సుజన ధైర్యం
- Neeraja Prabhala
- Mar 19, 2024
- 6 min read

'Sujana Dhairyam' - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 19/03/2024
'సుజన ధైర్యం' తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“అమ్మా! నా కాలేజి బస్సుకు టైమవుతోంది. బాక్స్ రెడీనా !” అడిగింది సుజన తన తల్లిని.
“ ఇదిగో బాక్స్. వచ్చి తీసుకో. ఈ పాలు త్రాగి వెళ్లు” వంటింట్లో నుంచి పెద్దగా కేకేసింది వైదేహి.
“సరే!” అని వంటింట్లోకి వెళ్లి పాలుత్రాగి బాక్స్ ని తీసుకుని హడావిడిగా బస్సు కోసం పరిగెత్తింది సుజన.
తనువెళ్లినవైపే చూస్తూండిపోయిన వైదేహికి కూతురి గురించిన ఆలోచనలు చుట్టుముట్టాయి.
చిన్నప్పటి నుంచి సుజన చాలా ఉత్సాహంగా గెంతులువేస్తూ ఎంతో సంతోషంగా ఉండేది. తను ఎక్కడ ఉంటే అక్కడ సందడి నెలకొనేది. గలగలలాడే సుజన కబుర్లు వింటుంటే తనకు, తన భర్త ఆనంద్ కు చాలా ఆహ్లాదకరంగా ఉండేది. ఒక్కగానొక్క కూతురు సుజనని కంటికి రెప్పలాగా చూసుకుంటూ, అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు వైదేహి దంపతులు.
సుజన చక్కగా పెరుగుతూ తన ముద్దు ముచ్చట్లు, ఆటపాటలతో అందరినీ చక్కగా అలరించేది. పెద్ద కంపెనీలో ఇంజనీరుగా పనిచేసే ఆనంద్ తనకు పెద్దలిచ్చిన ఇంట్లో భార్య వైదేహి, కూతురు సుజనతో చాలా సంతోషంగా ఉంటున్నారు. చిన్నదైన కుటుంబం, చింతలేని కుటుంబం అని వైదేహి మనసులో ఎప్పుడూ అనుకుని సంతోషపడుతూ ఉండేది. కాలక్రమేణా సుజన చక్కగా పెరుగుతూ స్కూలులో చేరింది. చక్కగా చదువుతూ ఉండే సుజన అంటే తోటి విద్యార్థులకు, టీచర్లకు చాలా ఇష్టం. స్కూలులో ఆటపాటలు, వక్తృత్వం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో సుజనే ముందంజలో ఉండి ప్రధమ బహుమతులను గెల్చుకునేది.
వారాంతంలో సుజనని తీసుకుని సినిమాలు, రెస్టారెంట్ లలో హాయిగా గడిపి ఇంటికి వచ్చేవాళ్లు ఆనంద్ దంపతులు. కాలం సాఫీగా గడిచిపోతోంది. సుజన పదవ తరగతి చదువుతుండగా ఒక సంఘటన జరిగింది. ఒక రోజు సుజన స్కూలు నుంచి ఇంటికి వచ్చి ఏడుస్తూ తల్లిని హత్తుకుంది. వైదేహి ఏం జరిగిందో అని చాలా భయపడిపోయి కూతుర్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని అనునయించింది.
సుజన కాసేపు స్ధిమితపడ్డాక “అమ్మా ! ఈరోజు క్లాసులో మా వెంకట్ మాస్టారు చాలా వెకిలిగా ప్రవర్తించారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. తన క్లాసు అయిపోతుండగానే “సుజనా ! నిన్నటి పాఠంలో నీకు ఏదో సందేహం ఉందన్నావు కదా! క్లాసు అయిపోయినాక ఉండు. నీకు సమాధానాలు చెపుతాను “ అన్నారు క్లాసులో అందరిముందూ.
నాకు చాలా ఆశ్చర్యం వేసి లేచి నుంచుని “నేను అడగలేదు మాస్టారు. నాకే సందేహాలు లేవు” అన్నాను.
“అప్పుడే నీవు మర్చిపోతే ఎలా ? గుర్తుపెట్టుకోవాలి.” అన్నారు ఆయన.
క్లాసు అవగానే నేను, నా స్నేహితురాలు నందిని కలిసి బయటికి వెళ్లబోతుండగా ఆయన నందినితో “నందినీ! నీవు వెళ్లి పో! సుజనకి పాఠంలో ఏవో సందేహాలున్నాయంది. అవి చెపుతాను” అనగానే నందిని వెళ్లిపోయింది.
మాస్టారు నా దగ్గరికి వచ్చి నా మీద చెయ్యి వేసి నా భుజాలు గట్టిగా పట్టుకున్నారు. నాకు చాలా భయం వేసి ఆయన్ని గట్టిగా విదిలించుకొని లాగి ఆయన చెంప ఛెళ్లుమనిపించి బయటికి పరుగులు తీశాను. నేనలా చేస్తానని ఆయన ఊహించి ఉండరు. ఆయన నన్ను వెంబడించారు. నేను వేగంగా పరిగెత్తి బయటికి రాగా, అదృష్టవశాత్తూ సమీపంలోనే మా స్కూలు బస్సు ఉంది. ఆయాసపడుతూ అందులోకి ఎక్కి కూర్చొని ఇంటికి వచ్చాను. నేనింక ఆ స్కూలుకు వెళ్లనమ్మా!. ఆయన్ని చూస్తే నాకు చాలా భయం వేస్తోంది”. అంది వెక్కివెక్కి ఏడుస్తూ సుజన.
కూతురి పరిస్ధితి వైదేహికి అర్ధమైంది. తమ కాలంలో ఉపాధ్యాయులు ఎంత చక్కగా విలువలతో కూడిన విద్యని బోధిస్తూ, నీతి - నిజాయితీలను బోధిస్తూ తమకు పాఠాలను చెప్పేవారు. చక్కటి క్రమశిక్షణను నేర్పి తండ్రి లాగా భయభక్తులను అలవాటు చేసేవారు.
“గురుర్బ్రహ్మః, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః ” అని ప్రతిరోజూ విద్యార్థులందరిచేత ప్రార్ధన చేయించి క్లాసు మొదలుపెట్టేవారు. గురుపూజోత్సవం రోజున మేము ఇప్పటికీ ఆ గురువులను కలుసుకుని పాదాభివందనం చేసొస్తాము.ఇప్పటికీ వాళ్లు పితృ వాత్సల్యంతో మమ్మల్ని ఆదరిస్తున్నారే!. సుజనకి ఇదేంటి ఈ విపత్కర పరిస్థితి? కలికాలం కాకపోతేను? అనుకుంది మనసులో వైదేహి.
ముందు తను అననుయంగా కూతురికి ధైర్యం చెప్పి ఆమెని ఓదార్చాలని నిర్ణయించుకుంది.
“చూడు సుజనా! ముందు నీవు ఏడుపాపి నేను చెప్పేది శ్రధ్ధగా విను. ” అని తన పైట చెంగుతో కూతురి కళ్లు తుడిచింది.
“ సుజనా! మనం ఏడిస్తే చూసి సంతోషించేవాళ్లే ఎక్కువ ఈ సమాజంలో. మా కాలం వేరు. మీ కాలం వేరు. మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి. మా కాలంలో ఆడపిలలకు బేలతనం, అమాయకత్వం ఎక్కువ ఉండేది. ఇప్పుడు మీరు అలాకాదు. ఎప్పుడూ ధైర్యం నీ వెన్నంటే ఉండాలి. కడదాకా నీవు మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ఎవరినీ నమ్మకూడదు. నీ జాగ్రత్తలో నీవుండాలి. ఆయనొక చీడపురుగు అనుకుని జరిగింది మర్చిపో. ఇలాంటి చీడపురుగులు ప్రతిచోటా మనకు తారసపడుతూనే ఉంటారు.
ఎవరో వచ్చి మనల్ని రక్షిస్తారనుకొని భ్రమపడద్దు. మనల్ని మనమే రక్షించుకోవాలి. ధైర్యమే నీ ఆయుధం. నీవు ధైర్యంగా ప్రతిఘటించి ఆయన చెంప ఛెళ్లుమనిపించి తగిన బుధ్ధి చెప్పావు. నాన్న రాగానే ఆయనకు చెప్పి మనం మంచి నిర్ణయం తీసుకుందాము. మనం రేపు ఆ స్కూలుకు వెళ్లి హెడ్మాస్టారుకు జరిగింది చెప్పి ఆ మాస్టార్ని ఉద్యోగం లోంచి తీసేయమని హెచ్చరిద్దాము.
దీనికి మిగిలిన పిల్లలు, వాళ్ల తల్లి తండ్రుల మద్దత్తుని కూడ గట్టుకుందాము. భవిష్యత్తులో ఇంక ఏ మాస్టార్లు నీచంగా ప్రవర్తించకుండా మనం బుధ్ధి చెపుదాం. నీవు నీ గదిలోకి వెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకో. నేను వేడివేడిగా పాలు తీసుకొస్తా. త్రాగి హాయిగా పడుకో. ఏదీ గుర్తుచేసుకోవద్దు.” అని కూతురికి ముద్దిచ్చింది వైదేహి.
సుజన తన గదిలోకి వెళ్లింది. కాసేపటికి వైదేహి తెచ్చిన వేడిపాలను త్రాగి పడుకుంది సుజన.
తర్వాత ఎప్పటిలానే ఆఫీసునుంచి వచ్చిన భర్తకు వేడిగా కాఫీ ఇచ్చి ఆయన కాసేపు సేద తీరాక సుజనకు జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది వైదేహి. అంతా విన్న ఆనంద్ కోపోద్రిక్తుడై “నేను ఇప్పుడే వెళ్లి వాడి పని చెపుతాను. వాడింటి అడ్రసు తెలుసుకోవడం కష్టమేంకాదు. హెడ్మాస్టారు నడిగితే చెబుతారు. వాడికి జీవితంలో బుద్ది వచ్చేట్టు చేస్తాను “ అంటూ ఇంతెత్తున ఆవేశంగా లేచాడు.
“ముందు మీరు కోపాన్ని నిగ్రహించుకుని శాంతంగా ఉండండి. కోపం కాదు ఇప్పుడు కావలసింది ఆలోచన. ముందు మీరు సుజన వద్దకెళ్లి తనకు ధైర్యం చెప్పి అనునయించండి. రేపు మనం స్కూలుకు వెళ్లి హెడ్మాస్టారిని కలిసి ఆ నీచుడి విషయాన్ని చెప్పి వాడి ఉద్యోగం పీకేయమని హెచ్చరిద్దాం. అందుకు అవసరమైతే మనం మిగిలిన విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రుల మద్దతు తీసుకుందాం “ అంది వైదేహి.
“సరే!” అని ఆనంద్ సుజన గదిలోకి వెళ్లాడు. అప్పుడే నిద్రలేచిన సుజన తండ్రిని చూసి హత్తుకుని బావురుమంది. ఆనంద్ కూతురి కన్నీళ్లను తుడిచి “ చూడు సుజనా! నీకేం కాలేదు. ఇకముందు కూడా ఏంకాదు. ధైర్యంగా ఉండు. ఆ నీచుడి చెంప ఛెళ్లుమనిపించి మంచి పని చేశావు. ఎప్పుడూ మేమంతా నీకు అండగా ఉంటాం. అమ్మ నీకు అంతా చెప్పే ఉంటుంది కదా! మనం రేపే మీ స్కూలుకు వెళ్లి ఆ నీచుడికి తగిన గుణపాఠం చెబుదాం” అన్నాడు ఆనంద్.
“కమాన్ బేబీ! ఇప్పుడు మనం ఏదైనా సినిమాకి వెళ్లి వచ్చేదారిలో మంచి రెస్టారెంట్ కెళ్లొద్దాం. పది నిమిషాలలో రెడీ అవ్వాలి. ఏదీ నవ్వు” అని అన్నతండ్రి మాటలకు జతకలుపుతూ కిలకిలా నవ్వింది సుజన.
కాసేపటికి ముగ్గురూ సరదాగా సినిమా చూసి, మంచి రెస్టారెంట్ లో విందు చేసి ఇంటికొచ్చి విశ్రమించారు.
మరునాడు ఆనంద్ దంపతులు సుజనతో వాళ్ల స్కూలుకు వెళ్లారు. అక్కడి హెడ్మాస్టరి ఆఫీసుకు కు వెళ్లి నిన్న జరిగిందంతా వివరించి ఆ మాస్టర్ ని పిలవమన్నాడు ఆనంద్. ఆయన వెంకట్ మాస్టర్ ని పిలిచాడు. వెంకట్ వీళ్లను చూడగానే భయంతో వణికిపోయాడు. కోపం పట్టలేక పోయిన ఆనంద్ ఆ నీచుడి చెంప ఛెళ్లుమనిపించాడు. హెడ్మాస్టారు ఆనంద్ ని వారించి కూర్చోబెట్టి సముదాయించాడు.
హెడ్మాస్టారు వెంకట్ ని నిలదీశారు. జరిగింది ఒప్పుకుని క్షమించమని హెడ్మాస్టారు కాళ్లు పట్టుకున్నాడు. ఆనంద్ కాళ్లు పట్టుకుని “నాకు భార్యా, పిల్లలు ఉన్నారు. ఈ విషయం ఎక్కడా చెప్పద్దు. నేనీ రోజే నా ఉద్యోగానికి రాజీనామా చేసి వేరే ఊరికెళ్లి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ నా భార్యాబిడ్డలతో బ్రతుకుతాను. ఇంకెప్పుడూ ఎవరితోను అమర్యాదగా ప్రవర్తించను. దయచేసి పోలీసులు, కేసులు పెట్టద్దు. నా బ్రతుకు రోడ్డు పాలవుతుంది. నన్ను క్షమించండి. సుజనా! నన్ను క్షమించమ్మా “ అన్నాడు వెంకట్.
వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ కాగితాన్ని హెడ్మాస్టారుకి అందించాడు వెంకట్. వెంకట్ భార్యాబిడ్డలను దృష్టిలో ఉంచుకుని దయార్ధ హృదయులై పెద్దమనసుతో అతడిని క్షమించి వదిలేశారు ఆనంద్ దంపతులు.
ముఖాన నెత్తురు చుక్క లేనట్లుగా తల వంచుకుని వెంకట్ వెళ్లిపోయాడు.
హెడ్మాస్టారు ఆనంద్ దంపతులకు క్షమాపణ చెప్పారు. “జరిగింది నాకు చాలా బాధగా ఉంది. ఇకమీదట పిల్లలకు ఏం జరుగకుండా నేను చూసుకుంటాను. నన్ను నమ్మండి. అమ్మా! సుజనా! నీవు ఇదేమీ మనసులో పెట్టుకోకుండా హాయిగా చదువుకో. మంచి మార్కులు తెచ్చుకుని మన స్కూల్ ఫస్టు రావాలి. సరేనా!” అన్నారు హెడ్మాస్టారు.
ఆయన వద్ద శెలవు తీసుకుని ఆనంద్ దంపతులు, సుజన తమ ఇంటికి వచ్చారు. అన్నట్లుగానే వెంకట్ తన భార్యాబిడ్డలతో వేరే ఊరు వెళ్లి అక్కడ మరో స్కూలులో బుధ్ధిగా ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాడు.
కాలం గడిచిపోతోంది. సుజన కష్టపడి చదివి మంచి మార్కులతో పాసయి స్కూల్ ఫస్ట్. వచ్చింది. ఆనంద్ దంపతుల ఆనందానికి అవధులు లేవు. హెడ్మాస్టారు తమ స్కూలులో అభినందన సభని ఏర్పాటు చేసి సుజనని ఘనంగా అభినందించారు.
సుజన కాలేజీలో చేరి చక్కగా చదువుకుంటూ స్కాలర్షిప్ ని కూడా తెచ్చుకుంటోంది. సుజనని చూసి ఆనంద్ దంపతులు చాలా సంతోషంగా ఉంటున్నారు. ఏదో చప్పుడైతే కూతురి గురించిన ఆలోచనలనుంచి తెప్పరిల్లి మరలా మిగిలిన పనిలో పడింది వైదేహి.
సమాప్తం.
నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
Video link
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం :
Profile Link:
Youtube Play List Link:
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు


"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
Comments