top of page

వీరి మధ్యన... ఎపిసోడ్ 7

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Veeri Madhyana Episode 7' New Telugu Web Series


Written By BVD Prasada Rao




బివిడి ప్రసాదరావు గారి ధారావాహిక 'వీరి మధ్యన..' ఏడవ భాగం



గత ఎపిసోడ్ లో…

సాహసి, జ్వాల ఇంటికి వెళుతుంది.

ఆమెను మేడపైకి తీసుకోని వెళ్లి, తనకూ సామ్రాట్ కూ మధ్య ప్రవేశించడానికి కారణం అడుగుతుంది.

ఇకపై తమ మధ్య జోక్యం చేసుకోవద్దని గట్టిగా చెబుతుంది.

ఒక సేల్స్ గర్ల్ సామ్రాట్ దగ్గరకు వచ్చి, కాస్త చనువుగా ప్రవర్తించ బోతుంది.



ఇక వీరి మధ్యన.. ఏడవ భాగం చదవండి...



"సారీ చెప్పను. కానీ, ఏదో మీ చేతిని తాకేను. అంతే." అనేసింది ఆమె నవ్వేస్తూ. సామ్రాట్ ఏమీ అనలేదు.


తన వద్ద ఉన్న నోట్లకి, సామ్రాట్ అందించిన నోట్లను చేరుస్తూ, "నా వద్ద హండ్రడ్సే ఉన్నాయి. ఛేంజ్ లేదు. మీరే ట్వటీ ఇస్తే, నేను రెండు వంద నోట్లు ఇస్తాను." చెప్పింది ఆమె.


"లేదు లేదు. ఏమీ ఇవ్వక్కర లేదు. అంతా ఉంచుకోండి." చెప్పాడు సామ్రాట్.


"అదేంటి." అనేసి, "ఆ మిగతాకి నేనేమైనా ఇవ్వాలా" అంది ఆమె చాలా హస్కీగా.


"లేదమ్మా. మీ అన్నయ్య ఇచ్చాడనుకో. ఉంచు. ఇంతగా హైరానా పడుతున్నారంటే, మీ అవసరం ఏమై ఉండొచ్చొ ఊహించుకోగలను. మరోలా భావించక, ఆ మిగతాది ఉంచుకో." చెప్పాడు సామ్రాట్. ఆమె అతనినే చూస్తుంది.


"ప్లీజ్. మీ సామాన్లును సర్దుకొని, మీ పనిని మీరు కొనసాగించుకోండి. ఆల్ ద బెస్ట్." చెప్పాడు సామ్రాట్.


ఆ వెంబడే, "ఎట్టి ఇబ్బంది పెట్టకూడదనే, నాకు ఇప్పటికిప్పుడు ఏమీ అవసరం కానివైనా వీటిని పర్చేజ్ చేశాను." చెప్పాడు సామ్రాట్ టీపాయ్ మీది తను కొన్న వాటిని చూపుతూ.


ఆమె తన బేగ్ లతో కనీసం 'థాంక్స్' కూడా చెప్పక, అక్కడ నుండి కదిలింది. సామ్రాట్ మైన్ డోర్ మూసేశాడు.


సేల్స్ గర్ల్ గా వచ్చిన ఆమె నేరుగా తన బాస్ రావ్ ను కలిసింది. జరిగింది చెప్పింది.

"వాట్. అవునా." అన్నాడు రావ్.


"అవును సార్. సామ్రాట్ సిసలైన మగవాడు. నా చూపులకు, నా వగలుకు ఏ మాత్రం టెమ్ట్ అవ్వలేదు. పైగా కచ్ఛితమైన స్పృహతో సరళంగా వ్యవహరించాడు. హీ ఈజ్ ఎ ఫైన్ మాన్ అండ్ పెర్ఫెక్ట్ జంటిల్ మాన్." చెప్పింది ఆమె. రావ్ ఇంప్రెస్ అయ్యాడు.


ఆ వెంబడే సాహసికి ఫోన్ చేసి, ఎట్టి ఉపోద్ఘాతాలు లేకుండా, సూటిగా, "సామ్రాట్ ని మీరు నిశ్చింతగా పెళ్లి చేసుకోవచ్చు." అంటూ, సామ్రాట్ గురించి తన అసిస్టెంట్ చెప్పిన చివరి మాటలనే తుచ పొల్లు రాకుండా వల్లించేశాడు, 'హీ ఈజ్ ఎ ఫైన్ మాన్ అండ్ పెర్ఫెక్ట్ జంటిల్ మాన్.' అని.

సాహసి సంబర పడి పోయింది.

***

మోహనరావు టివిలో భక్తి కార్యక్రమం చూస్తున్నాడు. తన ఇంటి హాలులో సోఫాలో కూర్చొని ఉన్నాడు. సాహసి సింగిల్ సోఫాలో కూర్చొని ఉంది.

"అమ్మా." అనంది.


"ఆ. టీ తయారు చేసుకుంటున్నాను. వస్తా." కిచన్ నుండి చెప్పింది శైలజ.

"ఏం కావాలమ్మా." అప్పుడే అడిగాడు మోహనరావు.


"మీ ఇద్దరితో మాట్లాడాలి నాన్నా." చెప్పింది సాహసి.

దాంతో భార్య రాకకై ఆగాడు మోహనరావు.


శైలజ వచ్చింది టీ కప్పుతో. భర్త పక్కనే కూర్చుంది.

టివిని ఆఫ్ చేశాడు మోహనరావు.


"చెప్పమ్మా." అంది శైలజ.

"నన్ను 'తిరుపతి వెళ్లొచ్చు' అన్నారుగా." అంది సాహసి.


"ఆ. అన్నాం. ఏం వెళ్లలేవా." అంది శైలజ.

"నువ్వు వెళ్తావని మేము ఆగాం. లేదంటే, బాగా తెలిసివారు, పైగా ఒకే వీథి వాళ్లం. తప్పక మనం వెళ్లాలి." అన్నాడు మోహనరావు.


"అదే. నాతో తిరిగేది కనుకనే, నేను వెళ్తానన్నాను. కానీ కవిత పెళ్లికి సామ్రాట్ కూడా వస్తున్నారు. అతడి కొలీగే కవితకి కాబోతున్న భర్తగా." చెప్పింది సాహసి.


"అవును కదా. కొలీగ్ కనుక సామ్రాట్ కూడా రావచ్చు." అంది శైలజ.

"అదే. అతను తిరుపతి వెళ్తున్నట్టు చెప్పారు." చెప్పింది సాహసి.


"అయితే అభ్యంతరం ఏంటి." అన్నాడు మోహనరావు.

"అదే. మాకు పెళ్లి కాబోతుందిగా. అలాంటప్పుడు మేమిద్దరం కవిత పెళ్లికి వెళ్ల వచ్చా." అడిగింది సాహసి.


"నిరభ్యంతరంగా. ఏమంటావు శైలజ." అన్నాడు మోహనరావు భార్యని చూస్తూ.

శైలజ కొద్దిసేపు ఆగి, పిమ్మట, "నాకేం తప్పు తోచడం లేదు." చెప్పింది.


"నువ్వు వీళ్లతో ఇలా వెళ్తుంటే, అతడు వాళ్లతో అలా వస్తున్నాడు. నో ప్రొబ్లమ్." అన్నాడు మోహనరావు.

సాహసి ఏమీ అనలేదు. కానీ లోలోపల పొంగి పోతుంది.


"ఎలానూ మీరు అక్కడ ఎదురు పడతారు కనుక, తప్పదు, కలిసి మాట్లాడుకోవచ్చు. ఏం కాదు." అంది శైలజ తేలిగ్గా.


"అంతంతే. అనుకుంటే అన్నీ అభ్యంతరాలే. సరళంగా పోతే ఏమీ కాదు. చక్కా వెళ్లమ్మా. ఏదేమైనా మీరు కాబోయే దంపతులు. అంతే." అనేశాడు మోహనరావు.


"సరే." అనేసింది సాహసి. ఆ వెంబడే లేచి, తన రూం వైపు కదిలింది, జాబ్ కి వెళ్లేందుకు తయారవ్వడానికి.


హాలులో మిగిలిన ఆ ఇద్దరూ మొహాలు చూసుకున్నారు. చిన్నగా నవ్వుకున్నారు.

"అమ్మాయి పద్ధతి ముచ్చటగా ఉంటుందండీ." అంది శైలజ.

"మనం అదృష్టవంతులం." అన్నాడు మోహనరావు.


శైలజ లేచి, కిచన్ వైపు కదిలింది, సాహసికి లంచ్ బాక్స్ సిద్ధపర్చడానికి. మోహనరావు తిరిగి టివి ఆన్ చేశాడు.

***

రాత్రి తొమ్మిదవుతుంది.

సాహసి ఫోన్ కాల్ చేసింది.


కనక్ట్ అవుతూనే, "హసి నీకు ఒక సంఘటన చెప్పాలి." చెప్పాడు సామ్రాట్.

"అవునా. ఏంటీ." అడిగింది సాహసి.


సేల్స్ గర్ల్ భోగాటంతా చక్కగా చెప్పేశాడు సామ్రాట్.

అది విన్న సాహసి, కొద్దిగా చలించింది. కానీ 'తనకా సంగతి తెలుసు' అని కానీ, ఆ సంఘటన వెనుక 'తను ఉన్నట్టు' కానీ చెప్పక, "నేను లక్కీ పర్సన్ ని. సో హాఫీ." అంది.


"అదేంటీ." అన్నాడు సామ్రాట్. అతడు నిజంగానే సర్ప్రైజ్ అవుతున్నాడు.


"మరి. నీలోని గొప్పతనం నాకు మరో మారు ఎఱికైందిగా ఆ సంఘటనతో." చెప్పింది సాహసి.

సామ్రాట్ మురిసి పోతున్నాడు.


"ఎంత మంది ఉంటారు నీలా అలా మూవ్ అయ్యేవారు. వావ్. నువ్వు నాకు దొరికిన ఆణిముత్యానివి." చెప్పింది సాహసి. ఆమె నిజంగానే సేటిస్ఫై అవుతుంది.


"చాల్లే. నిత్యం నిన్ను హాఫీ పర్చడమే నా ధ్యేయం. నమ్ము." చెప్పాడు సామ్రాట్.

"థాంక్యూ వెరీ మచ్." అనేసింది సాహసి.


"వెల్కం సో మచ్." చెప్పాడు సామ్రాట్. వాళ్ల సంభాషణ సరదాగా సాగిపోతుంది.

***

తమ ఇంటి డైనింగ్ టేబిల్ ముందు కూర్చొని, డిన్నర్ చేస్తున్నారు గోపాలస్వామి, మాలతి, సామ్రాట్ లు.


అన్నంలో ముద్ద పప్పు కలుపుకుంటూ, "మా కొలీగ్ పెళ్లికి రేపు తిరుపతి వెళ్తున్నాను." చెప్పాడు సామ్రాట్.


"అవునా." అంది మాలతి.

"ఆ పెళ్లికి సాహసి కూడా వస్తుంది." చెప్పాడు సామ్రాట్.


"అదేంటి." అంది మాలతి.

"అవును. సాహసికి బాగా తెలిసిన అమ్మాయి, పైగా సాహసి వీథి అమ్మాయి, నా కొలీగ్ కి కాబోతున్న భార్య. అలా సాహసి వాళ్లతో కలిసి తిరుపతి వస్తుంది." చెప్పాడు సామ్రాట్.

మాలతి మాట్లాడ లేదు.


"నేచురల్. అంతగా తెలిసిన వారైతే అటెండ్ కాక తప్పదు." అన్నాడు గోపాలరావు.

"నేను ఇటు నుండి వెళ్తున్నాను. తను అటు వాళ్లతో కలిసి వస్తుంది. మరి ఇద్దరం అక్కడ కలవక తప్పదుగా." చెప్పాడు సామ్రాట్.


"మరంతేగా." అనేశాడు గోపాలస్వామి.

మాలతి మాట్లాడక పోయే సరికి, "ఏమంటావమ్మా." అడిగాడు సామ్రాట్ తల్లిని చూస్తూ.


"జాగ్రత్త. స్వామి దర్శనం చేసుకొని, నీ పెళ్లి నిరాంటకంగా జరిగేలా సాయపడమని కోరుకో. అలాగే పెళ్లి తర్వాత భార్యతో కలిసి వస్తానని మొక్కుకో." చెప్పింది మాలతి.


"అలాగేనమ్మా." చెప్పాడు సామ్రాట్. ఆ వెంబడే, "వీలైతే ఇప్పుడు మేమిద్దరం కలిసి స్వామి దర్శనం చేసుకోవచ్చా." అడిగేశాడు.


మాలతి మాట్లాడ లేదు.

"అంత వెసులుబాటు ఉంటుందా. పెళ్లి హడావిడిలో పడితే అలా కుదరక పోవచ్చు. నువ్వు మాత్రం వీలు కల్పించుకొని, స్వామి దర్శనం చేసుకో. అమ్మ చెప్పినట్టు మొక్కుకో. హుండీలో దక్షిణ వేసుకో." చెప్పాడు గోపాలస్వామి చొరవగా.


మాలతి అన్నంలో బటర్మిల్క్ పోసుకుంటుంది.

మిగతా ఇద్దరూ డిన్నర్ కానిస్తున్నారు.

***

కవిత వాళ్లతో కలిసి తిరుపతి వచ్చింది సాహసి.

అప్పటికే సామ్రాట్ తిరుపతి చేరి ఉన్నాడు.


ఆ ఇద్దరూ కొండ మీద, పెళ్లి వారు ఏర్పాటు చేసిన వేరు వేరు వసతుల్లో ఉన్నారు.

సాహసి వీలు కల్పించుకొని, ముఖ్యంగా కవిత చొరవతో, గబగబా తయారై, సామ్రాట్ ని కలవడానికి తను ఉంటున్న వసతి నుండి బయట పడి కదిలింది. పైగా అప్పటికే తనకి సామ్రాట్ ఫోన్ చేసి 'కలుద్దాం' అని కోరి ఉన్నాడు కూడా. అందుకే అతడు చెప్పిన ప్లేస్ కి దార్లో వాకబులతో చేరగలిగింది సాహసి. సామ్రాట్ ని చూస్తూనే సంతోషపడింది. తనే తొలుత పలకరించింది.


"ఇలా కలవడం హాఫీగా ఉంది." చెప్పాడు సామ్రాట్ స్వేచ్ఛగా నవ్వుతూ.

"నాక్కూడా." చెప్పేసింది సాహసి తను అనుభవిస్తున్న ఉల్లాసాన్ని ప్రదర్శిస్తూ.


"బ్రేక్ఫాస్ట్ చేశావా." అడిగాడు సామ్రాట్.

"లేదు. నారింజ తిన్నాను" చెప్పింది సాహసి.


"నేను అదీ లేదు. మనం 'కలుద్దాం' అని నీకు ఫోన్ చేశాక, నిన్ను వెయిట్ చేయించకూడదని, నేను త్వరగా తెమిలి, తయారై, ఇలా వచ్చేశాను." చెప్పాడు సామ్రాట్.


"సారీ. నేను లేటయ్యి, నిన్ను వెయిట్ చేయించాను." అంది సాహసి నొచ్చుకుంటూ.

"నోనో. నేనూ ఇప్పుడే ఇక్కడికి వచ్చాను." చెప్పాడు సామ్రాట్ గబగబా.


ఇద్దరూ చిన్నగా నవ్వుకున్నారు.

"రా. ఆ హోటల్ కి వెళ్లి బ్రేక్ఫాస్ట్ చేద్దాం." చెప్పాడు సామ్రాట్ అటు కదులుతూ. సాహసి అతడి పక్కన నడిచింది. ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు.


"స్పెషల్ టిక్కెట్లు తీస్తాను. దర్శనానికి కలిసి వెళ్దామా." అడిగాడు సామ్రాట్.

"సరే." అంది సాహసి.


గంటన్నర తర్వాత, ఆ ఇద్దరూ స్పెషల్ దర్శనం క్యూలోకి చేరగలిగారు.

క్యూలో సాహసి వెనుక సామ్రాట్ నడుస్తున్నాడు.


"నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నీకు." అన్నాడు సామ్రాట్ మెల్లిగా.

సాహసి చిన్నగా వెనుక్కు తిరిగి, సామ్రాట్ ని చూస్తూ, మెత్తగా నవ్వింది.


సామ్రాట్, "చెప్పు." అన్నాడు. అతనూ చిన్నగా నవ్వుతున్నాడు.

"నువ్వు చెప్పగలిగావు. నేను చెప్పలేక పోతున్నాను." అంది సాహసి గుసగుసగా.

సామ్రాట్ పొంగి పోయాడు.


దేవుని దర్శనం తర్వాత - ఇద్దరూ బయటికి వచ్చి, ఒక పక్కగా ఎదురెదురుగా నిల్చున్నారు.

సాహసి కళ్లల్లోకి చూస్తూ, "థాంక్స్ హసి." అన్నాడు సామ్రాట్ హుషారుగా.


తన కళ్ల రెప్పల్ని టపటపా లాడిస్తూ, "ఎందుకు." అంది సాహసి తమాషాగా.

"నాకీ భాగ్యాన్ని ఇచ్చినందుకు." చెప్పాడు సామ్రాట్.


"నువ్వు మరిన్నూ. పుటుక్కున నీ సంతోషాన్ని వెల్లడించేయగలవు. నాకు అలా చేత కాదు." చెప్పింది సాహసి నేల చూపులు చూస్తూ.

సామ్రాట్ మాట్లాడ లేదు. కానీ నవ్వుతున్నాడు.


తలెత్తి, "నాకు ఇది ఒక మధురమైన మరవలేని మెమరీ, పక్కా." చెప్పింది సాహసి, సామ్రాట్ నే చూస్తూ.

"వావ్. నాకున్నూ." అనేశాడు సామ్రాట్.


"అల్రడీ చెప్పేవుగా." అంది సాహసి సరదాగా.

చిన్నగా నవ్వేసి, "నీ మూలంగా లభించే ఎట్టి నా ఫీలింగ్స్ ని దాచుకోలేను. అలాగే మన మధ్య ఎట్టి 'దాపరికాలు వద్దు' అని గట్టిగా అనుకుంటున్నాను. ఈ రెండింటినీ ఇదిగో ఈ దైవ సన్నిధిలో నీకు చెప్పి, అలా షూర్ గా నడుచుకుంటానని నీకు మాట ఇస్తున్నాను." చెప్పాడు సామ్రాట్ ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టు.


సాహసి ఒక్కమారుగా చలించింది. సామ్రాట్ నే చూస్తూ ఉండిపోయింది.

"ఏంటా చూపు. నిజమే చెప్పుతున్నాను." నవ్వేడు సామ్రాట్.


సాహసి తల దించుకుంది. వెంటనే మాట్లాడలేక పోతుంది.

"రా. వెళ్లి ప్రసాదాలు తీసుకుందాం. మన ఇళ్లకి తీసుకు వెళ్లాలిగా." అన్నాడు సామ్రాట్ కదులుతూ.


సాహసి అతడి పక్కనే నడుస్తూ, "నేను దాచిన విషయం ఒకటి నీకు చెప్పేయాలి." అంది టక్కున.

ఆగిపోయాడు సామ్రాట్.


సాహసి ఆగి, "అవును. నీలా నేనూ బ్రాడ్ గా ఉండాలంటే, ముందుగా నేను మరుగున పెట్టేయాలనుకున్న ఆ సంగతిని నీకు చెప్పేయాలి." చెప్పింది సాహసి.

"ఏంటి హసి. ఏంటా తడబాటు. కూల్. నెమ్మదిగా చెప్పొచ్చు. ఆత్రం ఏమీ వద్దు. కూల్." అన్నాడు సామ్రాట్ మెల్లి మెల్లిగా.


"నేను చెప్పేది పూర్తిగా విని, రియాక్ట్ అవ్వు. తొలుత ఓపిగ్గా మాత్రం విను. ప్లీజ్." చెప్పింది సాహసి.

"సరి సరే. చెప్పు. అదీ కూల్ గానే చెప్పు." అన్నాడు సామ్రాట్.


అర నిమిషం తర్వాత, "ఆ రోజు నిన్ను కలిసిన ఆ సేల్స్ గర్ల్, ఓ ఏజన్సీ వర్కర్. నిజానికి తను సేల్స్ గర్ల్ కాదు." అంటూ అప్పటి విషయాన్నంతటినీ ముక్క ముక్కల్లా ఐనా, సమగ్రంగా సామ్రాట్ తో చెప్పగలిగింది సాహసి.


అదంతా విన్న సామ్రాట్, "అవునా. అంటే, నా మీద నీకు నమ్మకం కుదరడం లేదన్న మాట." అనేశాడు సామ్రాట్ నీర్సంగా.


"ఛఛ. అలా కాదు. నిజానికి ఆ జ్వాల ఎపిసోడ్ నన్ను అనుమానపు ఆలోచన లోకి తోసేసింది. అందుకే, అందుకే ఆ ఏజన్సీ సహకారం కోరాను. వాళ్లు ఖరాఖండీగా తేల్చేశారు నీ మంచితనాన్ని. సో, నేను సిగ్గు, నిజంగానే సిగ్గు పడ్డాను. అంచేతనే నేను ఆ సంగతిని నీ ముందు పెట్ట లేకపోయాను. కానీ, ఎట్టి దాపరికం మన మధ్య ఉండ కూడదన్న నీ తలంపు నన్ను బరస్ట్ పర్చింది. నా బిహేవియర్ నాకే వరస్ట్ గా అనిపిస్తుంది. సారీ." అంది సాహసి. వెంటనే తల దించుకుంది.


సామ్రాట్ మెల్లిగా సర్దుకున్నాడు.

"ప్రేమించే మనసే బెదురుతుంది. నీ ప్రేమను స్వాగతిస్తున్నాను. నీ ప్రేమను సదా నిలబెట్టుకుంటాను." చెప్పాడు స్థిరంగా.


సాహసి తల ఎత్తింది. సామ్రాట్ ను చూస్తుంది.

"సర్లే. అనుభవాలే మనల్ని సరిదిద్దగలవు. సమర్థవంతమైన నడత వైపు నడిపిస్తాయి. జరిగినవన్నీ వదిలేసి. బి హేఫీ. వుయ్ హాఫీ. ఓకేనా." చెప్పాడు సామ్రాట్ చక్కగా.

సాహసి కుదుట పడుతుంది.


"పద. లంచ్ టైం దాటిపోయింది. మనకై అక్కడ చూస్తుంటారు." అన్నాడు సామ్రాట్.

సాహసి అటు నడిచింది.

సామ్రాట్ ఆమెను అనుసరించాడు.

***

సాయంకాలం ఐదింటికి తిరిగి సాహసి, సామ్రాట్ లు ఏకాంతంగా కలవ గలిగారు. ఇద్దరూ ఒక కాఫీ కేఫ్ లో, ఫామ్లీ కేబిన్ లో ఎదురెదురుగా కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. వాళ్ళ మధ్య టేబిల్ ఉంది.


"కాఫీ ఆర్ టీ తెప్పించనా." అడిగాడు సామ్రాట్.

"లంచ్ లేట్ ఐందిగా. కడుపు నిండుగా ఉంది. బట్ కాఫీ ఆర్ టీ లు సాధ్యమైనంత వరకు తీసుకోను." చెప్పింది సాహసి. నవ్వింది.

***

(కొనసాగుతుంది..)


***

బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం




మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.

రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


20 views0 comments

Comments


bottom of page