సు..ధీర ఎపిసోడ్ 3
- BVD Prasada Rao
- Jul 8, 2022
- 6 min read
Updated: Jul 16, 2022
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Su.. Dheera Episode 3' New Telugu Web Series Written By BVD Prasada Rao
రచన : బివిడి ప్రసాదరావు
గత ఎపిసోడ్ లో…
షూటింగ్ ముగిసి బయటకు వస్తున్న సు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ధీర. అతనితో మాట్లాడుతున్న సమయంలో అనుదీప్ అక్కడకు వచ్చి, 'ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా' అని అడుగుతాడు. ఏమీ లేదని చెప్పి, అతన్ని వెళ్ళమంటుంది సు.
తరువాత ధీరతో తనే కాల్ చేస్తానని చెప్పి పంపించేస్తుంది.
ఇక చదవండి...
పేచ్ షూట్స్ కై బయలు దేరిన సు.. దార్లో.. బ్యాంక్ కి వెళ్లింది.
నిన్నటి చెక్ ని.. నింపిన కొన్ని ఫార్మ్స్ తో పాటు కౌంటర్ లో ఇచ్చేసి.. బ్యాంక్ మేనేజర్ ని కలిసింది.
"గుడ్ మోర్నింగ్ మేడమ్" పలకరించాడు మేనేజర్.
"నమస్కారమండీ." మేనేజర్ చూపించగా.. ఆయన ఎదురు కుర్చీలో కూర్చుంది సు.
"మళ్లీ మిమ్మల్ని చూడడం ఆనందంగా ఉంది. మీకు ఏ విధంగా సాయ పడాలి" అడిగాడు మేనేజర్ నవ్వుతూ.
"చెక్ ఇచ్చాను. ఈ 'ఇయంఐ' తో నా కారు లోన్ క్లియర్ ఐపోతుంది" చెప్పింది సు.
"గుడ్. కంగ్రాట్స్.. మీది మాకు ఘనమైన ఖాతా." చెప్పాడు మేనేజర్ గొప్పగా.
"హౌస్ లోన్ కూడా త్వరలోనే ముగించేయబోతున్నాను" చెప్పింది సు.
"వెల్ కం.. బట్.. మేడమ్.. టేక్ యువర్ ఓన్ టైం.. మా నుండి మీకు ఎట్టి ఒత్తిడి ఉండదు" చెప్పాడు మేనేజర్ కాస్తా కుర్చీలో కదులుతూ.
నవ్వింది సు.
"మేడమ్.. మళ్లీ ఆఫర్ చేస్తున్నాను. మీకు క్రెడిట్ కార్డ్ చకచకా అందేలా చేస్తాను. తీసుకోండి." చెప్పాడు మేనేజర్.
"నో. థాంక్యూ వెరీ మచ్" అనేసింది సున్నితంగా సు.
"నా పని ఫలితాన్ని తప్పా.. మరో మార్గాన్న నేను నడవను.. సో.. మీ ఆఫర్ ని అందుకోలేను సార్." చెప్పింది సు.
"య. య. యాజ్ యు లైక్.. మేడమ్." తడబడ్డాడు మేనేజర్.
నవ్వింది సు.
"ఎనీ వే. ఒన్స్ ఎగేన్ ఐ టెల్ యూ.. మీరు.. మీ పర్ఫార్మెన్స్ సింప్లీ సూపర్బ్.. నేనూ మీ బడా ఫేన్ ని." చెప్పాడు మేనేజర్ షేక్హేండ్ కై తన కుడి చేతిని చాపి.
"థాంక్యూ సర్.. మీ అభిమానమే నాకు ఊతం.. దానిని నిలుపుకోవడానికి నేను శ్రమిస్తాను. వస్తా సార్." అంది సు.. రెండు చేతులు జోడించి.
మేనేజర్ కూడా తన రెండు చేతులు జోడించి.. సుకి నమస్కరించాడు.
సు అక్కడ నుండి కదిలింది చక్కని నవ్వుతో.
బ్యాంక్ లో వాళ్లు తనని గమనిస్తూ.. గుసగుసలాడుకోవడం సు పసి కట్టింది.. తను బ్యాంక్ నుండి బయటికి వెళ్తూ.
షూటింగ్ బ్రేక్ లో.. తన కారులోకి వచ్చిన సు.. కాల్స్ ఏమైనా ఉన్నాయేమోనని.. తన ఫోన్ చూసుకుంది. రజని నుండి కాల్ వచ్చి ఉంది.
రజనికి ఫోన్ చేసింది సు.
"షూట్స్ లో ఉన్నా.. నీ నుండి కాల్ వచ్చింది." చెప్పింది సు.
"అనుకున్నాలే. గుడిలో.. క్యూలో ఉన్న. అదే.. ఉదయమే పార్శల్ అందింది. ఐటమ్స్ బాగున్నాయి." చెప్పింది రజని.
"గుడ్.. గో హెడ్." నవ్వింది సు.
"నీలాంటిది నాకు ఫ్రెండ్ కావడం.. సో లక్కీయే." అంది రజని.
"బిస్కెట్.." అంది సు.
"కాదే తల్లీ.. నిజమే." అంది రజని.
"ఆపవే తల్లీ" నవ్వింది సు.
అప్పుడే తనకి కాల్ వస్తున్నట్టు గుర్తించిన సు..
"సరేనే.. కాల్ కట్ చేస్తానే. షూటింగ్ కి రమ్మని కాల్ వస్తుంది" చెప్పింది.
రజని.. తన కాల్ కట్ చేసేసింది సున్నితంగా.
పేచ్ వర్క్స్ కానిచ్చేసి.. సు ఇంటికి వచ్చే సరికి నాలుగున్నర దాటింది.
అర గంట సేపు పైగానే మంచం మీద ఎంచక్కా దొర్లి.. పిమ్మట లేచి.. రిప్రెష్ ఐన సు.. మెల్లిగా ప్రశాంతం ఐంది.
అప్పుడే ధీర సంగతి గుర్తుకు తెచ్చుకుంది.
అతడికి ఫోన్ చేద్దామని.. ఫోన్ అందుకోబోయింది.
అంతలోనే అది మోగింది.
చూస్తే.. హారిక కాల్ చేస్తుంది.
హారిక.. జూనియర్ యాంకర్.
కాల్ కలిపి.. "చెప్పు హారిక" అంది సు.
"సు.. షూటింగ్ స్పాట్ లో ఉన్నావా" అడిగింది హారిక.
"లేదు. చెప్పు" చెప్పింది సు.
మొదటి పరిచయంలోనే సరళంగా చెప్పేస్తుంది సు.. తన తోటి వారు కానీ.. సుమారు తన యేజ్ వారు కానీ.. ఎవరైనా.. తనని గౌరవ మాటతో కానీ.. వరస పెట్టి కానీ.. పలకరిస్తే.. అలా వద్దని.. తనని తన పేరుతోనే పిలవ మని.
"నాదో సమస్య.. ట్వంటీ థౌజండ్ అని చెప్పి.. ఫిప్టీన్ ఇచ్చాడు మా ప్రొడ్యూసర్. అడిగితే.. చూద్దాం లే. సరిపెట్టుకో అంటున్నాడు" చెప్పింది హారిక.
"అగ్రిమెంట్ ఉందా" అడిగింది సు.
"అగ్రిమెంట్ లో ఫిప్టీన్ అనే ఉంది. నోటి మాటగా ఫైవ్ అన్నాడు. లెక్కల్లో అది వద్దన్నాడు" చెప్పింది హారిక.
"ఛ. తప్పు నీదే. అనుభవించు." అనేసింది సు.
"సు.." వేడుకుంటుంది హారిక.
"అవును. మన ప్రతి 'గెట్ టుగెదర్' లో చెప్పుతున్నా.. నికరంగా.. నిబ్బరంగా ఉండాలి అని.. పేమెంట్స్ విషయాల్లో సూటిగా ఉండాలి అని.. నువ్వు అది వినిపించుకోలేదు" అంది సు.
"ఏమీ చెయ్యలేమా" అడిగింది హారిక.
"నిలతీతకి ఆధారాలు లేవు. అడిగితే ఇవ్వడు. ఇచ్చే వాడే ఐతే.. సవ్యంగానే ముట్ట చెప్పేవాడు. ఏదో దురాలోచనలో ఉన్నట్టు ఉన్నాడు. బతిమలాడితే బయలు పడతాడు. బెదిరిస్తే రచ్చ చేస్తాడు. అంతే. వదిలేసి.. ఇలాంటివి ఇకపై రిపీట్ కాకుండా మెసులుకో." చెప్పింది సు.
"అలా అనేస్తే ఎలా సు.. ప్లీజ్.. నువ్వు ఐతే హేండిల్ చేసి పెడతావని కొందరు చెప్పారు. అందుకే కాల్ చేశాను." చెప్పింది హారిక.
"చూడు హారికా.. నువ్వే ఆలోచించు.. ఇది సాల్వ్ చేయ తగ్గదా." అడిగింది సు.
హారిక మాట్లాడలేదు.
"హారిక.. జరిగింది వదిలేసి.. ఇదొక లెసన్ అనుకో. అంతే. ఇకపై ఇట్టి వాటిలో చక్కగా మెసులుకో." చెప్పింది సు.
"అంతేనా. సరే. థాంక్స్ సు." అనేసింది హారిక.
ఆ కాల్ ని కట్ చేసేసింది సు.
లేచి.. వాటర్ తాగి.. అటు ఇటు తచ్చాడింది సు.
ఆ తర్వాత.. మళ్లీ ధీర కోసం యోచించింది.
'ఎవడు ఇతడు.. ఇతడ్ని మార్చకపోతే.. ఏమైపోతాడో..' అనుకుంది.
'ఎంత మందో ఫేన్స్ ని చూశాను. నాతో సెల్ఫీస్ కై ఎగబ్రాకే వారు.. నా ఆటోగ్రాఫ్స్ కై తపించే వారు.. నన్ను తాకుటకై ప్రాకులాడే వారు.. తగుల్తున్నారు.. కానీ.. ఇలా బరితెగించే వారు.. నేరుగా ఎఱికవ్వలేదు. ఏమిటి ఇతడు.' అనుకుంది సు.. ధీర ను ఉద్దేశించి.
ఆ వెంటనే.. 'ఇతడిని మెల్లిగా దారి మల్లించక పోతే.. తనకి తల భారం తప్పదు' అని కూడా అనుకుంది సు.
'ఎలా చేయాలి.. ఏం చేయాలి..' ప్రశ్నించుకుంది సు.
వెంటనే.. 'నన్ను సాఫీగా ఫాలో అయ్యే వాడు.. నార్మల్ గా వ్యవహరించే వాడు.. చేతులు ఊపి తప్పుకునే వాడు.. ఏమిటి.. ఇప్పుడు మరీ భరి తెగించేసి.. రోడ్డు మధ్యన నన్ను నిలబెట్టేసి.. అలా నిలతీసేశాడు.. అలా బరస్ట్ ఐపోయాడు.' ధీర రీతి గురించి అనుకుంటుంది సు.
అప్పుడే తన ఫోన్ మోగింది.
చూస్తే.. సుదర్శనం నుండి కాల్..
సుదర్శనం.. మీడియేటర్. కమిషన్ ఏజెంట్. ప్రొడ్యూసర్స్ మరియు డైరక్టర్స్ దూత.
"హలో సుదర్శనం.. చాన్నాళ్లకి.. చెప్పండి." అంది సు.
"సు.. కొత్త సీరియల్ ఒకటి మొదలు కాబోతుంది. మంచి ప్రొడక్షన్. హీరోయిన్ కావాలంట. నిన్ను అడగమన్నారు." చెప్పాడు సుదర్శనం.
"సీరియల్ లా.. కుదరదేమో.. ఐనా ఎప్పటి నుండి మొదలెడతారు.. ఎన్ని ఎపిసోడ్స్ అనుకుంటున్నారు" అడిగింది సు.
"వచ్చే నెల మొదటి వారం నుండే.. నూరు ఎపిసోడ్స్. పైకం బాగానే ఉంటుంది." చెప్పాడు సుదర్శనం.
"ఎంతేమిటి" అడిగేసింది సు.
చెప్పాడు సుదర్శనం.
"అవునా" కాస్తా ఆశ్యర్యపోయింది సు.
"అవును. నేనే నీ డిమాండ్ బట్టి.. ఫేమ్ బట్టి.. అంతకు తక్కువైతే నువ్వు ఒప్పుకోవని గట్టిగా చెప్పాను. ఒప్పుకో. అలాగే ఈ ఆఫర్ కి తగ్గట్టు నాకూ రాల్చాలి మరి." చెప్పాడు సుదర్శనం.
"నీకు ఎంత అనుకుంటున్నావు." అడిగింది సు.
"ఆఫర్ బాగుందిగా. దానికి తగ్గట్టే చూడు." నసిగాడు సుదర్శనం.
"అలా కాదు. నువ్వే అడిగేసి" అంది సు.
"టు పెర్శెంట్." అన్నాడు సుదర్శనం.
"ప్రొడ్యూసర్ నుండి ఎంతేమిటి" సు నవ్వింది.
"అతడి దగ్గర.. నీకు బాగా హైప్ ఇచ్చాను. నీ ఫేమ్ ని వాడుకున్నాను. గురుడు త్రీ పెర్సంట్ కి కుదిరాడు. అందుకే నిన్ను నేను డిమాండ్ చేయడం లేదు." చెప్పాడు సుదర్శనం.
ఆ వెంటనే.. "ఒప్పుకో.. యాంకరింగ్ లు ముక్క ముక్కల వ్యవహారం. సీరియల్ చాలా రోజుల పని. కుదిరినప్పుడు సీరియల్స్ వైపు పోవడమే మంచిది." చెప్పాడు సుదర్శనం.
"రేపు చెప్పనా." అడిగింది సు.
"అలానే. కానీ ఒప్పేసుకోవాలి. ప్రొడక్షన్ వారు.. నీ వైపు మొగ్గేసి ఉన్నారు." చెప్పాడు సుదర్శనం.
"అలానా. ఐతే రేపు యక్స్ స్టూడియోలో ఉంటాను. నువ్వు వస్తే.. వీలు కల్పించు కొని.. వెళ్లి వాళ్లని కలుద్దాం." చెప్పింది సు.
"తప్పక" అనేశాడు సుదర్శనం.
కాల్ కట్ చేసేసింది సు.
'మంచి ఆఫర్.. కుదిరితే బాగుంటుంది' అనుకుంది సు.. సుదర్శనం చూసి పెట్టిన పనికై.
మంచం మీదికి ఒళ్లును చేర్చింది సు.
కళ్లు మూసుకుంది.
ప్రశాంతత కై ప్రాకులాడుతుంది.
దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది. నెమ్మదిగా విడిచి పెట్టింది.
ఆలోచనలు రాకుండా ప్రయత్నిస్తుంది.
అప్పుడే వేడిది ఏమైనా తాగాలనుకుంది.
లేచి.. గ్లాసు నీళ్లని వేడి చేసింది. అందులో నిమ్మ చెక్కని పిండింది. కొద్దిగా షుగర్ కలుపుకుంది.
ఆ నీటిని నెమ్మది నెమ్మదిగా తాగుతుంది.
ఆ నీరు గుటక పడుతూన్న ప్రతి మారు.. సు కొద్ది కొద్దిగా కుదుట పడగలుగుతుంది.
పది నిముషాల తర్వాత.. గ్లాసులో నీళ్లు చల్లగా అనిపించడంతో.. ఆ మిగిలిన నీటితో ఆ గ్లాస్ ని షింక్ లో పెట్టేసింది.
తర్వాత.. తిరిగి.. తన చిన్న పుస్తకాన్ని తీసి.. చూసుకుంటుంది.
డేస్ కే అంచనాలు వేసుకుంటుంది.
కొద్దిసేపటికి ఒక సంయమనంకి వస్తూ.. సర్దుకుంది.
సు ప్రతీది పద్ధతి ప్రకారం పోతుండాలని.. అందుకు తగ్గట్టు వ్యవహరిస్తుంటుంది. ఆ తీరే ఆమెని కుదుట పరుస్తుంటుంది అంటే అతిశయోక్తి కానే కాదు.
తను చేపట్టబోయే పనికి ఒక రీతి దొరకడంతో సు కాస్తా హుషారయ్యింది.
ఆ తోవలోనే తిరిగి ధీర కోసం యోచన చేసింది.
'తను డిస్టర్బ్ కాకుండా.. అతను వర్రీ పడకుండా.. అతని వ్యవహారం చక్కదిద్దాలి' అని గట్టిగా తలుస్తుంది సు.. ధీర గురించి.
ఆ స్థితి లోనే.. ఫోన్ తీసుకొని.. ధీరకి కాల్ చేసింది.
చాలా రింగ్ ల తర్వాత.. ధీర ఆ కాల్ కి కనెక్టు అయ్యాడు.
"హలో" అన్నాడు.
"నేను.. సు ని" చెప్పింది సు.
"ఈజ్ ఇట్.. వరేవా.. ఏమిటి నా ఈ అదృష్టం." అరిచినట్టు అన్నాడు ధీర.
"కూల్.. కూల్.. ఖాళీయేనా" అడిగింది సు.
"నీకై ఐతే ప్రతి క్షణం నేను ఖాళీయే" చెప్పాడు ధీర.
"తగ్గు. ఆ పిచ్చే వద్దు" అంది సు.
"పిచ్చి కాదు.. అభిమానం" చెప్పాడు ధీర.
"సర్లే కానీ.. విషయంకి వద్దామా" అడిగింది సు.
"తమరి దయ.. నా భాగ్యం" అన్నాడు ధీర గమ్మత్తుగా.
"సర్లే కానీ.. ఇప్పటి వరకు సామాన్యంగా సాగే వాడివి.. ఒక్క మారుగా.. కొద్ది రోజులుగా.. ఎందుకు మొండిగా బిహేవ్ చేస్తున్నావు" అడిగేసింది సు.
ధీర వెంటనే ఏమీ చెప్పలేదు.
"హలో" అంది సు.
"లైన్ లోనే ఉన్నాను." చెప్పాడు ధీర.
తర్వాత.. "చెప్పాగా.. నువ్వు రాను రాను నన్ను ఆకట్టేసుకుంటున్నావు. నీ చెంతనే పడి ఉండాలనిస్తుంది." చెప్పాడు ధీర.
"అదే.. మరదే.. ఈ మాటలే వద్దు. సరిగ్గా మాట్లాడు." గబుక్కున అంది సు.
"నిజం.. ఎందుకు అంటే చెప్పలేను.. ఏమిటంటే చెప్పలేను.. అంతే.. నువ్వు నాకు నచ్చేశావు.." చెప్పుతున్నాడు ధీర.
అప్పుడే.. "షటప్.. జస్ట్ షటప్." కసిరింది సు.
ధీర ఆగాడు.
"వద్దు.. ఆ పైత్యమే వద్దు. నీది అభిమానం కాదు.. వ్యామోహం.. ఛ" అంది సు.
"కాదు కాదు.. లేదు లేదు. నాది అభిమానమే. నువ్వంటే బోల్డు ఇష్టం.. నువ్వు కాదంటే.. నేను బ్రతక లేను అన్నంత అభిమానం నాది.. నీపై." గడగడా చెప్పాడు ధీర.
"అరె.. నీ సొదే నీదే కానీ.. నా మాట ఆలకించవేం.. నీ పై నా అభిప్రాయాన్ని పట్టించుకోవేం." చికాగ్గా అంది సు.
"మరి నేను ఎలా చెప్పేది. నువ్వు నమ్మకపోతే నేనేం చేసేది." గింజుకుంటున్నాడు ధీర.
"నిజంగా అభిమానించే వాడు.. చస్తాననడు. ఎక్స్ ప్రెషన్ చేయలేని వాడే గజిబిజి.. హడావిడి అవుతాడు." అంది సు సాధ్యమైనంత సామాన్యంగా.
"మరి ఎలా.. నా మాట నువ్వు వినవాయే.. మరెలా చెప్పేది." నిరుత్సామవుతున్నాడు ధీర.
"చాల్లే.. నేను అడిగే దానికే చెప్పు." చెప్పింది సు.
"సరే" అనేశాడు ధీర.
ధీరని తన వైపు నుండి.. తన రీతిన.. మార్చి.. తన దారి నుండి అతనంతట అతనే వైదొలిగేలా చేయాలని సు తలుస్తుంది.
అందుకే చాలా కూల్ గా వ్యవహరిస్తుంది.
"హలో" అన్నాడు ధీర.
అప్పుడే.. తనకి మరో కాల్ రావడం గమనించింది సు.
సుదర్శనం కాల్ చేస్తున్నాడు.
"హలో.. నాకు వేరే.. ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. లైన్ కట్ చేస్తాను. నీకు మీరో మారు కాల్ చేస్తాను. ఈ లోగా నువ్వు మాత్రం ఈ నెంబరుకు కాల్ చేయకు. సరేనా." చెప్పింది సు.
"అదేమిటి. కాల్ చేస్తే ఏం." నసిగాడు ధీర.
"నిజంగా నా మీద నీది అభిమానమే ఐతే.. నేను చెప్పేది చేయాలి." చెప్పింది సు.
"అవునా.. సరే." అనేశాడు ధీర.
ఆ కాల్ కట్ చేసి.. సుదర్శనంకి కాల్ చేసింది సు.
"సు.. సీరియల్ గురించి చెప్పానుగా. నీ కాల్ తర్వాత.. ప్రొడ్యూసర్ తో మాట్లాడేను. నువ్వు ఒప్పుకున్నట్టే అని చెప్పగా.. వాళ్లు ఎగిరి చిందులేశారు. మరి నీ వేల్యూ అలాంటిదిగా. వాళ్లే వచ్చి.. నిన్ను కలుస్తామన్నారు. రేపు యక్స్ స్టూడియోకి తీసుకు రానా" అడిగాడు సుదర్శనం.
"అవునా.. సరే.. ఉదయం ఎనిమిది లగాయితు.. రాత్రి ఎనిమిది వరకు అక్కడే ఉండాలి. ఈ మధ్య తీసుకు రా." చెప్పింది సు.
"అవునా.. రేపు నీకు ఫోన్ చేసే తీసుకు వస్తానులే." చెప్పాడు సుదర్శనం.
"సరే." అంది సు. కాల్ కట్ చేసేసింది.
(కొనసాగుతుంది..)
***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
Commentaires