ఆదర్శదంపతులు
- Srinivasarao Jeedigunta

- Jul 12, 2025
- 6 min read
#JeediguntaSrinivasaRao, #Adarsadampathulu, #ఆదర్శదంపతులు, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguStory, #తెలుగుకథ

Adarsadampathulu - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 12/07/2025
ఆదర్శదంపతులు - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“అయ్యో ఇక్కడే వున్నారా, మేడమీదకి వెళ్ళారనుకున్నాను” అంది భర్త విశ్వనాథం ని వాలుకుర్చీలో ఉండటం చూసి కమలమ్మ. ‘కొంపదీసి నేను తిట్టిన తిట్లు ఆయనకు వినిపించలేదు కదా, వినిపించి వుండవులే, వినిపించి వుంటే ఈ పాటికి రామరావణ యుద్ధం జరిగేది’ అనుకుంది మనసులో.
“ఏమిటి యిన్నాక ఏదో గొణుగుతున్నావు, యింకా ఏమి సహాయం చెయ్యాలి, వంకాయలు తరిగి పెట్టాను, ఆ మొద్దు గుమ్మడికాయ తొక్కు తీసి ముక్కలు చేసి యిచ్చాను, బియ్యం బస్తా లోనుంచి బియ్యం డబ్బాలో పోసిచ్చాను, యింకా ఏమి చెయ్యాలి? ‘మేడమీదకి వెళ్లి వాళ్ళతో వీళ్ళతో ఫోన్లో అరుస్తో ఉండటమే తప్ప ఒక్క సహాయం లేదు, చంపుకుతింటున్నారు, యింత కసాయి మనిషిని చూడలేదు’ అంటున్నావు. నన్ను అన్నా నోరుమూసుకుని వుంటున్నాను, గదిలో ఎవ్వరు వున్నారో చూసుకోకుండా రేపు నీ కోడలు కూర్చుని వున్నా నీ నోరు యిలాగే వాగుతో ఉంటే ప్రతీ నెల నీ కొడుకుని మనకి డబ్బులు పంపనివ్వకుండా చేస్తుంది. అప్పుడు నీకు వంట పని ఉండదు, నాకు కూరలు తరిగి యిచ్చే పని ఉండదు” అన్నాడు.
“అంటే విన్నారన్నమాట, ఇలాంటివి బాగానే వినిపిస్తాయి, కాలింగ్ బెల్లు వినిపించినా వినిపించినట్టు కూర్చుంటారు. చచ్చినట్టు నేను వెళ్లి తలుపు తీయ్యాలి” అంది కాఫీ కప్పు చేతికి యిస్తో.
“నీకు నడక లేదు, ఎంతవరకు వంటింట్లో మిక్సీ లా ఒకేచోట తిరుగుతావు, నేను రోజూ పదివేల అడుగులు నడుస్తాను. ఏదో ఈవిధంగానేనా కొద్దిగా నడుస్తావు అని నీకు అవకాశం యిస్తున్నాను” అన్నాడు విశ్వనాథం.
“చూడండి! పెళ్ళాం అనే నేను ఉండబట్టే మీకు కాలు కాదపకుండా జరుగుతుంది, రేపు నేను లేని నాడు మీ తిప్పలు తెలుస్తాయి” అంది కమలమ్మ.
“ఇంతోటి దానికి లేకపోవడం దాకా ఎందుకే, నేను ఏమన్నాను” అన్నాడు విశ్వనాథం. ఆగొడవ ఈ రోజుకి ఆగింది.
విశ్వనాథం కమలమ్మ ఆదర్శదంపతులే కాని ఇద్దరు ఏకాభిప్రాయం కి రావడానికి ముందు చిన్నపాటి యుద్ధం జరగకతప్పదు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు. మంచి ఉద్యోగాలలో సెటిల్ అయ్యారు. విశ్వనాథం కి మనవడు, మనవరాలు. మనవడికి తాతయ్య అంటే, మనవరాలు కి బామ్మ అంటే యిష్టం. తల్లిదండ్రులు తమ దగ్గరికి రావాలి అంటే విశ్వనాథం గారి పిల్లలు తమ పిల్లలని ప్రయోగించే వాళ్ళు. మనవడు, మనవరాల కోసం విశ్వనాథం దంపతులు విదేశీ ప్రయాణాలు కూడా చేసి వస్తోవుండే వాళ్ళు.
“అమ్మాయి మెసేజ్ పెట్టింది మనల్ని లండన్ రమ్మని, మనవరాలు కి స్కూల్ సెలవులట. వచ్చి కనీసం మూడు నెలలైన వచ్చి ఉండమంటోంది” అంది కమలమ్మ.
“అది అలాగే పిలుస్తుంది, మనం ప్రయాణం చేసే ఓపికతో లేము, వాళ్లనే రమ్మను, లేదంటే నువ్వు వెళ్ళు” అన్నాడు విశ్వనాథం.
“నేను వెళ్లలేక కాదు, మిమ్మల్ని ఒక్కళ్ళని వదిలేసి ఎలా వెళ్ళాలి, ఇప్పటికే ఆ పని చేసాను, ఈ పని చేసాను అని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇహ వంటగది వదిలేసి వెళ్తే మీతో తరువాత నానా మాటలు పడాలి” అంది.
“మీ నాన్న యిప్పుడు ప్రయాణం చెయ్యలేను అంటున్నారు, వచ్చే ఏడాది వస్తాము లేవే” అంది కూతురుకి ఫోన్ చేసి.
“యిప్పుడే ఓపిక లేకపోతే వచ్చే ఏడాది ఎలా వస్తారమ్మా, సరే మీ ఇష్టం నేను అడగగానే ఎప్పుడు ఒప్పుకున్నారు, బ్రతిమిలాడితే కాని రారు. ఈ రోజులలో రమ్మని పిలిచే వాళ్ళు ఎవ్వరమ్మా” అని దులిపేసి ఫోన్ పెట్టేసింది.
“కరవమంటే కప్పకి కోపం విడవమంటే పాముకి కోపం అన్నట్టుగా వుంది నా పని, వెళదాం అంటే మీకు కోపం, రాలేమంటే దానికి కోపం. మధ్యలో నాకొచ్చి పడింది” అంది విస్కుంటో కమలమ్మ.
సంధ్యావందనం పూర్తి చేసుకుని అరుగు మీద కూర్చుని కాఫీ తాగుతున్న విశ్వనాథం తో “ఇదిగో మీ మీద బ్రమ్మాస్త్రం ప్రయోగించింది మీ కూతురు” అంటూ ఫోన్ తీసుకుని వచ్చి యిచ్చింది కమలమ్మ. “ఎవ్వరే” అంటూ ఫోన్ తీసుకుని “‘హలో” అన్నాడు.
“వీడియో కాల్. ఫోన్ వంక చూసి మాట్లాడు తాతయ్యా” అని వినిపించడం తో స్క్రీన్ వంక చూసి “ఓసిని నువ్వా, యింకా పడుకోలేదా” అన్నాడు మనవరాలు తో.
“సరే ముందు నువ్వు ఇక్కడికి వస్తావా రావా” అంది మనవరాలు కీర్తి.
“నేను ఒక్కడిని రాలేనే, మీ అమ్మమ్మ రాలేను అంటోంది, వచ్చే ఏడు వస్తాము అప్పుడు నువ్వు టెన్త్ క్లాస్ కి వస్తావుగా.” అన్నాడు.
“నాకు చెప్పావు అబద్దం ఆడకూడదు అని, నువ్వు మాత్రం ఆడుతావు, అమ్మమ్మ వస్తే నువ్వు వస్తావా లేదా ముందు అది చెప్పు” అంది.
“యిప్పుడు రాలేనే ఓపిక లేదు” అన్నాడు విశ్వనాథం.
“అదేమిటి ఆలా జాలిగా మొహం పెట్టావు, యిలా పట్టు పడితే ఎలా తల్లీ, మీ అమ్మ నిన్ను నా మీద ప్రయోగిస్తోంది ఎందుకు, సరేలే వచ్చే నెలలో వస్తాములే, అయితే మళ్ళీ మేము ఇండియా వచ్చేసే అప్పుడు నువ్వు ఏడవకూడదు, నువ్వు ఏడిస్తే నేను చూడలేనే” అన్నాడు విశ్వనాథం.
“సరే అమ్మకి యిస్తాను, అమ్మతో చెప్పండి మీ ప్రోగ్రాం” అంది.
కూతురు అక్కడే వుంది అనుకుంటా, వెంటనే ఫోన్ తీసుకుని “సరే మొదటి వారంలో ఫ్లైట్ బుక్ చేస్తాను, యిక్కడకి తీసుకొని రావలిసిన వస్తువుల లిస్ట్ మెసేజ్ పెడ్తాను”, అంటూ ఫోన్ పెట్టేసింది.
“ఏమంటోంది మీ మనవరాలు, అది అడిగింది కదా అని ఒప్పేసుకోలేదుగా, మీరన్నట్టుగా యిప్పుడు ప్రయాణం చేసే ఓపిక నాకు లేదు, ఒకటే నడుం నొప్పి” అంది కమలమ్మ.
“భలే నటిస్తున్నారే అందరూ, మీ ఆడవాళ్లకి నడుం నొప్పి తప్పా వేరే కారణం కనిపించిందా. అంతా విన్నావుగా, ఇహ ఆవకాయ, తీపి ఆవకాయ, కందిపొడి తయారు చెయ్యడం మొదలుపెట్టు” అన్నాడు నవ్వుతూ.
“చూడం, యింకా ఎన్నాళ్ళు యిలా కలిసి వుంటామో తెలియదు, వున్నన్నాళ్ళు ఇద్దరం కలిసే ఉండాలి, ఎక్కడికైనా కలిసే వెళ్ళాలి, తెలిసిందా” అంది కమలమ్మ భర్త చెయ్యి పట్టుకుని.
“అలాగే లే, నువ్వు రోజూ గంటల సేపు పూజ చేస్తావ్ గా, ఆ దేముడిని కోరుకో” అన్నాడు.
నాలుగు సూటకేసులు నిండా కూతురు చెప్పినవి, తమ మందులు, బట్టలు, పెట్టుకుని విమానం ఎక్కారు. బస్సులో సీట్స్ కంటే యిరుకుగా వున్నాయి. కాళ్ళు కదపటానికి కూడా కష్టం. రోజూ పచ్చడి లేనిదే అన్నం తినని విశ్వనాథం దంపతులకు ఫ్లైట్ లో పెట్టే తిండి విషంలా వుంది. పోనీ జ్యూస్ తాగుదాము అంటే వొంట్లో షుగర్. మొత్తానికి కడుపు మాడ్చుకుని లండన్ విమానాశ్రయంలో దిగి ఒక గంట తరువాత బయటకు వచ్చారు.
తమకోసం ఎదురు చూస్తున్న అల్లుడు, కూతురిని చూసే సరికి అంతవరకు విమానం లో పడ్డా బాధ ఎగిరిపోయింది. “బాగున్నారా, నా మనవరాలు ఏది రాలేదా” అన్నాడు విశ్వనాథం.
“దానికి స్కూల్ వుంది లే, మేము వచ్చాముగా” అంటూ చేతిలోని ట్రోలీ తీసుకుంది కూతురు.
“వచ్చేదాకా చంపేసింది, ఈ ఒక్కరోజు స్కూల్ కి సెలవు పెట్టచ్చుగా” అన్నాడు నిరుత్సహంగా విశ్వనాథం.
అంతలో వెనకనుంచి గట్టిగా పట్టుకున్నట్టు అనిపించి కంగారుగా చూసాడు. మనవరాలు కీర్తి నవ్వుతు ‘తాతయ్య..’ అంది.
“ఓసినీ నువ్వు వచ్చావా, మీ అమ్మ నువ్వు స్కూల్ కి వెళ్ళావు అంది” అన్నాడు.
“ఈరోజు సండే తాతయ్య, రేపు కూడా స్కూల్ కి వెళ్ళను. మీతో కబుర్లు చెప్పాలి” అంటూ ఒకటే మాట్లాడేస్తోంది.
తెలియకుండానే మూడు నెలలు గడిచిపోయాయి. ఇండియా బయలుదేరారు.
“మళ్ళీ ఎప్పుడు వస్తావు తాతయ్య, యిక్కడ కరోనా ఎక్కువగా వుంది కాబట్టి మిమ్మల్ని వెళ్ళనిస్తున్నాను, లేకపోతే యింకో మూడు నెలలు వుండవచ్చు” అంది కూతురు.
“మామయ్యగారు.. మీరిద్దరూ ఇండియా లో కూడా జాగ్రత్తగా ఉండండి. అక్కడ కూడా కరోనా ఎక్కువగా వుంది. వీలుంటే మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళండి” అన్నాడు అల్లుడు.
“నిన్నే మీ బావమరిది తో మాట్లాడాను, వాళ్ళ ఊరిలో కూడా కరోనా ఎక్కువగా వుంది, అందుకే మేమే మీదగ్గరకి వద్దాము అనుకుంటున్నాము అన్నాడు.”
“తాతయ్యా, మాస్క్ సరిగ్గా పెట్టుకో, అమ్మమని చూడు ఎంత కరెక్టుగా పెట్టుకుందో” అంటూ మాస్క్ సరిగ్గా కట్టింది. వాళ్ళకి వీడ్కోలు చెప్పి ఫ్లైట్ ఎక్కేసారు. వచ్చేడప్పుడు లేని మాస్కులు యిప్పుడు అందరూ కట్టుకుని వున్నారు.
కూతురు యిచ్చిన పూరీలు తింటో విశ్వనాథం భార్యతో అన్నాడు. “ఇంటికి వెళ్లిన తరువాత ఒక కవర్ లో నువ్వు దేముడిని ఏమి కోరుకుంటున్నావో రాసి పెట్టు, అలాగే నేను రాస్తాను. మనం అనారోగ్యం పాలైనప్పుడు ఎవ్వరు ఏమి కోరుకున్నారో చూద్దాం” అన్నాడు.
“యిప్పుడు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు?” అంది విశ్వనాథం గారి భార్య.
“లండన్ లో వున్న ఈ మూడు నెలలు కంటికి రెప్పలా నాకు ఏమి అవసరమో కనిపెట్టి చూసావు, మన యింట్లో రోజూ ఏదో ఒక తగాదా పడేవాళ్ళం. ఇహ మనం ఒకరి మాట ఒకరు గౌరవించుకుందాం” అన్నాడు.
“చూద్దాం ఈ అనురాగం ఎంత సేపు ఉంటుందో” అంది.
ఇంటికి చేరారు. కాఫీ పెట్టుకుందాం అంటే పాలు లేవు. “పక్కవాళ్ళని అడిగి తీసుకుని వస్తాను, పాలవాడికి మెసేజ్ పెట్టండి రేపటి నుంచి పాల పాకెట్స్ వెయ్యాలి అని” అంటూ గ్లాస్ తీసుకొని పక్క ఇల్లు గాయత్రి గారి ఇంటికి వెళ్ళింది.
పదినిమిషాలలో తిరిగి వచ్చిన భార్య ని చూసి “అప్పుడే వచ్చేసావు.. ఆవిడ యింత త్వరగా వదలదే” అన్నాడు విశ్వనాథం.
“నా ఖర్మ వాళ్ళ ఆయన కి కరోనా వచ్చి తగ్గిందిటా, మరి మా యింట్లో పాలు పనికివస్తాయా అంది. దానితో గుండె ఆగిపోయింది కరోనాకి ఎదురు వెళ్లినందుకు” అంటూ స్నానం కి వెళ్ళింది. విశ్వనాథం కి ఎందుకో ఎడమ కన్ను కొట్టుకుంది.
“యింతకీ పాలు తీసుకున్నావా లేదా” అన్నాడు విశ్వనాథం.
“యింకా నయ్యం బతకాలి అని లేదా, ఈ పూటకి గ్రీన్ టీ తీసుకోండి, త్వరగా వంట చేస్తాను, తోటలో మీ కోసం అన్నట్టుగా పది వంకాయలు వున్నాయి” అంది కమలమ్మ.
“టీ వద్దులే భోజనం చేసేద్దాం” అన్నాడు. అన్నం తిని పడుకునే ముందు కమలమ్మ అంది “లండన్ లో పూరీ కూర బాగుండలేదు అని గొడవ చేశారుగా, రేపు ఉదయం టిఫిన్ కి పూరీ చేస్తాలేండి” అంది. ‘సంతోషం’ అన్నాడు విశ్వనాథం.
ప్రయాణం బడలిక వల్ల విశ్వనాథం కి త్వరగా మెలుకువ రాలేదు. బద్ధకంగా లేచి చూసే సరికి భార్య యింకా పడుకునే వుంది.
“లే, ఎనిమిది అయ్యింది” అని పిలిచాడు. ఏమిటి మూలుగుతోంది అనుకుంటూ చెయ్యి పట్టుకుని చూసి, ‘బాబోయ్ వళ్ళు కాలిపోతోంది, కొంపదీసి జ్వరం కాదుకదా’ అనుకుని బలవంతంగా లేపి కూర్చోపెట్టాడు భార్య ని.
“ఏమిటి జ్వరం వచ్చిందా?” అన్నాడు.
“అర్దరాత్రి ఒకటే చలి, వొళ్ళునొప్పులు అండి ఎందుకైనా మంచిది ఈ గదిలోకి రాకండి, ఈపూటకి సుబ్బమ్మ హోటల్ నుంచి భోజనం తెప్పించుకోండి” అంది.
“నా భోజనం గురించి భయడకు, కాఫీ కాచి యిస్తాను, తరువాత హాస్పిటల్ కి వెళ్దాం” అన్నాడు భార్యతో విశ్వనాథం.
“హాస్పిటల్ కి ఎందుకు అనవసరంగా లేని జబ్బులు ఎక్కించుకోవడానికి, మిర్యాల కషాయం తాగి క్రోసిన్ వేసుకుంటే అదే తగ్గుతుంది, పిల్లలకి నా విషయం చెప్పకండి, కంగారు పడతారు” అంది.
“సుబ్బమ్మ హోటల్ కి ఫోన్ చేసారా మీకు భోజనం పంపమని” అంటూ నీరసంగా అరుస్తున్న భార్య తో, “ఇంకెక్కడి సుబ్బమ్మ, క్రిందటి నెల కోవిడ్ తో పోయిందిట, పర్వాలేదు నేను కుక్కర్ పెట్టుకోగలను” అన్నాడు.
అన్నతరువాత ‘అయ్యో ఈ టైములో సుబ్బమ్మ చావు గురించి ఎందుకు చెప్పాను’ అనుకుంటూ, “ఆవిడ కోవిడ్ బాగా ఎక్కువగా వున్నప్పుడు పోయింది. యిప్పుడు జలుబు తగ్గినట్టే తగ్గుతోంది. అయినా మనం వాక్సిన్ వేయించుకున్నాము గా మనకి రాదు” అన్నాడు.
యమాలోకం లో “స్వామి.. ఈ భూలోకంలో కరోనా వల్ల చనిపోయి గుట్టలు గుట్టలుగా ఆత్మలు వచ్చిపడుతున్నాయి, వాళ్ళు చేసిన పాపపుణ్యాలు లెక్క పెట్టడానికి నాకు ఒక సహాయకుడు కావాలి” అన్నాడు యముడితో చిత్రగుప్తుడు.
“ఎందుకు అన్ని చావులు జరుగుతున్నాయి చిత్రగుప్తా” అని అడిగాడు యముడు.
“స్వామి, వాళ్ళు హాస్పిటల్ కి వెళ్లి వైద్యం చేయించుకోవడంకన్నా ఇక్కడికి రావడానికి సిద్ధంగా వున్నారు. ఈ రోజు ఒక చిత్రమైన దంపతుల రాసుకున్న జాబులు చూసాను రాజా. వాళ్ళు చనిపోయే రోజు వస్తే ఇద్దరు ఒకేసారి చనిపోవాలి అని, ఒకళ్ళు లేకుండా యింకోకరం జీవించి ఉండే కన్నా దంపతులు తమ ఆయుష్షు పూర్తి కాగానే ఒకేసారి చనిపోయే వరం, రోజు పూజ చేసే అప్పుడు కోరుకున్నారు, అందుకే యిప్పుడు ఆ ఇల్లాలు కి కరోనా వచ్చింది, ఆ ముసలి ఆయన భార్యకి సేవలు చేసి కరోనా అంటించుకునే వరం యిద్దాము అనుకుంటున్నాను యమధర్మరాజా. అప్పుడు వాళ్ళు కోరుకున్నట్టు ఇద్దరు ఒకేసారి మన లోకంకి వస్తారు” అన్నాడు చిత్రగుప్తుడు.
“చిత్రగుప్తా.. యమలోకంలో ఉండి నీ హృదయం బండపారిపోయింది. ఆ ఇల్లాలు కమలమ్మ, ఆమె భర్త విశ్వనాథం ఒకరికోసం ఒకరు అన్నట్టుగా, ఒకరు లేకపోతే ఇంకొకరు ఉండలేము అని ఎంతో ఆదర్శ దంపతులుగా ఆ కేశవుడిని పూజిస్తున్నారు. వాళ్ళని బలితీసుకుందామని నీకు ఎలా అనిపించింది, యిదే ఆ దంపతులకు నా వరం వాళ్ళు, వాళ్ళ సంతతి కోరుకున్న సంవత్సరాలు ఆరోగ్యం గా జీవించి చివరికి మన లోకం వంక చూడకుండా కైలాసం చేరాలి అని వరం ప్రసాదిస్తున్నాను” అన్నాడు యమధర్మరాజు.
‘నాకు తెలుసు స్వామి మీరు ఈ వరం వాళ్ళకి ఎందుకు యిస్తున్నారో, శివభక్తులతో విరోధం ఎంత ప్రమాదమో తమకి పూర్వం అనుభవం వుందిగా’ అనుకున్నాడు మనసులో చిత్రగుప్తుడు.
“ఏమిటే కమలా అప్పుడే లేచావు, జ్వరం పూర్తిగా తగ్గకుండా” అన్న విశ్వనాథం తో, “రాత్రే తగ్గిపోయింది. వొళ్ళు చల్లగా వుంది చూడండి, ఏదో ప్రయాణం బడలిక అంతే. మీరు కూడా లేచి కొబ్బరికాయ తీసుకుని రండి. ఈ రోజు సోమవారం మహాశివుడికి అభిషేకం చెయ్యాలి, ముక్కుకి మాస్క్ కట్టుకుని వెళ్ళండి” అంది.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






Comments