Swapna Vasthavam written by Thirumalasri
రచన : తిరుమలశ్రీ
అది 2099 వ సంవత్సరం.
“జనకా! జనకా!” బళ్ళోంచి వస్తూనే తండ్రిని పిలిచాడు ఏడేళ్ళ కృష్ణుడు.
“ఒరేయ్! నన్ను అలా పిలవొద్దని చెప్పానా? నువ్వు జనకా అంటూంటే అదేదో తిట్టులా అనిపిస్తోంది నాకు” అన్నాడు గోపాలం.
“మరెలా పిలవాలి? నువ్వు నా జనకుడివే కదా?” అమాయకంగా అడిగాడు కృష్ణుడు, చేతిలోని పుస్తకాల సంచిని అలమరలో పెడుతూ.
“డాడీ అని పిలవాలని చెప్పాను కదా?” విసుక్కున్నాడు గోపాలం.
“డాడీ అనునది ఏ భాష?” చంటాడి ప్రశ్న.
“దాన్ని ఆంగ్లం అంటారులే”.
“నాకు ఆంగ్లం వద్దు. తెలుగే బావుంది”.
నుదురు బాదుకున్నాడు తండ్రి. “పోనీ, నాన్నా అని పిలవొచ్చుగా?” అన్నాడు.
“ఉహుఁ, జనకా అన్న పిలుపే బావుంది,” దృఢంగా తన మనసును వ్యక్తం చేసాడు కృష్ణుడు. ““ఇవాళ మా బళ్ళో ఓ విశేషం జరిగింది, జనకా!”
“ఏం జరిగిందేమిటీ?”
“మేమంతా తోటపని చేస్తూ నేల త్రవ్వుతూంటే విచిత్ర పరికరం ఒకటి బైటపడింది…”
“ఏమిటది?” కుతూహలంతో అడిగాడు గోపాలం.
“అదేమిటో మా పంతులు గారికి కూడా తెలియలేదు. ప్రధానోపాధ్యాయులను అడిగితే, దాన్ని ఐ-పాడ్ అంటారని చెప్పారు” చెప్పాడు కృష్ణుడు. “ఏం పాడో- అంటూ పడిపడి నవ్వుకున్నాం అందరమూను”. నవ్వాడు.
“నవ్వకు. దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో నీకేం తెలుసు? అసలు మా చిన్నప్పుడు సాంకేతిక పరిజ్ఞానం జీవనానికి ఎంత వెసులుబాటు కలిగించేదో తెలుసా?” అన్నాడు గోపాలం.
“జనకా! ఎప్పట్నుంచో మీ చిన్ననాటి విశేషాలను తెలుసుకోవాలని నాకెంత ఆసక్తిగా ఉంది. చెప్పవూ?” అడిగాడు కృష్ణుడు.
“ఇప్పుడు నాకు పనుంది. ఇంకోసారి చెబుతాన్లే” అంటూ దాటవేయబోయాడు గోపాలం.
“ఉహూఁ, ఇప్పుడే చెప్పాలి” అంటూ చంటాడు పట్టుబట్టడంతో, “మీ పనులు ఎప్పుడూ ఉండేవే. పిల్లాడి ముచ్చట తీర్చండి” అంటూ కొడుక్కి వత్తాసు పలికింది శారద చిరునవ్వుతో.
తండ్రి ‘సరే’ననడంతో, హుషారుగా వచ్చి పక్కన కూర్చున్నాడు కృష్ణుడు.
గతించిన రోజులను నెమరువేసుకుంటూ కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు గోపాలం. “ప్రపంచంలో ప్రళయం రాకముందు సంగతులివి. అంటే, 2080వ సంవత్సరానికి ముందు మాట. అప్పుడు నా వయసు ఇరవయ్యేళ్ళు. కాలేజీలో చదువుతుండేవాణ్ణి…” “కాలేజీ అంటే?” అడిగాడు కృష్ణుడు.
“ప్రాథమిక విద్య స్కూళ్ళలో చెబితే, ఉన్నత విద్యలను కాలేజీలలో నేర్పేవారు. పెద్ద పెద్ద భవనాలు, చక్కటి ఫర్నిచర్, ఎసి గదులు, కంప్యూటర్ సాయంతో ఆధునిక బోధనా పద్ధతులను అవలంబించేవారు…” చెప్పుకుపోయాడు గోపాలం. “ఎసి అంటే?” కృష్ణుడి సందేహం.
“ఎయిర్ కండిషన్. తరగతి గదులలో గాలి చొరక వేడిగా, ఉక్కగా వుంటే ఎసి ద్వారా చల్లబరుస్తారన్నమాట”.
చేతులతో నోరు నొక్కుకుంటూ నవ్వాడు కృష్ణుడు. “అంటే, మాలా చక్కటి ప్రకృతి నడుమ ఆరుబైట కూర్చుని చదువుకోలేదా మీరు? కృత్రిమ గాలులతో రోజంతా నాలుగు గోడల మధ్య కూర్చుంటే మీ ఆరోగ్యం చెడిపోలేదూ?”
“గురుకులాల కాలం కాదది. ఇప్పటిలా పాకలలోనూ, ఆరుబైట ప్రకృతి నడుమా తరగతులను నిర్వహించే అవకాశం లేదు. అడవులను ధ్వంసంచేసి ఆకాశహర్మ్యాలను నిర్మించడంతో ప్రకృతికాంత మరుగయిపోయింది. చెట్టుచేమలు ఓ లగ్జరీ అయిపోయాయి. స్కూళ్ళు, కాలేజీలూ దూరప్రాంతాలలో ఉండేవి. రైళ్ళలోనో, బస్సులలోనో వెళ్ళవలసి వచ్చేది. నాకైతే మీ తాతయ్య మోటార్ బైక్ కొనిచ్చారు. దాని మీద నా స్నేహితులను కూడా ఎక్కించుకుని కాలేజీకి వెళ్ళేవాణ్ణి నేను”.
“రైళ్ళు, బస్ లు, మోటార్ బైకులు ఎలా ఉంటాయి?” కుతూహలంగా అడిగాడు చంటాడు. “మన ఎద్దుల బళ్ళలాగే ఉంటాయా? వాటిని ఎడ్లు, గుర్రాలే లాగేవా?”
తల అడ్డుగా త్రిప్పాడు గోపాలం. “కాదు. ఇంధనంతో నడచేవి అవి… సాయంత్రం కాలేజ్ వదలగానే మెక్డొనాల్డ్స్ కి వెళ్ళి నా స్నేహితులు నేనూ మాకిష్టమైన బర్గర్సవీ తినేవాళ్ళం”.
ఆశ్చర్యంగా చూసాడు కృష్ణుడు. “నాన్నమ్మ ఇంట్లో చేసిపెట్టేది కాదా?”
“బయటి ఫాస్ట్ ఫుడ్డే నచ్చేది మాకు”.
“కానీ, నాకు నా జనని వండేవే ఇష్టం” అన్నాడు వాడు. శారద మురిపెంగా కొడుకును ముద్దు పెట్టుకుంది.
“మీరు తినాలనుకున్నా, ఆ ఫుడ్ జాయింట్స్ ఏవీ ఇప్పుడు లేవుకదా!” అన్నాడు గోపాలం. “వారానికోసారి స్నేహితులందరమూ కలసి సినిమాకి వెళ్ళేవాళ్ళం”. “సినిమా అనగా?”
బుర్ర గోక్కున్నాడు గోపాలం. “పెద్ద తెరపైన మనుషులు ఆడతారు, పాడతారు” అన్నాడు.
“మన తోలుబొమ్మలాటలాగా?” కొడుకు ప్రశ్నకు శారద కిసుక్కున నవ్వింది.
అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణుడి తాతయ్య, “కంప్యూటర్స్, సెల్ ఫోన్స్, టీవీల గురించి ఆలకిస్తే మరింత విస్తుపోతావురా, మనవడా నువ్వు” అన్నాడు. డెబ్బై ఐదేళ్ళుంటాయి ఆయనకు.
“అవేంటో నువ్వు చెప్పు, తాతయ్యా!” అన్నాడు కృష్ణుడు కుతూహలంగా, తాతయ్య ఒళ్ళోకి చేరుతూ.
“నేను పుట్టకముందు నుంచీ ఉన్నాయవి. కంప్యూటర్ అనే చిన్న పరికరంలోని ఇంటర్నెట్ అనబడే అంతర్జాలంలో యావజ్జగత్తే ఇమిడి వుండేది. ఇంట్లో కూర్చుని కడుపులోని చల్ల కదలకుండా ప్రపంచంలోని ఏ దృశ్యాన్నైనా వీక్షించవచ్చును, ఏ విషయమైనా సేకరింపవచ్చును. ఉత్తరప్రత్యుత్తరాలు చేయవచ్చును… టీవీలో వినోదాత్మకమే కాక, ఇతరత్రా అన్ని రకాల కార్యక్రమాలనూ మనం ఇంట్లో కూర్చునే వీక్షించవచ్చును…అలాగే సెల్ ఫోన్లు. చరవాణులన్నమాట. ఒకరినొకరు కలుసుకోనవసరం లేకుండా ఎక్కణ్ణుంచైనా ఎవరితోనైనా సంభాషించుకోవచ్చును…”
“అంటే, మనుషులు ఒకరినొకరు కలుసుకునేవారు కాదా, తాతయ్యా?” ఆశ్చర్యంగా అడిగాడు వాడు.
“అవి వచ్చాక కలుసుకోవడాలు తగ్గిపోయాయిరా, మనవడా!” అంటూ ముసలాయన వివరిస్తూంటే, ఆశ్చర్యంతో నోరు తెరచుకుని వింటూ వుండిపోయాడు కృష్ణుడు-
‘అంతకుమునుపు స్వయంగా కలుసుకుని కష్టసుఖాలను ముచ్చటించుకుంటూ కొత్తకొత్త పరిచయాలను పెంపొందించుకునే కుటుంబాలు- టీవీలలో సీరియల్సు…కంప్యూటర్స్ లో, సెల్ ఫోన్లలో ఇంటర్నెట్, ఫేస్ బుక్, వాట్సా ప్ అంటూ…ఇళ్ళకే పరిమితమయిపోయేవారు. సోషియల్ నెట్ వర్కింగ్ లో మునిగితే ఓ పట్టాన తేలేవారు కాదు. అదొక మాయాలోకం! అన్నపానీయాలు లేకపోయినా ఉండేవారేమో కానీ, చేతిలో సెల్ ఫోన్ లేకుండా మనగలిగేవారు కాదు. ఇంట్లో కూడా అంతా కలసి కాలక్షేపం చేయడం కానీ, ఒకరితో నొకరు మాట్లాడుకోవడం కానీ తగ్గిపోయాయి. జీవనం యాంత్రికమయిపోయింది. మైదానానికి వెళ్ళి ఆటలాడుకునే పిల్లలు కంప్యూటర్ గేమ్సు, వీడియో గేమ్సూ అంటూ ఆటలను, స్నేహితుల్ని నిర్లక్ష్యం చేస్తూ ఇంట్లోనే వుండేవారు. శారీరకవ్యాయామం లోపించి పెద్దలు, పిన్నలు తరచు అనారోగ్యానికి గురవుతూండడం, ఊబకాయాలను సంతరించుకోవడం కద్దు…
అభివృద్ధి చెందిన సాంకేతికపరిజ్ఞానాన్ని సరైన పద్ధతిలో, అవసరమయినంతమట్టుకే ఉపయోగించుకోకపోవడమే అందుకు కారణం…పైగా, మనుషుల నిర్లక్ష్యత కారణంగానైతేనేమి, ఆ ఎలెక్ట్రానిక్ డివైసెస్ యొక్క ఉత్పత్తి విపరీతంగా పెరిగిపోవడం వల్ల నైతేనేమి, పర్యావరణమంతా మిక్కిలి కలుషితమయిపోయింది. ఫలితంగా, ప్రకృతి ఆగ్రహించి ఇరవయ్యేళ్ళ క్రితం ప్రళయరూపం దాల్చి ప్రపంచాన్ని కబళించింది. విపరీతమైన జననష్టంతోపాటు, ఆ ఆధునిక సాంకేతిక పరికరాలన్నీ ఆ ఉప్పెనలో కొట్టుకుపోయి నిర్వీర్యమయిపోవడమూ జరిగింది. ఏదైనా అతిగా చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందని తెలియజెబుతూ మానవాళికి గొప్ప గుణపాఠం నేర్పింది. అనంతరం ఓ కొత్త ప్రపంచం వెలసింది. రెండు దశాబ్దాలలోనే ప్రకృతి, వాతావరణం కొన్ని వందల ఏళ్ళ క్రితం ఎంత పచ్చగా హృద్యంగా ఉండేదో, అలా మునుపటి స్థితికి వచ్చేసింది. అడవులు వెలసి జంతుజాలం, పక్షులతో కళకళలాడుతున్నాయి. మానవసంబంధాలు మెరుగై మునుపటి స్థాయికి చేరుకుంటున్నాయి. మాతృభాషలో విద్యాబోధన జరుగుతోంది. జనజీవనం ప్రశాంతంగా ఉంది…’
ఓ క్షణం అక్కడ నిశ్శబ్దం ఆవరించుకుంది.
ముసలాయన నిట్టూర్చాడు. ‘ఏ యుగంలోనైనా శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానం అవసరమే. అది మనిషి మేథస్సుకు తార్కాణం. కానీ, అవసరమైన ప్రమాణాలను పాటిస్తూ దాన్ని పరిమిత పరిమాణంలో అభివృద్ధికి వాడాలే తప్ప…జనజీవనాన్ని స్తభింపచేయడానికి, మనుషులలో సోమరితనాన్ని పెంపొందించడానికీ కాదు…” అన్నాడు.
“అంటే మనుషులకు బదులు యంత్రాలతో సహజీవనం చేసేవారన్న మాట!” ఆశ్చర్యపోయాడు కృష్ణుడు.
“ఔను. మానవసంబంధాలు సుడిగాలిలో కొట్టుకుపోయి మానవుడు అదృశ్యలోకంలో విహరిస్తూన్న వేళ అతని కన్నులు తెరవడానికే వచ్చింది ఆ ప్రళయం. అది కూడా అతని స్వయంకృతాపరాధమే,” అన్నాడు ముసలాయన. “పచ్చని ప్రకృతి మధ్య స్వచ్చమైన గాలులు పీల్చుతూ ఆరోగ్యవంతంగా పెరిగే పరిస్థితులు మళ్ళీ నెలకొనడం మీ తరం చేసుకున్న అదృష్టంరా, కన్నా!”
వారలా మాట్లాడుకుంటుండగానే పావురం ఒకటి వచ్చి అక్కడ వాలింది. కృష్ణుడు వెళ్ళి దాని కాలికి కట్టబడియున్న కాగితాన్ని తీసి మడత విప్పి చదివాడు. “జనకా! ఈ లేఖ నీకే” అంటూ తండ్రి చేతిలో పెట్టాడు.
“అప్పట్లో ఇలా పావురాలతో రాయబేరాలు చేయవలసిన అగత్యం ఉండేదికాదు. సెల్ ఫోన్లో ఎస్సెమ్మెస్ ద్వారా మెసేజ్ లు అవతలివారికి లిప్తపాటులో అందేవి” అన్నాడు గోపాలం కించిత్తు గర్వంగా.
“ఔనా?” విస్తుపోయాడు వాడు. “కానీ, పావురం వస్తే అది ఏం వార్త మోసుకొచ్చిందా అన్న కుతూహలం, ఆ లేఖను చదవేంత వరకు పడే ఆత్రుతలలో ఉండే మజా…లిప్తపాటులో అందుకునే సమాచారంలో ఏం ఉంటుంది, జనకా?”
పావురం తెచ్చిన సందేశాన్ని చదువుకున్న గోపాలం ముఖం పాలిపోయింది.
“ఎందుకలా అయిపోయావు? ఏముంది అందులో?” అంటూ కొడుకు చేతిలోంచి లేఖను తీసుకుని చదివాడు ముసలాయన.
అది పర్యావరణ శాఖ నుండి వచ్చింది. ‘కొద్ది రోజులుగా గోపాలం ఇంటి పరిసరాల శుభ్రతలో లోపం కనిపిస్తోందట. అందుకు శిక్షగా అతను నెల్లాళ్ళపాటు పురవీధులను శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టాలట!’
“ఓఁ, నో…!” అంటూ పెద్దగా అరిచాడు గోపాలం…
*
“డాడీ! డాడీ!...ఎందుకు డాడీ, అలా అరిచావ్?” అంటూ పరుగెత్తుకొచ్చాడు, సెల్ ఫోన్లో ఏదో గేమ్ ఆడుకుంటున్న కృష్ణుడు.
వాడి వెనుకే వచ్చిన శారద, “ఏమిటండీ? ఏదైనా పీడకల వచ్చిందా?” అంటూ భర్తను కుదిపిలేపింది. “పగటినిద్ర పోతే అంతే!”
కళ్ళు తెరచిన గోపాలం, “కలా!?” అంటూ విస్తుపాటుతో చూసాడు. “ఇది…ఇది… ఏ సంవత్సరం?”
“నిద్రపోయి లేచేసరికి సంవత్సరం కూడా మరచిపోయారా? మనమింకా రెండువేల ఇరవై ఒకటి లోనే ఉన్నాం కానీ…లేవండి, టీ తెస్తాను” అందామె.
వాస్తవంలా తోచిన ఆ స్వప్నాన్ని తలచుకుంటూంటే చిత్రంగానే కాక, ఏదో తెలియని హాయిగా అనిపించింది గోపాలం మదికి.
*****
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.
రచయిత పరిచయం :
‘తిరుమలశ్రీ’ గారి అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. భారతప్రభుత్వపుCSIR అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి చెందిన వీరు, జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ అఫ్ అడ్మినిస్ట్రేషన్' గా పదవీ విరమణ చేసారు…వీరి మరో కలంపేరు 'విశ్వమోహిని'. తెలుగులో వీరివి అన్ని జేనర్స్లోను, ప్రక్రియలలోను(బాలసాహిత్యంతోసహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. సుమారు185 నవలలు ప్రచురితమయ్యాయి. పలుకథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలోప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్లో ప్రసారంకాగా, మరికొన్నిరంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలుకథలు బహుమతులను అందుకున్నాయి. కొన్నికథలు హిందితోపాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ నిర్వహించారు. ప్రతిలిపి 'కథాకిరీటి', 'కథావిశారద', మరియు 'బాలకథాబంధు' (బాలసుధ-బాలసాహితీసంస్థ, విజయనగరం) బిరుదాంకితులు. 'కలహంస పురస్కార' గ్రహీతలు. ఆంగ్లంలో సుమారు100 కథలు, ఆర్టికల్స్ ప్రముఖ పత్రికలలోను, జాతీయ దినపత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని బహుమతులను అందుకున్నాయి. ఓ ప్రముఖ ఆంగ్ల జాతీయ దినపత్రికలో వీక్లీ (లిటరరీ) కాలం వ్రాసారు. ఓ జర్మన్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా 20 ఈ బుక్స్ ప్రచురిత మయ్యాయి... స్టోరీ మిర్రర్ (ఆంగ్లం), ‘లిటరరీ బ్రిగేడియర్’ బిరుదాంకితులు, మరియు ‘ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020’ నామినీ… హిందీలో అరడజను కథలు ప్రచురితం కాగా,ఓ బాలల నాటిక ఆలిండియా రేడియోలో ప్రసారితమయింది.
Yorumlar