top of page

సువర్ణ

#పురాణం #ఆధ్యాత్మికం #devotional #TeluguMythologicalStories, #VagumudiLakshmiRaghavaRao, #వాగుమూడిలక్ష్మీరాఘవరావు, #Suvarna, #సువర్ణ

ree

Suvarna - New Telugu Story Written By - Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 02/04/2025

సువర్ణ - తెలుగు కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



చంద్రవంశమునకు చెందిన విజయ భుమన్యువు ల పుత్రుడు సుహోత్రుడు. అతగాడు క్షత్రియోచిత యుద్ధ విద్యల యందు మంచి నైపుణ్యం సంపాదించి, తండ్రి ని మించిన తనయుడు అని అనిపించుకున్నాడు. ఋగ్వేద స్త్రోత్ర పఠనంలో ఉదాత్తానుదాత్తాది స్వరాలకు అనుకూలంగా అశ్వమును పరిగెత్తించే కళానైపుణ్యం సుహోత్రునికి పుట్టుకతోనే అబ్బింది. సుహోత్రునికి అశ్వకళా నైపుణ్యం మెండని సురలు సహితం అనుకునేవారు. 


 అశ్వ సంచార ప్రాంగణమున ఋగ్వేద పండితులు శాస్త్రోక్తంగా సమర మంత్రాలను పఠిస్తుంటే, అందుకు అనుగుణంగా సుహోత్రుడు గుర్రపు స్వారీ చేసేవాడు. ఆ స్వారీని చూసి దేవేంద్రాది దేవ గణం సహితం మహదానంద పడేవారు. అత్యంత వేగంగా అశ్వమును వలయాకారంగా తిప్పే సుహోత్రుని చూచి, ఈ విద్య పదునాలుగు లోకములలో సుహోత్రునికి వచ్చినట్లు మరెవరికీ రాదని ఇంద్రాది దేవతలు అనుకునేవారు. సమర కళను సుహోత్రునిలా పెంపొందించుకోవాలని సమరాభిలాషులందరూ అనుకునేవారు. 


విజయ భుమన్యువు లు మహా పండితులు నిర్ణయించిన శుభ ముహూర్తాన సుహోత్రునికి పట్టాభిషేకం చేసారు. ఆ పట్టాభిషేక మహోత్సవం నకు అనేకమంది రాజులు వచ్చారు. వారిలో ఇక్ష్వాకు రాజు కూడా ఉన్నాడు. 

సుహోత్రుడు రాజయిన పిదప, ఆర్య ధర్మమార్గాన్ని, యుగ ధర్మమార్గాన్ని అనుసరించి రాజ్య విస్తరణ చేసాడు. అలా తను కొత్తగా జయించిన రాజ్యాలలో నిరుపేదల అభివృద్ధికి అనుకూలంగా అక్కడి పరిస్థితులను సరిదిద్దాడు. రెక్కాడితే కానీ డొక్కాడనివారి పక్కన ఉండి, వారికి అండగా ఉండగలిగినవాడే నిజమైన పరోపకారి అని సుహోత్రుడు అందరితో అనేవాడు. అలాంటి పరోపకారులకు సుహోత్రుడు అన్నివేళలా తోడునీడగా ఉండేవాడు. 


ఉదార స్వభావం తో సుహోత్రుడు అందరిని సమానంగా చూసేవాడు. ‌ సుహోత్రుని ఉదార స్వభావం నకు అన్ని రాజ్యాల ప్రజలు అతనికి దాసోహం అన్నారు. ఉదార స్వభావం నకు ప్రతి బింబం సుహోత్రుడు అని నాడు అందరూ అనుకునేవారు.

 ‌

అలా సుహోత్రుడు మొత్తం భూమి మీద ఆధిపత్యం చెలాయించాడు. అనేకానేక అశ్వమేథ యాగాలు, తదితర యాగాలు నియమనిష్టలతో జరిపించాడు. యాగాది పుణ్య కార్యాలను నియమనిష్టలతో సుహోత్రుడు జరిపించే విధానం ను చూచి, దేవేంద్రుడు సుహోత్రునితో స్నేహం చేసాడు. సుహోత్రుడు అనేక పర్యాయాలు ఇంద్రాది దేవతలను తన రాజ్యానికి ఆహ్వానించి, వారికి ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చాడు. 


దేవేంద్రుడు సుహోత్రుని ఆతిథ్యానికి సంతోషించి, "సుహోత్ర మహారాజ! నీకేం కావాలో కోరుకో" అని అన్నాడు. 

అందుకు సుహోత్రుడు "దేవేంద్ర! మా రాజ్యం లోని బ్రాహ్మణోత్తముల కోరికలన్నీ తీర్చండి." అని అన్నాడు.


అందుకు దేవేంద్రుడు" సరే " అన్నాడు. 


అప్పుడు సుహోత్రుడు తన రాజ్యంలోని బ్రాహ్మణోత్తములందరినీ పిలిచి, "బ్రాహ్మణోత్తములారా ! మీకేం కావాలో చెప్పండి. మీ కోరికలను దేవేంద్రుడు తీరుస్తాడు. " అని అన్నాడు. 


అప్పుడు బ్రాహ్మణోత్తములు, "మాకు బంగారు వర్షం, బంగారు నదులు కావాలి" అని కోరుకున్నారు. 


సుహోత్రుని మాటలను అనుసరించి దేవేంద్రుడు బ్రాహ్మణుల కోరికను నెరవేర్చాడు. అగ్రహారాలలో బంగారు వర్షం కురిసింది. అగ్రహారాలు లోని నదులలో బంగారం ప్రవహించసాగింది. దానితో బ్రాహ్మణుల ఇళ్ళన్నీ బంగారు మయం అయ్యాయి. అయితే వారికి తినడానికి తిండి దొరకలేదు. తాగడానికి నీరు లభించలేదు. 


బ్రాహ్మణులు తమ పొరపాటు ను గ్రహించి సుహోత్రుని కలిసి "శరణు శరణు" అన్నారు. 


అప్పుడు సుహోత్రుడు వ్యవసాయ దారులను పిలిచి మీకోరిక ఏమిటని అడిగాడు. వ్యవసాయదారులు, 

"ప్రజలందరికి సరిపడా పాడి పంటలు భూమాత ప్రసాదించాలి. రాజ్యంలో ఎవరూ ఏ విషయం లోనూ ఇబ్బందులు పడకూడదు. " అని అన్నారు. 


వ్యవసాయ దారుల మాటలకు మిక్కిలి సంతోషించిన సుహోత్రుడు దేవేంద్రుని అనుగ్రహం తో ప్రజలకు కావలసినవన్నీ సమకూర్చాడు.

 

ఒకసారి ఇంద్రాది దేవతలను తన రాజ్యానికి పిలిచి ప్రత్యేక విందులు ఏర్పాటు చేసిన సుహోత్రుడు విందు అనంతరం ఋగ్వేదం లోని స్తోత్రము లను క్రమంగా పఠించే విధానం ను అందరికి తెలిచేసాడు. 


సుహోత్రుని ఋగ్వేద పఠనా నైపుణ్యానికి అబ్బురపడిన దేవేంద్రుడు, "సుహోత్ర మహారాజ! ఋగ్వేద స్త్రోత్రములను క్రమంగా పఠించేవారిని హోత అంటారు. నువ్వు క్రమంగా సశాస్త్రీయంగా ఋగ్వేద స్త్రోత్రాలను పఠించి సుహోత్రుడువు అయ్యావు. నీలాగే ఋగ్వేద స్త్రోత్ర పఠనంలో మంచి నైపుణ్యం కల ఒక మహిళామణి ఉంది. ఆమె పేరు సువర్ణ. ఆమె ఇక్ష్వాకుని పుత్రిక. 


ఒకసారి ఆమె, ఆమె పూర్వీకుడైన మనువుతో కలిసి పాపపుణ్యాల మూలాల గురించి చర్చ జరిపింది. ఆమె చర్చ అనేక మంది దేవతలను ఆకర్షించింది. ‌ఆమె చర్చలో యుగ ధర్మం బాగా ఉందని అందరూ అనుకున్నారు. సువర్ణ ఋగ్వేద స్తోత్రాలలోని బీజాక్షరాల గురించి బాగా వివరించి చెప్పగలదు. అలాంటి ఆమెను నువ్వు వివాహం చేసుకుంటే ప్రజలకు మరింత మేలు జరుగుతుంది అని నా అభిప్రాయం" అని అన్నాడు. 


దేవేంద్రుని మాటలను విన్న సుహోత్రుడు తన తలిదండ్రులతో సంప్రదించి "సరే" అన్నాడు. 


దేవేంద్రుడు అష్టదిక్పాలకులతో కలిసి ఇక్ష్వాకుని కలిసాడు. ఇక్ష్వాకుని ఆతిథ్యం ను స్వీకరించాడు. అనంతరం సుహోత్రుని అతని పెద్దల అభిప్రాయం ను చెప్పాడు. పెళ్ళి పెద్దలుగా వచ్చిన దేవేంద్రాదులకు సువర్ణ నమస్కారం చేసింది. సుహోత్రుని మను వాడటానికి తనకెలాంటి అభ్యంతరం లేదని సువర్ణ దేవేంద్రాదులకు చెప్పింది. 


సువర్ణ మాటలను విని, దేవేంద్రుడు మహదానంద పడ్డాడు. ఇక్ష్వాకు రాజ్యం లోని వివిధ రకాల పొట్లకాయ తోటలను దేవేంద్రుడు చూసాడు. ఆయా పొట్లకాయ ల ప్రత్యేకతల గురించి సువర్ణ చెబుతుండగా దేవేంద్రుడు విన్నాడు. అలాగే ఋగ్వేద మూలాలను, అధర్వ వేద మూలాలను, జైమినీయ ఉపనిషదులలోని విషయాలనూ సువర్ణ చెబుతుండగా దేవేంద్రుడు కడు శ్రద్ధాసక్తులతో విన్నాడు. 


ఆయా వేదాలలోని గణితాంశాల గురించి సువర్ణ దేవేంద్రుని కి చెప్పింది. కడకు వేద విజ్ఞాన శీర్షం గణితం అని అంది. 

"బంగారం లాంటి మాట చెప్పావు సువర్ణ" అని దేవేంద్రుడు సువర్ణతో అన్నాడు. అనంతరం దేవేంద్రుడు ఇక్ష్వాకు దగ్గర సెలవు తీసుకుని సుహోత్రుని కలిసి విషయమంతా చెప్పాడు. 


దేవేంద్రుని ద్వారా సువర్ణ వేద జ్ఞానం గురించి తెలుసుకున్న సుహోత్రుడు, ‘వేద మంత్ర సృష్టి చేయగల గణిత తేజం సువర్ణకు ఉంది. ఆమె జ్ఞానాన్ని పదుగురికి ఉపయోగపడేటట్లు చేయాలి’ అని అనుకున్నాడు. 


సురనరయక్షకిన్నెరాదుల నడుమ సువర్ణ సుహోత్రుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సువర్ణ భర్త మాటలను అనుసరించి తన జ్ఞానాన్ని ఆసక్తిని చూపించే పదుగురికి పెంచింది. ఆ పుణ్య దంపతుల సుపుత్రుడు హస్తి మహారాజు. హస్తి మహారాజు పేరు మీదనే హస్తినాపురం ఏర్పడింది. 


సర్వే జనాః సుఖినోభవంతు 


***

వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



ree

-వాగుమూడి లక్ష్మీ రాఘవరావు








Comments


bottom of page