top of page
Writer's pictureLakshmi Sarma B

విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 4



'Vidhi Adina Vintha Natakam - Part 4' - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 23/09/2024

'విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 4తెలుగు ధారావాహిక

రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


కొత్తగా పెళ్ళైన ప్రియాంక దగ్గరకు తన మాజీ ప్రేమికుడు మధు వస్తాడు. డిస్టర్బ్ అవుతుంది ప్రియాంక. అతనితో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది. గతంలో ఉద్యోగం కోసం మధుని తన తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్తుంది ప్రియాంక. మధుని ఆఫీసుకు రమ్మంటాడు ఆమె తండ్రి దామోదరం. 



ఇక 'విధి ఆడిన వింత నాటకం' ధారావాహిక పార్ట్ 4 చదవండి. 


ఆ రాత్రంతా దామోదరంకు నిద్ర పట్టలేదు. తన స్తోమతకు తగినవాడికోసం తను వెదుకుతుంటే తన కూతురేమో దిక్కుమొక్కులేని వాడిని ఇష్టపడుతోంది.. ఇది జరిగే పనే అనుకుంటుందా? 


‘కోట్లకు వారసురాలు ఒక అనామకుడికి భార్య అవుతుందా. ఎట్టి పరిస్థితి 

లోను నా బొందిలో ప్రాణముండగా ఇది జరగదు. కాదు కూడదని మొండికేస్తే వాడిని నామరూపాలు లేకుండా చేస్తాను. అడిగే నాథుడే లేని దరిద్రుడు. ఎందుకైనా మంచిది, వాడిని నా కనుసన్నలలోనే ఉండేట్టుగా చేసుకోవాలి. వాళ్ళిద్దరు కలుసుకోలేకుండా చెయ్యాలి. ఈ లోపు తొందరపడి మంచి సంబంధం వెతికి బేబికి పెళ్ళి చెయ్యాలి’. 


ఇలా అనుకున్న తరువాత ప్రశాంతంగా పడుకున్నాడు దామోదరం. 


“ఏయ్ ప్రియా .. కనిపించినా కూడా మాట్లాడడం లేదు, నా మీద కోపం వచ్చిందా ? లేక మీ నాన్న ఏమైనా అన్నాడా, రెండురోజులనుండి నీ కోసం చూస్తున్నాను నువ్వు కనిపించడం లేదు, ” ఆదుర్దాగా అడిగాడు మధు. 


వినిపించుకోనట్టే ముందుకు వెళ్ళిపోసాగింది ప్రియాంక. వెనకనుండి గబగబా పరుగెత్తుతుంటూ వచ్చి అమాంతంగా ప్రియాంక చెయ్యి పట్టుకున్నాడు. వదిలించుకోవాలని చూసింది. బలమైన అతని చేతిలో సుకుమారమైన తన చేతిని విడిపించుకోలేకపోయింది. సిగ్గుతో తలెత్తి అతనివైపు చూసింది. 


“ ప్రియా.. ఎందుకు నన్నుచూసి అలా పారిపోతున్నావు? నేనేం తప్పుచేసానని నాకు శిక్షవేస్తున్నావు, మీ నాన్న ముందు నా గురించి చెప్పానని నీకు కోపం వచ్చిందని తెలుసు, కానీ ఏం చెయ్యను చెప్పు? మీ నాన్న ముందు అబద్దాలు చెప్పానని తెలిస్తే మొదటికే మోసం వస్తుందని అలా చెప్పాను, అయినా మీ నాన్న నన్ను ఏమి అనలేదు సరికదా నాకు మీ కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడు. ఆ విషయం చెబుదామని రెండురోజులనుండి నీ కోసం చూస్తున్నాను. నువ్వేమో నా మీద కోపంతో అందకుండా పారిపోతున్నావు, ” అన్నాడు బాధపడుతూ మధు. 


“నువ్వు చెప్పింది నిజమా.. నీకు మా నాన్న ఉద్యోగం ఇచ్చారా! ఏది నా మీద ఒట్టేసి చెప్పు, ” ఆశ్చర్యపోతూ మధు చేతిని తన నెత్తిమీద పెట్టుకుంది ప్రియాంక. 


“నీ దగ్గర ఎప్పుడైనా అబద్దాలు చెప్పానా డియర్, నీకు తెలిసి కూడా నన్ను ఆటపట్టిస్తున్నావు కదూ! నువ్వు మీ నాన్నలాగా నేను నిజం చెబుతానా అబద్ధం చెబుతానా అని పరీక్ష చేస్తున్నావు అవునా, లేకపోతే మీ నాన్న నీకు చెప్పే ఉంటాడు కానీ ఏమి తెలియనట్టు నన్ను అడుగుతున్నావు, ” నిష్టూరం ధ్వనించే కంఠంతో అడిగాడు. 


“ఛ ఛా నిన్ను అనుమానిస్తే నన్ను నేను అనుమానించినట్టే మధు.. నీకు ఉద్యోగం ఇచ్చినట్టు మా నాన్న ఒక్కమాట చెప్పలేదు. నువ్వు అన్న సమయానికి మా నాన్న దగ్గరకు వెళ్ళలేదేమోననుకున్నాను. నీ మీద కోపం వచ్చిన మాట నిజం ఎందుకంటే? మా నాన్నకు నువ్వు అనాథవని చెప్పావు చూడు అందుకు. ఇక జన్మలో మన పెళ్ళి జరగదని కోపమొచ్చింది, ఇప్పుడు నువ్వు చెప్పింది విన్నాక ధైర్యంగా ఉన్నాను, ఇక మనకేం దిగులు లేదు మధు,” అతని చేతులను తన చేతులలోకి తీసుకుని గట్టిగా ముద్దుపెట్టుకుంది ప్రియాంక. కానీ తన వెనుక తండ్రి ఏం చేస్తున్నాడనే విషయం గమనించ లేకపోయింది. వీళ్ళద్దరిని ఓ కంటకనిపెట్టమని ఓ మనిషిని కాపలా పెట్టాడన్న సంగతి తెలియదు ప్రియాంకకు. 


“నాన్నా .. మధును మీ ఆఫీసుకు రమ్మన్నారు కదా వచ్చాడా,” ఏమి తెలియనట్టే అడిగింది తండ్రిని రాత్రి భోజనం చేస్తున్నప్పుడు. 


“అదేంటి బేబి .. అతను నీకు కలిసి చెప్పలేదా? చూసావా మనుషులు ఎలా ఉంటారో, నువ్వే కష్టపడి నా దగ్గరకు తీసుకవచ్చావు కనీసం నీకు మర్యాద కోసమైనా చెప్పాలి కదా! రెండురోజుల క్రితమే వచ్చాడు, నువ్వు బాధపడకూడదని మంచివాడన్నావు కదాని ఉద్యోగం ఇచ్చాను, అయితే ఆ అబ్బాయి కాలేజికి రాలేదేమో, ” కూతురు బాధపడుతుందని అన్నాడు. 


“అవునా వచ్చాడా నాన్న.. మరి మీరు నాతో చెప్పనేలేదు, మధు నేను చాలా తక్కువ కలుస్తాము అందుకే చెప్పి ఉండకపోవచ్చు, పోనిలే నాన్న నా మాట నేను నిలుపుకున్నట్టయింది మా నాన్న చాలా మంచివాడు, ” తండ్రి చేతిమీద తలవాల్చింది. 


‘బేబి.. నువ్వు ప్రేమలో పడినావనే సంగతి నాకు తెలియదనుకున్నావు. వాడితే నువ్వు మాట్లాడిన సంగతి నాకు తెలియదనుకున్నావు. ఏనాడు నా ముందు అబద్ధం చెప్పని నువ్వు వాడి గురించి నా ముందు తెలియనట్టు నాటకం ఆడుతున్నావంటే. సంగతి చాలా దూరం వెళ్లిందని నాకర్థమైంది. నువ్వు ఒక అనాథను ప్రేమిస్తే చూస్తూ ఎలా ఉంటాను. నిన్ను అపురూపంగా పెంచుకున్నది ఇందుకోసమా? నువ్వు పుట్టినప్పటినుండి నా ప్రాణంలో ప్రాణంగా చూసుకున్నది నిన్ను కష్టాలపాలు చెయ్యడానికనుకున్నావా. నీకు మహారాజలాంటి సంబంధం తెచ్చి పెళ్ళిచేస్తాను నువ్వు మహారాణి లా ఉండాలి. నిన్ను నమ్మించడానికి వాడికి ఉద్యోగం ఇచ్చాను తరువాత నేను చెయ్యాల్సింది నేను చేస్తాను’. నవ్వుతూ కూతురు వైపు చూస్తూ అనుకున్నాడు. 


 “ఏమండి .. ఆ అబ్బాయి మన వాడేనా.. అందం చదువు ఉన్నాయా? ఎంత వయసుంటుందేంటి, ” తన ధోరణిలో తానడిగింది శారద. తల్లి అలా అడుగుతుంటే సిగ్గుపడుతూ నవ్వుకుంది ప్రియాంక. 


“అడిగావు .. ఇంకా ఏంటబ్బా నువ్వు మాట్లాడడం లేదు అనుకుంటున్నా, ఏం మీ చెల్లెలు కూతురిని ఇచ్చి పెళ్ళిచేస్తావా, మగపిల్లవాడు అనగానే పరుగెత్తుకు వస్తావు మాట్లాడడానికి, ” కసురుతూ అన్నాడు భార్యను. 


“సరేలెండి కట్టుకున్న భర్త దగ్గరనే నా మాటకు విలువలేదు, ఇంకా పరుల విషయంలో నేను తల దూరుస్తానా ఏంటి, అయినా నాకేంటి తండ్రి కూతురు ఇద్దరు ఒకటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, ” అంది మూతి మూడు వంకరలు తిప్పుతూ. 



“అది సరే శారద.. పెళ్ళి మండపంలోకి వస్తావా లేదా? కన్యాదానం మనమే చెయ్యాలి, నువ్వు రాను అన్నావంటే అప్పుడు నేను ఇంకొకావిడను వెతుక్కోవలసి వస్తుంది నీ ఇష్టం మరి, ” ఆమెను కవ్విస్తూ అన్నాడు దామోదరం. తండ్రి మాటలకు పకపకానవ్వింది ప్రియాంక. 


“అబ్బో .. ఇంతోటి అందగాడికి ఇంకొకావిడ కావలసివచ్చింది కాబోలు, ఆ సందడి కోసం ఎదురు చూస్తుంటే మీరు ఎక్కడ కానిస్తున్నారు, గొంతెమ్మ కోరికలతో జాప్యం చేస్తున్నారు, ఏ వయసులో జరుగవలసిన ముచ్చట ఆ వయసులో జరిగితే బాగుంటుంది, ” గిన్నెలు దడాలున సర్దుతూ అంది శారద.


*** 


“రావయ్యా గోపాలం .. ఏంటి ఈ మధ్య కనిపించడంలేదు, మీ అమ్మాయికి పెళ్ళైందని విన్నాను అబ్బాయి ఏం చేస్తున్నాడేంటి? అంత హడావుడిగా పెళ్ళి చేసావట, ” ఆఫీసుకు వచ్చిన తన స్నేహితుడు గోపాలంను అడిగాడు. 


“ఏం చెప్పామంటావు దామోదరం.. ఈ కాలం పిల్లలకు చదువులు చెప్పించడం మహాపాపం అయిపోయింది, మన వేలకు వేలు పోసి చదువులు చెప్పిస్తే చదవడం అటుంచి ప్రేమలో కొట్టుకుపోతున్నారు, మనం పెళ్ళి చేసుకోమ్మని అడిగితే ఇప్పుడెందుకు.. నాకేమంత వయసైపోయిందని తొందర పడుతున్నారు.. నేను చదువుకుని నా కాళ్ళమీద నిలబడాలి అంటారు. తీరా చూస్తే ముసుగులో గుద్దులాటలాగా ప్రేమించిన వాడితో లేచిపోయి తల్లితండ్రులను తలెత్తుకోలేకుండా చేస్తున్నారు. ఇన్నాళ్ళు అవమానంతో కుమిలిపోతూ బయటకు రాలేకపోయాను దామోదరం, ” బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు గోపాలం. 


ఉలిక్కిపడ్డట్టుగా కూర్చిలో కదిలాడు దామోదరం. కూతురు కళ్ళముందు కనిపించింది. 


“ఏం చేస్తాం గోపాలం వాళ్ళ బుద్దులు అలా తయారవుతున్నాయి, మనం వాళ్ళమీద ఎంత నమ్మకం పెట్టుకుంటామో వాళ్ళకు తెలియదు, కన్నవాళ్ళం మనకంటే బాగా చూసుకుంటారా వాళ్ళు, పిల్లలు కష్టపడకూడదని మనం ఎన్ని చేస్తాం ఏం చూసుకుని ప్రేమిస్తారో నాకర్ధం కావడంలేదు గోపాలం, ప్రేమ గుడ్డిది అంటారు కదా! అన్నట్టుగానే వాడు ఎలాంటివాడో తాగుబోతా తిరుగుబోతా, ఆస్తి ఉందా లేదా రేపు కనీసం పిల్లలు పుడితే పెంచిపెద్దచేసే స్థోమత ఉందా, ఇవేమీ ఆలోచించరు వాడేదో రెండు ప్రేమ మాటలు చెప్పుగానే వాడే లోకం అనుకుని మన గుండెలమీద తన్ని వెళ్ళిపోతున్నారు, ” అన్నాడు. 


“దామోదరం .. ఎందుకైనా మంచిది నువ్వు తొందరపడి మీ అమ్మాయికి పెళ్ళి చేసెయ్యి, నేనంటే మాములు స్థితి కలవాడిని నువ్వు అలా కాదు కదా, తలవంపులు తెచ్చే పని జరగకముందే జాగ్రత్త పడడం మంచిది, ” అనుభవంతో చెప్పాడు. 


“ఇంతకు ఏం చేస్తున్నాడు అల్లుడు, అమ్మాయిని బాగానే చూసుకుంటున్నాడా?

కాస్త ఉన్న కుటుంబమేనా, ” ఆసక్తితో అడిగాడు. 


“డబ్బుకు కోదవలేదు అమ్మాయిని చక్కగా చూసుకుంటున్నాడు, తల్లి తండ్రులు మంచివాళ్ళే కాకపోతే మన కులం కాదు, పోని మనకన్న పెద్దకులం అయితేనన్నా బాగుండేది, ఏం చెయ్యను పరిస్థితి చెయ్యిదాటిపోయిన తరువాత ఇక తప్పదని, యాదగిరి 

గుట్టకు వెళ్ళి అక్కడే పెళ్ళి అయిందనిపించి నా బాధ్యత తీర్చుకున్నాను, ” కలతచెందిన

మనసుతో చెప్పాడు గోపాలం. 


“ఏం చేస్తాం వాళ్ళకు అలా రాసిపెట్టుంది నువ్వు కావాలని చేసిందేమిలేదు బాధపడడం మినహా, కొన్నాళ్ళు పోతే అన్ని సర్ధుకుంటాయిలే గోపాలం, ” చెప్పాడు. 


“మధు .. నీకు ఉద్యోగం ఇప్పించాను కదా మరి నాకు పార్టీ ఇచ్చేది లేదా, అది కూడా నేనే అడిగి తీసుకోవాలా ? ఏం మనిషివి బాబు, ఓ సరసం తెలియదు ప్రేయసిని ఎలా సంతోషపెట్టాలి, సినిమాలకు షికార్లకు తిప్పాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎట్టా, అన్ని నేను చెబితే తప్పా చెయ్యవు ఇలాగైతే మన పెళ్ళైనతరువాత కష్టమే, అందుకే నేనొకమాట చెబుతాను నాకు నీలాంటి వాడిని పెళ్ళిచేసుకోవాలని లేదు, నాలాగా గలగలా మాట్లాడుతూ నా సరదాలన్నీ తీర్చేవాడిని చేసుకుందామనుకుంటున్నాను. ఏమంటావు మధు, ” అతన్నీ రెచ్చగొడుతూ నవ్వుతూ అడిగింది. 


చప్పున ప్రియాంక నోటికి తన చేతిని అడ్డంపెట్టాడు. “ ప్రియా.. ప్లీజ్ పైన తథాస్తూ దేవతలుంటారు నవ్వులాటకైనా అలా మాట్లాడకు, నీకేమోగానీ నాకు మాత్రం నిన్ను చూడకుండా నిన్ను దూరం చేసుకుని నేను ఒక్క క్షణం కూడా బతకలేను, నీకు మరొకరు దొరుకుతారేమో కానీ ! నాకు నువ్వే ప్రపంచం నీతోటిదే నాలోకం ప్రియా, నా గురించి నీకు ముందే చెప్పాను కటికదరిద్రుడినని, చేతిలో చిల్లిగవ్వలేని వాడిని నిన్ను ఎలా సంతోషపెట్టను, నువ్వు చేసిన సహాయానికి నీ మనసుకు నచ్చే బహుమతి నేను ఇవ్వగలనా, ” మనసంతా బాధతో సుడులు తిరుగుతుండగా చెప్పాడు మధు. 


“మధు.. నువ్వెందుకంత బాధపడుతున్నావు నేనేదో నిన్ను తమాష పట్టించడానికని అలా అన్నాను, దానికి నువ్వింత సీరియస్ తీసుకుంటావా? నాకు నీ మనసులోనే చోటిచ్చావు ఇంకా ఇంతకన్నా గొప్ప బహుమతి నాకేం కావాలి, నీదగ్గర డబ్బులేకపోతే నా దగ్గరలేదా? నా డబ్బు నీది కాదా ! ఎందుకంత బాధపడతావు డబ్బులేదని, ” మధును అనునయిస్తూ అతని చేతిని తన గుండెలమీద పెట్టుకుని అడిగింది. 


“ప్రియా.. నీ కోసమని ఉద్యోగం చెయ్యాలనుకున్నాను, ఆ వచ్చిన డబ్బుతో నిన్ను సినిమాలకు షికార్లకు తిప్పాలని నాకు ఉంది, ఇంకా ఉద్యోగంలో చేరి నెలకూడా కాలేదు ఇంకొక నెల రోజులు కావాలి మన పరీక్షలు అయిపోతే అప్పుడు పుల్ టైం చెయ్యమన్నారు మీ నాన్న, ప్రియా.. మగాడన్నాక డబ్బులు సంపాదించి ప్రేయసిని సంతోషపెట్టాలి కొన్నాళ్ళు ఓపికపట్టు, అంతేకానీ పెళ్ళికాకుండానే నీ డబ్బు నాదెలా అవుతుంది చెప్పు, అది ఎప్పటికైనా నీదే నేను కష్టపడితే వచ్చిందే నాది, ” తన పరిస్థితికి తాను బాధపడుతూ అన్నాడు. 


“బాగుంది మధు నువ్వు చెప్పేది.. నీ డబ్బు నాడబ్బు అంటూ మన మధ్య దూరం పెంచుతున్నావు, నేను నీ దాన్నీ అయినప్పుడు నాకు చెందినవన్నీ నీవే కదా మధు, ఏదో నువ్వు మా నాన్న దృష్టిలో పడతావన్న ఉద్దేశంతో ఉద్యోగం చేస్తానంటే సరే అన్నాను, మనకేం కర్మ కష్టపడడం మన పిల్లల పిల్లలు తిన్నా తరగని ఆస్తి సంపాదించాడు మా నాన్న, అసలు మన విషయం తెలిసిందంటే మా నాన్న ఉద్యోగం కాదు నీకిచ్చేది, నన్ను నీకిచ్చి పెళ్ళిచేస్తారు తెలుసా? అప్పుడు పెత్తనమంతా ఈ అబ్బాయిగారిదే, ”అంటూ సిగ్గులమొగ్గై మధు బుగ్గలను రెండుచేతులతో నొప్పి పుట్టేలా పిండింది. 


“అమ్మో అంత బాధ్యత నేను మోయలేను ప్రియా, లోకం ఏమంటుందో తెలుసా? కోట్ల ఆస్తికి మీద కన్నేసాడు ఎర్రగా బుర్రగా ఉందని ప్రేమంటూ వల విసిరాడు, పాపం అమాయకురాలు నమ్మింది అతన్ని డబ్బంతా తీసుకుని ఎప్పుడో ఉడాయిస్తాడు, అని నలుగురు నానారకాలుగా అనుకుంటారు అందుకే నేను నీ డబ్బును ముట్టను, నేను నిన్ను ప్రేమించానంటే కేవలం నీ అందంచూసి నీ మంచితనం చూసి, నేను లేనివాడినే కావచ్చు కానీ అభిమానం లేనివాడిని కాదు ప్రియా, ” అన్నాడు ప్రియ చేతిని నొక్కి వదిలిపెడుతూ. 


“సరే ఇప్పుడవన్నీ మాట్లాడుకుంటూ కూర్చోవడమేనా పద సినిమాకు వెళదాము, ” అంటూ “ ఏయ్ ఆటో ఇలారా, ” పిలిచింది. ఆటో రావడంతోనే గబుక్కున ఎక్కి కూర్చొని మధు చెయ్యిపట్టి లాగింది. అమాంతంగా వచ్చి ప్రియాంక ఒళ్ళో వాలిపోయాడు మధు. 


=================================================================================

                                                       ఇంకా వుంది..


=================================================================================


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

 

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 




46 views1 comment

1 ความคิดเห็น



@swapnaj8931

• 23 hours ago

Next part kosam waiting, tondaraga upload cheyyandi attayya, Katha super ga undi.

ถูกใจ
bottom of page