top of page

'సంతోష్ కావ్య'ము

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Santhosh Kavyamu' Written By BVD Prasada Rao

రచన : బివిడి ప్రసాదరావు

ప్రేమించిన అమ్మాయిని పెద్దల ఆమోదంతో పెళ్లి చేసుకోబోతున్న సంతోష్ కథను సరదాగా వివరించారు ప్రముఖ రచయిత బివిడి ప్రసాదరావు గారు.

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

ఇక కథ ప్రారంభిద్దాం

డోర్ బెల్ మోగింది.

తల్లికి సాయ బడుతున్న కావ్య.. చేతిలో పనిని ఆపి.. తలుపు తీయడానికి అటు కదిలింది.. వంట గదిలోంచి.

కావ్య తల్లి.. 'మార్కెట్ నుండి తన భర్త వచ్చి ఉంటాడు' అని తలుస్తుంది. కావ్య తలుపు తీసింది.

ఎదురుగా.. తన తోటి ఉద్యోగి.. సంతోష్ కనిపించడంతో.. కాస్తా తడబడింది. ఐనా

చిన్నగా పలకరించింది.

సంతోష్ నవ్వుతూ.. "మీ పేరెంట్స్ ఉన్నారా" అడిగాడు.

కావ్య సతమతమవుతుంది.

"ఆదివారం.. హాలీడే.. సో.. మనకు మల్లె.. మీ ఫాదర్ కూడా.. ఇంట్లోనే ఉంటారు

కదా.. అందుకే ఈ రోజు వచ్చాను." చెప్పాడు సంతోష్.

కావ్య ఇంకా తికమకలోనే ఉంది.

"నేను లోనికి రావచ్చా .. లేదా.." సంతోష్ చక్కగా నవ్వుతున్నాడు.

కావ్య తేరుకుంటూ, "అరె. రావచ్చు" అనేసింది.

సంతోష్ ఇంట్లోకి వచ్చాడు. హాలులో.. కావ్య చూపించిన సింగిల్ సోఫా కుర్చీలో కూర్చున్నాడు.

కావ్య వంట గదిలోకి వెళ్లింది.

"అమ్మా.. మా ఆఫీస్ కొలీగ్.. సంతోష్ వచ్చారు. మీ కోసమే నట." కావ్య తడబడుతుంది.

"మా కోసమా. ఎందుకేమిటి." అంటూనే, "మీ నాన్న ఇంకా రాలేదాయే.." కావ్య తల్లి కంగారవుతుంది.

తల్లి చేష్టలని చూస్తూ ఉండిపోయింది కావ్య.

"సరే.. వస్తాను.. నువ్వు వెళ్లు.. మాట్లాడుతుండు." అనేసింది కావ్య తల్లి.

కావ్య తప్పనిసరై.. అక్కడ నుండి హాలు లోకి వచ్చింది.

సంతోష్ కి కాస్తా దరిన నిల్చుని.. కాస్తా సన్నగా నవ్వుతూ ఉంది.

"నిల్చోడం ఏమిటి. కూర్చో వచ్చుగా." ఈజీగా అన్నాడు సంతోష్.

కావ్య కూర్చుంది.. సంతోష్ కి ఎదురుగా ఉన్న లాంగ్ సోఫాలో.

చూస్తున్న డైలీని తిరిగి తమ మధ్య ఉన్న టీపాయ్ మీద పడేసి.. "నా రాక

సర్ప్రైజా." అడిగాడు సంతోష్.

కావ్య అతడినే చూస్తుంది. సంతోష్ చిన్నగా నవ్వుతున్నాడు.

"రాకూడని టైంలో.. నేను రాలేదు కదా." సంతోష్ నవ్వుతూనే అడిగాడు.

"అబ్బే.. లేదు లేదు.." తడబడుతుంది కావ్య.

"అరరె. కూల్. నేను.. మీ పేరెంట్స్ తో మాట్లాడాలనే.. ఫిక్సై.. వచ్చాను."

సంతోష్ మాట్లాడుతున్నాడు.

కావ్య మాత్రం ఇంకా సాదా కాలేకపోతుంది.

"వెల్.. మీ ఇంటి లొకేషన్ కాస్తా తికమకగానే ఉంది. చాలా సందులు తిరిగాను"

కావ్యని తేలిక పరచాలన్నట్టు మాట్లాడుతున్నాడు సంతోష్.

కావ్య వింటుంది. వంట గది వైపు మాట మాటకీ చూస్తుంది.

"కూల్.. కంగారు వద్దు. డోన్ట్ వర్రీ.." సంతోష్ నవ్వుతున్నాడు.

అప్పుడే.. కావ్య తల్లి అక్కడికి వచ్చింది.. కాఫీ కప్పుతో.

కావ్య లేచి.. తన తల్లికి.. సంతోష్ కి.. ఒకరినొకరికి పరిచయం చేసింది.

సంతోష్ లేచి నిల్చుని.. కావ్య తల్లికి నమస్కరించాడు.

తల్లి చేతిలోని కాఫీ కప్పుని.. కావ్య అందుకుంది.. సంతోష్ కి దానిని అందించింది.

"థాంక్యూ" అంటూనే ఆ కప్పుని అందుకున్నాడు సంతోష్.

"కూర్చో బాబూ" అంది కావ్య తల్లి.

సంతోష్ తిరిగి.. సింగిల్ సోఫా కుర్చీలో కూర్చుంటూ.. "మీరూ కూర్చోండి" అన్నాడు.

కావ్య తల్లి.. లాంగ్ సోఫాలో కూర్చుంది. ఆవిడ పక్కనే కావ్య కూడా కూర్చుంది.

కాఫీ తాగుతూ.. "నేను.. మీ కావ్య.. ఒకే ఆఫీస్ లో.." చెప్పుతున్న సంతోష్ కి అడ్డు పడి..

"అమ్మాయి చెప్పింది." నవ్వగలిగింది కావ్య తల్లి.

కాఫీ తాగుతూ.. "సార్ లేరా" అడిగాడు సంతోష్.. కావ్య తండ్రికై.

"మార్కెట్ కి వెళ్లారు. వచ్చే టైమే.." చెప్పింది కావ్య.

"ఏమిటి బాబూ.. ఇలా వచ్చారు." తప్పక అడిగింది కావ్య తల్లి.

"చెప్తాను.. సార్ కూడా రానీయండి." నవ్వేడు సంతోష్.

తల్లీ కూతుళ్లు మొహాలు చూసుకున్నారు. ఇద్దరికీ సంతోష్ రాక గందరగోళంగా అనిపిస్తుంది.

కాఫీ తాగేసి.. కప్పుని టీపాయ్ అంచున పెట్టేడు సంతోష్.

అంతలోనే.. కావ్య తండ్రి ఇంట్లోకి వచ్చాడు. హాలులోని సంతోష్ ని చూస్తూ.. తికమక పడుతున్నాడు.

అప్పటికే.. కావ్య తల్లి.. కావ్య లేచి నిల్చుని ఉన్నారు.

సంతోష్.. "మీ ఫాదరా" అడిగాడు కావ్యని.

కావ్య.. 'అవును' అన్నట్టు తలాడించింది.

సంతోష్ లేచి నిల్చుని.. "నమస్కారం సార్" అన్నాడు.

ప్రతి నమస్కారం చేస్తున్న తండ్రితో.. "మా ఆఫీస్ కొలీగ్.. సంతోష్ గారు" చెప్పింది కావ్య.

భర్త చేతిలోని బ్యాగుని అందుకొని.. కావ్య తల్లి వంట గది వైపు నడిచింది.

"కూర్చొండి" అంటూ.. కావ్య తండ్రి లాంగ్ సోఫాలో కూర్చున్నాడు.

సంతోష్ తిరిగి కూర్చున్నాడు. కావ్య నిల్చుని ఉంది.

"చెప్పండి. ఏమిటిలా వచ్చారు" అడిగాడు కావ్య తండ్రి.. సంతోష్ ని చూస్తూ.

"మీ కావ్య మదర్ కూడా రానీయండి.." చెప్పాడు సంతోష్.

"మీ అమ్మని పిలు" చెప్పాడు కావ్య తండ్రి.. కావ్యనే చూస్తూ.

కావ్య అస్తవ్యస్తంగా వంట గది వైపు కదిలింది.

నిముషాల్లో తిరిగి హాలులోకి వచ్చింది తల్లితో కలిసి.

కావ్య తల్లి.. భర్త పక్కన కూర్చుంది.

కావ్య.. పక్కగా ఉన్న మరో సింగిల్ సోఫా కుర్చీలో కూర్చుంది.

సంతోష్ వాటం అక్కడి మిగిలిన ముగ్గురుకి వింతగా తోస్తుంది.

"నా రాక కారణం చెప్తాను. దానికి ముందు.. నా వివరాలు చెప్తాను. దయచేసి వినగలరు." అంటూ..

"నా పేరు సంతోష్. మాది రాజమండ్రి. నాన్న జానియర్ కాలేజీ లెక్చరర్. అమ్మ స్కూలు టీచర్. నేను.. అక్క.. వాళ్ల సంతానం. అక్కకి పెళ్లై రెండేళ్లు అవుతుంది. అక్క హౌస్వైఫ్. బావ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఆ ఇద్దరూ హైదరాబాద్ లో ఉంటున్నారు. వాళ్లకి నెలల పాప." అంటూ..

"మా అందరివీ.. రమారమీ చాలా బ్రాడ్ థింకింగ్స్. సరళంగా సాగిపోవాలన్నదే మా మోటివ్.."

కావ్య తల్లిదండ్రులతో పాటు.. కావ్య కూడా సంతోష్ చెప్పుతుంది శ్రద్ధగా వింటుంది.

"ఉద్యోగం రావడంతో.. నేను.. ఈ విజయవాడ వచ్చి.. ఆరు నెలలు అవుతుంది.

అద్దె గదిలో.. హోటల్ మీల్స్ తో.. సర్దుకు ఉంటున్నాను." చెప్పడం ఆపాడు సంతోష్.

కావ్య తల్లిదండ్రులకి.. సంతోష్ తీరు అర్ధం కావడం లేదు. పైగా వింతవుతున్నారు.

సంతోష్ మాత్రం చెప్పడం కొనసాగించాడు.

"తోటి ఎంప్లాయ్ కావడంతో.. మీ కావ్యతో కాస్తా పరిచయం ఏర్పడింది. పోను

పోను.. అదీ కూడా.. నా వాళ్లు నా పెళ్లికై.. పడే ప్రాకులాట ఎఱిగిన నేను.. మీ కావ్యని

పరిశీలించడం చేపట్టాను. మీ అమ్మాయి వివరాలు రాబెట్టుకున్నాను. అన్నీ నాకు

సవ్యం అనిపించడంతో.. నేరుగా మీ దగ్గరకి ఇలా వచ్చేశాను. మీ పెద్దల చెంతనే తేల్చుకోవాలని తలుస్తున్నాను.." ఆగాడు సంతోష్.

కావ్య తల్లిదండ్రులు మొహాలు చూసుకుంటున్నారు.

కావ్య కుదురు కాలేకపోతుంది.

"మీ కావ్యని పెళ్లి చేసుకోవాలని తలుస్తున్నాను. మీరు సమ్మతిస్తే.. మా పెద్దల్ని తీసుకు వస్తాను." చెప్పేశాడు సంతోష్.

"ఏమిటి బాబూ.. మీ తీరు.." విస్తుపోయాడు కావ్య తండ్రి.

"అవునండీ.. కోరినవి కావాలంటే.. తీరాలంటే.. చొరవ అవసరమండీ.. అదీన్నూ..

సవ్యంగానే సాగించాలన్నదే నా తపన.. అంతే.." చెప్పాడు సంతోష్.

ఆ ముగ్గురూ మొహాలు చూసుకుంటూ ఉండగా..

"నా గురించి ఇంకా ఏమైనా వివరాలు కావాలా.." అడిగాడు సంతోష్.

నీళ్లు నములుతున్నట్టు తొట్రుబాటవుతున్నాడు కావ్య తండ్రి.

"నా ఆలోచన చెప్పేశాను. మీరు ఆలోచించుకొని.. మీ నిర్ణయం తెల్పండి.

ఎప్పుడు కలవమంటే.. తిరిగి అప్పుడు వస్తాను." లేచి నిల్చున్నాడు సంతోష్.

ఆ ముగ్గురూ కీ బొమ్మల్లా లేచి నిల్చుండి పోయారు.

"మా వాళ్లు ఆమోదించినట్టే.. మీరు కూడా.. నా ప్రతిపాదనని ఆమోదిస్తారని

భావిస్తున్నాను. దయచేసి సమ్మతి తెలియచేయండి.. మీ అమ్మాయిని.. మీలానే..

నేను కూడా చూసుకుంటాను.. మా తల్లిదండ్రుల మీద ఒట్టు.. నమ్మండి.." అంటూ

చివరిగా తను చెప్పాలనుకున్నది చెప్పేసి.. సంతోష్ అక్కడ నుండి వెళ్లిపోయాడు.

మర్నాడు.. ఆఫీస్ లో..

"ప్రేమలు.. గొడవలు.. ససేమిరా ఇష్టం లేని మా వాళ్లని.. భలేగా బుట్టలో

పడేశారు.. మీతో.. నా పెళ్లికి.. మా వాళ్లు కూడా సమ్మతించేశారు.. సాయంకాలం..

మిమ్మల్ని.. మా ఇంటికి.. తోడ్చకు రమ్మనమన్నారు.." కావ్య సంతోషంతో తబ్బిబ్బు ఐపోతుంది.

సంతోష్ కాలర్ ఎగరేయడానికి ఏ మాత్రం ఆలస్యం చేయలేదు.

చక్కని ప్రేమ.. ఒక చిక్కని కావ్యమే మరి..

***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.

రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.



239 views0 comments
bottom of page