కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Vadhuvulu Koratha' Written By BVD Prasada Rao
రచన : బివిడి ప్రసాదరావు
భర్త ఆఫీస్ కి వెళ్లేక.. పనులు చక్క బెట్టేక.. తీరికయ్యింది సావిత్రి.
వెళ్లి.. సిట్ అవుట్ ఏరియాలో.. సోఫా కుర్చీలో కూర్చుంది.
గుండెల నిండా గాలి పీల్చుకుంది.
డైలీ చూస్తుంది.
కొన్ని నిముషాల తర్వాత.. సెల్ ఫోన్ ధ్వని వినిపిస్తుంది.
ఒంగి.. టీపాయ్ మీది ఆ ఫోన్ ని తీసుకుంది సావిత్రి.
ఫోన్ స్క్రీన్ మీది నెంబరు చూసింది. కానీ ఎవరో.. ఎవరిదో.. తనకి తెలియని నెంబరు.
"హలో" అంది సావిత్రి.
"హలో" అంది ఫోన్ చేసిన మరకతం.
అటు గొంతు పోల్చుకోలేక.. తికమకతో తిరిగి.. "హలో" అంది సావిత్రి.
"సావిత్రి.. సావిత్రేనా.." మరకతం అవస్త పడుతుంది.
"అవును.. ఇంతకీ.. మీరు.." గింజుకుంటుంది సావిత్రి.
"సావిత్రీ.. నేను.. రక్తంని.. మరకతంని.." హుషారు అవుతుంది మరకతం.
"అవునా.. రక్తం వా.. చాన్నాళ్లు.. చాన్నాళ్లకి.." ఖుషీ పడుతుంది సావిత్రి.
ఇద్దరూ హాయిగా నవ్వుకుంటూ.. మాట్లాడుకుంటున్నారు.
సావిత్రి.. మరకతం.. నైన్తు క్లాసు నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీమేట్స్.
మరకతంని.. 'రక్తం' అని సావిత్రి పిలిచేది.
"ఎలా ఉన్నావు సావిత్రీ." మరకతం అడుగుతుంది.
"నేను బాగున్నా.. నువ్వు.. అన్నట్టు నా నెంబర్ నీకు ఎలా తెలిసింది." సావిత్రి హడావిడి అవుతుంది.
"అదే.. అప్పటి మన స్టడీమేట్.. శేఖర్.. నిన్న సాయంకాలం.. బజార్ లో తలవని తలంపుగా అగుపడ్డాడు. ఆఫీస్ పని మీద మా ఊరు వచ్చాడట.. మాటల్లో.. నీ ఊసు దొర్లింది.. అతడి నుండి.. నీ ఫోన్ నెంబర్ తీసుకున్నాను.." చెప్పుతుంది మరకతం.
"అవునా.. అవునవును.. శేఖర్ ఉంటుంది మా ఊరిలోనే.. అప్పుడప్పుడు
మేము ముఖాముఖీ అవుతుంటాం." చెప్పింది సావిత్రి.
"అవును. శేఖర్ చెప్పాడు. వెతుకుతున్న తీగె కాలికి తగిలినట్టు.. నీ ఆచూకి.. శేఖర్ మూలాన నాకు చిక్కింది.. సో లక్కీ.." మరకతం చెప్పుతుంది.
"ఆగాగు.. తీగె.. కాలికి తగలడం.. ఏంటి కత.." నవ్వుతుంది సావిత్రి.
"చెప్తాను.. అవును.. నిజంగా ఈ మధ్య.. ఒక యత్నంకై.. విఫల దేవులాటలతో హైరాన అవుతున్నాను. నమ్ము. నీ ఉనికి తెలియడంతో.. కుదురు పడొచ్చు అనుకుంటున్నాను.."
"సరి సరే.. ముందు.. నీ తపనకి హేతువు చెప్పవే.." ఆత్రం అవుతుంది సావిత్రి.
"మరి.. అదేనే. నీతో ముఖాముఖీ కావాలని.. కొన్ని వివరాలు తెలుసుకోవాలని.. నీ గురించి కొద్దిగా తెలిసింది లగాయితు తలుస్తున్నాను.." చెప్పుకుపోతుంది మరకతం.
"ఆపవే.. ఉపోద్ఘాం ఆపి.. వివరణ ఇవ్వవే.." కుతూహలం అవుతుంది సావిత్రి.
"తీరికేనా" అడిగింది మరకతం.
"బ్రహ్మాండంగా.. సాయంకాలం.. మా వారు ఆఫీసు నుండి వచ్చే వరకు తీరికే." అంది సావిత్రి.
"నా క్కూడా డిటో." నవ్వింది మరకతం.
"వీడియో కాల్ కనెక్టు అవుదామా.. ఎంచక్కా చూసుకుంటూ.. ఎదురెదురుగా ఉన్నట్టు.. మాట్లాడుకోవచ్చు." గొప్పైపోతుంది సావిత్రి.
"షూర్.. షూర్." హుషారెక్కిపోతుంది మరకతం.
ఆ వెంబడే.. వాళ్లిద్దరూ.. వీడియో కాల్ లోకి దిగిపోయారు.
కొద్ది సేపు.. ఆ ఇద్దరూ.. ఒకరినొకరు.. తనివిగా చూసుకుంటూ.. అప్పటిలోని.. ఇప్పటిలోని.. వచ్చిన.. మారిన.. తమ తమ శరీర ఆకృతులలోని మార్పులని ముచ్చటించుకున్నారు.. సెటైర్లు పేల్చుకున్నారు.
ఆ పిమ్మట.. అప్పటివి.. మరి కొన్నింటిని నెమరు వేసుకున్నారు..
ముచ్చటైపోయారు.
సావిత్రి.. మరకతం ఇంటర్మీడియట్ చదువు తర్వాత.. సావిత్రి తండ్రి ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్ కావడంతో.. ఆ ఇద్దరూ విడిపోయారు.
ఆ తర్వాత.. సాధారణంగా ఇద్దరి కాలం గడుస్తూ వస్తోంది.. ఆ కాల గమనంలోనే.. ఆ ఇద్దరికీ.. పెళ్లిళ్లు ఐపోయాయి.. ఎవరి కుటుంబాలు వారికి ఏర్పడిపోయాయి.
అలాగే.. ఇంటర్మీడియట్ తర్వాత.. విడిపోయిన ఆ ఇద్దరూ.. కలిసేది ఇప్పటి వరకు జరగనే లేదు.
సావిత్రిని కలవాలని మరకతం తలవడంతో.. మళ్లీ.. వాళ్లిద్దరు ఇప్పుడు
కలవగలిగారు.
"ఇంతకీ.. ఇన్నాళ్లకి.. నన్ను నువ్వు తలవడం.. ఇలా కలవడం.. ఏమిటే.." అడిగేసింది సావిత్రి.
"నేనూ ఆ మేటర్ కే వస్తున్నా.. శేఖర్ ని నీ పిల్లలు గురించి అడిగాను.." మాట్లాడుతుంది మరకతం.
"ఆగాగు.. పిల్లలు కాదు.. పిల్ల.. ఒకే ఒక అమ్మాయి.. అమెరికాలో ఉంటుంది.. ఐటి ఫీల్డ్ లో ఉంది.." చెప్పింది సావిత్రి కొద్దిపాటి గర్వంతో.
"అదే.. మరదే.. ఆ అమ్మాయికి పెళ్లి చేయవా" గబుక్కున గబగబా అడిగేసింది మరకతం.
"ఏమిటే నీ గోల.." గందికవుతుంది సావిత్రి.
మరకతం ఏమీ పట్టించుకోనట్టు.. "నాకూ ఒకే ఒక సంతానం. అబ్బాయి. బెంగుళూరులో ఉంటున్నాడు. బ్యాంక్ లో జాబ్.. ఇంకా వాడికి పెళ్లి కాలేదు.. లేదు లేదు.. వాడికి పెళ్లి చేయలేక పోతున్నాను.." చకచకా చెప్పేస్తుంది.
"ఒసే.. కాస్తా నెమ్మదిగా మాట్లాడవే.. ఏమిటి నీ సొద.. సోది.." నవ్వుతుంది సావిత్రి.
మరకతం చెప్పడం ఆపింది.
"పెళ్లి చేయలేక పోవడమేమిటే.." విస్మయంలో ఉంది సావిత్రి.
"మరే.. ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా.. పెళ్లి సంబంధంకి.. తగ్గ ఆడ పిల్లలు దొరకడం లేదే.. వధువులు కొరత.."
"మా అమ్మాయికై చాలా సంబంధాలు వస్తున్నాయి.. చాలా జోరుగానే వాకబులు నడుస్తున్నాయి.. ఛాన్స్ లు ఎక్కువ కావడంతో.. ఛూజ్ చేసుకోవడం కష్టమవుతుంది" చెప్పుతుంది సావిత్రి.
"అవునవును.. నీకేం.. నీకు ఆడ పిల్ల.. పెళ్లికి.. అబ్బాయిలు లోటు.. లేనే లేదు.. దాంతో నీకు ఛాయ్స్ లు జాస్తీ.. ఎంచక్కా.. తీరిగ్గా ఎంపిక చేసుకోవచ్చు." గుణుస్తుంది మరకతం.
సావిత్రికి.. మరకతం విషయం అర్ధమైంది.
"నిజమే.. ఆ నోట.. ఈ నోట నేనూ వింటున్నాను.. పెళ్లిళ్లకి.. అమ్మాయిల శాతం తక్కువ.. అబ్బాయిల శాతం ఎక్కువ.. అని." అంటుంది సావిత్రి.
దిగులయ్యిపోతుంది మరకతం.
సావిత్రి గమనించగలిగింది.
"మరీ అంతగా డీలా కాకే. కలిసొస్తే అన్నీ చకచకా కాకపోవు.. అలాగే.. నీ
అబ్బాయికి సంబంధం రాకపోదు." సావిత్రి సముదాయించబోతుంది.
"లేదే.. చాలా ప్రయత్నాలు చేశాను. పెళ్లికి అమ్మాయి దొరకడం కష్టంగా ఉందే.. అన్ని ఖర్చులూ భరించి.. మేమే పెళ్లి చేస్తాం.. అన్నా.. సరైన ఒక్క అమ్మాయి.. దొరకడం లేదే.." మరకతం చెప్పుకుపోతుంది.
సావిత్రి వింటూ ఉంది.
"సావిత్రీ.. నీకూ ఈ ఆఫరే ఇస్తాను.. నీ అమ్మాయిని.. నా అబ్బాయికి ఇవ్వవా."
టక్కున కోరేసింది మరకతం.
తుళ్లి పడింది సావిత్రి.
"ఏమిటే ఆ చూపు.. చెప్పు.. మాట్లాడు.. ప్లీజే." మరకతం బేలైపోతుంది.
"అదే.. మరి.. పెళ్లంటే.. నా అమ్మాయి.. నా భర్త.. వాళ్లిష్టాలు..
వాళ్లభిప్రాయాలు.." నీళ్లు నములుతుంది సావిత్రి.
మరకతం బెంబేలైపోతుంది.
"అంతేనే.. నువ్వు.. అమ్మాయి తల్లివి.. నాలా గాభరా పడవు.. నాలా
గలాభా సేయనవసరం లేదు." నొచ్చుకుంటుంది మరకతం.
"రక్త.. మరకతం.. పని ఉంది.. ఉంటా.." అంటూనే.. సావిత్రి ఆ కాల్ ని కట్ చేసేసింది.. పుటుక్కున.
అటు.. మరకతం.. తన చేతిలోని ఫోన్ ని మంచం మీదకి విసిరేసి.. తన అత్తింటి వారి.. ముఖ్యంగా తన భర్త దాష్టీకానికి.. తన నిస్సహాయతకి.. అప్పటి తన గర్భంలోని పిండం.. ఆడబిడ్డది.. అని తెలియగా.. ఆ ఆడబిడ్డ.. నిర్దయగా అబార్షన్ కి బలి కావడం..
మరలా తలుచుకొని.. మరోసారి కుమిలిపోతుంది. తను.. తన లాంటి వారి మూలంగా..
ఇప్పటి అబ్బాయిల పెళ్ళిళ్ళు జటిలం కావడం.. తమదే పెద్ద తప్పిదమని తలుస్తూ..
మరింతగా కుమిలిపోతుంది.
***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
Comments