top of page

ప్రేమికుడు - పార్ట్ 4


He's an ex

'Premikudu (He's an ex) - Part 4' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 10/07/2024

'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 4' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు.


గతంలో ఇరువైపుల పెద్దలూ అంగీకరించక పోవడంతో వారి వివాహం జరగదు. పార్వతికి కుమార్ అనే వ్యక్తితో, శేషగిరి గిరిజతో వివాహాలు జరుగుతాయి.


శేషగిరి, ఇప్పుడు పార్వతిని కలిసిన విషయం తెలిసి అతని తల్లిదండ్రులు మందలిస్తారు. పార్వతి, తన భర్తతో కలిసి ఉండటం లేదని అనిపిస్తోందని శేషగిరికి చెబుతారు వాళ్ళు.


తన ఇంటికి వెళ్లిన శేషగిరి భార్య దగ్గర పార్వతి ప్రస్తావన తేవడానికి ప్రయత్నిస్తాడు.


ఇక ప్రేమికుడు పార్ట్ 4 చదవండి. 


తను తల తిప్పి.. భర్తనే చూస్తోంది.

భార్య చూపుల్లోకి చూడ లేక తల దించుకున్నాడు శేషగిరి.


"దయచేసి పూర్తిగా వినాలి. జరిగింది జరిగినట్టే చెప్తాను. ఏదీ దాయను.." చెప్పుతున్నాడు శేషగిరి. 


అతడు తన చేతి గోళ్లని చూసుకుంటున్నాడు.

"మహాశయ్యా. నో ఉపన్యాసం. సంగతికి వచ్చేయండి." గిరిజ చెప్పుతోంది.


ఆ వెంబడే..

"చెప్పాగా. నాకు బడలికగా ఉంది. త్వరగా ముగిస్తే.. వెళ్లి పడుకుంటా." చెప్పింది.


శేషగిరి ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాడు.

తటపటాయిస్తూనే ఉన్నాడు.

"తమరు రమ్మన్నారు. వచ్చాను. తెమల్చండి." అంటోంది గిరిజ.


ఆ వెంబడే..

"తమరికి ప్రయాణ బడలిక లేదా.. ఏం." అడిగింది.


తప్పక.. తెములుకుంటూ..

పార్వతి సంగతి క్లుప్తంగానైనా.. విడమరచే భార్యకు చెప్పేయగలిగాడు శేషగిరి.


శేషగిరి చెప్పడం ఆపేక..

"ఓ. మీకు లవ్ ట్రాక్ ఉండేదా." అంది గిరిజ చిత్రంగా.


"లవ్ అంటే.. మాది.. మాది.." ఏదో చెప్పాలనుకుంటున్నాడు శేషగిరి. కానీ చెప్పలేక పోతున్నాడు.


"సర్లెండి. ఏమైనా అది లవ్వేలెండి." తేలిగ్గా అనేసింది గిరిజ. తర్వాత ఏమీ మాట్లాడ లేదు.


"మా వాళ్ల మాటలు బట్టే తప్పా.. ఇప్పుడు తను ఏ స్థితిన ఉందో నాకు స్పష్టత లేదు." అనగలిగాడు శేషగిరి.


"ఉంటే.. స్పష్టత ఉంటే.. ఇప్పుడు ఏం చేస్తారేమిటి." సర్రున ప్రశ్నించింది గిరిజ.


శేషగిరి తడబడ్డాడు.

భార్యను చూసాడు. 

తను అతడినే చూస్తోంది.


"అదే.. అలా కాదు. జస్ట్.. అదే నీతో మాట్లాడాలి." నానుస్తున్నాడు శేషగిరి.


"ఏది.. ఏంటి.. ఏం మాట్లాడాలి." గిరిజ చకచకా మాట్లాడేస్తోంది.


"ప్లీజ్. కూల్. మెల్లిగా మాట్లాడవా." మెల్లిగా చెప్పాడు శేషగిరి.


ఆ వెంబడే..

"భయమేస్తోంది." అన్నాడు.


"ఈ భయం ఈ విషయం నాకు చెప్పక ముందే మీరు పడి ఉండాలి." గిరిజ గింజుకుంటోంది.


శేషగిరి మరింత భయ పడ్డాడు.

"జస్ట్. నీతో మాట్లాడి.. నీ అభిప్రాయం తీసుకోవాలనుకున్నాను." బెదురుతూనే చెప్పాడు.


సర్రున..

"అభిప్రాయమా.. నా అభిప్రాయమా. ఇందులో నా అభిప్రాయం ఏమిటి." అడిగేసింది గిరిజ.


శేషగిరి వెంటనే అనలేక పోయినా..

గిరిజ ఆగి ఉండడంతో..

"పార్వతి ఆడది. నువ్వు ఆడదానివి. సో. అర్థం చేసుకుంటావని.." చెప్పుతున్నాడు.


అడ్డై..

"ఏం చెప్పాలనుకుంటున్నారు. నా నుండి ఏం కోరుకుంటున్నారు. నేను అర్ధం చేసుకోవడమేమిటి." గడగడ అంది గిరిజ.


శేషగిరికి మెల్లిగా చెమటలు పడుతున్నాయి. ఫ్యాన్ గాలి వంటికి తగుతుతూన్న.

శేషగిరి ఎంతకీ చెప్పక పోయే సరికి..

"చెప్పాలనుకున్నది చెప్పేయండి." గిరిజ భర్తనే సూటిగా చూస్తోంది.


తల దించుకున్నాడు శేషగిరి.

"నానుస్తే అపార్థాలు పెరుగుతాయి. తర్వాతి ఇబ్బందులు వద్దు." గట్టిగానే చెప్పింది గిరిజ.


శేషగిరి.. 'అనవసరంగా కదిపానా.' అనుకున్నాడు.


ఆ వెంబడే..

'లేక.. నేను సరిగ్గా చెప్పలేక పోతున్నానా.' ప్రశ్నించుకున్నాడు.


బెదురుతోనే గిరిజని చూస్తున్నాడు.

తను మాత్రం అతడికి జటిలంగా తోస్తోంది.

'మునిగానుగా. తప్పదు. తేలాలి.' అనుకున్నాడు.


"పార్వతి కాపురం చక్కదిద్దాలనుకుంటున్నాను." చెప్పేసాడు.

ఆ వెంబడే..

"దానికి నీ సహకారం కావాలి." అడిగేసాడు.


"బాగుంది మహానుభావ.. ఏమైనా మీ అంతటి దానిని నేను కాను.. కాలేను." గిరిజ మాటల్లో వెటకారం చిక్కగానే ఉంది.


శేషగిరి ఏమీ అనలేదు.

"ఏమిటీ సోది.. ఎందుకీ సొద." గుప్పున లేచి నిల్చుంది గిరిజ.


శేషగిరీ లేచి పోయాడు. భార్య అర చేతుల్ని తన అర చేతుల్లోకి తీసుకున్నాడు.


"రిజా.. ఐ యాం సారీ. నేను సరిగ్గా చెప్పలేక పోతున్నాను. కానీ నాలో మరో తప్పుడు ఆలోచన లేదు. కేవలం పార్వతి కాపురంని పునరుద్ధరించాలనుకున్నాను." చెప్పగలిగాడు.


"మీరెవరండి." నిలదీసినట్టు అంది గిరిజ.


శేషగిరి నీళ్లు నమలుతున్నాడు.

ఎలా చెప్పాలో అతడికి బోధ పడడం లేదు.

గిరిజనే చూస్తున్నాడు.

ఆమె.. భర్త పట్టును విదిలించింది. చరచర పడక గదిలోకి దూరేసింది.


రాగిణి పక్కకు చేరిపోయింది.

శేషగిరి ఆ గది లోకి వెళ్లాడు.

ఏదో అనబోయాడు.


"పాపను లేపేస్తాను." చెప్పింది గిరిజ.


రాగిణి నిద్రలో లేస్తే ఏడుపు ఒకంతటికి ఆపదు.

శేషగిరి తగ్గాడు. మంచం ఎక్కేసాడు.


అతడికి నిద్ర రావడం లేదు. సీలింగ్ కేసి చూస్తూ ఉండి పోయాడు.

ఫ్యాన్ తిరుగుతోంది.


అప్పుడు శేషగిరికి గుర్తుకు వచ్చింది.. హాలులో ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయలేదని. ఐనా అటు వెళ్ల లేదు. 

అతడికి కళ్లు మూసుకున్నా నిద్ర రావడం లేదు.

గిరిజ వైపు చూసాడు.


గిరిజ వీపు వైపు కనిపిస్తోంది. 

'తను నిద్ర పోగలుగుతోందా..' తలచాడు శేషగిరి.


***

మర్నాడు..

నిద్ర లేక శేషగిరి కళ్లు మండుతున్నాయి.

గిరిజ ముభావంగా తచ్చాడుతున్నట్టే తిరుగుతోంది.


శేషగిరి ఏదో పనున్నట్టుగానే ఎకాఎకీన తయారయ్యిపోయాడు.


నిజానికి ఆఫీస్ పది గంటలకైనా.. పైగా ఆఫీస్ అర కిలో మీటరు దూరాన ఉన్నా.. చెంతన మోటర్ సైకిల్ ఉన్నా.. తొందరగానే ఇంటి నుండి బయటికి వచ్చేసాడు.


వస్తూనే గిరిజతో బిక్కు బిక్కుగానే..

"ఆఫీస్ కెళ్లొస్తాను." చెప్పాడు.


అదును కోసం వేచి ఉన్న గిరిజ..

వెంటనే.. "మనం అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం. లంచ్ టేబుల్ మీద పెట్టి పోదాం." చెప్పింది.. రాగిణిని చూస్తూ.


ఆ వెంబడే..

"సాయంకాలం వద్దాం." అంది.


గిరిజ తీరు అప్పటికే శేషగిరికి ఎరికై ఉంది. 

ఏదడిగినా రాగిణిని అడ్డు పెట్టుకొని సమాధానాలిచ్చింది గిరిజ అప్పటి వరకు. 

దాంతో.. శేషగిరి ఏమీ అనలేక.. మోటర్ సైకిల్ తో ఆఫీస్ వైపు కదిలాడు.


డిగ్రీ చదువు అవుతుండగానే.. గ్రూప్స్ ఎగ్జామ్ లో సెలెక్ట్ ఐ.. ప్రభుత్వాఫీసులో క్లర్క్ జాబ్ న చేరాడు శేషగిరి. 


తొలి పోస్టింగ్ పట్నంలో రావడం.. 

ఉద్యోగంలో చేరిన సరిగ్గా పద్నాలు నెలలకే పట్నంలోని గిరిజతో.. అప్పటికే ఆఫీస్ పనుల మూలంగా తనతో పరిచయం ఏర్పడిన గిరిజ తండ్రి నాగేశ్వరరావు చొరవతో తనకు పెళ్లి కావడం..

 

అత్తవారిచ్చిన సకల సదుపాయాలు ఉన్న ఇంటిన కాపురం పెట్టడం.. 

అత్తవారు అనుకూలంగా పట్నంలోనే ఉండడం.. 

శేషగిరికి కలిసొచ్చిన ముచ్చట్లు.


సాఫీగా సాగిపోతున్న శేషగిరికి.. పార్వతి పునర్దర్శనం ఒక కదుపే.

ఇది ఎటు దారి తీస్తోందో..

***

గిరిజ అమ్మవారింటిన..

గిరిజ తల్లి సరళ. తను ఓ గృహిణి. 


గిరిజ తండ్రి నాగేశ్వరరావు. తను ఓ ప్రభుత్వ ఇంజనీర్.


గిరిజ వెళ్లే సరికి.. నాగేశ్వరరావు డ్యూటీకి వెళ్లిపోయాడు.

డోర్ బెల్ తో తలుపు తీసిన సరళ.. 

రాగిణిని ఎత్తుకుంటూ..

"ఏంటీ సర్ప్రైజ్. అల్లుడు ఏరీ." గిరిజతో అంది.


"ఆయన రాలేదు." ముభావంగా చెప్పింది గిరిజ.


"మరి నువ్వు ఎలా వచ్చావు." అడిగిన సరళకి..


"క్యాబ్ లో." పొడిగా చెప్పింది గిరిజ.


"నువ్వు ఎప్పుడు వచ్చినా అల్లుడుగారేగా నిన్ను దిగబెట్టేది." ముక్తసరిగా అంది సరళ.


గిరిజ ఏమీ అనలేదు.


========================================================================

ఇంకా వుంది..

======================================================================== 


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










163 views0 comments

Comments


bottom of page