top of page
Writer's pictureNeeraja Prabhala

తొలి ఏకాదశి



'Toli Ekadasi' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 17/07/2024

'తొలి ఏకాదశి' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


ఈరోజు (17/07/2024) తొలి ఏకాదశి, శయన ఏకాదశి. 


తొలి ఏకాదశి అంటే ఏమిటి?


ఆషాడ శుద్ధ ఏకాదశిని “తొలి ఏకాద‌శి” అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి, శుక్ల పక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి. ) ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు. ఈ పదకొండు ఏకోన్ముకంగా పనిచేసే సమయమే ఏకాదశి. 


ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని “శయన ఏకాదశి” అంటారు. 


ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరిని నియమ నిష్టలతో భక్తి శ్రధ్ధలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి వివిధ రకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి. పేలాలను పొడిగా చేసి దానికి బెల్లం, నేయి కలిపి పేలాలపిండి చేసి స్వామికి నివేదన చేయాలి. అలాగే వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ‘కట్టెకారం’ చేసి నివేదన చేస్తారు. అది మారుతున్న ఈ మాసపు శీతోష్ణ పరిస్థితుల దృష్ట్యా ఆరోగ్యానికి. చాలా శ్రేష్టం. 


ఈ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. 


సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తిని పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. 


 ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని "ఉత్థాన ఏకాదశి" అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే 'క్షీరాబ్ధి ద్వాదశి' అంటారు. ఈ నాలుగు నెలల కాలం చాలా పవిత్రమైన కాలం


అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున సన్యాసులు, పీఠాధిపతులు చాతుర్మాస్య దీక్షని స్వీకరించి నియమనిష్టలతో పాటిస్తారు. 


ఈరోజున గోపద్మ వ్రతము’ను ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి. 


…. నీరజ హరి ప్రభల. 


40 views0 comments

Comments


bottom of page