top of page
Writer's pictureDasu Radhika

గాడిద గుడ్డు


'Gadida Guddu' written by Dasu Radhika

రచన : దాసు రాధిక

ఆకలి ఉన్నవారికి అదే పెద్ద సమస్య.

అలాగే భర్త వ్యసన పరుడయితే భార్యకు అదేపెద్ద సమస్య.

వేరే మానసిక సమస్యలు ఉండవు.

ఏ సమస్యలు లేనివారికి ఏమీ తోచక, లేని సమస్యల్ని ఊహించుకుంటారు. లేని గాడిద గుడ్డును వెతుక్కుంటారు.

ప్రముఖ రచయిత్రి దాసు రాధిక గారు రచించిన ఈ కథ లో ఆ విషయాన్ని చక్కగా తెలిపారు .




ఫ్లయిట్ ఎప్పుడు బయల్దేరుతుందో ఏమీ తెలియలేదు అందులో దాదాపు గంట నుండి కూర్చొని ఉన్న ప్రయాణికులకు... మూడో వరస లో కిటికీ పక్కన కూర్చున్న పాపకు షుమారుగా పదేళ్లు ఉండొచ్చు... చేతులో ఐ ప్యాడ్ ని ఒక్క సారిగా పక్కకు విసిరేసి "బోర్ బోర్" అని నస మొదలు పెట్టింది... అప్పటి దాకా ఆలస్యం అవుతోందని లోలోపల చిరాకుగా ఉన్నా బయటికి ప్రశాంతంగా కూర్చున్న సౌమ్యకు విసుగు వచ్చి తన కూతురు కీర్తిను చేయి చేసుకున్నది…


ఈ రోజుల్లో, ఇన్తో అంతో సంపాదన ఉన్న ఇళ్లలో పుట్టిన పిల్లలు పుడ్తూనే కార్లు ఇతర ఎన్నో భోగాలను హాయిగా అనుభవిస్తూ ఉన్నారు. వాటి విలువ ఏమీ వాళ్లకు తెలియడం లేదు... అదే వెనకటి కాలంలో అయితే గొప్ప ఇంటి పిల్లలు కూడా చాలా వరకు కొన్ని కట్టు బాట్ల లో పెరిగే వాళ్లు. అటువంటి పిల్లలకు కూడా జేబు ఖర్చుకు ప్యాకెట్ మనీ అనేది అందరికీ ఉండేది కాదు... ఇప్పుడేమొ సగటు మనిషి ఫ్లయిట్ లో చీటికి మాటికి ప్రయాణం చేసే స్థాయికి వచ్చేశాడు…


పిల్లలను ఎలా పెంచాలో ఏమీ అర్థం కావడం లేదు... ఎయిర్ హోస్టెస్ వచ్చి కీర్తి చేతులో చాక్లెట్ పెట్టి మంచి చిరునవ్వు తో "గుడ్ గర్ల్స్ గొడవ చేయరు" అంటూ ముందుకు నడిచింది. "అయిన ఆలశ్యానికి చింతిస్తున్నాము, ఇన్ కొద్దిసేపటిలో బయలుదేరుతాం" అని మైక్ లో చెప్పింది. ఆ నిమిషం నోరు మూసుకుని మళ్లీ నోరు తెరిచి చాక్లెట్ నోట్లో వేసుకొని అర క్షణం లో మళ్లీ మొదటి కొచ్చినది కీర్తి గొడవ... ఇంతలో రెండు సీట్ల అవతల నుంచి ఒక చిన్ని తలకాయ బైటికి వచ్చి "ఆంటీ, మీ ఐ ప్యాడ్ ఇస్తారా, కొంత సేపు ఆడుకుంటా" అని అడిగాడు షుమారుగా ఆరేడు ఏళ్ల బాబు...


ఎవరి తాలుకా అని వెనక్కి చూస్తే అతి సామాన్య మొహాలు రెండు కనిపిన్చాయి... ఆ అబ్బాయి ఫేస్ కూడా పాలిపోయి ఉంది ... ఆ దెబ్బతో కీర్తి తన సీట్లో నించి దూకి ఐ ప్యాడ్ ని గట్టిగా పట్టుకుని కూర్చుంది... కాసేపు "బోర్" అని భోరు మనడం మర్చిపోయింది... ఆ అబ్బాయి దాని వంక ఆశగా చూసి వెనక్కి వెళ్లి బిక్క మొహం పెట్టుకుని కూర్చున్నాడు...


"ఏవరో పాపం ఎంత అవసరం కొద్ది ఫ్లయిట్ లో వెళ్తున్నారో..." అని నిట్టూర్పు విడిచింది సౌమ్య... సాటి మనిషి మీద తనకు సానుభూతి కలగడం సౌమ్య కు వింతగా అనిపించింది...


మెల్లగా టేకాఫ్ అయిన కాసేపటిలోనే కీర్తి నిద్రపోయింది. ఐ ప్యాడ్ని వదల లేదు... సౌమ్య కాస్త ఊపిరి పీల్చుకుంది...


ఫ్లయిట్ దిగాక ఆ అబ్బాయి ని గమనించింది... తన వయసుకు మించి తల్లి తండ్రి తో పాటు అందుకొని సామాను మోస్తూ కనిపించాడు…


ఏ పేచీ లేదు వాడికి... ఉన్నా సాగదు... ఏంటో... అందరం ఓకే ప్రపంచంలో పుట్టి, పెరిగి చివరకు పోతాము... ఎవరి ఆర్థిక స్థోమత, సాంఘిక హోదాను బట్టి ప్రతి మనిషి నడవడిక ఉంటుంది కదా... సౌమ్య తన కూతురి చెయ్యి పట్టుకుని నడుస్తూ ఆలోచిస్తోంది... కీర్తి ఆ అబ్బాయిని ఉత్త పుణ్యానికి వెక్కిరిస్తూ నడుస్తోంది... సౌమ్యకు ఆ టైమ్ లో కూతురిని మందలిచ్చే ఓపిక లేదు... ఇలాగే కదా పిల్లలు పాడై పోయేది... ఎంత కష్టం పిల్లల్ని పెంచటం... ఇటువంటి ఆలోచనలు ఏ రోజు చేయ లేదు సౌమ్య... ఈ రోజు ఎందుకో మనసు మనసులో లేదు... ఈ రకంగా ఆలోచించి ఉంటే తాను ఈ ఫ్లయిట్ ఎక్కక పోదు కదా!


డ్రైవర్ రాజు ను చూసి "హమ్మయ్య" అనుకోని కార్ ఎక్కి కూర్చుంది సౌమ్య...

ఆ చిన్న బాబు వాళ్లు బస్సు కోసం నిలబడ్డారు... ఎండ మాడి పోతోంది ఒక పక్క...


"సౌమ్యా మేడం ఎలా ఉన్నారు? విజయ్ సార్ రాలేదా" అని రాజు పలకరిస్తే కస్సు మన్నది సౌమ్య... "కుశల ప్రశ్నలు ఆపి కార్ త్వరగా పోనీ". రాజు కు సౌమ్య వైఖరి కొత్త కాదు. పదేళ్ల నుంచి డ్రైవర్ పని చేస్తున్నాడు... సౌమ్య పుట్టింటి లో...


చేసేది లేక రాజు రేడియో పెట్టాడు. అందులో ఆర్ జే కిరణ్ గొంతు మాట్లాడుతోంది - "ఇది రేడియో మిర్చి, చాలా హాట్ గురూ... ఇప్పుడే జాయిన్ అయిన శ్రోతలన్దరికి మా కార్యక్రమానికి స్వాగతం... మీలో ఎంత మంది రోజు లో కనీసం మూడు సార్లు అయినా బోర్ బోర్ అని అంటూ ఉంటారు? మాతో మాట్లాడాలనుకునేవారు వెంటనే మా నెంబరు కు కాల్ చెయ్యండి... మా నెంబర్...9245637301 అని ఇంకా ఏదో చెబుతూ ఉంటే కీర్తి "అమ్మా, నువ్వు కాల్ చేస్తావా? నువ్వు, నేను ఎప్పుడూ బోర్ అంటూ ఉంటాం కదా" అని అమాయకంగా అంటే రాజు ఫ్రంట్ మిర్రర్ లో తన కేసీ చూడడం సౌమ్య చూసింది.. "నోరు మూసుకొని కూచో కీర్తి" అని పళ్లు నూరింది...


ఇంత లోకే ఒక కాలర్ "కిరణ్ గారు, " మా ఆవిడ చాలా మంచిది కాని పొద్దున నిద్దుర లేచిన దగ్గర నుంచి బోర్ బోర్ అని నన్ను బోర్ కొడుతుంది... మీరు నా కోసం ఈ పాట వెయ్యండి సర్... "ఎటో వెళ్లి పోయింది మనసు, ఇలా ఒంట రైయింది వయసు"... డ్రైవర్ రాజు నవ్వుకోవటం చూసింది... చికాకు కలిగింది... ఏమి చేయలేక కళ్లు మూసుకుంది సౌమ్య...


ఇంటికి వెళ్లాక భోజనం చేసి పడుకుంది... సాయంత్రం దీపాలు పెట్టాక టిఫిన్ తిని పడుకో బోతుంటే అమ్మ గొంతు వినిపించింది... "ఎన్టీ మౌనం? అక్కడ సంగతులు ఏమి చెప్పవే?? విజయ్ కులాసానా? నిన్నే సౌమ్య" ... మూతి విరిచి "ఎప్పుడూ అల్లుడు సంగతి తప్ప కూతురి సంగతి నీకు పట్టదా? నేనెలా ఉన్నానని అడిగావా పోద్దు నుంచీ?" అని సౌమ్య తల్లి మీద విరుచుకుపడ్డది... "ఏళ్ళు వచ్చాయి కాని ఏమి లాభం... గడుసు తనం ఎక్కడికి పోలేదు... సౌమ్య అని పేరు పెట్టినా... "

"సెలవలా కీర్తికి? విషయం తెలియక అడిగాను... చెప్పమ్మ, చిన్న పిల్ల లాగా ఏంటి "అని తండ్రి రామకృష్ణరావు కీర్తి ని ఎత్తుకొని గది లోకి వస్తూ అన్నాడు...


"బోర్ కొట్టి వచ్చేశాను నాన్న... కొంచెం బ్రేక్ కావాలి నాకు..." "బోరు ఏంటి బోరు, నీదేమైనా చిన్న పిల్లల లాగా తోచక మారాం చేసే వయసా ? అస్సలు ఏమి మాట్లాడుతున్నావు సౌమ్య? " ఖంగారు గా అడిగింది తల్లి శాంత... "అవును అమ్మమ్మ, యు ఆర్ రైట్... మార్నింగ్ ఫ్లయిట్ లో నేను బోరు అంటే మమ్మీ నన్ను కొట్టింది " అని కీర్తి తన తల్లి మీద పితూరి చెప్పి అమ్మమ్మ ను అమాంతం చుట్టేసుకుంది...


ఇంత లోకే వాకిలి తలుపు దగ్గర పొద్దున ఫ్లయిట్ లో కలిసి ప్రయాణం చేసిన ఆ ఆరేళ్ల బాబు, వాడి తల్లీ తండ్రి సుధ ఆంటీ తొ పాటు వచ్చారు... ఆశ్చర్య పోయింది సౌమ్య...


" సారీ శాంత... వీళ్లు ఊరంతా తిరిగి ఇల్లు తెలుసుకో లేక సాయంత్రం వచ్చారు. ఎలాగో లేట్ అయిందని ఈ పూటకు రాత్రి భోజనం పెట్టి తీస్కోచ్చాను . సరే వస్తాను. హాయ్ సౌమ్య, ఏంటి సర్ప్రైజ్? రేపు మాట్లాడు కుందాము. గుడ్ నైట్" అని సుధ ఆంటీ వెళ్లిపోయింది...


"మీ ఆయన కు ఫోన్ చేశావా చేరినట్లు" అని తల్లి శాంత అడిగిన ప్రశ్నకు సౌమ్య ఆశువు గా "చేశా" అని అబద్ధం ఆడింది...

మరునాడు పొద్దున 9 గంటలకు కొత్తగా పనికి చేరిన అమ్మాయి సౌమ్య గది దగ్గర తటపటాయిస్తూ ఉంటే శాంత "ఏమ్మా రాణి ఏన్ కావాలి?" అంటే "అన్నీ గదులు ఊడ్చేశాను... ఇది ఒక్కటే"... అని నసిగింది... "ఓహ్ అలాగా ... సౌమ్య లేవలేదా? ఏయ్ ఏంటి ఇది? సౌమ్య, లే..." అని శాంత విసురుగా కూతురిని లేపింది... "అమ్మమ్మ, రోజు డాడీని మమ్మీ ఇలాగే అరుస్తూ లేపుతుంది... సండే కూడా పడుకోనివ్వదు"... కీర్తి మాటలు సౌమ్య చెవిన పడ్డాయి కాని పట్టించు కోలేదు... మత్తు వదిలితేగా...


మధ్యాహ్నంకల్లా ఇల్లు అద్దం లాగా శుభ్రం చేసింది రాణి. కొడుకు నాని కూడా చిన్న చిన్న పనులు చేస్తూ తల్లికి సహాయం చేశాడు. మొగుడు డ్రైవర్ పని చేయటానికి సుధా ఆంటీ ఇంటికి వెళ్లి అంకుల్ను కోర్టు లో దింపి తిరిగి ఇక్కడికి వచ్చాడు. ఈ రెండు ఇళ్లలో చేసుకుని కాస్త డబ్బు చేసుకుని కొడుకు నానిను చదివించు కోవాలని వాళ్ల కోరిక. అచ్చంగా పనివాళ్ళు కాదు... కాలం కలిసి రాక ఇలాంటి పరిస్థితి వచ్చింది... శాంత, సుధ ఫ్లయిట్ టికెట్ డబ్బులు చెరి సగం వేసుకుని మరీ పిలిపించారు...


అదే అర్థం కాలేదు సౌమ్యకు ... నాని కి ఐ ప్యాడ్ ఎలా తెలుసా అని...


"రాజు వచ్చాడా? అన్నట్టు మన డ్రైవర్ రాజు పొద్దున్నె ఊరు వెళ్లిపోయి ఉంటాడు... రాణి మొగుడు రాజును రమ్మని చెప్పండి. సుధ ఇంట్లో ఉంటాడు... డా. కవితను ఇంటికి తీసుకు రావాలి... ఈ రోజు లక్ష్మి కాలు చెకప్ ఉంది…”అని శాంత మాటలు విని

"ఎమైంది అమ్మా?" సౌమ్య అడిగింది…


"మీ వదినకు కాలు ఫ్రాక్చర్ అయింది. నిన్న వచ్చావు... ఏమైనా పట్టించు కున్నావా?" శాంత బదులిచ్చింది.


డాక్టర్ వెళ్ళి పోయాక మేడ మీద గదిలో పడుకొని ఉన్న లక్ష్మిని చూడడానికి వెళ్లింది సౌమ్య. "హాయ్ వదిన, నీకు నిజంగా హాయి కదా... కొన్ని రోజులు ఇంటి పని, ఉద్యోగం తప్పాయి... చక్క గా రెస్ట్ తీసుకో. " సౌమ్య మాటలు కొత్త కాదు లక్ష్మికి... "బాధ్యత గల ఏ మనిషీ అలా ఆలోచించడు... నేను ఇలా పడక పెట్టడం వల్ల ఇంట్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు... మీ అన్నయ్యకున్నవి తక్కువ చీకాకులా? " డ్రైవర్ రాజు చూడు... ఇప్పుడే రావాలా వాడికి ఇబ్బంది... ఏకంగా ఒక ఆరు నెలలు సెలవు తీసుకొని ఊరు వెళ్లాడు... తల్లి కి జబ్బు చేసి... పదేళ్ల నుంచి చేస్తున్నాడు మన ఇంట్లో... అతనికి డబ్బు సహాయం మనమే చేస్తామని మీ అన్నయ్య హామీ ఇచ్చారు... నా పుణ్యమా అని కొత్త డ్రైవర్, పని చేసే మనిషి ని పిలిపించారు…


"సరే కానీ విజయ్ ఎప్పుడు వస్తారు?" అని లక్ష్మి ప్రశ్నిస్తే సౌమ్యకు కోపం వచ్చింది -


"అందరూ విజయ్ ని అడిగే వారే... నేనెప్పుడు తిరిగి వెళ్తాననే కదా... నేను వెళ్ళను. నాకు అక్కడ బోర్ కొట్టింది..." అని కిందికి వెళ్లి గది తలుపులు వేసుకుని కూర్చుంది...


ఆ రాత్రి లక్ష్మి తన భర్త సత్యంతో అన్నది "సౌమ్యకు డిప్రెషన్ అనిపిస్తోంది…”


ఎమజాన్ ప్రైమ్ లో చూస్తూ ఉన్న సినిమా ని పాజ్ చేసి చిరాకుగా లక్ష్మి వైపు చూస్తూ అన్నాడు - "గాడిద గుడ్డు కదూ... అడ్డమైనవి చదివి ప్రతి ఒక్కరూ డిప్రెషన్ పేరుతో తమ ధోరణి ని కప్పి పుచ్చు కుంటున్నారు ... సుధ ఆంటీ పక్కన ఉన్న ప్రభ కు ఉందంటే నమ్ముతాను...ఆ మాట కొస్తే విజయ్ కి డిప్రెషన్ రావాలి దీని తో వేగ లేక.... సౌమ్య కి తెగులు. విజయ్ కాబట్టి ఊరు కున్నాడు... అయినా అమ్మ దగ్గర అనేవు ... భోరు మంటుంది... నీ లాగే ఆవిడ డిప్రెషన్ గురించి ఎక్కడో వినో చదివో ఉంటుంది గా."..


"మీరేంటి కొత్తగా గాడిద గుడ్డు లాంటి పదాలు వాడుతున్నారు? మీకు నచ్చదుగా" అని లక్ష్మి నవ్వింది..


"ఏమి చేస్తాం, రోజు రాత్రి పిచ్చి సినిమాలు పెట్టి నన్ను చంపుతున్నావు గా నీ కాలు విరగటం కాదు కాని... ఇటువంటివి నాకూ వంట పట్టాయి మరి"... అని నవ్వాడు సత్యం...


నాని ఎప్పుడు కనిపించినా కీర్తి వాడిని ఏడిపిస్తూ ఉంది... వాడి చేతి లో ఉన్న వస్తువు ఏదైనా సరే లాగేస్తూ వాడి ముందే రకరకాల స్వీట్స్, చాక్లెట్లు తింటూ ఉండేది... ఎంత అల్లరి చేసినా ఇంట్లో పిల్ల అని అందరూ చూసి చూడనట్లు ఉన్నారు... కాని నాని రాత్రి పూట పుస్తకాలు తీసి చదువుకుంటునప్పుడు కీర్తి వాడిని గొడవ పెడితే రామకృష్ణ రావు తొ సహ ఎవరూ ఊరుకో లేదు... "కీర్తి తప్పు కాదు. సౌమ్య పెంపకం తప్పు... పిల్లను పాడిచేసింది... పెళ్లి అయి పన్నెండు ఏళ్లు అయింది... ఎలా భరిస్తున్నాడొ విజయ్..." సుధ ఆంటీ ఇంటికి వెళ్లి వచ్చిన సౌమ్యకు రాగానే తన గురించేనని అర్థం అయింది...


మౌనంగా పిల్లను తీసుకొని గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని పడుకుంది...


పుట్టింటికి వచ్చి అప్పుడే రెండు వారాలు అయింది... బోర్ కోడుతోంది... ఏంటో...

రోజు పొద్దున లేచి మొగుడిని, పిల్లను లేపి ఆఫీసు, స్కూల్ కి రెడీ చేసి పంపి, తను ఇంటి నుంచి ఒక స్టార్ట్ అప్ కంపెనీకి వర్క్ చేస్తూ ఉంది... డబ్బు ఉంది, ఇల్లు ఉంది, చీరలు, సొమ్ములు - జీవితం లో కావాల్సినవన్ని ఉన్నాయి... విజయ్ ఇంకో పిల్లవాడు కావాలంటే తనే వద్దన్నది... కని పెంచటం బోర్ అని…

అన్నిటికీ సర్దుకు పోతున్నాడు విజయ్... అయినా ఉండలేను, బోర్ అని వచ్చేసింది...

తన లాగా ఎందరో... ఈ కోవకు చెందిన వారికి వాళ్లకు ఏమి కావాలో వాళ్లకే తెలీదు... ఏ సమస్య లేక పోయినా సమస్యను సృష్టించు కుంటారు... రాణి చూడు... బాగా బతికింది ఒకప్పుడు... ఈ రోజు మరి కొడుకుకు ఒక రోజు మంచి జీవితం ఇవ్వాలనే లక్ష్యంతో ఇలా ఎవరి ఇంట్లోనో పనికి చేరింది... నాని కీర్తి కంటే చిన్న, డ్రైవర్ కొడుకు... కాని సద్బుద్ధి తో పెరుగుతున్నాడు...

ఎందుకు తను ఇలా ఉంది? కూతురిని సరిగ్గా పెంచ లేదు... మొగుడిని లక్ష్య పెట్ట లేదు... తన తల్లి తండ్రి తనను సవ్యంగా పెంచారు కదా... చదువు కుంది... ఒళ్లు పొగరు... అంతే...

ఇంకా తన లోని విచక్షణా శక్తి ఎక్కడో లోపల కాస్త ఉంది ... మంచి ఆలోచనలే వస్తూ ఉంటాయి... తనే వాటిని ఆచరణలో పెట్ట లేక పోతోంది... ఎందుకో...

నిద్రలోకి జారు కుంది...


ఉదయం సౌమ్య అందరి కంటే ముందు లేచి కాఫీ కలిపి అందరికీ ఇచ్చి, టిఫిన్ తయారు చేసి ఆ తరువాత దీపం కూడా పెట్టింది... మధ్య లో ఒక గంట లక్ష్మికి కబుర్లు చెప్పి కీర్తి, నానీలను ఆడించింది... తల్లి శాంత ఆ రోజు వొళ్లు మరిచి పడుకుంది... ఎవ్వరూ సహాయం లేక బండి నెడుతోంది తప్ప ఆవిడ పని అయిపోయింది పాపం... ఇలా ఇంకో వారం గడిచింది...


శాంత రామకృష్ణ రావు దగ్గర తన ఆనందాన్ని వ్యక్త పరిచింది... సౌమ్యలో నిజంగా మార్పు వచ్చిందని సంతోషించారు...

సుధ చెప్పింది శాంతకు - సుధ వాళ్ల పక్కింటి అమ్మాయి ఆ రోజు సౌమ్య వెళ్లే సరికి బయట నుంచోని సుధ తో కబుర్లు చెబుతోంది... అకస్మాత్తుగా సౌమ్య ఆ అమ్మాయి ను చూసి "హాయ్ ప్రభ , గుర్తు పట్టావా?" అని అమాంతం ప్రభ ను కావలించుకుంది... "బాగున్నావా సౌమ్య?" అంటూ, పని ఉంది అని వెంటనే లోపలికి వెళ్లి ఇంటి తలుపు వేసుకున్నది.


అప్పుడు సుధ చెప్పింది సౌమ్యకు-- ప్రభ కు ఒక్కతే కూతురు, పుట్టుకతో మూగ, చెవిటిదని... ఇప్పుడు దానికి తొమ్మిదేళ్లని... దానికి తోడు ముసలి అత్త, మామలు... భర్త ప్రభను వదిలేసి వేరే పెళ్ళి చేసుకుని తల్లి తండ్రి తో కూడా తెగతెంపులు చేసుకున్నాడు అని... సౌమ్య కు ప్రభ కాలేజీ లో బాగా తెలుసు... చాలా చలాకీ గా ఉండేది. ఒక దశాబ్దం తరువాత ఇలా చూసింది...

ఆ తర్వాత సుధ ఇంట్లో కూర్చున్న సౌమ్య ఏవేవో కబుర్లు చెబుతోంది కాని మనసు లో ప్రభ గురించి ఆలోచన, తెలియని బాధ... "విజయ్ కులాసా నా?" అని సుధ ప్రశ్నకు కోపం తెచ్చుకోకుండా "కులాసా" అని సౌమ్యం గా బదులిచ్చింది...


ఆ రోజు రాత్రి కీర్తి తల్లి ని అడిగింది "మమ్మీ, నాకు డాడీ కావాలి... ఇక్కడ బోర్ గా ఉంది... నానిని కూడా తీసు కొని మన ఇంటికి పోదాము...


సౌమ్యకు ఏమి తోచలేదు... ఇదివరకు ఇలాంటి మాట వస్తే ఒక దెబ్బ వేసేది కీర్తిని కాని తన మనసు ఇప్పుడు అలా లేదు...


ఫోన్ మొగినందువలన మెలుకువ వచ్చింది సౌమ్యకు. అప్పుడే 7 అయిపోయింది... సుధ ఆంటీ ఉంది లైన్ లో - " సౌమ్య సరిగ్గా 9 ఇంటికి రెడీగా ఉండు" ... "సరే ఆంటీ... వస్తాను... అర గంట లో తయారు అయి టిఫిన్, వంట అక్కడ చేసి పెట్టి బైటికి వెళ్లిన సౌమ్య ఇంటికి సాయంత్రం తిరిగి వచ్చింది...


ఆ రోజు రాత్రి విజయ్ కు ఫోన్ చేసింది... ఐ యామ్ సారి... నేను రేపే ఇంటికి వస్తాను... మీకు ఇష్టమైతే... "


"సౌమ్య, ఐ మిస్ యు... కాని ఇంకో సారి నువ్వు నన్ను వదిలి వెళ్తే... " అని విజయ్ ఆగిపోయాడు...

" నాకు ఇప్పుడు బాగా అర్థం అయింది విజయ్... నా ప్రాబ్లమ్ అల్లా నాకేమీ ప్రాబ్లమ్ లేక పోవడం... మనసు ఇంటర్నెట్ స్పీడ్ లో పరుగులు పెడుతుంది... అందుకే ఆ బోర్... అన్నీ నాకు చాలా ఎక్కువగా ఉన్నాయి, అడగ కుండానే దొరికాయి... మీ ప్రేమ తో సహ... ఐ ప్రామిస్ యు విజయ్ ... కీర్తికి పై ఏడాది కల్లా ఒక చెల్లెలో తమ్ముడో పుడతాడు... మీ కోరిక తీరుస్తాను...


నా మనసుకు నిజమైన ఆనందం ఇవాళ లభించింది... అనాధ పిల్లల మధ్య...సుధ ఆంటీ తో వెళ్లి వాళ్లకి స్నాక్స్, బుక్స్ పంచి పెట్టాను... ఆ పిల్లల మొహాలు, ఆ కళ్ళల్లోని ఆనందం మరువలేను విజయ్ ... ఆ రెండు గంటలు నాకు బోర్ అనిపించలేదు... ఈ సేవా కార్యక్రమాలు ఇలాగే చెయ్యాలని ఉంది నాకు"...


" అలాగే చెయ్యి... నీ ఇష్టం వచ్చినట్లు ఉండు... " అని లాలనగా విజయ్ గొంతు వింటూ ఉంటే ఆ క్షణం భర్త దగ్గరకు వాలి పోవాలనిపిన్చింది... ఏదొచ్చినా తొందరే... తనకు…


"బోర్ కొట్టింది కదూ మీకు, ఎలా చేసుకుంటున్నారు ఒంటరిగా? " "అమ్మా వాళ్లు వచ్చారు .. ఐ యామ్ వెరీ బిజీ సౌమ్య. అందుకే హెల్ప్ కావాలి.".. ఎప్పుడూ వచ్చినట్లు కోపం రాలేదు సౌమ్యకు... సిగ్గుగా అనిపించింది... అత్త మామలు ఇలాంటి కోడలు దొరికి నందుకు ఎలా భరిస్తున్నారో... మాట మాత్రం తన పుట్టింటి వాళ్లతో ఒక్క సారి కూడా అనలేదు... ఇదంతా తాను చేసుకున్న అదృష్టం... ప్రభ లాంటి జీవితాలు ఎన్నో... బోర్ అనే పదం పొరపాటున కూడా ప్రభ లైఫ్ లో చోటు చేసుకోనే ఆస్కారమే లేదు కదా... వదిలేసిన తన భర్త తల్లి తండ్రిని చూడాల్సిన అవసరం ఉందా? ఎంత మంది ఉంటారు అలా? తనేమో చేస్తున్న ఉద్యోగం విడిచి పెట్టి ఇలా వచ్చినా భర్త విజయ్ ఏమి అనలేదు... ఇలా ఎంతో మంది ఉన్నారు...


ఆ క్షణంలో గది బయటకు వచ్చి మెల్లగా వరండా లో నాని వాళ్ల కిచ్చిన చిన్న గది దగ్గరకు వెళ్లింది సౌమ్య.


"పడుకున్నావా రాణి? రేపు మధ్యాహ్నం ఫ్లయిట్ కి నేను కీర్తిని, నానిని తీసుకొని మా ఇంటికి, అదే విశాఖపట్నం వెళ్లాలని నిర్ణయించుకున్నాను... నువ్వు, రాజు సరే అంటే నానిని నేను చదివిస్తాను." అని సౌమ్య మాటలకు ఇంట్లో అందరూ హర్షం వ్యక్తం చేశారు...


మొదటి సారి తన తల్లి, అన్నా వదినలు సౌమ్యను ఇంకో నాలుగు రోజులు ఉండమన్నారు... వారం పది రోజుల నుంచి తానే అమ్మ చేసే రోజు వారి పనులు చేస్తోంది... ఇదివరకు ఎప్పుడూ చేయలేదు... అందరూ తను తిరిగి వెళ్లే రోజు కోసమే చూసేవారు...


"లేదమ్మ, విజయ్ కు నేను లేకపోతే బోర్ కోడుతోందిట..." అని సౌమ్య బదులు ఇస్తే అందరూ నవ్వారు...


అన్నయ్య సత్యం మర్నాడు సౌమ్యను ఎయిర్ పోర్ట్ లో దింపి "ఈ సారి మళ్లీ బోర్ కొట్టినప్పుడు రండి కీర్తి అని మేనకొడలి తో వేళాకోళంగా అంటే, సౌమ్య నవ్వుతూ "అయితే మేము ఇప్పుడు అప్పుడే రాము అన్నయ్య... చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి"... అని జవాబు చెప్పింది...


ఇంటికి వెళ్ళే సరికి సుధా ఆంటీ తల్లి శాంత తో చెప్పటం విన్నాడు సత్యం - సౌమ్య ఉద్యోగం చేసి వచ్చిన డబ్బు నాని చదువుకు మరియు ప్రభ కుటుంబానికి సాయంగా ప్రతి నెలా పంపాలనుకుందని... శాంత కళ్ళు ఆనందం తో చెమ్మగిల్లాయి...

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం

పూర్తి పేరు: శ్రీమతి దాసు రాధిక

వయసు: 52 సం.

నివాసం: బెంగుళూరు ( ప్రస్తుతము)

స్వస్థలం: తెనాలి

చదువు: BA English Litt., B.Ed

వృత్తి: గృహిణి. 1993-1997 హై స్కూల్ టీచర్ గా పని చేసిన అనుభవం.

ప్రవృత్తి: సంగీతం వినటం, పాటలు పాడటం

పాడుతా తీయగా ETV లో రెండో బ్యాచ్ 1997 లో క్వార్టర్ ఫైనలిస్ట్.

స్కూల్, కాలేజి లో పాటలు, నాటకాల( ఇంగ్లీషు, తెలుగు) అనుభవం.

కథలు వ్రాయటం, ఇంగ్లిష్ - తెలుగు భాషా అనువాదాలు.

ఇటీవలే ఛాంపియన్స్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ నుండి , ఆసియన్ వరల్డ్ రికార్డ్స్ వారినుండి సర్టిఫికేట్ లు పొందాను.








298 views0 comments

Comments


bottom of page