top of page

సుక్కి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.



'Sukki' written by Bhagavathula Bharathi

రచన : భాగవతుల భారతి

చనిపోయిన కూతురు సుక్కి ఇంకా తనతో ఉన్నట్లే భ్రమిస్తూ ఉంటుంది సీతాలు ఆ భ్రమ తొలిగితే ఆమె దక్కదేమోనని అలానే ఉంచుతాడు భర్త రాములయ్య.


"ఓరయ్యో ! ఇంత నిమ్మణంగా ఉంటివీ! పొద్దుగాలే సెబితీ.. అరటి పళ్ళు బేగి ఎత్తుకురా !" అంటూ లోపల్నించి రెండు పళ్ళాలూ, సంచెడు పూలూ, కొన్ని ఆకులూ తెచ్చి, ఆరు బయట చాపపరిచి.. దానిమీద ఉంచి, భర్తని పురమాయించి, బతకమ్మని పేర్చటానికి తయారయింది సీతాలు.

"'రెండెందుకే? ఓటి చాలదా?" అని అడగలేదు రాములయ్య, సీతాలుకి మళ్ళీ మతి పోయిందనుకుంటా! బతకమ్మ ఉత్సవాలు ప్రారంభమైతే చాలు దీనికి ఎర్రి ఎక్కిద్ది. అని మనసులో అనుకుని "తప్పుద్దా! తెత్తాలే. అంగీ తే!" అని పిలిచాడు. తెచ్చి ఇచ్చింది సీతాలు.

అంగీవేసుకుని బయలు దేరుతూ ఆగిచూసాడు. పసుపు గౌరమ్మను తమలపాకులో పెట్టి, పళ్ళెంలో ఉంచింది సీతాలు.

ఆమె ఏకాగ్రత, నైపుణ్యంతో ప్రత్యేక శిల్పకారుడు శిల్పం చెక్కుతున్నట్లుగా ఉంది.చెయ్యి తిరిగిన చిత్రకారుడు చిత్రం గీస్తున్నట్లుగా ఉంది. ప్రముఖ విద్వాంసుడు మైమరచి తీస్తున్న రాగంలా ఉంది.

చకచకా పచ్చతంగేడూ, ఎర్రతంగేడూ, తెల్లటి తుమ్మిపూలూ, బంతిపూలూ, రకరకాల పచ్చని, ఆకులూ...

ప్రకృతి రమణీయత నంతా గుదిగుచ్చి, విశ్వేశ్వరునికే అలంకరించాలనే తపనతో, కన్నియ కలల పూలపందిరిలాంటి పరవశం కలిగేలా బతకమ్మను పేరుస్తోంది, సీతాలు. రాములయ్యలో ఇంత భావుకత లేకపోయినా, ముచ్చటగా చూసి, బయలుదేరాడు.

"సుక్కి లేచేతలికి బేగి రారోయ్ . సకినాలంటే సుక్కి పడిసచ్చుద్ది. బియ్యం నానబోసినా!... దంపాల. సకినాలు సుట్టాల. మళ్ళీ సోపతి చేసుడు లేకపోయే" అన్న సీతాలు సణుగుడుకు ... వెడుతూ వెనక్కి తిరిగి చూసి వెఱ్ఱి మాలోకం అని నిట్టూర్చాడు,రాములయ్య, గతం కళ్ళముందు కదలాడగా.

÷÷÷÷÷

పది సంవత్సరాలక్రితం రాములయ్య కి, సీతాలు కీ పెళ్ళయింది. పేర్లూ , మనసూ కూడా కలిసిన చక్కని జంట, ఇద్దరిదీ...

వెంటనే నెలతప్పి చక్కని ఆడపిల్లకు తల్లయింది సీతాలు. సంబరం అంతా ఇంతాకాదు. చక్కని చుక్కలా ఉందని'చుక్క' అనే పేరుపెట్టారు. ముద్దుగా చుక్కి, సుక్కి అని పిలుస్తూ, పాప ఆటా పాటతో మురిసిపోతున్నారు.

ఇదే మేడారం జాతరలో, బంగారు తల్లి సుక్కి నిలువెత్తు బంగారం, అమ్మతల్లికి సమర్పించారు. ఇక బతకమ్మ పండుగకు చక్కని పట్టులంగా కుట్టించి, బతుకమ్మే తమ ఇంటికి వచ్చినట్లుగా పరవశించి పోయారు, సీతాలు రాములయ్య.

రెండో సంవత్సరం బ్రతుకమ్మ నిమజ్జనం రోజే అమ్మలక్కల తో కలిసి ఆడీ పాడారు.

సుక్కికూడా చిట్టి చేతులతో తాళం వేస్తూ, పసిపాదాలతో తన ఈడు పిల్లలతో తనకు వచ్చిన రీతిలో అడుతూ కనువిందు చేసింది. నిమజ్జనం రోజు తనూ వస్తానని మారాం చేసింది. తీసుకుని వెళ్ళారు.

ఎవరి హడావిడిలో వాళ్ళుండగా, ఎలా జారిందో కాలు, దభేలున నీళ్ళల్లో పడింది.

అందరూ "సుక్కీ సుక్కీ" అని అరుస్తున్నారు.

కానీ దగ్గర కెళ్ళి తీసేలోపలే జంపన్న వాగులో అమ్మవారితో కలిసి చుక్కి, తల్లి సీతాలు కళ్ళముందే ప్రవాహఉధృతికి నిమజ్జనం ఐపోయింది. వెదికించితే శవాన్నిమాత్రమే బయటకు తీసారు.

కళ్ళారా చూసిన సీతాలు కళ్ళు తిరిగి పడిపోయింది, శవాన్ని చూసి సీతాలు తట్టుకోలేదని రాములయ్యే పూడ్చేసాడు. మూడు రోజులతర్వాత సోయలోకి వచ్చిన సీతాలు మతిచలించి సుక్కి చనిపోయిన సంగతి మరిచిపోయి తిక్కతిక్కగా ప్రవర్తిస్తూ ఉంటుంది.

ముఖ్యంగా బ్రతకమ్మ ఎంగిలి పూవు రోజునుండీ సుక్కికి తనకూ, రెండు పళ్ళాలలో బ్రతుకమ్మ పేర్చి, "రాయే సుక్కీ" అనీ, చుట్టు ప్రక్కల వాళ్ళను పిలిచీ , సుక్కి పక్కనే ఉన్నట్లుగా, బతకమ్మ పాటలు తనకు నేర్పుతున్నట్లుగా, ఆడుతూ పాడుతూ ఉంటుంది.

" సుక్కీ! రాయే ఈ పాట నేర్చికోయే ! తాళం కాళ్ళతో ఇలాఏత్తూ, ఇలా కాలు కదపాల్నే " అంటూ ఏదో ఓటి మాట్లాడుతూ ఉండే, పసిపిల్ల లాంటి సీతాలును రాములయ్య, గుండెలో పెట్టుకుని, కాపాడుతుంటాడు.

చుట్టు ప్రక్కల వాళ్ళు కూడా,సుక్కి విషయం సీతాలు ముందు తీసుకురాకుండాజాగ్రత్తగా ఉంటారు.

////////

పళ్ళు తీసుకుని ఇంటికి చేరిన రాములయ్య నిర్ఘాతపోయాడు అక్కడి దృశ్యం చూసి. "సీతాలూ.. సీతాలూ.. "అని అరుచుకుంటూపళ్ళు క్రిందపడేసి పరుగెత్తుతూ సీతాలునుచేరాడు. పూలు పేరుస్తూనే సీతాలు కళ్ళుతిరిగి పడిపోయివుంది, చుట్టు పక్కల వాళ్ళుచేరారు. ఎవరో డాక్టర్ కోసమూ పరుగెత్తారు. డాక్టర్ వచ్చాడు.

మళ్ళీ బతుకమ్మ సీతాలు కడుపున పడిందని, నాడి చూసి శుభవార్త చెప్పాడు, డాక్టర్. రాములయ్య ఉబ్బితబ్బిబ్బు పడి,

"అబ్బ! సీతాలూ రెండు పళ్ళాలలో పూలు సరుదుతా ఉంటే , యెర్రి మా లోకం అనుకున్నానే! బతకమ్మే సాచ్చీకంగా చేసిందని ఇప్పుడే ఎరుకైనాదే " అని అప్పుడే స్పృహలో కొచ్చిన సీతాలును దగ్గరకు తీసుకుంటూ శుభవార్త చెప్పాడు.

సీతాలు " ఐతే మూడు పళ్ళాలలో కదా బతుకమ్మ ను సరిదేదీ! ఇంకోటితే మామా!" అంది బతకమ్మను పేర్చటానికి సిద్దమవుతూ.

ఇదివరకైతే పిచ్చిమాలోకం అని నిట్టూర్చేవాడే రాములయ్య.ఇప్పుడు మాత్రం "తెత్తానే సీతాలూ!" అని లోనికెళ్ళాడు, సంతోషంగా.

శుభం

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.



130 views0 comments
bottom of page