top of page

ఉత్తరాలు

గమనిక : ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి 2021 కథల పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకుంది. ఎంపికలో పాఠకుల అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకున్నాం.

Uttaralu Written By Sunadh Kappala

రచన : కప్పల సునాధ్


" అలాగేనమ్మా..అల్లుడుగార్ని అడిగినట్లు చెప్పు.పిల్లలు జాగ్రత్త ! ఉంటాను మరి" కూతురుతో ఫోనులో మాట్లాడి పెట్టేసాను. మా పాప అల్లుడు స్టేట్స్ లో ఉంటారు.

" స్మార్ట్ ఫోన్ తీసుకోండి నాన్నా!.మనం రోజూ వీడియో కాల్లో మాట్లాడుకోవచ్చు "

ఫోన్ చేసిన ప్రతిసారి అంటున్న మాట.నేనింకా పాతకాలపు ల్యాండ్ ఫోనే వాడుతున్నాను.అయినా కృష్ణా రామ అంటూ కూర్చునే వయస్సులో సెల్ ఫోన్ ఎలా వాడాలో నేర్చుకోవడం నావల్లకాదు. అందుకే ఆ మాటెత్తినప్పుడల్లా మాట దాటవేస్తుంటాను.

ఒకప్పుడు ఈ ల్యాండ్ ఫోన్ కోసం మావీధిలో అందరూ క్యూలో నిలబడేవారు.వాళ్ళందరికీ ఎక్కడెక్కడ నుంచో కాల్స్ రావడం.. మేమెళ్లి వారిని పిలవడం ఇదే తంతు. ప్రస్తుతం ఈ ఫోన్కి వచ్చే ఎకైక కాల్ మా పాప లక్ష్మీ నుండే.

టీచరుగా ఉద్యోగం చేస్తూ ఏడేళ్ళ కిందటే రిటైరయ్యాను. ముప్పైళ్ళు కిందటే నాభార్య సరోజ అభిరుచికి అనుగుణంగా విశాలమైన పెంకుటిల్లు కట్టాను.తనకు మొక్కలంటే ఎంతో ఇష్టం.రంగురంగుల పూలమొక్కలతో పెరటంతా అహ్లాదకరంగా ఉండేది.ఇప్పుడైతే ఆ మొక్కలు లేవు.. పూలు లేవు నాభార్యలాగా..

నాభార్య సరోజ రెండేళ్ళ కిందట అందనంత దూరాల కెళ్లిపోయింది. అప్పటి నుంచి ఈ లంకంత కొంపలో ఒంటరి జీవితమే.ఉమ్మడి కుటుంబాలు పోవడం..పిల్లలు దూరప్రాంతాలకు ఉద్యోగాల నిమిత్తం వెళ్లిపోవడంతో వృద్దాప్యంలో అందిరి పరిస్థితి నాలాగే ఉంది.

పిల్లల ఆనందాలే మాఆనందాలు.అందుకే ఇటువంటి పరిస్థితులకు అలవాటైపోయాం.

* * *

ఈ వయసులో మధుర స్మృతులే ఆనందాన్ని ఇస్తాయి. నూతనోత్తేజాన్ని కలిగిస్తాయి.ఫోన్లలో ఈరోజు మాట్లాడిన విషయాలు రేపు మర్చిపొతుంటాం.సమాచారాన్ని అందిస్తాయి కానీ మధుర స్మృతులను ఇవ్వలేక పోతున్నాయి.

ఆరోజుల్లో మానాన్నకో అన్నయ్యకో నాకో ప్రతిరోజూ ఉత్తరాలు పోస్ట్ మాన్ మోసుకొచ్చేవాడు . నేనైతే పోస్ట్ మాన్ వెర్రియ్య కోసం కళ్ళు కాయలుకాసేలా చూసేవాడ్ని. బంధువులు మిత్రులు రక్త సంభందీకుల్నుండి వచ్చే ఉత్తరాలు చదవడం. తిరిగి వాటికి రిప్లై ఇవ్వడం ఓ మధురానుభూతి. కొంతమంది నావద్దకొచ్చి ఉత్తరాలు రాయించుకోవడం, వారికొచ్చిన ఉత్తరాలు చదివించుకొని వారి కష్టసుఖాలు నాతో పంచుకోవడం భలే గమ్మత్తుగా ఉండేది.

* * *

మానాన్నగారికి ఒక అలవాటుండేది.వచ్చిన ఉత్తరాలన్నీ ఒక తీగకు గుచ్చి కిటికీకి వేలాడతీసేవారు.నాకు అదే అలవాటు వచ్చింది. డెబ్బై దశకం నుంచి తొంబై దశకంలో వరకు నాకొచ్చిన ఉత్తరాలన్నీ భద్రంగానే ఉన్నాయి. కొన్ని ఉత్తరాలింకా తీగకు మూలన వేలాడు తున్నాయి.ముఖ్యమైన ఉత్తరాలు మాత్రం ట్రంకుపెట్టెలో భద్రపర్చాను.ఈరోజెందుకో ట్రంకుపెట్టె చూడాలనిపించింది.

"తాతయ్యగారూ"అంటూ పక్కింటి కుర్రోడు స్టీల్ గ్లాసుతో టీ పట్టుకొచ్చాడు.పక్కింట్లో ఉండే సుబ్బారావుగారు కాస్త దూరపు బంధువే. నా మంచీ చెడ్డా ప్రస్తుతం వాళ్ళే చూసుకుంటున్నారు. వాళ్ళబ్బాయే ఈ కుర్రాడు.టెన్త్ క్లాసు చదువుతున్నాడు.నాకు కాస్తంత తోడుగానూ ఉంటాడు. చెప్పిన పనులన్నీ చకచక చేసిపెడుతుంటాడు.

టీ తాగుతూ ఆ కుర్రాడుతో షెడ్ మీదున్న ట్రంకుపెట్టె కిందకు తీయించాను.

మడతకుర్చీ పక్కనే ఉన్న స్టూలు మీద ట్రంకుపెట్టె పెడుతూ "ఇందులో ఏం ఉన్నాయి తాతాయ్యగారూ?"కుతూహలంగా అడిగాడా కుర్రాడు.

"ఉత్తరాలు"అని చెప్పాను.

"ఉత్తరాలంటే !" తెలయదన్నట్లు తెల్లమోహం వేసాడు.నేను ఎక్కడ క్లాసు తీసుకుంటానోనని మెల్లగా జారుకున్నాడు.

మడతకుర్చీలో అలా జాలువారాను. స్టూలు మీదన్న ట్రంకుపెట్టె తెరిచాను.పెట్టెలో ఎన్నెన్నో ఉత్తరాలు.పోస్ట్ కార్డులు, ఇన్లాండ్ లెటర్లు,ఎన్వలప్ కవర్లు ... నాటి రోజులు తెరలుతెరలుగా గుర్తొస్తున్నాయి.

మనుషుల మధ్య మమతానురాగాలకు..తీపి చేదు వార్తలకు..పట్టలేని సంతోషాలకు..జ్ఞాపకాల దొంతరలీ ఉత్తరాలు. లవ్లెటర్లు, ఫ్రెండ్స్ రాసిన లెటర్లు,శుభలేఖలు, అమ్మనాన్నలు రాసిన లెటర్లు, అన్నయ్య రాసిన లెటర్లు, పెళ్ళైన తర్వాత సరోజ పుట్టింటి నుంచి రాసిన లెటర్లు... ఇలా చాలానే ఉన్నాయి.

ఓ ఇన్లాండ్ లెటర్ తీసాను. పెళ్లికి ముందు ఈఉత్తరం ఎన్నిసార్లు చదివానో నాకే గుర్తు లేదు."ప్రియాతి ప్రియమైన నా సుబ్బు ! నువ్వు ఎంత బాగుంటావో తెలుసా ? అచ్చం శోభన్ బాబులా ఉంటావు. కళ్ళు తెరిచినా.. మూసినా నీరూపమే.నాగుండె చప్పుడు కూడ నీ నామ స్మరణ చేస్తుంది. నిన్ను చూడాలని.. మాట్లాడాలని నాహృదయం పరితపిస్తుంది. నీతో సైకిలుపై గోదావరి గట్లపై షికార్లు చేయాలని మనసు ఉబలాటపడుతుంది. నువ్వంటే చచ్చేంత ఇష్టం. మరినీకు ?నేనంటే ఇష్టమేనా ! ఇట్లు..నీ ప్రేయసి"ఇంటర్లో ఉండగా ఫస్టొచ్చిన లవ్ లెటర్. కానీ చిత్రమేంటంటే ఈలెటరెవరు వ్రాసారో పేరుగానీ చిరునామా గానీ లేదు.అయితే స్టాంప్ను బట్టి మా వూర్లోనే పోస్ట్ చేసినట్లుగా తెలిసింది.ఈ లెటర్ ఎవర్రాశారనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.మరలా ఈలెటర్ చదవడంతో నాటి జ్ఞాపకాలెన్నో కళ్ళెదుట కదలాడాయి.

పదిహేను పైసల పోస్టుకార్డు తీసాను.అది అమ్మనాన్నలు రాసింది. నేను భీమవరం దంతులూరు నారాయణరాజు కళాశాలలో డిగ్రీ చదువుతున్నప్పటి ఉత్తరం.

" ప్రియ చిరంజీవి చిన్నోడుకి....అమ్మనాన్నలు దీవించి రాయునది.

మేము బాగానే ఉన్నాం.నీవు ఎలా ఉన్నావు?.వేళకు తిని వేళకు పడుకో .అన్నయ్య లాగా బాగా చదువుకో. చెడు సహవాసాలేమీ చేయకు.ఇక్కడ మా గురించేమీ ఆలోచించకు. వారంరోజుల్లో మనియార్డరు పంపిస్తాను.నీ ఆరోగ్యం జాగ్రత్త.ఈ ఉత్తరం అందిన వెంటనే జవాబు రాయి.ఇట్లు..... అమ్మనాన్నలు."

ఊరికి దూరంగా హాస్టల్లో ఉంటున్నరోజుల్లో ఇటువంటి ఉత్తరాల కోసం రోజు వేయికళ్ళుతో ఎదురుచూసేవాడ్ని.మావూరు పొలాల్లో మాకొసం గొడ్డుల్లా కష్టపడే మనుషులు అమ్మనాన్నలు.. పస్తులుండి కూడా తమ పిల్లలు గొప్పగా చదువుకోవాలనుకునేవారు.అమ్మనాన్నల ఎన్నోఏళ్ళ ప్రేమాప్యాయతలను ఈఒక్క కార్డుముక్క ఈక్షణంలో నా ముందుంచింది.

మరొక ఇన్లాండ్ లెటర్ మడత విప్పాను.కొయ్యలగూడెం నుంచి నా స్నేహితుడు నాగేశ్వరరావు రాసాడు."ప్రియ స్నేహితుడు సుబ్రహ్మణ్యం కు....నాగేశ్వరరావు వ్రాయునది.ఎలా ఉన్నావురా ?డిగ్రీ పూర్తయ్యాక మళ్ళీ మనం కలవలేదు. మీనాన్నగారు కాలం చేసారని తెలిసింది. రాలేకపోయాను. ఇప్పుడేమి చేస్తున్నావు ? నేనైతే ఏలూరులో బిఎల్ జాయిన్ అయ్యాను.మన ఫ్రెండ్స్ ఎవ‌రైన కలిసారా ! సుబ్బారావు గాడు వాళ్ళ బంధువులమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. శ్రీనివాస్ గాడు ఆంధ్రా యూనివర్శిటిలో ఎమ్మెస్సీ జాయినయ్యాడు.నువ్వేం చేస్తున్నావు? అన్ని విషయాలతో లెటర్ రాయి. ఎదురుచూస్తుంటాను. ఇట్లు.... నాగేశ్వరరావు."

ఈ లెటర్ చదువుతున్నంతసేపు నాలో ఏదో తెలియని ఉత్సాహం. కాలేజీ రోజులు.. అప్పటి స్నేహితులు..నాటి సంఘటనలెన్నో ఒక్కొక్కటిగా గుర్తుకొస్తూనే ఉన్నాయి.ఆ జ్ఞాపకాలలో అలా పది నిమిషాలపాటు కళ్ళు మూసుకుని మడతకుర్చీలో ఉండిపోయాను.

మరో ఉత్తరం చేతికందుకున్నాను.అది వైజాగ్ లో ఉండే అన్నయ్య రాసిన ఉత్తరం.రాజమండ్రిలో టిచర్ ట్రైనింగులో ఉండగా రాసింది.

"ప్రియమైన తమ్ముడు సుబ్రహ్మణ్యంకు అన్నయ్య వ్రాయునది.నేను క్షేమం. నీవును క్షేమమని తలంచుచున్నాను.ముఖ్యంగా వ్రాయునది ఏమనగా. నీవు ఎలా చదువు తున్నావు. నీ ఆరోగ్యం జాగ్రత్త !.ఈ వారంలో ఇంటికెళ్ళావా ? అమ్మ ఎలా ఉంది. అడిగినట్లు చెప్పు. వీలైతే సంక్రాంతి సెలవులకు ఊరుకొస్తాను. అమ్మను జాగ్రత్తగా చూసుకో.అయిదొందలు మనియార్డర్ చేస్తున్నాను. ఇంకా అవసరమైతే లెటర్ వ్రాయి. అందర్ని అడిగినట్లు చెప్పు. ఇట్లు... అన్నయ్య "

అన్నయ్య వద్దనుండి ప్రతినెలా ఇటువంటి ఉత్తరాలు వస్తూనే ఉండేవి.అన్నయ్యంటే నాకు చాలా భయం.అయన రాసిన ఉత్తరాలే నా ఉన్నతికి బాటవేసాయి.ఉత్తరం చదువుతుండగా నాటి స్మృతుల్లోకి జారుకున్నాను.

మరో ఇన్లాండ్ లెటరందుకున్నాను.అనకాపల్లి నుంచి మీనాక్షి అనే అమ్మాయి రాసింది. మీనాక్షి తోనే నా మొట్టమొదటి పెళ్లి చూపులు. కొంచెం బాధకరమైనా లెటర్ చదవలనిపించింది.

"సుబ్రహ్మణ్యం గారికి నమస్కరించి వ్రాయునది.నేను అనకాపల్లి నుంచి మీనాక్షిని.మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. కోపం పడకుండా అర్థం చేసుకోగలరు. మనపెళ్లిచూపులు అప్పటికప్పుడు హడావుడిగా జరిగిపోయాయి.అంతా ఓకే అవ్వడంతో మీవాళ్ళు,మావాళ్ళు పెళ్లి ఖాయం చేసేసారు. నా వాళ్ళ మాట నేను కాదనలేను. అందుకే ఆ సమయంలో ఏమీ మాట్లాడలేకపొయాను. నన్ను క్షమించాలి. నేను ఆల్రెడీ ఒకబ్బాయిని ప్రేమించాను. మేమిద్దరం పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నాం.ఈవిషయం ఇంట్లో చెప్పే ధైర్యం లేక మౌనంగానే ఉండిపోయాను.మీరు చాలా మంచివారు. చాలా చాలా అందంగా ఉంటారు. దయచేసి ఏమీ అనుకోవద్దు. నాదొక విన్నపం. నన్ను చేసుకోవడం మీకే ఇష్టం లేదని మావాళ్ళతో చెప్పగలరు. అర్థం చేసుకొండి ప్లీజ్ !....ఇట్లు.... మీనాక్షి."

ఈ విషయంలో మీనాక్షిని వద్దని చెప్పినందుకు అప్పట్లో మావాళ్ళతో ఎన్ని చీవాట్లు పడ్డానో...అలా అలా గుర్తుకొస్తున్నాయి.ఏదిఏమైనా మంచి పనే చేసాననే తృప్తి మాత్రం నాలో ఉంది.

మరో ఇన్లాండ్ లెటర్. నాభార్య డెలివరీకి పుట్టింటికి వెళ్లినప్పుడు రాసిన ఉత్తరం. తాను పుట్టింటి కెళ్లినప్పుడల్లా ఒకరికొకరం ఎన్నెన్నో ఉత్తరాలు రాసుకునే వాళ్లం.

"ప్రియాతి ప్రియమైన శ్రీవారికి...ఎలా ఉన్నారు ? నే నెళ్లి రెండ్రోజులే అయినా ఈ యడబాటు రెండు యుగాలైనట్లుంది. నాకయితే ఇక్కడుండాలనిపించడం లేదు. ఎప్పుడెప్పుడు వచ్చేదామా అనిపిస్తుంది. నా ధ్యాసంతా మీ మీదే. వంటెలాగ చేసుకుంటున్నారు. చేతులు గట్రా కాల్చుకోకండి. సమయానికి తినండి. బయట పుడ్ గట్లా తినకండి. రాత్రికి ఎర్లీగా పడుకొండి. ఈరోజు డాక్టర్ వద్దకెళ్లోచ్చాం. డాక్టర్ గారు అంతా బాగానే ఉందన్నారు. బొజ్జలో బేబీ అయితే బుజ్జిబుజ్జి చేతులతో గుచ్చుతుంది. కాళ్ళతో తన్నుతుంది. నాకయితే నిజంగా చెప్పలేని మధురానుభూతే. మీరొచ్చాక చూద్దురుగానీ. ఇక ఉంటాను.ఈ ఉత్తరం అందిన వెంటనే అన్ని విషయాలతో ఉత్తరం రాయండి. ఎదురుచూస్తుంటాను. ఇట్లు ....మీ ప్రియమైన సరోజ."

సరోజ డెలివరికెళ్లిన కొద్ది కాలం ఎడబాటులోనే ఒంటరిగా ఉండలేక పోయాను. నాలో సగమైన సరోజ నన్ను విడిచి శాశ్వతంగా వెళ్లపోవడంతో జీవచ్ఛవంలానే జీవిస్తున్నాను. ఒంటరితనం భరించలేక పోతున్నాను.ఒకప్పుడు నాచుట్టూ సందడిగా ఉండే బంధు గణం ఇప్పుడు లేదు. స్నేహితులు లేరు.వాళ్ళందరదీ నాలాంటి పరిస్థితే.సుదూరప్రాంతంలోనున్న అల్లుడు కూతుళ్ళ ఫోన్ కాలే పలకరింపు. పక్కంటి కుర్రాడు సాయమే కొండంత ఆసరా.

భవిష్యత్ కోసం బెంగలేదు.వర్తమానమంతా ఒంటరితనం. ఈ ఒంటరితనంలో ధైర్యాన్నిచ్చేది గతం. గత మధురస్మృతులు తియ్యటి అనుభూతి నిస్తాయి.నాలో నూతనోత్సాహాన్ని నింపుతాయి.అందుకే ఒంటరితనం ఫీలైనప్పుడల్లా ట్రంకుపెట్టె తెరుస్తాను.దొంతర దొంతరలుగా వున్న ఉత్తరాలనుంచి నా జ్ఞాపకాల దొంతరలను వెతుక్కుంటాను.

// the end //



923 views29 comments
bottom of page