తరం తీరం
- Dr. Kanupuru Srinivasulu Reddy
- Jul 26
- 7 min read
#DrKanupuruSrinivasuluReddy, #కనుపూరుశ్రీనివాసులురెడ్డి, #తరంతీరం, #TharamTheeram, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Tharam Theeram- New Telugu Story Written By Dr. Kanupuru Srinivasulu Reddy
Published In manatelugukathalu.com On 26/07/2025
తరం తీరం!! - తెలుగు కథ
రచన : డా. కనుపూరు శ్రీనివాసులు రెడ్డి
ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
రాత్రి సరిగా నిదురపట్టలేదు. అటుఇటు కదులుతూనే ఉంది కమలమ్మ. భర్తను చూస్తే గాఢంగా నిదుర పోతున్నట్లు అనిపించింది. తనను హత్తుకు పడుకోనున్న కూతురు కూడా వొళ్ళు తెలియకుండా నిదురపోతుంది. అలా కాస్సేపు కూతురు ముఖాన్నే చూస్తూ ఉండిపోయింది. ప్రశాంతంగా ఆదమరచి నమ్మకంగా నిశ్చింతగా రాణిలా నిదురపోతున్నది.
మనసు వాత్సల్యంతో పొంగి పోయింది. మాటకు ఎదురు చెప్పదు. ఈ కాలం పిల్లల్లాగా ఎబ్బెట్టు అలంకరణలు అతి చేష్టలు చెయ్యదు. ఇంత అందమైన బిడ్డ సుగుణాల రాసి అపూర్వను అపురూపంగానే పెంచుతుంది. తనకు ఎలా పుట్టిందా అని ఎప్పుడూ మురిసిపోతూ ఉంటుంది కమలమ్మ.
వెంటనే కళ్ళల్లో నీరు పొంగాయి. ఇలాంటి బిడ్డకు ఎలాంటి సంబంధం వస్తుందో.. ఎలాంటి భర్త వస్తాడో.. అనుకునే సరికి ఆత్రుతతో గుండెల్లో అశాంతి చొరబడింది. ప్రపంచమంతా గాలించి. ఎన్ని సంవత్సరాలైనా తనకు నచ్చిన, అందరూ మెచ్చేవిధంగా అంగరంగ వైభోగంగా పెండ్లి చెయ్యాలనే ఆలోచనల్లో మునిగి ఆనంద లోకాల్లో విహరించ సాగింది.
భర్త సుందరయ్య కదిలినట్లయి తిరిగి చూసింది. అప్పుడు గుర్తుకొచ్చి చివుక్కున లేచింది. ఈ రోజు కూతురి ప్రయాణం హైదరాబాద్ కు. అన్నీ పరిక్షలు అయిపోయాయి. ఏవిటో ఇంప్రూవ్ మెంట్ కు ఒక పరీక్ష రాస్తే, గోల్డు మెడల్ వస్తుందట. అది ఎందుకో ? అన్నింటిలోను ఫస్ట్ తన బిడ్డ !!
ఒకవేళ ఏదయినా తనకు చీకాకులు ఉన్నా జటిలసమస్యలు ఎదురైనా, బిడ్డ చిరునవ్వుతో ఇక్కడ లేక పోతే ఫోనులో క్షణం మాట్లాడినా మటుమాయం అయ్యేవి. తను కాలేజీకి వెళ్ళినప్పుడల్లా అంతా శూన్యంగా ప్రపంచమే తల్లక్రిందులయినట్లు నరకంలో బ్రతుకుతున్నట్లు అనిపించేది.
బిడ్డ ఊరికి వెళుతుంది అనుకోగానే గుండెల్లో దడ మొదలయ్యింది. ఎన్నో విధాల సర్ది చెప్పుకుంది సముదాయించుకుంది. నిన్ననే బోలెడన్ని తిను బండారాలు, పచ్చళ్ళు, పొడులు ఒక బస్తాకు చేసి పెట్టింది. కొత్తగుడ్డలు తెప్పించింది. ఒక్క రోజుకు ఎందుకు అంటే స్నేహితులకు చూపిస్తే గొప్పగా అనుకుంటారు. అందరిలోనూ నా బిడ్డ రాణిలా ఉండాలి అని భర్తతో కొట్లాటకు దిగింది.
” సరే.. సరే ! పిచ్చి నీకు ! ఎదిగిన బిడ్డ. దానికీ ఇష్టా ఇష్టాలు ఉంటాయి” అని తలగొట్టుకున్నాడు సుందరయ్య.
“లేదు ! నా ఇష్టమే తన ఇష్టం. ఆ మాత్రం దాని మనసు తెలుసుకోలేక పోతే నేను తల్లినే కాదు”
స్నానం చేసి పూజ చేసి క్షేమంగా తిరిగి రావాలని దేవుళ్ళకు మొక్కుకొని చెంపలేసుకుని ఒకసారి వచ్చి కూతురు బాగా నిద్రలో ఉన్నట్లు గమనించి తరువాత లేపుదామని పనిలో పడిపోయింది.
“ తెల్లారి పోయింది లే ! అమ్మాయి బయలు దేరాలి కదా! ” అని భర్తను విసుక్కుంది.
“ఏం నీకేమయినా పిచ్చి పట్టిందా.. సాయంకాలం బస్సుకు ఇప్పుడు పోవడం ఏవిటి? ” అంటూ చిరాకు పడ్డాడు.
అప్పుడు గుర్తుకొచ్చింది ఇప్పుడు ఉదయం కదా అని. మంచిదే అయ్యింది. కజ్జకాయలు బెల్లపు, చక్కెర అరిసెలు చేయడం మరిచిపోయా అనుకుంటూ వాటికోసం ప్రయత్నం చేయసాగింది.
అందులోకి ఏవో తక్కువ అయ్యాయి. భర్త ఇంకా నిద్ర లేవ లేదు. ఒక్క అరుపు అరిచింది స్నానానికి లెమ్మని.
“చేస్తాలే ! కాస్త కాఫీ ఇవ్వు. ” అంటూ విధి లేక లేచాడు.
“బిడ్డ ఊరికి పోతుంటే ఎట్లా నిదురపడుతుందండి. కాస్తకూడా బాధలేదు “
“బాధ ఎందుకు? అత్తగారింటికి ఏమయినా పోతుందా?”
“అప్పుడే తరిమేయ్యాలనా ? ఏం బుద్ధి. కూతురు అంత బరువా?”
“ఆడపిల్లవే ! సంసారం చెయ్యాలి. ఎల్లకాలం మన దగ్గర ఉంచుకోలేము “
“ఉంచుకుంటాను. అలాంటి దరిద్రపు ఆలోచనలను మానుకోండి” గట్టిగా అంది.
అందులోని నిజాన్ని భరించలేక పోయింది. శిలలా నిలబడి పోయింది..
అది చూసి సుందరయ్య ఆత్రుతగా వచ్చి, “ఏవిటి.. ఏమయ్యింది ?” అని కదిలించాడు.
కలదెలుసుకుని, “ఏవండి! ఎప్పుడూ ఆ మాట నా దగ్గర ఎత్తొద్దు” అంది ఏడుపు ముఖంతో..
“దానికెందుకు అలా అయిపోవడం. అది సహజమే.. !!”
“ మీరు మాట్లాడకండి,” అంటూ కన్నీళ్లు తుడుచుకుంది.
సుందరయ్యకు కాఫీ ఇచ్చి, “మనం కూడా అమ్మాయితో వెళ్ళొస్తామండి. తృప్తిగా, ధైర్యంగా ఉంటుంది” అంది.
“నువ్వు ఈ అతి జాగ్రతలు, ముదిగారాలు తగ్గించకపోతే విసుగు పుట్టి పారిపోతుంది. తరం మారింది !!”
గుండె గబుక్కుమంది కమలమ్మకు..
“ఎంత మారినా బాంధవ్యానుబంధాల అంతరంగం మారదు” కళ్ళ లో స్థిరత్వం కనిపించింది.
మారుతుంది అనుకుంటూ భార్యను అలాగే చూస్తూ కాఫీ తాగుతూ కూర్చున్నాడు. ఇంతలో కూతురు లేచి వచ్చి ఎదురుగా కూర్చుంది.
అది చూసి, “అప్పుడే మెలుకువ వచ్చిందా ? ఇంకాస్సేపు పడుకోలేక పోయావా” అంటూ కమలమ్మ కూతుర్ని నొసట ముద్దు పెట్టుకుని. “కాఫీ ఇచ్చేదా? కాంప్లాను..?” ప్రేమగా తల నిమురుతూ అడిగింది.
“అది ఇంకా పండ్లే తోమలేదు.” అన్నాడు సుందరయ్య.
“రాత్రి తోమింది లెండి. చాలు !!” అంటూ వంటింటి వైపు వెళ్ళింది. ఈ లోగా బ్రష్ చేసుకునేందు లేచి వెళ్ళింది అపూర్వ.
“టిఫిన్ ఎం చెయ్యమంటావు.. జీడి పప్పు ఉప్మా, కేసరి, పూరీలు కొంచెం..” అని అడుగుతూ తిరుగుతూనే ఉంది కమలమ్మ.
“ఇట్లా రా! స్థిమితంగా కూర్చో ! ఇంత ఆత్రుత ఉండకూడదు. ఇట్లా రా! కూర్చో! టిఫిన్ నేను చేస్తా!” అంటూ లేచాడు సుందరయ్య..
“వద్దు.. వద్దు. అది నేను చేస్తేనే తృప్తిగా తింటుంది. హాస్టల్ భోజనం ఎలా ఉంటుందో ఈ ఒక్క రోజయినా..!” అంటూ లోపలికి వెళ్ళింది.
ఆ రోజంతా అపూర్వ ఎదో ఆలోచనలో ముభావంగా ఉన్నట్లు కనిపెట్టింది కమలమ్మ. పదే పదే అడిగింది ఎందుకు అలా ఉన్నావమ్మా అని బుజ్జగించింది, బ్రతిమలాడింది.
“ఎందుకో అమ్మా ఈ సారి.. ఈ సారి మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే చాలా దిగులుగా ఉంది“
అంతే కూతుర్ని గట్టిగా కౌగలించుకుని ముద్దులు పెడుతూ, “నీ కంటే నాకు ఇంకా ఎక్కువగా ఉందమ్మా!” అంటూ రూములోకి పొదివి పట్టుకుని తీసుకు పోయింది. ఒక గంట తరువాత కళ్ళు తుడుచుకుంటూ సుందరయ్యను దాటుకు పోతూ, “మనసేమీ బాగలేదండి” అంది.
దగ్గరకు తీసుకుని, “ఏవిటి నీ పిచ్చి. ఈ రోజే కొత్తగా, దూరంగా.. మళ్ళీ తిరిగిరానట్లు అంత బాధ పడుతున్నావు. దానికి ధైర్యం చెప్పి పంపు. లేకపోతే బెంగతో అక్కడికి పోయి ఏం రాస్తుంది పరీక్ష” అని బుజ్జగించాడు సుందరయ్య.
తలంటి స్నానం చేయించి తానే వెంట్రుకలు ఆరేవరకు డ్రైయర్తో గంట సేపు శుభ్రం చేసి సాంబ్రాణి పొగబట్టి, దగ్గరే ఉండి కొసరి కొసరి టిఫిన్ తినిపించింది.
అలాగెలాగో సాయంత్రం వచ్చింది. ప్రయాణానికి సమయమైంది. కారులో సామాను సర్దుతుంటే పది సార్లు అన్నీ ఉన్నాయో లేవో చూసి బాగా అలిసి పోయింది. శ్రమతో అనేదానికంటే ఆత్రుతతో నిండిన వాత్సల్యంతో !!
కారులో లగేజి పెడుతుంటే ముక్కులు ఎగ చీదటం చూసి, “అలా ఉండకూడదు. ఎందుకు అంత భయం. నీ కూతురు ఎక్కడికో అడివిలోకి వెళుతున్నట్లు. పులులు సింహాలు కాచుకోనున్నట్లు.” అని విసుక్కున్నాడు సుందరయ్య.
“వాటిని గురించి కాదండి. ఈ చేతగాని ప్రభుత్వం, భాద్యతలేని పోలీసులు, రోడ్లు పొడవునా డాబాలు, సారాయి అంగడ్లు, ఎక్కడంటే అక్కడ నిలిపి బిర్యాని ముక్కలు, చెక్కలు తిని పీకలదాకా తాగి బస్సు నడిపే డ్రైవర్లు !!”
“అవేవి ఉండవు. ఎందరో వెళుతున్నారు వస్తున్నారు”
తనూ వస్తానని పట్టుబట్టింది. “ఆ సీన్లు నేను చూడలేను. వద్దు !” అని తీసుకెళ్ళి బస్సు ఎక్కించి వచ్చాడు.
అప్పటివరకు కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న కమలమ్మ వచ్చి దిగులుగా కూర్చుంటూ, “బస్సులో కూర్చో బెట్టారాండీ.. చుట్టుపక్కల చూసారా? ఆడవాళ్ళు ఉన్నారా? ఏదోగా ఉందండి. ఇల్లంతా బోసిపోయి దిగులుతో ఏడుస్తున్నట్లు !!” అంది కళ్ళుతుడుచుకుంటూ.
“ఇంటి యజమానురాలికి తోడుగావాలి కదా !”
వ్యంగ్యానికి చిన్న బుచ్చుకుంది.
సాయంకాలం వరకు ఏడుపు ముఖమే చూడాలని, “సువాసనలు వెదజల్లుతున్నాయి. ఎం చేసావేవిటి ?” అన్నాడు.
“తినిబండారాలండి. చివరి సారిగా స్నేహితులకు ఇస్తుందని. వాళ్ళ మరీ మరీ అడిగారంట నే చేసేవి భూలోకంలో ఎవ్వరూ చేయనంత రుచిగా ఉంటాయట”
“నగలు గిగలు ఏమయినా ఇచ్చావా?”
“అన్నీ ఇచ్చానండి. స్నేహితులు డైమండ్ గాజులు, నెక్లెస్ ఎప్పుడూ చూడలేదట.”
“ఒక్క రోజుకే! అంత బయపడ్డావు. మరి అవన్నీ.. దొరికినోడికి పండగే! దారిలో.. !?”
గుండె చేతిలో పట్టుకుని భర్తతో, “అంత మాట అనకండి. చస్తాను.” అంటూ ఫోను తీసుకుంది.
అవతల వైపు ఫోను తీసుకున్నట్లు లేదు. చూస్తూనే ఉన్నాడు. ఆమెలోని ఆతృత తారాస్థాయిని అందుకోవడం గమనిస్తున్నాడు. భయంగా భర్త వైపు చూసింది., “పడక అది సర్దుకుంటుందేమో? చేస్తుంది లే. రా! అంత తిండి తిని పడుకో! చాలా పొద్దుబోయింది” అన్నాడు లేచి సుందరయ్య.
ఫోను వచ్చింది. ఎగిరిగంతేసింది. “అమ్మా! తల్లీ !! ఫోను ఎత్తుకోకపోతే భయపడి పోయానమ్మా! బస్సు బాగుందా? నిండి పోయిందా? జాగర్తమ్మా! పడుకో! కాస్త మెలుకవగానే ఉండు. ” పది సార్లు చెప్పి భర్తకు భోజనం పెడుతూ సాంబారు గిన్నెలో వేయబోయి చొక్కా మీద పోసింది.
“ఖర్మ.. ఖర్మ. గమనించి వెయ్యవే !” లేచి వెళ్లి గుడ్డలు మార్చుకుని తానే పెట్టుకుని తినేసి వెళ్లి పడుకున్నాడు. అరగంట తరువాత లేచి చూస్తే ఇంకా మాట్లాడుతుంది. ఒక్క అరుపు అరిచాడు. వెళ్లి నాలుగు ముద్దలు తిని వచ్చి పడుకుంది. నిదుర పట్టలేదు.
భర్తను గమనిస్తూ లేచి బాల్కనీ లోకి వెళ్లి, “నిదురపోతున్నావా తల్లి. సారీ మా! మధ్య బెర్తేనా? కింద దిగేటప్పుడు జాగర్తమ్మా ?! అసలే పరధ్యానంగా ఉంటావు. ప్రక్క బెడ్లో ఆడవాళ్ళేనా? ఎక్కడోల్లో కనుకున్నావా? మన వాళ్ళు కాదా..? గమనిస్తూ ఉండమ్మా ! ” అంటూ వెనక్కు తిరిగి చూసింది. భర్త !!
“ఏం దాన్ని కాసేపయినా ప్రశాంతంగా పడుకోనివ్వవా? రా లేచి!! నీకే ప్రేమకారి పోతున్నట్లు“ అని ఫోను పెరుక్కోపోతే ఇక చెయ్యనని దాచుకుంది. విధిలేక వెళ్లి పడుకున్నాడు.
కళ్ళు మూతలు పడితే కదా !
మెల్లగా లేచి ఇంటి వెనుకకు వెళ్లి ఫోను ఎత్తుకుంది.
తళుక్కున ఆకాశం మెరిసి ఉరుము శబ్దం వినిపించింది. దడుసుకుంది. గబా గబా మిద్దె మెట్టు ఎక్కి ఆకాశంలోకి చూసింది! దూరంగా మెరుపులతో ఉరుముతున్నట్లు అనిపించి, కమలమ్మకు చెమటలు పోసాయి.
అక్కడ కురుస్తుంటే.. బస్సు.. దారి కనపడక పోతే.. ఇక ఆగలేక పోయింది. ఫోను చేసింది. కూతురు ఎత్తుకోలేదు. గుండె దడ మొదలయ్యింది. ఎత్తుకుంది. అడిగింది. ” ఏమ్మా వర్షం వస్తుందా ?”
“లేదమ్మా! బస్సు నిలుచుంది. ”
“ఎందుకు.. ఎందుకు” ఆతృత పెరిగి పోయింది.
ఎదో అడగబోయే లోగా కూతురు, “నువ్వు పడుకో.. పరవాలేదు పడుకో!” అంది.
రెండు సార్లు పడుకో.. పడుకో అని చెప్పేసరికి కష్టం వేసింది. మళ్ళీ, పాపం నిదుర వస్తుందేమో? పడుకోనీ అనుకుంటూ లోపలికి వచ్చి కూర్చుంది. కానీ పడుకోలేదు.
పది నిముషాలు కూడా కాలేదు ఈ సారి బాత్ రూమ్ లోకి వెళ్లి రహస్యంగా మాట్లాడటం మొదలు పెట్టింది. “బస్సు కదలబోతుంది” అని చెప్పింది. అమ్మయ్య అని గాలి పీల్చుకుని, “కాస్సేపు నిద్ర పొమ్మా. ఏదయినా అవసరముంటే వెంటనే ఫోను చెయ్యామ్మా! నీకు మొహమాటం ఎక్కువ. మేలుకునే ఉంటాను. చూడు.. మీ నాన్న దిగులు, విచారం లేకుండా హాయిగా గుర్రు పెట్టి నిద్ర పోతున్నాడు. జాగర్తగా ఉండు! వెళ్ళగానే ఫోను చెయ్యమ్మా. మరిచిపోవద్దు!!”
ఫోను పక్కనబెట్టి తలనొప్పిగా ఉంటే కాఫీ తాగితే బాగుంటుందని కిచెన్లో లైటు వెయ్యబోయి కాలు దేనికో తగిలింది. అమ్మా అంటూ గావుకేక వేసింది. భర్త పరుగెత్తుకు వచ్చి లైటు వేసి చూస్తే బొటనవేలు చిట్లి రక్తం కారుతుంది!
“ఎందుకొచ్చావు. పడుకొని ఏడవక!”
“కాఫీ.. కాఫీ” అంది భయపడుతూ. కట్టుకట్టి బెడ్ దగ్గరకు తీసుకొచ్చి పడుకో బెట్టి కాఫీ చేసుకుని ఇచ్చి, ఫోను పెరుక్కుని, “ఈ దరిద్రపు ఫోనులు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి” విసిరి కొట్టబోయి దిండు కింద దూర్చాడు. ఇక చెయ్యనని బ్రతిమలాడింది. ఇవ్వలేదు.
అరగంట కూడా ఉండలేక పోయింది. బాగా నిదురపోతున్నది గమనించి చాకచక్యంగా ఫోను తీసుకుని మెల్లగా లేచి తాగిన కాఫీ గ్లాసు తీసుకొచ్చి వంటింటిలో పెట్టి, లైటు వెయ్యకుండా మూల కూర్చుని ఫోను చేసింది.
రాలేదు. నాలుగయిదుసార్లు చేసింది జవాబు లేదు. ఏం జరిగుంటుంది.. ఏం జరిగుటుంది ? భయంతో చెమటలు పోసిపోయాయి.
అప్పుడు వచ్చింది ఫోను. వర్షాలకు వాగు పొంగిందని, బస్సు నిలిచుందని, ఒకటి రెండు కార్లు వెళ్లాయని అందరూ దిగి ఆవల వైపుకు వెళ్లి చూసి నీళ్ళు పారుడు ఎక్కువ వేగం లేవని, లోతు లేదని బస్సు రావచ్చని చెప్పారు. బయలు దేరి చివరి వరకు వచ్చేసామని. ఇక భయం లేదని చెప్పింది.
అట్లాగే కూలబడి పోయింది కమలమ్మ. నీటి వేగాన్ని ఎవ్వరూ అంచనా వెయ్యలేరు. ఉన్నట్లుండి వరద ఎక్కువయి బస్సు కొట్టుకు పోతే..! గుండెల్లో అదిమినట్లు అనిపించింది. తెలిసిన దేవుళ్ళకు మొక్కులు మీద మొక్కుల తీరుస్తానని ప్రమాణం చేసి ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంది. కదలలేక పోయింది.
భయం భయంగా, “ఇంకెన్ని గంటల ప్రయాణం. మధ్యలో ఏం లేవు కదా? ఇంకా వర్షం వస్తుందా? ఎవర్ని అయినా బస్సు దగ్గరకు రమ్మన్నావా?” అని ఏడుపు గొంతుతో అడిగింది.
“వస్తాడమ్మా !.. వస్తారు. అమ్మా! నువ్వు చేసిన బాదుషా, తాపేశ్వరం కాజాలు, అరిసెలు, అందరికి ఇచ్చాను. ఎంత బాగున్నాయో. మా కడుపు నింపావమ్మా! ఏ తల్లికన్నదో నిన్ను, ఆ తల్లి సుఖంగా ఉండాలని నన్ను ఎంత పొగిడారో! చాలా గర్వం వేసింది. అన్నపూర్ణ నాతల్లి అని పొంగిపోయాను”
అంతే కమలమ్మ ఆకాశంలో విహరించ సాగింది. గుండెల్లో బరువంతా ఎగిరి పోయింది ఆత్రుత అణిగిపోయింది. వెళ్లి భర్త ప్రక్కన మనశ్శాంతితో తృప్తిగా పడుకుంది. కానీ తను విన్నది వాడనా.. వారనా? ఛీ.. నా కూతురు ఆణిముత్యం. రేపు పరుగెత్తుకుంటూ వస్తుందని పూర్తి నమ్మకంతో ప్రశాంతంగా నిదురలోకి జారుకుంది కమలమ్మ.
తెల్లవారిపోయింది.
అపూర్వ బస్సు దిగింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి సూర్యుడు సిగ్గుపడేలా నవ్వుతూ ముత్యాలు వెదజల్లుతూ ఒక్క ఉదుటున అతనిలో ఐక్యమై పోయింది.
గట్టిగా తనలో ఇముడ్చుకున్నాడు. రిజిస్ట్రార్ ఆఫీసు వైపు ఏడేడు జన్మల బంధం కోసం చేతులు కలుపుకుని సాగిపోయారు!!
ఏ తీరుగ నను దయజూసెదవో..! ఈ తరం ఏ తీరానికో..???
*****
సమాప్తం
డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : డా.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి..
నమస్తే ! నా కధ ప్రచురణకు నోచుకున్నందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. నా గురించి గొప్పగా ఏమీ లేదు. సాహిత్యం అంటే మక్కువ. ప్రయోగాలు చెయ్యాలని అభిలాష. చాలా సంవత్సరాల ముందు కధలు రాసేవాడిని. అన్నీ కూడా ఆంధ్రప్రభ, ఆంద్ర జ్యోతిలలో ప్రచురితమైనవి. కొన్ని కారణాల వలన సాహిత్యానికి దూరం అయినాను. 2010 నుండి నవలలు, భావకవితలు రాయడం మొదలుపెట్టాను. మరో హృదయం-మరో ఉదయం{నవల} ,గీతాంజలి అనువాదం, నీకోసం అనే భావకవిత్యం, చీకటిలో మలివెలుగు {నవల} ప్రచురించడం జరిగింది.
30/10/2022 న మనతెలుగుకథలు.కామ్ వారిచేత సన్మానింపబడి ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

Comments