నా నాన్న
- BVD Prasada Rao
- Jun 19, 2022
- 4 min read
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Na Nanna' New Telugu Story Written By BVD Prasada Rao
రచన : బివిడి ప్రసాదరావు
"ఏమిటమ్మా.. ఆయన మరీ కటువైపోతున్నాడు" అన్నాను.
"ఆయనా.. ఎవరూ." విస్మయమయ్యింది అమ్మ.
"అదే.. నీ ఆయన." చెప్పాను.
"ఒరే.. ఆ పెడసరమేమిటిరా. నాన్నా అనవచ్చుగా." కసిరింది అమ్మ.
"ఏమోనమ్మా.. ఆయన అలా అనిపించడం లేదు. నా పాలిటి విలన్ లా కనిపిస్తున్నాడు." చెప్పాను.
"చాల్లే. నోరు అదుపులో పెట్టుకో.. ఆయన నీ నాన్న.. నీ మేలు కోరడమే తప్పా.. ఆయనకి నీ మీద ఏమీ లేదు" అనేసింది అమ్మ.
"అవునులే.. నీ ఆయన్ని ఎప్పుడూ వెనుకేసుకు వస్తావు." గుణిశాను.
నా పేరు కుమార్. టెన్త్ చదువుతున్నాను.
చూస్తున్నానుగా.. చిన్నప్పటి నుండి.. ఆయన.. అదే.. చెప్పాలి కనుక చెప్పుతున్నాను.. నాన్న.. నా పట్ల మొదటి నుండి చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు.
నా ప్రతి పనిని పట్టి పట్టి చూస్తుంటాడు.
అలాగని 'తిడతాడా' అంటే లేదు.. 'కొడతాడా' అంటే లేదు.
మార్కులు బాగా తెచ్చుకుంటున్నా.. 'ఏం పట్టనట్టు ప్రొగ్రస్ కార్డు మీద సంతకం' పెట్టేస్తాడు.
'బాగా చదవాలి. పరీక్ష తప్పితే నా కోపం ఏమిటో మరింత తెలుస్తుంది' అని మాత్రం అనేస్తాడు. అదీ నాతో కాదు.. అమ్మతో చెప్పిస్తాడు.
చెప్తే నమ్మరు కానీ.. చాక్లెట్ కాదు కదా.. చిన్న తీపి బిళ్ల నాకు ఇప్పటికీ ఇచ్చేదే లేదు.
అమ్మే లేక పోతే.. ఈ నాన్నతో ఉండేది పరమ కష్టం. అమ్మో.. తల్చుకుంటేనే భయమేస్తుంది.
అమ్మ నన్ను బాగా చూస్తుంది.
కానీ.. నాన్న గురించి కంప్లెంట్ ఇస్తే మాత్రం చిందులు వేసేస్తుంది.
వద్దనుకుంటూనే.. భరించ లేనప్పుడు అమ్మతో నాన్న గురించి మాట్లాడేస్తాను. అదే ఇక పై మానుకోవాలి. లేదంటే అమ్మ తప్పక నాన్న పార్టీ ఐపోతుంది.
అమ్మో.. అలా ఐతే.. నాకు కష్టమే.
సుధామ రావడంతో నేను తేరుకున్నాను.
సుధామ నా క్లాస్ మేట్.
"అమ్మా.. ఆటకి వెళ్లి వస్తాను. తలుపు వేసుకో." గుమ్మం నుండే కేకేశాను.
"సరే. నాన్న రాక ముందు వచ్చేయ్." అరిచింది అమ్మ లోపలి నుండే.
చిర్రెత్తి పోయింది నాకు. ఛ. ఈ నాన్న ఒకడు. ఠంచన్ గా ఆఫీస్ నుండి ఆరయ్యే సరికి ఇంట్లో వాలిపోతాడు.
వీధి చివర ఉన్న గ్రౌండ్ లోకి చేరాను సుధామ తో కలిసి.
అక్కడ మా తోటి గుంపులో చేరిపోయాను.
క్రికెట్ ఆడుకుంటున్నాం మేము.
ఆటలో పడి.. టైం గమనించ లేదు కానీ.. 'గుఢ్ గుఢ్ గుఢ్' మన్న బైక్ శబ్దంతో జల్దుకున్నాను. అది నాన్న బండి. మా వీధి లోకి వెళ్తుంది.
ఆట ఆపేసి.. నేను ఇంటికి పరుగు పెట్టాను.
'పాపం.. వీడి నాన్న వచ్చేశాడురా.' నా ఫ్రెండ్ మాటలు వెనుక నుండి నాకు వినిపించాయి.
'ఛ. నాన్నా.. నాన్నా' అనుకున్నాను కసిగా.
నాన్న అరుగు మీద బండి పెడుతున్నాడు. నేను ఇంట్లోకి పరుగు తీసేశాను.
అప్పటికే చెల్లి.. వరండాలో పుస్తకం పట్టుకొని చదివేస్తుంది.
నేను గబగబా పుస్తకాలు తీసుకొని.. వచ్చి.. దాని పక్కనే.. నేల మీద చతికిలి పడ్డాను.
నాన్న మమ్మల్ని దాటుకొని లోనికి వెళ్లి పోయాడు.
కొంత సేపు తర్వాత..
నాన్న వచ్చి మా దగ్గరగా కుర్చీలో కూర్చున్నాడు.
అమ్మ కాఫీ తెచ్చి.. నాన్నకి అందించింది.
అమ్మ నన్నే చూస్తుంది. నేను చూశాను.
"ఏం తల్లీ.. ఈ రోజు స్కూలు సంగతులు ఏమిటి." నాన్న అడిగాడు చెల్లిని చూస్తూ.
నాన్న బాగా నవ్వుతున్నాడు. నేను చూశాను.
ఛ. నన్ను ఒక్కసారి కూడా ఇలా అడిగాడా.
ఏమిటో ఇతను.
చెల్లి.. నాన్న మాట్లాడుకుంటున్నారు.
ఏమిటి ఈయనా.
నాన్నని అడగలేక పోతున్నాను.
అమ్మని అడిగితే చెప్పదు.
నాకు ఏమిటీ ఘోరం.
ఒక్కొక్కసారి అనిపిస్తుంది.. తెగించి.. నాన్నని నిలదేసేయాలని. కానీ నాన్నని చూసే సరికి నోరు పెగలదు.
అయ్యో. ఏమిట్రా నాకీ కష్టం.
అమ్మ అప్పటికే అక్కడ నుండి వెళ్లి పోయింది.
చెల్లి.. నాన్న నవ్వేసుకుంటూ.. మాట్లాడేసుకుంటున్నారు.
నేను ఆపుకోలేక.. "చదువుకుంటున్నానా. నవ్వు ఆపు." అన్నాను చెల్లినే చూస్తూ.
"చదువుకో తల్లీ." అంటూ నాన్న లేచి వెళ్లి పోయాడు.
తర్వాత.. అమ్మతో నాన్న మాట్లాడుతున్నట్టు ఉంది. మెల్లి మెల్లిగా లోపలి నుండి మాటలు వినబడుతున్నాయి.
రాత్రి భోజనాలయ్యాక.. హాలు లో అమ్మ.. చెల్లి.. నాన్న కూర్చుని టివి చూస్తున్నారు. నేను వాళ్లతో చేరాను.
అంతే.. నాకు తెలుసుగా.
నాన్న టక్కున చానల్ మార్చేశాడు. న్యూస్ పెట్టేడు.
హు. ఈయన ఎప్పుడు ఇంతే. నేను ఉంటే చాలు.. న్యూసే పడతాడు.
లేచి.. గది లోకి వెళ్లి పోయాను. నిద్రకై మంచం ఎక్కేశాను.
ఎప్పుడు ఏం పాపం చేశానో.. ఇప్పుడు నాకీ గతి.
నాకు ఏడుపు అంత తొందరగా రాదు కానీ.. కోపం చఫ్ న వచ్చేస్తుంది.
నాన్న టివి చానల్ మార్చేశాడు. టివిలో పాటలు వస్తున్నాయి. నాకేమైనా చెవులు వినిపించవా.. ఆఁ.
నాన్నా.. నాన్నా..
గట్టిగా అరిచేయాలని ఉంది.. కానీ.. నోరు పెగలదుగా.
నాన్నా.. నీ ఫవర్ ఏమిటో మరి.
నీకు నీ నాన్న ఉంటే.. నా ఏడుపు నీకు తెలిసేది.
ఏమోలే.. నీ పోరు భరించలేకే.. నీ నాన్న టపా కట్టేశాడేమో. అదృష్టవంతుడు.
ఆలోచనల్లోనే నిద్ర పట్టేసింది.
నన్ను ఎవరో పుస్తకంతో కొడుతున్నట్టు అనిపించగా.. నిద్ర లేచాను.
నా ఎదురుగా.. మంచం ముందు.. చేతిలో న్యూస్ పేపర్ తో నాన్న.
స్ప్రింగ్ లో లేచి.. మంచం దిగేశాను.
"స్కూలుకి టైం కావస్తుంది." నన్ను చూసి అమ్మ అంది.
తను చెల్లికి జడ అల్లుతుంది.
బాత్రూం లోకి దూరి పోయాను.
మా ఊరిలో టెన్త్ పాసయ్యాక.. పది కిలో మీటర్లు దూరాన ఉన్న పట్నంలో.. ఇంటర్ చేరేకైనా.. నా మీద నాన్నలో మార్పులేదు.
నా తోటి వాళ్లంతా మోటర్ బైక్ ల మీద ఇంటర్ క్లాసులకి తిరుగుతుంటే.. నాకు మాత్రం బస్సులో కుదేసి పడేశాడు.. చేతిలో బస్ పాస్ పెట్టి.
నేను ఎవరి బైక్ ఎక్కినా బాగోదని వార్నింగ్ లాగా అమ్మ చేత చెప్పించాడు.
ఛ. మరి తప్పుతుందా.. అంతే.. ఆ బస్సు తిరుగుళ్లే నాకు అందాయి.
ఈ నా నాన్నతో.. నా పాట్లు ఎన్నని చెప్పుతాను.. చెప్పుకుంటాను.
మీరు వినాలి.. నమ్మాలి.. నాకీ నాన్న పాట్లు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
ఇప్పుడు నేను బిఇడి చేస్తున్నాను.
ఇప్పటికీ నా తిరుగుళ్లకి బస్సే ప్రాప్తి.
నాన్న తీరు మారలే.. నా పాట్లు ఆగలే..
నవ్వకండి.. మీకు నవ్వులాటగా ఉందా నా వరస.
హు. మీ నాన్న.. నా నాన్నలాంటి నాన్న కాదుగా.. అందుకే.. నన్ను చూసి నవ్వేస్తున్నారు.. కదూ.
అబ్బో.. వద్దరా నాయనో.. నా నాన్న లాంటి నాన్న.. మరెవరికీ వద్దు.
అలవాటు పడిపోయిన జీవిని కనుక.. ముక్కుతూ.. మూలుగుతూ.. నా చదువును కొనసాగించుకుంటున్నాను.
చెల్లి ఇంటర్ లో జాయినైంది.
అమ్మో.. ఇక్కడే.. నాన్న బాగోతం చెప్పాలి.. మీరు విని తీరాలి..
చెల్లికి నాన్న స్కూటీ కొనిచ్చేశాడోచ్.. సెల్ ఫోన్ కూడా..
వారేవా నాన్నా.. నువ్వు.. నువ్వు..
ఏమీ అనలేక.. అన్నింటినీ దిగమింగేసుకుంటూ..
బిఇడి పూర్తి చేసేశాను.
ఆ సర్టిఫికేట్ చూసేసి.. 'మాస్టార్ ఉద్యోగం లో చేరాలి' అన్నాడు నాన్న.
అది నాతో కాదండీ.. అమ్మతో నాకు అలా కబురు పంపాడు.
వావ్.. వరేవా.. నాన్న..
ఇక పై చదువు లేదని తేలిపోయేక.. తప్పదుగా.. ఉద్యోగం కై తిరుగులు మొదలు పెట్టాను.
ఎట్టకేలకి.. కొన్నాళ్లకి.. ఒక ప్రయివేట్ స్కూలులో మాస్టార్ ఉద్యోగం వచ్చింది.
నేరుగా చెప్పితే.. నాన్నతో నాకు ఒరిగేది ఏమీ ఉండదని.. నేను కూడా అమ్మతోనే నాన్నకి చెప్పించాను.. 'వాడికి మాస్టారు ఉద్యోగం వచ్చింది.' అని.
రెండు రోజుల తర్వాత.. ఉద్యోగంలో చేరడానికి నేను గబగబా తయారయ్యాక..
నాన్న.. "ఇదిగో తాళం.. నీ కోసం కొత్త బైక్ కొన్నాను. గుమ్మంలో ఉంది." చెప్పాడు నాతో. వెంటనే ఆ తాళంతో పాటు.. సెల్ ఫోన్ బాక్సు కూడా నా చేతిలో పెట్టాడు.
అమ్మ.. చెల్లి అక్కడే ఉన్నారు.
నాకు ఏదోలా ఐపోతుంది.
"మా నాన్న కోరిక.. తనలా.. నన్ను మాస్టారుగా చూడాలని. నాకు కుదరలే. ఆ లోటు తోనే మా నాన్న పోయాడు. మనవడి ద్వారా అతడి కోరిక తీర్చాలని.. అందుకు ఎట్టి వెసులుబాట్లు.. సర్దుబాటులు రాకూడదని.. నీ పట్ల.. ఇంత వరకు.. నేను కఠినంగా వ్యవహరించాను. కానీ మా నాన్న కోరిక తీర్చాను. థాంక్స్ రా. అలాగే నన్ను క్షమించురా." అంటూ నాన్న ఏడ్చేస్తున్నాడు.
నిజమండీ.. నాన్న.. నా నాన్న వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.
నేను నిల్చున్న నేల.. ఒక్క మారుగా.. కంపిస్తున్నట్టు నాకు అనిపిస్తుండగా..
నేను కుప్ప కూలేలా భళ్లున నేల వైపు ఒరిగి పోయాను..
నాన్న పాదాల్ని ఆసరాగా పట్టేసుకున్నాను.
గట్టి గట్టిగా ఏడ్చేస్తున్నాను.
***
***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
Comments