top of page
Writer's pictureLakshmi Sarma B

స్నేహ బంధం



'Sneha Bandham' - New Telugu Story Written By Lakshmi Sarma Thrigulla

Published In manatelugukathalu.com On 14/07/2024

'స్నేహ బంధం' తెలుగు కథ

రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



తిరుమల మాడవీధుల్లో జనం రద్దీగా ఉంది. ప్రతి ఒక్కరి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలన్న తపన. మేము ముందంటే మేము ముందన్నట్టుగా హంగామా చేస్తున్నారు భక్తులు. కొంతమంది స్వామిని దర్శించుకొని తృప్తిగా బయటకు వస్తున్నారు. 


స్వామిని చూసాక మా జన్మ ధన్యమైంది మా కోరికలను నెరవేర్చు స్వామి అని మనస్ఫూర్తిగా వేడుకుని వచ్చినట్టున్నారు. లడ్డు వడ ప్రసాదాలు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. పిల్లలకోసం బొమ్మలుకొనుగోలు చేసేవాళ్ళ హడావుడితో షాపులన్నీ కిక్కిరిసిపోయాయి. ఇదే సమయం కనుక దోచుకోవడానికి తహతహలాడుతారు షాపులవాళ్ళు. ఎక్కడ చూసినా జనం తండోపతండాలుగా వస్తునే ఉన్నారు. 


వెంగమాంబ అన్నసత్రం కిటకిటలాడుతూ కన్నులపండుగగా ఉంది. ఎక్కడి హోటళ్ళు సరిపోవడంలేదు జనాలకు గదులు దొరకడం కూడా కష్టంగానే ఉంది. డబ్బున్నవాళ్ళకు లగ్జరి గదులు ఆర్జిత సేవ దర్శనం అన్ని సులభంగానే జరిగిపోతున్నాయి కనుక వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. ఎటొచ్చి మాములు ప్రజానీకానికే కష్టం పాపం కొంతమందికి గదులు దొరకక సర్వదర్శనం కోసం గంటలకొద్ది వేచి ఉండడం అదంతా స్వామి మీద భక్తికి నిదర్శనం. అప్పుడే దర్శనం ముగించుకుని వస్తున్న అనుపమకు తన ముందునుండే నడుచుకుంటూ వెళుతున్న ఒకావిడ చేతిలోని పర్సు కిందపడిపోయింది. ఆమె చేతిలో లడ్డూల కవరు ఉండడంతో ఆమె పర్సు జారిపోయినా చూసుకోలేదు. కిందపడిన పర్సును టక్కున చేతిలోకి తీసుకుంది అనుపమ వేరే ఎవరైనా తీసుకుంటారేమోనని. పరుగెత్తి నడిచినట్టే నడిచి ఆమెను చేరుకుని.. 


“ఏమండి .. మీ పర్సు జారిపోయింది మీరు చూసుకోలేదు, ” అంటూ ఆమె చేతికి అందించింది అనుపమ. 


“థాంక్సండి.. కంగారులో చూసుకోలేదు, మీరు మంచివారు కాబట్టి తెచ్చిచ్చారు అదే వేరే వాళ్ళయితే దాచుకునే వాళ్ళు, ఇందులో చాలా డబ్బుతో పాటు మా ఫ్లైట్ టికెట్స్ నా కార్డులు, ఇంకా వజ్రాల నెక్లెస్ కూడా ఉన్నాయి చాలా సంతోషమండి, ” అంటూనే పర్సు తెరిచి చూసింది అన్ని ఉన్నాయో లేదోనని. అన్ని కనిపించేసరికి తృప్తిగా అనుపమ వైపు చూస్తూ. “మీరు దర్శనం చేసుకున్నారా? మీరు ఎక్కడుంటారు” అడిగింది మాటలు కలుపుతూ. 


“మాది రాజమండ్రి దగ్గర చిన్న టౌనండి, మా తమ్ముడి కొడుకుకు పుట్టువెంట్రుకలు తీస్తామంటే వచ్చాము, ఈ రోజు సాయంత్రం వెళ్ళిపోతున్నాము మీరు ఎక్కడనుండి వచ్చారు?” అడిగింది అనుపమ. 


“మాది హైదరాబాద్ మేము ప్రతి సంవత్సరం వస్తుంటాము స్వామి దర్శనం కోసం, అవును ఇంతకు మీ పేరు చెప్పలేదు ? నా పేరు నందిని, మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో ఆత్మీయులుగా కనిపిస్తున్నారు, మనం స్నేహితులుగా కలిసిపోదాం ఏమంటారు? ఇదిగో నా ఫోన్ నెంబర్, ” అంటూ కార్డ్ తీసి ఇచ్చింది తను. 


కార్డ్ తీసుకుంటూ “చాలా సంతోషం నందినిగారు .. మిమ్మల్ని చూస్తుంటే చిన్నప్పటి నా స్నేహితురాలే గుర్తుకు వస్తుంది, నా పేరు అనుపమ. ఇదిగోండి నా ఫోన్.. రాసుకుంటారా, ” అడిగింది తన ఫోన్ హ్యాండ్ బ్యాగులోనుండి తీస్తూ. 


“అనుపమ.. బాగుంది మీ పేరు, మీకు మల్లే స్వచ్చమైన పేరు. మనం తరుచూ కలుసుకోలేకపోయినా ఫోన్‌లో మాత్రం మన స్నేహాన్ని మరిచిపోవద్దు, ” 


ఇంతలోకి వాళ్ళాయన కాబోలు. “ఫ్లైట్ టైం అవుతుంది తొందరగా రా”, అంటూ పిలిచాడు. 


“సరే అండి. మీ వారు పిలుస్తున్నట్టున్నారు వెళ్ళండి. మనం ఫోన్‌లో మాట్లాడుకుందాం, స్వామి సన్నిధిలో మన పరిచయం పదిలంగా కాపాడుకుందాం, ” అంటూ నవ్వుకుంటూ ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు. 


‘అనుపమను చూస్తే చాలా చక్కగా నాజుగ్గా ఉంది. తను కట్టుకున్న బెంగాలి కాటన్ చీర ఎంతబాగుందో మెడలో ముత్యాల హారం చెవులకు ముత్యాల లోలాకులు. చూడగానే తనతో మాట్లాడాలనిపించేలా ఉంది. ఇతరులను ఆకట్టుకునే ఆ చిరునవ్వు చూస్తుంటే ఎంతబాగుందో’ అనుకుంది. ఇంటికి వచ్చాక అనుపమ గురించే ఆలోచిస్తుంది నందిని. 


‘అవును, నందిని కట్టుబొట్టు చూస్తేనే తెలుస్తుంది గొప్ప శ్రీమంతురాలని, కానీ ఏ మాత్రం గర్వంలేదు. మనిషి అంత అందమైనది కాకున్నా ఇతరులను తన మాటలతో ఇట్టే ఆకట్టుకునే నేర్పు తనలో ఉంది. తన తాహతుకు నేను తగుదునా ! కాకపోతే ఆ స్వామి సన్నిధిలో కలిసాం కాబట్టి.. నన్ను చిన్న చూపు చూడదేమో చూద్దాం’ అనుకుంది మనసులో అనుపమ. తను ఇలా అనుకుందోలేదో గణగణమని ఫోన్ మోగింది. 


గబాలున ఫోన్ అందుకుని. “హలో .. నేను అనుపమను మాట్లాడుతున్నాను మీరెవరు?” అడిగింది ఆత్రుతగా. 


“అనుపమ.. నేను నందినిని.. బాగున్నావా? నేను ఇంటికి వచ్చినప్పటినుండి నీ గురించే ఆలోచిస్తున్నాను, మనం మళ్ళి ఎప్పుడు కలుస్తామో గానీ.. పదేపదే నువ్వే గుర్తుకు వస్తున్నావు, ” అంది నందిని. 


“నిజం నందిని .. మీరు చెప్పింది, నాకు మిమ్మల్ని మళ్ళి ఎప్పుడు కలుస్తానా ఎప్పుడు మీతో మాట్లాడుదామని నాకు ఇంటికి వచ్చినప్పటినుండి ఒకటే ఆరాటంగా ఉంది, చెప్పండి ఏం చేస్తున్నారు డిన్నరు చేసారా? మీ పిల్లలు ఎక్కడుంటారు పెళ్ళిళ్ళు అయ్యాయా, ” అడిగింది ఉత్సాహపడుతూ. 


“అనుపమ.. నాకు అమ్మాయి, అబ్బాయి.. వాళ్ళ పెళ్ళిళ్ళు అయి పిల్లలతో తలోచోట ఉన్నారు, మా వారు నేను మాత్రమే ఇక్కడున్నాము, ఎప్పుడో పండగలకో పబ్బాలకో వచ్చిపోతుంటారు అంతే, ” చెప్పింది నందిని. 


“మా పరిస్థితి అంతేనండి .. అమ్మాయికి.. అబ్బాయికి పెళ్ళి చేసాము, వాళ్ళు పిల్లాపాపలతో ఒకరు సింగపూర్ లో ఉన్నారు ఇంకొకరు సౌదిలో ఉన్నారు, మా వారు ఈ మధ్యనే రిటైర్మెంట్ అయ్యారు, ఇదిగో అలా ఏం తోచక పుణ్యక్షేత్రాలు తిరుగుతుంటాము, ” గలగల నవ్వుతూ చెప్పింది అనుపమ. 


ఇలానే వీళ్ళ పరిచయం బలీయం కాగాసాగింది. రోజు గంటలతరబడి ముచ్చట్లు.. ఎక్కడినుండి వస్తాయో తెలియదు కానీ! రోజు రోజుకు తీసిపోనన్ని కబుర్లు చెప్పుకోందే ఎవరికి తోచదు. అంతలా పెనవేసుకుంది వీళ్ళ స్నేహబంధం. 


“హలో అనుపమ .. మా వారికి షష్టిపూర్తి మహోత్సవం చెయ్యాలని పిల్లలు పట్టుబట్టారు, వచ్చేనెల ఆరో తేది కాబట్టి.. నువ్వు మీ వారు తప్పకుండా రెండోరోజుల ముందే ఇక్కడుండాలి, అంతేకాదు అనుపమ నన్ను నువ్వే తయారు చెయ్యాలి, ఎందుకంటే నాకు తోడబుట్టిన వాళ్ళెవరులేరు నువ్వే నాకు తోడుగా ఉండాలి, కాదు కుదరదు రావడానికి వీలులేదు అంటే మాత్రం ఊరుకొనేది లేదు ఆ ఏమనుకున్నానో, ” అంది జబర్దస్తీగా. 


“ఏం ఊరుకోక ఏం చేస్తావేంటి ? అలకపానుపు ఎక్కి కూర్చుంటావా, ” నవ్వుతూ అడిగింది. 


“ఏయ్ అను .. నా గురించి నీకు తెలియదు కదూ, నేను చాలా మొండిదాన్నీ. నేను అనుకున్న పని జరుగకపోతే నిద్రాహారాలు మానేస్తాను, అప్పుడు మా వారు చప్పున నా దారికొస్తారు తెలుసా! కానీ నువ్వు రాకపోతే నేనేం చేస్తానన్నావు కదా, షష్టిపూర్తి ఆపేస్తాను నీ వల్లనే ఆగిపోయిందని తెలిసి నువ్వు బాధపడవలసి వస్తుంది, ” కిలకిలా నవ్వుతూ అడిగింది నందిని. 


“ అమ్మా తల్లి .. అలాంటి పని చెయ్యమాకు, రెండురోజుల ముందే నీ దగ్గర వాలిపోతాను, నా హాంగామా భరించుకోలేక ఎందుకు పిలిచానురా అనుకుంటావు, ” అంది. 


నందిని వాళ్ళింటికి వెళ్ళాలంటే తనకు మంచి గిప్ట్ ఇవ్వాలి. వాళ్ళ తాహతుకు తను ఏమి ఇవ్వగలదు. బంగారం పెడదామంటే ఆకాశాన్నంటే ధరలు. పట్టుచీర పెడదామంటే తను ఆ రోజు తిరుపతిలో కట్టుకున్న చీరను చూస్తేనే అర్ధమైంది మాములు పట్టుచీరలు కట్టదేమోనని మరి ఏమివ్వగలను. పోని డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుందేమో ఛీ ఛీ వెయ్యి రెండువేలు పెడితే ఏం బాగుంటుంది. ఏం కొనాలో అర్ధంకాక రెండురోజులు షాపులన్నీ తిరిగితిరిగి చివరకు తెల్లటి పాలరాతి కృష్ణుడి విగ్రహం తీసుకుంది.


 అది చూసి అనుపమ భర్త “ఏమిటిది.. ఇది మనం హైదరాబాద్ తీసుకుని వెళ్ళడమా? నీకేమైనా పిచ్చి పట్టిందా అనూ. లేకపోతే ఏంటి, ఇంతదూరం నుండి ఎలా తీసుకవెళదామనుకున్నావు, అయినా ఇలాంటివి హైదరాబాద్ లో ఇంతకంటే మంచివి దొరుకుతాయి, ఇది వాపసు ఇచ్చేయ్యి. అక్కడే కొనుక్కుందాము, ” కోప్పడుతూ అన్నాడు, అనుపమ భర్త రమేశ్. 


“ఏమోనండీ ఎంత ఆలోచించినా ఏమివ్వాలో తోచలేదు, ఇదిగో ఈ కృష్ణుడు కనిపించేసరికి ఆనందం తట్టుకోలేక ఇది తీసుకున్నాను, అతను వాపసు తీసుకోనన్నాడు ఎలాగోలా మనం తీసుకవెళదామండి, ” బతిమాలుతూ అడిగింది. 


“సరే తప్పుతుందా నువ్వు చేసిన ఘనకార్యానికి, ” అన్నాడు. 


షష్టిపూర్తి కంటే రెండురోజులు ముందుగానే హైదరాబాద్ కు చేరుకున్నారు అనుపమ దంపతులు. రైల్వేస్టేషన్ కు కారు పంపించింది నందిని. 


“ఏమండి చూసారా .. నా స్నేహితురాలిది ఎంతగొప్ప మనసో, మనం వస్తున్నామని తెలిసి స్టేషన్ కు కారు పంపింది, నాకింతవరకు అలాంటి మంచి మనసున్న స్నేహితులే లేరండి” సంతోషంతో భర్తకు చెప్పింది అనుపమ. 


“సరేలే, మరీ అంతగా ఆలోచించకు. ఆమె గొప్ప శ్రీమంతురాలు అంటున్నావు, పొరబాటున ఎక్కడన్నా చిన్న చూపు చూస్తే తట్టుకోలేవు, ” భార్యను ఉడికిస్తూ అన్నాడు. 


“నా స్నేహితురాలు అలాంటిది కాదు, నాకు తెలుసు మీకు ఇంతమంచి స్నేహితులు లేరని నా మీద ఉడుక్కుంటున్నారు కదూ, ” అంది నవ్వుతూ. 


ఒకచేత్తో హ్యాండు బ్యాగు మరో చేత్తో కృష్ణుడి విగ్రహాన్ని పట్టుకుని అనుపమ, రెండు బ్యాగులు పట్టుకుని ఆ వెనకాలే రమేశ్ నందిని ఇంటిలోకి వస్తూ కనురెప్పలు కొట్టడం కూడా మరిచిపోయారు ఆ ఇల్లును చూసి. ఇది ఇల్లా ఇంద్రభవనమా అనుకుంటూ ఆశ్చర్యపోతూ చుట్టూ పరికించి చూసారు. 


“ఏయ్ అనుపమ.. బాగున్నావా, ” అమాంతంగా వెనకనుండి వచ్చి గట్టిగా వాటేసుకుంది నందిని. అలాగే గుడ్లప్పగించి నందినిని చూడసాగింది అనుపమ. నందిని శ్రీమంతురాలు అనుకుందిగానీ కోట్లకు అధిపతని ఇప్పుడే తెలిసింది. ఇలాంటి వాళ్ళతో నాకు స్నేహమా!


ఏమో నేను తిన్నగా జారుకోవడం మంచిదేమో. నలుగురు చూసినా నవ్వుకుంటారేమో నన్ను చూసి. ఆశకు కూడా అంతుండాలే దేనికైనా సరిసమానులుండాలే కానీ ఇంతగొప్పవాళ్ళతో స్నేహం మంచిదికాదు. మనసులో అనుకుంటునే అలానే చూడసాగింది. 


“ఏయ్ ఏమిటాలోచిస్తున్నావు? ఇలాంటి వాళ్ళతో నాకు స్నేహమేంటాని కదా నీ ఆలోచన, అనుపమ .. నువ్వు పొరబాటు పడుతున్నావు, నా గతం తెలిస్తే నువ్వు నేను ఒకటే పరిస్తితి నుండి వచ్చినవాళ్ళం కాకపోతే, నన్ను పెంపకానికి తెచ్చుకున్నవాళ్ళు కోటీశ్వరులు కనుక నేను కోటీశ్వరురాలిని అయ్యాను. కానీ ఏం లాభం? నాకు పుట్టినింటివాళ్ళెవరులేరు. ఒంటరిదాన్నీ. నా భర్త, నా కడుపున పుట్టిన పిల్లలు.. ఇదే నా కుటుంబం, ” బాధపడుతూ చెప్పింది నందిని. 


“ఏయ్ నందినిగారు..” అంటూ ఏదో చెప్పబోయింది. 


“ఏయ్ చంపేస్తాను నిన్ను .. ఇంకొకసారి నన్ను గారు మీరు అని పిలిచావంటే, ” అంది కళ్ళెర్రచేస్తూ. 


భయపడింది అనుపమ. “సరే సరె నందిని.. నువ్వు పెంపకానికి రావడం ఏంటి నాకేం అర్ధంకాలేదు, ” అడుగుతూ ‘అమ్మబాబోయ్ అవలిస్తే పేగులు లెక్కపెట్టే రకంలా ఉంది, జాగ్రత్తగా మాట్లాడాలి’ అనుకుంది. 


“అనుపమ.. మనం తీరికగా అవన్ని మాట్లాడుకుందాము, ముందు మీ వారిని గదిలోకి తీసుకవెళ్ళి తయారై రండి టిఫిన్ చేద్దురుగాని, ” అంది. 


గదిలోకి వెళుతుంటే “పైవ్ స్టార్ హోటల్ కూడా ఇంత బాగుండదేమోనండి, నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి ఇదంతా చూస్తుంటే” ఆనందం ఆశ్చర్యంతో చెప్పింది భర్తతో. 


“నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు అను, మనమేం పూర్తిగా లేని వాళ్ళం అన్నట్టు

ఇప్పుడే ఇంత గొప్పవాళ్ళను చూస్తున్నట్టు చేస్తున్నావు, చులకనయై పోతావు జాగ్రత్త. మనకు లేకున్నా ఉన్నట్టు బిల్డప్ ఇవ్వాలిగానీ, ” భార్యను మందలించాడు. 


రాత్రి భోజనాలు అవి అయ్యాక నందిని భర్త వాసు, రమేశ్ ఇద్దరు వాళ్ళకు తెలిసిన లోకాభిరామాయణం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నందిని అనుపమ ఆరు బయట వెన్నెల్లో కూర్చొన్నారు. 


“నందిని .. నువ్వు ఏమనుకోకపోతే నీ గురించి చెబుతావా? ఎందుకో నీ గతం తెలుసుకోవాలని ఉంది, నిన్ను చూస్తుంటే నా మనసులో ఎక్కడో కలిసామన్న భావన వస్తుంది, ” అడిగింది తననే చూస్తూ. 


“అనుపమ.. నన్ను ఎక్కడో చూడడమేంటి మనం తిరుపతిలో కలిసాము కదా అప్పుడే మరిచిపోయావా ” నవ్వుతూ అడిగింది నందిని. 


“ఊహూ అది ఎలా మరిచిపోతాను ఆ దైవం సాక్షిగా మనం స్నేహితులం అయ్యాము, ఈ జన్మేకాదు జన్మలకు మనం స్నేహితులుగానే పుట్టాలని కోరుకుంటాను, అదికాదు నా మనసులో మనం ఎప్పుడో కలిసి తిరిగామని అనిపిస్తుంది, అందుకే నీ గతం చెప్పవా” పట్టువదలని విక్రమార్కుడిలా పట్టుబట్టింది అనుపమ. 


“చెబుతాను అనుపమ నీకు కాకపోతే ఇంకెవరికి చెప్పగలను చెప్పు, నేను దురదృష్టవంతురాలినో అదృష్టవంతురాలినో నాకు తెలియదు, ఎందుకంటే కన్నతల్లి తండ్రుల ప్రేమను పొందలేకపోయాను అందుకు దురదృష్ట వంతురాలిని, నన్ను పెంచుకున్న తల్లి తండ్రులు కావాలసినంత ప్రేమను పంచారు, డబ్బులో మునిగి తేలుతున్నానంటే అదృష్టవంతురాలినే కదా! నాకు నాలుగేళ్ళ వయసప్పుడు మా నాన్న అమ్మా కారు యాక్సిడెంట్ లో పోయారట, రోడ్డు పక్కన గుంతలో పడి ఉన్న నేను బోరుబోరుమని ఏడుస్తుంటే, రాత్రిపూట కదా ఎవరులేరు అటుగా వెళుతున్న రఘురాం గారు ఆయన భార్య 

సుమతి నా ఏడుపువిని నన్ను దగ్గరకు తీసుకున్నారు.


వాళ్ళు ఎన్ని పూజలుచేసినా ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా సంతానం కాలేదనే బెంగ ఉంది, నన్ను చూడగానే దేవుడే వాళ్ళకు ఈ బిడ్డను చూపాడని నన్ను ఎవరికి తెలియనివ్వకుండా జాగ్రత్తగా తీసుకునివెళ్ళిపోయారు, అప్పటినుండి నా కంటిలో నీరు రాకుండా చూసుకున్నారు.


నాకు అప్పుడు వేరే పేరుండేది. వీళ్ళు మార్చేసి నందిని అని పెట్టుకున్నారు. చాలా రోజులు నేను అమ్మా నాన్నలకోసం బాధపడేదాన్నీ, వాళ్ళు నన్ను ఓదార్చేవారు. నాకు ఏ లోటు లేకుండా పెంచారు. కానీ చిన్నప్పుడు నాకొక స్నేహితురాలుండేది. అది బాగా గుర్తుంది కానీ తన పేరు గుర్తులేదు. అంతేకాదు అనుపమ, మాకు యాక్సిడెంట్ అయ్యేముందుకూడా నా స్నేహితురాలు ఇచ్చిన గుర్రంబొమ్మ నా చేతులోనే ఉంది.


దాన్నీ మాత్రం ఇదిగో ఇప్పటివరకు దాచుకున్నాను. అదొక్కటే నా చిన్నప్పటి మంచి జ్ఞాపకం, తరువాత నేను మెల్లిగా మా అమ్మానాన్నలను మరచిపోయాను. వీళ్ళే నా అమ్మానాన్నలనుకుని అలానే పిలిచేదాన్నీ. నాకు చదువు చెప్పించి మంచి సంబంధం చూసి పెళ్ళిచేసారు, మనవడు మనవరాలు పుట్టేవరకు ఉన్నారు. తరువాతనే కలరా సోకి చనిపోయారు ఇద్దరు. చనిపోయే ముందు నా గురించి చెప్పి ఇంత ఆస్తికి వారసురాలిని చేసారు. మేము సంతోషంగానే ఉన్నాము. కాకపోతే నాకు నా తోబుట్టువులుగాని కన్నతల్లి తండ్రులుగాని లేరే అన్నబాధ మనసును తొలిచేస్తుంది అప్పుడప్పుడు. ఇది అనుపమ నా కథ! చెప్పు ఎలా ఉంది, ” కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ అడిగింది నందిని. 


“నందిని.. ఇప్పుడా గుర్రంబొమ్మ నీ దగ్గరుందా?, ” తనకేదో అనుమానం వచ్చి అడిగింది అనుపమ. ఉంది అని తలూపింది నందిని. 


“సుచిత్రా ..” పిలిచింది అనుపమ. ఒక్కసారిగా తలతిప్పి అనుపమ వైపు చూసింది నందిని. 


“అనుపమ .. నువ్వు సుచిత్రా అని కదా పిలిచావు, ఆ పేరు నేను ఎక్కడో విన్నట్టు బాగా గుర్తుంది, ఏది మళ్ళీ ఒకసారి పిలువవా.. నాకు ఆ పేరు వినాలని ఉంది, ” మనసంతా గందరగోళం అవుతుండగా అడిగింది. 


“సుచిత్రా .. సుచిత్రా, ” రెండుసార్లు పిలిచింది అనుపమ. నందిలో ఏదో పులకరింత.. ఏవో జ్ఞాపకాల సుడిగుండం మసక మసకగా కనపడుతుంది. 


“ నందిని .. నీకు నా చిన్నప్పుడు జరిగిన సంఘటన ఒకటి చెబుతాను విను, మా నాన్న టీచరు. మేము అప్పుడు రాజమండ్రికి దూరంగా ఒకపల్లెటూరిలో ఉండేవాళ్ళం. మా పక్కింట్లో చౌదరిగారని ఒక కుటుంబం ఉండేది, వాళ్ళమ్మాయికి నాకు మంచి స్నేహం. ఇద్దరం ఇంచుమించు ఒకే వయసు, ఇద్దరం ఒకరిని విడిచి ఒకరం ఉండేవాళ్ళం కాదట.. మా అమ్మ చెప్పేది.


అప్పుడు మాకు నాలుగేళ్ళనుకుంటా.. తన పేరు చెప్పలేదు కదా సుచిత్రా .. ఒకరోజు వాళ్ళకుటుంబం ఏదో పెళ్లికి వెళ్ళి వస్తుంటే ఘోరంగా యాక్సిడెంట్ అయిందట, పాపం సుచిత్ర వాళ్ళమ్మ నాన్నలు అక్కడిక్కడే చనిపోయారట, కానీ సుచిత్ర కోసం పోలీసులు ఎంత వెదికినా కనిపించలేదట. ఏ జంతువులు లాక్కపోయినాయేమో అనుకున్నారట. ఈ విషయం తెలిసి నేను చాలా రోజులవరకు మాములు మనిషిని కాలేదు, అప్పుడు మా నాన్నకు నన్ను చూస్తుంటే భయంవేసి వేరే ఊరికి బదిలీ  చేయించుకున్నాడట. 


కొత్తచోటు కొత్త స్కూలు నేను మళ్ళి మాములైపోయానని వాళ్ళు సంతోషం చెప్పరాదు, కానీ ఊరు మారినా నాకు వయసు వచ్చినా నా చిన్ననాటి స్నేహితురాలి జ్ఞాపకాలు మాత్రం నా హృదయంలో ఉండిపోయాయి, ” కన్నీళ్లు జలజలరాలుతుండగా గొంతు బయటకు రాలేకపోయింది అనుపమకు. 


“అనుపమ.. నువ్వు నువ్వు అంటే నేను నీ చిన్నప్పటి స్నేహితురాలు సుచిత్రను కదా! నువ్వు చెబుతున్నది మనిద్దరి కథ నాకు ఇప్పుడు గుర్తుకు వస్తున్నది, మనం గోదావరి పుష్కరాలలో నా దగ్గరున్న గుర్రంబొమ్మ నాకిష్టమని నువ్వు మీ నాన్నతో కొనిపించి నాకిచ్చావు, నేనేమో నీకిష్టమని కొండపల్లి బొమ్మ కొనిపించి ఇచ్చాను కదూ, ”


అవునని తలూపింది అనుపమ. 


“అనుపమ.. నువ్వు నిజంగా నా ప్రాణస్నేహితురాలివే, ” అంటూ భావోద్వేగంతో ఒకరినొకరు పట్టుకుని కడుపులో ఉన్న వేదనంతా పోయే వరకు దుఃఖించారు. ఆనందం పట్టలేక ఒకరి కౌగిలిలో ఒకరు బిగియారా కౌగిలించుకున్నారు. 

వదిలేస్తే ఎక్కడ వెళ్ళిపోతామోనని ఒకరిని ఒకరు వదలలేకపోతున్నారు. 


“చూసావా అను .. మన స్నేహబంధమా ఎంత గట్టిదో, ఆ ఏడుకొండలవాడి దయవలన మనం కలిసాము కాదు కాదు ఆయనే మనల్ని కలిపాడు, నేను పర్సు పడేసుకోవడమేంటి.. అది నీకే దొరకడం నువ్వు నా దగ్గరకు వచ్చి నాకివ్వడం, అంటే ఇది మనిద్దరం కలవడానికే ఆ దేవుడు ఇలా చేసాడేమో, ఏదైతేనేమి నా చిన్ననాటి స్నేహితురాలు నాకుంది నాకది చాలు, ” తన్మయత్వంతో అనుపమ ఒడిలో తలపెట్టుకుని పడుకుంది. 


“అవును సుచిత్రా.. నేను ఇప్పటికి నమ్మలేకపోతున్నాను తెలుసా? ఇలా జరగాలని ఉంది కనుకనే ఎంతో ఇబ్బంది అయినా తిరుపతికి రాగలిగాము, నీకే తెలుసోలేదు సుచిత్రా.. నీ ఫోటో చూడని రోజు ఉండందంటే నువ్వు నమ్ముతావా, ” అంటూ తన ఫోన్ లో గుర్రంబొమ్మ పట్టుకుని సుచిత్ర కొండపల్లి బొమ్మ పట్టుకుని అనుపమ దిగిన ఫోటో చూపించింది సుచిత్రకు. 


ఫోటో చూస్తుంటే సుచిత్రకు ఆనందంతో నోటమాట రావడంలేదు. అనుపమ చేతులను పట్టుకుని కళ్ళకు ఆనించుకుంది. అనుపమకు కూడా ఎక్కడలేని సంతోషంతో మనసంతా ఉరుకులు పరుగులు పెడుతుంటే, గబగబా లేచి వెళ్ళి భర్తకు చెప్పింది అనందం తట్టుకోలేపోతుంది. అంతా విన్న రమేశ్ వాసు ఆశ్చర్యపోయారు. 


“మీరు చాలా అదృష్టవంతులు ఇన్నేళ్ళకయినా మీరిద్దరు ఒకటయ్యారు, మీ స్నేహబంధం చాలా గట్టిది సుమా, ” నవ్వుతూ అన్నాడు రమేశ్. 


“అంతేకాదు రమేశ్ .. మా నందిని చాలా అదృష్టవంతురాలు, ఇంతమంచి స్నేహితురాలు తనకున్నదంటే తనకింకేమి వద్దు, తను ఎప్పుడు ఒంటరిని అని బాధపడేది. ఇప్పుడు స్నేహపరిమళం అందించే స్నేహితురాలు దొరికింది కదా! తనకు ఆ తృప్తి చాలు, స్నేహానికన్న మిన్న లోకాన ఏది లేదురా, ” అంటూ పాట పాడుతూ ఆప్యాయంగా నందిని దగ్గరకు తీసుకున్నాడు వాసు. సుచిత్ర అనుపమ మనసులు ఆనందంలో తేలియాడుతున్నాయి. 

******* ********** ********** **********


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

 

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 













 


 










 









 


166 views0 comments

Comments


bottom of page