top of page
Writer's pictureDivakarla Padmavathi

సామెతల సోమేశ్వర్రావు




'Samethala Someswara Rao' - New Telugu Story Written By Padmavathi Divakarla

Published In manatelugukathalu.com On 22/09/2024

'సామెతల సోమేశ్వర్రావు' తెలుగు కథ

రచన: పద్మావతి దివాకర్ల

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



చిన్నప్పటినుండి సామెతల్ని బాగా వంట బట్టించుకున్న పొట్టిగా ‘సోమేశ్’ అని పిలవబడే సోమేశ్వర్రావు పొట్టి కాదు కానీ, ఒట్టి అమాయకుడు. చిన్నప్పుడు అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకున్న సోమేశ్కి అవిడ మాటలవరసలో సందర్భంలో అలవోకగా చెప్పే సామెతలు మెదడులో బలంగా నాటుకున్నాయి. క్రమంగా అవి పెరిగి తలంతా వ్యాపించాయి. మర్రిఊడల్లా నవనాడులా విస్తరించాయి. తను విన్న సామెతలన్నీ నిజమని నమ్మే రకం మన సోమేశ్! 


ఓసారి కుక్కపిల్ల పెంచుకోవాలని బుద్ధిపుట్టి, పెంపుడు జంతువులు అమ్మే ఓ 'పెట్ షాప్' కి వెళ్ళాడు. అక్కడ రకరకాల కుక్కపిల్లల్ని చూస్తూ ఉండగా, ఓ బోనులో కుందేలు పిల్ల కనపడింది. దానికి నాలుగు కాళ్ళుండటం సోమేశ్ కి ఆశ్చర్యాన్ని కలుగజేసింది. 'తాను పట్టిన కుందేలుకి మూడేకాళ్ళు!' అని అంటారు కదా మరి, ఈ కుందేలుకు నాలుగు కాళ్ళు ఎలా ఉన్నాయబ్బా అని బోలెడంత ఆశ్చర్యపోయాడు. ఆ కుందేలు వైపు ఆశ్చర్యంగా సోమేశ్ చూడటం గమనించిన ఆ షాపు ఓనర్, "కుందేలు పిల్ల మీకు బాగా నచ్చిందా, అది కూడా కొంటరా?" అని అడిగాడు.


లేదని అడ్డంగా తల ఊపుతూ, "ఈ కుందేలుకి నాలుగు కాళ్ళు ఎలా ఉన్నాయి? తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళంటారు కదా!" అని సందేహం వెలిబుచ్చేసరికి విస్తు పోయాడు ఆ షాపతను. సోమేశ్కి వేపకాయంత వెర్రి ఉందని బాగానే అర్థమైంది. షాకు నుండి తేరుకొని, సోమేశ్ వెర్రిని క్యాష్ చేసుకోదలచి, "కానీ, మేము అమ్ముతున్న కుందేళ్ళకు మాత్రం నాలుగే కాళ్ళుంటాయి. మరెక్కడా ఇలాంటివి దొరకవు, తీసుకుంటారా?" అని కుక్కపిల్లతో పాటు ఓ కుందేలు పిల్లనికూడా అంటగట్టాడు మన సామెతల సోమేశ్కి, ఉదయమే మంచి బేరం దొరికినందుకు బోలెడు సంబరపడిపోతూ. సోమేశ్ సంబరం కూడా అంబరం దాటింది తనకు అరుదైన నాలుగుకాళ్ళ కుందేలు దొరికినందుకు.


మరోసారి, ఓ దూరపు బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళాడు సోమేశ్. అప్పుడు పెళ్ళికి సంబంధించిన సామెత ఒకటి గుర్తుకు వచ్చింది. 'స్నానానికి వెనుక, భోజనానికి ముందర ఉండాలన్న' ఆ సామెతని అమలు జరిపి తద్వారా లబ్ధి పొందాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్న విధంగానే స్నానానికి లేటుగా వెళ్ళేసరికి, కరెంటు పోవడంతో వేడినీళ్ళు దొరకలేదు సరికదా, అప్పటివరకూ వస్తున్న నీళ్ళు కూడా బందయిపోయాయి. కరెంటు పోవడంవల్ల నల్లాలో మామూలు నీళ్ళు కూడా రావడం మానేసాయి. ఎలాగోలా అరకొర నీళ్ళతో స్నానం అయిందనిపించాడు.


సెంట్ స్ప్రే చేసుకొని బట్టలు వేసుకొని తయారయ్యాడు. తను నమ్ముకున్న సామెత ప్రకారం భోజనానికి ముందు పంక్తిలో కూర్చోవాలని హడావుడిగా వెళ్ళాడు. మొదటి పంక్తిలో వేడివేడి భోజనం లభించిందని కడుపు నిండా తిని, తృప్తిగా తేన్చి లేచాడు కానీ ఆ సంతోషం ఎంతసేపో నిలవలేదు. ఎందుకంటే రెండో పంక్తిలో భోజనం చేసిన వారికి అప్పుడే బయట నుండి తెప్పించిన నోరూరించే రసగుల్లాలు వడ్డించబడ్డాయి. రసగుల్లా అంటే సోమేశ్కి చాలా ఇష్టం. నోరూరుతున్న రసగుల్లాలు అందరూ తింటూ ఉంటే పాపం నోరెత్తలేకపోయాడు. అసలే భోజన ప్రియుడైన సోమేశ్ అప్పటికే పీకలదాకా లాగించేసాడు మరి! తనకిష్టమైన రసగుల్లాలు అందరూ లాగిస్తూంటే చాలా కష్టమనిపించింది సోమేశ్కి. అలాగే రాత్రి కూడా తనకిష్టమైన పకోడీలు దొరకలేదు. అతని భోజనం పూర్తైయ్యాకగానీ పకోడీల పత్తాలేదు మరి! తన సామెతల పిచ్చి వల్ల అలా జరిగిందని తెలిసినా, సోమేశ్ తీరు మాత్రం మారలేదు.


పెళ్ళైన తర్వాత సోమేశ్ తన భార్య శ్యామలతో మొదటి పండుగకి మామగారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్ని మర్యాదలు చేసినా అలిగి కూర్చున్నాడు. అల్లుడి అలకకి కారణమేమిటో బోధపడక అత్తమామలిద్దరూ, బావమరిది కూడా అయోమయానికి గురైయ్యారు. ఎన్నికల ముందు అసమ్మతి నాయకులను అధిష్టానం వాళ్ళు బుజ్జగించినట్లు అల్లుణ్ణి బుజ్జగించారు. చివరికి శ్యామల నుంచి అల్లుడి అలకకు కారణం తెలుసుకొని తెల్లమొహం వేసారు. అయిన వాళ్ళకు ఆకుల్లోని, కానివాళ్ళకి కంచాల్లోని వడ్డిస్తారన్న సామెత వంటబట్టించుకున్న సోమేశ్కి అత్తవారింట తనకు వెండి కంచంలో వడ్డించినందుకు అలిగాడు మరి! తనకి సర్ది చెప్పడానికి వాళ్ళ తలప్రాణం తోకకి వచ్చిందని గ్రహించినా సరే, రేపటినుండైనా ఆకుల్లోనే భోజనం వడ్డిస్తామని మాటిస్తేనే గానీ అలక నుండి బయటపడలేదు.


పెళ్ళైన కొత్తలోనే అల్లుడి సామెతల పిచ్చి, అతనిపై గల సినిమాల ప్రభావం గురించి బాగానే తెలిసిపోయింది మామగారైన శేషగిరికి. 


"పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలంటారు కదా మావయ్యగారూ. అవేంటో చెప్తారా భవిష్యత్తులో నాకు బాగా పనికివస్తాయి!" అన్న సోమెశ్ వైపు ఆశ్చర్యంగా చూసాడు.

"అది సినిమా పేరనుకుంటాను అల్లుడుగారూ! నేను కూడా ఆ సినిమా చూడలా! మీరు చూస్తానంటే యూట్యూబ్లో పెడ్తాను, చూడండి! ఆ పన్నెండు సూత్రాలేమిటో తెలుసుకొని ఆచరించుదురుగాని! అయితే నాకు తెలిసినంతవరకూ పండంటి కాపురానికి మాత్రం ఒకటే ముఖ్యమైన సూత్రం ఉంది! ఆ సూత్రం ఒక్కటీ ఆచరణలో పెడ్తే చాలు, జీవితమంతా ఆనందమయమే!" చెప్పాడు శేషగిరి.


"అదేమిటో చెప్పండి మావయ్యగారూ, తెలుసుకుంటాను." కొత్త అల్లుడు ఆత్రంగా అడిగాడు. 

"కాపురాన్ని ఆనందమయం చేసుకొవాలంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా భార్య మాట జవదాట కూడదు! ఆమె గీసిన గీత దాటకూడదు. అంతే నే చెప్పేది. ఆచరించగలిగితే సుఖపడిపోతావు, లేదంటే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడన్నది, నేను తెలుసుకున్న సత్యం! పెళ్ళాం మెళ్ళో మంగళసూత్రం కట్టినందుకు ఆ ఒక్క సూత్రం గుర్తుంచుకుంటే చాలు." అల్లుడితో చెప్పాడు శేషగిరి స్వానుభవంతో.


మామగారిచ్చిన ఉపదేశం బాగా నచ్చింది సోమేశ్కి. ఆ సూత్రం బాగా గుర్తుపెట్టుకున్నాడు.

సామెతలు నిజమని నమ్మే సోమేశ్కి చిన్నప్పటినుండి సినిమాలు చూసే సరదా కూడా మెండుగానే ఉంది. రెండవ తరగతి చదువుతున్నప్పడు లెక్కల మాస్టరు, 

"రెండురెళ్ళెంతరా?" అని అడిగిన ప్రశ్నకి, "రెండు రెళ్ళు ఆరు!" అని తన చలనచిత్ర పరిజ్ఞానంతో జవాబిచ్చి అతని చేత చీవాట్లు తిని, ఓ పూటంతా గోడకుర్చీలో కూర్చొన్నాడు పాపం. అలాగే కామెడీ సినిమాలు చూసినప్పుడు నవ్వు వచ్చినా నవ్వడు సోమేష్. పెళ్ళైన కొత్తలో సినిమా హాల్లో కామెడీ సీన్లు వచ్చినప్పుడు నవ్వకుండా బిగదీసుకొని కూర్చున్న భర్తని చూసి ముందు ఆశ్చర్యపోయింది శ్యామల. తర్వాత, అతని నోటివెంట అందుకు గల కారణం తెలుసుకొని నోరెళ్ళబెట్టింది. 'నవ్వు నాలుగు విధాల చేటు!' అన్న సామెతని వంటబట్టించుకున్న ఫలితమది అని తెలిసి నవ్వు ఆగింది కాదు. ఆమెలా నవ్వేసరికి ఆమె వైపు గుర్రుగా చూసాడు సోమేశ్.


అల్లుడ్ని పండుగకి పిలవాలంటే కొంచెం భయంగానే ఉంది శేషగిరికి, శాంతమ్మకి, ఏ సామెత చెప్పి అలిగి కూర్చుంటాడో కదా అని! అయినా పిలవక తప్పదు కనుక, ఉగాదికి వారం రోజులుండగానే కూతుర్నీ, అల్లుణ్ణీ పండుగకి రమ్మని పిలిచాడు శేషగిరి. అయితే సోమేశ్ బావమరిది కైలాశ్ కి మాత్రం బావగారిని ఎలాగైనా అల్లరి పట్టించాలని ఉంది. ఉగాది ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగాడు కైలాశ్. బెంబేలెత్తిపోతున్న తండ్రికి ధైర్యం చెప్పి కొన్ని చిట్కాలు చెప్పాడు. అల్లుడికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి అతని సామెతల పిచ్చి తగ్గించాలని నిశ్చయించుకున్నాడు శేషగిరి.


ఉగాది రానే వచ్చింది. శ్యామలతో పాటే ఉగాది ముందు రోజు అత్తవారింటికి చేరాడు సోమేశ్. ఇంటికి వచ్చిన అల్లుణ్ణి మర్యాదగా ఆహ్వానించారు శేషగిరి, శాంతమ్మ దంపతులు.

అల్లుణ్ణి పలకరించి కుశల ప్రశ్నలు వేసిన తర్వాత, "అల్లుడుగారూ, మీకు బాగా తెలుసనుకుంటాను అల్లుణ్ణి దశమ గ్రహం అంటారని. నవగ్రహాలకి శాంతి జరిపించినట్లే, దశమ గ్రహానికి కూడా శాంతి జరిపించాలని మన ఊరి రామాలయం పురోహితుడంటే అతన్ని పిలిపించాను శాంతి కోసం! అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి, ఘనంగా జరిపించాలి మరి!" అన్నాడు.


"సరే! చేసుకోండి!" అనుమతిచ్చేసాడు సోమేశ్.


"అందుకు పాతికవేల రూపాయవుతాయట! ఆ ఖర్చంతా ఇంటి అల్లుడే భరించాలిట!" అని శేషగిరి అనేసరికి గుండెల్లో రాయి పడింది సోమేశ్కి.


"అలాగే!" అన్నాడు ఏమనాలో తెలియక, మనసులో నేరకపోయి ఉగాది పండుగకి వచ్చాను అనుకుంటూ. 


అతన్నలా షాకులో ఉండనిచ్చారు ఎందుకైనా మంచిదని. అయితే అంతపెద్ద షాక్ తగిలినా ఏ మాత్రం చలించలేదు సోమేశ్. అత్తగారు చేసిన పిండివంటలు లొట్టలేసుకుంటూ తిన్నాడు. భోజనం చేసిన తర్వాత, వక్కపొడి వేసుకొని, భుక్తాయాసం తీర్చుకోవడానికి మంచంపై వాలాడు. ఫేన్ వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తూండగా అతని బావమరిది కైలాశ్ ఆ గదిలోకి వచ్చాడు. బావగారిని చూస్తూ, "ఏమిటి బావగారూ, తిన్నింటి వాసాలు లెక్కపెట్టాలని చూస్తున్నారా? అయినా ఇది స్లాబ్ ఇల్లు కదా, వాసాలు లేవే? అయినా ఎందుకలా పైకి చూస్తున్నారు?" అని కొంటెగా అడిగాడు కైలాశ్.


వేలెడంతలేని కైలాశ్ తనని వేళాకోళం చేస్తున్నాడని గ్రహించాడు సోమేశ్. అయినా, ఏం జవాబు చెప్పాలో తెలీక నవ్వేసి ఊరుకున్నాడు. ఆ రోజంతా అలా ఏదో ఓ సామెత చెప్పి బావగారిని ఆటపట్టిస్తూనే ఉన్నాడు కైలాశ్. బజారు నుండి వక్కపొడి తెమ్మని డబ్బులిచ్చి బామ్మరిదిని పంపిస్తే, రెండు గంటల తర్వాత వట్టి చేతులతో తిరిగి వచ్చి, "అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో అన్నట్లు.. మీరడిగిందే దొరకలేదు. ఊరంతా తిరిగి వచ్చా!" అని జవాబిచ్చాడు.


ఆ మరుసటి రోజు శేషగిరి చెప్పిన పురోహితుడు పరంధామయ్య రానే వచ్చాడు. అతన్ని ఇంట్లోకి అహ్వానించి అల్లుడ్ని పరిచయం చేసాడు. 


"నిజంగానే దశమ గ్రహానికి శాంతి జరిపించాలంటారా పంతులుగారూ?" అని అడిగాడు సోమేశ్ సందేహంగా.


"నిశ్శందేహంగా! తప్పకుండా చెయ్యాలి నాయనా! రేపు ఉగాదినాడే అందుకు మంచి ముహూర్తం కూడా ఉంది!" అని చేంతాడంత లిస్టిచ్చాడు. తనకి రావలసిన సంభావనలో కొంత అడ్వాన్స్గా పుచ్చుకున్నాడు కూడా.


తన తల్లీతండ్రీ, తమ్ముడూ భర్తని ఆటపట్టిస్తున్నారని శ్యామలకి తెలుసుగానీ, ఆమె కూడా భర్త సామెతల పిచ్చికి రోజూ బలైపోవడంతో నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా ఉండిపోయింది. తన భర్తకి సామెతల పిచ్చి తగ్గితే చాలనుకుంది.


సామెతల పేరుతో అల్లుడ్ని బలేగా ఓ ఆట ఆడుకున్నామే అని శేషగిరి, శాంతమ్మ సంబరపడ్డారు. తన సరదా కూడా తీరిందని కైలాశ్ కూడా ఆనందంగానే ఉన్నాడు. ఉగాదినాడు దశమగ్రహ శాంతి అంటూ ఓ ఆట ఆడించి, అతని సామెతల పిచ్చి తగ్గించాలనుకున్నారు. 


ఆ సాయంకాలం ఏదో అవసరమొచ్చి తన పర్సు చూసుకున్న శాంతమ్మ గొల్లుమంది. అందులో ఉండాల్సిన పాతికవేల రూపాయలూ లేవు! ఎలా మాయమయ్యాయో అర్ధం కాలేదు. ఇల్లంతా వెదికినా దొరకలేదు. ఏమైందా అని ఇంటిల్లపాదీ మల్లాగుల్లాలు పడుతున్న సమయంలో వీధిలోకి తిరగడానికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చిన సోమేశ్ విషయం తెలుసుకొని చిద్విలాసంగా నవ్వాడు. 


"అత్త సొమ్ము అల్లుడు ధారపోసినట్లు.. అన్న సామెత మీకు తెలుసనుకుంటాను. అందుకే నేను అత్తగారి పర్సు నుంచి అ డబ్బులు తీసి దశమ గ్రహ శాంతికి పురోహితులకిచ్చాను." అని చెప్పేసరికి నోరెళ్ళబెట్టారు అందరూ.


తమ ప్లాన్ బెడిసికొట్టిందని, తామేం చేసినా అల్లుడి సామెతల పిచ్చి తగ్గించలేమని వాళ్ళందరికీ బాగానే అర్ధం అయింది ఆ సంఘటనతో.


సమాప్తం


పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:


పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.


85 views0 comments

Comments


bottom of page