top of page

వీరి మధ్యన... ఎపిసోడ్ 1

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Veeri Madhyana Episode 1' New Telugu Web Series


Written By BVD Prasada Rao


రచన: బివిడి ప్రసాదరావు


బివిడి ప్రసాదరావు గారి కొత్త ధారావాహిక 'వీరి మధ్యన..' ప్రారంభం


"వీడియో లింక్ పంపడం ఏంట్రా.." అశ్చర్యమయ్యాడు గోపాలస్వామి.

"మెయిల్ లో 'బయోడేటా బదులు' అని మెన్షన్ చేశారు నాన్నా." చెప్పాడు సామ్రాట్.

"భలే. చోద్యంగా ఉంది." అంది మాలతి.


వారం రోజుల క్రితం పెళ్లిళ్ల పేరయ్యను కలిసి, తన కొడుకు బయోడేటా, ఫోటో ఇచ్చి, మంచి పెళ్లి సంబంధం చూడమని కోరాడు గోపాలస్వామి.


నిన్న ఉదయం ఆ పేరయ్య ఫోన్ చేసి, "మీ అబ్బాయ్, ఒక ఆడ పెళ్లి వారికి నచ్చాడు. అమ్మాయి వివరాలు నేరుగా వాళ్లే మీకు పంపుతామని చెప్పారు. ఆ వివరాలు వచ్చేక మీరు నాకు ఫోన్ చేయండి. మిమ్మల్ని కలుస్తాను." చెప్పాడు గోపాలస్వామితో.


ఉదయం ఆ అమ్మాయి వాళ్ల నుండి, సామ్రాట్ బయోడేటాలో ఇచ్చిన ఇ-మెయిల్ ఐడికి, ఆ అమ్మాయి వివరాలు వీడియో రూపంలో చేరాయి.

మెయిల్ చూసిన సామ్రాట్, తన తల్లిదండ్రులతో ఆ ముచ్చట చెప్పాడు.


"సర్లే. ఆ వీడియో చూపు." అన్నాడు గోపాలస్వామి.

ఆ ముగ్గురు తమ ఇంటిలో, హాలులో ఉన్నారు.

గోపాలస్వామి, మాలతి లాంగ్ సోఫాలో కూర్చుని ఉన్నారు. వాళ్లకు ఎదురుగా సామ్రాట్ సింగిల్ సోఫాలో కూర్చుని ఉన్నాడు.


లాప్టాప్ తో లేచి, టివి ముందుకు వెళ్లాడు సామ్రాట్. డివైజ్స్ కనెక్టివ్స్ తర్వాత, వచ్చి కూర్చున్నాడు.

టివిలో ఆ వీడియో ప్లే అవుతుంది.


'నా పేరు సాహసి..' తో మొదలై, ఆ అమ్మాయి వాయిస్ తోనే ఆ వీడియో నడుస్తుంది.

ఆ ముగ్గురు మౌనంగా దానినే చూస్తున్నారు.


తన జాతకం పేపరు చూపుతూ, 'తన పుట్టిన తేది, తను పుట్టిన స్థలం, తన పుట్టిన నక్షత్రం, దాని పాదం' చెప్పింది సాహసి.


తన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ చూపుతూ, "నేను కామర్స్ లో డిగ్రీ చేశాను." చెప్పింది సాహసి.


తన అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీని చూపుతూ, "నేను బ్యాంక్ ఎంప్లాయిని" చెప్పింది సాహసి.


తను కనబడుతూ, "నా ఎడ్యుకేషన్ సాగింది, నా జాబ్ వచ్చింది, వరంగల్ లోనే కావడం విశేషం." చెప్పింది సాహసి.


తన తండ్రిని చూపుతూ, తండ్రి ఇంటి పేరు చెప్పి, "నాన్న పేరు మోహనరావు. ప్రయివేట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్." చెప్పింది సాహసి.


వీడియోలో మోహనరావు కనిపిస్తూ నమస్కరిస్తున్నాడు.

తన తల్లిని చూపుతూ, తల్లి ఇంటి పేరు చెప్పి, "అమ్మ శైలజ. గృహిణి." చెప్పింది సాహసి.


వీడియోలో శైలజ కనిపిస్తూ నమస్కరిస్తుంది.

తను వీడియోలో కనిపిస్తూ, "నేను ఒకర్తెనే. నాకు తోబుట్టువులు లేరు." చెప్పింది సాహసి.

తర్వాత, "ఇది మా ఇల్లు." అంటూ తన ఇంటి మొత్తాన్ని వీడియోలో చూపింది సాహసి.


ఆ వెంబడే, ఒక కారు చూపుతూ, "ఇది నాన్నది.", ఒక స్కూటీ చూపుతూ, "ఇది నాది." చెప్పింది.


తను తిరిగి వీడియోలో కనిపిస్తూ, "ఇప్పుడు మీకు చూపిన ఇల్లు నాన్న సొంతం. నేను ఉద్యోగంలో చేరే సరికే, నాన్న తగ్గ ఆభరణాలు, సదుపాయాలు నాకై సమకూర్చిపెట్టేశారు. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత, నేను నా కంటూ ఒక బ్యాంక్ అకౌంట్ ను సమకూర్చుకున్నాను. దాంట్లో నా సంపాదన డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఇంటి ఖర్చుల్లాంటివి మాత్రం ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో సాగిస్తున్నాను. ఇదంతా నాన్న చొరవే." చెప్పింది సాహసి.


తనని తాను చూపించుకుంటూ, "నా ఫిజిక్ చూస్తున్నారు. సో, ఆ వివరాలు ప్రస్తావించడం లేదు. సీజనల్ సిక్ ల్లాంటివి మినహా, నా ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అవసరమైనంత వరకు వాకింగ్, మెడిటేషన్ ల్లాంటివి రోజూ ఆచరిస్తుంటాను." చెప్పింది సాహసి.


ఆ వెంబడే, "నాకు ఫ్రెండ్స్ తక్కువ. ఉన్నా ఆ కొద్ది మంది కూడా గర్ల్సే. ఇక, అమ్మ, నాన్నలతో మాత్రమే కలిసి, సినిమాలకు వెళ్లడం కానీ, టీవీ ప్రొగ్రామ్స్ చూడడం కానీ, షికారుల్లాంటివి కానీ, సరదాలు కానీ, టూర్లు కానీ కానిస్తుంటాను. ఇంతే నా గురించిన వివరాలు, విశేషాలు." చెప్పింది.


తర్వాత, "మీకు కూడా సమ్మతమైతే, మీరు మా ఇంటికి రండి. పెద్దలు పెద్దలు మాట్లాడుకోండి." చెప్పింది సాహసి.


ఆ వెంబడే, "ఈ వీడియో లింక్ ఓపెన్ చేసిన ఒన్ అవర్ లో ఆటోమెటిక్ గా లాక్ ఐ పోతుంది. సేవ్ కి పనికి రాదు. కనుక, మరో సారి చూడాలనుకుంటే, రివైడ్ చేసి త్వరగా చూసుకోండి. థాంక్యూ." అంది.


"అంతా బాగుంది." అన్నాడు గోపాలస్వామి.

"అవును, అమ్మాయి బాగుంది. ఇల్లు బాగుంది. వీళ్లు సరైన వాళ్లలా తోస్తుంది." అంది మాలతి.


"వీడియోని ఆఫ్ చేసేయనా. మరో సారి చూస్తారా." అడిగాడు సామ్రాట్.

"మరోమారు ఎందుకు. నీకు నచ్చితే, స్వయంగా వెళ్లి చూద్దాం." చెప్పాడు గోపాలస్వామి.


"అవును. చెప్పరా. నువ్వు ఏమంటావు." అంది మాలతి కొడుకును చూస్తూ.

సామ్రాట్ డివైజ్స్ కనెక్టివ్స్ క్లోజ్ చేసేసి, తిరిగి వచ్చి కూర్చున్నాడు.

"మీరేమంటారు." తల్లిదండ్రులను అడిగాడు.


"మేము చెప్పేశాం. ఇక నువ్వే చెప్పాలి." అన్నాడు గోపాలస్వామి.

"ఎవ్వెర్ థింగ్ ఓకే. ప్రొసీడ్ అవుదాం." చెప్పాడు సామ్రాట్.


"ఐతే సాయంకాలం అమ్మతో వెళ్లి పంతులుగారిని కలుస్తాను." చెప్పాడు గోపాలస్వామి.

"ముందు పేరయ్యకు ఫోన్ చేసి, మన అభిప్రాయం తెలియచేయండి." చెప్పాడు సామ్రాట్.


"అవునవును." అంది మాలతి.

గోపాలస్వామి టీపాయ్ మీది తన ఫోన్ ను తీసుకున్నాడు పేరయ్యతో మాట్లాడడానికి.

***

వారం రోజులు తర్వాత -

సామ్రాట్ తన తల్లిదండ్రులతో, సాహసి ఇంటికి వచ్చాడు.

పరిచయాలు, ఆ పిమ్మటి మాటలతో, ఇరు వైపుల పెద్దలు, తమ పిల్లల పెళ్లికై ఒక సమ్మతికి రాగలుగుతున్నారు.


వాళ్లంతా ఆ ఇంటి హాలులో సమావేశమై ఉన్నారు.


అప్పుడే, "అమ్మాయితో అబ్బాయి విడిగా మాట్లాడతాడట." చెప్పాడు పేరయ్య.


దాంతో పెద్దల మాటతో, ఆ హాలుకు దరిగా ఉన్న ఒక గది లోకి వెళ్లారు సాహసి, సామ్రాట్.

సామ్రాట్ కుర్చీలో కూర్చున్నాడు. "నాకు మీరు, అండి ల్లాంటివి నచ్చవు. ఏకవచనం నాకు బహు పసందనిపిస్తుంది. నువ్వు అలానే కానిస్తే సంతోషం" చెప్పాడు.


సాహసి మంచం అంచున కూర్చుంది. ఏమీ అనలేదు.

ఆ గదిని చూస్తూ, "నీ రూమా." అడిగాడు సామ్రాట్.


చిన్నగా కదిలి, "నాకంటూ ప్రత్యేకం కాదు. నేను ఎక్కువుగా దీన్ని వినియోగించుకుంటాను." చెప్పింది సాహసి.


"ఓ. లాప్టాప్ టేబిల్.. బుక్స్ కేరియర్ ఉంటేను, అలా అనుకున్నాను." చెప్పాడు సామ్రాట్.

"చెప్పాగా. ఎక్కువుగా ఈ గది లోనే ఉంటాను. కనుక నేనే వాటిని ఇక్కడ సర్ది పెట్టుకున్నాను." చెప్పింది సాహసి.


"నీ చదువు, ఉద్యోగం ఒకే చోట కావడం లక్కీయే. అలాగే పెళ్లి తర్వాత ఇక్కడే ఉండాలన్నది ఏమైనా ఉందా" నవ్వేడు సామ్రాట్.


"అబ్బే. అత్యాశది. అలా ఏమీ లేదు. ట్రాన్స్ఫర్ అవకాశం ఉందిగా. నాకు ఉద్యోగం చేయడం ఇష్టం." చెప్పింది సాహసి.


"బై ద బై, నీ ఫ్రెండ్స్ గర్ల్సేనా." సాహసినే చూస్తూ అడిగాడు సామ్రాట్.

సాహసి తలెత్తింది. సామ్రాట్ నే చూస్తూ, "అవును. క్లీయర్ గా వీడియోలో చెప్పాను కూడా." అంది క్లుప్తంగా.


"యయ. నీది కో ఎడ్యుకేషన్ కాదా" అడిగాడు సామ్రాట్.

"వై నాట్. కో ఎడ్యుకేషనే. నా చదువు అంతా ఈ ఊర్లోనే." చెప్పింది సాహసి.


"అవునా. వాళ్లకు, అదే నీకు ఉన్న, కొద్ది మంది గర్ల్ ఫ్రెండ్స్ కు కూడా బోయ్ ఫ్రెండ్స్ లేరా" అడిగాడు సామ్రాట్ కాస్తా నవ్వుతూ సడన్ గా.

సాహసి చిన్నగా కదిలింది. కానీ ఏమీ అనలేదు.

"నీకు తెలియదా." ప్రశ్నించాడు సామ్రాట్.

"ఏమిటి." అడిగేసింది సాహసి.


"అదే. వాళ్లకు బోయ్ ఫ్రెండ్స్ ఉన్నదీ లేనిదీ." అన్నాడు సామ్రాట్.

"నాకు తెలిసినంత వరకు లేరు. ఐనా వాళ్లు నా పద్ధతి మేరకే నాతో కలిసి మెలిసి తిరిగే వారు" చెప్పింది సాహసి కాస్తా జోరుగానే.


"ఈ రోజుల్లో నీలా ఇలా మెసులుకోవడం గ్రేటే. సరే, నా గురించి అడగవా." అన్నాడు సామ్రాట్ నవ్వుతూనే.

సాహసి మాట్లాడ లేదు.


"నా ఎడ్యుకేషన్ డేస్ లో కానీ, నా సాఫ్ట్వేర్ జాబ్ ప్లేస్ లో కానీ, నేను ఎంతో మంది అమ్మాయిలతో సరదాగానే మూవ్ అవుతుంటాను. నేను నిజమే చెప్తాను." అన్నాడు సామ్రాట్.


"నేను ఏదీ అబద్ధం చెప్పడం లేదు." చెప్పింది సాహసి గమ్మున.

"అయ్యో నేను నిన్ను అలా అనలేదే." అన్నాడు సామ్రాట్.


"అలా అనుకుంటున్నట్టు నాకు తోస్తుంటేను." ఆగింది సాహసి.

"అది నీ మిస్టేక్." చెప్పేశాడు సామ్రాట్.


సాహసి ఊరుకుంది. ఆమె మొహం కాస్తా ఎర్రబడింది.

అప్పుడే ఆ గది తలుపు కర్టెన్ ముందుకు వచ్చి, బయట నుండే కూతురును పిలిచింది శైలజ.


సాహసి గది బయటికి వచ్చింది.

"ఏమ్మా." అంది.

"కంగ్రాట్స్ తల్లీ. సంబంధం సవ్యంగా ఓకే ఐపోయింది. కాఫీలు ఇవ్వనా. హాలు లోకి వచ్చేస్తారా." అడిగింది శైలజ.


"అడిగి చెప్తాను." అంటూ గది లోకి వెళ్లింది సాహసి.

శైలజ చిన్నగా నవ్వుకుంది.


సామ్రాట్ తో, "కాఫీకై కబురు. అక్కడకు వస్తారా. ఇక్కడకు తేనా." అంది సాహసి.

"లేదు. అక్కడికి పోయి తాగుతా." అంటూ లేచాడు సామ్రాట్.

"మాటలయ్యిపోయావా." అడిగింది సాహసి.


"ఏదో క్యాజువల్ గా మాట్లాడాలి అన్నాను. అంతే. పద." అంటూ కదిలాడు సామ్రాట్.

విస్మయమయ్యింది సాహసి. తర్వాత, తెములుకుంటూ కదిలింది. హాలు లోకి వచ్చింది.

అక్కడికి వచ్చిన సాహసితో, "పాపా అంతా శుభమ్. మీకు రాసి పెట్టి ఉంది. మీరు దంపతులు కాబోతున్నారు." చెప్పాడు పేరయ్య గొప్పగా.


చూపు తిప్పి, సామ్రాట్ ని చూసింది సాహసి.

సామ్రాట్ చక్కగా కాఫీ తాగుతున్నాడు.


"కంగ్రాట్సే." ఆమె ఇద్దరి ఫ్రెండ్స్ సాహసిని చేరి, షేక్ హేండ్స్ ఇస్తున్నారు.

సామ్రాట్ వాళ్లను చూస్తున్నాడు.

అప్పుడే, "త్వరలో కలుద్దాం." అన్నాడు గోపాలస్వామి లేస్తూ.


"సరే బావగారు. కబురు పెడతాను. రండి. పెళ్లి ఇక్కడే కనుక, మా పంతులు గారితోనే ముహూర్త కార్యక్రమాలు కానిద్దాం." చెప్పాడు మోహనరావు లేచి నిల్చుని.


ఆ తర్వాత, సామ్రాట్ తన తల్లిదండ్రులతో పాటు పేరయ్యను కలుపుకొని, తను ఉంటున్న హైదరాబాద్ కు బయలుదేరాడు, తాము వచ్చిన కారులోనే.

సామ్రాట్ వెళ్తూ, "బై" అన్నాడు సాహసితో. సాహసి చేయి ఊపేసింది.

***

రెండు రోజులు పిమ్మట ఆదివారం వచ్చింది.

ఉదయం కర్రీస్ కై బజారుకు తన తల్లిదండ్రులు వెళ్లగానే, సామ్రాట్ కు సాహసి ఫోన్ చేసింది, అతడు ఇచ్చిన బయోడేటాలోని అతడి ఫోన్ నెంబర్ తో.


అటు, "హలో." అన్నాడు సామ్రాట్.

ఇటు, "నేను సాహసిని." చెప్పింది సాహసి.


"హలో. ఇది నీ ఫోన్ నెంబరా. బోలో బోలో." సామ్రాట్ ఉత్సాహ పడుతున్నాడు.

"బిజీయా." అడిగింది సాహసి.


"లేదు లేదు. న్యూస్ పేపర్ తిరగేస్తున్నాను. అంతే." చెప్పాడు సామ్రాట్.


"క్లారిఫై కోసం మీకు కాల్ చేశాను. మన పెళ్లి చూపులప్పుడు, మన మధ్య సంభాషణ సమయంలోని, మీ మాట తీరు నన్ను ఇబ్బంది పర్చింది." చెప్పింది సాహసి.


"వాట్ వాట్ వాట్. నేను కాని మాటలు ఏమాడాను." అడిగాడు సామ్రాట్.

"అదే, మీరే నిజాలు చెప్పుతున్నట్టు, నేను దాస్తున్నట్టు మాట్లాడేరుగా. ఆ పాయింట్స్ నాకు కలవరపరిచాయి." చెప్పింది సాహసి.


"అంటే." ఆగాడు సామ్రాట్.

"అదే, నాకు 'బోయ్ ఫ్రెండ్స్' అంటూ అడిగే విధం నాకు నచ్చలేదు." అంది సాహసి.

"అయ్యో. దానిని అంత సీరియస్ గా తీసుకున్నావా. నేను మామూలుగా అడిగేశాను. అంతే." చెప్పాడు సామ్రాట్.


"నేను.. లేరని చెప్పేక కూడా దానినే అటు తిప్పి, ఇటు తిప్పి అడగడం నాకు నచ్చలే." చెప్పింది సాహసి.

"ఓయ్ బాబోయ్. మరీ ఇంత ఇదా నువ్వు." అన్నాడు సామ్రాట్.


"నేను ఏదీ దాయను. అంతా కరెక్టు గానే మాట్లాడతాను." చెప్పింది సాహసి.

"చాల్లే. వదిలేయ్." అనేశాడు సామ్రాట్.


"అలా మాట్లాడడంతో మీరు మరోలా తోచారు." చెప్పింది సాహసి.

"మరోలానా. ఎలా." అడిగాడు సామ్రాట్.

"ఎదుట వారిని నమ్మే వారు కాదని." చెప్పేసింది సాహసి.


"బాబోయ్. మరీ దారుణం. అప్పుడు నువ్వు నాకు ఒక అమాయకురాలుగా తోచినా, ఇప్పుడు మాత్రం నువ్వు ఒక అనుమానపు మనిషిలా అనిపిస్తున్నావు." చెప్పాడు సామ్రాట్.


"నేనేమీ అనుమానం పడే మనిషిని కాదు. మీ మాట తీరే నన్ను భయ పెట్టింది." చెప్పింది సాహసి.


"కొత్త కదా. కొద్ది సేపులో మనం ఒకరికి ఒకరం ఏమీ అర్ధం కాలేం. నువ్వు ఇలా అడేగేయడమే నాకు నచ్చింది. ఇప్పుడు నువ్వు మరింత నాకు నచ్చావు. సో, దయచేసి ఏమీ మనసులో పెట్టేసుకొని మధన పడిపోకు. ఇలానే ఎప్పటిది అప్పుడు అడిగేస్తుండు. కలతల్ని క్యారీ ఆన్ కానీయకు." చెప్పాడు సామ్రాట్.


సాహసి మాట్లాడ లేదు.

***

(కొనసాగుతుంది..)

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.

రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.



336 views0 comments
bottom of page