top of page

ఎ ఫ్రస్ట్రేటెడ్ బ్యాంకర్

'A Frustrated Banker' New Telugu Story

Written By Kotte Vinay Kumar

రచన : కొట్టే వినయ్ కుమార్ఓ పెస్టిసైడ్ కంపెనీలో పని చేసి 'ఇక ఇది మనకు కుదరదు , మనం చేయలేం' అని వొదిలేసి ఖాళీగా కూర్చున్నప్పుడు కృష్ణుడి అంతటి ఓ మేధావి నా దగ్గరకు వచ్చి “మామా! బ్యాంక్ జాబ్ ట్రై చెయ్. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే పని. పైగా గవర్నమెంట్ జాబ్. డబ్బుతో పాటు గౌరవం కూడా వస్తుంది” అంటూ వీర లెవల్లో గీతోపదేశం చేశాడు.

అది నన్ను ఎంతగా ఇంప్రెస్ చేసింది అంటే బ్యాంక్ లో జాయిన్ అయ్యి, దేశానికి సేవ చేద్దాం అనేంతగా. బేసిక్ గా నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఫ్యాన్ ని . మల్లీశ్వరి సినిమాలో హీరో ‘నా పేరు వరప్రసాద్. నేను ఫలానా బ్యాంక్ లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాను’ అని చెప్పే డైలాగు కూడా ప్రాక్టీసు చేయడం మొదలుపెట్టేసా.

బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కి కొద్దిగా ఫేమస్ ఐన ఓ ఇన్స్టిట్యూట్ లో చేరిపోయా.మ్యాథ్స్ లో నేను చాలా వీక్. వాళ్ళు చెప్పేది మూడు నాలుగు సార్లు ప్రాక్టీస్ చేస్తే గాని అర్థం అయ్యేది కాదు. ఎలాగోలా ఎగ్జామ్ పాస్ అయ్యా.

ఇక నెక్స్ట్ ఇంటర్వ్యూ.

ఇంటర్వ్యూలో కామన్ గా అడిగే ప్రశ్న "టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్" ని బాగా బట్టీ పట్టి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యా. ఇంటర్వ్యూలో ఆ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పాక, నా ఇంగ్లీష్ బ్రిటీష్ వాడి ఇంగ్లీష్ కంటే హై లెవెల్ లో ఉందని వాళ్లకు అర్థమై,

" బాబూ! మా సౌకర్యం కోసం తెలుగులోనే ఇంటర్వ్యూ చేస్తాం " అని తెలుగులోనే కానిచ్చేశారు. కొద్ది రోజుల్లోనే రిజల్ట్స్ వచ్చేసాయి. నేను కూడా ఓ బ్యాంక్ లో సెలెక్ట్ అయ్యా. నా చుట్టూ ఉండే ఫ్రెండ్స్ " అరేయ్ వీడికే బ్యాంక్ జాబ్ వచ్చింది అంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది" అనుకోవడం మొదలుపెట్టారు. నేను బ్యాంక్ ఎగ్జామ్ లో పాస్ అయితే నాకు సమాజంలో గౌరవం పెరుగుతుందని అనుకుంటే నేను పాసవ్వడం వల్ల బ్యాంక్ ఎగ్జామ్ కి ఉన్న గౌరవం పోయింది.


ఇక తర్వాత ఇండక్షన్ ప్రోగ్రాం.

బ్యాంక్ లో జాయిన్ అయ్యేముందు ఇచ్చే ట్రైనింగ్ అన్నమాట.

ఇండక్షన్ ప్రోగ్రాం ఓ త్రీ స్టార్ హోటల్ లో.

ఇప్పుడే ఇలా ఉంది అంటే ముందు ముందు ఇంకెలా ఉంటుందో అనుకొని మురిసిపోయా. ఇండక్షన్ ప్రోగ్రాంలో పెద్ద పెద్ద సీనియర్ ఆఫీసర్లు వచ్చి " మీకు ఇంత చిన్న వయసులోనే జాబ్ రావడం చాలా గ్రేట్. ఈ ఏజ్ లో జాయిన్ అయ్యారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక చైర్మన్, ఒక ఎం.డి స్థాయికి వెళ్తారు. మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి" అంటూ చెప్పడం మొదలెట్టాక, మరో పది పదిహేను సంవత్సరాలలో బ్యాంక్ ను ఏలేది నేనే అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఇండక్షన్ ప్రోగ్రాం తర్వాత జోనల్ ఆఫీసులో మధ్యాహ్నం వరకు కూర్చోబెట్టి పోస్టింగ్ ఇచ్చేసారు. రిపోర్ట్ చేయడానికి బ్రాంచ్ కి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ఒకటే ఆలోచన త్రీస్టార్ హోటల్ లో ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి, బ్యాంక్ లో మినిమం సెంట్రలైజ్డ్ ఏసి, నాకోసం ఒక సెపరేట్ క్యాబిన్ ఉంటుందని. తీరా బ్యాంక్ కి వెళ్లి చూస్తే అది అడవికి తక్కువగా గుహకి ఎక్కువగా ఉంది. సెపరేట్ క్యాబిన్ మాట దేవుడెరుగు కనీసం సెపరేట్ టేబుల్ కూడా కనిపించలేదు. వెళ్లి మేనేజర్ కి జాయినింగ్ ఆర్డర్ ఇవ్వగానే “రిజిష్టర్లో ఎంట్రీ చేసి, వెళ్లి రూమ్ వెతుక్కొని ఏమైనా సామాన్లు ఉంటే తీసుకుపో” అని పంపించాడు. బ్రాంచ్ అవతారం బాగా లేకున్నా బ్రాంచ్ మేనేజర్ బాగా ఫ్రెండ్లీ గా ఉన్నాడులే అనుకున్నా.


రూమ్ , సామాను అంతా సెట్ చేసుకొని నెక్స్ట్ డే బ్రాంచ్ కి వెళ్ళాను. అప్పటికే బ్రాంచ్ లో సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ డిప్యుటేషన్ పై పని చేస్తున్నాడు. నాకు ఇంకా సిస్టంలో బ్యాంక్ సర్వీస్ చేయడానికి అవసరం అయిన బయోమెట్రిక్ రాలేదు. కాబట్టి నాకు మొదటి రోజు లోన్ డాకుమెంట్స్ ఫిల్ చేసేపని అప్పజెప్పారు. మొదటి రోజు కొన్ని డాకుమెంట్స్ అప్పజెప్పడంతో ఎక్సయిట్మెంట్ లో మొత్తం నింపేసా. మళ్ళీ కొత్తవి తెచ్చిపెట్టారు. అవి కూడా నింపితే మళ్ళీ తెస్తారు అని కొంచెం స్లోగా నింపడం మొదలుపెట్టా. లంచ్ తర్వాత కూడా అదే పని.మొత్తానికి ఆ డాక్యుమెంట్లు ఫిల్ చేస్తూ సాయంత్రం అయిపోయింది. క్యాషియర్ కూడా క్యాష్ అప్పజెప్పి వెళ్ళిపోయాడు. నేను కూడా వెళ్దాం అని, మేనేజర్ రూంకి వెళ్ళా.


మేనేజర్ వాలకం చూస్తుంటే ఇంకో నాలుగు గంటలైనా బ్రాంచ్ క్లోజ్ చేసే ఆలోచన లేనట్లు కనిపించాడు. ఏదో ఒక విధంగా ధైర్యం చేసి " సర్. నేను వెళ్తాను " అని చెప్పా. ఆ మాటకి మనోడికి చిర్రెత్తినట్టు ఉంది. జాయిన్ అయ్యి రెండు రోజులే అయ్యింది కదా, జడుసుకుంటాడు అనుకున్నాడేమో, మెల్లగా చెప్పడం మొదలుపెట్టాడు.

" నేను క్లర్క్ గా జాయిన్ అయినప్పుడు నా జీతం చాలా తక్కువ. అయినా కూడా నేను నాకు ఇచ్చే జీతం కంటే ఎక్కువ పనిచేసేవాణ్ణి. నా పనితనాన్ని మెచ్చి బ్యాంక్ నన్ను ఈ స్థాయికి తెచ్చింది. నువ్వు చాలా తక్కువ వయస్సులో జాబ్ లో జాయిన్ అయ్యావ్. నిన్ను నేను ఎక్కడో , ఏ స్థాయిలోనో ఊహించుకుంటే నువ్వేమో ఇంటికి పోతా అంటున్నావు” అంటూ చెప్పాడు. అది విన్న నాకు, ‘ఇక్కడ ఏం మాట్లాడడానికీ లేదు అని వెళ్ళి మళ్ళీ నా టేబుల్ దగ్గర కూర్చున్నా. బ్యాంకు జాబ్ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే అన్న ఆ మేధావి గుర్తొచ్చాడు.


రోజూ పొద్దున్నే రావడంతోనే అటెండర్ ఆ క్రాప్ లోన్ డాక్యుమెంట్లు, ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోన్ డాక్యుమెంట్లు నా చుట్టూ పెట్టేసేవాడు. వాటిని చూస్తుంటే నాకు కాంచన్ గంగ, ఎవరెస్టు శిఖరాలు గుర్తొచ్చేవి. కనీసం వాటిని ఎక్కితే వాటి ఎత్తు తగ్గినట్లు అనిపిస్తుందేమో కానీ ఎన్ని డాక్యుమెంట్లు రాసినా అస్సలు తరిగేవి కావు. ఈ కష్టాలనుంచి బయటపడేయడానికా అన్నట్లు నాకు బయోమెట్రిక్ వచ్చింది. మెల్లగా బ్యాంక్ సర్వర్ లో పని చేయడం మొదలు పెట్టాను. మెల్ల మెల్లగా అన్ని పనులు నేర్చుకున్నాను. అదే నన్ను "అడ్డా మీద కూలీలా" మార్చింది. బ్రాంచ్ లో ఎవరు రాకపోయినా నన్ను వారి ప్లేస్ లో కూర్చోబెట్టేవారు. ఒక రోజు పాస్ బుక్ ప్రింటింగ్ వద్ద, ఒకరోజు డి.డి.లు, ఆర్టిజీఎస్, నెప్ట్ ల దగ్గర, ఒక రోజు క్యాష్ క్యాబిన్ లో , ఇంకొకరోజు ఆఫీసర్ చైర్లో. అన్ని పనులకు వాడేసేవారు. క్యాషియర్ రోజూ తన చుట్టూ నోట్ల కట్టలతో కుబేరుడులా కనిపించేవాడు. కానీ సాయంత్రం అయితే జేబులోంచి సొంత డబ్బులు కలిపితే గాని క్యాష్ టాలి అయ్యేది కాదు. అదేం విచిత్రమో అనుకునే వాణ్ణి. నేను ఒక రోజు క్యాష్ క్యాబిన్ లో కూర్చొని డబ్బు పోగొట్టుకుంటే గానీ తెలియలేదు. అందుకే అంటారేమో " క్షవరం అయితే గాని వివరం తెలియదట " అని.


నెమ్మదిగా ‘ఈ.ఒ.డి’ చేయటం కూడా నేర్చుకున్నా.ఈ.ఒ.డి అంటే ఆఫీషియల్ గా డైలీ బ్రాంచ్ క్లోజ్ చేయడం. అన్నీ వోచర్స్ వెరిఫై చేసి ఏం పెండింగ్ లేకుండా ఉంటేనే అది పూర్తి అవుతుంది. మా మేనేజర్ "క్రేపస్కులర్" జీవి. అంటే సంధ్యా సమయంలో అతిగా ఆక్టివ్ గా ఉంటాడు. ‘ఈ.ఒ.డి’ చేద్దాం అనే చివరినిమిషంలో ఎదో ఒక వోచర్ వేసేవాడు. దీనితో ‘ఈ.ఒ.డి’ మరింత లేట్ అయ్యేది. రోజు పది దాటితే గాని ‘ఈ.ఒ.డి’ అయ్యేది కాదు. మా పక్క బ్రాంచ్ లలో ఉన్న ఫ్రెండ్స్ 8 గంటల లోపు ‘ఈ.ఒ.డి’ చేసుకొని మా బ్రాంచ్ కి వచ్చేవారు. ఒక్కసారి నేనే రమ్మని పిలిచే వాడిని. కనీసం వాళ్ళని చూసైనా మా మేనేజర్ ముందుగా ‘ఈ.ఒ.డి’ చేసే ఛాన్స్ ఇస్తాడేమో అని. కానీ మా వాడు అన్నింటిని తనకు అనుకూలంగా మార్చుకునే అతి తెలివి కలవాడు. వాళ్ళవి చిన్న బ్రాంచ్ లు .మనది పెద్ద బ్రాంచ్. వర్క్ అలాగే ఉంటుందంటూ కవరింగ్ లు ఇచ్చే వాడు. నాకు ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అవడంతో నోరు మెదపక పని చేసుకునే వాడిని.


బ్యాంకు జాబ్ గవర్నమెంట్ కి తక్కువ కార్పొరేట్ కి ఎక్కువ అని నాకు తొందర్లోనే అర్థం అయ్యింది. గవర్నమెంట్ అనే పదం బ్యాంక్ షేర్ హోల్డింగ్ లో తప్ప ఎక్కడ కనిపించేది కాదు. గవర్నమెంట్ స్కీం లకు లోన్ ఇవ్వడం, సబ్సిడీ అకౌంట్లకు ఆధార్ లింక్ చేయడం లాంటి పనులు చేస్తున్నంత మాత్రాన బ్యాంక్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అనిపించుకోదని పూర్తిగా అర్థం అయ్యింది.మెల్లగా బ్యాంక్ పనులకి అలవాటు పడ్డాక జనాలను ఫేస్ చేయడం మొదలుపెట్టా. కొందరేమో అకౌంట్ బ్యాలన్స్ చూడమని లొల్లి. ఇంకొందరేమో పాస్ బుక్ ప్రింటింగ్ గురించి , మరికొందరు సబ్సిడీ గ్యాస్ డబ్బులు పడలేదని చుక్కలు చూపించేవారు. కొందరేమో సరిగ్గా టైం చూసుకొని లంచ్ కి వెళ్లేముందు, లేదా క్యాష్ కౌంటర్ క్లోజ్ చేసేముందు వచ్చేవారు. కొందరేమో థర్డ్ పార్టీ ఆప్ లలో అకౌంట్ నంబర్లు తప్పుగా ఎంట్రీ చేసి డబ్బులు పోగొట్టుకుని బ్యాంక్ లో గోల చేసేవారు.ఇక బ్యాంక్ లో ఇన్సూరెన్స్ , పెన్షన్ స్కీం లకు జనాలు దొరకక టార్గెట్ లు పూర్తి చేయడం కోసం నాకు, ఇంట్లో వాళ్లకు అకౌంట్లు తీయడం మాములు విషయం అయిపోయింది.


బ్యాంక్ లోను అనగానే అప్పటికప్పుడే బిజినెస్ పాయింట్ లు వెలిసేవి. ఇక్కడ ఇవి ఉండేవా అనేంతగా. నేను ప్రీ శాంక్షన్ ఇన్స్పెక్షన్ కి వెళ్ళినప్పుడు అందంగా , ఫుల్లు స్టాక్ తో ఉండేవి. పోస్ట్ శాంక్షన్ ఇన్ఫెక్షన్ కి వెళ్ళినప్పుడు స్టాక్ కాదు కదా షాపే ఉండేది కాదు.


ఇక బ్యాంకు జాబులో అతి ఘోరమైనది రికవరీ. నెల ప్రారంభంలొనే జీతం వచ్చింది అని సంతోషించే లోపే జోనల్ ఆఫీసు నుంచి ఎన్.పి.ఏ( నిరార్థక ఆస్తులు) అంటే చాలా నెలల నుండి వడ్డీ కట్టకుండా పెండింగులో ఉన్న అకౌంట్లు, పి.ఎన్.పి.ఏ అకౌంట్లు అంటే ఈ నెలతో పెండింగులో పడే అకౌంట్ల లిస్ట్ వచ్చేది.ఇక ఆ లిస్ట్ లో అకౌంట్ హోల్డర్ లనుంచి వడ్డీ వసూలు చేయడమే నా పని . రికవరీకి వెళ్ళగానే ఇంటికి లాక్ ఉండేది .లాక్ లేకుంటే ఇంట్లో లోన్ తీసుకున్నవారు ఉండేవారు కాదు. ఒకవేళ ఉన్నా బ్యాంక్ కి వస్తాం అని చెప్పాం కదా . ఇంటిదాక ఎందుకొచ్చావు అనేవారు. కొందరేమో తమ కష్టాలన్నీ చెప్పుకొని కట్టలేమని పంపేసే వారు. ఇంకొందరు రుణమాఫీ అన్నారు కదా మళ్ళీ ఈ వసూళ్లేంటని గోలపెట్టేవారు. మరికొందరు అయితే అజయ్ మాల్యా లాంటోళ్లు కోట్లు టోకరా వేస్తే ఏం చెయ్యరు కానీ, మాలాంటోళ్ల మీదే మీ ప్రతాపం అంటూ లొల్లికి దిగేవారు. ఇవన్నీ దాటుకుని నేను ఎంతో కొంత వసూలు చేసి బ్రాంచ్ కి రాగానే జోనల్ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చేది. మొదట్లో ఎంత వసూలు చేశావ్ అని అడిగేవారు. రిజిస్టర్ లో పేరు ఉండి రికవరీ పూర్ ఉండే సరికి ఈ నెల ఎంత ఎన్.పి.ఏ యాడ్ చేస్తున్నావ్ అని అడగడం మొదలు పెట్టారు.


ఇవన్నీ చూసాక ఎవడురా బ్యాంక్ జాబ్ ఈజీ అని చెప్పింది అని అనిపించక మానదు. నేను ఎలాగోలా బ్యాంక్ నుంచి బయటికి వచ్చేసా. బ్యాంక్ జాబ్ కన్నా బయటే బాగుంది. కానీ జీతం వచ్చి ఈ.ఎం.ఐ.లు, రెంట్లు పోగా జేబులో మిగిలిన డబ్బు చూస్తుంటే బ్యాంక్ జాబే బాగుండేది అనిపిస్తుంది.


ఒక బ్యాంకర్ కాలర్ నలగకుండా ఉన్నంత మాత్రాన బ్యాంక్ జాబ్ వైట్ కాలర్ జాబ్ కాదు.అది ఆ జాబ్ లో నలుగుతున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. మీకు కూడా అది తెలియాలి. బ్యాంకర్ కి కొంచెమైనా గౌరవం ఇవ్వండి అని తెలపడానికే ఈ కథ రాసాను. నోట్ల రద్దు సమయంలో, కరోనా విలయ సమయంలో బ్యాంకర్ లు చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ


' సెల్యూట్ టు ద బ్యాంకర్.'


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి .


40 views0 comments

Comments


bottom of page