top of page

ఉగాది విశిష్టత

#SudhavishwamAkondi, #HolyPandugaHolikaPournami, #హోలీపండుగహోళికాపౌర్ణమి, #సుధావిశ్వంఆకొండి, #TeluguArticleOnHoli, #తెలుగువ్యాసం

అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు

��������������������


Ugadi Visishtatha - New Telugu Article Written By - Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 30/03/2025 

ఉగాది విశిష్టత - తెలుగు వ్యాసం

రచన: సుధావిశ్వం ఆకొండి


చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన పరమాత్మ, వేదాలను అపహరించిన సోమకుడు అనే రాక్షసుని సంహరించి వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ పండుగ జరుపుకోవడం ఆచరణ లోనికి వచ్చినట్లుగా పురాణప్రతీతి అని పెద్దలు చెబుతారు. 


బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాసం, శుక్లపక్షం, ప్రథమ దినాన అంటే పాడ్యమి రోజున సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాలుగా కాలగణనాన్ని బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడని పెద్దల భావన! 


శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక చారిత్రక గాథ.


 శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా వుంటుంది. కోయిలలు కుహూకుహూ అని పాడుతాయి.

 ఆ వసంత ఋతువు ఇప్పుడే మొదలవుతుంది. చెట్లు చిగుళ్లు వేయడం మొదలు అవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారని అంటారు. 


”ఉగాది”,, “యుగాది” అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. “ఉగ” అనగా నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ‘ఆది’ ‘ఉగాది’ అంటే సృష్టి ఆరంభమైన దినమే “ఉగాది” అని అర్థం. 


‘యుగము’ అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము! ఉత్తరాయణం, దక్షిణాయనం కలిపి ఆయన ద్వయం (రెండు) కలిసినది యుగం అంటే సంవత్సరం. ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా పిలవడం జరుగుతోంది.


ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక ఈ సవత్సరాది పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో జరుపుకుంటారు. కానీ వారి కాలమానం ప్రకారం వేరే నెలలు, తేదీల్లో వస్తాయి. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా జరుపుకుంటారు. 


అయితే మరాఠీలు గుడి పడ్వాగా, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ సవత్సరాదిని జరుపుకుంటారు.


 ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం ఈ పండుగ!


ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారికి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి! 


ఈ రోజు ఉదయాన్నే లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచు కుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడి తయారు చేసి, భగవంతునికి నివేదన చేసి, ఆ పచ్చడిని తినడంతో దినచర్య ప్రారంభిస్తారు. 


ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది! షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి! తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడిని సేవించి, మనిషి జీవితంలోని అనుభవాలను షడ్రుచుల సమ్మేళనంగా చూపిస్తారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.


ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి కూడా కొందరు వాడుతుంటారు.

 ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేయగా, అక్కడ ఈ పండుగ గుడిపడ్వాగా పేరు పొందిందని చెబుతారు. 


ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది. ఆ సంవత్సరంలో జరిగే మంచి చెడులను, ఆదాయ, వ్యయాలను తమ భావి జీవితం క్రమం తెలుసుకొని దాని కనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడం చేస్తుంటారు. దేశ భవిష్యత్తు గురించి, ప్రకృతి సంబంధిత విషయాలను గురించి పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటారు.

 కవితా పఠనం, కవులను సన్మానించడం వంటివి చేయడం కూడా మన తెలుగువారి ఆనవాయితీ. 

 

తెలుగు సంవత్సరాలు అరవై. క్రోధి నామ సంవత్సరం తర్వాత విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం! విశ్వావసు సంవత్సరం అన్నివిధాల శుభాలను కలిగిస్తుందని పండితుల ఉవాచ! 


కొత్తగా చిగుళ్లు వేస్తున్న క్రొంగొత్త ఆశలతో, ఆలోచనలతో షడ్రుచుల మేలు కలయికతో, అన్ని రుచులు ఆస్వాదిస్తూ హాయిగా, ప్రశాంతంగా అందరికీ మంచిని పంచుతూ అందరి జీవితాలు సంవత్సరం అంతా సులభంగా సాగిపోయేలా చేయమని ఆ పరంధాముని సదా ప్రార్థన చేస్తూ సంవత్సరానికి శుభ స్వాగతం పలుకుదాం!


సర్వే జనా సుఖినోభవంతు! సమస్త సన్మంగళానిభవంతు!


శ్రీకృష్ణార్పణమస్తు

����������

సుధావిశ్వం


  ###


సుధావిశ్వం ఆకొండి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!

 కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది.  ప్రస్తుత నివాసం ఢిల్లీ.




Comments


bottom of page