top of page
Original.png

తొలి గురువు తల్లి

Updated: Mar 11

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AmmaAmruthaPalukulu, #అమ్మఅమృతపలుకులు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 25

Tholi Guruvu Thalli - Somanna Gari Kavithalu Part 25 - New Telugu Poem Written By Gadvala Somanna Published In manatelugukathalu.com On 05/03/2025

తొలి గురువు తల్లి - సోమన్న గారి కవితలు పార్ట్ 25 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


తొలి గురువు తల్లి


అమ్మ ఇంట మొదటి గురువు

సదనములో కల్పతరువు

అనురాగాలకూ నెలవు

గుండెల్లో పెట్టి కొలువు


అమ్మ లేక ప్రగతి లేదు

ఆమె లేక జగతి లేదు

ఒక్క క్షణం దూరమైన

కుటుంబాన వెలుగు రాదు


త్యాగానికి మారుపేరు

జనం మేలు తల్లి కోరు

ఆకాశము బహు చిన్నది

పోల్చగా మనసు పెద్దది


అమ్మ ఉన్న లోటు లేదు

ఆమె లేని చోటు లేదు

అనురాగ దేవత ఇంట

ప్రేమానురాగాల పంట


అమ్మ మనసు చూడ వెన్న

సృష్టిలోన మిగుల మిన్న

సదనంలో కాంతి ప్రమిద

అమె వలన ఉండు వసుధ

ree
















నిప్పులాంటి నిజాలు

----------------------------------------

జీవితమంటే గమనము

అక్షరాల అద్భుతము

చేర్చాలోయ్! గమ్యాన్ని

పొందాలోయ్! విజయాన్ని


పదే పదే పాడినా!

పాట మధురమవుతుంది

ఎన్ని సార్లు ఓడినా!

గెలుపు పిలుపు వినిపిస్తుంది


నిరంతర సాధనతో

ఏదైనా సాధ్యమే!

తినగతినగ వేము కూడా

తియ్యగ నుండు విదితమే!


వాస్తవాలు ఎప్పుడూ

చేదుగా ఉండు కదూ!

అబద్ధాలు అహర్నిశలు

తేనెలా ఉండు కదూ!


విజ్ఞానపు వెలుగులో

నిన్ను నీవు చూసుకో!

అజ్ఞానపు ముసుగులో

ప్రమాదముంది తెలుసుకో!

ree









అన్నదాతకు అండగా!!

----------------------------------------

కడుపునింపు అన్నదాత

దేశానికి వెన్నెముక

ఇవ్వాలోయ్! చేయూత

ఎంతమాత్రం కాదనక


పెను అప్పుల ఊబిలో

కూరుకుపోయిన రైతులు

గిట్టుబాటు ధరలు లేక

చాలిస్తున్నారు అసువులు


రైతే రాజు ఒకనాడు

తారుమారు ఈనాడు

ఆదుకొను నాథుడు లేడు

అన్నదాతలను చూడు


కన్నీరే ఏరులై

పారుతుంది గమనించు

రుణ భారం యమపాశమై

శ్వాస తీస్తుంది గాంచు


రైతన్నకు అండగా

అందరూ నిలవాలోయ్!

చేయి చేయి కలపగా

ధైర్యమే రావాలోయ్!

ree























ప్రేమమూర్తి అమ్మ

----------------------------------------

అమ్మ మనసు భవ్యము

ఆమె మాట దివ్యము

అలకిస్తే గనుక

బ్రతుకు అగును నవ్యము


అమ్మ ఇంట దీపము

అసమానము త్యాగము

ఆమె లేక కుటుంబము

అవుతుందోయ్! శూన్యము


దేవత ప్రతిరూపము

అమ్మ ప్రేమ శిఖరము

మనసు కష్టబెడితే

దీవెనలిక దూరము


వెన్నముద్ద హృదయము

చూడంగా హృద్యము

అమ్మ ఉన్న స్థలమే!

తలపించును స్వర్గము

ree












నిజమే కదూ!!

----------------------------------------

విజ్ఞానము వికసిస్తే

అజ్ఞానము మాయమగును

క్షమాగుణము చూపిస్తే

శత్రుత్వము దూరమగును


ప్రేమ నదులు ప్రవహిస్తే

వసుధైక కుటుంబమగును

సమైక్యత సాధిస్తే

విశ్వశాంతి సాధ్యపడును


కన్నోళ్లను పూజిస్తే

జీవితాలు వర్ధిల్లును

పెద్దలను గౌరవిస్తే

కుటుంబాలు బాగుపడును


పిల్లలను ప్రేమిస్తే

అభిమానమెక్కువగును

మంచి దారి నడిపిస్తే

వారి భవిత చక్కబడును


-గద్వాల సోమన్న


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page