top of page

సు...ధీర ఎపిసోడ్ 7

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Su... Dheera Episode 7' New Telugu Web Series

Written By BVD Prasada Rao

రచన: బివిడి ప్రసాదరావు



గత ఎపిసోడ్ లో…

ధీర ప్రవర్తన పై అతడి పేరెంట్స్ చర్చించుకుంటారు.

సు కి ఆమె బ్యానర్ ముందు నిల్చొని తను తీసుకున్న సెల్ఫీ పంపుతాడు ధీర.

సింగిల్ ఎపిసోడ్ చేస్తున్న ప్రొడ్యూసర్, డైరెక్టర్ సలహాపై సు ని సిరీస్ లో నటించమని అడుగుతాడు.

ఇక చదవండి...



"మేడమ్.. అలా కాదనేయకండి. మీది గోల్డెన్ హాండ్. మీ చేతితో ప్రారంభోత్సవం చేయించుకున్న.. మా రెండు షాపులు కళకళ లాడుతున్నాయి. ఈ మా బ్రాంచిని కూడా.. మీ చేతితో ఓపెన్ చేసి పెట్టాలి." వేడుకుంటున్నట్టు అంటున్నాడు ఆ షాపింగ్ బిజినెస్ ఓనర్.


"ఉగాది నాడు నాకు కుదరదు అంటున్నానుగా." చెప్పింది సు.


లంచ్ బ్రేక్ లో.. ఆ ఓనర్.. సు అనుమతితో వచ్చి.. ఆమెని కలిసి మాట్లాడుతున్నాడు.. సు కారు చెంతన.


"ఉగాది రోజున బాగుంది.. ఇది గోల్డ్ షాప్. మీరు కాదన కూడదు. మీకు.. ఒడ్డాణం.. ఎనిమిది గాజులు అందిస్తాం. ప్లీజ్ మేడమ్." చెప్పాడు ఓనర్.


"నేను వస్తు రూపేణా పుచ్చుకోనుగా." నవ్వింది సు.


"అవునవును. కానీ.. ఈ మారు పుచ్చుకోండి.. మీ కోసమని ప్రత్యేకంగా డిజైన్ చేయించాం.." చెప్పుతున్నాడు ఓనర్.


"కుదరదు." టక్కున అంది సు.


"సరే ఐతే.. వాటికి తగ్గ కేష్ నే.. మీరు ఎప్పుడూ పుచ్చుకున్నట్టే.. చెక్ గా అందిస్తాం." చెప్పాడు ఓనర్.


"కానీ.. నాకు ఆ రోజు కుదరదండీ.. చెప్పాగా." అంది సు.


"ప్లీజ్ అండీ.." బతిమలాడుతున్నాడు ఓనర్.


"ఆ రోజు నా కొత్త సీరియల్ ప్రారంభ షూటింగ్.. నేను తప్పక ఉండాలి. పొడక్షన్ వారికి మాటిచ్చేసి ఉన్నాను." చెప్పింది సు.


"ఐతే.. ఆ షూటింగ్ తర్వాతే పెట్టుకుందాం." చెప్పాడు ఓనర్.


"అలా ఐతే అవుతుంది.. కానీ.. ఈ హైదరాబాద్ లో కాదుగా.. మీది వరంగల్ లో కదా.. సకాలంలో కాగలదా." అంది సు.


"మీ షూటింగ్ పని ఎన్నింటికి ఐపోతుంది." అడిగాడు ఓనర్.


"పన్నెండుకి అంతా ఐపోతుంది. తర్వాత.. మళ్లీ మర్నాడు ఉదయం వరకు ఖాళీయే." చెప్పింది సు.


"అవునా. ప్లాన్ చేసుకుంటాం. ఒప్పుకోండి." అన్నాడు ఓనర్.


"సరే.. కానీయండి." అనేసింది సు.


"థాంక్స్ మేడమ్.. ఇన్విటేషన్స్.. బేనర్స్ తయారు చేయించుకుంటాం. మీ వీలు చెప్పితే.. మా వాళ్లు వచ్చి.. మీ ఫోటో షూట్ చేసుకుంటారు. వాళ్లతోనే మీ చెక్ పంపిస్తాను." చెప్పాడు ఓనర్.


"మీకు సాయంకాలం ఫోన్ చేసి చెప్పుతాను. ఆ ప్రకారం మీ వాళ్లని పంపండి." చెప్పింది సు.


"మేడమ్.. ఈ మారు కూడా.. మీ ఫోటో షూట్ కాగానే.. ఇన్విటేషన్స్ ప్రింట్ చేయించి.. ఫోటోలని.. ఇన్విటేషన్ ని మీకు అంద చేయిస్తాను. వాటిని.. మీ ఫేస్ బుక్ లోను.. మీ ఇన్స్టాగ్రాం లోను ఈ మారూ పెట్టండి." చెప్పాడు ఓనర్.


"మీరు చెప్పాలా. ఆ రెండింటిలోనే కాదు.. కొత్తగా ఓపెన్ కాబడిన నా యూట్యూబ్ ఛానల్ లో కూడా.. ఒక వీడియో రూపాన పెడతాను." చెప్పి.. నవ్వింది సు.

ఓనర్ సంబరంగా వెళ్లి పోయాడు.

సు లంచ్ కై కారులోకి వెళ్లింది.


లంచ్ చేస్తూ.. ఫోన్ చూస్తుండగా.. ధీర వాట్సప్ మేసేజ్ పంపినట్టు గుర్తించింది.

ఆ మెసేజ్ చూసింది.


'కంగ్రాట్స్.. ఎ ఛానల్ వారి ప్రొమో వీడియో యూట్యూబ్ లో చూశాను. ఆ గేమ్ షో లో.. గెలిచిన పైకం మొత్తంని ఓ చార్టీకి నువ్వు ఇస్తున్నట్టు చూపారు. గ్రేట్. నీ అందమే కాదు నీ చేత కూడా నన్ను మురిపిస్తుంది. వాటే హూమనిటీ. ఓ మై లక్..' ఆ మెసేజ్ ఇలా ఉంది.


సు చిన్నగా నవ్వుకుంది.


ఫోన్ ని పక్కన పడేసింది.. ఆ మెసేజ్ కి ఏ సమాధానం ఇవ్వక.


అదే సమయాన...


'ఇంకెన్ని రోజులు వేచి ఉండాలి.. సు ని కలవాలి.. ఎలా.. తన అనుమతి లేనిదే కలవడం బాగోదు.. తనని హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. తను మరీ చెప్పింది.. కొద్ది రోజులు ఆగమని.. తనే ఫోన్ చేసి.. కలిసి మాట్లాడతానని.. కాలం భారంగా కదులుతుంది.. ప్చ్.. తనని కలిసేది ఎప్పుడు.. ఎలా.' అనుకున్నాడు.. సు గురించి ధీర.


ధీర ఆఫీస్ లో ఉన్నాడు.


అతని పని స్లగ్గీష్ గా నడుస్తుంది.


రోజులు మాత్రం సరసరా గడిచి పోతున్నాయి.


బి ఛానల్ వారి ఉగాది స్పెషన్ ప్రొగ్రాం షూటింగ్ ఐ.. ముగింపులో ఉంది..


ఒక పాటతో ఎపిసోడ్ ని ముగించాలని డైరక్టర్ షూట్ చేస్తుండగా..


సు ఒక్కమారుగా.. విదిలించుకుంటున్నట్టు కదిలి.. ఆ ఫ్రేం నుండి బయటికి వచ్చేసింది.


యూనిట్ అంతా గడబిడి అయ్యారు.


అంతా ఆమె నే చూస్తున్నారు.


డైరక్టర్ వచ్చి.. "ఏమైంది మేడమ్." అడిగాడు సు ని గాభరాగా.


"వాట్ సార్.. ఎంత సెలబ్రటీ యాంకర్ ని మీరు పెట్టుకున్నా.. ఆయన చేస్తుందేమిటి.. నేను టాల్రెట్ చేయలేను." చెప్పింది సు గడగడా.


"ఆయన ఏం చేశారు మేడమ్." అడుగుతున్నాడు డైరక్టర్.


"మీరు మోనిటర్ చూస్తున్నారుగా.. మీకు ఏమీ కనిపించ లేదా. ఏమీ అనిపించ లేదా. అల్లరి పాలు.. రభసా కాకూడదని నేను తగ్గుతున్నాను. సరిచేయండి." అంది సు.


డైరక్టర్ తల గొక్కుంటున్నాడు.


కొరియోగ్రాఫర్ గింజుకుంటున్నాడు.


"అవును సార్.. ఆయన కాస్తా ఎగస్ట్రా చేశారు." అన్నాడు డైరక్టర్ చెవి దగ్గర.


"నేను గుర్తించలేదయ్యా." చెప్పాడు డైరక్టర్.


ఆ ఎపిసోడ్ కి యాంకరింగ్ చేస్తున్న ఆ సెలబ్రటీ మాత్రం కూల్ గా ఉన్నాడు కుర్చీలో కూలబడి.


"ఆయన.. సు మేడమ్ గారి చేయిని పట్టుకొని.. డాన్స్ చేస్తూ.. ఆ చెయ్యిని తన ఒంటి మీద.. పెట్టరాని చోట పెట్ట బోయారు." చెప్పాడు కొరియోగ్రాఫర్.. డైరక్టర్ కే వినిపించేలా.


డైరక్టర్ ఉలిక్కి పడ్డాడు.


కదిలి.. షూట్ చేసిన పార్ట్ ని.. కొద్దిగా రివైండ్ చేసి.. మోనిటర్ లో చూసుకున్నాడు.


కొరియోగ్రాఫర్ చెప్పింది.. 'నిజమే' అనుకున్నాడు.


హైరానా అవుతూనే.. వడివడిగా సు వద్దకి వచ్చాడు.


"సారీ మేడమ్.. ఓవర్ లుక్కు ఐంది. ఎడిట్ చేసేస్తాను. దానిని పూర్తిగా తీసేస్తాను.." అంటూనే.. "పేకప్" చెప్పేశాడు.. అరిచేలా.


సెలబ్రటీ.. "అదేమిటి.. ఇంకా పూర్తి కాలేదుగా." అన్నాడు నవ్వుతూనే.


డైరక్టర్.. సెలబ్రటీ అన్నది వినిపించుకోలేనట్టు కదిలి.. "మేడమ్.. మీరు వర్రీ కాకండి.. అన్నీ చూసుకుంటాను. ఇక మీరు వెళ్లి పోవచ్చు." చెప్పాడు సు తో అర చేతులు రుద్దుకుంటూ.


అనుదీప్ ఏమీ పట్టనట్టు ఉండిపోవడం గుర్తించిన సు.. ఏమీ అనుకోలేదు.


'తనకి ఎదురైన అనుభవాల్లో.. ఇది ఏమీ కొత్తది కాదు' అనుకుంది మాత్రం.


అక్కడ నుండి తన కారు వైపు నడిచింది.. నెమ్మదిగానే.


ఉగాది నాడు..


సు యాక్ట్ చేసిన.. రెండు స్పెషల్ ప్రొగ్రామ్స్ మంచి ఆదరణ పొందాయి.


యూట్యూబ్ లో వాటి క్లిప్పింగ్స్ వ్యూస్ .. విరివిగా పెరిగిపోతున్నాయి.


సు మాత్రం.. తన తోటి యాంకర్స్ నుండి.. తన ప్రొడ్యూషర్స్.. తన డైరక్టర్స్.. తన ఆడియన్స్.. నుండి వచ్చి పడుతూన్న మేసేజ్ లకి.. 'మీ అభిమానం నాకు ఇంకా కావాలి' అంటూ స్టీరియో రిప్లే ఇస్తుంది.. తనకి వీలు చిక్కే ప్రతి మారు.. వెంట వెంటనే. అందులో ధీర సాదాగా కొట్టుకుపోయాడు.


ఐనా.. ధీర.. సు మెసేజ్ చూసి.. 'అభిమానం కాదు.. నా ప్రాణమే అడిగినా నీకు ఇచ్చేయడానికి నేను సిద్ధం' అనుకున్నాడు.


అప్పుడు అతడు.. ఇంట్లో ఉన్నాడు.

కొద్ది సేపు గడిచాక..


"నేను బయటికి వెళ్తున్నాను. వచ్చేసరికి ఆలస్యం కావచ్చు." చెప్పాడు ధీర.. తల్లితో.


"ఈ రోజు పండుగ. ఇంటి పట్టున ఉండు. వంటలు అవుతున్నాయి. తిందువు కానీ ఉండు." చెప్పింది సావిత్రి.


"లేదు. బయట తింటాలే." అనేశాడు ధీర.


బయటికి బయలు దేరేశాడు.


వెంకటరావు కూడా ప్రయత్నం చేశాడు.. ధీర ని ఆపడానికి.


కానీ.. ధీర బయటికి వెళ్లి పోయాడు.


సీరియల్ ముహూర్తపు షూటింగ్ కాగానే.. సు.. వరంగల్ బయలు దేరి వెళ్తుంది.. ఫోన్ చూపే నేవిగేషన్ ప్రకారం.


అక్కడ ఆమెకి మంచి వెల్ కం లభించింది.


అక్కడ కార్యక్రమం ముగిసే సరికి..

రాత్రి ఏడు అవుతుంది.


"ఈ రాత్రి అప్పుడు ఎందుకు.. మీకు మంచి వసతి ఏర్పరుస్తాం. రేపు ఉదయం బయలు దేరండి." చెప్పాడు షాప్ ఓపెనింగ్ చేయించుకున్న ఓనర్.


"లేదు. రేపు షూటింగ్ ఉంది. వెళ్లగలను." సరళంగా చెప్పింది సు.


"ఐతే.. మా మనిషిని పంపిస్తాను. డ్రయివింగ్ వచ్చిన వాడే. రాత్రి కదా" చెప్పాడు ఓనర్.

నవ్వేసింది సు.


"ఏమీ కాదు.. రాదు.. నేను వెళ్లగలను." అంటూనే సు అక్కడ నుండి బయలు దేరిపోయింది.


ఆమె కారు వెనుక చాలా మంది.. చాలా వరకు వెంబడించారు అక్కడ చేరిన వారు. కొంత మంది ఐతే.. తమ తమ వాహనాలతో కూడా కొంత వరకు వెంబడించారు.


తర్వాత.. చాలా దూరం తరిగేక..


సు కారు రోడ్డు మీద స్మూత్ గా సాగిపోతుంది.

సు ఆపిల్ తింటుంది.


సు కారు వెనుక.. కొద్ది దూరాన.. ధీర మోటర్ బైక్ పరుగులు తీస్తుంది.


సు యూట్యూబ్ ఛానల్ ద్వారా.. సు వరంగల్ ప్రొగ్రాం ని చూసిన ధీర.. ఆమెని ఫాలో అవుతున్నాడు.


సు చూపుకి అందకూడదన్నట్టు మెసులు తున్నాడు ధీర.

కొన్ని నిముషాల పిమ్మట..


ధీరకి సావిత్రి ఫోన్ చేసింది.

బైక్ ఆపాడు ధీర.


"ఎక్కడరా" అడిగింది సావిత్రి.. ధీర కాల్ ఎత్తగానే.

"వచ్చేస్తున్నాను" చెప్పి.. కాల్ కట్ చేసేశాడు ధీర.


ఎకాఎకీగా బైక్ ని స్టార్ట్ చేశాడు.

సు కారుని చూస్తూ కదులుతున్నాడు.


కారులో..

సు ఫోన్ మోగింది.


రజని నుండి కాల్ వస్తుంది.

"హలో" అంది సు.


"ఎక్కడే" అడిగింది రజని.

"కారులో." చెప్పింది సు.


"అవునా.. ఇంకా ఇంటికి చేరలేదా.. ఎలా ఉంది షాప్ ఓపెనింగ్." అడిగింది రజని.

"గుడ్. ఎవ్రీ థింక్ ఓకే." చెప్పింది సు.


"నీ సీరియల్ రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుండి." అడిగింది రజని.

చెప్పింది సు.


"ఇంకేమిటే" అంది రజని.


"పడుకోవే. ఇప్పుడు ఎంతైందో తెలుసా.." అంటూ.. ఫోన్ లోకి చూసి..

"మరో పది నిముషాల్లో అర్ధరాత్రి కాబోతుంది." అంది సు.


"తెలుసు. అందుకే కాల్ చేశాను. నువ్వు నిద్రకి ఆగలేవు గా." అంది రజని.


"సర్లే.. డ్రయివ్ లో మాట్లాడితే చికాకవుతుంది." చెప్పింది సు.


"టేక్ కేర్.. ఇంటిని చేరగానే మెసేజ్ పెట్టు" చెప్పింది రజని.


"ఎక్స్పెక్ట్ మాత్రం వద్దు." నవ్వింది సు.


"తిక్క మనిషివి." అంటూ రజని కాల్ కట్ చేసేసింది.


రోడ్డు చాలా విశాలంగా తోస్తుంది సుకి.


'రోడ్డు మీద పగటి పూట వినిపించే హారన్ రొదలు.. వెహికల్స్ జోరులు.. ఈ రాత్రి పూట చాలా మేరకు లేకపోయడమే కారణం కావచ్చు' అనుకుంది.


కారు సైడ్ మిర్రర్ లోకి చూస్తున్న సు..


ఒక్క మారుగా పట్టి చూడడం మొదలు పెట్టింది.


వెనుక వస్తున్న బైక్ లైట్ వెలుతురు చాలా బ్రైట్ గా అనిపించడంతో మరింతగా పట్టుగా మిర్రర్ లోకి చూస్తుంది.


రోడ్డు లైట్ పడగానే.. ఆ బైక్ ని.. ఆ బైక్ మీది ధీర ని.. సు ఇంచుమించుగా గుర్తు పట్టేసింది.

దాంతో మరింత శ్రద్ధగా చూసింది.


'ధీర' అనే తేల్చేసుకుంది.


'ఏమిటబ్బా ఇతడు' అనుకుంది.


కారుని మెల్లిగా స్లో చేస్తుంది.


ఆ బైక్ పరుగు కూడా తగ్గుతుండడం గమనించింది సు.


'డవుట్ లేదు.. వస్తుంది ధీరే' అనుకుంది.


'మరీ ఇంత పిచ్చోడా' అనుకుంది కూడా.


కారుని పక్కకి తీస్తూ.. నెమ్మదిగా ఆపింది.


ధీర తన బైక్ ని కూడా దూరంగానే ఆపాడు.

సు ఫోన్ తీసింది. ధీర కి కాల్ చేసింది.


ధీర గజిబిజి అయ్యాడు. కొద్ది సేపటికి కాల్ కలిపాడు.

"హలో" అన్నాడు.


"రా" అంది సు. కాల్ కట్ చేసేసింది.

ధీర తప్పక బైక్ స్టార్ట్ చేశాడు.


సు ని చేరాడు.

డోర్ గ్లాస్ ని కొద్దిగా దించి.. "ఏమిటి ఈ ఫాలోయింగ్." అడిగింది.


ధీర చిన్నగా నవ్వేశాడు.

"ఓపినింగ్ దగ్గరికి వచ్చావా" అడిగింది సు.


తలూపాడు ధీర.

"ఎలా" అడిగింది సు.


"నీ సోషల్ మీడియాస్ సబ్స్కైబర్ ని" చెప్పాడు ధీర.


"అఘోరించావు. ఏమిటీ పిచ్చి పనులు." కాస్తా గట్టిగానే అంది సు.


"చెప్పాగా. నువ్వు నా ఎవ్రిథింగ్.. నీ సేఫ్టీ నాకు ముఖ్యం." చెప్పాడు ధీర.


"నీకు తెలియదు కానీ.. నేను నిన్ను.. ప్రతి రోజూ.. ఒక్క మారైనా.. ఫాలో అవుతుంటాను. నువ్వు షూటింగ్ వెళ్లే టప్పుడు కానీ.. నువ్వు ఇంటికి వచ్చే టప్పుడు కానీ.. నిన్ను రోజుకి ఒక్క మారైనా ప్రత్యక్షంగా చూడదే ఉండలేను. నువ్వు హర్ట్ అవ్వకూడదని.. నేను నీకు కనిపించకుండా జాగ్రత్త పడతాను. ఇప్పుడు అంతే. మరి ఎలా పట్టేశావో." వెంటనే చెప్పాడు ధీర.

"బాగుంది. నాకు ఇట్టివి గిట్టవు." అంది సు.

ధీర ఏమీ అనలేదు.


"నీకు ఇల్లు ఉందా." అడిగింది సు.


"ఉంది. అమ్మ నాన్న ఉంటున్నారు." చెప్పాడు ధీర.


"పాపం.. వాళ్లు ఎదురు చూస్తుంటారు. బయలుదేరు." అనేసింది సు.

"నువ్వు కదులు" చెప్పాడు ధీర.


"ఏయ్. నువ్వు ఏమైనా బాడీగార్డువా." అనేసింది సు.

"అంతకంటే.. నేను నీ నీడ మాదిరిని." చెప్పాడు ధీర.


"అయ్యో.. భగవంతుడా. చాల్లే.. పద పద." అంది సు.

కారుని స్టార్ట్ చేసింది.


కారు కదులుతుంది.

ధీర ఆగి.. బైక్ ని స్టార్ట్ చేశాడు.


మిర్రర్ లో వెనుకే వస్తున్న దీర కై.. 'వీడు మరిన్నూ' అనుకుంది.


'ఇలాంటి వాడిని సరిగ్గా సరి చేసి పెట్టాలి. తేడా ఐతే.. మనిషి మితి మీరొచ్చు.. లేదా.. మనిషి మిగలక పోవచ్చు.' అని కూడా అనుకుంది సు.

(కొనసాగుతుంది..)

***


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.

రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


311 views0 comments
bottom of page