కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link
'Veeri Madhyana Episode 8' New Telugu Web Series
Written By BVD Prasada Rao
రచన: బివిడి ప్రసాదరావు
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
బివిడి ప్రసాదరావు గారి ధారావాహిక 'వీరి మధ్యన..' ఎనిమిదవ భాగం
గత ఎపిసోడ్ లో…
సేల్స్ గర్ల్ గా వచ్చిన ఆమె తనతో ప్రవర్తించిన తీరును సాహసితో చెబుతాడు సామ్రాట్.
అతని నిజాయితీకి సంతోషిస్తుంది సాహసి.
ఆ సేల్స్ గర్ల్, సామ్రాట్ ని పరీక్షించడానికి తాను ఏర్పాటు చేసిన వ్యక్తి అనే విషయం అతని ముందు అంగీకరిస్తుంది.
స్నేహితుల పెళ్లికోసం ఇద్దరూ తిరుమల వెళ్తారు.
ఇక వీరి మధ్యన.. ఎనిమిదవ భాగం చదవండి...
"ఈ టైంకి నాకు టీ పడాలబ్బా." అన్నాడు సామ్రాట్ గుణుస్తూ.
"ఓకే బాబూ. నువ్వు తెప్పించుకో." అంది సాహసి చొరవగా.
"నిన్ను ఎదురుగా పెట్టుకొని ఒంటరిగా తాగడమా. నో. వద్దులే." అనేశాడు సామ్రాట్ సరదాగా.
"కాదు బాబూ. తెప్పించుకో" చెప్పింది సాహసి.
"ఒక పని చేస్తా. టీ తెప్పించుకుంటా. నీకు కొద్దిగా షేర్ చేస్తా." చెప్పాడు సామ్రాట్.
"మొండిగా అగుపిస్తున్నావు. సర్లే. కానీ." అనేసింది సాహసి.
బోయ్ ని పిలిచి, "ఒక టీ. ఒక ఖాళీ గ్లాస్." చెప్పాడు సామ్రాట్.
సామ్రాట్ ని ఎగదిగా చూసి వెళ్లి పోయాడు బోయ్.
"ఒన్ బై టూ అనవలసింది." అంది సాహసి. తను బోయ్ చేష్టని చూసింది.
"అబ్బే. ఐ వాంట్ సమ్ థ్రిల్." అన్నాడు సామ్రాట్ నవ్వేస్తూ. సాహసి కూడా నవ్వేసింది.
పావు గంట పిదప, కాఫీ కేఫ్ నుండి ఆ ఇద్దరూ బయటికి వచ్చారు. తిరిగి తమకు కేటాయించిన వసతుల వైపు నడుస్తూ మాట్లాడుకుంటున్నారు.
"ఆ జ్వాలను లంచ్ టైంలో చూశాను. తను ఈ పెళ్లికే వచ్చినట్టు ఉంది." చెప్పాడు సామ్రాట్.
"మరి. తనూ కవితకు తెలిసిందే." చెప్పింది సాహసి.
ఆ వెంబడే, "ఏం. ఏమైనా మాట్లాడిందా." అడిగింది.
"అబ్బే. నన్ను చూస్తూనే చరచరా ఎటో వెళ్లి పోయింది." చెప్పాడు సామ్రాట్ నవ్వుతూ.
సాహసి నవ్వుకుంది.
తర్వాత, ఆ ఇద్దరూ విడిపోయి, ఎవరి తోవన వారు నడిచారు.
డిన్నర్ సమయంలో సాహసి, సామ్రాట్ లు ఒకర్ని ఒకరు చూసుకున్నారే తప్పా, మాట్లాడుకునే అవకాశం వాళ్లకి చిక్కలేదు.
పెళ్లి మండపంలో, వేదిక మీద, కవిత పక్కకి సాహసి, రమేష్ పక్కకి సామ్రాట్ చొరవగా చేరిపోయి, ఇద్దరూ అక్కడ చక్కగా, చలాకీగా మెసులుకున్నారు.
కవిత, రమేష్ ల పెళ్లి ముచ్చటగా ముగిసింది.
ఆ రాత్రి ఎవరి వసతుల్లో వాళ్లు గడిపేసి, మర్నాటి తెల్లవారున, అక్కడ ఉండ వలసిన వారు ఉండి పోయారు. వెళ్ల వలసిన వారు తమకు కేటాయింపడిన వాహనాల్లో బయలు దేరి పోయారు.
దాంతో సాహసి, సామ్రాట్ లు తమ తమ వాహనాల్లో తమ తమ ఊళ్లకు తిరుగు పయనమయ్యారు బరువెక్కిన హృదయాలతో.
***
తేది ఇరవై నాలుగు. సమయం టెన్ ఫిప్టీ టు ఏయం.
ఆఫీస్ లో తన కొలీగ్స్ కు తన వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డులను ఇస్తున్నాడు సామ్రాట్. అంతలోనే అతని సెల్ ఫోన్ మోగుతుంది.
కాల్ కి కనెక్ట్ ఐ, "చెప్పమ్మా." అన్నాడు.
ఫోన్ చేసిన మాలతి వెంటనే మాట్లాడలేక పోయింది.
"అమ్మా." అన్నాడు సామ్రాట్.
"ఆ. నువ్వు ఇంటికి రా." చెప్పగలిగింది మాలతి.
"ఏమ్మా." అడిగాడు సామ్రాట్ ఆత్రంగా. తల్లి గొంతులో మార్పు అతనికి తెలుస్తుంది.
"అదే. మీ విజయవాడ మేనత్త చనిపోయింది." చెప్పేసింది మాలతి.
సామ్రాట్ చలించాడు.
"మీ నాన్నని ఓదార్చలేకపోతున్నాను." చెప్పుతుంది మాలతి.
అది వింటూనే, "వస్తున్నానమ్మా." చెప్పాడు సామ్రాట్.
ఆ వెంటనే ఇంటికి బయలు దేరాడు. అప్పటికి కొలీగ్ చేతికి అందించబోతున్న తన వెడ్డింగ్ కార్డును తిరిగి తన బేగ్ లో పడేస్తూ, "అన్నా మళ్లీ కలుస్తాను." అని అతనితో అని, హడావిడిగా అక్కడ నుండి కదిలిపోయాడు.
ఆ కొలీగ్, విషయం అర్థం కాక విస్మయంలో ఉండి పోయాడు.
సామ్రాట్ ఇంటిని చేరాడు. హాలులోని తల్లిదండ్రుల దరికి చేరాడు.
సామ్రాట్ ను చూడగానే గోపాలస్వామి ఏడ్చేశాడు.
తండ్రిని సముదాయిస్తూ, "కబురు ఎప్పుడు వచ్చింది." అడిగాడు.
"అరగంట క్రితం మీ సుబ్బారావు మామయ్య నాన్నకి ఫోన్ చేసి చెప్పారు." చెప్పింది మాలతి.
ఆ వెంబడే, "హార్ట్ ఎటాక్ ట. హాస్పిటల్ కు చేరక ముందే, దార్లోనే ప్రాణం పోయిందట." చెప్పింది.
సామ్రాట్ చొరవతో త్వరత్వరగా తెములుకొని, విజయవాడ బయలుదేరారు ఆ తల్లిదండ్రులు. సామ్రాట్ వాళ్ల వెంటే ఉన్నాడు. అతడే కారును డ్రయివ్ చేస్తున్నాడు.
***
సమయం సాయంకాలం ఐదవుతుంది.
గోపాలస్వామి వాళ్ల రాక కోసమే వేచి ఉన్న అక్కడి వారు, వీళ్లు అక్కడికి చేరగానే, ఎకాఎకీన తదుపరి కార్యక్రమాలు కానిచ్చేశారు.
రాత్రి తొమ్మిదవుతుంది.
సామ్రాట్ ఫోన్ మోగుతుంది.
అక్కడి వాళ్ల మధ్య కూర్చున్న సామ్రాట్ లేచాడు. ఆ ఇంటి బయటికి వచ్చాడు. ఒక పక్కన నిల్చున్నాడు. అప్పటికే సాహసి నుండి వచ్చిన ఆ ఫోన్ కాల్ కట్ ఐపోయింది. సామ్రాట్ తిరిగి సాహసికి ఫోన్ చేశాడు.
ఆ ఫోన్ కాల్ కి కనెక్ట్ అవ్వగానే, "ఏంటి బిజీయా." అడిగింది సాహసి.
సామ్రాట్ నెమ్మదిగా జరిగింది చెప్పాడు.
అంతా విని, "సారీ." అంది సాహసి.
సామ్రాట్ మాట్లాడ లేదు.
"అంకుల్ దగ్గరిలో ఉన్నారా." అడిగింది సాహసి.
"లోపల ఉన్నారు. వాళ్లతో మాట్లాడుతున్నారు." చెప్పాడు సామ్రాట్.
"సరే. టేక్ కేర్." అంటూ ఆ కాల్ ని కట్ చేసేసింది సాహసి.
సామ్రాట్ ఇంట్లోకి వెళ్లి పోయాడు.
పది నిమిషాల లోపే గోపాలస్వామి ఫోన్ మోగుతుంది.
ఆ కాల్ కి కనెక్ట్ కాగానే, "సారీ బావగారూ. ఇప్పుడే విషయం తెలిసింది." అటు మోహనరావు అన్నాడు.
"అంతా సడన్ బావగారు. మాకే అయోమయంగా ఉంది." చెప్పాడు గోపాలస్వామి.
మోహనరావు ఓదార్పు మాటలు చెప్పి, "మీ చెల్లెమ్మ మాట్లాడుతుంది." అన్నాడు.
శైలజ మాట్లాడింది. తర్వాత మాలతికి ఫోన్ ఇవ్వమంది. మాలతి, శైలజలు మాట్లాడుకున్నారు.
ఆ ఫోన్ సంభాషణలు ముగిశాక, "ఇరవై తొమ్మదిన సామ్రాట్ పెళ్లి ఉంది కదూ." అన్నారు అక్కడి వాళ్లలో ఒకరు.
"అవును." అన్నాడు గోపాలస్వామి.
"వాయిదా వేయక తప్పదు." అన్నారు మరొకరు.
మాలతి, గోపాలస్వామి మొహాలు చూసుకున్నారు.
అప్పుడే, "మరి అంతేగా. తప్పదు." అన్నారు వేరొకరు.
సామ్రాట్ అందర్నీ చూస్తూ, అన్నీ వింటూ బొమ్మలా ఉండిపోయాడు.
***
మర్నాడు. ఉదయం తొమ్మిదవుతుంది.
శైలజ, మోహనరావు విజయవాడ వచ్చారు. వాళ్లు తన మేనత్త ఇంటిని చేరడానికి సామ్రాట్ సాయపడ్డాడు.
పలకరింపులు, పరామర్శలు అయ్యాయి. కాఫీ, టిఫిన్లు అంద చేయబడ్డాయి.
తర్వాత మోహనరావు కోరిక మేరకు, సామ్రాట్ చొరవతో, మోహనరావు దంపతులు, గోపాలస్వామి దంపతులు ఒక గదిలో సమావేశమయ్యారు. వాళ్ల చెంతనే సామ్రాట్ కూడా ఉన్నాడు.
"బావగారూ. సమయం కాదు. కానీ పిల్లల పెళ్లి దగ్గర పడుతుంది కనుక, ఇప్పుడు ఇలా మాట్లాడక తప్పడం లేదు." అన్నాడు మోహనరావు.
"చెప్పండి బావగారు." అన్నాడు గోపాలస్వామి.
ఆగి, "పెళ్లి జరిపించుకొనే అవకాశం ఉంటుందా." అడిగాడు మోహనరావు మెల్లిగా.
గోపాలస్వామి మాట్లాడ లేదు.
"తన అక్క చనిపోవడంతో ఇతను బాగా డీలా పడ్డారు." చెప్పింది మాలతి.
"మరి. సహజమేగా వదినగారూ." అంది శైలజ.
సామ్రాట్ కామ్ గా ఉన్నాడు.
"తలవని తలంపు సంఘటనే ఇది. తేరుకోవడం కష్టమే. కానీ, మా వైపు నుండి.." ఆగాడు మోహనరావు.
"చెప్పండి బావగారు." అన్నాడు గోపాలస్వామి నెమ్మదిగా.
"అదే బావగారు. అడ్వాన్స్ లుగా చాలా పైకం హెచ్చించి, బాగా ఖర్చులు చేసేసి, అన్ని పిలుపులు చేసేసి, పిల్లల పెళ్లికి సిద్ధమై ఉన్నాం." మళ్లీ చెప్పడం ఆపాడు మోహనరావు.
"మేమూ అలానే మాట్లాడుకున్నాం. మాకూ కష్టంగానే ఉంది. నిజమే. మా కంటే మీ వైపుదే జాస్తీ హైరానా. ఏమీ పాలు పోవడం లేదు." చెప్పాడు గోపాలస్వామి.
"ఈయన వైపు వాళ్లు వాయిదా కోరుతున్నారు." చెప్పింది మాలతి.
అప్పుడే సామ్రాట్ మాట్లాడేడు. "అంకుల్ వైపుది కూడా గుర్తించాలిగా. పైగా మోర్ దేన్ నైన్టీ పర్సంట్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ మన వైపున కూడా ఐపోయాయి. ఏది సమ్మర్థవంతమో ఆలోచించండి." చెప్పాడు.
పెద్దలు ఏమీ మాట్లాడలేదు.
కానీ సామ్రాట్ ఈ సమయంలో కలగచేసుకొని, తమకు అండగా మాట్లాడడం మోహనరావు దంపతులను కుదుట పరుస్తుంది.
"మీరు ఉండండి, నేను వెళ్లి మరో సారి మా బావగారితో మాట్లాడతాను." చెప్పాడు గోపాలస్వామి. లేచాడు. అటు కదిలాడు. అతనిని అనుసరించింది మాలతి.
మిగిలిన ఆ ముగ్గురు హాయి అవుతున్నారు.
"థాంక్స్ బాబూ. నువ్వు మమ్మల్ని అర్ధం చేసుకున్నావు." అన్నాడు మోహనరావు కొద్ది సేపు తర్వాత.
"అయ్యో. పెళ్లి చేస్తుంది మీరు. మీ వైపుది విస్మరించడం భావ్యం కాదు. వీలున్నంత మేరకు లభించే అవకాశాన్ని వినియోగించుకు తీరాలి." చెప్పాడు సామ్రాట్.
"మానసిక వ్యధ తప్పా, సాంప్రదాయ ప్రకారం సర్దుకు పోవచ్చట. పెళ్లి జరుపుకోవచ్చట." చెప్పింది శైలజ.
"మా పెద్దలతోనూ మేము మాట్లాడేం బాబూ." చెప్పాడు మోహనరావు.
"అయ్యో. మిమ్మల్ని అనడానికి ఏమీ లేదు. పెళ్లి సవ్యంగా జరిపేందుకే చూద్దాం." చెప్పాడు సామ్రాట్.
"సాహసి కూడా మీతో మాట్లాడి మీ అభిప్రాయం ప్రకారమే నడుచుకోమని మాకు మరీ మరీ చెప్పింది బాబూ." చెప్పాడు మోహనరావు.
సామ్రాట్ చిన్నగా నవ్వేసి, "మేము ఫోన్ లో మాట్లాడుకున్నాం అంకుల్. ఉభయలకు సమ్మతమైనట్టే నడుచుకోవాలని మేము అనుకున్నాం." చెప్పాడు సామ్రాట్.
మరి కొంత సేపు తర్వాత - అక్కడికి తిరిగి గోపాలస్వామి వచ్చాడు. మాలతి అతడి వెంటే వచ్చింది.
అక్కడి ముగ్గురూ వచ్చిన ఆ ఇద్దరి వంక ఆతృతగా చూస్తున్నారు.
"బావాగారూ అనుకున్నట్టే పిల్లల పెళ్లి కానిద్దాం." చెప్పాడు గోపాలస్వామి.
"థాంక్స్ బావగారు." అనేశాడు మోహనరావు. పూర్తిగా రిలీఫ్ అయ్యాడు.
"బావగారూ నేను మాత్రం పెళ్లిలో ఎక్కువగా పార్టిష్పేషన్ చేయలేను. అలాగే నా వైపు వారు కొద్ది మంది హాజర్ కాలేరు." చెప్పాడు.
ఆ వెంబడే, "మా వైపువి ఏమైనా జరపవలసినవి మేము జరపలేకపోతే, మీరు సమ్మతించాలి." అన్నాడు మోహనరావు.
"అయ్యో. మాకు తెలీదా. మీరు వచ్చి నిల్చొండి. చాలు." చెప్పాడు మోహనరావు.
ఆ తర్వాత, లంచ్ వరకు ఉండలేమంటూ, అందుకు క్షమాపణలు కోరేసి, తిరిగి వరంగల్ బయలుదేరారు మోహనరావు దంపతులు. సామ్రాట్ వాళ్లని దగ్గర ఉండి సాగనంపాడు.
***
రాత్రి తొమ్మిది దాటింది. సాహసి, సామ్రాట్ ల ఫోన్ సంభాషణ మొదలయ్యింది.
"నీ సపోర్ట్ ని అమ్మా నాన్న తలుచుకొని తలుచుకొని ఆనంద పడుతున్నారు. థాంక్యూ వెరీ మచ్." చెప్పింది సాహసి హాయిగా.
"సర్లే. నిజంగా నాకూ టెన్షనే. పెళ్లి వాయిదా పడుతుందేమోనని." చెప్పాడు సామ్రాట్ దిగులుగా.
"అలానా." అంది సాహసి కొంటెగా.
"మరే. ఇంకెన్నాళ్లు నీ దరి నాకు చేరువ కాదో అన్న దిగులులో కూరుకుపోయాననుకో." చెప్పాడు సామ్రాట్.
చిన్నగా నవ్వుకుంది సాహసి.
"రేపు మా మేనత్త మూడో రోజు కార్యక్రమాలు చేయాలట. అవి కాగానే నేను హైదరాబాద్ బయలుదేరుతున్నాను. ఇంకా కార్డులు కొన్ని ఇవ్వాలి. అలాగే అక్కడ మా వైపు పెళ్లి సామాన్లు ఉన్నాయి. వాటితో నేను నేరుగా వరంగల్ వచ్చేస్తాను. అమ్మా, నాన్న పెళ్లి నాటికి ఇటు నుండి వరంగల్ వచ్చేస్తారు." చెప్పాడు సామ్రాట్.
"ఐనా, అంకుల్ తో నాన్న టచ్ లో ఉన్నారట. ఉన్నపాళంగా మీరు వచ్చేస్తే చాలట. అన్నీ మా వాళ్లే మీ వైపువి కూడా సమకూర్చిపెట్టగలమంటున్నారు." చెప్పింది సాహసి.
"సారీరా. మీకు బర్డనవుతున్నాం." అన్నాడు సామ్రాట్ నొచ్చుకుంటూ.
"చాలు బాబూ, చాలు. ఇది మీది, మాది కాదు. మనది. థట్సాల్." అనేసింది సాహసి.
"థాంక్స్ హసి." అన్నాడు సామ్రాట్.
"షడప్. జస్ట్ షడప్." చెప్పింది సాహసి మృదువుగా.
తర్వాత ఆ ఇద్దరి సంభాషణ మారింది. సరదాగా కొనసాగుతుంది.
***
సాహసి, సామ్రాట్ ల పెళ్లి సమ్మతైన సమయాన్న సక్రమంగా, సరళంగా నిర్వహింపబడింది. కానీ పెళ్లి పిమ్మట జరగ వలసిన వాళ్ల శోభనం మాత్రం వాయిదా పడింది, గోపాలస్వామి అక్క కార్యక్రమాల మూలంగా.
అలాగే పెళ్లి తర్వాతి నూతన వధూవరుల రాక పోకలు కూడా తూతూ మంత్రంలా వెంట వెంటనే కానిచ్చేసి ఇరు వైపు పెద్దలు స్తిమిత పడిపోయారు.
దాంతో సాహసి, సామ్రాట్ లు ప్రస్తుతం ఎవరి ఇల్లల్లో వారు ఉన్నారు. కానీ సమయానికే వాళ్ల ఫోన్ సంభాషణలు కొనసాగిపోతున్నాయి. ఈ మారు వాళ్ల సంభాషణలలో విరహతాపాలు ముమ్మరంగానే చోటు చేసుకుంటున్నాయి. ఇద్దరి తనువులూ తహతహలాడిపోతున్నాయి. వెచ్చని నిట్టూర్పులు విడుస్తున్నాయి. వీటికి తోడుగా సాహసి, సామ్రాట్ ల పెళ్లైన పదిహేడవ రోజన వాళ్ల నడుమ ఆషాఢ మాసం నిలిచింది నిండుగా.
***
పెట్టిన సెలవులు ముగియక ముందే సాహసి బ్యాంక్ కి వెళ్లింది రీజాయినింగ్ కై.
సాహసిని చూస్తూనే, "హలో సాహసి. రారా. కూర్చో." అంది బ్యాంక్ మేనేజర్ చంద్రిక, తన ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ.
సాహసి ఆ కుర్చీలో కూర్చుంది.
ఆ ఇద్దరూ మేనేజర్ కేబిన్ లో ఉన్నారు.
"నీ హస్బండ్ హేండ్సమ్ గయ్. పెళ్లిలో చూశానుగా. గొప్ప చలాకీ మనిషిలా అగుపించాడు. ఒన్స్ ఎగేన్ కంగ్రాట్స్." అంది చంద్రిక నవ్వేస్తూ.
"థాంక్యూ." అనేసింది సాహసి.
"ఉ. చెప్పు. ఏంటిలా వచ్చావ్. ఇంకా నీకు సెలవులు ఉన్నాయిగా" అంది చంద్రిక.
"చంద్రికా." అంటూ తన రాకకు కారణం చెప్పుతుంది సాహసి.
***
(కొనసాగుతుంది..)
***
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
Comments