top of page
Original_edited.jpg

దీప స్థంభం 

#దీపస్థంభం, #DeepaSthambham, #MRVSathyanarayanaMurthy, #MRVసత్యనారాయణమూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Deepa Sthambham - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy

Published In manatelugukathalu.com on 20/11/2025

దీప స్థంభం - తెలుగు కథ

రచన: M R V సత్యనారాయణ మూర్తి

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

సుబ్రహ్మణ్యం స్వామికి దణ్ణం పెట్టుకుని, యధాలాపంగా పక్కనున్న మండపం కేసి చూసాను. జనం రెండు వరుసలుగా కూర్చుని ‘రాహు కేతు’ పూజ చేస్తున్నారు. పంతులు గారు మైకులో పూజా విధానం చెబుతున్నారు. రాతి స్తంభానికి ఆనుకుని చిన్న స్టూలు మీద కూర్చుని ఉన్న స్త్రీ మూర్తిని చూడగానే నా గుండె ‘ఝల్లు’ మంది. అమెరికాలో ఉంటున్న ఆవిడ ఇండియా ఎపుడు వచ్చింది? అని ఆలోచిస్తూ పరీక్షగా చూసాను. ముమ్మూర్తులా ఆవిడలాగే ఉన్న ఓ యువతి, జాకెట్టు గుడ్డలమీద ఉంచిన, రెండు పాము పడగలకు పూజ చేస్తోంది. 


తరువాతి బ్యాచ్ లో పూజ చేయడం కోసం కొంతమంది మండపం చివర కూర్చుని ఉన్నారు. నేను నాలుగు అడుగులు వేసి వారి పక్కన కూర్చున్నాను. అరగంటకి పూజ అయ్యింది. అందరూ లేచి స్వామి వారి దర్శనానికి బయల్దేరారు. నేను గబ గబా ఆవిడ వద్దకు వెళ్లి “మధూ, ఎప్పుడు వచ్చావు ఇండియాకి ?” అని అడిగాను. 


నన్ను అక్కడ చూసి ఆశ్చర్యపోయింది మధులత. “బాగున్నవా వసూ?” అని పలకరించి, కూతుర్ని పరిచయం చేసింది. “మా అమ్మాయి మధుమంజరి” అని. 


ఆ అమ్మాయి చిన్నగా నవ్వింది. నేనూ నవ్వాను. 


“వసూ, స్వామి వారి దర్శనం అయ్యాక మాట్లాడుకుందాము, రా” అని ముందుకు కదిలింది మధులత.


నేనూ వాళ్ళిద్దరితో కల్సి, శ్రీ కాళ హస్తీశ్వర స్వామిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబా అమ్మవారిని దర్శించుకున్నాను. గుడి బయటకు వచ్చి మండపం మెట్ల మీద కూర్చున్నాము. నాకు చాలా ఆత్రుతగా ఉంది, మధు గురించి తెలుసుకోవాలని. ఆ విషయం గ్రహించింది మధులత. 


“వసూ, నా గురించి తర్వాత చెబుతాను. నువ్వు ఎక్కడ ఉంటున్నావు, పిల్లలు ఎంత మంది? ఆ విషయం చెప్పు” అంది మధులత నవ్వుతూ. ఆ నవ్వు అలాగే ముగ్ధమనోహరంగా ఉంది. 


“నేను విజయవాడలో లెక్చరర్ గా ఉంటున్నాను. మావారు బ్యాంకు ఆఫీసర్. మాకు ఇద్దరు పిల్లలు. 


అమ్మాయికి పెళ్లి చేసాం. అల్లుడూ, తనూ చెన్నై లో ఉంటారు. అబ్బాయి సాఫ్ట్ వేర్ ఇంజినీర్. బెంగుళూరులో ఉంటున్నాడు.. చాలా” అన్నాను. నా బుగ్గలు పట్టుకుని సాగదీసి గట్టిగా నవ్వింది మధులత. 


“నువ్వేం మారలేదే వసూ. మూడు ముక్కల్లో మొత్తం చెప్పావు. మా అమ్మాయి మధుమంజరి ఎం. సి. ఏ. చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో పి. హెచ్. డి. చేస్తోంది. ఇప్పుడు మేము రేణిగుంట వెళ్లి విమానంలో హైదరాబాద్ వెళ్ళాలి. తర్వాత తను ఒక్కర్తే ఢిల్లీ వెళ్ళిపోతుంది. నేను రాజమండ్రి వెళ్తాను. ప్రస్తుతం నేను రాజమండ్రి లో ఉంటున్నాను. అమ్మాయి చేత పూజ చేయించడం కోసం శ్రీకాళహస్తి వచ్చాం. మాది చాలా బిజీ షెడ్యూల్. ఏమీ అనుకోకు. ఒక ఆదివారం నువ్వు రాజమండ్రి రా. బోలెడు కబుర్లు చెప్పుకుందాము” అని నా ఫోన్ నెంబర్ తీసుకుని, నా ఫోన్ కి రింగ్ ఇచ్చింది.

 

“నా నెంబర్ సేవ్ చేసుకో. బై” అని కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయింది మధులత. 


వాళ్ళిద్దరూ అలా వెళ్తుంటే ‘అక్కా చెల్లెలు’ లా ఉన్నారే గానీ, తల్లీ కూతురులా లేరు. నాకు చాలా ముచ్చటవేసింది వాళ్ళని అలాచూసి. 


నేను హోటల్ కి వెళ్లి భోజనం చేసి తిరుపతి వచ్చాను. తర్వాత తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకుని, సాయంత్రంఆరు గంటలకు రైల్వే స్టేషన్ కి వచ్చి, క్లోకు రూమ్ నుండి బ్యాగు తీసుకున్నాను. నిన్న తిరుపతి వచ్చి స్వామివారిని దర్శించుకుని, ఈరోజు ఉదయం కొండదిగి రైల్వే స్టేషన్ లో బ్యాగు పెట్టి శ్రీకాళహస్తి వెళ్లాను. మా శ్రీవారు బ్యాంకులో అత్యవసరమైన పని ఉంది, రాలేను అంటే, నేను ఒక్కర్తినే వచ్చాను. 


కొద్దిసేపటికి వచ్చిన, ధర్మవరం-నర్సాపురం ఎక్సుప్రెస్ ఎక్కాను. నా మనసు గతంలోకి పరుగులు తీసింది. 

*****

మధులత వాళ్ళ ఇల్లు తణుకులో టౌన్ హాలు వెనుక వీధిలో ఉంది. ఆమె సైకిల్ మీద మహిళా కళాశాలకు వస్తుంటే అరడజను మంది కుర్రాళ్ళు సైకిళ్ళమీద ఆమె వెనుకే వచ్చేవారు. బంగారు మేనిచాయతో మెరిసిపోతూ, ఎప్పుడూ ఉత్సాహంగా నవ్వుతూ ఉండే ఆమెని చూసి మహిళా లెక్చరర్లు కూడా అసూయపడేవారు. ఒక సినిమా స్టార్ లా ఉండేది మధులత. డిగ్రీలో నాతోనే ఎక్కువ చనువుగా ఉండేది. తను పాటలు బాగా పాడేది. కళాశాలలో జరిగే ప్రతి ఫంక్షన్ కీ, ప్రార్ధనాగీతం తనే పాడేది. 


డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు అయిపోగానే, తణుకులోని ప్రముఖ వ్యాపారవేత్త శేషగిరిరావు, మధ్యవర్తి ద్వారా మధులత వాళ్ళ నాన్నగారు విశ్వనాధం గారికి కబురుచేసారు. ’ మీ అమ్మాయికి పెళ్లి చేయదలచుకుంటే చెప్పండి. మా ఇంటి కోడలుగా చేసుకుంటాను. కట్న కానుకలు అవసరం లేదు’ అని. 


కానీ, పి. జి. అయితేనేగానీ ‘పెళ్లి చేసుకోనని’ మధులత చెప్పింది తండ్రితో. 


ఎం. సి. ఏ. చదవడానికి మధులత విశాఖపట్నం వెళ్ళింది. నేను బి. ఎడ్. చేసి, టీచర్ ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత పి. జి. చేసి లెక్చరర్ గా ప్రమోషన్ పొందాను. మధులతని వాళ్ళ క్లాస్మేట్ చక్రవర్తి ప్రేమించడం, అందగాడూ, ఆస్తిపరుడు అయిన చక్రవర్తిని మధులత కూడా ఇష్టపడడం జరిగింది. ఎం. సి. ఏ. పూర్తీ కాగానే వాళ్ళు ఇద్దరూ పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయారు. అక్కడ చక్రవర్తి బావగారు, వాళ్ళు ఇద్దరికీ ఉద్యోగాలు రావడంలో చాలా సహాయం చేసారని, మధులత నాన్నగారు విశ్వనాధం గారు చెప్పారు. 


మధులతని ఆమె పెళ్లిలో చూడడమే ఆఖరుసారి. తన పెళ్ళికి మధులత రాలేదు. వాళ్ళ నాన్నగారిచేత ‘గిఫ్ట్’ పంపింది. ఆమె చాలా బిజీగా ఉందని విశ్వనాధంగారు చెప్పారు. 


ఇన్ని సంవత్సరాల త్యర్వాత ఈరోజు శ్రీకాళహస్తి లో కనిపించింది, అదీ కూతురితో కలిసి. భర్త ప్రస్తావా తేలేదు. ‘మేము’ అని అనకుండా ‘నేను’ రాజమండ్రిలో ఉంటున్నానని చెప్పింది. మధులత కూడా ఉద్యోగం చేసి చాలా సంపాదించిందని విశ్వనాధం గారు ఓసారి తనకు చెప్పారు. అంత రాబడి ఉన్న ఉద్యోగం మానేసి 

రాజమండ్రిలో ఎందుకు ఉంటోంది?


రాత్రి బాగా పొద్దుపోయేదాకా మధులత ఆలోచనలతో నాకు నిద్రపట్టలేదు. 

****

తర్వాత పదిరోజులు పోయాక మధులతకి ఫోన్ చేసాను. “రేపు ఆదివారం ఇంటి దగ్గర ఉంటావా? నేను వస్తాను” అని. 


“తప్పకుండా రా వసూ. నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను” అంది మధులత. 


ఆరోజే మా శ్రీవారికి చెప్పాను, ‘ఆదివారం రాజమండ్రి వెళ్ళాలి మా స్నేహితురాలి దగ్గరకు’ అని. 


‘అలాగే’ అని ఫోన్ తో కుస్తీపట్టి, ఆదివారం ఉదయం ‘రత్నాచల్ ఎక్స్ ప్రెస్’ కి టికెట్ తీసారు. ఆదివారం శ్రీవారు స్టేషన్ కి వచ్చి రైలు ఎక్కించారు. 


ఎనిమిదన్నరకి రాజమండ్రిలో రైలు దిగి, మధులత చెప్పిన అడ్రస్ కి ఆటోలో వెళ్లాను. దానవాయిపేట పార్కు పక్కవీధిలో ఉన్న ‘శబరి’ అపార్ట్మెంట్ దగ్గర దిగి, మధులత ప్లాట్ కి వెళ్లాను. 


కాలింగ్ బెల్ కొట్టగానే తలుపుతీసి ‘హాయ్ వసూ’ అంటూ కౌగలించుకుంది ఆనందంగా. 


ఇద్దరం లోపలకు వెళ్లాం. విశాలమైన హాలు, వంటగది, రెండు పడక గదులు చాలా ఆధునికంగా, సౌకర్యవంతంగా ఉన్నాయి. ఇద్దరం టిఫిన్లు తిన్నాం. 


“మధూ, నువ్వు అమెరికా నుండి ఎప్పుడు వచ్చావ్?” ఆత్రుతగా అడిగాను నేను. నా ప్రశ్నకు దీర్ఘంగా నిట్టూర్చింది మధులత. 


“వసూ, చక్రవర్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళాక వాళ్ళ బావగారి ద్వారా మా ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. వీకెండ్ లో చాలా జాలీగా తిరిగేవాళ్ళం. అమ్మాయి పుట్టింది. ఇద్దరం చాలా సంతోషించాం. పాపని పెంచడం కోసం నేను సెలవు పెట్టాను. పాపకి రెండేళ్ళు వచ్చాక నేను మళ్ళీ ఉద్యోగంలో చేరాను. చక్రవర్తి వేరే కంపెనీలో చేరాడు, జీతం ఎక్కువని. 


మధుమంజరికి పదో ఏడు వచ్చింది. ఒక ఆదివారం చక్రవర్తి వాళ్ళ బాస్ ని భోజనానికి పిలిచాడు. ఆయనపేరు ధనరాజ్ షిండే. కొద్దిసేపు కబుర్లు అయ్యాక, నేను వంటగదిలోకి వచ్చి మరికొన్ని ఐటమ్స్ తయారీలో ఉన్నాను. అకస్మాత్తుగా షిండే శబ్దం రాకుండా వంటగదిలోకి వచ్చి, న వెనుకనుండి నన్ను గట్టిగా కౌగలించుకుని ‘ ఐ లవ్ యు మధూ ’ అన్నాడు గుస గుసగా. నేను అతని పట్టు విడిపించుకుని “ప్లీజ్ గో సర్” అన్నాను చిరాగ్గా. అతను నవ్వుకుంటూ హాలులోకి వెళ్ళాడు. 


చక్రవర్తి హాలులో లేడు. బయట ఫోన్ మాట్లాడుతున్నాడు. నేను అతని దగ్గరకు వెళ్లి “గెస్ట్ ని వదిలేసి కబుర్లు ఏమిటి? లోపలకు రా” అని చెప్పడంతో లోపలకు వచ్చాడు. భోజనాల దగ్గర చక్రవర్తి, షిండేని పొగుడుతూ మాట్లాడాడు. షిండే ముసి ముసి నవ్వులు నవ్వాడు. అది చూసి నాకు వళ్ళు మండిపోయింది. షిండే వెళ్లిపోయాక, చక్రవర్తితో షిండే ప్రవర్తన గురించి చెప్పాను. చక్రవర్తి మొహంలో ఏ భావమూ లేదు. 


‘లైట్ తీసుకో మధూ. వచ్చే నెలలో కంపెనీ పని మీద షిండే నన్ను ఆస్ట్రేలియా పంపుతున్నాడు. ఆ డీల్ సక్సెస్ అయితే నాకు పెద్ద ప్రమోషన్ వస్తుంది. నా స్టేటస్ మారిపోతుంది. జీతం రెండు రెట్లు అవుతుంది’ అని తన  గదిలోకి వెళ్ళి, లాప్ టాప్ చూసుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది ‘కావాలనే తను అలా బయటకు వెళ్ళాడా?’ అని. 


తర్వాత నెల చక్రవర్తి ఆస్ట్రేలియా వెళ్లి వచ్చాడు. డీల్ ఫెయిల్. ప్రమోషన్ నిల్. అంతే! అప్పటినుండీ నాతో సరిగా మాట్లాడటం మానేసాడు. వీకెండ్ కి కంపెనీ స్టాఫ్ తో కలిసి వెళ్తున్నాడు. నేనూ, పాపా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళం. ఒక ఏడాది గడిచింది. ఒక ఆదివారం చక్రవర్తి కంపెనీ లో పనిచేసే జర్మనీ అమాయి మా ఇంటికి వచ్చింది. రెండు గంటలు ఉండి వెళ్ళింది. ఆమె ఉన్నంతసేపూ చక్రవర్తి చాలా హుషారుగా ఉన్నాడు. ఆ తర్వాత మా కంపెనీలో పనిచేసే రాధిక చెప్పింది, చక్రవర్తి, ఆ జర్మనీ అమ్మాయి వీకెండ్ లకు బయటకు కలిసి వెళ్తున్నారని. 


ఒకరోజు చక్రవర్తిని నిలదీసాను, ‘జర్మనీ అమ్మాయి సంగతి ఏమిటి?’ అని. 


“ఏం చేయను. నీ వలన నా ప్రమోషన్ పోయింది. నువ్వు నాకు విడాకులు ఇస్తే, నేను జెన్నిఫర్ ని పెళ్లి చేస్కుంటాను. నాకంటే డబుల్ సాలరీ జెన్నిఫర్ కి. ఇద్దరం హాయిగా ఉందామని అనుకుంటున్నాను” తాపీగా చెప్పాడు. 


నాకు బుర్ర తిరిగిపోయింది అతని మాటలకి. అంటే ఆరోజు షిండేకి కావాలనే ఆ అవకాశం కల్పించాడని అర్ధమయ్యింది. డబ్బు కోసం జెన్నిఫర్ ని పెళ్లి చేసుకుంటాననడం, అతను పూర్తిగా దిగజారిపోయాడని ఋజువయ్యింది. నా జీతం నేను బ్యాంకులో ఉంచుకోవడం మేలయ్యింది. తన అవసరం కోసం, ఏదో పార్టీ అని చెప్పి నన్ను ఇంకొకరికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తాడని భయం వేసింది. 


ఇటువంటి వాతావరణంలో ఉంటే నా కూతురు భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందని, చక్రవర్తికి విడాకులు ఇచ్చి నా కూతురుతో ఇండియా వచ్చేసాను. తర్వాత రాధిక ఫ్రెండ్ ద్వారా ఇక్కడికి వచ్చాను” అంది మధులత భారంగా. 

టీపాయ్ మీదున్న గ్లాసులోని నీళ్ళు తాగింది మధులత. నా మనసంతా వికలమైపోయింది. కొద్దిసేపటికి తేరుకున్నాను. “మరిప్పుడు ఏం చేస్తున్నావు?” అడిగాను. 


“ఉహూ, ఇప్పుడు చెప్పను. పొద్దున్న చూపిస్తాను” అంది మధులత. తర్వాత తణుకు లోని మా స్నేహితుల గురించి చాలాసేపు మాట్లాడుకున్నాము. 


మర్నాడు ఉదయం తన స్కూటర్ మీద రెండు వీధుల అవతల ఉన్న భవనానికి తీసుకెళ్ళింది. 


“చైతన్య ట్యుటోరియల్” అని బోర్డు కనపడింది గేటు దాటగానే.


ఒక గదిలోకి వెళ్ళాము. ఒకావిడ అక్కడున్న నలభై మందికి లెక్కలు చెబుతున్నారు. ఇంకో గదిలోకి తీసుకువెళ్ళింది. అక్కడ ఒకావిడ ఇంగ్లీష్ చెబుతోంది పిల్లలకు. ఆ పక్కగదిలో సైన్సు, ఆ తర్వాతా గదిలో హిందీ క్లాసులు జరుగుతున్నాయి. 


“వీళ్ళందరూ పదోతరగతి పిల్లలు. పైన ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు పద” అని, పై అంతస్తుకి తీసుకువెళ్ళింది నన్ను. అక్కడ కూడా నాలుగు గదుల్లో నలుగురు మేడంలు నాలుగు సబ్జెక్టులు చెబుతున్నారు పిల్లలకు. 


వాళ్ళని చూసాక నన్ను కిందకు తీసుకు వచ్చింది మధులత. భవనం పక్కన చిన్న బంగాళాపెంకు షెడ్ ఉంది. అందులో ఇరవైమంది వరకూ చిన్న పిల్లలు ఉన్నారు. ఒకావిడ వాళ్లకి ఇంగ్లీష్ పాఠం చెబుతున్నారు. అదికూడా చూసి భవనంలో ఉన్న ఆఫీస్ రూమ్ కి వచ్చాం ఇద్దరం. 


“ఇది నేను నిర్వహిస్తున్న ట్యుటోరియల్ సెంటర్. ఉదయం, సాయంత్రం క్లాసులు ఉంటాయి. నాతో కలిపి పదిమంది వాళ్లకు కావాల్సిన పాఠాలు బోధిస్తున్నాము. సెంటర్ మీద వచ్చే ఆదాయం అందరం సమానంగా తీసుకుంటాము. షెడ్డులో ఉన్నది ప్రాథమిక పాఠశాల. అక్కడి పిల్లలకి ఉచిత బోధన. ఫీజులు లేవు. భోజనం మేమే పెడతాం. వాళ్ళు అందరూ వీధిబాలలు. వారికి బోధించే టీచర్లకు నేనే జీతాలు ఇస్తాను. 


ఇక్కడ పనిచేసేవారందరూ, విడాకులు తీసుకున్నవారు, భర్త నిరాదరణకు గురై బాధపడుతున్న మహిళలు. భవనం అద్దె, ప్రాథమిక పాఠశాల నిర్వహణ ఖర్చులు నేనే భరిస్తాను. అమెరికాలో నేను సంపాదించిన డబ్బు బ్యాంకులో వేసాను. దాని మీద వచ్చే ఆదాయం ఇలా ఖర్చు చేస్తున్నాను. 


ఉదయం పదిగంటల నుండీ నేను నా కంప్యూటర్ మీద ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తాను. అ ఆదాయం నా కూతురు చదువుకి, నా ఖర్చులకి వినియోగిస్తాను” అంది మెరుస్తున్న కళ్ళతో మధులత. 


భర్తల వలన దగాపడిన మహిళలకు చేయూతనిస్తూ, వారి జీవితాలకు ‘దీపస్తంభం’ లా నిలబడి వెలుగుదారి చూపుతున్న మధులతని చూసి నాకు చాలా సంతోషం కలిగింది. 

“అభినందనలు మధూ. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది” అని ఆమెకి షేక్ హ్యాండ్ ఇచ్చాను. 


పది దాటాకా ఇద్దరం ఇంటికి వచ్చాము. భోజనాలయ్యాక ఇద్దరం అపార్ట్ మెంట్ కిందకు వచ్చాం. అటుగా వెళ్తున్న ఆటో పిలిచింది మధులత. బ్యాగు ఆటోలో పెట్టి మధులత దగ్గరకు వచ్చాను. 


మధుని వాటేసుకుని, ఆమె బుగ్గ మీద ముద్దుపెట్టి “వస్తాను వదినా” అన్నాను నవ్వుతూ. 


“ఇదేమిటి, కొత్తపిలుపు?” అంది ఆశ్చర్యంగా మధులత. 


“మీ మధుమంజరిని మా ఇంటి కోడలుగా పంపాలి” మధు రెండు చేతులూ పట్టుకుని అడిగాను. 


ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటిపొర కదలాడి, తర్వాత అది ఆనందభాష్పాలుగా మారింది. మధులత ఆనందంగా తలూపింది. గుండె నిండా సంతోషం నింపుకుని ఆటో ఎక్కాను నేను. 


సమాప్తం.


*******

M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.

 30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.

ree

ree



 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page