top of page

దత్తత

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

'Datthatha' New Telugu Story Written By BVD Prasada Rao


రచన : బివిడి ప్రసాదరావు


"రేపు సండేగా.. నాకు బయట పని ఉంది. నీ బైక్ కావాలి" అన్నాను.

"సరే.. పెట్రోల్ మాత్రం కొట్టించుకో." చెప్పాడు కిరణ్.

తర్వాత.. ఇద్దరం.. నేల మీద పక్కలు వేసుకున్నాం. పడుకున్నాం.

కిరణ్.. నా ఆఫీస్మేట్.. రూమ్మేట్.

***

ఇద్దరం కేంటిన్ నుండి బయటకి వచ్చాం.

రూం వద్దకి చేరాం.

నేను బైక్ దిగేక.. "నువ్వు రూంలోకి వెళ్లు.. నీ బైక్ తీసుకు వెళ్తా.. రాత్రి చెప్పాగా" చెప్పాను.

"లంచ్ టైంకి వచ్చేస్తావా." అడిగాడు కిరణ్.

"సాధ్యపడితే వచ్చేస్తా. లేటైతే ఫోన్ చేస్తా." చెప్పాను.

"సరే. నువ్వు నా బైక్ తీసుకెళ్లు." కిరణ్ చెప్పాడు.

నేను బైకు పుచ్చుకున్నాను.. స్టార్ట్ చేశాను.

కిరణ్ రూం వైపు కదిలిపోయాడు.

నేను.. నా పనికై కదిలాను.

దార్లో.. బైక్ లో పెట్రోల్ పోయించాను.

నేను ఆఫీస్ లో చేరిన రోజునే.. కిరణ్ నన్ను కోరి కలిశాడు. అతడి రూంలో..

షేరింగ్ పేమెంట్ తో.. నాకు వసతి చూపించాడు.

కిరణ్ చాలా చొరవైన వాడు. చురుకైన వాడు. నాకు ఇట్టే నచ్చేశాడు.

నేను.. కిరణ్ తో కలిసి.. అతడి బైక్ మీదే.. ఆఫీస్ కి వెళ్లడం.. తిళ్లకి వెళ్లడం..

రూంకి రావడం.. సదా సవ్యంగా సాగిపోతున్నాయి.

నేను ఉద్యోగ రీత్యా ఈ ఊరు రాగానే.. కొత్త ప్లేస్.. అనే భావం రాకుండా పోయింది

కిరణ్ మూలంగా.

కిరణ్ ది రాజమండ్రి. తండ్రి, తల్లి, చెల్లి ఉన్నారట. తండ్రి క్లాత్ షాప్ రన్ చేస్తున్నాడట.

కిరణ్ తొలుతగా కాకినాడలో జాబ్ చేసేవాడట. ట్రాన్స్ఫర్ మీద ఈ గుంటూరుకి వచ్చి ఏడాదవుతుందట. ఒక కొలీగ్ పరిచయంతో.. ఇప్పుడు మేము ఉంటున్న రూంలోకి షేరింగ్ చెల్లించి చేరాడట. ఆ కొలీగ్ ట్రాన్స్ఫర్ కావడం.. ఆ ప్లేస్ లోకి నేను రావడంతో.. అతడి ప్లేస్ లోకి.. కిరణ్.. నన్ను ఆహ్వానించుకున్నాడట.

నేను విజయవాడ నుండి ఇక్కడకి వచ్చాను.

నాకు తల్లిదండ్రులు.. తోబుట్టువులు లేరు.

మాది కొత్తపేటట. నా చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు ఒక బస్సు ప్రమాదంలో చనిపోయారట. నన్ను అమ్మమ్మ చేరతీసి.. తను ఉంటున్న బుర్లంకకి నన్ను తీసుకు వచ్చేసిందట.


అమ్మమ్మ మూడిళ్లల్లో ఉదయం పూట పని మనిషిగా తిరుగుతూ.. మిగతా సమయంలో కూలి పనులు చేస్తూ.. నన్ను పెంచింది. చదివించింది.

నేను డిగ్రీ పట్టా పొందిన రోజునే.. అమ్మమ్మ గుండె పోటుతో.. సడన్ గా మరణించింది.

అమ్మమ్మ ఉన్నన్నాళ్లు నా కోసమే తపించింది.. శ్రమించింది. నన్ను చాలా ఇదిగా సాకింది.


నా చిన్నప్పుడు.. అమ్మమ్మ పని చేస్తున్న ఒక ఇంటి వారు.. నన్ను దత్తతకి అడిగారట. వాళ్లకి సంతాన యోగ్యత లేదని.. అమ్మమ్మ నా పట్ల పడుతూన్న అవస్థలని గమనించి.. నన్ను తమకి ఇచ్చేస్తే.. పెంచుకుంటామని ప్రాధేయపడ్డారట.

అమ్మమ్మ ససేమిరా అనేసిందట. తను పస్తులు ఉండైనా.. నన్ను పెంచి పెద్ద చేసుకుంటానని.. నా కాళ్ల మీద నేను నిలబడిన రోజున.. నా నీడన చక్కగా తను బతుకుతానని.. అమ్మమ్మ గట్టిగా చెప్పేసిందట.


పాపం అమ్మమ్మ.. నన్ను నిలబెట్టేసి.. తను పోయింది.

నేనే ఆమె తపనని తీర్చలేకపోయాను. అందుకు నేను చాలా చింతిస్తున్నాను.

అమ్మమ్మ పేరున ఏమైనా చేయాలి. ఆమె నా చెంత పొందాలనుకున్న స్వేద..

ఆమె లాంటి వారికి చవి చూపాలి. తద్వారా.. ఆమె పట్ల నా కర్తవ్యం సక్రమంగా నిర్వహించి పెట్టాలి.


అందుకై.. నేను ఆలోచన చేశాను. ఒక నిర్ణయానికి వచ్చేశాను. ఆ పని మీదే వెళ్తున్నాను.

ఎడతెరిపి లేని హారన్ ధ్వనితో తేరుకున్నాను.

వెనక్కి చూశాను. లారీ..

బైక్ ని.. రోడ్డు అంచుకి చేర్చాను.

నన్ను దాటుకొని.. ఆ లారీ వెళ్లి పోయింది.

నేను స్తిమితమై.. నేను వెళ్ల తలచిన చోటు వైపుకి.. స్థిరంగా బైక్ ని నడిపాను.

కొంత సేపటికి ఆ చోటుని చేరుకున్నాను.


బైక్ ని బయట.. ఒక పక్కన నిలిపి.. అక్కడ ఆఫీస్ రూం లోకి నడిచాను.

అక్కడ నన్ను నేను పరిచయం చేసుకున్నాను.

అక్కడ అతను.. గుమస్తాట. నన్ను కూర్చోమన్నాడు.

నేను గుమస్తా ఎదుట.. కుర్చీలో కూర్చున్నాను.


"ఏం కావాలి" గుమస్తా మెల్లిగా అడిగాడు.

"మీ ఆశ్రమము నుండి.. ఒక పెద్దావిడ పోషణ బాధ్యతని.. నేను తీసుకో తలిచాను." నికరంగా చెప్పాను.

"అంటే.. సరిగ్గా చెప్పండి" గుమస్తా అడిగాడు.

వెంటనే ఏమి చెప్పాలో.. ఎలా చెప్పాలో.. నాకు అర్ధం కాలేదు.

"అదే.. ధన సహాయం చేస్తారా.. ఎంత.. ఎలా చేయాలనుకుంటున్నారు."

గుమస్తా అప్పుడే అడిగాడు.

"అదేమీ.. అలానేమీ కాదు. నాతో పాటు ఉంచుకుంటూ.. ఆవిడని నా అమ్మమ్మ మాదిరిగా పోషించుకుంటా." చెప్పాను.


గుమస్తా ఏమీ అనడం లేదు. నన్నే చూస్తున్నాడు.

"పద్ధతి చెప్పితే.. ఒక పెద్దావిడని చేర తీస్తాను." చెప్పాను.

కొంత సంభాషణ తర్వాత.. గుమస్తా నన్ను ఒక హాలు లోకి తీసుకు వెళ్లాడు.

అక్కడ.. పది.. పదిహేను మంది.. పెద్దవారు ఉన్నారు.

అక్కడ.. ఒక పక్కన.. వంట పనులు జరుగుతున్నాయి.

"ఆడవాళ్లు నలుగురే ఉన్నారు. వాళ్లలో ఒక్కరే ఒంటరి వారు. మిగతా ముగ్గురుకి భర్తలు ఉన్నారు." చెప్పాడు గుమస్తా.


నేను అటే చూస్తున్నాను.

"ఆ పసుపు రంగు చీరలో ఉన్న ఆవిడే.. ఒంటరిది." గుమస్తా చెప్పాడు.

ఆవిడని చూశాను.

ఆవిడని గుమస్తా పిలిచాడు.

ఆవిడ మా వద్దకి వచ్చింది.

"నీకు వసతి.. వేరే చోటున కల్పిస్తే.. వెళ్లగలవా" ఆవిడని అడిగాడు గుమస్తా.

ఆవిడ ఆయోమయమవుతుంది.


"అంటే.. నన్ను మరో చోటుకి పంపించేస్తారా. వద్దు వద్దు. నేను ఇక్కడే ఉండి పోతాను. ఇక్కడ వాళ్లతో నాకు బాగుంది." చెప్పింది ఆవిడ.

గుమస్తా నన్ను చూశాడు.

నేను ఆయన్నే చూస్తున్నాను.

"ఇక్కడ వారిపై.. ఎట్టి ఒత్తిడి తేకూడదు. ఈ ఆశ్రమము యజమాని.. చాలా పకడ్బందీగా ఉంటారు." గుమస్తా చెప్పాడు.

నేనేమీ అడగలేకపోతున్నాను.


ఆవిడ గందికగా తన వారిని పిలవగా.. వాళ్లు మా వద్దకి వచ్చారు.

వాళ్లతో.. "నన్ను ఇక్కడ నుండి పంపేస్తారట" ఆవిడ చెప్పుతుంది.

"అబ్బే.. అదేమీ లేదు." గుమస్తా తంటాలు పడుతున్నాడు.

నేనేమీ అనలేకపోతున్నాను.

"ఈయన.. ఒక ఆవిడని చేరతీసి.. తన అమ్మమ్మలా పోషిస్తానని వచ్చాడు. అందుకే.." గుమస్తా చెప్పుతున్నాడు.


"అయ్యో.. వద్దొద్దు.. పెనమ్మీద నుండి పొయ్యిలోకి తిరిగి పడడం మాకు వద్దు.

ఏదో మీ చలువతో.. ఈ పంచన బతుకు ఈడుస్తున్నాం. మా వాళ్ల దాష్టికం నుండి విముక్తి అయ్యామనుకుంటున్నాం. దయచేసి తిరిగి రొచ్చులోకి మాలో ఏ ఒక్కరినీ తోసేయకండి. మమ్మల్ని ఇక్కడ.. ఇలా బతకనీయండి." ఎవరో.. ఒక పెద్దాయన గడగడా అన్నాడు.

నేను అవస్థ అవుతున్నాను.. అయోమయమవుతున్నాను.

అది గమనించినట్టు.. గుమస్తా.. నన్ను అక్కడ నుండి తిరిగి ఆఫీస్ రూంలోకి తీసుకు వచ్చేశాడు.


ఇద్దరం ఎదురెదురుగా కుర్చీల్లో కూర్చున్నాం.

"మీ పని కాదు" చెప్పాడు గుమస్తా.

"అయ్యో.. అలా అనేస్తారేమిటి. ఎంతో ఆలోచించి వచ్చాను. నేను అనుకున్నట్టు కుదిరితే.. రెండు గదుల ఇల్లు ఒకటి అద్దెకి తీసుకోవాలని.. కావలసిన సామాగ్రిని కొనుగోలు చేసుకోవాలని.. నాతో వచ్చిన ఆవిడని చక్కగా చూసుకోవాలని.. అబ్బో.. ఎన్నెన్నో అనుకొని.. వచ్చాను" చెప్పాను.

గుమస్తా నన్నే చూస్తున్నాడు.


అంతలోనే ఒక ఆయన మా వద్దకి వచ్చాడు.

గుమస్తా లేచి నిల్చున్నాడు.

ఆ వచ్చిన ఆయన.. గుమస్తా ఖాళీ చేసిన కుర్చీలో కూర్చున్నాడు.

గుమస్తా కదిలి.. నా పక్క కుర్చీలో కూర్చున్నాడు.

నాతో.. "ఆయన ఈ ఆశ్రమము యజమాని" చెప్పాడు గుమస్తా.

అలాగే.. నా రాక గురించి.. గుమస్తా ఆయనకి వివరించాడు. మరియు హాలులో జరిగింది కూడా చెప్పాడు.


యజమాని నన్నే చూస్తూ.. "ఇక్కడ వారికి నచ్చని పని ఏమీ నేను చేపట్టను.. చేపట్టలేను." చెప్పాడు. ఆయన గొంతు గంభీరంగా ఉంది.

"సార్" అన్నాను.

"అవును. నేను మక్కువగా.. బాధ్యతగా.. ఈ ఆశ్రమము నిర్వహిస్తున్నాను.

ఇక్కడ చేరిన వారు.. నన్ను ఎంతగానో నమ్మి ఉన్నారు. వారిని నిరాశ పర్చను."

చెప్పాడు యజమాని.


ఆయన నాతో మాట్లాడుతున్నా.. ఆయన నన్ను ఎగాదిగా చూస్తున్నాడు. నేను గుర్తించాను.

"ఏమిటి సార్.. అలా చూస్తున్నారు.. నన్ను అనుమానిస్తున్నారా. మీకు హామీ ఇస్తాను.. కావాలంటే బాండ్ రాయమన్నా రాస్తాను.. నాకు మాత్రం.."


యజమాని నాకు అడ్డు పడి.. "అబ్బెబ్బే.. నిన్ను.. నేను.. ఏమీ అనుమానించడం లేదు. కానీ.. నీ ముఖం మీది ఆ మచ్చతో.. కాస్తా తికమక అవుతున్నాను" చెప్పాడు.

నిజమే.. నా ముఖం మీది మచ్చ.. కొట్టొచ్చినట్టు ఉంటుంది. అర చేయి అంత బూడిద రంగు మచ్చ.. నా కుడి బుగ్గ మీద ఉంది.


"పుట్టుకతో వచ్చిన మచ్చ సార్.. పుట్టు మచ్చ పెద్దది.. అంటుంటారు" చెప్పాను.

"నీది బుర్లంకా.. నీ అమ్మమ్మ కాసులమ్మా.." అడిగాడు యజమాని.

"అవును సార్" అన్నాను.


"నువ్వు నన్ను పోల్చుకోలేకపోయావు.. ఉద్యోగ రీత్యా బుర్లంకలో ఉండేవాడిని.

అప్పుడు నీ అమ్మమ్మ మా ఇంటి పని మనిషి. నాకు ట్రాన్స్ఫర్ కావడంతో.. ఆ ఊరు

నుండి వెళ్ల వలసి వచ్చింది. తర్వాత మీ కబుర్లు మాకు తెలియవు.. నిజానికి.. నిన్ను దత్తత ఇమ్మని.. నేను.. నా ఆవిడ.. నీ అమ్మమ్మని ఎంతగానో కోరాం. కానీ నీ అమ్మమ్మ కాదనేసింది. సర్లే. ఇంతకీ నీ అమ్మమ్మ ఎలా ఉంది" అడిగాడు యజమాని.

"అమ్మమ్మ చనిపోయింది సార్" చెప్పాను. పిమ్మట తర్వాతి కబుర్లు చెప్పాను.


"అవునా.. నీ అమ్మమ్మ ప్రేరణతో ఈ ఆలోచనకి వచ్చావా. గుడ్. నిజానికి మాకు పిల్లలు లేక.. ఆ లేమితో కృంగినా.. నా భార్య చొరవతో.. మాటతో.. నేను ఈ ఆశ్రమంని స్థాపించాను. ఇక్కడ వారిని.. పిల్లలు మాదిరిగా చూసుకుంటూ.. వాళ్లతో ఆత్మీయతని.. ఆనందాన్ని చవి చూడగలుగుతున్నాం" చెప్పాడు యజమాని చాలా నిశ్చలంగా.

నేను మరో సారి ప్రయత్నించాను.


"నీ ఆలోచన అభినందనీయమే. కానీ.. నేను ఇక్కడ వాళ్లని ఇబ్బంది పర్చలేను" చెప్పేశాడు యజమాని.

నేను తటపటాయిస్తున్నాను.

"మీరు మరో చోట లేదా మరోలా ప్రయత్నించండి. మీ తలంపు మంచిది." చెప్పాడు గుమస్తా.


"అవునవును" అన్నాడు యజమాని.

అప్పుడే.."సార్.. నాదో విన్నపం" అన్నాను.

నేను యజమానినే చూస్తున్నాను.

"చెప్పు" ఆయన అన్నాడు.


"అదే.. మరి.. గతంలో నన్ను.. మీరు దత్తత తీసుకోవాలనుకున్నారు. అప్పుడు మీకు కుదర లేదు. అప్పుడు మీరు నొచ్చుకొనుంటారు. ఇప్పుడు నేను.. మిమ్మల్ని దత్తత కోరుకుంటున్నాను. అప్పటి వ్యధ ఎరిగిన మీరు.. ఇప్పుడు నాకు కాదనకండి

సార్.. నా అమ్మమ్మ మీది అనురాగంని ఆవిడకి పంచుతాను సార్. పెళ్లి కూడా మానుకొని.. నా పూర్తి ఖాళీ సమయాల్ని నాతో ఉండే ఆవిడకి కేటాయించాలని.. ఆవిడని సాకాలని తలుస్తున్నాను సార్" చెప్పాను.


"ఇక్కడ వారు.. నన్ను నమ్మి ఉన్నారు. వీళ్లల్లో ఏ ఒక్కరినీ నేను నిరాశ పర్చలేను" చెప్పాడు యజమాని.

నేను మాట్లాడలేకపోయాను.

నిముషాలు గడిచి పోతున్నాయి.

నేను తంటాలు పడుతున్నాను.


"నాది ఒక మాట.. కాదు.. ఒక సలహా.. నీ ఆలోచన దొడ్డది.. కనుక.. నువ్వు అర్ధం చేసుకోగలవు అనుకుంటూ చెప్పుతున్నాను.. పైగా నువ్వు ఒంటరివి కనుక..

నువ్వే.. మా చెంతకి వచ్చేయ్.. అప్పుడు.. ఒక అమ్మమ్మే కాదు.. ఎందరో అమ్మల.. ఎందరో నాన్నల.. సేవకి కూడా నువ్వు పాత్రుడువి అవుతావు" చెప్పాడు యజమాని.

నేను గమ్మున ఉండిపోయాను కొద్దిసేపు.

పిమ్మట తేరుకున్నాను.

లేచి.. నిల్చున్నాను.


యజమాని ప్రతిపాదనకి ప్రతీకగా.. ఆయనకి నమస్కరించాను.

"మహా భాగ్యం.. అవసరమైతే.. ఉద్యోగం వదిలేసి.. పూర్తి సమయం.. ఇక్కడే ఉండి పోయి.. మీతో కలిసి పని చేస్తూ.. మా అమ్మమ్మ బుుణము తగ్గించుకుంటాను" చెప్పేశాను ఏక బిగిన.

***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.

రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.366 views3 comments

댓글 3개


Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
2022년 5월 18일

Surya Rao • 1 hour ago

Very heart touching story....

좋아요

Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
2022년 5월 16일

kranthikumar tentu • 5 hours ago

Katha bagundandi

좋아요
BVD Prasadarao
BVD Prasadarao
2022년 5월 16일
답글 상대:

ధన్యవాదాలండీ..

좋아요
bottom of page