top of page

గిల్లికజ్జాలు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Gilli Kajjalu' New Telugu Story Written By Dasu Radhika

రచన: దాసు రాధిక


"ఆరడుగుల అమితాబ్ బచ్చన్ లాంటి వాడ్ని చేసుకుందామనుకుంటే ఈ జన్మ కి దేవుడు అయిదడుగుల నాలుగు అంగుళాల బుల్లెట్ నిచ్చాడు...పొట్టివాడు గట్టివాడని సామెత అక్షరాల నిజం...అదే మీ నాన్న" అని కొడుకు తో ఇన్నాళ్టికి చెప్పుకునే అవకాశం దొరికినందుకు జానకి ఏ మాత్రం మొహమాటం లేకుండా తన భర్త సుబ్బు కి రకరకాల బిరుదులిస్తోంది...


"నేనడిగిందేంటి, నువ్వు చెప్తోందెంటమ్మ??" అని యశ్వంత్ ప్రశ్నిచ్చాడు... "నీకు నాన్నే అని ఎలా తెలిసింది పెళ్లి చేసుకునేటప్పుడు?

నాన్న, కాస్త టీవీ మ్యూట్ పెట్టి నేనడిగినదానికి నువ్వైనా చెప్పు, నీకు అమ్మే అని ఎలా తెలిసింది?"


"ఆయనేమ్ చెప్తారో నాకు తెలుసులే...నువ్వనుకుంటున్నట్లు మా కాలం లో పది సార్లు కలిసి తిరగటాలు అవి లేవు రా.. అక్కడికక్కడే మ్యాగీ టూ మినిట్ నూడిల్స్ లాగా, వన్ వర్డ్ ఆన్సర్ లాగా యెస్ ఆర్ నో చెప్పేయ్యాలి...జీవితాంతం కలిసి ఉండేందుకు నిర్ణయం తీసుకునేందుకు ఇచ్చే సమయం రెండే నిమిషాలు..."


"అమ్మా, సోది ఆపి, అస్సలు పాయింట్ కి రామ్మా..."


"యషు, నన్ను కాదనే దమ్ము మీ నాన్నకెక్కడుందిరా? నా లాంటి చదువుకున్న, అందమైన అమ్మాయి మళ్లీ దొరకద్దు...ఆ రోజుల్లో అస్సలే దీపికా పడుకొనే లాగా సన్నగా ఉండేదాన్ని రా..."

"బుల్లెట్ లాగా వెళ్తోంది ఎవరో ఇందాకటినుంచి వింటూనే ఉన్నాను... యషు దగ్గరైన నిజాలు మాట్లాడదాము జాను" అని నసిగాడు సోఫా లొనే వాలుతూ సగం బద్ధకంగా సుబ్బు…


"ఒరేయ్ మీ నాన్నేమో "ఆరేసుకోబోయి పారేసుకున్నాను" అనే మాస్ పాటలకు తై తక్కలాడుతూ ఎంజాయ్ చేసే రకం, నేనేమో 'కె.విశ్వనాథ్ సప్తపది' లాంటి క్లాస్ మనిషిని...

ఎదో ఆ రోజు అలా కుదిర్చేసాడు ఆ భగవంతుడు..."


"కొంచెమైనా రొమాంటిక్ గా చెప్పలేవా అమ్మా," అని యషు అడిగితే సుబ్బు జవాబిచ్చాడు... "ఆ పదం మీ అమ్మ డిక్షనరీ లొనే లేదు లే..."


యషు ఈ సంభాషణ తో విసుగు చెంది "అస్సలు మీరిన్నేళ్ళు కలిసి ఎలా ఉన్నారు? అవసరేముముంది?" అని కొత్త అంశం రేపాడు...


"మా కాలం డిక్షనరీ లో విడిపోవడం అనే మాట లేదురా...సర్దుకుపోవటమే మా సిద్ధాంతము... ఇప్పటి పిల్లలు ఎదో కలిసి తిరిగితే చాలా తెలుసుకోవచ్చు అనుకుంటున్నారు...కొన్నాళ్ళు కలిసి ఉండి ఇష్టమైతే పెళ్లి లేదా లేదు అని మూర్ఖముగా ఆలోచిస్తూ జీవితాలను పాడు చేసుకుంటున్నారు... ఎన్నేళ్లు కలిసి ఉన్నా ఎదుటి మనిషిని నిత్యం ఇంకా అర్ధంచేసుకునే అవసరం ఎంతో ఉంటూనే ఉంటుంది యషు..."


"సరె, మీ నాన్న రొమాన్స్ అంటే గుర్తొచ్చింది... విను... మా పెళ్లయిన కొత్తల్లో బజాజ్ స్కూటర్ ఉండేది ఆయనకు... దాని మీదే తిరిగేవాళ్ళం...షికార్లు అనుకునేవు... ఎంతో రొమాంటిక్ గా బంధువుల ఇళ్లకు లేదా గుళ్లకు తిప్పేవాళ్ళు..." వెటకార స్వరం లో గట్టిగా ఇచ్చింది మొగుడికి...


"స్కూటర్ మీద కూర్చొటం కూడా రాదు మీ క్లాస్ అమ్మ కు" అని సుబ్బు సోఫాలో నుండి అమాంతం లేచి నుంచుని మరీ వెటకారంగా అన్నాడు...


"వస్తున్నాను అక్కడికే"... అంది జానకి..." నాకు నిజంగానే మొగుడిని అతుక్కుని భుజం మీద చేయివేసి కూర్చొటం రాదు ... ఆయన రొమాన్సు ఏ పాటిదో చెప్తా విను... మంచి ట్రాఫ్జిక్ ఉన్న తార్నాక రోడ్డుపై ఒక పక్కగా స్కూటర్ ఆపి, ఆరాధన థియేటర్ ఎదురుగా అనుకో... 'ఇప్పుడు నువ్వు నవ్వాలి జాను, అప్పుడే మనం ఇక్కడ నుంచి వెళ్ళేది...' అన్నారు... సాయంత్రం వేళ కిట కిట లాడుతూ జనం ...అందరూ మమ్మల్నే చూస్తున్నారనిపించింది... అస్సలే సరిగ్గా కూర్చోలేదని ఒక రెండు నిమిషాల ముందు స్కూటర్ నడుపుతూ కోపడ్డారు... 'మీ అమ్మ వాళ్ళు మొగుడి వెనకెలా కూర్చోవాలో నేర్పలేదా?' అన్నారు... మా ఫ్రెండ్స్ ఎవరూ కూడా అప్పట్లో, నాకన్నా ముందు పెళ్లయిన వాళ్ళు ఇటువంటివి చెప్పలేదు నాకు...ఏడుపొచ్చింది... ఆ తర్వాత నవ్వమంటే నాకేం అర్ధంకాలేదు... అదే అన్నాను... 'ఏదయినా జోక్ చెప్పండి నవ్వుతాను' అని... అలా ఒక అరగంట అక్కడే ఉన్నాము...


ఫస్ట్ షో జనం లోపలికెళ్లిపోయారు... కొంచెం ఖాళీ అయిందక్కడ... ఆకలి మొదలైంది...

'మీరు నవ్వండి, నేను నవ్వుతా' అన్నాను...


మీ నాన్నేమో కొండవీటి సింహం లో ఎన్ టీ రామారావు లాగా 'నువ్వు నవ్వితేనే ఇంటికి తీసుకెళ్తా' అని స్వరం పెంచారు...


ఇక నాకు అనిపించింది...ఎదో తేడాగా ఉన్నారు... ఎవరూ చెప్పలేదు మాకు, మోసం చేశారో ఏమో... ఈ విషయం మా అమ్మా నాన్నకు తెలిస్తే వాళ్లేమైపోతారు... ఖచ్చితంగా ఇది పిచ్చే...

ఇంకో అరగంటయ్యాక తనకీ ఆకలి వేసి మెల్లగా నన్నెక్కించుకొని ఇంటికెళ్లారు..."


సుబ్బు కూడా అవతలికెళ్లి నవ్వు కుంటు న్నాడు... అవును, తాను అప్పుడు అలా ఎందుకు చేసాడు?


యషు రావటం చూసి వరండా లోకి, ఉక్రోషం తో సుబ్బు మొదలు పెట్టాడు - "ఆ... మీ అమ్మ ఏమి తక్కువ తినలేదులే... షాలిని ఆంటీ కూతురి ఫస్ట్ బర్త్డే పార్టీ రొజు రాత్రి తిరిగి వస్తునప్పుడు లిఫ్ట్ లో ఇరుక్కుపోయాము...భయం తో పెద్దగా ఏడ్చి, గోల చేసి ఆ హోటల్ వాళ్ళ ముందు నా పరువు పోగొట్టింది గా... లిఫ్ట్ నుండి బయట పడ్డాక కూడా ఎవరో పోయినట్లే ఏడ్చి రభస చేసింది... ఎడవలేక వాళ్ళందరిముందు నవ్వానని నెల రోజులు సాధించింది తర్వాత నన్ను... మరి అది పిచ్చి కాదా???" హిమాలయ పర్వతమెక్కినంత ఆనందం కలిగింది సుబ్బుకు...ముప్పై ఏళ్ళ నుండి కాపురం చేస్తుంటే కొడుకు తో లేని పోనివి చెబుతుందా???


యషు కు అస్సలేమి అర్ధం కావటం లేదు... అమ్మా నాన్నల అనుభవం విని, అర్ధం చేసుకుని తాను కూడా పెళ్లికి సిద్ధమని తల్లితండ్రులకు చెబుదామనుకున్నాడు... తన స్నేహితులు చాలా మంది పెళ్లిళ్లు అయిపోయాయి... కొంత మంది విడిపోయారు కూడా...మరి ఇంకొందరు పెళ్లి అవ్వకుండా కలిసుంటున్నారు... ఒకళ్ళిద్దరు అమ్మాయిలు తన ముందు పెళ్లి ప్రస్తావన పెట్టారు... కానీ అది అక్కడే ఆగిపోయింది...


యశ్వంత్ చేసేది హార్డ్ వేర్ ఉద్యోగం... సంపాదన పరంగా సాఫ్ట్వేర్ తో పొలికే లేదని చెప్పాలి... ఈ రోజుల్లో ప్రేమ డబ్బు లోనుండే పుడుతుంది కాబట్టి యశ్వంత్కు అంత అదృష్టం కలగలేదు...

అస్సలు గర్ల్ ఫ్రెండ్స్ ను భరించే అంత సీన్ యశ్వంత్ కి లేదు... దానికి బ్యాంక్ బ్యాలన్స్ తో పాటు ఇంకా చాలా కళలు ఉండాలి... కన్న వాళ్ళను వొదులుకోవాలి అడుగు ముందుకెళ్లి గర్ల్ ఫ్రెండ్ ను పెళ్లాడాలంటే! ఉద్యోగం లో ఒత్తిడయినా తట్టుకోవచ్చేమో కానీ గర్ల్ఫ్రెండ్ ఒత్తిడి తట్టుకోవడం కష్టం అనే చేదు నిజం తొందరగా తెలుసుకున్నాడు యశ్వంత్...


అమ్మా, నాన్నను ఇంకో రోజు మళ్లీ విడివిడిగా కదిలించి చూసాడు...

"మీ అమ్మకు నేను సరి జోడి కాదురా యషు... నా కుటుంబం కోసం ఎన్నో వొదులుకుంది మీ అమ్మ... తన వ్యక్తిగత అభిరుచుల్ని, ఆశయాలని మరచిపోయి బాధ్యతలను సంతోషంగా స్వీకరించి నాకు కొండంత అండ గా నిలిచిందిరా... జాను ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం" అని సుబ్బు యషుని హత్తుకుంటూ చెప్పాడు... "రత్నాల లాంటి ఇద్దరు పిల్లల్ని కనీ చక్కగా పెంచి ప్రయోజకుల్ని చేసింది... మీ అక్క చూడు, ఈ రోజు ఊళ్ళోని సఫలమైన సీ ఏ అభ్యాసకులలో ఒకటిగా నిలచింది..."


కాసేపు అమ్మ తో బాల్కనీ లో కూర్చున్నప్పుడు "యషు... నీకు మంచి అమ్మాయి దొరుకుతుంది... ఖంగారు పడకు...అన్నిటికీ ఆ భగవంతుడున్నాడు...

నీ పెళ్లి ఆలోచన మమ్మల్ని నువ్వు చేయనిస్తే గా ... మొదలు పెట్టే లోపలే నీ ఒత్తిడి వల్ల మానేశాముగా ... "ప్రతి వాళ్లకు గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ - ఈ నాలుగు కంపెనీల లో పనిచేస్తున్న వాడే అల్లుడుగా రావాలంటే ఎలా సాధ్యం? డబ్బు సంపాదించే యంత్రం గా కాకుండా ఒక మంచి మనిషిగా భావించి చేసుకుంటానని ముందు కొచ్చిన అమ్మాయినే చేసుకుంటానని ఎదురు చూస్తున్నావుగా... నీతో పాటు మేము కూడా ఆ టైమ్ ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్"...


" పెళ్లి అవటం ఒక ఎత్తు, అనంతరం కలిసి జీవించటం ఒక ఎత్తు యషు...

దాంపత్య జీవితము లో షడ్రుచులు ఉంటాయి నాన్న... పరస్పర ప్రేమానురాగాలుంటే అన్నీ రుచులు కమ్మగానే ఉంటాయి... అనుమానం,అసూయ, అహం లేకుండా ఉంటే ఆ కాపురం లో ఏ ఒడిదుడుకులోచ్చినా, కలిసి ఎదురుకోవచ్చు... నాన్నకు నేనంటే చాలా ఇష్టంరా... కోపం ముక్కు మీదే ఉన్నా మనసు చాలా మంచిది... ఆయన మంచితనమే నన్ను ఆకట్టుకుంది... ఐ యామ్ లక్కీ యషు" ...


చూస్తూ చూస్తూ యశ్వంత్ తిరిగి వెళ్లిపోయి ఆరు నెలలు గడిచిపోయాయి... ఒక రోజు పై అంతస్తులో ఉంటున్న భాస్కర్ గారికి ఉన్నట్టుండి గుండెపోటుతో ఆసుపత్రి లో చేరారు...వారి చిన్నమ్మాయి భవ్య తండ్రికి చేసిన సేవకు అందరూ ఆశ్చర్య పోయారు... ఎయిర్ పోర్ట్ లో పనిచేస్తున్న భవ్య సగం రోజులు నైట్ డ్యూటీ తో బిజీగా ఉంటుంది... ఎవరికీ పెద్ద పరిచయం లేదు... మోకాళ్ల పై వరకు వేసుకొనే గౌను, నల్ల మేజోళ్లు, మేకప్ తో ఉండే మోహము వెనుక అసలు మనిషిని ఎవరికి వారే తమ కిష్టమైనట్లు ఊహించుకుంటూ ఉంటారు ... కొంత మంది లెక్క లో "రాత్రి అయితే ఇల్లు వదిలి తిరిగే పిల్ల"... మరి కొందరు "మన పిల్లలు మటుకు ఉద్యోగాలు చెయ్యడం లేదా?? "


మంచి మాట అంత త్వరగా ఇతరుల కోసం ఎవరి నోట రాదుగా మరి...


భాస్కర్ గారికి ముగ్గురు ఆడపిల్లలు. ముగ్గురూ భిన్నమైన ఉద్యోగాలు ఎంచు కొన్నారు. పెద్దమ్మాయి హోటల్లో చెఫ్ అయితే రెండో అమ్మాయి రేడియో జాకీ గా ఎంతో పేరు తెచ్చుకుంది. ఇద్దరికీ పెళ్లిళ్లు అయి సుఖంగా ఉన్నారు. ఆఖరి అమ్మాయి భవ్య...


యషు ఈ సారి అనుకున్న దానికన్నా రెండు వారాల తరువాత వచ్చాడు... ఈ లోపల సుబ్బుకు కుడి కంటి పొరకు ఏదో ఇన్ఫెక్షన్ వచ్చి అప్పటికప్పుడు ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్ చెప్పాడు.

సమయానికి అక్క జ్యోతి ఊళ్ళో లేదు ... ప్రపంచ టూర్ కోసం నెల రోజులు బ్రేక్ తీసుకున్నది జ్యోతి కుటుంబం ... యూరప్ లో ఎక్కడో ఎంజాయ్ చేస్తున్నారు...


ఆ రోజు పొద్దున 9 కల్లా భవ్య తన కార్ ను పార్కింగ్ నుంచి తీసి సుబ్బును కంటి ఆసుపత్రి కు తీసుకు వెళ్లడానికి వాళ్ల ఇంటి బెల్ కొట్టింది... గోధుమ రంగు కంచి కాటన్ చీర లో చాలా హుందా గా ఉంది భవ్య... "జాను ఆంటీ, నాతో రండి తీసుకెళ్తాను. డాడీ చెప్పారు నాకు, సుబ్బు అంకుల్ సంగతి, అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారట కదా... ఇప్పుడు బయలుదేరి వెళ్తే మనం టైమ్ కి వెళ్తాము " అంటూ జానకి చేతులో సామాను తీసుకుంది. ఆ రెండు వారాలు యషు పక్కన ఉన్నట్లు అనిపించింది జానకి, సుబ్బులకు... మందులు దగ్గరనుంచి అన్నీ చూసుకుంది భవ్య... ఇంకా రెండు నెలలు కాలేదు భాస్కర్ గారు కోలుకొని... ఆ సమయంలోనే భవ్యను తను పనిచేస్తున్న ఎయిర్ లైన్స్ వాళ్లు బలవంతంగా సెలవ లో ఒక ఆరు నెలలు వెళ్ళమన్నారు... చాలా నష్టాలలో ఉండి ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు ఆ ఎయిర్లైన్స్ కు... అనుకో కుండా ఈ రకంగా భవ్యకు కలిసొచ్చింది...


యషు వచ్చే సరికి సుబ్బు కన్ను దాదాపుగా మామూలుగా ఉంది... ఇంట్లో వాతావరణం లో ఏ మార్పు లేదు... ఎప్పటిలాగే టీవీ లో ఎన్. టీ. రామారావు పాటలు ఫుల్ సౌండ్ లో ఒక వైపు, ఇంకో వైపు హిందుస్తాని విద్వాంసులు పండిట్ భీమ్ సేన్ జోషి కచ్చేరీ కలిపి ఇంట్లో జుగల్బందీ నడుస్తోంది...


జానకి ఒక రోజు భవ్యను, భాస్కర్ గారిని లంచ్ కి పిలిచింది ... వాళ్ళు రాగానే యషు లేచి తలుపు తీసి అమాంతం భవ్యను వాటేసుకున్నాడు...


పెద్దవాళ్లు ముగ్గురూ దిగ్భ్రాంతి చెందారు...కాసేపటికి తేరుకొని తెలుసుకున్నారు...

లిఫ్ట్ లో పరిచయం ఎయిర్ పోర్ట్ లో స్నేహంగా మారి ఆపై ఫోన్ కాల్స్, వాట్సప్ వార్తాలాపాల తో కొనసాగుతూ ఉంది... వీళ్ల ఇద్దరి మధ్య...


"నాకిప్పుడు అర్థం అయిందిరా ఆ రోజు నువ్వు మా ఇద్దరినీ ఎందుకు మా పెళ్లి చూపులు గురించి అడిగావో..."


"అవును మా, అప్పటికే భవ్యకీ నాకు ఒక ఏడాది పరిచయం... అందరూ గర్ల్ ఫ్రెండ్స్ ను వేసుకోని తిరిగినట్లు నా వల్ల కాదని నాకు ముందే తెలుసు... అందుకే అమెరికా లో చాలా జాగ్రత్త పడ్డాను... భవ్య తో పరిచయం మొదట్లో సీరియస్ గా తీసుకోలేదు... జస్ట్ ఆకర్షణ అనుకున్నా... అలా మొదలై ఆ తర్వాత మెల్లగా నాన్న లాగా " ఆకు చాటు పిందె తడిసె" అని డ్యూఎట్ వేసుకుందామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను... గత ఆరునెలల లో తనే అని నాకు తెలిసి పోయింది..." నవ్వాడు యశ్వంత్ భవ్య వైపు చూసి చిలిపి గా కన్ను కొడుతూ...


" ఒరేయ్ యషు, రేపు పెళ్లి అయ్యాక మీ నాన్న నాకు అర్ధరాత్రి వరకు బెడ్రూమ్ కిటికీ తెరచి పెట్టి మరీ దయ్యం కథలు చెప్పి ఏడిపించినట్లు నువ్వు భవ్యను ఏడిపించవద్దు"... అని చెప్పి తెగ సంతోష పడి పోయింది జానకి... "మరి మీ అమ్మో... చెప్పిందా తను నిద్ర లో నడుస్తూ ఉంటుందని... హడలి చచ్చాను మా పెళ్లి అయిన కొత్తలో"... అని అంతే ఘాటుగా బదులిచ్చాడు సుబ్బు...


భలే అత్తమామల దొరికారు తన కూతురికి అని మురిసిపోయాడు భాస్కర్... వాళ్ల ఆకతాయి మాటల వెనకున్న వాళ్ల మంచి మనసు భాస్కర్ కు బాగా తెలుసు... ఒకే చోట దాదాపు పదేళ్ల నుండి కలిసి ఉంటున్నారుగా...


ఎన్నో సార్లు కూతురు గౌను వేసుకుని ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు లిఫ్ట్ లో అదే బిల్డింగ్ లో ఉంటున్న ఎంతో మంది పెద్ద మనుషులు తన బిడ్డను చూసి చొంగను కార్చుకోవటం భాస్కర్ చూశాడు. బాధ పడ్డాడు. ఈ రోజు తో అన్నీ బాధలు, బాధ్యతలు తీరి పోయాయి" అనుకున్నాడు.. చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకున్నాడు.


"ఏ రోజు తన నైట్ షిఫ్ట్ ఉద్యోగం గురించి ఆ బిల్డింగ్ లో ఉంటున్న మిగిలిన వాళ్ల లాగా

జాను ఆంటీ కానీ సుబ్బు అంకుల్ కానీ సరదాగా కూడా ఒక్క మాట అడగలేదు తనని. ఫ్లయిట్ టికెట్ల కోసం ఎన్నో సార్లు బిల్డింగ్ లో ఉన్న ఎంతో మంది తన హెల్ప్ తీసుకున్నారు... దేశాయి అంకుల్ లగేజి ఒక సారి ఏదో ఎయిర్ లైన్స్ వాళ్ళు మిస్ చేస్తే అప్పుడు తనే వాళ్లనీ వీళ్లనీ పట్టుకుని పోయిందనుకున్న సామాను తిరిగి వచ్చే లా చేసింది... అలాగే ఎదిరింటి ఆంటీకి ఒక రెండు నెలలు ఒళ్లు బాగా లేక పోతే, తాను వండిన దాని లో వాళ్లకి రెండు పూటలా సరి పోయే అంత పంచి పెట్టేది... ఆ ఆంటీ మొగుడు మటుకు ఒంటరిగా దొరికితే చేయి పట్టు కుందామని చూసేవాడు... మూడో అంతస్తు లోని ఆడవాళ్లు కొంతమంది తను కనిపిస్తే చాలు... మొదలు పెట్టే వాళ్లు... "తల్లి లేదు. అక్కలు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లి పోయారు... ఎవరు పట్టించు కుంటారు ఈ పిల్లను... ఎప్పుడో ఏదో జరగరానిది జరిగితే ఆ తండ్రి ఏడుస్తాడు..."


"ఎమైంది భవ్య? కమాన్ గెట్ అప్" అని యశ్వంత్ పిలుపు కి ఉలిక్కిపడి లేచి

మనస్పూర్తిగా కాబోయే అత్తమామల కాళ్లకు కాబోయే కోడలిగా భవ్య నమస్కరించింది...

భాస్కర్ కూతురి తో ఇలా అన్నాడు "ఏమ్మా ముందే తెలుసు కదా నీకు... చీర కొట్టుకోకుండా ఏంటి ఇలా గౌను వేసుకున్నావు?"


భవ్య ఇబ్బంది గా మోహము పెట్టింది... తన తండ్రి ఇలాంటి ప్రశ్న ఇంతకు ముందు ఎప్పుడూ వేయలేదు... "ఆంటీ, నేను ఇప్పుడే వస్తాను" అని భవ్య అన్న మాటకు జానకి వెంటనే "ఎక్కడికమ్మా, డ్రస్ మార్చుకోవాలనా? నో నో, యు లుక్ వెరీ నైస్ ఇన్ దిస్ "... ఆ మాటకు భవ్య అమాంతం జానకి ని వాటేసుకుంది...


"మా అమ్మ నాన్న ఏమంటారోనని నేనే అలా రమ్మన్నాను" అన్నాడు యశ్వంత్ మామగారి వంక చూస్తూ...

"ఏదో కాలక్షేపంగా కీచులాడు కుంటూ ఉంటాం రా నేను మీ అమ్మ... లైఫ్ లో మేమున్న స్టేజీ లో ఈ గిల్లికజ్జాలు సాల్ట్ అండ్ పెప్పర్ లాంటివి. అది లేనిదే జీవితం నిస్సారంగా ఉంటుంది... ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసులో ఆలుమగల మధ్య సరస సల్లాపాలు పెరగాలే కాని తరగ కూడదు. ఇదే సక్సెస్ ఫుల్ మేరేజ్ కి ఫార్ములా.


మీ అమ్మ గౌను వేసుకుని ఉంటే ఆ రోజుల్లో ఖచ్చితంగా నాకు దొరికి ఉండేది కాదు, ఏ అదృష్టవంతుడో ఎగరేసుకు పోయేవాడు... "

"అంటే మీ ఉద్దేశ్యం... నేను ఎవరితో పడితే వాడితో వెళ్లే దాన్ని అనా... "

"జాను, మనము కొంచెం బ్రేక్ తీసుకొని తరువాత కంటిన్యూ అవుదామా? " అన్నాడు సుబ్బు... "ఇప్పుడూ గౌను వేసుకోవచ్చు నేను, కాకపోతే కొడలికి అనవసరంగా పోటీనవుతాను " అంటూ జానకి శ్రీవారిని చిలిపిగా చూస్తుంటే అందరూ నవ్వేశారు.


"నా చిట్టి తల్లి చాలా అదృష్ట వంతురాలు... మిగిలిన ఇద్దరు పిల్లలు భిన్నమైన వృత్తులు ఎన్నుకున్నా బాగానే స్థిర పడ్డారు... భవ్య గురించే దిగులుగా ఉండేది... రాత్రి పూట చేసే ఉద్యోగం వల్ల ఏ ముప్పు వాటిల్లుతుందోనని... కానీ ఏ రోజు దాని సంతోషాన్ని నేను కాదనలేక పోయాను యశ్వంత్..."


"డోంట్ వరీ అంకుల్. భవ్య ఎయిర్ లైన్స్ జోబ్ పెళ్లి అయ్యాక కూడా చేయవచ్చు. అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు " అంటూ అమ్మ జానకి భోజనం వడ్డించిన ప్లేట్లను యశ్వంత్ ఒక్కోకళ్లకు అందించాడు.


అందరూ నిశ్శబ్దంగా తింటూ ఉంటే సుబ్బు ఎందుకు లేచాడో అర్ధం కాలేదు... "ఒక మంచి ఎన్ టీ ఆర్ పాట చూస్తూ తినాలి... ఏ సెలబ్రేషన్ లేకుండా ఎలా" అంటూ క్షణం లో టివి ఆన్ చేశాడు - - "జాబిలి తో చెప్పనా... జాము రాత్రి నిదుర లోన... నీవు చేసిన అల్లరి... చెప్పనా.. రోజా... " అని టివి లో రామారావు, శ్రీదేవి దరశనం ఇచ్చారు...


"నో నాట్ ఎగైన్... యషు చెప్పరా మీ నాన్న కు... లంచ్ త్వరగా చేస్తే మీ అక్క జ్యోతి కి ఫోన్ చేసి ఈ గుడ్ న్యూస్ చెబుదాము"... భాస్కర్ గారు... పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాము... ఒక డేట్ అనుకుంటే ఆ రోజు మా మ్యూజిక్ సంస్థ కు చెప్పి శ్రీ హారిహరన్ గారి ఘజల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయిస్తాను..."


"అబ్బా మళ్లీ మొదలు పెట్టావా జాను, అబ్బాయి పెళ్ళికి మన తెలుగు సినిమా సింగర్లను పిలిస్తే మంచి రామారావు పాటలు లైవ్ విని ఆనందించచ్చు... "


భాస్కర్ గారు అందుకొని " రెండూ పెట్టచ్చు - ఒకటి నిశ్చితార్థం మరియు రెండోది పెళ్లి కి "..." ఇదిలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అంకుల్... నెక్స్ట్ పెళ్లి లో మెనూ గురించి మొదలు పెడతారు అమ్మా నాన్న" అన్నాడు యశ్వంత్... "


"ఈ సుబ్బు, జానుల జుగల్బందీని మీ పెళ్లి సంగీత్ లో లైవ్ చూడండి యషు"... సుబ్బు డైలాగ్ కు జానకి ఇచ్చిన ధమ్స్ అప్ చూసిన యశ్వంత్ కు తన అమ్మా నాన్న ల్లో ఆ కొత్త కోణం ఏంటో అర్థం కాలేదు...


"గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధమే స్వచ్ఛమైన బంధం, అదే ఒక వరం రా అబ్బాయి "... అని కొడుకు భుజం మీద చేయి వేస్తూ తన జానుని చూసి కన్ను కొట్టాడు సుబ్బు...

*********************************

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం

పూర్తి పేరు: శ్రీమతి దాసు రాధిక

వయసు: 52 సం.

నివాసం: బెంగుళూరు ( ప్రస్తుతము)

స్వస్థలం: తెనాలి

చదువు: BA English Litt., B.Ed

వృత్తి: గృహిణి. 1993-1997 హై స్కూల్ టీచర్ గా పని చేసిన అనుభవం.

ప్రవృత్తి: సంగీతం వినటం, పాటలు పాడటం

పాడుతా తీయగా ETV లో రెండో బ్యాచ్ 1997 లో క్వార్టర్ ఫైనలిస్ట్.

స్కూల్, కాలేజి లో పాటలు, నాటకాల( ఇంగ్లీషు, తెలుగు) అనుభవం.

కథలు వ్రాయటం, ఇంగ్లిష్ - తెలుగు భాషా అనువాదాలు.

ఇటీవలే ఛాంపియన్స్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ నుండి , ఆసియన్ వరల్డ్ రికార్డ్స్ వారినుండి సర్టిఫికేట్ లు పొందాను.


244 views1 comment
bottom of page