కాన్పు నొప్పి
- BVD Prasada Rao
- Jan 10, 2022
- 4 min read
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Kanpu Noppi' Written By BVD Prasada Rao
రచన : బివిడి ప్రసాదరావు
గోడకు కొట్టిన బంతి అదే వేగంతో వెనక్కి వస్తుంది
చేసిన తప్పుల తాలూకు ఫలితం కూడా అంతేనా..
అలా జరగదులే… అని తప్పులు, పొరపాట్లు చేస్తుంటారు చాలా మంది.
చివరికి ఏమవుతుందనేది ప్రముఖ రచయిత, బ్లాగర్ బివిడి ప్రసాదరావు గారి కాన్పు నొప్పి కథ చదివితే తెలుస్తుంది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
కోర్టు ఆవరణ..
"బై." తన మోటర్ బైక్ వైపు వెళ్లిపోయాడు రేవంత్ విసురుగా.
"బైబై." మతిశ్రీ ఆటోకై కదిలింది స్థిరంగా.
ఇద్దరూ కొద్ది నిముషాల క్రితం వరకు భార్యాభర్తలు. ఇప్పుడు సమ్మతంగా విడాకులు
పొందిన వ్యక్తులు. ఇద్దరూ ఎవరి దారిన వారు తమ గమ్యాల వైపు.. తమ తమ వెహికిల్స్
తో కదిలి వెళ్తున్నారు.
***
కొన్నాళ్ల క్రితం..
"అమ్మాయి మతిశ్రీ.. నచ్చింది" తన తల్లిదండ్రుల ప్రశ్నకి జవాబు ఇచ్చాడు రేవంత్.
"గుడ్" రేవంత్ తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు.
అప్పటి వరకు.. రేవంత్ పెళ్లికై వాళ్లు చాలా తంటాలు పడ్డారు. రేవంత్.. పెళ్లి చూపుల్లో
ఒకంతకి ఏ అమ్మాయిని నచ్చే వాడు కాదు. ఏవేవో వంకలు పెట్టేవాడు. తల్లిదండ్రులని
హైరానా పర్చేవాడు.
ఒకే సంతానం కావడంతో.. రేవంత్ అంటే పిచ్చి ప్రేమ ఆ తల్లిదండ్రులకి. కొడుకుకి
కష్టపెట్టే విధం.. వాళ్లు ఎన్నడూ చేపట్టలేదు. కొడుకుకి తందాన తానే పాడేవారు. రేవంత్
మాత్రం తనకి రాబోయే భార్యకై నిర్థిష్టమైన అభిప్రాయం ఏర్పర్చుకొని స్థిరంగా
వ్యవహరించేవాడు.
"ఇక.. పై మాటలు కొనసాగిస్తాం" రేవంత్ తల్లి.. రేవంత్ తండ్రి కంటే పిసరంత
ఎక్కువగానే ఆనందిస్తోంది.
"తప్పక." నిశ్చలమయ్యాడు రేవంత్.
ఆ తర్వాత..
అన్నీ సాఫీగా సాగిపోయాయి.
రేవంత్, మతిశ్రీ.. భార్యాభర్తలయ్యారు.
రేవంత్ షేరింగ్ పోర్షన్ నుంచి డబుల్ బెడ్ రూం ప్లాట్ కి మారాడు. దాని రెంట్
పది వేలు వెచ్చింపుకై స్థిరమై.. మతిశ్రీతో కాపురంకై సిద్ధమయ్యాడు.
రేవంత్ ఉద్యోగ రీత్యా విజయవాడలో ఉంటున్నాడు. అతడి తల్లిదండ్రులు
హైదరాబాద్ లో.. సొంతింటిలో ఉంటున్నారు. అతడి తండ్రి ఓ ప్రయివేట్ కంపెనీలో
జాబ్ చేస్తుండగా.. అతడి తల్లి గృహిణి.
మతిశ్రీ కుటుంబం.. సాదా సీదాకి ఒక మచ్చు. ఆమె తల్లిదండ్రులు.. ఆమె పదమూడో
యేట.. ఒక బస్సు ప్రమాదంలో చనిపోయారు. అప్పటి నుండి ఆమె.. ఒకే ఒక తోబుట్టువైన
అన్నయ్యచే సాక బడింది.
ఆ అన్నయ్య.. చెల్లికి పెళ్లి చేసి తన బాధ్యత తీరిందన్నట్టు చేతులు
దులిపేసుకున్నాడు.. పైగా తన చెల్లి మూలంగా తను చవిచూసే తన భార్య పోరు ఇకపై
కొనసాగదని నిశ్చంతయ్యాడు.
రేవంత్, మతిశ్రీ.. కొత్త కాపురం మోజులో చాలా రోజులుగా హాయి హాయి అవుతున్నారు.
మురిపాలు, ముచ్చట్లుతో భలే సంబరాన్ని కొసరి కొసరి అనుభవిస్తున్నారు.
"అబ్బ ప్రతీ రాత్రిన్నూ. ఇక వద్దండి." విచ్చుకుపోతోంది మతిశ్రీ.
"నో డియర్. నువ్వు పచ్చ జెండా ఊపే వరకు.. నేను మన కలయికలో సేఫ్టీ
మెథడ్స్ వీడను" మొరాయిస్తున్నాడు రేవంత్.
"మన పెళ్లయ్యి ఏడాది దాటిపోయింది. మీ అమ్మగారు గుచ్చి గుచ్చి మరీ
అడుగుతున్నారు. వాళ్లు మనవడ్ని లేదా మనవరాల్ని ఆశిస్తున్నారు" మతిశ్రీ మళ్లీ
చెప్పింది.
"కదా. అందుకే అంటున్నా. ఆ బిడ్డనేదో కనేసి.. తర్వాత.. నువ్వు వెంటనే
ఆపరేషన్ చేయించేసుకోవాలి. మనకి ఒకే ఒక సంతానం చాలు." ఖారాఖండీగా
ఉన్నాడు రేవంత్.
"తప్పదా. ఇద్దరు వద్దా" ఆశపడుతోంది మతిశ్రీ.
"నో. నో. చెప్పాగా. ఫ్యూచర్ అగమ్యగోచరంగా అగుపడుతోంది. దానిని నెట్టుకు
ముందుకు సాగలేం. మన స్థితిగతులు నీకు తెలియనివా" నిస్సత్తువైపోతున్నాడు
రేవంత్.
ప్రతి మారు భర్త అవస్థల పాలవ్వడం చూస్తున్న మతిశ్రీ ఈ మారు చప్పబడింది.
"సరే.. మీరనుకున్నట్టే కానీయండి. ఒక బిడ్డకే నేను ఒప్పుకుంటున్నాను. సంతానం
తర్వాత.. నేనే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటాను."
ఉత్సాహమయ్యాడు రేవంత్. సేఫ్టీ మెథడ్స్ వీడాడు. మొదటి సారిగా భార్యని
పూర్తిగా ఏ అడ్డు లేకుండా ఆక్రమించుకున్నాడు.
రెండు నెలల్లోనే మతిశ్రీ గర్భవతయ్యింది.
రేవంత్ తల్లిదండ్రులు సంబరమైపోయారు.
"మీ అన్నయ్య ఇప్పటికీ మనిషవ్వడా" రేవంత్ కలవరమయ్యాడు.
మతిశ్రీ ఆందోళన పడింది. "చెప్పానుగా. మా వదిన కానివ్వదు"
"ఎటూ నాకు బావమరిది ఊతం అందడం లేదు.. కనీసం నీకు అన్నయ్య వైపు
ముచ్చట అందకపోవడమేమిటి" నొచ్చుకుంటున్నాడు రేవంత్.
మతిశ్రీ తలదించుకుంది.
కాలం ఆగలేదు.. స్లో కాలేదు.. తన నడకన తాను సాఫీగా సాగిపోతోంది.
ఆ గమనంలోనే.. మతిశ్రీ, రేవంత్.. తల్లిదండ్రులయ్యారు. మతిశ్రీ పురుడు బల్ల
మీదే ఫామ్లీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేసుకుంది.
బిడ్డని చూసిన.. రేవంత్ హతాశుడయ్యాడు.
"ఏమిట్రా" రేవంత్ తండ్రి తల్లకిందలవుతున్నాడు.
"ఆడపిల్ల అనగానే అష్టలక్ష్మీ అనుకున్నాను.. చూస్తే.. అవిటిదా" రేవంత్ తల్లి
అట్టుడికిపోయింది.
"కడుపులోనే పోయింటే బాగుణ్ణు" రేవంత్ వాగేశాడు.
మతిశ్రీ హడలిపోతోంది.
కొడుకు రిక్వెస్ట్ తో.. హాస్పిటల్ నుంచి బిడ్డతో రేవంత్ ఇంటికి వచ్చే వరకు ముళ్ల
మీద నడకలా నడిచేసి.. తిరిగి తమ ఇంటికి గమ్మున వెళ్లి పోయారు రేవంత్
తల్లిదండ్రులు.
మతిశ్రీ పట్ల, బిడ్డ పట్ల.. ఎడ మొహం పెడ మొహంలా మెసులుతున్నాడు
రేవంత్.
మతిశ్రీ ఇబ్బంది పడుతున్నా బిడ్డ సంరక్షణని వదలడం లేదు.
కాలం గడిచిపోతోంది.
మతిశ్రీ నుండి తప్పా.. ఆ బిడ్డకి ఆలనా, పాలనా.. అచ్చటా ముచ్చటా ఎటు
నుండి అందడం లేదు.
అలానే ఆ బిడ్డ వయస్సు మూడు నెలలు దాటేసింది.
"ఓర్చుకుంటున్నాను. ఓపిక పడుతున్నాను. కానీ తండ్రిగా మీకు మన బిడ్డ పట్ల
ఈ వివక్ష తగదు. మీరు పట్టించుకు తీరాలి" చివరికి రేవంత్ ని నిలదీస్తోంది మతిశ్రీ.
"సంతానం సంగతిలో ఎన్నో అనుకున్నాను. ఖర్మ. ఏమిటిది" అలానే
విసుక్కున్నాడు రేవంత్.
"నా తప్పా" ఎదురు నిలిచింది మతిశ్రీ.
"కన్నది నువ్వేగా" నోరు చేసుకున్నాడు రేవంత్.
"అదేమిటి.. మీ ప్రమేయం తోనేగా.. నేను కన్నది" మతిశ్రీ తంటాలు పడుతోంది.
మరో మారు..
"ఈ బిడ్డని ఏదోలా వదిలించేసుకుందాం." తన ఆలోచనని జార్చేశాడు రేవంత్.
అవాక్కయి పోయింది మతిశ్రీ.
"అలా ఐతేనే మనం మునుపటిలా ఉండగలం" చెప్పేశాడు రేవంత్.
"అదెలాగండీ" అడగ్గలిగింది మతిశ్రీ.
"తర్కాలు వద్దు. తర్జనభర్జనలు నాకు వద్దు. నా మాట వినవలసిందే" నికరమై
ఉన్నాడు రేవంత్.
మతిశ్రీ మాట సాగలేదు.
చివరికి..
బిడ్డ విషయంలో రాజీ పడక.. ఇద్దరూ విడిపోవాలనేసుకున్నారు.
విడాకులకై ప్రొసీజర్ ని ఆరంభించేశారు.
రేవంత్ తల్లిదండ్రులు కొడుక్కి వత్తాసు పలికేశారు.
మతిశ్రీ.. బిడ్డకై తగ్గింది. అలాగే.. ఇప్పటికీ తను.. తన అన్నయ్యకై
ప్రాకులాడలేదు.
రేవంత్ తిరిగి షేరింగ్ పోర్షన్ లోకి మారిపోయాడు.
మతిశ్రీ అదే ఊరిలో వేరే చోట సింగిల్ బెడ్ రూం పోర్షన్ ని రెంట్ కి
కుదుర్చుకుంది.
***
కోర్టు వైపు నుండి..
రేవంత్ నేరుగా తను పని చేస్తున్న ఆఫీసుని చేరాడు.
మతిశ్రీ నేరుగా తను పని చేస్తున్న శిశు సంరక్షణ కేంద్రంని చేరింది. తన తోటి
ఆయా చెంత నుంచి తన బిడ్డని అందుకొని.. బిడ్డని ముద్దాడి.. నిబ్బరంగా, నిశ్చలంగా
అక్కడి తన ఆయా డ్యూటీని చేపట్టింది.
***
కాలం గడుస్తుంది..
రేవంత్ తల్లిదండ్రులు.. కొడుక్కు మళ్లీ పెళ్లి చేయతలిచారు.
రేవంత్ కూడా పెళ్లికి మొగ్గు చూపాడు.
సంబంధం కుదిరింది. నిశ్చతార్థం పూర్తయింది. ముహూర్తాలు తీశారు.
రేవంత్.. తన వెడ్డింగ్ కార్డ్స్ ఇస్తున్న క్రమంలో.. మోటర్ బైక్ ప్రమాదంకి
గురయ్యాడు.
రేవంత్ కుడి కాలు తీసేయవలసి వచ్చింది.
"ఆడ పెళ్లి వారు.. పెళ్లి కేన్సిల్ చేసేశారు. అవిటివాడయ్యాడని.. మన అబ్బాయిని
తిరష్కరించారు" చెప్పాడు రేవంత్ తండ్రి.
రేవంత్ తల్లి అవస్థయ్యింది.
రేవంత్ కంగు తిన్నాడు. అతడు తేరుకుంటుండగా.. సడన్ గా.. తనకి పుట్టిన
బిడ్డ యాదకి వచ్చింది. తుళ్లి పడ్డాడు.
"ఏమైందిరా" రేవంత్ తల్లి అడుగుతుంది.
"నా బిడ్డ పట్ల అనుచితంగా వ్యవహరించాను.. అది ఘోరం కదమ్మా.." రేవంత్
వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.
***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
Comments