమి ఎదురైతే ఒరిగిపోకు...

అవరోధం ఎదురైతే ఆగిపోకు...

విమర్శలు వినిపిస్తే వెనుదిరగకు...

విజయం వరించే వరకు

విశ్రమించకు... విరమించకు!


ఓ యువతా..!గుర్తుంచుకో 

ప్రతిభ ప్రదర్శనతోనే పరిమళిస్తుంది...

జ్ఞానం జ్ఞానదానంతోనే వెలుగుతుంది...

ప్రయత్నం పట్టుదలతోనే ఫలిస్తుంది...

జీవితం సార్థకతతోనే ధన్యమవుతుంది!


నీ ప్రతిభను నీవే సమాధి చేయకు...

నీ శక్తిని నీవే సంకెళ్లలో బంధించకు...

నీ వెలుగును నీవే చీకటికి అప్పగించకు...


నీలోని నిప్పును రగిలిగించు...

నీ విజయంతో 

నలుగురికీ దారి చూపించు!

నీవు ఎదగాలి.....

నీ ఎదుగుదల నీ సద్బుద్ధి 

నీ సహనం నీ సమభావమే

నవసమాజానికి నాంది కావాలి..!


రచన: 

పోలయ్య కవి కూకట్లపల్లి 

అత్తాపూర్ హైదరాబాద్ 


3. వెలిగించు వేయి దీపాలు..!

తొలిగించు లక్ష పాపాలు..!!

కరిగించు కోటి శాపాలు..!!!!


ఓ మిత్రమా! నా ప్రియ నేస్తమా!

ఈ దివ్య దీపావళి పర్వదినాన  

ఆ పరమాత్మను నేను కోరుకునేది 

ఒక్కటే... మీ ఇంట... 

వెలగాలని... వెలగాలని... వేయి దీపాలు!

తొలగాలని... తొలగాలని... లక్ష పాపాలు!

కరగాలని... కరగాలని....కోటి శాపాలు...!


అందుకే ఓ మిత్రమా నా ప్రియ నేస్తమా 

వెలిగించు..వెలిగించు...పది దీపాలు!

పవిత్ర గ్రంధం  బైబిలు బోధించిన

పది ఆజ్ఞలకు ప్రతిరూపాలుగా...

మానవాళి ధర్మమార్గాన్ని దర్శించేలా!


ఓ మిత్రమా నా ప్రియ నేస్తమా 

వెలిగించు.. వెలిగించు తొమ్మిది దీపాలు!

నవగ్రహా శక్తులకు ప్రతిబింబాలుగా...

నీ జీవిత గమనాన్ని నవవసంతంగా

నవవైభవంగా నడిపించేలా!


ఓ మిత్రమా నా ప్రియ నేస్తమా 

వెలిగించు.. వెలిగించు..ఎనిమిది దీపాలు!

అష్టదరిద్రాల అంధకారాన్ని తరిమేసి..

నీ జీవితం నీతీ నిజాయితీ నిస్వార్థాలకు

నిలువెత్తు నిదర్శనమై నిలిచేలా!


ఓ మిత్రమా నా ప్రియ నేస్తమా 

వెలిగించు... వెలిగించు ఏడు దీపాలు!

ఈ జీవితం... 

ఏడు రంగుల ఇంద్రధనుస్సని...

ఏడడుగుల ఈ అనుబంధం...

ఏడు జన్మలూ అనురాగ బంధంగా సాగిపోవాలని మనసారా కోరుకుంటూ!


ఓ మిత్రమా నా ప్రియ నేస్తమా 

వెలిగించు... వెలిగించు ఆరు దీపాలు!

అరిషడ్వర్గాల...

ఆరు అవలక్షణాలను ఆర్పేసి.

అంతరంగంలోని 

అహంకార ఆవేశాలను కరిగించి...

మానవత్వం పరిమళించే 

మందిరాలుగా మనసుల్ని మార్చేలా!


ఓ మిత్రమా నా ప్రియ నేస్తమా 

వెలిగించు... వెలిగించు ఐదు దీపాలు!

మనిషి పుట్టుకకు మూలమైన

పంచభూతాలకు ప్రతిరూపాలుగా...

కడకు కలిసిపోయేది ప్రకృతిలోనేనని 

ఈ మట్టిమనిషికి జ్ఞానోదయమయ్యేలా!


ఓ మిత్రమా నా ప్రియ నేస్తమా 

వెలిగించు... వెలిగించు నాలుగు దీపాలు!

నలుగురితో మంచిగా మెలగాలని...

చివరి మజిలీలో కాటిదాకా కలిసొచ్చేది 

ఆ నలుగురేనని చాటిచెప్పేలా!


ఓ మిత్రమా నా ప్రియ నేస్తమా 

వెలిగించు... వెలిగించు మూడు దీపాలు!

సత్వ రజో తమో గుణాలకు ప్రతీకలుగా...

సత్వగుణ సంపదతో సద్బుద్ధితో...

సత్సంకల్పంతో...సమభావంతో....

సమాజాన్ని సన్మార్గంలో నడిపించేలా!


ఓ మిత్రమా నా ప్రియ నేస్తమా 

వెలిగించు... వెలిగించు రెండు దీపాలు!

కని పెంచే అమ్మానాన్నలకు అంకితంగా...

కంటికి కనిపించే ఆ కరుణామయ

దైవాల ప్రతిరూపాలను పూజించేలా!


ఓ మిత్రమా నా ప్రియ నేస్తమా 

వెలిగించు... వెలిగించు ఒక్క దీపం!

ఒక్కడే దేవుడని... 

ఆయనే ఏకైక పరమాత్మయని...

సర్వశక్తిమంతుడని...

సర్వాంతర్యామియని...

సకల చరాచర సృష్టికి మూలకర్తని

మానవ జాతి ఒక్కటే మహోన్నతమైనదన్న 

విశ్వ మానవ సందేశం 

ప్రపంచమంతా ప్రతిధ్వనించేలా


ఓ మిత్రమా! నా ప్రియ నేస్తమా!

దీపం వెలిగించడం అంటే 

వత్తిని వెలిగించడం కాదు...

నీ అంతరంగంలో 

మానవత్వాన్ని మేల్కొల్పడం!

పరుల జీవితాలను

ప్రేమజ్యోతులతో నింపడం!


రచన: 

పోలయ్య కవి కూకట్లపల్లి 

అత్తాపూర్ హైదరాబాద్ 


4. బుద్ధుని బాటలో…

అంబేద్కర్ అడుగుజాడల్లో!

అంబేద్కర్ ఆశయ సాధన కోసం  (అభ్యుదయ గీతం )


పల్లవి:

లేవరా… లేవరా…

ఓ బహుజన బిడ్డా లేవరా

వెలగరా… వెలగరా…

విజ్ఞాన జ్యోతివై వెలగరా!


వినరా వినరా 

బుద్ధుని బోధనలు వినరా,

సాగరా సాగరా

సమసమాజ స్థాపనకై సాగరా!


నడవరా నడవరా

అంబేద్కర్ అడుగుల్లో నడవరా!

సాధించరా సాధించరా 

అఖండ విజయాలు సాధించరా!

ఎగురవేయరా ఎగురవేయరా

స్వాభిమాన రాజ్యాధికార

పతాకాన్ని ఎగురవేయరా!


చరణం – 1

ఓ బహుజన బిడ్డా…!

బుద్ధుని బోధన బంగారు బాటరా!

అంబేద్కర్ ఆలోచన అక్షరాల కోటరా!

కరుణను కవచంగా ధరించి నడవరా!

సమ సమాజానికి 

సమర శంఖారావాన్ని పూరించరా!


చరణం – 2

ఓ బహుజన బిడ్డా…!

నీలి వస్త్రధారణతో 

నీతిపతాకమై నిలవరా!

నిలువెత్తు ఆత్మగౌరవం 

నీలో నింపుకోరా!

వినయమే ఆభరణంగా 

వివేకమే వాహనంగా

విజ్ఞాన వజ్రాయుధంతో 

విజయాలు సాధించరా!


చరణం – 3

ఓ బహుజన బిడ్డా…!

శుభ్రమైన దుస్తులే 

సంస్కారానికి చిరునామారా!

చక్కని నడవడికే 

వ్యక్తిత్వపు నిలువుటద్దంరా!

మితమైన మాటలే 

మమతల మకరందంరా!

మంచి మనసే 

మానవత్వపు మహాసౌధంరా!


చరణం – 4

ఓ బహుజన బిడ్డా…!

అక్షరాన్ని అందుకోరా  

అజ్ఞానాన్ని అంతమొందించరా!

విద్యాదీపం వెలిగించరా 

వివక్షల చీకట్లను తొలిగించరా!

పోయిన హక్కులను తెలుసుకోరా  

అన్యాయపు ఆధిపత్యాన్ని ఎదిరించరా!

కులవివక్ష సంకెళ్లను తెంచి 

స్వాభిమాన జెండాను ఎగురవేయరా!


ఓ బహుజన బిడ్డా…!

బుద్ధుని బాటలో కరుణను పంచరా!

అంబేద్కర్ బాటలో సమతను చాటరా!

ఆశయాలను ఆచరణలో చూపరా!

అభ్యుదయ భారత నిర్మాణంలో భాగస్వామివైపోరా!


విగ్రహాలకు పూలమాలలు 

వేయడం కాదురా…

మహనీయుల ఆశయాలకు 

ఆచరణమాల వేయాలిరా!


రచన: 

పోలయ్య కవి కూకట్లపల్లి 

అత్తాపూర్ హైదరాబాద్ 


5. అక్షర అక్షయ మాల..!


అక్షరాలే నా ఆభరణాలు.. 

భావాలే నా ఆస్తులు..!


అక్షరయజ్ఞం నా ఆరంభం...

అక్షరయాత్ర నా పయనం...

అక్షర నక్షత్రాలు నా వెలుగులు...

అక్షరాభిషేకం నా అక్షరార్చనం!


అక్షర సామ్రాజ్యం నా ప్రపంచం...

అక్షర సింహాసనం నా సాహిత్య పీఠం...

అక్షర స్నేహం నా అనుబంధం...

అక్షర అక్షయపాత్ర నా భావ సంపద!


అక్షరాంజలి నా ఆత్మ నివేదనం...

అక్షరామృతం నా మధుర వచనం...

అక్షరాలే నా నేస్తాలు...

అనుభూతులే నా ఆభరణాలు!


అక్షరం ఒక విత్తనం...

భావం ఒక జీవధార...

కవిత ఒక కల్పవృక్షం...

పాఠకుడి హృదయం దాని ఫలసారం!


అక్షరంతో ఆలోచన...

ఆలోచనతో ఆచరణ...

ఆచరణతో పరివర్తన...

పరివర్తనతోనే సమసమాజ సౌందర్యం!


అక్షరాలు రాలిపోవు...

అనుభూతులు ఆరిపోవు...

కలం ఆగిపోయినా...

కవిత్వం కాలగర్భంలో కలిసిపోదు!


అక్షరం ఉన్నంతకాలం 

సాహిత్యం అజరామరం...

భావం ఉన్నంతకాలం 

కవిత్వం ఒక అక్షయపాత్ర...

మనసు ఉన్నంతకాలం అక్షర స్నేహం...

మానవత్వం ఉన్నంతకాలం అక్షరయజ్ఞం!


అక్షరమే నా ఆయువు...

అక్షరమే నా ఐశ్వర్యం...

అక్షరమే నా చిరునామా...

అక్షరమే నా అక్షయ వారసత్వం!!


రచన: 

పోలయ్య కవి కూకట్లపల్లి 

అత్తాపూర్ హైదరాబాద్ 


6. కంటికేల కన్నీటి శిక్ష..? 


రక్షకులే భక్షకులైతే

ఇక రక్షణకు అర్థమేముంది..?


నమ్మిన చేతులే నిప్పులైతే

ఇక నమ్మకానికి నీడెక్కడుంది..?


జింకలే పులులై వేటాడితే

ఇక అడవంతా ఆర్తనాదమే కదా..!


కంచే చేనును మేస్తే

ఇక కాపలాకు విలువెక్కడుంది..?


కనురెప్పే కంటిని కాటేస్తే

ఇక కంటికి మిగిలేది కన్నీటి శిక్షే కదా..!


నమ్మినవారే నయవంచకులై నట్టేట ముంచితే ఇక న్యాయ దేవతెక్కడ..?


కష్టాల్లో ఉన్నారని చేరదీసి దారిచూపితే

కాలసర్పాలై కాటేస్తే ఇక ధర్మదేవతెక్కడ..?


రచన: 

పోలయ్య కవి కూకట్లపల్లి 

అత్తాపూర్ హైదరాబాద్ 


7. ఉక్కు మహిళ ఇందిర...! 

చరిత ఒక ప్రశ్నల కొలిమి..!


(అక్టోబర్ 31 — శ్రీమతి 

ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా)


విజయాల వెలుగులు విరజిమ్మినా

వివాదాల నీడలు వెంటాడినా,

అధికార శిఖరాలు అధిరోహించినా

చరిత్ర ప్రశ్నలు సంధిస్తూనే ఉంటాయి!


అత్యవసర పాలన ఆవహించగా

స్వేచ్ఛా స్వరాలు మూగబోగా,

ప్రజాస్వామ్యపు ప్రాణవాయువుకు

పరీక్షా సమయం ఎదురాయే!


అధికారమొక బాధ్యత కావాలి—

అహంకారానికి ఆయుధం కారాదు!


దేశ సమైక్యత దృఢంగా నిలవాలి,

ప్రజల స్వేచ్ఛ పదిలంగా ఉండాలి

నాయకుడి నిర్ణయం న్యాయమై నడవాలి,

నవభారత ఆశయం సజీవంగా ఉండాలి!


పేదల కన్నీరు తుడిచే పాలన,

బడుగుల బతుకులు మార్చే ప్రణాళిక

అభివృద్ధి అడుగులు ముందుకు సాగినా

ప్రజాస్వామ్యమే పాలనకు ప్రాణాధారం!


ప్రజలే పీఠం—ప్రజలే శక్తి

ప్రజల విశ్వాసమే పాలకులకు ఆక్సిజన్!


అంగరక్షకుల తుపాకీ గుళ్లు

ఆమె జీవన దీపం ఆర్పివేసినా,

అక్టోబరు ముప్పై ఒకటి

భారత చరిత్రలో విషాదమై మిగిలినా,


మరణం మనిషిని మట్టిలో కలిపినా

మహనీయుల జ్ఞాపకాలు మాసిపోవు

వారి విజయాలు, వైఫల్యాలు

కాలం వేసే ప్రశ్నల నుంచి తప్పించుకోవు!


వ్యక్తులు గతిస్తారు

వారి నిర్ణయాలు చరిత్రలో నిలుస్తాయి

దేహాలు మట్టిలో కలుస్తాయి

వారి పాఠాలు తరతరాలకు అందుతాయి!


ఓ ఉక్కు మహిళ ఇందిరమ్మా! 

నీ జీవితం ఒక అధ్యాయం,

నీ ప్రస్థానం ఒక రాజకీయ కావ్యం

నీ విజయాలు స్ఫూర్తి పుటలు,

నీ వివాదాలు విమర్శల మెట్లు!


నిన్ను కీర్తించడం ఒక్కటే కాదు,

నిన్ను విమర్శించడం ఒక్కటే కాదు

వెలుగునీడల వెనుక 

వాస్తవాన్ని వెతకడమే

వివేకవంతమైన చరిత్ర పఠనం!


ఓ పేదల పెన్నిధి ఇందిరమ్మా! 

నీ మరణం ఒక విషాదగాథ—

నీ చరిత ఒక  ప్రశ్నల కొలిమి!

నాయకులందరికీ నీ జీవితం

ఒక ప్రజాస్వామ్య పాఠశాల కావాలి!


రచన: 

పోలయ్య కవి కూకట్లపల్లి 

అత్తాపూర్ హైదరాబాద్ 


8. కన్నతల్లి ఇందిర...కన్ను మూసిందిర..!


విశాల భారతావనిని 

అద్వితీయంగా పరిపాలించి 

విశ్వశాంతి స్థాపనకై అహర్నిశలు పరితపించి విశ్వాస ఘాతకులైన అంగరక్షకుల అమానుషత్వానికి

...బలిపశువులా ఇందిర...బలైపోయిందిర


కారుచిచ్చులా దహించే 

కటిక దారిద్య్రంలో జీవించే 

కార్మిక కర్షక బ్రతుకుల్లో 

కారుచీకట్లు తొలగించిన... 

కాంతి రేఖలు వెలిగించిన...

...కన్నతల్లి ఇందిర...కన్నుమూసిందిర


విదేశీయుల మద్దతుతో 

విజృంభించే విచ్ఛిన్నకర శ క్తులు తీవ్రరూపందాల్చి దేశాన్ని చీల్చి 

ప్రజల రక్తాన్ని పీలుస్తాయని... ప్రజాస్వామ్యాన్ని కూలుస్తాయని...

... చింతిస్తూ ఇందిర...చితికి చేరిందిర


అనేక సూత్రాలు అమలుపరచి 

ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచి అట్టడుగునున్న బడుగు వర్గాల 

ఆకలి బాధలు తీర్చిన...

ఆశలన్ని నెరవేర్చిన...

...ఆశాజ్యోతి ఇందిర...ఆరిపోయిందిర


అగ్రరాజ్యాలు ఉన్మాదంతో 

ఉగ్రరూపం దాల్చక మునుపె 

అనంత విశ్వాన్ని భస్మం చేసె అణుబాంబులను పేల్చక మునుపె 

అణు యుద్ధాన్ని ఆపమని... 

అగ్రరాజ్యాలను ఆదేశించమని... 

దాగివున్న ఆ దైవాన్ని

...అర్ధించ ఇందిర...అసువులు బాసిందిర


త్రాగిన మైకంలో 

తల తిరిగె తరుణంలో 

కన్నీరు నింపిన కలంతో 

విధి వ్రాసిన నిరుపేదల 

"తలరాతల రాజ్యాంగాన్ని"

...సవరించ ఇందిర...స్వర్గానికేగిందిర


రచన: 

పోలయ్య కవి కూకట్లపల్లి 

అత్తాపూర్ హైదరాబాద్ 


9. అహంకారం..! అంధకారం..!


ఆస్తి 

— అహంకారానికి 

ఓ ఆలవాలం

అందం 

— గర్వానికి ఓ గాజుమేడ

అధికారం 

— పొగరుకు ఓ పీఠం

అంగబలం 

— విర్రవీగే ఓ మత్తు

నాలుగు గుర్రాలెక్కి

నింగికెగసిన మనిషికి

నేలమీద నడిచే 

నలుగురు గడ్డి పోచలే...


కానీ...కాలచక్రం కాటేస్తే

కాసుల కోట కూలిపోతుంది..!

వయసనే వడగాలికి

వన్నెల వసంతం వాడిపోతుంది..!

అధికారపు కుర్చీ

అవతలి వాడి సొంతమవుతుంది..!

అంగబలపు ఆర్భాటం

అరక్షణంలో ఆవిరవుతుంది..!


నిన్నటి వీరుడే...శూరుడే...నేడు 

పలకరింపే పరాయిదౌతుంది..!

నిన్న మీసం మెలేసి

మిడిసిపడిన మనిషికి

నేడు మిగిలేది మీసమొక్కటే

గౌరవం గాలిలో దీపమౌతుంది

మర్యాద మటుమాయమౌతుంది..!


నాది... నాది... అంటూ

నలుదిక్కులా గర్జించిన నోటికి

నేడు నాలుగు పలుకులు కరువు..!

చుట్టూ జనమున్నా

చుట్టరికం కరువై,

కన్నీటికి కంటితడి తోడై,

గుండె గదిలో గుబులు రేగి

ఒంటరితనం ఒడిలో వొరిగిపోవచ్చు..!


ఓ మనిషీ!

నీఆస్తి నీ నీడే గానీ 

— నీ వెంట రాదు...

అందం పూవే గానీ 

— శాశ్వతం కాదు...

అధికారం అద్దమే గానీ 

— నీ రూపం కాదు...

అంగబలం అలలే గానీ 

— నిలకడ కాదు..!


అహంకారం తలకెక్కితే

అనుబంధాలు అడుగంటుతాయి

వినయం మనసున నిలిస్తే

విలువలు నీ వెంటే నడుస్తాయి..!


గుర్తుంచుకో ఓ నరుడా—

నీవు ఆర్జించినదేది నీదికాదు

నీ వెంట ఏదీ రాదు

నువ్వు పంచిన ప్రేమే

నలుగురి గుండెల్లో చెరగని 

ఒక చిరునామా అవుతుంది..!


గుర్తింపు ఆస్తితో రాదు—

ఆత్మీయతతో వస్తుంది

మనిషి గొప్పతనం ఎదుటివారిని 

అణచివేయడంలో లేదు

అక్కున చేర్చుకోవడంలో ఉంది..!


రచన: 

పోలయ్య కవి కూకట్లపల్లి 

అత్తాపూర్ హైదరాబాద్ 


10. ఓ మనిషి మారరా..!

మహర్షిగా మారరా..!!


ఓ మనిషీ ఎదగరా...

ఎవరెస్ట్ శిఖరమంత 

ఎత్తుకు ఎదగరా!!

ఓ మనిషీ మారరా..

మహర్షిగా మారరా..!!


ఓ మనిషీ పెంచుకోరా… పెంచుకోరా!

మంచితనాన్ని పెంచుకోరా!

మానవత్వాన్ని పంచుకోరా!

సమానత్వానికి చేయందించరా!

సౌభ్రాతృత్వంతో గుండెలు కలపరా!


ప్రేమతత్వంతో మనసులు నింపరా!

దాతృత్వంతో కన్నీళ్లు తుడవరా!

నీ హృదయమే మానవతా మందిరంగా

ఆపదలో సాటి మనుషులను ఆదుకోరా


ఓ మనిషీ తెంచుకోరా… తెంచుకోరా!

కులమతాల కంచెలు తెంచుకోరా!

కుటిలత్వపు కోరలు విరిచేయరా!

ద్వేషాగ్నిలో బంధాలు కాల్చక 

అనుబంధాల దీపాలు వెలిగించరా!


కులం గీసిన గీతలు చెరిపేయరా!

మతమౌఢ్యపు ముళ్లను ఏరేయరా!

అందరి రక్తం ఎరుపేనని తెలిపి

రగిలే కులచిచ్చులను ఆర్పేయరా!


ఓ మనిషీ మార్చుకోరా… మార్చుకోరా!

దానవత్వాన్ని దైవత్వంగా...

దాచే తత్వాన్ని దాతృత్వంగా...

పగా ప్రతీకారాలను ప్రేమగా...

కసి ద్వేషాలను కనికరంగా...

కఠిన హృదయాన్ని 

కరుణా సాగరంగా మార్చుకోరా!


నీ ఎదుగుదలతో పదిమంది ఎదగాలి 

నీ సంపదతో అనాధల ఆకలి తీరాలి!

నీ బతుకుతో  పరుల బతుకు వెలగాలి 

నీ జన్మకే మానవత్వం సాక్ష్యమవ్వాలి!


ఓ మనిషీ 

మంచితనం నీ మతం కావాలి 

మానవత్వం నీ వ్రతం కావాలి!

సమానత్వం నీ బాట కావాలి 

సౌభ్రాతృత్వం నీ బంధం కావాలి!


ప్రేమతత్వం నీ ఊపిరి కావాలి 

దాతృత్వం నీ చేతిగీత కావాలి!

దానవత్వం నీలో అంతం కావాలి 

దైవత్వం నీలోనే ఉదయించాలి!


ఓ మనిషీ… 

ఒక్కసారి నీ మనసులోకి తొంగి చూడు!

నీలోని మృగాన్ని బయటకు తోసేయ్!

నీ గుండె గుడిలో దైవాన్ని ప్రతిష్టించు..!


మనిషిగా పుట్టడం పరమాత్మ వరం 

మనిషిగా బతకడంతోనే జన్మసార్థకం!



కూకట్లపల్లి పోలయ్య కవి

రచయిత పరిచయం: కూకట్లపల్లి పోలయ్య కవి


జన్మస్థలం: కందివారి పల్లె గ్రామం 

మార్కాపురం: మునిసిపాలిటీ 

ప్రకాశం: జిల్లా  ఆంధ్రప్రదేశ్: రాష్ట్రం. 


తండ్రి పేరు: కీ.శే.కూకట్లపల్లి ప్రకాశరావు

తల్లి పేరు: శ్రీమతి కూకట్లపల్లి భాగ్యమ్మ

భార్య పేరు: శ్రీమతి పోతిరెడ్డి సుధారాణి


సంతానం        : ముగ్గురు

పెద్ద కూతురు   : ప్రతిభా లావణ్య

చిన్న కూతురు : లక్ష్మీ సౌజన్య

కుమారుడు      : వంశీ కృష్ణ


పొందిన డిగ్రీలు: M .Com, LLB, CAIIB, 

విద్యాభ్యాసం:

ప్రాథమిక విద్య - ప్రకాశం జిల్లా - తర్లుపాడులో


కాలేజీ చదువు - 1973 -78లో...

Inter‌mediate, B.Com 

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి కళాశాల...మార్కాపురంలో...


ఉన్నత విద్య - 1978 - 80లో...

M .Com, LLB, CAIIB, 

వాణిజ్య శాస్త్రంలో పట్టా...

నాగార్జునవిశ్వవిద్యాలయం...

గుంటూరులో...


ఉద్యోగవివరాలు:


1981 డిశంబర్ లో...

ఆంధ్రాబ్యాంకులో...ఉద్యోగం..

33 సంవత్సరాల...సుదీర్ఘ ప్రయాణం...

1995 జూన్ లో....హైదరాబాద్ లో...

సీనియర్ బ్రాంచి మేనేజర్ గా పదవీ విరమణ...


ప్రవృత్తి: వచన కవితారచన

పుస్తకపఠనం, కవితాగానం...నటన


వ్రాసిన వచన కవితా రచనల సంఖ్య:

...రమారమి 5000 వచన కవితలు

...దినపత్రికల్లో ప్రింట్ ఐన కవితలు: 

...దాదాపుగా 4600 (75 పత్రికల్లో)

...250 పద్య కవితలు (ద్విశతకం)

... అన్న పోలన్న సుభాషితం

...విన్న మీకు శుభోదయం అన్న

...మధురమైన మకుటంతో

...130 కరోనా కవితలు


స్వీయరచనలు :


(1) ముద్రిత రచనలు : 7

1. కవితా కిరణాలు 

2. సుభాషితాలు - సూర్యకిరణాలు(ద్విశతకం) 

"అన్న పోలన్న సుభాషితం 

"విన్న మీకు శుభోదయం"..

"అన్నమకుటంతో

3. కంప్యూటర్ యుగంలో కాకి

4. జయించడానికే నీవు జన్మించావు

5. స్వామి వివేకానందలా ఆలోచించు 

రామకృష్ణ పరమహంసలా జీవించు

6. Secret of Success.

7. అభిషిక్తుని అమృత వాక్కులు. 


అముద్రితాలు : 

ఇట్లు ప్రేమతో నాన్న ఆశతో అమ్మ

మరో15 పుస్తకాలు...


పొందిన సన్మానాలు/ సత్కారాలు :

1. రాగరమ్య కల్చరల్  ఆర్గనైజేషన్

2. సీనియర్ సిటిజన్స్ వెల్ ఫేర్ సొసైటీ

3. కవన కిరణాలు ముంబై

4. ఉదయం సాహితీ వేదిక

5. తెలుగు సాహిత్య సమితి

6. ఆరికపుడి పూర్ణ చంద్రారావు ఫౌండేషన్

7. సైమన్ ఫౌండేషన్

8. మేడిది సుబ్బయ్య ట్రస్ట్

9. మహర్షి వాల్మీకి సాంస్కృతిక

సేవా సంస్థ

10. విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్


ప్రశంసాపత్రాలు...

అందించిన ప్రముఖ సంస్థలు 

 

1. తెలుగు వెలుగు సాహితీ వేదిక 

2. కవన కిరణాలు

3. ఉదయ  సాహితీ వేదిక

4 పున్నమి పత్రిక...

5..ఏ.కె‌ తెలుగుమీడియా ముంబై...

(ఆంధ్రరత్న అవార్డు) 

6. కర్నాటక తెలుగు రచయితల సంఘం...

7. రాగరమ్య కల్చరల్ ఆర్గనైజేషన్

8. ఆరికపుడి పూర్ణచంద్రారావు ఫౌండేషన్

9. సైమన్ ఫౌండేషన్

10. మహర్షి వాల్మీకి

సాంస్కృతిక సేవా సంస్థ

11. తెలుగు సాహిత్య సమితి12. సీనియర్ సిటిజన్ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్

13. శ్రీ శ్రీ కళావేదిక

14. విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్


సత్కరించిన ప్రముఖ వ్యక్తులు/కవులు


1. ఉదయ సాహితీ వేదిక పురస్కారం

 (ప్రముఖ కవి ‌రచయిత)

నందిని సిధారెడ్డి గారిచే సన్మానం


2. రాగరమ్య కల్చరల్ ఆర్గనైజేషన్ పురస్కారం

(హాస్య బ్రహ్మ) శ్రీ గౌరీ శంకర్‌

(సినీ గేయ రచయిత) మౌనశ్రీ మల్లిక్ గార్లచే సన్మానం


3. కవన కిరణాలు సాహితీ‌ వేదిక పురస్కారం

(ప్రముఖ కవి ‌రచయిత) నందిని సిధారెడ్డి

(సినీ గేయ రచయిత) మౌనశ్రీ మల్లిక్

(ప్రముఖ విశ్లేషకులు)

నాళేశ్వరం శంకరం గార్లచే సన్మానం


4.ఆరికపుడి పూర్ణచంద్రారావు

ఫౌండేషన్ పురస్కారం

లయన్ శ్రీ విజయకుమార్ గారిచే సన్మానం


5. సైమన్ ఫౌండేషన్ పురస్కారం

(మాజీ సిబిఐ జేడీ )

లక్ష్మీనారాయణ గారిచే సన్మానం


6. మహర్షి వాల్మీకి సాంస్కృతిక

సేవా సంస్థ పురస్కారం

హిమాలయ శివసాయి గురూజీ గారిచే సన్మానం


7.సీనియర్ సిటిజన్

ఇంటర్నేషనల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్

పురస్కారం

(హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి)‌

శ్రీ చంద్రయ్య గారిచే సన్మానం 


8. మేడిది సుబ్బయ్య ట్రస్ట్‌ పురస్కారం

(ప్రముఖ గజల్ రచయిత)

కళారత్న బిక్కికృష్ణ గారిచే సన్మానం


9. తెలుగు సాహిత్య సమితి ‌మరియు

ఆరు సంస్థల ఆధ్వర్యంలో జరిగిన

మాతృ భాషాదినోత్సవ పురస్కారం

శ్రీ నందినీ సిధారెడ్డి గారిచే సన్మానం


10. విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్

అధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మి

పండిట్ గారిచే సన్మానం...


ప్రముఖుల చేతులమీదుగా

సన్మానాలు సత్కారాలు...


1. నందిని సిధారెడ్డి (ప్రముఖ కవి ‌రచయిత)

2. చంద్రయ్య  హైకోర్టు (ప్రధాన న్యాయమూర్తి) 

3. మౌనశ్రీ మల్లిక్ (సినీ గేయ రచయిత)

4. నాళేశ్వరం శంకరం ( ప్రముఖ విశ్లేషకులు)

5. లక్ష్మీనారాయణ(మాజీ సిబిఐ జేడీ )

6. కళారత్న బిక్కి కృష్ణ (ప్రముఖ గజల్ రచయిత)

7. హిమాలయ శివసాయి గురూజీచే సన్మానం

8. మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రాజగోపాల్ గారు


ప్రస్తుతనివాసం & చిరునామా :

పోలయ్య కవి కూకట్లపల్లి

మేనేజర్ ఆంధ్రా బ్యాంకు (రిటైర్డ్)

ప్లాట్ నె.201 

శ్రీ సాయిదత్తా అపార్ట్మెంటు. 

గుమ్మకొండ కాలనీ

గౌతం మోడల్ స్కూల్ వెనుక

అత్తాపూర్ హైదర్ గూడ  

రంగారెడ్డి జిల్లా

హైదరాబాద్ -500048


క్లుప్తంగా...నా గురించి...


మనసులోమాటగా, నా పేరు కూకట్లపల్లి పోలయ్య, కలం పేరు,పోలయ్య కవి కూకట్లపల్లి. ప్రస్తుత నివాసం...అత్తాపూర్ హైదరాబాద్ లో...పదవీవిరమణ జూన్ 2015లో. ఆంధ్రా బ్యాంక్ నుండి అధికారిగా...


ఐతే ఎన్నో ఏళ్ళ తర్వాత చిక్కిన ఒక చక్కని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విహారయాత్రలు చేసి వీలైనన్ని కొత్తప్రదేశాలను దర్శించాలన్న ఆలోచనలో వున్న ఉన్న నేను కరోనాకాలంలో ఇంట్లోనే బంధీనైపోవడంతో... నా ఊహలకు రెక్కలొచ్చాయి...అనేక నా కవితలు వెలుగు చూశాయి


క్లుప్తంగా... నా సాహితీ సేవ

1975 నుండి 2026 వరకు రమారమి - 51 సంవత్సరాల సాహితీ ప్రయాణం. వృత్తిరీత్యా బ్యాంకు అధికారి‌గా వుంటూ

ప్రవృత్తిరీత్యా కవితలు అల్లడం...నా హాబీ.అనేకానేక సామాజిక అంశాలమీద, సమాజంలోనిఅనేక సమస్యల మీద, మానవ సంబంధాలమీద,

5000 పైగా వచన కవితలు

రచించడంతో పాటు 4600 కవితలు

75 పాత్రికలలో ప్రచురితం

250 వేమనవంటి కవితా పద్యాలు...

130 కరోనా కవితలు...

200 సూక్తులు...

కొత్తగా వ్రాయడం జరిగింది...


నిన్నటి మొన్నటివరకు కారుచీకట్లో

ఉన్న నా కవితలన్ని అనేకమంది సహృదయులైన సంపాదకుల

ఆదరణతో ప్రోత్సాహంతో గత

6 సంవత్సరాలలో సుమారుగా

75 దినపత్రికల్లో

4600 కవితల పైచిలుకు ప్రచురించబడినాయి..




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page