top of page

ఉండిపోరాదే నాన్నా ! ?

గమనిక : ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి 2021 కథల పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకుంది. ఎంపికలో పాఠకుల అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకున్నాం.


'Undiporade Nanna' written by K. B. Krishna

రచన : -- కె .బి.కృష్ణ

బెడ్ రూమ్ కిటికీ లోంచి కనిపించే వేప చెట్టు కొమ్మ మీద తల్లి కాకి, గులాబీ రంగులో ఉన్న తన నోటి ని ఆత్రంగా తెరిచిన పిల్ల కాకికి తాను తెచ్చిన ఆహారం దాని నోట్లో కుక్కుతోంది. పిల్ల కాకి గోల చేస్తూ రెక్కలు ఆడిస్తూతింటోంది. తల్లి కాకి ముక్కుతో పిల్ల కాకి వళ్లంతా సవరిస్తోంది.

ఏమిటీ సృష్టి వైచిత్రం ? మనుషుల్లోను, సకల జీవ రాశుల్లోనూ తల్లీ పిల్లల అనుబంధం అపురూపంగా ఒకేలా ఉంటుందేం ?

ఆలోచనల్లో ఉన్న రాణి “ అమ్మా -- “ అన్న పిలుపు తో వెనక్కు తిరిగింది. చిన్నిగాడు నిద్ర లేస్తూనే “ అమ్మా

నా బర్త్ డే వచ్చేస్తోంది కదా, నాన్న రాకపోతే నేను బర్త్ డే చేసుకోను లేదంటే మనమే దుబాయ్ వెళ్ళిపోదాం. ఓ.కే !! అన్నాడు రాణి తో.

రాణి సాఫ్ట్ వేర్ ఇంజనీర్. సుమారు ఆరు అడుగుల ఎత్తు వున్న తన భర్త రాజా భుజాల దగ్గరకు వస్తుంది రాణి . గంధపు రంగులో ఉంటుంది. ఎప్పుడూ గులాబీ, పింక్, ఎరుపు, వంకాయ

రంగుల డ్రెస్ లు వేసుకుని, ఎత్తుకు తగిన పుష్టికరమైన వయ్యారపు శరీరంతో ఏ బట్టలు

వేసుకున్నా వంటికి అంటుకుపోయి నయనాందకరంగా ఉంటుంది. ఆమె జుట్టు బిరుసు గా ఉండడంతో చందమామ వంటి ముఖం మీద మబ్బు తునకల్లా వెంట్రుకలు అడ్డుపడి మగాళ్లకు మత్తె క్కించే విశాల నేత్రాలు, పొడవాటి ముక్కు కింద లిప్ స్టిక్ అవసరం లేని గులాబీ పెదవులూ, బుల్లి గెడ్డం, మగవాడిని మొదటి చూపులోనే వివశుణ్ణి చేసే అపురూప లావణ్యం ---

సంవత్సరం క్రితం బైక్ యాక్సిడెంట్ లో ఆమె భర్త రాజా మరణిస్తే, అప్పటికి రెండేళ్ల వయసు దాటిన చిన్నిగాడికి నాన్నకు దుబాయ్ లో మంచి ఆఫర్ వచ్చింది త్వరలో మనల్ని తీసుకువెళ్తారు ఈ లోగా ఒకసారి వస్తారులే -- అంటూ -- మాయ మాటలు చెప్పి కాలం గడుపుతోంది.

కానీ ఇప్పుడెలా ? ఇప్పటివరకూ దుబాయ్ లో ఉన్నారని, మిమిక్రి సాయం తో ఫోన్ లో కనెక్ట్ చేసి, మాట్లాడించి మోసం చేస్తూ వస్తోంది. కానీ ఆయన్ను తీసుకు రావడం అసాధ్యం.

భగవాన్ నాకీ పరీక్ష పెట్టావేమిటి ? అని కుమిలిపోసాగింది రాణి.

వాడు తల్లిని గట్టిగా పట్టుకుని నిద్ర పోతున్నాడు.

రాణి నెమ్మదిగా వాడిని వదిలించుకుని, డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరింది. ట్రింగ్ ట్రింగ్ --

సెల్ లోంచి శబ్దాలు వస్తున్నాయి. విసుక్కుంటూ వెళ్లి సెల్ ఓపెన్ చేసింది. ఒక వాట్సాప్

గ్రూప్ లో ఒక పోస్టింగ్ ఆమెను ఆకర్షించింది.

“కిరాయికి నాన్న కావాలా -- ఆశ్చర్యపోతున్నారు కదూ -- చదవండి మరి !! ”

మానవ జీవితం లో అమ్మ ,నాన్న లకు ఎంతో ప్రాముఖ్యత ఉందని మేము చెప్పవలసిన అవసరం లేదు. అయితే దురదృష్టవశాత్తూ దైవలీల లో కొంతమంది పిల్లలకు తమ తండ్రులు అకస్మాత్తుగా మరణించడం మనం చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు వారి చిన్న పిల్లలు “ నాన్న కావాలి “ అని మారాము చెయ్యడం, లేదా చనిపోయిన వారి తండ్రి కోసం బెంగపెట్టుకుని విపరీతమైన జబ్బు పడడం కొన్ని సమయాలలో మరణించడం జరుగుతోంటుంది. దీనికి మేము ఒక ఉపాయం ఆలోచించాము. చనిపోయిన తండ్రి స్థానం లో తండ్రి కోసం బెంగ పెట్టుకున్న ఆ పిల్లల కోసం సరిగ్గా అలాంటి తండ్రిని వారి ఇంటికి పంపిస్తాము. ఏ మాత్రం తేడా లేకుండా వారి తండ్రి లాంటి వారినే కఠిన శిక్షణ ఇచ్చి పంపుతాము. దీనికి చాలా జాగ్రత్తలు తీసుకుంటాము. ఇలా తాత్కాలిక తండ్రి అదే !

“ కిరాయికి నాన్న ”కావాలని మీరు కోరుకుంటుంటే వెంటనే ఈ క్రింది సెల్ నెంబర్ తో సంప్రదించండి. ఇది సాధ్యం కాదని మీరు అనుకుంటున్నారు కదూ -- సాధ్యమే ! “” అంటూ ముగిసిందా పోస్టింగ్.

ఈ ప్రకటన చదివిన రాణీకి తన శరీరం లోని నవ నాడులకూ ఎనర్జీ ఇంజక్షన్ ఇచ్చినట్లుగా అపూర్వ శక్తి వచ్చేసింది. లేచి నిలబడి రిలాక్సింగ్ గా వొళ్ళు విరుచుకుంది.

వెంటనే సెల్ తీసి వాట్సాప్ లో ఇచ్చిన నెంబర్ కి రింగ్ చేసింది. రింగ్ టోన్ మోగుతుంటే రాణి గుండెల మీద ఎవరో తడుతున్నట్లు అనుభూతి. అసలు వాళ్ళు ఏమి చెబుతారో, అసలు తండ్రి ని ఎలా సృష్టిస్తారు ? ఏమిటీ పిచ్చి ఆలోచన వచ్చింది వాళ్లకి అనుకుంటూ ఉండగా --

“ హలో -- “ అంటూ ఒక సమ్మోహన పరిచే గొంతు తో ఒక అమ్మాయి పలికింది అటు వేపు నుండి --

“ హలో -- నా పేరు రాణి, నేను స్థానికం గా ఒక కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని.

మాకు వివాహమైంది, మాకు ఒకే ఒక్క ముద్దుల బాబు. త్వరలో వాడికి మూడవ బర్త్ డే --

“ఆమె మాటలకు అడ్డు వస్తూ “ మాకు ఫోన్ చేసినందుకు మమ్మల్ని సంప్రదించినందుకు

కృతజ్ఞతలు మేమ్ -- మీ అబ్బాయి తన బర్త్ డే కి తండ్రి కావాలంటున్నాడు, అవునా ?

మాకు తెలుసును, అయినా చెప్పండి -- “అంది --

“మా శ్రీవారు బైక్ యాక్సిడెంట్ లో మరణించి సుమారు సంవత్సరం కావస్తోంది.

ఆయన మంచి జీతంతో ఉద్యోగం వచ్చి అర్జెంటుగా వెళ్లారని చెప్పి మా బాబుకు చెప్పి

కాలక్షేపం చేస్తున్నాను. ఆయన లేని మొదటి పుట్టినరోజు ఇదే ! వాడు తన తండ్రి లేకుండా

బర్త్ డే జరుపుకోనని మారాం చేస్తున్నాడు లేదంటే దుబాయ్ వెళదాం అంటున్నాడు. లేకపోతే

అస్సలు బర్త్ డే చేసుకోను అంటున్నాడు. నేను ఈ టెన్షన్ లో ఉండగా వాట్సాప్ గ్రూప్ లో మీ

పోస్టింగ్ కనిపించింది. మీకూ మీ అద్భుతమైన ఆలోచనకు నా హృదయపూర్వక

ధన్యవాదాలు, కృతజ్ఞతలు. --” అని రాణి ఉద్వేగంగా మాట్లాడుతోంటే, ఆమె అడ్డు తగిలి ---

“మేడం -- మీకు కిరాయికి ఒక రోజు బర్త్ డే కి నాన్న కావాలి. అంతే కదా ! మాకు

కావాల్సిన కొన్ని విషయాలు చెబుతాను. అవన్నీ మాకు మీరు ఇచ్చేసి, కొంత గడువు ఇస్తే

మీ ఇంటికి మీ చిన్నారి బాబు కు తండ్రి వచ్చేస్తాడు. దీనికి మీరు చేయవలసిందల్లా --- ఒక

కాగితం మీద రాసుకోండి. చెబుతాను -- “ అంది ఆ అమ్మాయి.

“ జస్ట్ ఏ మినిట్ నోట్ బుక్ లో రాసుకుంటాను “ అని అని రాణి ఒక ప్యాకెట్ నోట్ బుక్ తీసుకుని “ ఎస్-- ఓ.కె చెప్పండి -- బై ది బై ఈ రోజు ఏడవ తారీఖు కదా. వచ్చే నెల వదిలేసి ఆ పై నెలలో తొమ్మిదో తేదీన బాబు బర్త్ డే. ఆ రోజు తెల్లవారుఝాము నుండి రాత్రి బాబు నిద్రపోయేవరకూ నాన్న కావాలి. తెల్లవారేసరికి అర్జెంటు గా దుబాయ్ వెళ్లిపోయారని చెబుతాను. --” అంది రాణి.

‘’ మీ వారు మీ ఇంట్లో ప్రవర్తించే విధానం, మీ బాబును బుజ్జగించే తీరు, ఆడుకుంటుంటేను , ఇలాగ ఎన్ని వీడియోలు ఉంటే అన్నీ పంపండి. తరువాత ఆయన ఫోటోలు అన్నీ యాంగిల్సు లోను సెల్ లో పంపండి. తరువాత మిమ్మల్ని ఆయన ఏమని పిలుస్తారు, ఎన్ని వివరాలు పంపితే మాకు అంత ఉపయోగం., తరువాత మీకు మీ భర్త ఎంత సమయం మీ ఇంట్లో ఉండాలి, ? సందర్భం ఏమిటి ? తరువాత చాలా ముఖ్యమైన విషయం. మీ భర్త మరణించారని మీ ఇరుగు పొరుగు తెలుసును కాబట్టి, ఇప్పుడు మీ దగ్గరకు ఎప్పుడు అద్దె భర్త వస్తారో,ఆ సమయానికి ముందూ వెనుకా, ఒక నాలుగైదు రోజులు మీరు ఎవరితోనూ మాట్లాడకుండా ఉండాలి.

తరువాత మీ బాబుని కూడా ఎవరింటికి పంపకపోవడం మంచిది. ఓ .కే -- నేను ఇంకా ఏవైనా కావాలంటే ఫోన్ చేస్తుంటాను, ఏమీ అనుకోకండి. -- బై -- “ అని ఫోన్ పెట్టేసిందా అమ్మాయి. ఆవేళ డే కేర్ సెంటర్ నుండి బాబు ని తీసుకువస్తూ -- -- చిన్నీ నీ కో గుడ్ న్యూస్ -- మీ నాన్నగారు నీ బర్త్ డే కి వస్తున్నారు. ఆ వేళ హ్యాపీ గా మనం పండగ చేసుకుందాం అన్నదో లేదో -- ఇక చిన్ని గాడి సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. వాడు గంధపు రంగు లో బూరెల్లాంటి బుగ్గలతో పేస్ట్, సబ్బుల ప్రకటనల్లో చూపించే చిన్నారి లాగా వర్ణించడానికి పదాలు చాలనంత అందం గా ఉన్నాడు. వాడి తండ్రి ఎలా వదిలివెళ్ళిపోయాడో అని బాధ పడాల్సి వస్తుంది చూసిన వారికి. కానీ మానవ జీవితం లో చెప్పివెళ్లడానికి గాని అయ్యో మా వాళ్ళని కొంతకాలం తనివితీరా చూసుకుని వస్తాను అని పర్మిషన్ తీసుకుని నింపాది గా వస్తాను అంటే వింటారా యమభటులు? ఏమిటో ఆమె కు తన చిన్నారిని చూస్తోంటే గుండెలు కలుక్కుమన్నాయి.--

రోజులు భారం గా గడుస్తున్నాయి. రెండు రోజులకోసారి వాళ్ళు ఫోన్ చేసి ఎదో ఒక విషయం అడుగుతూనే ఉన్నారు, రాణి చెబుతూనే ఉంది. రాణీ -- చిన్నా షాపింగ్ కి వెళ్లారు. చిన్న తనకు కావాలని మెరూన్ కలర్ లో సూటు కొనుక్కున్నాడు. తన తండ్రి కోసం నేవీ బ్లూ కలర్ సూటింగ్ కొనిపించాడు. ఏమిటో ఋణానుబంధం డాడీ గా వచ్చిన అతనికి లక్ష రూపాయల పైగా -- కంపెనీ కి పేమెంట్ ఇవ్వాలి, అదీకాకుండా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి -- కానీ ఇప్పుడు సూట్ కొనడం తో కొంచెం డబ్బు ఎక్కువైంది.. కొనకపోతే వాడు ఊరుకోడు --

“ చిన్నీ రేపు నీ బర్త్ డే కదా -- మీ నాన్నగారు తెల్లవారుఝామున వస్తారు. నిన్ను నిద్ర లేపుతాను పడుకో నాన్నా -- “ అని వాడిని తన ప్రక్కలో పడుకోబెట్టుకుని తానూ నిద్రపోయింది.

తెల్లవారుఝామున కాలింగ్ బెల్ మోగింది. విపరీతమైన టెన్షన్ తో నిద్ర లేచింది రాణి. తనకు అస్సలు ఏ మాత్రం పరిచయం లేని సరికొత్త వ్యక్తి తో ఒక రోజంతా గడపాలి. అతను తన భర్త కు డూప్ గా వస్తున్నాడు. నిజ జీవితం లో ఎన్నడూ జరగని సరికొత్త సంఘటన.

రాణీ కి చాలా భయం గా ఉంది. చిన్ని గాడి కోసం ఈ సాహసం చేసింది ఏం ప్రమాదం ముంచుకు రాకుండా ఉంటే చాలు, సుమారు పద్దెనిమిది గంటలు పరాయి వ్యక్తి ని ఇంట్లో ఉంచుకోవాలి, రాణి గుండెలు గుబగుబ లాడేయి టెన్షన్ తో -- తలుపు తీసింది రాణి, ఎదురుగా -- ఆరడుగుల కు రెండు అంగుళాల తక్కువ పొడవు లో ఎత్తుకు తగిన శరీర పుష్టి లో నీలం రంగు జీన్సు ప్యాంటు మీద నల్లని టి. షర్ట్ లో మెరుగైన చామన ఛాయ రంగు లో సమ్మర్ కటింగ్ లో, సన్నని కళ్లద్దాల వెనుక వశీకరణ శక్తి ఉన్నట్లు గా విశాల నేత్రాలలో అబ్బ ! అచ్చు రాజా లాగే ఉన్నాడు. మరి ప్రపంచం లో మనిషి ని పోలిన మనుషులు కొంతమంది ఉంటారుట అది నిజమేనేమో --- రాణి గుండె ఝల్లుమంది. ఒక్కసారి శరీరమంతా కింద నుండి పై దాకా మైకం కమ్మింది -- తన్మయురాలై చూస్తున్న ఆమె ను గమనించి “” మేడం మే ఐ కమిన్ ? “” అన్నాడు రాణి ని చిరునవ్వు తో చూస్తూ --

“ ఎస్ -- అని దారికి తప్పుకుంది. వెంటనే అతను తన సెల్ ఫోన్ ఆమెకు ఇచ్చి “ మాట్లాడండి, భయపడకండి -- “ అన్నాడు.

“మేమ్ -- నమస్కారం. పరాయి పురుషుణ్ణి ఉదయం నుండి రాత్రి దాకా ఇంట్లో దగ్గరగా ఉంచుకొని, ఎలా మెలగాలా అని వర్రీ పడుతున్నారు కదూ. మేము మీ దగ్గరకు పంపే వ్యక్తి కి కఠోర శిక్షణ ఇస్తాం. ఒకవేళ అతను మీ అందచందాలు చూసి మైకం కమ్మి శృతి తప్పకుండా, అతని ప్రతీ కదలికా మా కార్యాలయం లోని కంప్యూటర్ లో పరిశీలిస్తూనే ఉంటాం. అందువలన భయపడకండి. గో ఎహెడ్ -- “” అంటూ ఫోన్ నొక్కేసింది.

అతను చకచకా లోపలకు వచ్చేసి “ రాణీ మన డ్రామా మొదలైంది పద లోపలకు --

“అంటూ బెడ్ రూమ్ లో ప్రవేశించి హాంగర్లు కి ఉన్న రాజా వేసుకునే షార్ట్, టి. షర్ట్ వేసేసుకుని మరుక్షణమే లో చిన్ని గాడి ప్రక్కలో పడుకుని, రాణీ ని కూడా బాబు కు అటువైపు దగ్గరగా పడుకోమని సైగ చేశాడు. టెన్షన్ తో శరీరం చెమటలు పడుతోంటే బాబు పక్కనే పడుకుంది రాణి. “ నానీ నిద్ర లేవరా -- నేను దుబాయ్ నుంచి నీ బర్త్ డే కోసం వచ్చేశాను రా -- “

అంటూ చిన్ని గాడి చెవుల దగ్గర ముఖం పెట్టి గారాబంగా పిలిచాడు అతను, మరుక్షణమే లేచి పోయాడు చిన్నిగాడు. లేచి తండ్రి ని గట్టి గా కావలించేసుకుని-- “ చూడండి నాన్నగారూ -- మీరు దుబాయ్ నుండి రావడం కుదరదనీ, నన్ను మాయ చేస్తోంది అమ్మ -- అమ్మను కొట్టండి మీరు అమ్మకు అస్సలు భయం లేదు -- “ అంటూ బుంగమూతి తో గారాలు పోతోంటే “ డియర్ తప్పు కదూ -- చిన్నిగాడి కోసం నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు రెక్కలు కట్టుకుని ఎగిరి వచ్చేస్తాను కదా -- “ అంటూ రాణి వీపు మీద ఒక్క చరుపు చరిచాడు.

వెంటనే వాడు “ నాన్న గారూ అదేమిటీ మీరు విమానం లో రాలేదా ? రెక్కలు కట్టుకోవడం ఏమిటీ --” అన్నాడు చిన్నిగాడు -- వెంటనే అతను రాణి వేపు చూసి కన్నుకొట్టి “ వొత్తినే ఆలా అంటాం కానీ విమానమే ఎక్కి వచ్చానురా --” అన్నాడు. ఈ లోగా తెల్లవారింది.

చిన్నిగాడిని వాష్ బేసిన్ దగ్గరకు తీసుకెళ్లి రాజా ముద్దులాడినట్లుగానే వాడి వళ్లంతా నిమురుతూ బ్రష్ చేయించాడు, బ్రష్ చేయిస్తూ వాడి వళ్లంతా ఆప్యాయతా అనురాగాలు కురిపిస్తూ వాడిని మురిపిస్తున్నాడు. వాడి కళ్ళల్లో ఆనందరేఖలు అలుముకుని వాడి ముఖారవిందం వింత కాంతులీనుతోంది. “ చిన్నీ నువ్వేమో వెంటనే కాక్కు వెళ్ళాలి నేనేమో తరువాత శుభ్రం గా కడిగేసి, ఇంచెక్కా నీకు నీళ్లు పోసేస్తాను అప్పుడేమో -- నా బంగారు కొండ ఎలా మెరిసిపోతాడంటే, అప్పుడే తయారైన వజ్రాలు పొదిగిన బంగారు నగ లాగా తళతళా మెరిసిపోతాడు తెలిసిందా ? అంటుంటే వాడు బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు.

రోజూ బాత్ రూమ్ కి వెళ్ళడానికి తనను నానా యాతనా పెట్టే చిన్ని గాడు ఇవ్వాళ ఎంతగా మారిపోయాడు ? తన భర్త రాజా ఒక వేళ ఇతని శరీరం లో ఆవహించాడా ఏమిటి ? రాణి కి చాలా ఆశ్చర్యంగా ఆనందం గా ఉంది. ఇంతలో నానా అని పిలిచాడు చిన్ని, బాత్ రూమ్ లోంచి, వెంటనే పరుగులతో బాత్ రూమ్ లోకి దూరి, ఒక అర్ధ గంట తరువాత, తడి తువ్వాలు చుట్టిన చిన్నిగాడిని, తన భుజాల మీద మోసుకుంటూ “ ఏనుగమ్మ ఏనుగు -- “ అంటూ పాట పాడుతూ బయటకు వచ్చేడు అతను. ఇంచెక్కా వాడి వంటి నిండా పౌడర్ రాసి ఫ్రెష్ గా తయారు చేశేశాడు చిన్నిగాడిని.

తరువాత డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరి “ ఇవ్వాళేమో చిన్ని గాడి బర్త్ డే అని చెప్పి అయ్యరు హోటల్ నుంచి ఇడ్లీ వడ సాంబార్ తెప్పించాను. చక్కగా తినేస్తాడు.-- “ అంటూ వాడిని తన వోడి లో కూర్చోబెట్టుకుని గారం చేస్తూ ఇడ్లి వడ సాంబార్ తినిపించేశాడు. రోజూ సగం ఇడ్లి తినిపించడానికి నానా పాట్లు పడేది, ఆశ్చర్యం అతని దగ్గర ఎంత బాగా చెప్పిన మాట వింటున్నాడు ? ఈ తీయని కల నిజమైతే ఎంత బావుండును ? రాణి మనసుకు ఒక క్షణం లో ఆనందం ముప్పిరిగొనగా మరుక్షణం రాత్రికి అతను వెళ్ళి పోతాడు కదా తరువాత ఎలా అని దుఃఖం కమ్ముకొంటోంది.

హాలులో అతనూ చిన్నిగాడూ ఏనుగు ఆట ఆడుకుంటున్నారు. ఎప్పుడూ మోకాళ్ళ మీద, చేతుల మీదా నడుస్తూ చిన్ని గాడిని తన మీద ఎక్కించుకుని ఏనుగు అంబారీ ఆట ఆడుకొనే వారు రాజా చిన్నిగాడి తో -- తాను పంపిన వీడియోల్లో ఇవన్నీ చూసి ఎంత బాగా గుర్తు పెట్టుకుని చిన్ని గాడిని ఆడిస్తున్నాడు ? కఠిన శిక్షణ అంటే ఇంతగానా ? మరణించిన మనిషి యొక్క రూపురేఖల విన్యాసం అతని బుద్ధులు, అతని ప్రవర్తనను మరిపించడం ఎంతటి అపూర్వమైన విషయం ? దురదృష్టవంతురాలైన తనకు ఇతన్ని పంపించిన వారికి కోటానుకోట్ల కృతజ్ఞతాoజలి సమర్పించుకుంది రాణి.

ఇంతలో భోజనాలకు టైమయింది. ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరారు. కంచం మీద చెంచా తో గంట కొట్టి అతను “ మా చిన్ని గాడికి ఆకలేస్తోంది త్వరగా అన్నం పెట్టండీ -- “అంటూ అల్లరి చేయసాగేడు. సరిగ్గా ఇలాగే డైనింగ్ టేబుల్ దగ్గర అల్లరి చేసే వాడు రాజా -

“ మా చిన్నిగాడి బర్త్ డే కదా ఇవ్వాళ -- అందుకనే అమ్మేమో -- ఇవ్వాళ చక్కగా చక్కర పొంగలి, బాగా నెయ్యి వేసి చేసింది, పులిహార ఆవ పెట్టి మన కోసం చేసింది “ అంటూ చిన్నాగాడిని టేబుల్ అంచున కూర్చోబెట్టుకుని గోరు ముద్దలు తినిపించాడు. వాడు చెక్కరపొంగలి , పులిహార కూడా కడుపునిండా తినేశాడు. రోజూ ఇలాగే తినేస్తే తనకు అసలు దిగులేదీ ? -- అనుకుంటూంది రాణి --

తామిద్దరమూ తింటుంటే చిన్నిగాడు నిద్రపోయాడు అతని ఒడి లో-- రెండు చేతులూ అతని నడుము చుట్టూ బిగించేసి -- ఆ అనురాగ బంధాన్ని చూసి ముగ్ధురాలై పోయింది రాణి. కానీ ఈ బంధం కొన్ని గంటలు మాత్రమే ! తరువాత ఎలా ? ఆమ్మో రాణి గుండెల్లో కలుక్కుమంది దుఃఖం. కొంచెం సేపట్లో ఇద్దరు నిద్రపోయారు. రాణి కూడా బెడ్ రూమ్ లో బెడ్ ప్రక్కనే ఉన్న సోఫా లో కునుకు తీసింది. సాయంత్రం రాణి నిద్ర లేచేసమయానికి తమ ఇంటి హాలు లో చాలా సందడి గా ఉంది. అతని గొంతూ చిన్నిగాడి గొంతూ వినిపిస్తున్నాయి. చిన్నిగాడు బర్త్ డే కి కొనుక్కున్న మెరూన్ కలర్ సూటింగ్ , చిన్నిగాడు వాళ్ళ నాన్న కోసం కొన్న నేవీ బ్లు షూటింగు అతనూ వేసుకున్నారు. అచ్ఛంగా తన భర్త లానే ఉన్నాడు అతను.

వాళ్ళు నవ్వులూ కేరింతలూ వినిపిస్తున్నాయి. చకచకా హాలు లో ప్రవేశింది. అక్కడ హాలు లో రంగురంగుల బెలూన్లు ఊది అందం గా అలంకరిస్తున్నారు ఇద్దరూ -- హాలు మధ్యలోకి బల్లను లాగి దాని మీద అందమైన శాలువా పరిచారు. మధ్య లో బర్త్ డే కేకు ను అమర్చారు. పక్కనే ప్లాస్టీక్ కత్తి కొవ్వొత్తులు ఉన్నాయి. గబా గబా కిచెన్ లోకి వెళ్లి టీ తయారు చేసి పట్టుకొస్తుంటే “ రాణీ డియర్ బాగా తలనొప్పి గా ఉందోయ్ -- టీ అడుగుదామనుకుంటున్నా -- ఏకంగా టీ తీసుకువచ్చేశావ్ -- మై డియర్ రాణీ -- “ అంటూ గభాల్న రాణి బుగ్గ మీద చిటికె వేశాడు అతను. వెంటనే చిన్నిగాడు “ భలే భలే --” అని చప్పట్లు కొట్టాడు చిన్ని సంబరం తో నిండిన ముఖం తో -- అతని చర్య కు కొంచెం షాక్ తిన్నా కూడా మరుక్షణం లో మామూలు గా అయిపోయింది రాణి.

“ హ్యాపీ బర్త్ డే టు యూ --” అంటూ పాట పాడుతూ అతను చిన్నిగాడిని ఎత్తుకుని, కేకు దగ్గరగా వెళ్లి కనుసైగలతో రాణిని బల్ల కు దగ్గరగా రమ్మన్నాడు. చిన్ని చేత కేక్ కట్ చేయించి వాడి చేతిలో కేక్ ముక్క తన నోట్లో పెట్టించుకుని, తరువాత రాణి నోట్లో పెట్టించాడు. చప్పట్లు కొడుతూ వాడిని తన భుజాల పైకి ఎత్తుకుని, తిరునాళ్ల లో పిచ్చి గెంతులు వేసినట్లుగా ఎగరసాగేడు. ఆ సమయం లో చిన్ని గాడి ముఖం లో నెలకొన్న తృప్తీ, ఆనందం, సంబరం, వర్ణించడానికి రాణి ఊహ కు అందలేదు. అలాగే ఒక గంట సేపటి దాకా పుట్టిన రోజు సంబరాలు చేసుకున్నారు ఇద్దరూ -- రాత్రి ఎనిమిది అయింది. చిన్ని గాడి ని అతను తన గుండెలకు దగ్గరగా పొదువుకుని, అతను బెడ్ రూమ్ లో బెడ్ మీద పడుకుని తన రెండు అర చేతులతో ప్రేమ తో అనురాగం తో నిమురుతోంటే “ నాన్నా రాత్రికి వెళ్ళిపోతావని అమ్మ చెప్పింది. నా కోసం కొంత కాలం ఇక్కడే ఉండిపోరాదే --” అని గోముగా జాలినిండిన ముఖం తో వాడు అంటోంటే రాజా కాని రాజా మనసంతా బాధతో నిండిపోయి “ అలాగే నా చిట్టి తండ్రీ --రాత్రికి మా కంపెనీ వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడతాను, వాళ్ళు ఉండిపోమంటే అలాగే ఉండిపోతాను సరేనా ? “ అన్నాడు వాడి వొళ్ళంతా ప్రేమగా నిమురుతూ --- కొన్ని క్షణాలలో వాడు నిద్రపోయాడు.

“ చిన్నీ నీకు తృప్తి గా ఆనందం గా ఉందా ? మీ నాన్న గారు నీ జన్మదినానికి వచ్చి నిన్ను సంతోష పెట్టారు గదూ --” అని తగ్గు స్వరం తో అతను చిన్నిగాడి చెవి లో అంటూ ఉంటే -- నిద్ర పోతున్న చిన్ని గాడి ముఖం లో చిరునవ్వు తో కూడుకున్నఆనందం గోచరించి, తండ్రి ని ఇంకా కరుచుకుని మరీ దగ్గరగా హత్తుకుపోయాడు. పదిహేడు గంటలపాటు సాగిన

అనుబంధం తెగిపోడానికి గిలగిలలాడిపోతోంది. పాపం పై లోకం లో వీడి తండ్రి ఎంత యాతన పడుతున్నాడో ? అని రాజా కాని రాజా కుమిలి పోతున్నాడు --

ఇంతలో హాలు లోంచి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారో అని ఇల్లంతా తిరిగి, బెడ్ రూమ్ లోకి చేరింది రాణి. రాణి బెడ్ రూమ్ లో ప్రవేశించడం ఆలస్యం, నెమ్మది గా తన ఛాతీ మీద ఉన్న చిన్ని గాడిని బెడ్ మీద పడుకోబెట్టి, తాను వేసుకున్న సూటింగ్ విప్పేసి, తాను వచ్చినప్పుడు వేసుకున్న డ్రెస్ ధరించి, రాణి వేపు తిరిగి తల వంచుకుని -చేతులు జోడించి

“మేడం -- చిన్నిగాడి తండ్రి మళ్ళీ దుబాయ్ ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు రాత్రి విమానానికి. వెంటనే వచ్చేయయమన్నారు వాళ్ళు. -- నా వలన ఏదైనా అపరాధం జరిగితే మన్నించండి --” అంటూ అతను రెండు చేతులూ జోడించి వినయం గా తల వొంచుకుని చక చకా వెళ్ళిపోయాడు.

రాణి కళ్ళు నులుముకుని చూసింది. కన్నీరు పొంగి వరద లా పొంగుతోంది. అతను ఎదురుగా లేడు బెడ్ మీద అతను ధరించిన సూటింగ్ పడి ఉంది -- గాఢం....గా నిట్టూరుస్తూ నిస్త్రాణ అయిపోయి చిన్నిగాడి పక్కన చేరి కళ్ళు మూసుకుంది రాణి --

రచయిత పరిచయం : కె .బి.కృష్ణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో డి. ఏ. ఓ (వర్క్సు ) గ్రేడ్ -1 గా 2002 పదవి విరమణ తరువాత శ్రీమతి సరస్వతి తో కాకినాడ లో స్వగృహం లో నివాసం. అమ్మాయి అబ్బాయి వారి పిల్లలతో స్థిరపడ్డారు.

1979 లో రచన వ్యాసంగం లో ప్రవేశించి ఇప్పటి వరకు 880 కథలూ, 16 నవలలూ రచించారు. 2 నవలలు, మినీకథల సంపుటాలు-3, 54 కార్డు కథల పుస్తకం-1, 4 కథల సంపుటాలు, 2 హాస్యకథల సంపుటాలు వెలువడ్డాయి. వెలువడ్డాయి.

స్వాతి వారపత్రిక లో నవల కు 25 వేలు, ఆస్ట్రేలియా తెలుగు పలుకు పత్రిక లో పెద్ద కథ కు ప్రధమ బహుమతి, కెనడా డే పత్రిక లో బహుమతి గెలుచుకున్న బహుమతులలో చెప్పుకోదగ్గవి. దాదాపు 12 పురస్కారాలు, కర్నూలు లో “ మినీకథా చక్రవర్తి “ మచిలీపట్టణం లో “ కథా నిధి” తెనాలి లో “కథా బ్రహ్మ” అనంతపురం లో “ కథా విశారద “ బిరుదులతో సత్కారం పొందారు

వీరి కథల పై శ్రీ గంజి శ్రీనివాస రావు,గుంటూరు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బొమ్మూరు నుండి, శ్రీ కె దుర్గా ప్రాసాద్ తెలుగు పండిట్ మదురై కామరాజ్ యూనివర్సిటీ చెన్నై నుండి పరిశోధన పత్రాలు సమర్పించి *ఎమ్.ఫిల్* పట్టాలు సాధించారు. ఒకరు వీరి మొత్తం రచనల పై పి.హెచ్ డి పట్టా కోసం పరిశోధన చేస్తున్నారు. తుది దశ లో ఉంది.

సందేశాత్మకమైన, మానవ సంబంధాలు పెంపొందించే కథలూ, హాస్య కథలూ ఇలా నవరసాల్లో రాయాలని 76 సంవత్సరాల వయస్సు లో కాంక్షిస్తున్నారు.

*** *** ***



294 views16 comments

16 Comments


Srinivas K B
Srinivas K B
Jan 15, 2021

Marvellous storytelling & novel ending. Must read story by every one.

Like

veru srikeerthi
veru srikeerthi
Jan 15, 2021

Beautiful narration. And heart touching ending. 😊

Like

K Veeresalingam
K Veeresalingam
Jan 15, 2021

Simply superb story with unexpected ending

Like

Surya teja Ganti
Surya teja Ganti
Jan 15, 2021

marvellous ending 😎👏🏻😊

Like

Ananda Divya K
Ananda Divya K
Jan 15, 2021

Very nice story and I expect such a wonderful stories from the writer.

Like
bottom of page