top of page
Writer's pictureBVD Prasada Rao

ప్రేమికుడు - పార్ట్ 19


He's an ex

'Premikudu (He's an ex) - Part 19' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 22/09/2024

'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 19' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు. ఆమె సమస్యల్లో ఉందని తెలుసుకొని సహాయం చేయాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు. తల్లి సలహా మీద అంగీకరిస్తుంది అతడి భార్య గిరిజ. 


జాతర కోసం ఊరికి వెళ్లిన శేషగిరి, భార్యతో కలిసి పార్వతిని కలుస్తాడు. శోభనం రోజునుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి. ప్రతిరోజూ తనని మానసికంగా హింసించేవాడని చెబుతుంది. 


పార్వతి విషయంలో తన తలిదండ్రుల సహాయం తీసుకుందామంటుంది గిరిజ. మామగారి కారులో కుమార్ ని కలవడానికి వెళతాడు శేషగిరి.


 ఇక ప్రేమికుడు పార్ట్ 19 చదవండి. 

 

"ఆ కుటుంబం చాలా గొప్పది అల్లుడు సారూ." ఘనంగా చెప్పాడు సుందరం.


"మంచి బంటువి. గుడ్." శేషగిరి మెచ్చుకున్నాడు.


సుందరం సంతృప్తయ్యాడు.

కారు సాఫీగా ముందుకు పోతోంది.


"అల్లుడు సారూ.. మీకు ఆరెకరాల భూమి ఉండేది. అలానే వ్యవసాయం అవుతోందా." అడిగాడు సుందరం.


"ఆఁ. నాన్నే చూస్తున్నాడు. బోర్ పడింది. నీటి ఎద్దడి లేదు. పంటలు సకాలంలో బాగానే పండిస్తున్నాడు." చెప్పాడు శేషగిరి.


"మీ కుటుంబం మీద మీ ఊరిలో మంచి గురి వినిపించింది." చెప్పాడు సుందరం.


ఆ వెంబడే..

"మీరు చదువుకున్న రోజుల్లో కొద్దిపాటి అల్లర్లు చేసేవారటగా." అడిగాడు.


శేషగిరి చిన్నగా కదలాడు.

"ఆఁ. అవి అప్పటి వయస్సు పనులు. ఐనా అవీ లేవంటే నమ్మ బుద్ధి కాదు." నవ్వేసాడు సుందరం.


శేషగిరి కుదురవ్వుతున్నాడు.

సుమారు నిముషం తర్వాత..

"అల్లుడు సారూ.. మీరు సినిమాలు చూస్తారా." అడిగాడు సుందరం.


"సెలవు రోజుల్లో. అదీ తక్కువ." చెప్పాడు శేషగిరి.


"మా సారైతే అదీ లేదు. పెద్దమ్మగారు.. గిరిజమ్మ మాత్రం చూస్తుంటారు. అదీ ఎక్కువగా టివిలోనే. హాలుకు పోయేది తక్కువ." చెప్పాడు సుందరం.


ఆ వెంబడే..

"ఆఁ. ఐనా.. అప్పటిలా ఇప్పటి సినిమాలు ఉంటున్నాయా అల్లుడు సార్. ఈ మధ్యవి చాలా మట్టుకు మూస సినిమాలే. అప్పడప్పుడు వచ్చేవి మంచి కథ ఉన్న సినిమాలు అనిపించుకుంటున్నా.. అవి కూడా సినిమా ఫార్ములా చట్రంలో పడి సినిమాటిక్ గా సాగి తేలి పోతున్నాయి. కాదా అల్లుడు సార్." చెప్పి ఆగాడు.


"నీలో మంచి సమీక్షకుడు కూడా ఉన్నాడు సుందరం." శేషగిరి పొగిడాడు.


"ఏమో అల్లుడు సార్. నాకు మాత్రం అలానే తోస్తోంది." నవ్వేసాడు సుందరం.


అంతలోనే..

శేషగిరికి పార్వతి ఫోన్ చేస్తోంది.

అతడు తన జేబులోంచి ఫోన్ తీస్తాడు.

సుందరం కారుని కొద్దిగా స్లో చేస్తాడు.

"సుందరం కారు ఆపు. నేను దిగి ఫోన్ మాట్లాడి వస్తాను." చెప్పాడు శేషగిరి.


సుందరం కారు ఆపాడు.

శేషగిరి కారు దిగి.. తిరిగి డోర్ మూసి.. కొద్ది దూరం నడిచి..

పార్వతి ఫోన్ కాల్ కి కనెక్టయ్యాడు.

"చెప్పు పార్వతి." అన్నాడు.


"శేషగిరి ఎంత వరకు వెళ్లావు." అటు పార్వతి అడుగుతోంది.


"ఆఁ. బయలుదేర్తూ.. నీకు చెప్పి.. గంటేగా దాటినట్టు ఉంది. ఇదేదో చోటు. ఇటు నాకు కొత్త. గూగుల్ మ్యాపు ప్రకారం వెళ్తున్నాం." చెప్పాడు శేషగిరి.


"నా కోసం శ్రమిస్తున్నావు. జాగ్రత్త." నొచ్చుకుంటుంది పార్వతి.


ఆ వెంబడే..

"అతడు వాగితే పడకు. నాకై నువ్వు మాటలు పడ వద్దు." గబగబ అంది.


"అరె. ఎన్ని మార్లు చెప్తావ్. భయ పడకు. బాధ పడకు. నేను అంత వరకు తెచ్చుకోను." చెప్పాడు శేషగిరి.


"సరే." అనేసింది పార్వతి.

"ఉంటా మరి. గాభరా పడకు. ఇక మీదట నేనే చేస్తాను. సరేనా." చెప్పి.. ఫోన్ కాల్ కట్ చేసేసాడు శేషగిరి.


ఆ వెంబడే..

గిరిజకి ఫోన్ చేసాడు.

గిరిజ తన ఫోన్ కాల్ కి కనెక్ట్ కాగానే..

"ఏం చేస్తున్నావ్." అడిగాడు.


"మమ్మీ.. డాడీలతో మాట్లాడుతున్నా." చెప్పింది గిరిజ.


"పాప." అడిగాడు.


"యాజ్యూజువల్. చక్కగా ఆడుకుంటుంది." చెప్పింది గిరిజ.


ఉదయం.. ఊరికి బయలు దేరే ముందు..

ప్లాన్ ప్రకారం..

గిరిజని.. రాగిణిని తన మోటర్ సైకిల్ తో తీసుకొని వెళ్లి.. 

గిరిజ అమ్మ వాళ్లింటిన వాళ్లని దింపాడు శేషగిరి.

అక్కడే టిఫిన్ చేసి..

కారులో సుందరం తో కలిసి ఊరు బయలు దేరాడు. 


"ప్రయాణం బాగుంది." చెప్పాడు శేషగిరి.


ఆ వెంబడే..

"గూగుల్ మ్యాప్ ప్రకారం మరో రెండు గంటలు ప్రయాణం ఉన్నట్టు ఉంది." చెప్పాడు.


"అవునా." అంది గిరిజ.


"బోర్ లేకుండా పోతోంది సుందరంతో." నవ్వేడు శేషగిరి.

ఆ వెంబడే..

"సుందరం తెగ వాగుడు మనిషిలా ఉన్నాడు." చెప్పాడు.


"అవును. మీకు చెప్పలేదు కదూ. అతడు జర్నీ పొడుగునా మాట్లాడుతూనే ఉంటాడు." అటు గిరిజ నవ్వుతోంది.


ఆ వెంబడే..

"మీకు డ్రయివింగ్ రావడంతో.. అతడితో కలిసి కారు ప్రయాణం చేసే అవసరం మీకు ఇంత వరకు రాలేదు. కనుక మీకు తెలియక పోవచ్చు." చెప్పింది.


"పోన్లే.. బోల్డు కాలక్షేపం." చెప్పాడు శేషగిరి.


ఆ వెంబడే..

"మళ్లీ చేస్తాను. ఉంటా మరి." అన్నాడు.


"టేక్కేర్." చెప్పింది అటు గిరిజ.


శేషగిరి ఆ ఫోన్ కాల్ కట్ చేసాడు. 

కారు ఎక్కాడు.

కారు కదిలింది.

నిముషం గడవ లేదు..


"అల్లుడు సార్.. మీరు టివి చూస్తారా." సుందరం అడిగాడు.


"అప్పుడప్పుడు. న్యూస్ చూస్తుంటాను.. కామెడీ.." చెప్పుతున్న శేషగిరికి అడ్డై..

"ఆఁ. ఏం న్యూస్.. రోజుకు రెండు, మూడు మార్లు మారుతోంది.. మిగతా అంతా రిఫీట్ రీతినే న్యూస్ వస్తోంది." 

చెప్పాడు సుందరం.


చిన్నగా నవ్వేసి.. చెప్పాడు శేషగిరి..

"కామెడీ షోలు చూస్తాను."


"అమ్మో.. భలే అల్లుడు సార్. ఇప్పుడు వస్తున్న కామిడీ ప్రొగ్రామ్స్ చూడడమే. డబులు మీనింగ్స్.. వెటకారాలు.. ఎదుట వారిని కించ పర్చడాలు.. అబ్బో.. మీరు చూడగలుగు తున్నారంటే.. మీకు హెట్సాప్." ఈజీగా అనేసాడు సుందరం.


శేషగిరి ఇరకాట పడుతున్నాడు.

సుందరంని చూడలేక.. రోడ్డునే చూస్తున్నాడు.

కారు ముందుకు సాఫీగా పోతోంది.

కొద్ది సేపు తర్వాత..

మలుపు మార్గం నుండి రోడ్డెక్కి.. అటు పోతున్న గుంపుని చూసి..

కారు ఆపేసాడు సుందరం.


ఆ గుంపు శవంని తీసుకెళ్తోంది.

"ప్చ్. ఇక్కడ ఒక ప్రాణి పోయింది.. ఇదే టైంన ఎక్కడెక్కడ ఎన్నెన్నో ప్రాణులు పోయి ఉంటాయి. అలానే ఇదే టైంన ఎన్నో ప్రాణులు పుట్టుకు వచ్చుంటాయి. కాలం.. పుట్టుకులు ఆగవు.. పోవడాలు పోవు." సుందరం మెట్టవేదాంతయ్యాడు.


అప్పుడే తల తిప్పి.. సుందరంని చూస్తాడు శేషగిరి. 

ఆ వెంబడే..

చిన్నగా నవ్వుకుంటాడు.


ఆ గుంపు కనుమరుగయ్యేక.. సుందరం కారు స్టార్ట్ చేసాడు.

కారు ముందుకు పోతోంది.

"ముందు కాఫీ షాప్ కనబడితే ఆపు సుందరం. కాఫీ తాగుదాం." చెప్పాడు శేషగిరి.


"చూస్తుంటే ఈ ఏరియాల్లో కాఫీ షాప్ ల్లాంటివి తగలకపోవచ్చు అల్లుడు సార్. ఐతే గితే.. టీ పాకలు తగలొచ్చు." చెప్పాడు సుందరం.

శేషగిరి ఏమీ అనలేదు.


"ఐనా.. నిజానికి కాఫీ షాపులు బడాయికే కానీ.. ఆడ కంటే పాక టీయే నాలుకకి కమ్మగ ఉంటుంది అల్లుడు సార్." చెప్పాడు సుందరం.


'ఇదీ నీ అభిప్రాయమే.' అనుకున్నాడే కానీ.. బయటికి అనలేదు శేషగిరి.

సుందరం నుండి ఇక మీదట కౌంటర్లు వినే సహనం అతడిలో సన్నగా సన్నగిల్లుతోంది.

మరి కొంత దూరం పోయేక..

కారు ఆపాడు సుందరం.

ఇద్దరూ టీ తాగారు.

తిరిగి కారు స్టార్ట్ చేసాడు సుందరం.

తమ ముందున్న మోనిటర్ లోని గూగుల్ మ్యాప్ ని చూస్తూ..

'మరో అర గంటలో ఆ ఊరు చేరి పోవచ్చు.' అనుకున్నాడు శేషగిరి.


అప్పుడే దారి పక్కన జరుగుతున్న సభను దాటేస్తూ..

"అల్లుడు సార్.. వీళ్లు చెప్పేవి చెయ్యరు.. అడిగేవి ఇవ్వరు.. మొదట అందరికీ ఇస్తామన్నట్టు చెప్తారు. తీరా ఇచ్చేటప్పుడు ఫిల్టర్ అంటూ పిడికెడు మందికి.. అదీ పిండంలా పడేస్తారు. తమ పబ్బాలుకు ప్రజల్ని పంచుకుంటారు. వీళ్లు మారరు.. మనం ఆగం." సుందరం చిరాకవుతున్నాడు.


అతడిని చూసాడే తప్పా.. శేషగిరి ఏమీ అనలేదు.

తినగ తినగ వేము.. మచ్చున.. వినగ వినగ చెవి మొత్తును మాదిరయ్యాడు శేషగిరి.. సుందరం వాగుడులు విన్నాక.

ఎట్టకేలకు కుమార్ ఊరు వాళ్లు చేరారు.


"ఊరు చేరాం అల్లుడు సార్." చెప్పాడు సుందరం.


"మనం ఓ హోటల్ కు వెళ్దాం. మొదట రిప్రెష్ కావాలి. ఆ తర్వాత భోజనం చేసేద్దాం.. చెప్పుతున్నాడు శేషగిరి.. అటు ఇటు చూస్తూ.


"ఆఁ. అదిగో అల్లుడు సార్. అది పెద్ద హోటల్ లా ఉంది. అక్కడ ఆపుతాను." చెప్పాడు సుందరం.


కారు అటు వెళ్తోంది.

అప్పుడే.. సడన్ గా.. శేషగిరిలో ఓ ఐడియా పొడ చూపుతోంది.


========================================================================

ఇంకా వుంది..

======================================================================== 


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










142 views0 comments

Comments


bottom of page