top of page

 విశ్వ గాథ శతకము

#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, #ViswagathaSathakamu, #విశ్వగాథశతకము, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #ఆటవెలది

ree

Viswagatha Sathakamu - New Telugu Poems Written By - Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 23/09/2025

 విశ్వ గాథ శతకము - తెలుగు పద్యాలు

రచన : సుదర్శన రావు పోచంపల్లి

 

(1) అప్పు జేసి రోజు పప్పుతొ దినుచుండ 

అప్పు లోడు అడుగు అదను జూసి

అప్పు ముప్పు అనుచు నిప్పుగ బ్రతుకింక 

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(2) గుడులు బడులు గట్టు గురుతర భాద్యత 

అనుచు మదిని దలచి అనువు జూసి

నీదు ఊరు నందు నిర్మించ పుణ్యము

 విబుధు లార వినుడు విశ్వ గాథ


 (3) మూడ నమ్మ కాలె ముదమగు ననుచును

మంది రాలు తిరుగు మనుషు లందు

భ్రమయె అగును గాని బ్రతుకుకు సుఖమేల

విబుధు లార వినుడు విశ్వ గాథ


 4) సజ్జ నుండు తులువ సావాస మయినను

మార్పు రాదు అటులె మాను గంధ

మయిన పాము జేర మైలప డగబోదు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(5) చెరువు లున్న గనుచు చేపకు గాలము 

వనధి యందు అనగ వలయె నింక

నాయ కుండు వేయు నరులకు వలవేరు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(6) పండి తుండు వ్రాయు పద్దెము సరిగను

పలుక లేక యుండి పరుల ముండు

పండి తుండ ననుచు పలుకగ పరువేల

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(7) లెక్క లందు సున్న లెక్కకు రాదన

సున్న విలువ యెంతొ సున్న దెలుపు 

సంఖ్య సున్న గలిసె సంఖ్యకు విలువన

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(8) త్రాగ మైక మొచ్చు త్రాణము కరువగు

త్రాగ మనిషి ప్రాణ త్యాగ మొందు

త్రాగ కున్న నింక త్రాణము కలుగును

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(9) కాల మన్న ఎవరు కనగను లేరన

కాల మంటు లెక్క కాన నగును

దేవు డంటు గనక దేవుని గొలువరా

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(10) ఆక లయిన అపుడె అన్నము వండుట

బాగ దప్పి గలుగ బావి త్రవ్వ 

సోయి లేని వాడు సోమరి అనెదరు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(11) ముసలి వారి సేవ ముదమన మనసిడి 

యాష్ట పడక సేయు యాత ననక

దాని వల్ల గలుగు దరుమము నీకిగ

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(12) సమకొ నుండె మనకు సంగీత సాహితి

జాన పదుల నుండె జగము లోన

జాన పదులె లేక జగమెంత శూన్యమొ

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(13) జాయ బిడ్డ బంధు జనులతొ కూడుండి

మరణ సమయ మనగ మథన మేల

మాపు మాను జేరి మరలవా పులుగులు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


 (14)క్షణము కామ వాంఛ క్షణమైన మనసిడి

 ఆప లేక యున్న ఆప దెంతొ

 జెప్ప నలవి కాదు చెరసాల మార్గమె

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(15) కోరు కున్న చోటె కోవిదు డుండడు 

కోవి దుండు చోటె కోరి వెదుకు

అతని చలువ వలన అబ్బును జ్ఞానము

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(16) ప్రసవ వెతలు బొంది ప్రసవము జెందిన 

జన్మ నిచ్చి నట్టి జనని సేవ

జేయ నెంతొ మేలు జేయును జనుమకు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(17) తనయు కిడుము గన్న తనరుచు తల్లియె

దేవ కాచు మంటు దిగులు తోడ

మొక్కు నట్టి తల్లి మొక్కగ శుభమగు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(18) ఎంత పెద్ద వారొ అంతగ అనుభుక్తి

వారి తోడ నెంతొ వాద ననగ

తగదు లేత మదికి తాళరు వారును

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(19) ముగ్గు రమ్మ లనగ ముదమగు బతుకమ్మ

పూలు పేర్వ బుట్టు పుడమి నందు

జనము కోర్కె దీర్చు జగదాంబ బతుకమ్మ

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(20) చంటి వాడు ఏడ్వ చరవాణి అందీయ

ఏడ్పు మాను నింక ఏమి గనడు

చూడ నదియె వింత చరవాణి మహిమ

విబుధు లార వినుడు విశ్వ గాథ


(21) చూడ సుంద రంబు చురుకగు వినయము 

మాట లందు తేనె మధుర మన్న

మూర్ఖ ధూర్తు లంటు ముఖమునె అనెదరు

విబుధు లార వినుడు విశ్వ గాథ


 (22) నిత్తె మింక బలుకు నిజమును వదులక 

నిజము వీడ బోక నిలుచు టందు 

నీదు కీర్తి బెరుగు నిక్కము ఎరుగంగ

విబుధు లార వినుడు విశ్వ గాథ


(23) వేద నేల నీకు వేయిగ దారులు 

కలసి విడిచి పోవు కర్ర గనుము

నదిన పడుచు లేచి తుదకును కలువవా

విబుధు లార వినుడు విశ్వ గాథ


(24) దారు ణంబు లేమి దావాన లముకన్న

దార సుతుల సాకు దారి యనగ

కాయ కష్ట మొకటె కనబడు దారన

విబుధు లార వినుడు విశ్వ గాథ


(25) ధనము యుండి దాన ధర్మము ఎరుగక 

భాష యుండి గూడ భావ మనగ

తెలువ లేక యున్న తెలివిలే దందురు

విబుధు లార వినుడు విశ్వ గాథ


(26) అంశు మాలి గాన అగుపడు చిన్నగ 

లోక మంత వెలుగు లోప మనక

మనిషి మెదడు అంతె మహిమల మయమన

విబుధు లార వినుడు విశ్వ గాథ


(27) మూగ వాడు ఎంతొ ముదముగ మాటాడ 

తామ రసము పొందు తావి వలెనె

సౌమ్య గంధ మొందు సౌగంధ ఫలమోలె

విబుధు లార వినుడు విశ్వ గాథ


(28) సబ్బు లేని స్నాన సరిపడ దొంటికి 

ఆస్ర దువ్వ కున్న అంగు యేల 

నగవు గనక నికను ననబోడి కందమా

విబుధు లార వినుడు విశ్వ గాథ


(29) వెన్ను తట్టు వాడు వెనుకకు జరుగడు 

తిండి బెట్టు వాడు తిట్ట బోడు

మంచి వాడు జెప్పు మనసగు మాటలు

విబుధు లార వినుడు విశ్వ గాథ


(30) లేశ మైన సిగ్గు లేకను వరుడిక 

ధనము అడుగ తగదు దరుమ మనుచు

తన్ని పంప వాని తనయకు మేలగు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(31) ఒక్క సున్న గనగ పెక్కుగ విలువలు

అంకె తోడు సున్న అనగ ఉన్న

దాని విలువ బెరుగు దశముగ అనగను

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(32) వేద భాగ ములని విభజించె నాలుగు

వనము నందు జేరి వరుస గాను 

బాద రాయ ణుడన బదరికా వనముండ

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(33) మందు త్రాగు విందు మనిషికి చేటన 

పప్పు కూడు దిన్న తప్పు లేదు

తులువ సోప తెపుడు తలువను తప్పగు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(34) ఆలు నమ్మ కున్న ఆలుయు నమ్మదు 

నీదు పైన ప్రేమ నిలువ బోదు

కలసి మెలసి బ్రతుక కలుగును సుఖమన

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(35) చీక టన్న భయము చీకుకు లేదేల

చీక టందు దిరుగు చీమ దోమ

మనిషి కేల యింక మనమున భయమగు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(36) కాక గాలి చలియు కనులను కనలేము 

ఆరు రుచులు గూడ అగుపడ విక 

పంచ ఇంద్రి యంబు పనులవి తెలియగ

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(37) నింగి సూర్య చంద్రు నిలువక కదులగ 

కాన నెంతొ వింత కలుగు చుండు

 నిమిస మయిన ఎపుడు నిలువరు తిరుగక

 విబుధు లార వినుడు విశ్వ గాథ



(38) అనువు గాని చోట అరువన తగదిక 

అప్పు సేయ కున్న అదియె మేలు

అరువు ఎపుడు కలుగు అవమాన కరమన

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(39) సంబ ళంబు లేక సంసార మెటు జేయు

పేద వాని గనుచు పెద్ద లెపుడు

యాత నెరిగి ఈయు జీతమె మేలగు

 విబుధు లార వినుడు విశ్వ గాథ 


(40) అహము వదల మనిషి అపజయ మెరుగడు 

సాటి జీవి పాటు సహన ముండ

మనుషు లెపుడు పొగడ మనమున తనివగు 

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(41) పండు పంట యందు బిడికెడు పుడిగన

దండు గెంత గాదు దరుమము అగు

ఎండ రాలి నంత ఎరుగను గనమిక

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(42) రాబ డైదు పాలు రయము జేయుటయును 

దాన ధర్మ కీర్తి తగను ఇకను

తాను పిల్ల పాప తగునటు శుభమగు 

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(43) పందె మనక ఆట పల్లవ నక పాట 

గంధ లేని పూలు గగన మెత్తు

కనగ ఫలము దెలియ కడకును తగనివి

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(44) వరుష మనగ వేగ వనమున జేరగ

పిడుగు చెట్టు పైన పడుట చేత

ప్రాణ హాని గలుగు ప్రాణము బోవచ్చు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(45) పేద వాడు ఎపుడు పెద్దల ననబోడు

వాడు వీడు యనెడి వదరు భాష

పేద కున్న నీతి పెద్దకు లేదాయె

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(46) మహిమ గలదు అనగ మనుజులు కూడగ 

తాయి ఎత్తు కట్ట తగును మీకు

ననుచు కపటి నుడువ నణుచుట నయమగు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(47) రెండు చేతు లందు బంగరు గాజులు 

కంఠ మందు జూడ కనక మాల

కనగ నాచు దోచ కాచుకొనుండును

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(48) తల్లి కెపుడు ప్రేమ తనయుల పయిననె 

నాతి వంపు సొంపె నరుని బ్రీతి

పిల్ల లెరుగ బ్రీతి తల్లియు తండ్రియె

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(49) తల్లి తండ్రి పైన తలువని అభిమతి 

తోడ బుట్టు పైన తొలగ నెలమి

అనుగు తెలువ నధము డనెదరు పరులును

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(50) అసువు లనిన గణతి అధికులు ఎరుగరు 

పన్న డన్న జూచు పరుల జంప

అనువు కొరకు అధిక అధమ ఎడమదియె

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(51) త్వరగ త్వరగ నడుచు దాపలి కుతపము 

మెల్ల మెల్ల నడ్చు మెరుగు టెద్దు

అలసు చురుకలిలలొ అగుపడు తులమన

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(52) ధనము సుఖము సతియు దనకును తగియును 

బిడ్డ పాప లెల్ల బిరుసు లేక

జనము పొగడ ఇకను జనకుడు సుఖమను

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(53) బడులు ఉండి గూడ బడులకు పంపక

చిన్న నాడె చదువు చిన్నమెత్తు

నేర్వ కున్న వారు నేరము నేర్తురు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(54) కులము మతము అనుచు కుములుట తగదని 

ఒక్క చోట జేరి ఒనరు గూర్చ

కడలి నదుల జలము కలసిన యటులగు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(55) సతియు పతియు గలిసి సరసము బలుకగ 

తెచ్చు హెచ్చు మెచ్చు తెలియ వచ్చు

విరస బలుకు బలుక వినయము కరువగు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(56) జనని జనక శిశువు జయమన కదియగ 

ఇల్లు నిండి యుండ ఇంక వేడ్క

నెలవు యెచట తనివి నెరయక నెరుగరు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(57) అద్ద మందు కొండ అందము గనపడ

చెంత జేరి చూడ చెప్ప గలవు

దూర ముండ కొండ దెప్పర మెంతనొ

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(58) పరుల పయిన చనువు పొడముట బదులుగ 

తల్లి బిడ్డ ఆలు తగును జూడ

మతియు గలిగి మెలుగ మనసుకు తనివగు

విబుధు లార వినుడు విశ్వ గాథ


 (59) పులుగు యయిన పశువు పురుషుడయినగూడ

కుక్షి నిండ కుండ కుదుల లేవు

చమరు గనక వెలుగు ఛవులను కనలేము

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(60) తగవరి తడవు యన తగునెటు దరుమము 

తగ్గ న్యాయ మన్న తగవు లేదు

సమయ మధిక మయిన సహనము తరుగును

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(61) వెలుగు తెలుగు మిగుల వెలగల పదముల 

 చక్క నైన భాష చదువ బాగు

 మధుర మయిన దదియె మనకును గరువము

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(62) కుక్క తోక ఎపుడు చక్కగ రాబోదు

కోతి మూక లెపుడు కోలుకోవు

కుక్క కోతి వలెనె కూళుడు మెలగును

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(63) పసిడి అధిక వెలన పడతులు కొనకను 

మాన లేరు వారి మనసు మీర

మనసు మగువ దెపుడు మణులను గొనుటయె

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(64) బాన పొట్ట యుండి బాదాము పిస్తలు

తినును ఎపుడు జూడ తిండి బోతు

బలిమి దినుము యన్న బలహీను దినబోడు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(65) మనిషి పనులు గనగ మనమున అరుచన 

చేయు వాడు యేడి చెమట బట్ట

ఒడలు విరువ పనియె ఒనరును అశనము

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(66) నభము సొగసు తపుడు నరులును దెలియగ 

తోట కంద మన్న దొరపు తేటి

సకల గుణము లెరుగ సుగుణము నయమన

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(67) భరత చరిత రచన బాదరాయ బలుక 

కొక్కు రౌతు వ్రాసె కలము చేత

కరివ దనుని గొలువ కలుగును జయములు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(68) వసతి కలుగ మనిషి వసతులు గనుగొను 

చావ వల్ల కాడె సదన మింక 

చవులు యెరిగి దినిన జఠరము కవగడ

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(69) తనయు పసిమి గనును జనకుడు జననియు 

తల్లి తండ్రి జూచి తనయ మెచ్చు

పరుల తెరగు గనుచు పరికించి జూతురు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(70) సరఘ మధువు పుడికి సవ్వడి యెరుగదు 

సంఘ ద్రోహి సేయు సతత హాని

మధుప మెపుడు సలుపు మట్టము మానక

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(71) ఒకని దునుమ ఫలము ఒనగూడు నేమిటి 

వాని జంపు వాడు వదల బోడు

ఒకరి కొకరు పగలు ఒనరించ నేలకొ

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(72) రమణ మతము గనక రమపతి నయినను 

సేవ జేయ బోడు సెలవు లేక

అధిపు డయిన వధువు అనుమతి అడుగడా

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(73) అధిక వలపు వలన అగుపడు అటమట 

పెక్కు నిక్కు గూడ పెంచు కీడు

అధిక వరుస గలుగు అధికము అలజడి 

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(74) కినుక వలన కలుగు కీడుయు మనిషికి

శాప మన్న నదియె శాంతి లేదు

కోప మున్న మనిషి కోపిష్టి యనబడు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(75) మునుపు జనుల హితము మనుజుల భాగ్యము 

మంచి దైన విద్దె మనకు జెప్ప

చదువు గలిగె ఇపుడు చదువుయె ధనమన

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(76) అగము గరువ మనిషి అసువులు బోనుండు 

మంచి మందు ఈయ మాను బాధ

 అపుడె మనిషి కింక అడలును బోవును

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(77) ధనము గలుగ నెపుడు దాచుకో నేరక 

ఒక్క నాడె ఖర్చు ఒనరు చేటు

పొదుపు గనుచు అదుపు పూనుకో మానవా

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(78) ధనము గలుగ ధనికి దాచగా కుతిలము 

కుక్షి నిండ దిన్న కూడు చేటు

 బాధ యన్న లేదు బీదకు నెన్నడు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(79) కుక్క తోనె బూని కుక్కతో తెమలుచె 

బాద రాయ ణుండు భరత గాధ

శ్వాన మొందె గోము సవినయ సమరంతొ

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(80) స్వార్థ చింత కన్న జనముకు సేవన 

స్వాబి మాని యంటు సకల మెప్పు 

స్వావ లంబ నన్న సమకూరు ప్రఖ్యాతి

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(81) మేహ వ్యాధి సోక మేల్గాదు మధురము 

ఖర్జు పండె మంచి ఖాద మగును

మూడు సార్లు నడ్వ మెరుగగు స్వస్థత

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(82) తంతు పుర్వు జంపి తంతువు లల్లియు 

పట్టు బట్ట నేసి పడతి కీయ

తేనె టీగ జంపి తేనీయ దీయుటే

 విబుధు లార వినుడు విశ్వ గాథ


 83) ఏమి లేని వాడు ఎగురుచు నుండగ

అన్ని ఉన్న వాడు అణగి యుండు

నిండు విస్త రుండ నిలుచునా వట్టిది

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(84) ఆడ వారి కంట అశ్రువు జారగ 

ఇంటి వారి కెంతొ ఇడుము గల్గు

నిప్పు యంట మంట నిలయము నిండదా

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(85) మాట మాట బెంచ మనసులు పాడౌను 

పోరు సేయ నింక పొగడ రాదు

కూర్మి గల్గి యుండ కుదురును యోగము

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(86) అన్న దమ్ము లింక అతిగను పోరాడ 

అయ్య లమ్మ లమది కౌను బాధ

వేరు నూడ చెట్టు వేగ వెలసి నట్టు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(87) ధనికు డౌట చేత ధనికుడ ననరాదు 

బీద వారు మెచ్చు బిరుదు పొందు

కొరకు రాని సొమ్ము కొదువయు యననేమి

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(88) పగలు రేయి పెక్కు పనులను సేయక 

పక్క పర్చి కూడు బుక్క లేరు

ఒడలు వంచి సేయ ఒనగూడు ధరలోన

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(89) మనది యనగ వసతి మనకును భవికము 

అద్దె కొంప నున్న అద్దె బాధ

కొదువ గనని వసతి కొలదియు నయమగు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(90) కులము కులము అనుచు కులమును ద్వేషించ 

నీది యేది జెప్పు నెరుగ నాకు

మనుజ కులము ఒకటె మనుషులు ధ్యానించ

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(91) గురువు లెరుగ దెలుప గుణములు బాగుండు 

చట్టు నేర్వ గాంచు చదువు లట్టు

ఎవరు దెలుప గనక ఎరుగరు మేలొంద

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(92) మధుర వచన బలుకు మనుజుల నెపుడును 

నమ్మ రాదు జూడ నయము లేదు

కుదుర బలుకు వచన కులుకుల మయమగు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(93) కూర గాయ గొన్న కొసరని అడుగుచు

బట్ట బంగ రందు బెట్టు జూప

బీద వాని నింక బీదను జేయుటె

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(94) బుద్ధి లేని వాని బుధులును దిద్దరు 

మనసు పడియు జదువె మనిషి దారి

మంచి మాట విన్న మనసుకు పట్టును

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(95) ఆట పాట లెస్స అవసర మనుకొన్న 

చదువు యెపుడు మనిషి చక్క దిద్ద

అప్పు దప్పు డాట అవసర మనుకొమ్ము

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(96) జనము తగును యనుచు జయమును అందీయ 

కుంభ కోణ జిక్కి కుదులు టేల

పదవి నొదల మనిషి పతనము ముద్దాడు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(97) మనిషి దూర మైన మమతలు దగ్గర

ప్రేమ మహిమ అదియె పెనుపు యనను

ప్రేమ లేని జీవి పృథ్విని గనబోము

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(98) తెలుగు మనకు వెలుగు తెలియగ మదికిని 

అక్ష రాల సొంపు అదియె కెంపు

మనసు ముదము గలుగు మరువక జదివిన 

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(99) ఇగుర మనిన ఎరుగ ఇడుములు అనినను 

కల్గ దింక సొమ్ము కలన నైన

కుదుర దనుచు దెలుప కులమున కటకట

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(100) తప్పు మాట విన్న తక్షణ మొదిలేయి

చెప్పు మాట లెపుడు చెవుల చేటు

మంచి మనిషి మాట మరచుట తగదిక

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(101) లోక మందు నీవు లోకువ గాకుండ

చేత నైన రీతి చేయు బనులు

చిన్న దీప మైన చీకటి పోగొట్టు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(102) జనని జనకు లెపుడు తనయుల శుభమునె 

గాంచు వారు గాన గరువ ముంచి

మనసి డడిమె సలుప మనసున తనివగు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(103) ఎవరి తెరువు తనకు ఎరుగుట తగదన 

తాను ఒక్క డుండి తనకు సేవ

తరుణ మనిన ఎవరు తలువరు పిలువరు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(104) పరుల పలుకు వినక పెడచెవి పెడుతును 

తాను జెప్పు మాట తగును యేల

అనిన మనసు చివుకు అనబడు తుదకును

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(105) తెలియ దనుచు తనకు తెలిసినటుబలుక 

బుద్ధి హీను డంటు బుధులు అంద్రు

తెలియ నపుడు దనకు తెలియదనుట మేలు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(106) పయన మగుట కొరకు పంచాంగ మెతుకకు 

అన్ని రోజు లందు అగును మంచి

సమయ మెపుడు మనకు సవ్యంగ గననగు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


(107) ధైర్య మింత లేక ధనమును కొనిపోవ

 ఆయు ధాలు చెంత అధిక మున్న

సాహ సుండు ధనము సాంతము కాజేయు

 విబుధు లార వినుడు విశ్వ గాథ


 (108)అవిటి వారి జూచి అల్లరి సేయకు 

చెవిటి వారి గనుచు చిర్రు మనకు

సాటి మనిషి కింక సాయము జేయుము 

 విబుధు లార వినుడు విశ్వ గాథ


 భూమిక

ఎందరో మహానుభావులు శతక రచనలు చేసి శతకోటి జనుల జీవన విధానాన్ని చక్కబరుచుటలో సఫలీకృతులైనారు.


సాహిత్యములో శతక సాహిత్యము సర్వకాల సర్వావస్థలయందు ఉపమాన ఉపమేయములుగా ఉండి అందరికి వల్లించ ఉపయుక్తముగా ఉండుట వలన ఆదరణ ఎక్కువ.


ఈ శతక రచనలో ఎన్నో రకాలు 1.భక్తి శతకము,2.నీతి శతకము,3.వేదాంత శతకము,4.శృంగార శతకము,5.వ్యాజస్తుతి శతకము,6.హాస్య శతకము,7. కథాశతకము,8.సమస్యా శతకము,9.వైరాగ్య శతకము మున్నగు ఎన్నో ప్రక్రియలలో కాబడుతాయి.


నేను ఎన్నుకున్నది నీతి శతకము-ఇంతకు ముందు 1.పోచంపల్లి శతకము,2.వినయ శీల శతకము రెండూ ఛందోబద్ధము కాక వచన పద్యములుగా వ్రాయడము జరిగింది.3. "కనకధార శతకము" శతకమునకు గల అష్టోత్తర శత నియమము పాటించుచు శతకమను ఆటవెలదిలో 108 పద్యములు వ్రాయ బడినవి. ఇప్పుడీ విశ్వ గాథ శతకము కూడ 108 పద్యములతో ఆటవెలదిలోనే వ్రాయ బడినది.


పాఠకులు ఎప్పటి మాదిరిగనే ఆదరించి సహృదయముతో లోపాలను సరిదిద్ద సలహాలిచ్చిన సవినయంగా స్వీకరించి సరిచేయ గలను.

సదా పాఠకుల ఆదరాభిమానాలు కోరుతూ

 పోచంపల్లి సుదర్శన రావు 


 అంకితం


ఈ నా రచన నా అనురాగ దేవత కీ.శే.పోచంపల్లి రమాదేవికి

 అనురాగ స్మృతులతో అంకితం.


 పోచంపల్లి సుదర్శన రావు

      

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


Comments


bottom of page