top of page

వెట్టిచాకిరి బ్రతుకులు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Vetti Chakiri Brathukulu' New Telugu Story Written By Lakshmi Sarma B

రచన : B. లక్ష్మీ శర్మ (త్రిగుళ్ళ)


భానుడు నులివెచ్చని తన కిరణాలను పుడమి తల్లి నుదుట ప్రసరింప చేస్తున్నాడు. పల్లె ప్రజలంతా ఆపాటికే లేచారు. ఆడవాళ్ళంతా ఇంటి ముందు కళ్ళాపి చల్లి, ముగ్గులు పెడుతున్నారు. మగవాళ్ళందరు చెంబులో నీళ్ళు తీసుకొని బహిర్భూమికి వెళుతున్నారు.


రమణయ్య ఆ ఊరిలో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆయన మాటంటే ఆఊరి వాళ్ళకు వేదవాక్కు. ఆయన చెప్పిందే జరగాలి. ఎవరూ ఎదురు మాట్లాడలేరు. ఆయన దగ్గర పని చెయ్యాలంటే భయభక్తులతో ఉండాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా ఊరుకునే మనిషి కాదు. రంగడు బుద్ది తెలిసిన నాటినుండి ఆయన దగ్గరనే పనిచేస్తున్నాడు. రంగడి తాతల నాటినుండి వస్తున్న ఆనవాయితీ. రంగడే కాదు, ఆయన మనవళ్లు చేసినా, తీరవు వాళ్ళ బాకీలు. వెట్టి చాకిరి బ్రతుకులు.. పైసా ఆదాయము ఉండదు. గడియ తీరదు. రంగడి భార్యకు ఇది ఎలాగైనా వదిలించుకోవాలని ఉంది.


రంగడికి వున్నది ఒక్కడే కొడుకు. వాణ్ణి ఎలాగైనా ఈ వెట్టి చాకిరి నుండి బయట పడెయ్యాలని ఉంది. అందుకే రంగడితో గొడవ చేస్తుంది. రంగడికి ధైర్యం తక్కువ. ఏమి మాట్లడితే ఏమి చేస్తాడోనని భయం. అందుకే మంగ ఎంత గొడవ చేసినా రమణయ్య దగ్గర ఏమీ మాట్లాడడు. ఇక మంగకు విసుగు వచ్చింది. అన్నం తినడం మానేస్తానని బెదిరించింది రంగడిని. అంతేకాదు. మంగ కూడ రమణయ్య వాళ్ళింటిలో పాచి పని చేస్తుంది. అది కూడా తరతరాల నుండి వస్తున్న అనవాయితీ.


“మావ… మన అంజిగాడిని బడికి తోలుదాము. ఇయ్యాల మంచి దినముందట. అయ్యవారిని అడిగొచ్చిన. ఇయ్యాల పనికి రానని సెప్పిన. నువ్వు ఈపొద్దు పని మానెయ్‌. ఆడిని బడిలో వేసి పుస్తకాలు, బట్టలు.. ఆడికి పనికొచ్చేటివి తియ్యాల. పద మావ! బిరాన పోదాము ” తొందర చేసింది మంగ.


“మంగ… వాడిని బడికి తోలాలంటే మాటలానే? మనం వెట్టి చాకిరి చేసుకుని బతుకు బండిని ఈదుతున్నాము. మనకాడ ఏముందని మంగ.. ఆడిని సదివించాలంటే చాల పైసలుండాలే. రెక్కాడితే గాని డొక్కాడదు. మనలాటోళ్ళకి పెద్ద పెద్ద ఆసలు వుండకూడదే, ” అన్నాడు రంగడు.


“మావ! మనం అంజికి ఒక్క పైస పెడతలేము. అది గవర్మెంట్ బడి. పది వరకు సదువుకోవచ్చట. పెద్ద సదువులకు కూడ ఆళ్ళే తోలుకపోతారట మావ, ” అంది మంగ సంతోషంతో.


“ మంగా… నీకు ఇయన్నీ ఎవరు సెపుతున్నారు? సరేలే.. నేను మునసబు తానకు పోయి సెపుతాను.ఆయనేదంటే అదె, ” అన్నాడు రంగడు.


అంతెత్తున లేచింది మంగ . “ఏటి ఆయనేదంటె అదా… ;ఓసిని జిమ్మడిపోను! ఎట్టాటోడివి దాపురించావయ్యా. ఇదిగో మావ.. నేనిప్పుడె సెపుతుండ… నువ్వు మునసబు తానకు బేగి పోయ్యి, రానని సెప్పిరా. ఆడనే కూకుండకుండా బిరాన రా, ” అంటూ పిల్లాడిని తీసుకొని లోపలకి వెళ్ళింది.


రంగడికి ప్రాణ సంకటంగా ఉంది. వెనుకకు పోతె గోయ్యి, ముందుకు పోతె నుయ్యి అన్నట్టుగా ఉంది. పిల్లాడిని బడికి తోలుతాను అంటే ఆయన ఇంతెత్తున లేస్తాడు, పిల్లాడిని బడికి వద్దు అంటే మంగ వినదు. ఏం చేయ్యాలో ఏమి తోచడంలేదు. అటు ఇటు తిరిగాడు చాలా సేపు. ఒక నిర్ణయానికి వచ్చినవాడిలా గబగబా లోపలికి వెళ్ళి “మంగా …, ” అంటూ పిలిచాడు.


“ఆ …ఏంది మావ! అయనకాడికి ఎల్లి సెప్పాలంటే గుబులయితుందా, ”? వెక్కిరింతగా అడిగింది.

“మంగ! అంజిని కూడా తీసుకొని మునసబు తానకు పోదాము, ఆడే అడుగుతాడు ఆయనను.పిల్లగాడు కదా! ఆడి ముఖం చూసన్న ఒప్పుకుంటాడేమో, ” అన్నాడు రంగడు.


మంగకు కూడా ఈ ఆలోచన నచ్చింది. “ సరే మావ పోదాం దా, ” అంటూ పిల్లగాని చెయ్యి పట్టుకుని, బయపడుతూనే మునసబు గారింటికి వెళ్ళారు.

“ఏందిరా.. పొద్దు పొద్దు గానే పెండ్లాం పిల్లగాణ్ణి వేసుకుని వచ్చావు, ” హేళనగా అడిగాడు

మునసబు. ఆయనకు తెలుసు పైసలవసరముంటేనే ఇలా వస్తారని.


“అయ్యా… అది.. అది..” నీళ్ళునములుతూ… “మాఆడోళ్ళకి ఏదో ఆస పుట్టినాది, మీరూ ఊ అంటే , ” నసిగాడు రంగడు.

“ఆ నసుగుడు ఏందిరా? ఏం కావాలట. ఈ పూట పని మానేస్తుందటనా? అయినా ఆ విషయం అమ్మ గారిని అడగమను, ” అంటూ అక్కడనుండి వెళ్ళ బోయాడు..


“అది కాదండయ్యా… అంటూ నీళ్ళు నములుతూ ఉంటే, “నువ్వుకో మావ, ” అంటూ మంగ ముందుకు వచ్చింది.


“ఏం లేదండయ్య …మా అంజిగాడిని మన ఊరు బడికి తోలుదామనుకున్నామయ్య, ఆ ఇసయం మీతానికి వచ్చి చెప్పటానికి బుగులు పడుతున్నాడయ్య, ” చెప్పింది మంగ తను వచ్చిన పని అయిపోయింది అన్నట్టు.

విషయం వింటూనే అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు మునసబు.


“ఏందిరా వ్యవహారం ఇంతదాక వచ్చింది? వాడు బడికి పోతే నీ తరువాత నా కాడ ఎవరు పని చేస్తారనుకున్నవు? ఇది నీకు పుట్టిన బుద్దా లేక పోతే నీ పెండ్లాంకు పుట్టిందా?ఇలాంటి పప్పులేం ఉడకవు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. పో ఇంటికి! ఇంకెప్పుడు పాడు ఆలోచనలు చెయ్యకు. అర్దమైందా, ”? గదమాయించాడు.


రంగడికి పై ప్రాణాలు పైననే పోయాయనిపించింది. మంగకు సుర్రుమన్నది బుస కొట్టిన నాగులా చూసింది మునసబు వైపు.


అంజి చిన్నవాడైనా బయపడకుండా… “అయ్యా …నాకు సదువుకోవాలని ఉందయ్య, నేను బడికి పోయి ఆడినుంచి ఈడికే వచ్చి మీరు ఏ పని సెప్పిన సేత్తానయ్య, ” అంటూ మునసబు రెండు కాళ్ళు పట్టుకున్నాడు. మంగకు, రంగడికి కళ్ళవెంట జలజల కన్నీళ్ళు కారాయి.


మునసబు అంజిని కాళ్ళతో ఈడ్చి తన్నాడు. ఆ దెబ్బకు అంజి తలకు గాయమైంది.

మంగ అపర కాళిలాగ దూసుక వచ్చింది మునసబు మీదకు “ఓరేయ్” అంటూ.

.

కాని అంతలోనే నలుగురు రౌడీలు వచ్చి మంగను ఇవతలకు లాగి పారేసారు.

చేసేది ఏమిలేక పిల్లవాడిని తీసుకోని ఇంటికి వచ్చారు ఏడుచుకుంటూ, మంగ దారంత

మునసబుకు శాపానార్దాలు పెడుతునే ఉంది.


రంగడి మనసు మనసులో లేదు ఈ జన్మకు ఇంతే అనుకున్నాడు, కొడుకును గవర్నమెంటు హాస్పిటల్ కు తీసుకవెళ్ళి సూదిమందు వేయించుకొని పనికి వచ్చేప్పటికి చాల లేటయింది రంగడికి. మునసబు మండిపడ్డాడు రంగడిని చూడగానే. .


“ఇప్పుడు తీరిందా దరిద్రపువెధవా …పెళ్ళాం మాటలు పట్టుకునే ఆడంగి నయాల, ” అంటూ తిట్ల వర్షం మొదలుపెట్టాడు.


“ అయ్యా …మా అంజిగాడి నెత్తికి బొప్పి కట్టినాది. దవాఖానాకు పొయ్యాం అయ్యా. ఆడనే కాసింత సేపయింది, ” చెప్పాడు నసుగుతూ.


“అవున్రా! మీరెంతకైనా తెగిస్తారు. సమయమొస్తే కొడుకు సచ్చినాడని కూడా చెబుతారు మీరు. మిమ్మల్ని పాపమంటే నెత్తినెక్కి కూర్చుంటారు, ” అన్నాడు వురిమి చూస్తూ.


“గట్ల మాట్లడకయ్యా… మాకు ఆడొక్కడె కొడుకు, ” అంటూ పనిలోకి దిగాడు మనసులో బాధపడుతూ. గర్వంగా మీసాలు మెలేసాడు మునసబు.


చిమ్మ చీకటి అయింది. అయినా రంగడు రాలేదు. మంగ రంగడి కోసం ఎదురు చూస్తుంది. కొడుకు పరిస్థితి కొద్దిగా నయమైంది. రంగడు వచ్చాడు. మంగ మాట్లాడలేదు.


“ఎందె మంగ! గట్ల కోపంమీదున్నవు? అంజి కి యెట్లుందె? ఒస్ పిలుస్త వుంటె మాట్లడవేందే, ” అడిగాడు రంగడు.


“ఏంది మావ… ఎప్పుడనగా వత్తా అన్నావు. ఎప్పడొచ్చినవు. ఆడ్ని మంత్రాల మరియమ్మ తానకు తీసుకపొయినా. మంత్రమేసింది కనుక మన అంజి మనకు దక్కాడు, ” అంటూ ఏడుస్తు ముక్కు చీదసాగింది మంగ.

“ఏందే నీ ఎదవ గోల! ఇంత బువ్వ పెడతావ లేదా? ఉరుకున్న కొద్ది ఎక్కువ చేస్తున్నవు. నేనేమన్న ఆడ కచ్చకాయలు ఆడుకుంటున్నానా?” అని కయ్య్ మని లేచాడు రంగడు.


“ఏందయ్యో.. ఉరుమురిమి మంగళం మీద పడినట్టు నా మీద యిరిసక పడుతున్నావు, ఆ మునసబు తాన మాత్రం నోరు మూసుకపోతాది, ” అంది మంగ.


“ఎంతసేపె అవ్వ.. అయ్యను తిడ్తావు? ఆడ ఆ పెద్దపులిగాడు రానియ్యొద్దె, ”అంటూ లేచి వచ్చాడు అంజి.


“గట్ల సెప్పర మీ అవ్వకు” అంటూ “అంజి.. నువ్వు తొంగోలేదా, ” అని కొడుకుని దగ్గరకు తీసుకున్నాడు రంగడు.


“అయ్యా… నాకు సదువుకోవాలనుంది, ” అడిగాడు తండ్రిని అంజి.


“ఏందిరా ఇది మన ఇంట వంట లేని సదువు నీ కెందుకురా , అయినా నువ్వు సదువుకు పోతె మునసబు ఇంటికి ఎవరు పోతారు, ” అడిగాడు రంగడు.


“అయ్యా …నేను ఆ పని చెయ్యను. సదువుకుంటాను” మొండిపట్టు పట్టాడు అంజి.


“అవును మావ, అంజిని గొప్ప సదువులు సదివించాల. ఈడి వల్ల మన బతుకులు మంచిగయితయి, ” అని చెపుతున్న మంగ రంగడి కేకతో గతుక్కుమన్నది.


“మంగా …నువ్వు ఆడికి మస్తు నూరి పోస్తున్నవు. ఆ నాయాల్లకు తెలిసినాదనుకో.. మనను పాణంతో కూడా ఉంచడు, నాకూ ఉందే.. మనోన్ని బాగా సదివియ్యాల.. ఆడు పెద్ద ఉద్దొగం సెయ్యాలా అని, కాని ఆళ్ళకాడ, ఈడికి పుట్టిన మనవలు సేసినా కూడ మన అప్పు అయిపోదే. అందుకే నేను నోరు మూసుకుంటున్న, ఒరె అంజి ఇంకా నువ్వు ఇట్టాంటి ఇషయాలు మనసులొ ఎట్టకు ” అంటూ బాధతో వెళ్ళిపోయాడు.


“ నిజమేరా అంజి… అయ్యచెప్పింది, . ఆయనెంబడి నువ్వు కూడ రేపటిసంది పనికి పొ, ” చెప్పింది కొడుకును దగ్గరకు తీసుకొని మంగ.


“అట్టాగేలేవె. నువ్వెల్లి పడుకొ, ” అంటూ అటువైపు తిరిగి పడుకున్నాడు. వాడి బుర్రనిండా ఆలోచనలే.


‘పిచ్చి తండ్రి’ అని కొడుకు తల నిమిరి తను పడుకుంది మంగ.


“మంగ! నేను పనికిబోతున్న, ” అన్న రంగడి పిలుపుతో లేచింది మంగ.


“వుండు మావ! అంజి నీతో వత్తున్నాడు. పనిలోకి తోలుకపో, ” అని అంజి కోసం చూసింది. అంజి కనిపించలేదు.


“మావ.. అంజి కనపడతలేడు, ” అంటూ గట్టిగా అరిచింది మంగ.


అంతా వెతికారు. అంజి జాడ కనిపించలేదు. మంగను ఓదార్చడం ఎవ్వరి తరం కావడం లేదు. మంగను ఓదార్చడంతోనే రంగడి జీవితం అయిపోతుంది. కాలం గడిచిపోయింది. అంజి జాడ తెలియక ఇద్దరికిద్దరు గుర్తుపట్టనంతగా మారిపోయారు. ఒకరి కడుపుతీపి ఒకరికి ముద్దా, అన్నట్టు మునసబుకు తన పని మాత్రం తనకు జరగాల్సిందే. వీపున చేడేల్మని కొట్టినా నోరేత్తడు. అలవాటైపోయింది రంగడికి. వాతలు పెట్టినా, మెడకు నాగలి కట్టినా ఇదేమని అడగడు. మంగను మునసబు వివస్త్ర ను చేసినా ఎదురు చెప్పలేని నిర్బాగ్యుడు. మనసులోన మౌనంగా రోదించేవాడు. మంగ ఎంత సేపు తన కొడుకు వస్తాడు అని ఎదురు చూస్తూ గడపలోనే కూచునేది. రంగడే బలవంతం చేసి రోజూ ఇంత ముద్ద తినిపించేవాడు. దేవుడా! నీకు మామీద ఎప్పుడు దయకలుగుతుంది? ఈ మనషులు ఎప్పుడు మారుతారు? మా కష్టాలు

ఎప్పుడు పోతాయి..” అని మౌనంగా రోదించేవాడు.


ఉన్నట్టుండి “నాన్న… అమ్మా…, ” అన్న పిలుపు విని ఒక్క ఉదుటున బయటకు వచ్చాడు రంగడు. నిలువెత్తు మనిషి సూటు బూటు.. చూడ చక్కని రూపం చూసి బయపడ్డాడు. ఎవరో పెద్ద ఆఫీసరు మన ఇంటికి ఎందుకు వచ్చాడోనని భయపడుతూ “దండాలయ్యా” అన్నాడు రంగడు.


మంగ తూలుకుంటూ వచ్చి “ఎవరు సారు మీరు, ఈ పేదోళ్ళ గుడిసెలు పీకి పారేయ్యడానికి వొచ్చినారా, ” అడిగింది మంగ.


మంగ తూలుతుంటే గబుక్కున పట్టుకుని “అమ్మా… నాన్న… నన్ను గుర్తు పట్టలేదా? నేనేనమ్మా మీ అంజిని, ” అంటూ తల్లిని అక్కున చేర్చుకున్నాడు ఊరప్ కలెక్టర్ అంజనీకుమార్. “నాన్న “అంటూ తండ్రిని దగ్గరకు తీసుకున్నాడు.

నోట మాట రావడం లేదు ఇద్దరికి. తమ కళ్ళను తామే నమ్మలేకుండా ఉన్నారు.


“అయ్యా …నేను మీ కొడుకుని. మిమ్ములను బాధకు గురిచేసి ఇంట్లోనుండి పారిపోయిన

మీ అంజిని అవ్వా(అమ్మా)”


ఆ మాటకు గుర్తుకు వచ్చినవారిలా కొడుకును కౌగిలించుకొని వాళ్ళ మనసు సేద తీరేవరకు బావురుమన్నారు.


“అంజి… నువ్వు పెద్ద సదువులు సదువుకొని వచ్చినావ? పెద్ద ఉద్దొగం సెత్తున్నావా? శాన మంచి పని సెసినవు కొడుకా, ” అంటూ కొడుకును చూసి మురిసిపోతున్నారు ఆ దంపతులు.


“నాన్న …అమ్మ… నేను ఇప్పటినుండి మిమ్ములను ఇలానే పిలుస్తాను, నేను ఊర్లోకి వెళ్ళాలి. ఆఫీస్ పనుంది. మళ్ళీ వస్తా, ” అంటూ బయటకు వచ్చాడు.


కారులో వెళుతున్న కొడుకును చూసి ఎంతో మురిసిపోయారు. వాళ్ళు పడిన కష్టాలన్ని

మరిచిపోయారు.


సరాసరి మునసబు ఇంటిముందు కారాగింది అప్పటికే కలెక్టరు వస్తున్నాడని స్వాగతం

చెప్పటానికి బయటకు వచ్చాడు మునసబు.


“ఇన్స్పెక్టర్… నేను చెప్పానే మీకు, పరమ చండశాసనుడని.. ఇతనే! ఇతని చేతులకు బేడీలు వెయ్యండి, ” అంటూ ముందుకు వచ్చాడు అంజనీకుమార్.


కొంచెం బెదిరాడు మునసబు. కాని పొగరుబోతు కదా; “ఏంది కలెక్టర్ బాబు? కొత్తోడివి కదా అని ఉరుకుంటే నాకే బేడీలు వేయిస్తున్నావే? అసలు నేనెవరో తెలుసా నీకూ, ” అడిగాడు మునసబు.


“ఆపు రమణయ్యా! ఇంత కాలము నువ్వు చేసిన అరాచకాలు, చేసిన మోసాలు అన్నీ ఈ

రోజు బయటపెట్టానికే వచ్చాను. అంతేకాదు. నువ్వు ఎంత మంది చేత దొంగ సంతకాలు

పెట్టించుకుని వాళ్ళ ఆస్తులు కబ్జా చేసావో అవన్ని దస్తావేజులతో సహా తెచ్చాను. ఇన్నాళ్ళకు ఈ ఊరికి పట్టిన దరిద్రాన్ని పారదోలడానికే కంకణం కట్టుకున్నాను.


ఇంతకూ నేనెవరో చెప్పలేదుకదూ? నేను నీ చేతికింద బానిసలా బతుకుతున్న రంగయ్య కొడుకును. నీకు గుర్తుందా… ఆ రోజు నేను చదువుకుంటా అని నీ కాళ్ళు పట్టుకుని అడిగితే నన్ను ఆమడ దూరం తన్నావు. ఆ రోజు తగిలిన దెబ్బ నేనెప్పటికి మరిచిపోను. అందుకే పట్టుదలతో ఇంట్లోనుండి పారిపోయి అనుకున్నది సాధించుకుని వచ్చాను. ఇప్పటికి అర్దమైందా రమణయ్యా, ” అన్నాడు అంజనీకుమూర్.


పెద్దపులిని చూసి బెదిరినట్టు బెదిరిపోయాడు రమణయ్య. పోలీసులు రమణయ్యను

పట్టుకుపోయారు. ఊరికి పట్టిన పీడ విరగడ అయినందుకు అందరు పండుగ చేసుకున్నారు. రంగయ్య మంగలను అందరు పొగిడారు.


ఆ ఊరి కళ మారిపోయింది. హైస్కూల్ వచ్చింది. బస్ సౌకర్యం ఏర్పడింది. నీళ్ళ ట్యాంకర్లు వచ్చాయి. ఒకటేమిటి.. అన్ని వసతులు ఏర్పడ్డాయి. తల్లి తండ్రి కష్టపడకుండా పెద్ద భవనం కట్టించాడు అన్ని వసతులతో. మొత్తానికి అనుకున్నది సాధించాకే ఆ ఊరిలో అడుగుపెట్టాడు కలెక్టర్ అంజనికుమార్ ( అంజి).


వెట్టిచాకిరి లేకుండా మనుషులంతా ఒక్కటేనని ని రూపించే రోజు కోసం ఎదురు చూద్దాం.


॥॥శుభం ॥॥

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : B.లక్ష్మి శర్మ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్


101 views3 comments
bottom of page