top of page
Writer's pictureBVD Prasada Rao

ప్రేమికుడు - పార్ట్ 2


He's an ex

'Premikudu (He's an ex) - Part 2' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 30/06/2024

'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 2' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి.

తల్లిని హాస్పిటల్ లో చూపించాక తనతో తీసుకొని వెళతానంటాడు.

ఊర్లో అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు.

ఇక ప్రేమికుడు పార్ట్ 2  చదవండి.


హైవే మీద బస్సు సాఫీగా సాగుతోంది.

అనసూయ.. శేషగిరి పక్క పక్కగా ఒకే సీటున కూర్చున్నారు. 

అనసూయ కిటికీ వైపున ఉంది.

బయట ఎండ నిమానంగా ఉంది. అదీ అటు వైపు నుండి బస్సులోకి పడుతోంది.


అనసూయ.. శేషగిరి కూర్చున్న వైపున నీడ ఉన్నా.. గాలి కాస్తా వేడిగానే తగులుతోంది.

ప్రయాణాల్లో.. అలవాటు ప్రకారం.. సీటు వెనుక్కు జారపడి కళ్లు మూసుకున్నాడు శేషగిరి.

పార్వతి తలంపు అతడిలో పొడచూపుతోంది.


'పార్వతి.. పార్వతి..'

***

శేషగిరి తల్లిదండ్రుల ఊరి స్కూలులో ఏడవ తరగతి వరకే చదవొచ్చు.

ఆ పై చదువులకు ఆ ఊరికి ఆరు కిలో మీటర్ల దూరాన ఉన్న పురం పోవలసిందే.

శేషగిరి అందుకే తన ఎనిమిదవ తరగతి చదువుకై అటు వెళ్తున్నాడు. 


అప్పలస్వామి రెండో వాడుక సైకిల్ ని శేషగిరికి కొని  పెట్టాడు.

శేషగిరి పదవ తరగతిన ఉండగా.. పార్వతి ఎనిమిదవ తరగతి చదువుకై పురం వచ్చేది.

ఆమె కూడా సైకిల్ మీదే వచ్చేది.


అప్పటి వరకు ఆమె.. 'తన ఊరు అమ్మాయి'గానే శేషగిరికి తెలుసు. అంతే. 

అప్పటి వరకు పార్వతిని పట్టించుకోని శేషగిరి.. సైకిల్ మీద వెళ్తుండగా దార్లో కాకతాళీయంగా ఆమెను గమనించడం జరుగుతోంది. కారణం.. అప్పుడే ఆమె పెద్ద పిల్ల కావడం.. ఆమె ఒళ్లు నిగారింపు.. ఆమె కళ్లు జలదరింపు.. ఆమె వైపుకు అతడిని ఉసిగొల్పాయి.


తొలినాళ్లలో.. భీతితో ఆమెను చూడడం వరకే సరి పెట్టుకున్న శేషగిరి.. మెల్లిగా ప్రీతితో ఆమె చేరువకు చేరడం మొదలెట్టాడు.


వాళ్లకు మాటలు అడడం నెమ్మదిగా కుదిరింది. ఆ మాటలు మెల్లిగా గుసగుసలుగా మారాయి.


వెళ్లేటప్పుడు.. వచ్చేటప్పుడు.. అటు వెళ్లే వీళ్లాంటి స్టూడెంట్స్ ని.. వదిలి పెడుతూ.. పార్వతి.. శేషగిరి.. కోరి వెనుక్కు తగ్గడం చేపట్టారు. ఇద్దరూ కలిసి పక్క పక్కగా సైకిల్స్ మీద ఆ స్టూడెంట్స్ కు బాగా వెనుగ్గా వెళ్లేవారు. 


అలా ఆ ఇద్దరే కలిసి రాక పోకలు కొనసాగించారు.

వీళ్ల గురించి చెవులు కొరుక్కోవడాలు జరుగుతున్నాయని ఒక రోజున వీళ్లకి తెలిసింది.


ఐనా వీళ్లు పట్టించుకోలేదు. తమ తమ సొదలన తాము ఉన్నారు.


శేషగిరి ఇంటర్మీడియట్ పాసయ్యాడు. 

పార్వతి పదవ తరగతి తప్పింది.

దాంతో వీళ్లిద్దరి దార్లో కలయికలకు బ్రేక్ పడింది.


శేషగిరి డిగ్రీలో చేరాడు. 

పార్వతి ఇంటినే పడింది.


అప్పటికి మాట్లాడుకున్నందుకు వీళ్లిద్దరి వద్ద ఫోన్ లు లేవు.

శేషగిరి.. పార్వతి ఇంటి ముందు తచ్చాట్లు మొదలెట్టాడు.

ఆమె కనిపించడం గగనమే ఐంది.

శేషగిరి చిర్రెత్తిపోతుండే వాడు.


ఏమైందో ఏమో కానీ.. ఒక రోజున.. వీళ్ల గురించి.. వీళ్ల పెద్దలు గట్టిగానే తగువులు పడ్డారు.


శేషగిరే.. పార్వతి వెనుక పడుతుండేవాడని.. పార్వతి పరీక్ష పోవడానికి శేషగిరే కారణమని.. ఇప్పుడు ఆమెకై.. తమ ఇంటి ముందు శేషగిరి తచ్చాడుతున్నాడని.. పార్వతి పెద్దలు.. ఊరి మోతుబరులు తేల్చేసారు. శేషగిరి తల్లిదండ్రులకు వార్నింగ్ లిచ్చారు.


దాంతో  అనసూయ.. అప్పలస్వామి.. శేషగిరిని బాగా ఆడిపోసుకున్నారు.


ఆ తోవ లోనే.. పార్వతిని ఎకాఎకీన ఎక్కడికో గుట్టుగా ఊరు నుండే తోలేసారు ఆమె తల్లిదండ్రులు.

శేషగిరికి తర్వాత తెలిసింది.. పార్వతి తన అమ్మమ్మ ఊరులో ఉంటుందని.


సాహసించి శేషగిరి అక్కడికీ పాకేడు. ప్చ్. పార్వతిని కలిసే వీలు అతడికి కుదర లేదు. పైగా శేషగిరి అటు వెళ్లాడని తెలుసుకున్న పెద్దలు.. ముఖ్యంగా శేషగిరి తల్లిదండ్రులు.. చాలా కటువుగా శేషగిరి పట్ల ప్రవర్తించారు. కఠినమైన కాపలా మధ్య అతడిని ఇరికించేసారు. 


కొన్నాళ్లకి శేషగిరికి తెలిసింది.. పార్వతికి పెళ్లి చేసేసి అమ్మమ్మ ఊరి నుండే ఆమె అత్తవారూరికి తోలేసారని.

***

పదిహేను రోజుల తర్వాత..

అనసూయని పట్నం నుండి తిరిగి ఊరికి తీసుకు వచ్చేడు శేషగిరి.


అనసూయ ఆరోగ్యం కుదురయ్యింది.

అనసూయని ఇంటిన దించేక.. మరి ఆగలేక.. పార్వతిని కలవడానికి బయలు దేరాడు శేషగిరి.


"ఇప్పుడే వచ్చావుగా. ఎటు." అప్పలస్వామి గమ్మున అడిగాడు.


శేషగిరి తడబడబడుతున్నాడు.

అప్పుడే..

"నువ్వు.. ఆ పార్వతి బొట్టె కలుసుకున్నారట." అన్నాడు అప్పలస్వామి. 


తండ్రిని చూసాడు శేషగిరి.

అప్పలస్వామి చూపులు చాలా దారుణంగా ఉన్నాయి.


"నన్ను నాన్నకి అప్పగించేసావుగా. నీ ఇంటికి వెంటనే పో." అనసూయ విసురుగా కలగ చేసుకుంది.


ఆ వెంబడే..

అప్పలస్వామితో..

"ఏంటీ. ఆ చుప్పనాతి.. వీడు కలుసుకున్నారా."  అంది.

 

అనసూయ అయోమయంలో ఉంది.

"ఎప్పుడు." భర్తని అడుగుతోంది.


"నిన్ను తీసుకు పోడానికి వచ్చాడుగా. ఆ రోజే. ఇద్దరూ కలిసారట. దానింటి ముందే మాట్లాడుకున్నారట. మీరెళ్లేక.. మన లచ్చుమ్ మామ లేడు.. అతడు చెప్పాడు. తను కళ్లారా చూసాడట. అదే వీడిని చూసి ఆపిందట." చెప్పాడు అప్పలస్వామి.


"ఏరా. మళ్లేటీ బాగోతం." అనసూయ కొడుకును చూస్తోంది.


"ఎన్నాళ్ల నుండో లేనిది.. ఇదిగో.. ఆ ముదనష్టపుది ఊరిలోకి దాపరించి పడిందిగా. వీడు అగుపించే సరికి.. తైతకలు మొదలెట్టింది." హైరానా అవుతున్నాడు అప్పలస్వామి.


"మనోడిదే తప్పు అంటూ గోలెట్టారుగా.  ఇప్పుడు దాని వాళ్లని కడిగేయండి." అనసూయ విసురుగా అంది భర్తతో.


"దాని వాళ్లా.. ఆఁ. దాని అబ్బ ఎప్పుడో చచ్చాడుగా. ఇక దాని తల్లి కాళ్లాడక మంచాన పడ్డాదిగా." రోషంగా అన్నాడు అప్పలస్వామి.


"మరే. అప్పుడు మనని ఆడిపోసుకున్నారుగా. ఉసురు ఊరుకుంటుందా." విసురుగా అనసూయ అనేసింది.


శేషగిరి అప్పటికి తేరుకోగలిగాడు.

"చాల్లెండి. నోరు చేసుకొని పడిపోతారు. ఇంత వయస్సు వచ్చినా మారరు. ఛఛ." విసుక్కున్నాడు.


అనసూయ.. అప్పలస్వామి మాట్లాపేరు.

అదే అదునుగా..

"నేనేమైనా అప్పటి పిల్లోడ్నా. నాకు ఏమీ తెలియవనుకుంటున్నారా. ఇంకా కట్టడి చేస్తున్నారు." గట్టిగానే అన్నాడు శేషగిరి.


కొడుకు గొంతుతో అనసూయ.. అప్పలస్వామి బిక్కచచ్చారు.

"నాకు భార్య ఉంది. నాకు బిడ్డ ఉంది. నేను మంచి, చెడు చెప్పించుకొనేలా లేను." చెప్పాడు శేషగిరి గట్టిగానే.


ఆ వెంబడే..

"నేను బయటికి వెళ్తున్నాను. పట్నం డాక్టర్ బోగాట ఇక్కడి డాక్టర్ కు చెప్పాలి." చెప్పాడు.


బయటికి నడిచాడు.

పార్వతి ఇల్లు దాటుకొని నేరుగా డాక్టర్ వద్దకు వెళ్లాడు.

అతడికి అనసూయ వైద్యం సంగతి చెప్పాడు.

తిరిగి వస్తూ.. పార్వతి ఇంటి ముందు కోరి ఆగాడు.

ఇంట్లోకి చూసాడు.


ఇంటి తలుపు మూసి ఉంది.

అటు ఇటు చూసాడు. 

గడప లోకి వెళ్లి.. ఆ ఇంటి తలుపు తట్టాడు.

తలుపు తడుతున్నా.. ఎంతకీ తలుపు తీయక పోయే సరికి.. పరిశీలనగా చూసాడు.


తలుపు పైన గొళ్లం పెట్టి తాళం వేసి ఉండడం అతడి చూపున పడింది.

ఉసూరుమన్నాడు.

వీథిలోకి వచ్చాడు.


అప్పుడే ఎదురింటి గడపలో చుట్ట చుట్టుకుంటున్న పెద్దాయన లక్ష్ముం అగుపించాడు.


"పార్వతమ్మి.. తన తల్లిను తీసుకొని పురం వెళ్లింది. ఆ తల్లికి ఏదో రోగం." చెప్పాడు లక్ష్ముం. అతడి మాట తీరు శేషగిరిని ఇబ్బంది పర్చింది.


ఏమీ అనక.. బరబర ఇంటిని చేరాడు శేషగిరి.

"అన్నం వండాను. తినేసి బయలుదేర్తావా." అనసూయ అడిగింది.


"లేదు." పొడిగా చెప్పాడు శేషగిరి.


"ఆడ నీ పెళ్లం, నీ బిడ్డ బిక్కుబిక్కు అవుతారు." తల్లి తీరులోని వెటకారం శేషగిరికి తెలుస్తోంది.


ఐనా.. నిదానంగానే.. 

"పర్లేదు. ఇరుగు పొరుగు ఉన్నారు. పైగా ఆమె కన్నోరు ఊరిలోనే ఉన్నారు." చెప్పాడు.


"డాక్టర్ ని ఇంకా కలవ లేదా." అప్పుడే అప్పలస్వామి అడిగాడు.


"ఆఁ. కలిసాను." చెప్పాడు శేషగిరి నిర్లిప్తంగా.


"మరేం. ఇక్కడ నీకు ఇంకేం పని." అడిగాడు అప్పలస్వామి. అతడి వాటం శేషగిరిని చిర్రెక్కించింది.


"మీరు.. అమ్మా.. నాన్నలేనా." అనేసాడు విసుగ్గా.. విసురుగా.

ఆ వెంబడే..

"బిడ్డతో మాట్లాడే తీరు ఇంత దారుణంగా ఉండదు." అన్నాడు.


వెంటనే ఆ తల్లిదండ్రులు ఏమీ అనలేదు.


========================================================================

ఇంకా వుంది..

======================================================================== 


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










156 views0 comments

Comments


bottom of page