top of page

సు...ధీర ఎపిసోడ్ 5

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link


'Su... Dheera Episode 5' New Telugu Web Series Written By BVD Prasada Rao


రచన: బివిడి ప్రసాదరావుగత ఎపిసోడ్ లో…


సుదర్శనం తీసుకొని వచ్చిన ప్రొడ్యూసర్ తో కథ విన్నాకే అడ్వాన్స్ తీసుకుంటానని చెబుతుంది సు.


ప్రొడ్యూసర్ పంపిన రైటర్ సు కి కథ వినిపిస్తాడు. సు కి ఆ కథ నచ్చి ఆ విషయం సుదర్శనానికి తెలియజేస్తుంది.


అనుదీప్ ఒక సింగిల్ ఎపిసోడ్ లో నటించడానికి సు ని ఒప్పిస్తాడు.

ధీర పెట్టిన మెసేజ్ కి రిప్లై ఇస్తుంది సు.


ఇక చదవండి...


"గత కొద్ది మాసాల నుండి గమనిస్తున్నా.. నువ్వు ఇది వరకటిలా ఉండడం లేదు" చెప్పింది సావిత్రి.


"నేను లెక్కిస్తూనే ఉన్నా.. గత ఆరు మాసాలు లగాయితు." చెప్పాడు వెంకటరావు.

"అబ్బే.. అలాంటిదేమీ లేదే" చెప్పాడు ధీర.


"లేదు లేదు. మాకు తెలుస్తుందిగా." అంది సావిత్రి.

"అయ్యో అమ్మా. మీకు ఎందుకు అలా అనిపిస్తుందో మరి." అంటున్నాడు ధీర.


"ఈ మధ్య నీ ప్రవర్తన అలా ఉందిరా మరి" కలగచేసుకున్నాడు వెంకటరావు.

"ఏమిటి నాన్నా.. నువ్వు కూడా." అనేశాడు ధీర.


ఆ ముగ్గురూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉన్నారు. బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారు.


ఇడ్లీని ముక్కలు చేస్తూ.. ఆ ముక్కల్ని సాంబార్ బౌల్ లో వేసు కుంటున్నాడు ధీర.


"నీ లేట్ నైట్ నిద్రలు తెలుస్తున్నాయి.. ఎక్కువ సేపు టివి చూస్తున్నావు." అంది సావిత్రి.


"ఆ టివిని వాడి గది లోంచి తీసేస్తే సరి" టక్కున అన్నాడు వెంకటరావు.

"అలానా.. స్మార్ట్ ఫోన్ లేదా.. లాప్టాప్ లేదా." ఈజీగా చెప్పాడు ధీర.


"అదేరా.. ఎప్పుడూ లేనిది.. ఈ మధ్య ఈ పెడసరం మాటలే నీలో ఎక్కువ అయ్యాయి." అంది గమ్మున సావిత్రి.


"ఏమిటమ్మా.. నాకు నిద్ర వస్తే.. పడుకోనా ఏం." చిరాకవుతున్నాడు ధీర.

"మా ఏకైక బిడ్డవురా నువ్వు. మక్కువతో నీ పై మాకు శ్రద్ధ జాస్తీరా." చెప్పాడు వెంకటరావు.


సాంబార్ తో ఇడ్లీ ముక్కలు తింటూ ఉన్నాడు ధీర.


"నువ్వు మా ప్రాణం రా. నీ ప్రతి కదలిక మాకు ఇట్టే తెలుస్తుందిరా. నిజంగా ఈ మధ్య నీ తీరు.. మాకు విడ్డూరంగా తోస్తుందిరా." చెప్పింది సావిత్రి.


"అమ్మ నేను.. బాగా అనుకొనే.. ఇక ఆగలేక.. ఇలా అడుగుతున్నాం" చెప్పాడు వెంకటరావు.


"చాల్లెండి. అలాంటిదేమీ లేదు.. టిఫిన్ చేయండి." అన్నాడు ధీర విసురుగా.


"మొదటిలో బాగానే తిరిగావు.. చదువు రోజుల్లో.. క్లాసులకి ఇంటికి తప్పా బయటికి పోయేవాడివి కాదు. నీకు స్నేహితులా తక్కువ.." చెప్పుతుంది సావిత్రి.


"స్నేహితులా.. తక్కువా.. అయ్యో.. మనం పోరినా వినేవాడా.. అస్సలు వీడికి ఫ్రెండ్స్ లేరంటేనే నిజం." భార్యకి అడ్డు పడి వెంకటరావు అన్నాడు.


"అంతే లెండీ.. చదువు కాగానే.. అదేదో కంపెనీలో.. అదేదో ఉద్యోగంలో చేరావు.." చెప్పుతున్న సావిత్రికి..


అడ్డై.. "ఈజీ సెల్యూషన్స్ లో సాఫ్ట్వేర్ జాబ్" చెప్పాడు వెంకటరావు.

"ఆ.. అప్పటి నుండి.. ఆఫీస్.. ఇల్లు తప్పా బయటికి కదిలేదే తక్కువ" చెప్పింది సావిత్రి.


"సినిమాలకి మాతోనే తప్పా.. ఒక్కడివి కానీ.. ఎవరితో కానీ వెళ్లేదే లేదు." అన్నాడు వెంకటరావు.


"అవునవును. మధ్యలో ఎలా అబ్బిందో.. హాలులో టివి ఉన్నా.. నీ కంటూ కావాలని నీ గదిలో టివి పెట్టుకున్నావు. ఖాళీ దొరికితే చాలు ఆ టివి ముందే కూలబడిపోయినట్టు కూర్చుని ఉంటావు." ఆగింది సావిత్రి.


"తిళ్లు కూడా గదిలోకే పట్టుకు పోతుంటావు. అడిగితే ఏమీ అనే వాడివి కాదు. నీ సొదే నీది." అన్నాడు వెంకటరావు.


ధీర ఏమీ అనలేదు. టిఫిన్ ముగించేశాడు.


"పట్టుతో.. పోరితే.. ఇన్నాళ్లకి.. ఏదో ఇలా.. ఇప్పుడు.. మాతో కూర్చున్నావు. ఎన్నాళ్లైందిరా మనం కలిసి తిని." అంది సావిత్రి.


ఖాళీ మంచి నీళ్ల గ్లాస్ ని టేబుల్ మీద పెట్టి లేవబోతాడు ధీర.

"ఆగు.. తేల్చు" అన్నాడు వెంకటరావు ఆందోళనగా.


తిరిగి కూర్చొని.. "ఏం చెప్పాలి. ఐనా చెప్పడానికి ఏం ఉంది." విసుక్కుంటున్నాడు ధీర.

"ఇది వరకటిలా ఎందుకు నువ్వు ఉండడం లేదు." అడిగాడు వెంకటరావు.


"ఉంటున్నానుగా. ఏం.. మీతో మాట్లాడడం లేదా.. మీరు పెట్టింది తినడం లేదా.. ఎప్పటికప్పుడు ఖర్చులు చూడడం లేదా.. మీకు కావలసినవి సర్దడం లేదా.. ఏం లేదు.. అంతా మామూలే గా." అన్నాడు ధీర గట్టిగానే.


"చూశావా.. ఇది వరకు ఇలా గలాటాలా మాట్లాడేదే లేదు. ఎంత పొందికగా తిరిగే వాడివి." నొచ్చుకుంటుంది సావిత్రి.


"మరే.. మాటలే కాదు.. చేతలూ మారాయి. బయటికి వెళ్లడానికి.. ఇంటికి రావడానికి.. టైమింగ్సే లేవు. ఎప్పుడు వెళ్లి పోతావో.. ఎప్పుడు వస్తావో.. అబ్బో.. ఈ మధ్య మాకు బిత్తర పాట్లు.. కునుకు పాట్లు తప్పడం లేదు నీ మూలంగా." అన్నాడు వెంకటరావు.


ధీర అనీజీగా కదిలాడు.

కొడుకునే చూస్తూ ఉండిపోయారు ఆ తల్లిదండ్రులు.


"నేను చెడిపోయాననుకుంటున్నారా." సడన్ గా ప్రశ్నించాడు ధీర.

ఆ తల్లిదండ్రులు తుళ్లి పడ్డారు.


"తిరుగుబోతునయ్యాననుకుంటున్నారా." మళ్లీ టక్కున అడిగాడు ధీర.

ఆ తల్లిదండ్రులు గతుక్కుమన్నారు.


"చెప్పండి. నేనేం మారిపోయాను." గుప్పున అడిగాడు ధీర.

"నువ్వు అడిగినట్టు మేము ఏమీ అనుకోవడం లేదురా." చెప్పింది సావిత్రి.


"మరి.." గందిక చేస్తున్నాడు ధీర.

"ఓరే నాన్నా.. చెప్పాంగా. నీ రాక పోకలు మారాయి.. నీ నడత నడక మారాయి.. అన్నవే మా బెంగకి కారణాలు" అన్నాడు వెంకటరావు.


"లేదు. నేనేమీ మారలేదు. మీరే మారారు. మీరు నా గురించి అలా అనుకోవడాలు తప్పు. అంతే." తేల్చేసేలా చెప్పాడు ధీర.

"అంతే నంటావా" అంది సావిత్రి బేలగా.


"వర్రీ వద్దంటావా" అడిగాడు వెంకటరావు బిత్తరగా.

"ముమ్మాటికి.. మీకు ఎట్టి సంశయాలు వద్దు" అనేశాడు ధీర.


ఆ భార్యా భర్తలు మొహాలు చూసుకుంటున్నారు.

"నేను వెళ్తాను" అన్నాడు ధీర లేస్తూ.


"వెళ్లి వస్తాననురా." నీర్సంగా అంది సావిత్రి.

"ఇదేరా నీలో అప్పటికి ఇప్పటికీ మార్పు.." ఇంకా ఏదో అనబోతున్నాడు వెంకటరావు.


"ఆపండి." అంటూ ధీర అక్కడ నుండి తన గదిలోకి వెళ్లి పోయాడు.

ఆ తల్లిదండ్రులు ఉసూరుమన్నారు.


తర్వాత.. నిముషాల్లో.. విసురుగా ధీర బయటికి వెళ్లాడు.

ఆ వెంబడే ఆఫీస్ కి బయలు దేరిపోయాడు బైక్ తో.


అదే సమయంలో.. బ్యాంక్ లో..

మేనేజర్ తో మాట్లాడుతుంది సు.


"ఇప్పుడే కౌంటర్ లో ఇచ్చిన చెక్కుల మొత్తంతో.. నా హోస్ లోన్ పూర్తయింది." చెప్పింది సు.

"ఇక లగాయితు మీరు ఆ ఇంటి ఓనరయ్యిపోయారు మేడమ్.. సంతోషం." అన్నాడు మేనేజర్.


నవ్వేసింది సు.


"ఈ సారి లార్జ్ స్కేల్ అమౌంటే కట్టినట్టుందే" అన్నాడు మెల్లిగా మేనేజర్ తన ముందున్న మోనిటర్ లోని.. సు అకౌంట్ చూస్తూ.


"అవునవును. ఒక మంచి ప్రొజెక్టు చిక్కింది." చెప్పింది సు.

ఆ వెంటనే.. "సీరియల్" అంది.


"వావ్.. సీరియల్స్ వైపు వచ్చారా. గుడ్. కంగ్రాట్స్ మేడమ్. మీది గొప్ప టాలెంట్. ఇట్స్ ట్రూ." అన్నాడు మేనేజర్.


నవ్వింది సు.

"సినిమాల వైపు వెళ్లండి మేడమ్. మీకు తప్పక తిరుగే ఉండదు." అనేశాడు మేనేజర్.


"అంతా ఆడియన్స్ అభిమానం.. వాళ్లు ఎటు తీసుకు పోతే అటే." మళ్లీ నవ్వేసింది సు.

లేచి నమస్కరించింది.

మేనేజర్ కూడా లేచి నమస్కరించాడు.

సు బ్యాంకు నుండి బయటికి వచ్చింది.


షూటింగ్ స్పాట్ కి బయలు దేరింది కారుతో.

షూటింగ్ బ్రేక్ లో..


"చూస్తున్నా.. ఇప్పటికీ.. కారు డ్రయివర్ ని కాని.. పర్సనల్ మేకప్ మాన్ ని కాని.. కాస్య్టూమ్ పర్షన్ ని కాని.. పెట్టుకోలేదు నువ్వు. సింప్లిసిటీ అనుకోవాలా." అన్నాడు సు తో వినోద్.


సు హైబ్రోస్ ని చక్కగా కదిపింది.


వినోద్ సీనియర్ డైరక్టర్. అతని డైరక్షన్ లో సు పాతిక పైగానే ఎపిసోడ్స్ చేసింది. ఆ పరిచయంతోనే వినోద్ చొరవగా సు తో వ్యహరిస్తుంటాడు.


సు నవ్వేస్తుంది.

"నవ్వేయడం కాదు. ఈ మారు చెప్పు." అన్నాడు వినోద్ నవ్వుతూనే.

సు మళ్లీ నవ్వుతుంది.


"పిసినారీ అనుకోనా" అనేశాడు వినోద్.

"యాజ్ యు లైక్." అంది సు.


"దొరకవు" అన్నాడు వినోద్.

"చిక్కనుగా." అంది సు గమ్మత్తుగా.

నవ్వేశాడు వినోద్.


అసిస్టెంట్ వచ్చి చెప్పడంతో..

వినోద్ తో పాటు సు తిరిగి షూటింగ్ కి సిద్ధమయ్యింది.


లంచ్ బ్రేక్ లో.. యాంకర్ సుమలత వచ్చింది సు వద్దకి.

పలకరింపుల తర్వాత.. ఇద్దరూ.. సు కారులో కూర్చున్నారు.


"లతా.. డేట్స్ కుదరక.. నా నాలుగు షెడ్యూల్ వర్క్ ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను." చెప్పింది సు.

"నాలుగూ సింగిల్ ఎపిసోడ్సా" అడిగింది సుమలత.


"అవునవును. దేనికవే." చెప్పింది సు.

"థాంక్స్ సు." అంది సుమలత.


"సర్దుబాటు చేసినందుకు నేనే నీకు థాంక్స్ చెప్పాలి." అంది సు.

"నీ సీరియల్ షెడ్యూల్స్ వలనా.. నీకు కుదరలేదు." అడిగింది సుమలత.


"అవును. ఆ నాలుగు వర్క్స్ అమౌంట్ నేను నీకు చెల్లిస్తాను" చెప్పింది సు.

"అలానే" ఒప్పుకుంది సుమలత.


"ఆ నాలుగింటికి నాకు ఎంత ముడుతుందో.. అంతే నీకు ముట్ట చెప్పుతాను స్మీ." తిరిగి చెప్పింది సు.


"అయ్యో.. సు.. అలానే.. నీ సంగతి నాకు తెలియనదా.. నువ్వు కచ్ఛితమైన మనిషివి." అంది సుమలత.


"చౌవ్ చౌవ్ సమయంలో నాకు పని ఇస్తున్నావు. అంతే చాలు నాకు." అంది సుమతల ఆ వెంబడే.


"ఎట్టి ఇజాలకి పోక నువ్వు సహకరిస్తుంటావు. నాకు వీలైనప్పుడు.. తొలుత నిన్నే కోరుతాను. నువ్వు ఇంత వరకు నన్ను కాదనేదే జరగలేదు." చెప్పింది సు నిబ్బరంగా.


నవ్వేసింది సుమలత.

"నేను డేట్స్ చెప్పి ఉన్నాను. గుర్తు ఉన్నాయిగా." అడిగింది సు.


"నోట్ చేసుకున్నాను" చెప్పింది సుమలత.


అప్పుడే తిరిగి షూటింగ్ కి రమ్మని పిలుపు రావడంతో.. సుమలతని సాగ నంపి.. షూటింగ్ స్పాట్ ని చేరింది సు.


షూటింగ్ పేకప్ తర్వాత.. ఇంటికి తిరిగి వచ్చిన సు.. డిన్నర్ తెప్పించుకుంది.

డిన్నర్ కాన్నిచ్చేశాక.. వెంటనే నిద్రకై మంచం ఎక్కేసింది సు.


అదే సమయంలో.. ధీర ఇంటిలో..

తలుపు చప్పుడుకి.. లేచి.. వెళ్లి తలుపు తెరిచాడు ధీర.


తన గది బయట.. తల్లి.

"డిన్నర్ కి రా" అంది సావిత్రి.


"తెచ్చేయ్." చెప్పాడు ధీర.

నొచ్చుకుంది సావిత్రి. ఐనా అక్కడ నుండి వంట గది వైపు నడిచింది.


వెళ్తూ.. "తలుపు గడియ పెట్టకు. ఇప్పుడే తెస్తాను." అంది.

ధీర తలుపు దగ్గరగా మూసి.. తన రీడింగ్ టేబుల్ మీది లాప్టాప్ ముందుకి చేరిపోయాడు.


కొద్ది నిముషాల్లో.. డిన్నర్ ప్లేట్.. వాటర్ బాటిల్ తో ధీర గది లోకి వచ్చింది సావిత్రి.. గది తలుపు తోసుకొని.


తను తెచ్చిన వాటిని ధీర కి అందిస్తూ.. కొడుకు లాప్టాప్ లోకి చూసింది సావిత్రి.

"అది పాత ప్రొగ్రామే కదరా. టివి లో చూసిందే గా." అంది.


ధీర ఏమీ అనలేదు. తెర మీది సు నే చూస్తూ ఉండి పోయాడు.

ఇంకేదో అడగబోతుంది సావిత్రి.


"అమ్మా. డిస్టర్బ్ చేయక వెళ్లి పోవా." అనేశాడు ధీర చూపు తిప్ప కుండానే.

చిన్నబోతూ సావిత్రి అక్కడ నుండి వెళ్లి పోయింది.


ఆ వెంటనే.. ధీర చకచకా కదిలి.. గది తలుపు మూసేసి.. లోపలి గడియ వేసేశాడు.

తిరిగి లాప్టాప్ ముందుకి చేరిపోయాడు. డిన్నర్ ప్లేట్ ని.. వాటర్ బాటిల్ ని మంచం మీద పెట్టేశాడు.


సు ఇంటిన..

ఫోన్ రింగ్ తో కునుకు పాట్లు నుండి తెములుకుంది సు. ఫోన్ అందుకుంది.


అనుదీప్ ఫోన్ చేస్తున్నాడు.

చిరాగ్గానే.. "ఏమిటి.. ఈ సమయాన." అంది సు.


"నిద్ర పోతున్నావా" అడిగాడు అనుదీప్.

"మరి.. చెప్పు.. ఏమిటి." అంది కాస్తా ఇబ్బందిగానే సు.


"మరే.. మరో ఉగాది స్పెషల్ ప్రొగ్రాం ఆఫర్ వచ్చింది. బి టివి ఛానల్ వారికి.. ఇద్దరు సెలబ్రేటీ యాంకర్స్ కావాలట. నన్ను అడిగారు. మరొకరికై నిన్ను చెప్పొచ్చా." అడిగాడు అనుదీప్.


టకటకా జల్దుకుంది సు. లేచి కూర్చుంది.

"పిక్క గిట్టుబాటు అవుతుందా" అడిగేసింది.


"నీకు వీలు అవుతుందా" అడిగాడు అనుదీప్. అతడు నవ్వుకుంటున్నాడు.

"బిట్వీన్ ఎయిట్ పియం టు ఎయిట్ ఏయం చేసే వీలు ఉంటుందా." అడిగింది సు.


"నాకు తెలుసు తల్లీ. అందుకే నీ గురించే కదిపి.. నిన్ను ఒప్పిస్తానని చెప్పి.. నువ్వు చెప్పిన టైమింగ్సే చెప్పి.. అలా ఐతేనే.. నువ్వు ఓకే చేయగలవని కూడా చెప్పాను." చెప్పాడు అనుదీప్.


"ఏ రోజు." అడిగింది సు.

"వచ్చే బుధ ఆర్ గురు వారాల్లో షూటింగ్ ఉంటుంది." చెప్పాడు అనుదీప్.


"కానిచ్చేయ్" అంది సు.


"నా తల్లే.. పని రాక్షసివి." అనేశాడు అనుదీప్ బయటికి. కానీ మనసులో 'నిజానికి నువ్వు ఐతే బాగుంటుందని వాళ్లు అన్నారు. నీ డిమాండ్ మూలంగా నువ్వు కుదరవని అనుకున్నారట. కానీ నా బిల్డప్ తో నిన్నే బుక్ చేసుకొనేలా చేశా. మరి.. నీ వలన నాకు భలే గిట్టుబాటు అవుతుందిగా.' అనుకున్నాడు సు ని ఉద్దేశించి.


తర్వాత.. "సరే ఐతే.. వాళ్లతో మాట్లాడేసి.. ఫైనలైజ్ చేసేస్తాను." చెప్పాడు.


"అలాగే కానీ. కానీ.. ఈ రాత్రి అప్పుడు వాళ్లచే నాకు ఫోన్ చేయించకు. ప్లీజ్. నిద్ర తన్నుకు వస్తుంది." చెప్పింది సు.


"అలాగే. రేపు మాట్లాడిస్తాను." చెప్పాడు అనుదీప్.

సు కాల్ కట్ చేసేసి.. నిద్రకి ప్రయత్నిస్తుంది.

(కొనసాగుతుంది..)

***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.

రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.

317 views0 comments

Comments


bottom of page