top of page

వాట్సప్

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Whatsapp' New Telugu Story Written By Dasu Radhika


రచన: దాసు రాధిక


"తులసీ, వంట అయిందా తల్లి? ఏం చేశావు ఇవాళ?" ఫోను లో దుర్గత్త గొంతు వినగానే గొంతు మార్చి హరి లాగా పెట్టి - " తులసి బాత్ రూమ్ లో ఉంది" అని టక్కున ఫోను పెట్టేసింది.


తన కొడుకు చిన్నప్పుడు గొంతు లు మార్చి అందరిని ఆట పట్టిస్తూ ఉండేవాడు... తులసి కి ఎందుకో గుర్తొచ్చింది... ధైర్యం చేసి తాను అదే పని చేసింది....


ఈవిడ కెందుకు నేను ఏం చేస్తే, ఏదో వంక తో ఫోను చేసి ప్రతీ నిమిషం ఏ ఇంట్లో ఏం జరుగుతుందో అనే కుతూహలం తో మరీ రోజు రోజుకు తన ఎంక్వయిరీ తో చంపేస్తోంది... అని తులసి తన చికాకును సోఫా లో కూర్చుని పేపర్ చదువుతూ ఉన్న మొగుడు హరి తో రోజూ లాగే పంచుకొందామని చూసినా అతను తల ఎత్తి పట్టించుకోలేదు ... తులసి గొణుగుతూ ఉంది... కాని వినే వాడెవరు???


పప్పన్నం తింటూ " నా ముందే నా గొంతు పెట్టి మాట్లాడావు, చాలా దూరం వచ్చింది వ్యవహారం, ఏంటి సంగతి" అని పచ్చి మిరపకాయ కొరుకుతూ భర్త అడిగిన ప్రశ్నకు తులసి "ఒక చెవు, ఇటు వేసే ఉంచుతారు సుమా..."


"ఏం చేయను, ఈ సెల్లు ఫోన్ల కాలంలో మనుషుల మధ్య ప్రేమ, ఆపేక్ష మనం తట్టుకోలేనంత పెరిగి పోయాయి... అందుకే నాలో ని కొత్త కళలను వెలికి తీస్తున్నాను .. ఇంతకీ అది కోపమా లేక..." అంటూ హరి కంచం లో అన్నం వడ్డించి చారు పోసినది...


"అస్సలు భర్త అంటే భయం లేదు కదా నీకు తులసి ... మీ దుర్గత్త, పిన్ని సుమతి, నీ ఫ్రెండ్స్ వాసవి, మరియు రమ... ఇంకా ఎవరు... ఆ.. మన పక్కింటి ఆవిడ గోమతి ఆంటీ వీళ్ల మాట ఎత్తితే మటుకు నీకు హడలు"...

తులసికి ఆ పూట అన్నం సొక్క లేదు... మొగుడు ఎగతాళి చేసిన సంగతి అర్థం కాని అమాయకపు పక్షి... లో లోపల బాధ పడుతోంది... పెరుగన్నం ఆఖరి ముద్ద తింటూ "భయం కాదండి, భక్తి, గౌరవం, అన్నిటినీ మించి ప్రేమ ఉండాలి మొగుడు మీద... మీ మొగవాళ్లు అందరూ తప్పుగా ఆలోచిస్తారు... "


"అయ్యో పాపం... మీ అత్తగారిని ఆసుపత్రిలో చేర్చారని విన్నాను, నీకే మైనా హెల్ప్ కావాల్సినా ఏ మొహమాటం లేకుండా అడుగు"... మర్నాడు వచ్చిన మొదటి ఫోన్ కాల్ అది... అటు పక్కన పిన్ని సుమతి...


గుమ్మం లో అలికిడి విని ఫోను తో సహా అటు నడిచింది తులసి...

"కం గోమతి ఆంటీ , కం, ప్లీజ్ సిట్ " అని పక్కింటి ఆవిడ తన ఇంట్లో కి తొంగి చూస్తూ కనిపిస్తే ఫోను రిసీవర్ పట్టుకుని ఇటు మాట్లాడింది తులసి...


"అవును తులసి...మరీ మీ తోటి కోడలు విజయ పలికినదా? ఎప్పటి లాగే తప్పించుకుందా? ఫోన్ లో సుమతి పిన్ని ప్రశ్నలు వేసుకుంటూ పోతోంది... అంతకు ముందు చెప్పిన దానికి తులసి ఏమీ బదులు ఇవ్వక పోయినా, ఇంకెవరితోనో మాట్లాడుతోందని విన్నా కూడా ఒక్క క్షణం వృథా కాకుండా బ్రేకులు లేని బండి లాగా దూసుకొని వెళ్లి పోతోంది - "అమ్మాయి, నా మాట గా చెబుతున్నా - అబ్బాయి హరి ని ఎక్కువ గా ఆసుపత్రికి తిరగనీయకు... మిగతా వాళ్లకు ఆ మాత్రం బాధ్యత ఉండద్దా?..."


" జస్ట్ లెట్ మీ నో ఇఫ్ యు వాంట్ హెల్ప్" ఇక్కడ Mrs. గోమతి మాట్లాడు తోంది... తులసి లైన్ కట్ చెయ్యి లేదు కాబట్టి సుమతి పిన్ని బుర్ర మాటలను వెయ్యి గీగా బైట్స్ పెర్ అవర్ స్పీడ్ లో నోటి ద్వారా బయటకు పంపుతోంది...


గోమతి ఆంటీ హెల్ప్ పేరుతో ఇంట్లోకి వచ్చి కూర్చొని మాట్లాడటం ఇదే మొదటిసారి... కాలానికి తిప్పలు వచ్చాయి లేదా ఈవిడ ఇంకేమీ ఉద్దేశంతో వచ్చిందో... తులసి తల తిరిగి పోతోంది... అటు ఆసుపత్రికి లంచ్ తీసుకెళ్లాలి, టైమ్ అయింది... తను వెళ్తేనే తన భర్త హరి భోజనం చేసి ఆఫీసు కి వెళ్ళగలడు... ఇది వాళ్లకు మామూలే... ఒక రకంగా మిగిలిన కుటుంబ సభ్యులు నయము... ఎవరి తో ఏ సంబంధాలు పెట్టుకోరు... ఇలా

వాళ్లు ఫోన్లు కూడా కష్ట పడి చేయరు... ఒక్క మాటలో చెప్పాలంటే అసలు కలుపుగోల్తనం గానే ఉండరు...


ఊరకె రారు మహానుభావులూ...ఇంకా పక్కింటి వాళ్లు....!

అస్సలు సంగతి చెప్పింది Mrs. గోమతి... "ప్లీజ్ డోంట్ బృంగ్ యువర్ మదర్ ఇన్ లా హియర్... లెట్ హర్ గెట్ బెటర్... హోప్ యు అండర్ స్టాండ్" (మీ అత్తను ఆసుపత్రి నించి ఇక్కడికి తీసుకు రావద్దు...పూర్తిగా కోలుకొనే వరకు...అర్ధం చేసుకో) అని మరు క్షణం లో పక్కింట్లో కి వెళ్ళి తలుపు వేసుకున్నది... "


తులసి, నీ పిన్నినమ్మ , నీ మంచి ఆలోచించి చెబుతున్నాను ... హరికి రావాల్సిన మొత్తం రాసిందా లేదా మీ అత్త... ఇవాళ ఆసుపత్రిలో తేల్చుకో "...


తులసికి కళ్ల నీళ్ళు వచ్చాయి...

ఫోన్ కట్ చేసి పెట్టేసింది ...

ఈ మనుషులు హెల్ప్ చేస్తున్నారా, తన ను పీక్కు తింటూ ఉన్నారా?.. కంగారు గా ఇల్లు తాళం పెట్టి కెరీర్ తీసుకుని ఆసుపత్రికి పరుగులు తీసింది...


వారం తరువాత తన ఆప్తురాలైన పద్మిని తన ఇంటికి వచ్చింది... తులసి రోజూ లాగే పని తో పాటు అటు వాట్సప్ లో వస్తున్న మెసేజస్ తో సతమతమవుతున్నది... ఇరవై నాలుగు గంటలు సరిపోవడం లేదు తులసి కి... వాట్సప్ వచ్చాక !! ఇంటి పని, వంట పని తో పాటు ఇది కూడా పనే... ఎవరు కనిపెట్టారో కాని.... తన పని అయిపోతోంది...


మామూలుగా వచ్చే మెసేజెస్ కాక ఉచితంగా బహుమతి ఇస్తామని, అది గెలుచు కోవాలని అంటే ఒక పది గ్రూపుల తో షేర్ చేయమని, షిర్డీ సాయిబాబా గారు మనకు అదృష్టం తెచ్చి పెడతారు, గంట లో ఏదో శుభవార్త వింటామని...కాకపోతే ఇది జరగాలంటే ఒక ఇరవై మంది ఫ్రెండ్స్ కు ఆ మెసేజ్ షేర్ చేయమని...ఈ రకంగా వివిధ సవాళ్లు విసురుతూ ఉంటుంది వాట్సప్... అందులో కూడా తాను వెనకపడి ఉంది...అందరికీ దక్కుతున్న అదృష్టం తన అసమర్థత వలన కోల్పోతోంది అని తులసి కి బాధ...

ఆ బాధ పద్మిని ని చూడగానే సంతోషముగా మారింది... తులసి కి ఆ రోజు హాయిగా గడిచింది... ఫోను తో కాకుండా తనకి ఇష్టమైన మనిషి తో...

అది కూడా కరువైందా ఈ కాలంలో???


అనుకోకుండా పద్మిని కి ఆ రోజు స్కూల్ లో సెలవు ప్రకటించారు... ఎలాగూ ఇంటి నుంచి బయట పడింది కాబట్టి స్నేహితురాలి ఇంటికి వచ్చింది...


స్నేహితులు ఇద్దరూ ఆ రోజు చాలా కాలం తర్వాత మనసు విప్పి మాట్లాడుకున్నారు... వాళ్లది చిన్నప్పటి స్నేహం... దేవుడి దయవల్ల ఇంకా కొనసాగుతూనే ఉంది... పద్మిని ఒక టపాకాయ... ఎవరి పద్ధతి అయినా నచ్చక పోతే వెంటనే వాళ్ల పై పేలు తుంది. తులసి కి లౌక్యం తెలీదు.. నోరు లేదు...స్వతహాగా మంచి మనసు... కాని ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక, ముఖ్యంగా అందరిలా సోషల్ మీడియాలో కాంటాక్ట్సు, సెల్ ఫోన్ లో అందరి తో 'ఆ హ హా' అని అంటూ వెనకాల నిందించటం చేతకాదు... తిక్కగా జరిగే ఎన్నో వాట్సప్ సంభాషణలకు తిక్కగానే స్పందించే సమయస్ఫూర్తి తులసి కి లేదు...


సాయంత్రం తిరిగి వెళ్తూ నాలుగు పెట్టింది తులసిని తనదైన స్టయిల్ లో పద్మిని... తులసి కి కొన్ని గీతా పాఠాలు బోధించింది...


ఆ మర్నాడు రమ వచ్చి అమాంతం తులసి ని సూపర్ మార్కెట్ లో "హాయ్" అంటూ వెనక నుంచి గట్టిగా వాటేసుకుంది... తులసి కి ఏ మాత్రం రమ వైఖరి నచ్చదు... బలవంతంగా అల్లుకుపోయేరకం... తన కొడుకు హై స్కూల్ లో చదువుతున్నప్పుడు ఒక దుర్ముహూర్తం లో పరిచయమై శని గ్రహంలాగా అప్పటి నుండి పీడిస్తూనే ఉంది...


"ఏంటి తులసి, చిక్కి పోయావు? అయ్యో, ఏం సినిమా కష్టాలు తల్లి నీవి... ఉన్నదంతా పెద్దవాళ్లకు పెడితే నువ్వేమి అనుభవిస్తావు... గోమతి ఆంటీ నాకంతా ఎప్పటి కప్పుడు చెబుతుంది కాబట్టి సరిపోతోంది... లేదా నీకు ఫోను చేసయినా నీ మంచి చెడు కనుక్కొనేదాన్ని అనుకో... ఇంతకీ హాస్పిటల్ బిల్ ఎంత అయిందేన్టి? ఏం పాపం ఈ సారి మీ అత్తను మీ ఆడపడుచు ఇంటికి తీసుకెళ్ళారట... ఆ మాత్రం భయం ఉండాలి ఇరుగు పొరుగు అంటే... చూశావా గోమతి ఆంటీకి, మా అందరికీ నువ్వన్టే ఎంత ప్రేమో... "


"దేవుడా, కాపాడు తండ్రి"... తులసి లోపల నుండి ఈ కేక బయటకు రాకుండా గొంతు లోనే అతి కష్టం మీద ఆగిపోయింది...


క్షణంలో కళ్ళ ముందు పద్మినీ మెదిలినది... ఆమె వల్ల వేయించిన గీతా పాఠం తులసికి ఇక్కడ ఉపయోగ పడింది...


" అన్నట్టు రమా, మీ వారు రోజు రాత్రిళ్ళు లేటుగా వస్తారట కదా... బాగా తాగుతారుట కదా... ఎలా మ్యానేజ్ చేస్తున్నావోయ్... నోటికి వచ్చింది మాట్లాడుతూ తులసి కావాల్సిన సరుకులు కొంటోన్ది... రమ నిర్ఘాంత పోయి చూస్తుంటే 'గోమతి ఆంటీ ఎప్పుడో అన్నది' అని తులసి నవ్విన్ది... రెండు నిమిషాల తర్వాత తల ఎత్తి చూస్తే అక్కడ రమ కనిపించలేదు...


ఆ సాయంత్రం తన కొడుకు స్కూల్ లో పరిచయమైన నలుగురు పేరెన్ట్స్ తో ఏర్పడిన నాలుగేళ్ల నాటి వాట్సప్ గ్రూపు నుంచి రమ తొలగిపోయింది ... "అమ్మయ్య... ఒకళ్లు తగ్గినా తగ్గినట్లే..." అని తులసి నిట్టూర్చిన్ది... కానీ తులసి కి తను రమ తో మాట్లాడిన తీరు నచ్చ లేదు... లోపల కుళ్ళి కుళ్ళి తల పోటు తెచ్చుకుంది... తన స్నేహితురాలిని తిట్టుకుంది... "పద్మిని అలాంటిదే... నువ్వు కాదుగా"... అలా ఎలా మాట్లాడావు... అని

తన మనసు నిందిస్తోంది...


ఆ రాత్రి నిద్ర పోలేదు తులసి... తెల్లారి తను కూడా ఆ గ్రూపు నుంచి తొలగి పోవాలనుకుంది ...పొద్దున్న కల్లా పాతిక మెసేజ్లు ఉన్నాయి ఆ గ్రూపులో... భయం వేసింది తులసి కి...


జరగ రానిది ఏదైనా జరిగినదా..."భగవంతుడా".. కాఫీ పెడుతూ కంగారు గా చూసింది... వాసవి రమను తిరిగి గ్రూపు లో చేర్చటమూ, గ్రూపులో ఉన్న అందరూ రమకు 'వెల్కం' చేశారు అన్నది చూసి తులసి కి అర్థం కాలేదు... ఇప్పుడు తను ఏమీ చెయ్యాలి... రమకు స్వాగతం పలకాలా... ఎలా... ఈ "అవుట్ ఆఫ్ సిలబస్" స్థితి లో కాఫీ గిన్నె కాస్తా మాడిపోయింది... ఇంకా ఎన్నో పాఠాలు నేర్చు కోవాలి ...


ఆ శనివారం అనుకోకుండా ఒక పది రోజుల కోసం ఆస్ట్రేలియా నుండి దీప్తి ఇంటికి వచ్చిన్ది... కాస్త ఇంట్లో సందడి వచ్చింది... ఏదో సరదాగా దానికి ఇష్టమైనవన్ని చేసి పెడుతూ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పటం, వినటం లో ఎంత ఆనందం ఉంటుందో...

పది రోజులు ఇట్టే గడిచి పోతాయి... రెండేళ్లు అయింది దీప్తి ఇంటికొచ్చి... హరి కూడా దీప్తి వచ్చిన సందర్భంలో ఉషారుగా ఉంటున్నారు...

లేకపోతే ఎవరి గోల వాళ్లది...


కొడుకు కి పరీక్షలు ఉండే సరికి వాడు హాస్టల్ లోనే ఉండి పోయాడు...

ఒక విధంగా చెప్పాలంటే మొగవాళ్లు అదృష్టవంతులు... ఆడవాళ్ల మధ్య నడిచే సంభాషణలు వాళ్ల మధ్య ఉండవు... ఎంత సేపు కార్లు, కొత్త ఫోన్లు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలతో కూడిన మాటలు... అధిక ప్రసంగం ఇన్టా బయటా కూడా చేయరు...


దీప్తి వెళ్లే లోపల చాలా పనులు ఉన్నాయి... కొన్ని కొత్త బట్టలు కొనాలి... అక్కడ తెలుగు వాళ్ళు ఏదైనా ఫంక్షన్ కి పిలిచినా లేదా ఏ దేశీ కార్యక్రమానికి-- మన ఇండియన్ కార్యక్రమానికి వెళ్లినా తగిన సాంప్రదాయ దుస్తులు లేవు... తను పూను కుంటే తప్ప దీప్తి కి పట్టదు... బజారు వెళ్లి కావాల్సినవి తెచ్చు కోవాలన్నది... కూతురి ని వదిలేస్తే అది కూడా ఫోను లోనే ఉంటుంది అందరి లాగా...


పని లో పని ఆ దేశీ బట్టలు ఎలాగైనా దీప్తి చేత ఇక్కడ ఉండగా వేయించి మంచి ఫోటోలు తీస్తే రేపు పెళ్ళి సంబంధాలు చూసేందుకు పనికి వస్తాయనుకుంది తులసి....


దానికంటే ముందు దీప్తి మనసు లో ఎవరైనా ఉన్నారా అన్నది తెలుసు కోవాలి... అక్కడ ఎలా ఉందొ తెలుసు కోవాలి... ఫోను లో వేల్టికి తిన్నావా, తాగావా అని ఆడగడం తప్ప దీప్తి ఆస్ట్రేలియా నించి కాల్ చేస్తే ఇంకేమీ పెద్ద మాట్లాడుకోవటం కుదరటం లేదు...


ఇంకా నాలుగు రోజుల లో దీప్తి ప్రయాణం... హరి వాళ్ల శేఖర్ మావయ్య కూతురి నిశ్చితార్థం పిలుపు వచ్చింది... ఊళ్లోనే... వెళ్ళక తప్పదు... మరునాడే ఫంక్షన్...

ఆదివారం అయ్యేసరికి అందరు బంధువులు, కొంత మంది కామన్ ఫ్రెండ్స్ కలిశారు... ఫంక్షన్ లో.... హరి కి హాయిగా కాలక్షేపం అయిపోయింది కాని...

అదేమిటో... ఎక్కువ మంది ఆడవాళ్ళకు మటుకు ఇంటా బయటా కూడా వాయింపు తప్పదు కదా...


" నీ కూతురు వచ్చినట్లు కూడా ఎవరికీ తెలీదు... అప్పుడే వెళ్లి పోతుందిట కదా... దానికి పెళ్ళి చేయవా తులసి? అని ఒకళ్ళు... "నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఏమె దీప్తి, మీ అమ్మా నాన్న నీ పెళ్ళి మాటే ఎత్తటం లేదు" అని ఇంకొకళ్ళు... "మేమంతా ఫంక్షన్ కు బ్లూ చీరలు కట్టు కోవాలని ప్లాన్ చేసాము... మీ అమ్మ వాట్సప్ కూడా చూడదా... దేనికి స్పందించదు దీప్తి" అని మూడో వాళ్లు, "కనీసం నాయనమ్మకు మనవరాలును తీసుకొచ్చి చూపించలేదు" అని అదే టైమ్ కి హాల్లో కి వచ్చిన తులసి ఆడపడుచు వేసిన చురక... తులసి అక్కడ నిలబడ లేక వాష్రూమ్ లోకి జారుకుంది...


ఎన్నో సార్లు తను సంజాయిషీలు చెప్పింది అందరికీ కాని వీళ్ళెవరు మారరు... పోనీ తను కూడా అలాగే మాటల తూటాల తో ఎదిటి వాడిని పొడ్డుద్దామంటే తన సంస్కారము ఒప్పుకోదు...ఫంక్షన్ పిలుపు రాగానే ఇదంతా ఊహించింది తులసి... టెన్షన్ పడుతూ ఉంది...


దీప్తి వచ్చిందని వెంటనే ఊళ్లో ఉన్న బంధువులకు చెప్తే ఇంక ఫోను మోగటం ఆగదు... వాళ్ళైనా ఇటు వస్తారు లేదా తనే కూతురి ని అందరిళ్ళకు తిప్పాలి... హాయిగా కబుర్లు చెప్పుకుంటే వేరు కానీ శృతి మించి పోతారు... వ్యంగ్యం, ఈర్ష్య, కుతూహలం తో కూడిన మాటలు తప్ప ప్రేమగా మాట్లాడరు ...


ఎవరి పిల్లల గురించి వాళ్ళకే పూర్తిగా తెలియని రోజులు ఇవి... కాని ఈ సెల్ ఫోన్లు, ఫేస్ బుక్ వగైరాలలో ఎదిటి వాడిని 'ఫాలో ' అవుతూ గడుపుతున్నారు అందరూ...ఏమీ ఆనందం ఉందో అందులో తులసి కి బోధ పడటం లేదు...


ఫంక్షన్ అని కూడా చూడకుండా మొదలు పెట్టారు కదా ఇక్కడ కూడా... కళ్లు తుడుచుకొని, మొహం కడుక్కొని వాష్ రూమ్ నించి వస్తున్న తులసి కి దీప్తి గొంతు వినిపించింది...


"నా పెళ్లి ఫిక్స్ అయితే మీ అందరికీ మా అమ్మా నాన్న సంతోషంగా చెపుతారు... నేను బామ్మను చూడకుండా తిరిగి వెళ్తున్నానని నీకు ఎవరు చెప్పారు అత్తా? అనిత అక్కకు ఇంత లేటుగా ఇవాళ ఎన్గేజ్మెంట్ అవుతోంది... తన కీ ఎవరి తో నైనా బ్రేక్ అప్ అయిందా? మా అమ్మ మీతో ఎప్పుడైనా ఇలా మాట్లడిందా? వై డూ యు హర్ట మై అమ్మ? "


దీప్తి అన్న మాటలు విని అందరూ షాక్ తిన్నారు... ఇంతలో బ్రాహ్మడు మంత్రాలు చదవటం ఆరంభించాడు... దీప్తి తన తల్లి చేయ్యి గట్టిగా పట్టుకుని సరాసరి తండ్రి హరి

ఉన్న చోటికి వెళ్లి కూర్చుంది... ఇక్కడ ఆడవాళ్ళ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్లు బాగా బిజీ అయిపోయాయి పాపం! అటు ఎన్గేజ్మెంట్ ఫొటోలు ఆ తరువాత ఫంక్షన్లో జరిగిన-- దీప్తి వృత్తాంతం--

బ్రేకింగ్ న్యూసు షేర్ చెయ్యాలి కదా... అది వాళ్ల కనీస బాధ్యత!


చూస్తూ చూస్తూ దీప్తి ఆస్ట్రేలియా కు తిరిగి వెళ్ళి పోయి రెండు వారాలు అయింది... తులసి కి ఈ రెండు వారాలు ఎటు వంటి ఫోన్లు మెసేజ్లు రాలేదు... తన దినచర్య ప్రశాంతంగా సాగుతోంది... ఒక వారం అయింది అత్తగారిని తిరిగి ఇక్కడ దింపి వెళ్లింది ఆడపడుచు...


ఒక ఆదివారం అడిగాడు హరి - " అన్నట్లు తులసి, మా అక్క ఏంటి సరిగ్గా మాట్లాడలేదు మొన్న మన ఇంటికి వచ్చినప్పుడు?"


"మా ఆయనకు ఈ ప్రపంచానికి సంబంధం లేదు... మరి ఇది ఏమిటీ"...

అనుకుంది తులసి... తన అక్క అనే సరికి బాగా గమనించి గుర్తుంచుకోని మరీ అడుగుతున్నారు"...


"ఆ రోజు నిశ్చితార్థం లో మన దీప్తి నా తరఫున వకాల్తా పుచ్చుకుంది కదా... మీరు ఏమీ పట్టించుకోరు గా... ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న అత్తయ్యగారు కి కూడా జరిగింది తెలుసు... "కొంచెం లౌక్యం, నోరు తెచ్చుకో తులసి లేదా బతక లేవు" అని అన్నారు... నువ్వు ఆ మాత్రం మారితే ఈ ప్రపంచం ఏమీ ఆగిపోదు"... ... దీప్తి పెళ్లి చక్కగా జరుగుతుంది... అందరూ వస్తారు... చాలా ఎక్కువ ఆలోచిస్తావు... నీకే మంచిది కాదమ్మ..."


ఎప్పుడూ ముక్తసరి గా ఉండే ఆవిడ కూడా "నా కూతురు కి నోరు ఎక్కువ తులసి, పట్టించు కోకు, చేతనైతే నువ్వు కూడా తిరిగి అను.. అని అన్నారు... అదే మాట మీరు అంటే నాకు ఏనుగంత బలం వస్తుంది"... మొబైల్ చూస్తూ ఇటు ఒక చెవి పడేసీన హరి ని చూసి ఒక్క సారి తులసి కి పిచ్చి కోపం వచ్చింది... అతి కష్టం మీద తమాయించుకుంది.. బాధ పంచుకొనే తీరు ఇదేనా అనుకుంది... అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ ఉంటే ఒక్క సారి కూడా తన వంక హరి ఏ రోజు చూడరు ... చూపు ఎప్పుడూ ఆ మాయ దారి సెల్ ఫోను మీదే...

పైపెచ్చు ...

"తులసి, నిన్నే... నీకు ఇప్పుడే బ్రహ్మానందం కామిడీ సీన్స్ ఫార్వర్డ్ చేశాను... చూడు... తెగ నవ్వచ్చు..." మొగుడు ఇచ్చిన బదులుకు లాభం లేదనుకొని

తులసి అక్కడి నుండి లేచి బాల్కనీ లోకి వెళ్లిపోయింది...


"సరే ఇప్పుడేమంటావు తులసి? కాసేపటికి బాల్కనీ లో బట్టలతీగ మీద ఉన్న టవల్ తీసుకుంటూ తన భార్యని కదిలించాడు హరి ...


నా బంగారు తల్లి దీప్తి తో చెప్పి దాని పెళ్లి చేద్దామా, చెప్పు? నీతో చెప్పటం మరిచాను... ఆ మధ్య నేను ఒక కొత్త వాట్సప్ గ్రూపు లో చేరాను... మా హై స్కూల్ బ్యాచ్ స్టూడెంట్స్ పెట్టింది... అందులో పాత ఫ్రెండ్స్ చాలా మంది తగిలారు... ఫ్యామిలీ ఫోటోలు పెట్టమంటే అందరం పెట్టాము... మన బంగారం ఆనంద్ గాడి కొడుకుకు నచ్చింది... ఆస్ట్రేలియా లోనే మంచి జాబ్ లో ఉన్నాడు... బాగున్నాడు... మనం రెడీ అంటే వాళ్లు రెడీ... "


టేకిట్ ఈజీ తులసి ... అలా వాక్ వెల్దాము, వస్తావా? స్నానం చేసి వస్తాను" అన్నాడు...

"అత్తయ్య గారికి చెప్పొస్తాను... " తులసి జవాబు ఇచ్చింది...


"నీ బాధ నాకు అర్థం కాదు అనుకుంటావు... ఇప్పుడున్న కాలంలో ఫోన్లు, సోషల్ నెట్ వర్కింగ్ అనేది అనివార్యంగా మారింది... అందరి తో పాటు మనమూ... కాకపోతే బంధు బలగం ఉన్న వాళ్ళకు కష్టమే... నీది మరీ సున్నితమైన మనసు తులసి... నేను రోజు ఇంటికి వచ్చాక ఇదే శోది కదా నాకు ... సరదాగా ఎప్పుడు ఉన్నామో గుర్తులేదు... నిన్ను ఏమీ అనలేక పూర్తిగా వినలేక నీవు తిట్టుకునే అదే సెల్ ఫోన్ లో నా కాలక్షేపం నేను చేసుకుంటూ ఉన్నాను... ఇష్టం లేనిది నచ్చనిది నేను చూడను ...


వీలైతె కాసేపు నవ్వుకునేవి చూస్తాను...అంతే... మాటి మాటికి అమ్మ అడ్డం పడుతూ ఉంటుంది... నీ లాగే నేను ఉంటే ఎలా?? మనసు ని మళ్లించు కోవాలి కదా... ఫ్రెండ్స్ దగ్గర కు వెళ్లి మెల్లగా ఇంటికి రావచ్చు... తిని పడుకోటానికి ... కాని నువ్వే గుర్తు వస్తావు ... పని అయ్యాక సరాసరి ఇంటికి వస్తాను...నువ్వు అనుకున్నట్లు ఒక చెవి వేస్తాను నువ్వు చెప్పే రోజు వారి ఫోను, వాట్సప్ శోది మీద... రెండు చెవులతో వింటే నా బుర్ర తరువాత పని చేయదు...


నీ అమాయకపు బుర్ర కి ఇది కూడా అర్థం కాదు...

చెప్పొచ్చేదే మిటంటే...


ఈ వాట్సప్ రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని అనుకుంటే పార్ట్ టైమ్ జాబ్ చెయ్యి, ... చదువు కున్నావు కదా ... ఆ తెలివితేటలు మా ఆవిడ కు ఉన్నాయని నాకు తెలుసు... బయటకు వెళ్లకుండా...


ఇంటి నుంచి ఆన్ లైన్... నేను చూసి పెడతాను... ఉద్యోగం...

లేదా అమ్మ చెప్పింది బావుంది... మేమంతా ఉన్నాం నీ వెనుక... నీ కే భయం లేదు... అందరి మాటలు ఇలా విని అలా వదిలెయ్యి... కష్టంగా ఉంటే తిరిగి మాట్లాడు...

సోషల్ మీడియా మరియు నిత్యము మారుతున్న సెల్ ఫోన్ సాంకేతిక పరిజ్ఞానం మన జీవితాలనే మార్చి వేసింది ... పోను పోను ఇంకా ఎంత మారనున్నదో ఎవరు చెప్పగలరు?

ఇవాళ మన పిల్లల తో ఎక్కడున్నా హాయిగా మాట్లాడుకో గలుగుతున్నాము... సెల్ ఫోన్ పుణ్యమా అని...


రేపు మన మనవరాళ్లు, మనవళ్ళ తో ఆటలు కూడా అందులో నే ఆడుకోవాలి తులసి... దీప్తి పెళ్లి సన్నాహాలు కూడా వాట్సప్ లేకుండా చేయలేము... సరిగ్గా వాడుకుంటే మనకు చాలా ఉపయోగము...


జీవితం చాలా చిన్నది తులసి... సంతోషంగా ఉండాలి... చుట్టూ ఉన్న వాళ్లు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు... అది లోకం తీరు... దీప్తి, పద్మిని లాగా ఉండాలి నువ్వు... "


గంట నుంచి తులసి కి పని సాగడం లేదు... గోమతి ఆంటీ ఇంట్లో పొద్దుటినుండి ఏదో హడావుడిగా ఉంది... చెవులు చిల్లులు పడే మ్యూజిక్ పెట్టారు... మధ్యాహ్నానికి ఇంకా ఎక్కువ అయింది... తలుపు తీసి తులసి తిన్నగా వాళ్ల కాలింగ్ బెల్ కొట్టింది...


"ఇప్పటికే ఆరు గంటలు భరించాము... మా అత్తగారికి అసలే అనారోగ్యం మీకు తెలుసుగా అని గోమతి ఆంటీ కళ్ల లోకి సూటిగా చూస్తూ నిర్భయంగా తులసి మాట్లాడుతూ ఉంటే రంగస్థలం సినిమా లో రంగమ్మత్త లా కనిపించింది... రేపు పొద్దున ఆవిడ కి ఏదైనా వస్తే ఈ సారి హాస్పిటల్ నించి ఇక్కడి కే వస్తుంది. ఇదే ఆవిడ ఇల్లు... ఆలోచించు కొండి ఆంటీ " అని తన ఇంటి తలుపు ఠక్కున వేసుకున్నది తులసి... ఇంకో రెండు గంటల పని హాయిగా నిశ్శబ్దం లో చేసుకుని ఆ రోజు కి పని ముగించింది... అత్తగారు ఆద మరచి నిద్ర పోయి లేచింది...


ఆ రోజు సాయంత్రం వాసవి కాల్ చేసింది - "హాయ్ తులసి, హౌ ఆర్ యు? ఉన్నవి చాలకా? నీకెందుకు ఈ పార్ట్ టైమ్లు???"


"హాయ్ వసు, ఐ యామ్ ఫైన్ డియర్... నీ లాంటి వాళ్లని తీసుకో లేరుగా, సో నా లాంటి వాళ్లను వెతికి టాలెంట్ ఉన్న అందరినీ తీసుకున్టున్నారు... రేపు నా ఫస్ట్ మన్థ శాలరీ వస్తుంది... పార్టీ ఇస్తున్నా అందరికీ... డోంట్ మిస్.. వాట్సప్ లో టైము, ఎక్కడనేది పెడతా లే " ...


ఫోను పెట్టేసి వెనక్కి తిరిగే సరికి హరి సోఫా లో షూస్ ఇప్పుతూ కనిపించాడు...


"టి తెస్తాను, మొహం కడుక్కొని రండి" అని నవ్వుతూ కిచెన్ లోకి వెళ్ళిన తులసిని చూసి హరి తన ముద్దుల కూతురు దీప్తి కి మెసేజ్ చేశాడు - "ఒక నెల నుంచి అమ్మ చాలా హ్యాపీ గా ఉంది బంగారం... ఐ యామ్ ఆల్సొ వెరీ హ్యాపీ" అని స్మైలీలు పెట్టాడు.


********************************

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం

పూర్తి పేరు: శ్రీమతి దాసు రాధిక

వయసు: 52 సం.

నివాసం: బెంగుళూరు ( ప్రస్తుతము)

స్వస్థలం: తెనాలి

చదువు: BA English Litt., B.Ed

వృత్తి: గృహిణి. 1993-1997 హై స్కూల్ టీచర్ గా పని చేసిన అనుభవం.

ప్రవృత్తి: సంగీతం వినటం, పాటలు పాడటం

పాడుతా తీయగా ETV లో రెండో బ్యాచ్ 1997 లో క్వార్టర్ ఫైనలిస్ట్.

స్కూల్, కాలేజి లో పాటలు, నాటకాల( ఇంగ్లీషు, తెలుగు) అనుభవం.

కథలు వ్రాయటం, ఇంగ్లిష్ - తెలుగు భాషా అనువాదాలు.

ఇటీవలే ఛాంపియన్స్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ నుండి , ఆసియన్ వరల్డ్ రికార్డ్స్ వారినుండి సర్టిఫికేట్ లు పొందాను.












101 views0 comments
bottom of page