top of page

ట్రిక్

#SudhavishwamAkondi, #Trick, #ట్రిక్ , #సుధావిశ్వంఆకొండి, #TeluguStories, #తెలుగుకథలు, #గల్పిక


Trick - New Telugu Story Written By - Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 15/03/2025 

ట్రిక్తెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



"అబ్బా! త్వరగా పదవే! సినిమా స్టార్ట్ అయిపోతుంది. అసలే నా ఫేవరైట్ హీరో సినిమా. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు చూస్తే ఆ కిక్కే వేరు! నేను నా స్కూటీ తీసి, రెడీ ఉంటా! నువ్వు రూమ్ కి లాక్ చేసేసి త్వరగా వచ్చేయ్!" అని తన ఫ్రెండ్, రూమ్మేటు అయిన పల్లవితో చెప్పేసి, పార్కింగ్ ఏరియా కి నడిచింది దీపిక.


దీపిక, పల్లవి ఇద్దరూ రిలేటివ్స్ నే అయినా, అంతకుమించి క్లోజ్ ఫ్రెండ్స్. చదువు అయ్యాక, ఈ మధ్యే ఓ సాఫ్ట్వేర్ కంపెనీ లో జాయిన్ అయ్యారు. ఒకే స్కూల్, ఒకే క్లాస్ తో మొదలైన వారి స్నేహం పెరుగుతూ పోయింది వారితో పాటుగా. చివరకు జాబ్ కూడా ఒకే కంపెనీ లో దొరికింది అదృష్టవశాత్తూ. తెలిసిన వాళ్ళ ద్వారా ఒక సింగిల్ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. 


ఇద్దరూ కలిసి వుంటున్నారు అందులో. ఇద్దరి ఊరు ఒక్కటే. ఇద్దరికీ పెద్దవాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. 


పెళ్లి అయ్యేలోపే, హాయిగా ఇష్టం ఉన్న సినిమాలు చూస్తూ ఇద్దరూ ఎంజాయ్ చేయాలని వాళ్ళ ప్లాన్. పబ్బులు, డ్రింకింగ్ లాంటివి నచ్చవు ఇద్దరికీ. కేవలం సినిమాలు చూడడం ఒక్కటే ఇష్టం. పెళ్లయ్యాక ఎలా ఉంటుందోనని వాళ్ళ సందేహం. అందుకే కొత్త సినిమా రాగానే వెళ్ళిపోతారు. ఇక ఇష్టమైన హీరో, హీరోయిన్ సినిమాలు అయితే చెప్పక్కర్లేదు. అలాగే ఈరోజు బయలుదేరుతున్నారు. 


"ఆ.. ఛలో!.. " అంది పల్లవి.


"అబ్బా! లాక్ చేసి రావడానికి ఇంతసేపా?" అని విసుక్కుంది దీపిక


"అదే నాకు ఇష్టమైన హీరో సినిమా అయితే ఇలా అనేదానివా? నువ్వే లేట్ చేసేదానివి. అందుకే నీకు ఆ బాధ చూపిద్దామని.. " అంటూ నవ్వింది పల్లవి.


"చాల్లేవే నీ రివెంజ్! పదా! నీతో వాదిస్తే లేట్ అయిపోతుంది" అని, పల్లవి ఎక్కగానే బండి స్టార్ట్ చేసింది దీపిక. 


ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్న దీపిక ఓ చోట సిగ్నల్ సమీపిస్తుండగానే బండి స్లో చేసి, ఆపింది ఓ పక్కగా. 


"ఏంటే! ఏమయ్యింది? సడెన్ గా బండి ఆపేశావు? ఇష్టమైన హీరో సినిమా అన్నావు" అని అడిగింది పల్లవి.


"అటు చూడు!" అని చేత్తో అటువైపు చూపించింది.


అక్కడ ట్రాఫిక్ పోలీసులు వున్నారు. వ్యాన్ ఓ పక్కన ఆపి ఉంది. టు వీలర్స్ ఆపేసి, చెక్ చేస్తున్నారు. 


"అయితే ఏంటి? పోదాం పదా! పేపర్లు అన్నీ ఉన్నాయిగా మన వద్ద"


"అబ్బా! అన్నీ వున్నా, ఏదో ఒకటి రీజన్ చెప్పి, ఆపేస్తారు. డబ్బులు లాగడానికి ఏదో ఒకటి చెబుతారు. అదే నా టెన్షన్. మనం ఇదే రూట్ లో వెళ్లాల్సి ఉంది. ఏ ట్రిక్ వేసి, ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్నా!" అంటూ టెన్షన్ గా అటు చూస్తోంది. 


అప్పుడు అక్కడ జరిగిన ఒక సీన్ చూసి, ఆమె బుర్రలో బల్బ్ వెలిగింది. 


అక్కడ.. 


బైక్ పై ఓ కుర్రాడు వీళ్ళు ఉన్న ప్లేస్ వరకూ వస్తూ స్లో చేసి, పోలీసులు ఉండడం అంత దూరం నుంచి చూసాడు. వెంటనే ఓ ఐడియా ఆలోచించి, బైక్ ఆపేసాడు. 


హెల్మెట్ తీసి, బైక్ కి తగిలించి, బైక్ ను తోసుకుంటూ ముందుకు వెళ్ళాడు ఆపసోపాలు పడుతూ. ఎదురుగా వచ్చిన కానిస్టేబుల్ తో.. 

"సార్! ఇక్కడ దగ్గర్లో పెట్రోల్ బంక్ ఎక్కడుంది?" అని అడిగాడు


ఈ పక్కన ఉందని అతను చూపించాడు. ఆ బైక్ ను ఆపలేదు. అతను అలాగే కొద్దిదూరం తోసుకుంటూ వెళ్లి, తర్వాత స్టార్ట్ చేసుకుని, వెళ్ళిపోయాడు. అతడు వేసిన ట్రిక్ బాగా నచ్చింది దీపికకు. 


 ఇది చూసి.. 

 "మనమూ అతడు వేసిన ట్రిక్ ఫాలో అయిపోయి, అలాగే వెళదాం! నువ్వు కూడా నెమ్మదిగా తొయ్యి!" అంది దీపిక.


అలాగే తోసుకుంటూ వెళ్ళసాగారు. పోలీసులు ఉన్న ప్లేస్ దాకా వచ్చారు. ఎంతో ఇష్టమైన సస్పెన్స్ సినిమా చూసేటప్పుడు ఎలా ఉంటుందో అలా లోపల టెన్షన్ గా ఉంది ఇద్దరికీ. అక్కడున్న పోలీసులు చూసారు. కానీ ఆపలేదు. 


"హమ్మయ్య! దాటేసాం" అని అనుకుంటూ వున్నారు. 


ఇంతలో.. 

"ఏయ్ అమ్మాయిలూ! ఆగండి!" అని వినబడింది వెనక నుంచి.


'ఇక ఇరుక్కున్నామురా బాబోయ్!' అని అనుకుని, ఉస్సూరుమంటూ వెనక్కి చూసారు. 


వెనక్కి చూస్తే, ఎస్సై ఏమో వీళ్ళ వద్దకు ఫాస్ట్ గా వస్తున్నాడు. హుందాగా చూడడానికి బాగానే వున్నాడు. 


"ఆగమంటే అలాగే వెళుతున్నారు!" అన్నాడు అధికారికంగా


"సార్! ఇదీ.. బరువుగా ఉంది.. " అంటూ నసిగింది పల్లవి బండిని చూపిస్తూ


"అందుకే ఆగమన్నాను. ఎంతసేపు తోసుకుంటూ వెళతారు? ఏమైంది బండికి?"


"ఏమో సార్! మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ స్టార్ట్ అవ్వట్లేదు. అందుకే ఇక్కడ ఏదో మెకానిక్ షాప్ ఉందని అక్కడ ఎవరో చెప్పారు. అందుకని.. " అని నోటికొచ్చినట్లుగా చెబుతూ ఆగింది.


"ఓ! అలాగా! మా కానిస్టేబుల్ హెల్ప్ చేస్తాడు. ఒక్క నిముషం!" అని అక్కడున్న ఒక కానిస్టేబుల్ ను పిలిచాడు.


 "సార్!" అంటూ వచ్చాడతను.


"పాపం ఆడపిల్లలు బండితో ఇబ్బంది పడుతున్నారు. బండి ట్రబుల్ ఇచ్చిందట! నీకు రిపేర్లు చేయడం కొంచెం తెలుసుగా! ఓ సారి చూడు. కొద్దిదూరం వెళ్లగలిగితే చాలు!. ఆ తర్వాత షాప్ లో చూపిస్తారు" అన్నాడు.


"అలాగే సార్!" అని


వీళ్ళతో.. 


"ఏం ప్రాబ్లేమ్ వచ్చిందమ్మా?" అన్నాడు.


 "స్టార్ట్ అవ్వట్లేదండీ!"


 కొంచెం చెక్ చేసి, 'కీ' పెట్టి స్టార్ట్ చేసాడు. బండి స్టార్ట్ అయ్యింది. స్నేహితురాళ్ళిద్దరికీ భయం వేసింది. నిజం తెలిసిపోతుందేమోనని టెన్షన్ పెరిగింది. 


"స్టార్ట్ అయ్యింది సార్!" అన్నాడు ఉత్సాహంగా ఆ కానిస్టేబుల్, తనే రిపేర్ చేసి, బాగు చేసినట్లుగా ఫోజ్ కొడుతూ.


"ఓహ్! గుడ్! నువ్వు అసాధ్యుడివయ్యా!" అతనితో అని 


"అమ్మాయ్! ఎక్కడికి వెళుతున్నారు మీరు?" అని అడిగాడు.


"సార్! సినిమా కోసం.. "


"ఇద్దరే వెళుతున్నారా? జాగ్రత్తగా వెళ్ళండి. ఒంటరిగా వెళ్ళకండీ ఎప్పుడూ" అంటూ జాగ్రత్తలు చెప్పి పొమ్మన్నాడు.


వెంటనే బండి స్టార్ట్ చేసి, పరుగులు తీయించారు. ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు. ప్రకటనలు వస్తున్నాయి. సీట్స్ చూసుకుని, సెటిల్ అయ్యారు. 


"భయపడతాం కానీ పోలీసుల్లో కూడా మంచివాళ్లు ఉన్నారే! ఎంత బాగా మాట్లాడాడు ఆ ఎస్సై! నాకైతే మా పెద్దన్నయ్య గుర్తుకు వచ్చాడు" అంది పల్లవి ఎమోషనల్ అయిపోయి.


అవునని తలవూపింది దీపిక. ఇంతలో సినిమా మొదలయ్యింది. చూడడంలో మునిగిపోయారు. 


అన్ని డిపార్ట్మెంటుల్లో మంచివాళ్ళూ, చెడ్డవాళ్ళు రెండు రకాల వాళ్ళు వుంటారు. మనిషి తత్వాన్ని బట్టి అనుకోవాలి కానీ ప్రాంతాన్ని బట్టి, కుల, మత, జాతిని బట్టి మంచి, చెడు ఉండదు. డిపార్ట్మెంట్ ను బట్టి, వృత్తిని బట్టి మంచి, చెడు నిర్ణయించడం తప్పు. 


  ###


సుధావిశ్వం ఆకొండి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!

 కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది.  ప్రస్తుత నివాసం ఢిల్లీ.




Comments


bottom of page