top of page
Writer's pictureBVD Prasada Rao

ప్రేమికుడు - పార్ట్ 6


He's an ex

'Premikudu (He's an ex) - Part 6' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 20/07/2024

'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 6' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు.


గతంలో ఇరువైపుల పెద్దలూ అంగీకరించక పోవడంతో వారి వివాహం జరగదు. పార్వతికి కుమార్ అనే వ్యక్తితో, శేషగిరికి గిరిజతో వివాహాలు జరుగుతాయి.


శేషగిరి, ఇప్పుడు పార్వతిని కలిసిన విషయం తెలిసి అతని తల్లిదండ్రులు మందలిస్తారు. పార్వతి, తన భర్తతో కలిసి ఉండటం లేదని అనిపిస్తోందని శేషగిరికి చెబుతారు వాళ్ళు.


తన ఇంటికి వెళ్లిన శేషగిరి, భార్య దగ్గర పార్వతి ప్రస్తావన తేవడానికి ప్రయత్నిస్తాడు. పార్వతికి సహాయం చేయాలనుకుంటున్నట్లు చెబుతాడు. కోపగించుకుని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ.


శేషగిరి దాపరికం లేని వ్యక్తి అని, కాబట్టి అతని ద్వారా ప్రతి విషయాన్నీ తెలుసుకొమ్మని చెబుతుంది గిరిజ తల్లి సరళ.


ఇక ప్రేమికుడు పార్ట్ 6 చదవండి. 


"నాకు తెలుసమ్మా. అల్లుడుగారు ఆకతాయి కానే కాదు." అనేసింది.


"నా అదృష్టం." గిరిజ పొంగి పోతోంది.


"మన అదృష్టం. ఈ రోజుల్లో అల్లుడుగారిలాంటి వారు అరుదు." మమకారం చూపుతోంది సరళ.


"నిన్ను కలవకపోతే.. నేను తొందర పడేదాన్నేమో." గిరిజ సంశయ పడ్డది.


"వద్దొద్దు. ఏ విషయంలోను.. అందులో.. ముఖ్యంగా భార్యాభర్తలు తొందర పడ రాదు. నిదానమే ప్రదానం. గుర్తు పెట్టుకో." అవ్వలా చెప్పింది సరళ.


ఆ వెంబడే..

"ఆ పార్వతి విషయం తిరిగి అల్లుడుగారు కదిపే వరకు.. నువ్వు ప్రస్తావించకు. ఏమైనా నీతో మాట్లాడక అతడు ఏమీ చేయడు. చేయలేడు. సో. కూల్.. కూల్." చెప్పింది.


గిరిజ నెమ్మదిగా తేలకవుతోంది.

"వంటయ్యిందా." అడిగింది సరళ.


"లేదు. చేయాలి." గిరిజ చెప్పింది.


ఆ వెంబడే..

"నీది." అడిగింది.


"నేనూ డిటో. డాడీ లంచ్ కి రారుగా. తొందర లేదులే." 

అనేసింది సరళ.


"మరి.. నా వద్దకు రావచ్చుగా." అడిగేసింది గిరిజ.


"ఆఁ. లేదులే. ఇంకా స్నానమే లేదు. మరో మారు కలుద్దాం." చెప్పింది సరళ.


ఆ తర్వాత..

కొద్ది సేపు వాళ్ల సంభాషణ కొనసాగి.. 'బై బై' లతో ముగిసింది.

***

మూడు రోజుల తర్వాత..

ఉదయం పూట..

అప్పలస్వామి ఇల్లు..

చేతి కర్ర ఊతంతో లక్ష్ముం వచ్చాడు.


అతడిని చూస్తూనే..

"ఏటి మామా.. ఇలా వచ్చావు." అడిగాడు అప్పలస్వామి.


అనసూయ వంట చేస్తోంది.

ఆ ఇంటి గడపలో.. నేల మీద.. అప్పలస్వామి చేరువన.. లక్ష్ముం చతికిల పడ్డాడు.


అతడు ఆపసోపాలు పడుతున్నాడు. 

"నీళ్లు తేనా. తాగుతావా." అడిగాడు అప్పలస్వామి.


"వద్దులే." అనేసాడు లక్ష్ముం.


ఆ వెంబడే..

"నీకో కబురు తెచ్చాను." చెప్పాడు. 


తన చేతిన చుట్టి పెట్టుకున్న కాగితం ముక్కని అప్పలస్వామికి అందించాడు.


"మా ఇంటి ఎదురు పార్వతమ్మి పోన్ నంబరు. తను ఇచ్చింది." చెప్పాడు.


"ఫోన్ నెంబరా. నాకెందుకు." అప్పలస్వామి గమ్మున చిర్రెత్తిపోతాడు.


"పార్వతమ్మి మొన్ననే వచ్చింది పురంలో తన తల్లిని డాకటర్ కు చూపించుకొని.." చెప్పుతున్నాడు లక్ష్ముం.

 

అప్పలస్వామి అవస్త పడుతున్నాడు.

"నేనే చెప్పాను. మన శేషగిరి ఈ మధ్య ఆమె కోసం తనింటికి వచ్చాడని.." 


లక్ష్ముంకి అడ్డై..

"నీకెందుకు. నీకు తెలుసుగా. దానికి శేషగిరి గురించి చెప్పడమేమిటి." విసుక్కుంటున్నాడు అప్పలస్వామి.


"చాల్లేరా. ఎప్పుడో ఐంది ఐంది. ఇద్దరికీ పెళ్లిళ్లూ ఐపోయాయి. పరిచయం ఉన్నోళ్లు. కనుక ఇప్పుడు కలిస్తే తప్పేటి." గరగర చెప్పాడు లక్ష్మం.


"నొప్పి నీది కాదుగా. నాది.. మాది. మన పిల్లోడ్ని ఎంతగా ఆడిపోసుకున్నారు." నొచ్చుకుంటున్నాడు అప్పలస్వామి.


లక్ష్ముం ఏమీ అనలేదు.

గడపలో గోలకి అనసూయ అక్కడికి వచ్చింది.


"చూడూ.. మామ ఏం చేసాడో." అనసూయకి.. లక్ష్ముం నిర్వాకం  చెప్పాడు అప్పలస్వామి.


"ఏటయ్యా.. నీ పని.." విరుచుకు పడబోయింది అనసూయ.


లక్ష్ముం చేతి కర్ర ఊతంతో లేచి.. నిల్చున్నాడు.


"ఆ పిల్ల తన పోన్ నంబర్ ఇచ్చింది. మీ ద్వారా శేషగిరికి అందించమంది. వచ్చిన నా పని ఐంది. మీరు మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండి. మీ మధ్య దూరడం నాదే తప్పు." లక్ష్ముం వీథిలోకి వచ్చేసాడు. తన ఇంటి వైపు కదిలి పోయాడు.


అనసూయ.. అప్పలస్వామి ఒకరి మొహాం ఒకరి చూసుకుంటూ ఉండిపోయారు.


చివరికి అనసూయే తేరుకొని..

"గడపలో గోలెందుకు. ఇంట్లోకి రా." అనేసి స్టౌ కేసి కదిలిపోయింది.


ఆమె వెంబడే.. లేచి కదిలాడు అప్పలస్వామి.

"దీన్ని మంటలో పడేయి." అన్నాడు తన చేతిలోని కాగితం ముక్కని చూపుతూ.


"ఆ పిల్ల ఇచ్చిందిగా." అంది అనసూయ.


"అవును." తలాడించాడు అప్పలస్వామి.


"ఆగవయ్యా. బిడ్డకి తెలిస్తే మన మీద రంకెలేస్తాడు." చెప్పింది అనసూయ.


"ఆఁ. ఆడికి తెలిసినప్పటి మాట." విసురుగా అన్నాడు అప్పలస్వామి.


"లేదు లేదు. వాడి ఊరిలోకి వచ్చేక.. మీ మావైనా.. లేదా.. ఆ గుడిసేటైనా మోయక మానతారా. ఎందుకు బిడ్డతో అనిపించుకోవడం. అదే ఏదో వాడికి మోసేయ్." అనేసింది అనసూయ.


అప్పలస్వామి వెంటనే ఏమీ అనలేక పోయాడు.


అప్పుడే గుర్తుకు వచ్చినట్టు..

"అన్నట్టు.. బిడ్డకు పోనులో మాట్లాడి.. ఆ బోరు మోటరు విసయం చెప్పాలన్నావుగా. ఇదే అదును.. ఆ పోనేదో చేసి.. ఆ విసయం చెప్తూ.. ఈ విసయం కూడా చేప్పేసే." చెప్పింది అనసూయ.


"అంతేనంటావా." నసిగాడు అప్పలస్వామి.


"అంతే." తేల్చేసింది అనసూయ.


అప్పలస్వామి అక్కడి నుండి కదిలాడు. గోడ గూట్లోని తన ఫోన్ ని తీసుకున్నాడు.. శేషగిరికి ఫోన్ చేయడానికి.

***

శేషగిరి లంచ్ కి వచ్చాడు.

గిరిజ.. రాగిణికి పెరుగన్నం తినిపిస్తోంది.


"తనంతట తనే తినేలా అలవాటు చేయి రిజా." రిప్రషై వచ్చి.. గిరిజతో అన్నాడు శేషగిరి నవ్వుతూనే.


"మీరు చూస్తున్నారుగా. మీ పాప అల్లరి. చేతితో తిన్నది ఇంత.. నేల పాలు చేసింది అంత. నాకు డబుల్ పనాయే." నవ్వుతూనే చెప్పింది గిరిజ.


"అవునవును." అనేసాడు శేషగిరి.


రాగిణి భోజనమయ్యాక.. తనకి ఆట బొమ్మలు ఇచ్చి.. 

గిరిజ.. శేషగిరి.. లంచా కై డైనింగ్ టేబుల్ ముందుకు చేరారు.


అన్నంలో పప్పు చారు కలుపుకుంటూ..

"రిజా.." చక్కగా గిరిజని పిలిచాడు శేషగిరి.


'చెప్పండి.' అన్నట్టు అతడిని చూస్తోంది గిరిజ.


అప్పలస్వామి ఫోన్ సంగతులు చెప్పే ప్రయత్నం చేపట్టాడు శేషగిరి.

మొదటి సంగతి చెప్పేక ఆగాడు.


"మాటి మాటికి ఆ బోర్ మోటర్ రిఫైర్ రావడమేమిటి. ఆ పురం మెకానిక్ పనితనం బాలేనట్టే. వీలు చూసుకొని ఇక్కడి నుండి ఓ మోటర్ మెకానిక్ ని తీసుకు పోయి చూపిస్తే బాగుంటుంది. పైగా మరొకరు చూసినట్టు అవుతోంది." చెప్పింది గిరిజ.


"అదే చేస్తాను." ఒప్పుకున్నాడు శేషగిరి.


ఆ తర్వాత..

"అక్కడి విషయాలు ఇంకేమిటి." గిరిజే అడిగింది.


మెల్లిగా.. పార్వతి ఇచ్చిన ఫోన్ నెంబర్ సంగతి కూడా శేషగిరి చెప్పేయగలిగాడు.

ఆ సంగతి విన్నాక..

"అబ్బో. తను ధైర్యం చేస్తున్నట్టుందే. లేకపోతే మీ నాన్నగారికి చీటి పంపడమేమిటి." అనేసింది గిరిజ.


"చెప్పాగా. నేను వెళ్తే.. ఆమె ఇంట్లో లేదని. ఎందుకు నేను వచ్చానో తెలుసు కోవడానికేమో." శేషగిరి నసుగుతున్నాడు.


ఆ వెంబడే..

"నేను నెంబర్ ఉందని తనతో మాట్లాడ లేదు. ఐనా నీతో చెప్పక నేనలా చేయనుగా." చెప్పాడు.


భర్తనే చూస్తున్న గిరిజ.. మెల్లిగా తెములుకుంటుంది.

అంతలోనే..

"ఏమైనా.. నీ సమక్షంలోనే తనతో మాట్లాడేది జరుగుతోంది. ఫిక్స్." తేల్చేసాడు శేషగిరి.


పార్వతి మూలంగా తమ నడుమ తంటాలు ఏర్పర్చుకోవడం ముమ్మాటికి శేషగిరికి ఇష్టం లేదు.


"ఇప్పుడు మాట్లాడతారా." టక్కున అడిగేసింది గిరిజ.


"ముందు లంచ్ పూర్తి చేద్దాం." చెప్పాడు శేషగిరి.


గిరిజ మరేమీ అనలేదు.

ఇద్దరి లంచ్ పూర్తయింది.

తమ తమ పనులు చక్క పెట్టుకొని హాలులోకి వచ్చారు ఆ ఇద్దరు.

రాగిణి బొమ్మలతో ఆడుకుంటుంది.


"ఇది వరకటిలా పాప మధ్యాహ్నం పూటలు పడుకోవడం లేదేం." సోఫాలో కూర్చుంటూ అడిగాడు శేషగిరి.


"అవును." భర్త పక్కనే కూర్చుంది గిరిజ.


ఆ వెంబడే..

"ఇదీ మంచిదే. ఎలానూ వచ్చే యేడాది నుండి స్కూల్ కు పంపాలను కుంటున్నాంగా." చెప్పింది గిరిజ.


షర్ట్ జేబులోని కాగితం తీసి.. గిరిజకి అందిస్తూ..

"ఆమె ఫోన్ నెంబర్. నాన్న చెప్పింది నోట్ చేసుకున్నాను." చెప్పాడు.


"నాకెందుకు." ఆశ్చర్యపడింది గిరిజ.


"నేను ఫోన్ లో నోట్ చేసుకోను. నీ ఫోన్ లో ఫీడ్ చేసుకో." చెప్పాడు శేషగిరి.


భర్తనే చూస్తోంది గిరిజ.

చక్కగా .. "ప్లీజ్." అన్నాడు శేషగిరి.


చిన్నగా నవ్వేసి.. ఆ కాగితంని అందుకుంది గిరిజ.

"తొందరేం లేదు. సాయంకాలం లేదా తర్వాత మాట్లాడదాం. నెంబర్ మాత్రం అట్టి పెట్టు." చెప్పాడు శేషగిరి.


చిన్నగా తలాడించింది గిరిజ. ఆ కాగితాన్ని జాకెట్ లోనికి తోసేసింది.

ఆమెకు భర్త తీరు తెగ నచ్చేస్తోంది.


ఓ పావుగంట సేపు చిన్నపాటి హస్కు తర్వాత.. శేషగిరి ఆఫీస్ కు బయలు దేరాడు.

గిరిజ.. రాగిణి వెనుకెళ్లారు.

'బై బై'లు తర్వాత.. గుమ్మం తలుపు మూసి వచ్చేక..

రాగిణి తిరిగి బొమ్మల ముందు కూర్చుంది.


తిరిగి గిరిజ సోఫాలో కూర్చొంది.

గిరిజ తల్లికి ఫోన్ చేసి.. పార్వతి ఫోన్ నెంబర్ సంగతి చెప్తోంది.


========================================================================

ఇంకా వుంది..

======================================================================== 


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










149 views0 comments

Comments


bottom of page